రూపాంతరం చెందిన జీవితము 4 వ భాగము నిష్కపటమైన ప్రేమకు మూడు లక్షణాలు

Posted byTelugu Editor May 14, 2024 Comments:0

(English version: “The Transformed Life–3 Characteristics of Sincere Love”)

ఓపెన్ సోర్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఉబుంటుకి పెట్టిన పేరు చాలా అర్థవంతమైనది.

ఆఫ్రికన్ గిరిజన పిల్లలకు ఒక ఆంత్రోపాలజిస్ట్‌ ఒక ఆటను ప్రతిపాదించాడు. అతడు ఒక చెట్టు దగ్గర స్వీట్లు ఉన్న బుట్టను ఉంచాడు. అలాగే వారిని 100 మీటర్ల దూరంలో నిలబెట్టి ఎవరు ముందుగా చేరుకున్నారో వారికి బుట్టలో ఉన్న స్వీట్లు అన్ని చెందుతాయని చెప్పాడు.

అతడు 1, 2, 3 వెళ్లండి అని చెప్పగానే ఈ చిన్న పిల్లలు ఏమి చేసారో మీకు తెలుసా? పిల్లలందరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని చెట్టువైపు కలిసి పరిగెత్తుకుని వెళ్లి ఆ స్వీట్లు తీసుకుని అందరూ పంచుకుని తిని ఆనందించారు. ఎందుకు అలా చేసారని ఆంత్రోపాలజిస్ట్‌ వారిని అడిగినప్పుడు వారు ఉబుంటు అన్నారు. మిగిలిన వారందరు విచారంగా ఉన్నప్పుడు ఒకరు ఎలా సంతోషంగా ఉంటారు? అని దానికి అర్థము. వారి భాషలో ఉబుంటు అంటే, “మనం అందరమూ ఉంటేనే నేను ఉన్నాను!”

అది ప్రేమ, తన కోసం కాదు, ఇతరుల కోసం. బైబిలు ఈ రకమైన ప్రేమను పదే పదే నొక్కి చెబుతుంది. ప్రేమ అనే అంశం చాలా ముఖ్యమైనది.

తన మరణానికి ముందు రాత్రి మేడమీది గదిలో మన ప్రభువు ఒకరిని ఒకరు ప్రేమించాలని చెబుతూ యోహాను 13:34-35లో “34 మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. 35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను” అన్నారు. మనపట్ల యేసుకున్న ప్రేమ యథార్థమైనది. ఇది ముసుగు లేని ప్రేమ! మనం ఇతర విశ్వాసులను అదే విధంగా ప్రేమించాలి! అలాగే, ఇతరులను ప్రేమించడమే మనం నిజంగా యేసు శిష్యులమనడానికి రుజువు!

మన జీవితాలలో ఒకరిపట్ల ఒకరు ముఖ్యంగా తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని యేసు చాలా ఖచ్చితంగా చెప్పారు [యోహాను 15:12, 17]. అపొస్తలుడైన పౌలు రోమా ​​​​12: 9-10లో దేవుని కనికరం ద్వారా జీవితాలు రూపాంతరం చెందడం గురించి చెప్పాడు [రోమా 12:1-2].

3-8 వచనాలలో ఆత్మవరాల గురించి మాట్లాడిన వెంటనే పౌలు ప్రేమ గురించి మాట్లాడాడు. ఇది మంచి ఆలోచనని నేను భావిస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రేమ కలిగి ఇతరులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆత్మీయ వరాలను ఇస్తారు. మరొక చోట ప్రేమ లేకపోతే ఎంత ఉన్నతమైన ఆత్మ వరం కలిగివున్నా అది దేవుని దృష్టిలో విలువైనవి కాదని పౌలు పేర్కొన్నాడు [1 కొరింథి 13:1-3].

పౌలు 9వ వచనాన్ని ఎలా ప్రారంభించాడో గమనించండి. “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను” అని చెప్పాడు. నిష్కపటమైనది అనే పదం ముసుగు లేనిది అనే అర్థం కలిగిన పదం నుండి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి వివిధ ముసుగులు ధరించే రంగస్థల నటుల గురించి చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. నటుడు సంతోషకరమైన భావాలు ప్రదర్శిస్తుంటే అతడు నవ్వుతున్న ముసుగును, దుఃఖ భావాలు ప్రదర్శిస్తుంటే దుఃఖం యొక్క ముసుగును అనగా పాత్రకు అనుగుణంగా వివిధ ముసుగులను ధరిస్తాడు; నిజానికి ఆ ముసుగు సూచించే భావోద్వేగాలను నటుడు అనుభవించడు. అతడు కేవలం ఒక పాత్రను పోషిస్తున్నాడు.

అయితే, ఒకరిపట్ల ఒకరికి మనకుండవలసిన ప్రేమ విషయంలో మనం ప్రేమ అనే బాహ్య ముసుగును వేసుకోకూడదని పౌలు చెప్పాడు. మనం నిజమైన హృదయంతో ప్రేమించాలి! ప్రేమ మరియు కపటం ఒకదానితో ఒకటి కలిసి ఉండలేవు. అవి రెండు పూర్తిగా విరుద్ధమైనవి. దొంగ ప్రేమతో యేసును ముద్దు పెట్టుకున్న యూదాలా క్రైస్తవులమని చెప్పుకునేవారు చేస్తున్నారు. ఒక రచయిత వ్రాసిన మాటలు ఇలా ఉన్నాయి:

దాదాపు మనుషులందరూ తమ వద్ద లేని ప్రేమను చూపించడంలో ఎంత తెలివిగా ఉంటారో చెప్పడం కష్టం. వారు ఇతరులనే కాకుండా తమను తామే మోసం చేసుకుంటారు. వారు నిర్లక్ష్యం చేసి తిరస్కరించే వారి పట్ల తమకు నిజమైన ప్రేమ ఉందని వారు తమకు తాము సర్దిచెప్పుకుంటారు.

పరిసయ్యులు తాము పవిత్రులమని లోకానికి చూపించుకోడానికి ముసుగులు ధరించడంలో నిపుణులు. వాస్తవానికి వారు హృదయంలో చెడ్డవారు. యేసు అనేకసార్లు వారిని వేషధారులారా అని పిలిచి వారి మతాన్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన హృదయమంతటితో ప్రేమించమని చెబుతున్నారు; పౌలు ఏ ముసుగు లేకుండా ప్రేమించమని చెబుతున్నాడు.

ఈ నిష్కపటమైన ప్రేమను 3 లక్షణాలతో గుర్తించవచ్చని పౌలు తెలియచేశాడు.

1వ లక్షణం: నిష్కపటమైన ప్రేమకు పవిత్రత లక్షణంగా ఉండాలి.

“చెడ్డదాని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి” అని పౌలు రోమా ​​​​12:9లో చెప్పాడు. ఒకేసారి ప్రేమించి ద్వేషించమని చెప్పడం కొంచెం వింతగా అనిపిస్తుంది. అయితే, ప్రేమ గురించి బైబిలు ఇదే బోధిస్తుంది. ప్రేమలో మనం వివేచనతో ఉండాలి. ప్రేమ అనేది కేవలం మానసికమైన భావం కాదు. దానిని విచక్షణతో సాధన చేయాలి. ప్రేమామయుడైన అదే దేవుడు చెడును కూడా అసహ్యించుకుంటాడు. కాబట్టి మనం కూడా అదే మార్గాన్ని అనుసరించాలి.

పాత మెథడిస్ట్ సంఘ సభ్యులు పాపాన్ని తప్ప మరేమీ ద్వేషించని పురుషులుగా వర్ణించబడ్డారు. “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి” [కీర్తన 97:10] అనే కీర్తనాకారుని ఉపదేశాలను మరియు “కీడును ద్వేషించి మేలును ప్రేమించు” [ఆమోసు 5:15] అని చెప్పిన ప్రవక్తయైన ఆమోసు సూచనలను వారు నిష్టగా పాటించారు.

ఇక్కడ పౌలు ఉపయోగించిన “ద్వేషం” అనే పదం చాలా శక్తివంతమైనది. ఇది క్రొత్త నిబంధనలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. ఒక గ్రీకు నిఘంటువు ప్రకారం, అసహ్యతతో కుంచించుకుపోవడం, అసహ్యించుకోవడం అనే భావం దీనిలో ఉంది. ఇది బలమైన అయిష్టమనే భావాన్ని కలిగి ఉంది. బైబిలు చెడుగా పిలిచే వాటిని మనం ద్వేషించాలి. మనం చెడును దూరం పెట్టడానికి మాత్రమే పిలువబడలేదు, కానీ చెడును ద్వేషించడానికి చీదరించుకోడానికి మరియు అసహ్యించుకోడానికి పిలువబడ్డాము! మనం చెడును ద్వేషించలేకపోతే మంచిని ప్రేమించలేము.

అంతేకాకుండా, అలా ద్వేషించడం వలన మనం దాని నుండి పారిపోవడమే కాకుండా చెడును చేస్తున్న మన తోటి విశ్వాసులను చూసి అలా చేయవద్దని ప్రేమతో వారిని వేడుకుంటాము. మన తోటి క్రైస్తవులకు హాని కలిగించే వాటిని అసహ్యించుకోకుండా మనం నిజంగా వారిని ప్రేమిస్తున్నామని చెప్పలేము. నిష్కపటమైన ప్రేమ వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మనం ప్రేమతో పాపంలో ఉన్న ప్రమాదాల గురించి వారిని హెచ్చరిస్తాము; అలాగే దాని నుండి దూరంగా ఉండమని వారిని వేడుకుంటాము. అలా హెచ్చరించడానికి మనం కొంత వెల చెల్లించవలసి వచ్చినా సరే!

పౌలు కేవలం చెడును ద్వేషించమని చెప్పడంతోనే ఆగిపోలేదు కానీ సానుకూలమైన దానిని అనుసరించమని కూడా చెప్పాడు. “మంచిదానిని హత్తుకొని యుండుడి. “హత్తుకొను అనే పదానికి దేనికైనా అతుక్కోవడం అనే భావం ఉంటుంది.  మన నిర్వచనం ప్రకారం కాకుండా, బైబిలు [ఫిలిప్పి 4:8] వర్ణించినట్లుగా  మనం మంచి వాటికి హత్తుకుని ఉండాలి. ఆచరణాత్మకంగా చూస్తే, నిష్కపటమైన ప్రేమ మన స్వంత జీవితాల్లో మంచిని హత్తుకుని ఉండేలా చేస్తుంది. అలాగే ఇతర విశ్వాసులను మంచిని అంటిపెట్టుకుని ఉండటానికి ప్రోత్సహిస్తుంది. నీతిని ప్రేమించే అదే దేవుడు చెడును ద్వేషిస్తాడు. ఇతరుల పట్ల మనకున్న ప్రేమలో దేవుని ప్రేమను చూపించడానికి మనం పిలువబడ్డాము. కాబట్టి మనం కూడా దేవుడు ద్వేషించేదాన్ని ద్వేషించాలి అలాగే దేవుడు ప్రేమించేవాటిని ప్రేమించాలి. కాబట్టి మన హృదయాలలో జీవితాలలో దీనిని కొనసాగించాలి; అలాగే ఇతర విశ్వాసులను కూడా అలా చేయమని ప్రోత్సహించాలి.

కాబట్టి, నిష్కపటమైన ప్రేమ యొక్క మొదటి లక్షణం పవిత్రమైన ప్రేమ. ఆ తర్వాత పౌలు నిష్కపటమైన ప్రేమ యొక్క రెండవ లక్షణాన్ని చెప్పాడు.

2వ లక్షణం: నిష్కపటమైన ప్రేమకు తప్పనిసరిగా కుటుంబ ఆప్యాయత ఉండాలి 

రోమా ​​​​12:10లో, “సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై ఉండుడి” అని చదువుతాము. అనురాగం అనే పదం బంధువుల పట్ల ప్రేమను స్నేహితుల మధ్య ప్రేమను వివరిస్తుంది. అది ఒకరికొకరి మధ్య ఉండే సున్నితమైన కుటుంబ ఆప్యాయత. చర్చి ఒక కుటుంబం కాబట్టి మన రక్తసంబంధులతో మనకుండే ప్రేమను ఇక్కడ మనం చూపించడంలో ఆశ్చర్యం లేదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వారి తప్పులను కప్పి ఉంచుతుందనే దానికి సాదృశ్యంగా రక్తం నీటి కంటే చిక్కగా ఉంటుందని అంటారు.

అదే విధంగా, మన నేపథ్యాలతో సంబంధం లేకుండా క్రీస్తు చిందించిన రక్తం కారణంగా మనం దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నాము. మనం ఆయనలో ఐక్యమై ఇప్పుడు దేవుని కుటుంబంలో భాగమయ్యాం. మనం దేవుని కుటుంబమని పిలువబడ్డాము [1 తిమోతి 3:15]. కాబట్టి, మనం ఒకరి పట్ల మరొకరు కుటుంబ ప్రేమను ప్రదర్శించాలి. నిష్కపటమైన ప్రేమ యొక్క రెండవ లక్షణం అది.

3వ లక్షణం: నిష్కపటమైన ప్రేమకు తప్పనిసరిగా వినయం ఉండాలి 

రోమా ​​​​12:10 చివరి భాగంలో “ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని చదువుతాము. మనం ప్రేమలో ఒకరికొకరు అనురాగం కలిగివుంటే సహజంగానే మనకన్న ఇతరులనే గౌరవించాలని మనం కోరుకుంటాము. మన గౌరవం కోసం కాకుండా ఇతరులను ప్రోత్సహించడానికి మనం పిలువబడ్డాము. వ్యక్తిగత గౌరవాన్ని పొందడాలని ఆశించకండి కాని ఇతరులకు గౌరవాన్ని ఇవ్వాలని ఆశించండి. వినయం కలిగిన ఆత్మ నుండి పుట్టే ప్రేమను కలిగివుండమని పిలుపు ఇవ్వబడింది.

బైబిలులో మరొకచోట, పౌలు ఇదే విషయాన్ని చెప్పాడు: “3 కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు 4 మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” [ఫిలిప్పి 2:3-4]. ఇలా ఎందుకు చేయాలి? యేసు అలాగే చేశారు కాబట్టి [5-8]! మన దినచర్యలో మనం ఆయనను అనుకరించాలి.

చిన్న చిన్న విషయాలలో కూడా ఇతరుల అవసరాలకు మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఇతరులకు మద్ధతు ఇవ్వడంలో మనం సంతోషించాలి అలాగే మనం మితంగా ఉండడంలో సంతృప్తి చెందాలి. వినయపూర్వకమైన హృదయం నుండి వచ్చే నిష్కపటమైన ప్రేమ అలా ఉంటుంది! వెనుక సీటు తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి! భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు మరియు చర్చి సభ్యులు వినయపూర్వకమైన హృదయం నుండి పుట్టుకొచ్చే ప్రేమ కారణంగా ఒకరినొకరు ప్రోత్సహించడానికి  ప్రయత్నిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి. మన ప్రేమలో వినయం ఉన్నప్పుడు క్రీస్తు ఎంత ఎక్కువగా మహిమపరచబడతారో ఊహించండి!

ముగింపు మాటలు.

నిష్కపటమైన ప్రేమకు పవిత్రత, కుటుంబ ఆప్యాయత మరియు వినయం లక్షణాలుగా ఉండాలి. ఇవి కేవలం సూచనలు మాత్రమే కాదు. బదులుగా, అవి చాలా తీవ్రంగా పరిగణించవలసిన ఆదేశాలు. ప్రేమరాహిత్యం వలన కలిగే తీవ్రమైన చిక్కులను యోహాను 1 యోహాను 2:9-11లో తెలియచేశాడు. “9 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. 10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. 11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవు చున్నాడో అతనికి తెలియదు.” ఒకరి పట్ల ఒకరికి  ప్రేమ ఉండడం నిజమైన రక్షణకు రుజువని యోహాను చెప్పాడు [1 యోహాను 3:10 మరియు 1 యోహాను 3:16-18 కూడా చూడండి].

మనం నిష్కపటమైన ప్రేమ కలిగిన జీవితాన్ని ఎలా కొనసాగించాలి? ఇక్కడ 4 సూచనలు ఉన్నాయి.

1. పరిగణించండి. మనం ఎన్నో పాపాలు చేసినప్పటికీ సిలువను మరియు మనకు లభించిన దయను మనం నిరంతరం ప్రతిబింబించాలి [రోమా 12:1].

2. ఆధారపడటం. ఇతరులను ప్రేమించేలా మనలను మార్చగల పరిశుద్ధాత్మపై మనం నిరంతరం ఆధారపడాలి [రోమా 12:2].

3. ధ్యానం. బైబిలు ప్రేమ లక్షణాలను మరియు మనలను మార్చడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించడానికి పరిశుద్ధాత్మపై విశ్వాసం ఉంచమని మనకు జ్ఞాపకం చేసే 1 కొరింథీ 13: 4-7 వంటి వచనాలను మనం ధ్యానిస్తూ ఉండాలి.

4. ఆచరణ. మన భావాలపై ఆధారపడకుండా అవకాశం వచ్చినప్పుడు మనం ఇతరులకు మంచి చేస్తూనే ఉండాలి [లూకా 6:27-31].

ఇతరులను ప్రేమిస్తే దానివలన గాయపడతామనే భయం మనకుంటుంది. గత అనుభవాల కారణంగా మనకు ఈ భయం ఉండి వెనక్కి తగ్గుతాము. అయితే దేవుని కృప వలన మారుమనస్సు పొంది పరలోక బంధం ఉన్నవారు పరిశుద్ధాత్మ ప్రేరేపించిన విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని కోరుకుంటారు. “ఉబుంటు—మనం అందరమూ ఉంటేనే నేను ఉన్నాను” అని చెప్పిన ఆఫ్రికన్ పిల్లల మాదిరిగానే వారు కూడా అదే ఆలోచన కలిగివుంటారు.

Category

Leave a Comment