మన తండ్రియైన దేవునిచే దత్తత తీసుకోబడటం వలన కలిగే నాలుగు ఆశీర్వాదాలు

Posted byTelugu Editor July 9, 2025 Comments:0

(English version: 4 Blessings of Being Adopted by God Our Father)

ఆయనను “తండ్రి” అని పిలవడానికి దేవుడు మనకు సహాయం చేసే ప్రక్రియను బైబిలు “దత్తత” అని పిలుస్తుంది. మనం అనుభవించే ఈ అత్యున్నత అధికారం విమోచన కన్నా ఉన్నతమైనది. విమోచన అంటే మనం మన పాపాల గురించి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన అపరాధం నుండి విడుదల చేసే ప్రక్రియ. విమోచన అనేది దేవుని న్యాయమూర్తిగా చూసే చట్టపరమైన పదము. ఇది దేవుని పవిత్ర ధర్మశాస్త్రం ఎదుట మనం నిలబడటానికి సంబంధించినది.

మరోవైపు, దత్తత అనేది కుటుంబానికి సంబంధించిన అంశము. ఒక రచయిత ప్రకారం, “దత్తత అనేది దేవుడు మనలను తన కుటుంబ సభ్యులుగా చేర్చుకునే ప్రక్రియ.” దత్తత అనేది దేవుడిని తండ్రిగా చూస్తుంది, తద్వారా సాన్నిహిత్యం, ఆప్యాయత మరియు దాతృత్వాన్ని సూచిస్తుంది. మరొక రచయిత ఇలా అన్నాడు, “న్యాయమూర్తి అయిన దేవుని దృష్టిలో సరైనదిగా ఉండటం గొప్ప విషయం, కానీ తండ్రియైన దేవునిచే ప్రేమించబడి సంరక్షించబడడం చాలా గొప్ప విషయము”. క్రింది దృష్టాంతం ఈ భావనను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఎవరైనా మీ కుమారుడిని చంపి, మరణశిక్షను ఎదుర్కొంటూ జైలులో వేయబడ్డారని అనుకుందాం. నీవు ఆ వ్యక్తిని క్షమించి విడిపిస్తే అది గొప్ప విషయం అవుతుంది. కానీ మీరు అక్కడితో ఆగలేదు. ఆ వ్యక్తి జైలు నుండి విడుదలైన తర్వాత, మీరు ఆ హంతకుడిని దత్తత తీసుకుని, అతడిని మీ స్వంత కుమారునిగా చేసుకుని మీ కుమారునికి ఉండే అన్ని అధికారాలను అతనికి ఇవ్వండి! అది ఎలా కనిపిస్తుంది? ప్రజలు మీకు పిచ్చి పట్టిందని కూడా అనవచ్చు! కానీ అది మీ ప్రేమలోని ఔన్నత్యాన్ని చూపిస్తుంది! అంతేకాదు, నీ అమూల్యమైన కుమారుడిని చంపిన వ్యక్తి అనుభవించిన ఆశీర్వాదపు ఔన్నత్యాన్ని కూడా ఇది చూపిస్తుంది.

అది విమోచనకు దత్తతకు సంబంధించిన బైబిలు వివరణయే కదా? దేవుడు విమోచనతో ఆగిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. విమోచన ఆశీర్వాదం కంటే మరింత మెరుగైన దత్తతను ఆయన మనకు ఇచ్చారు, తద్వారా ఆయన మమ్మల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసాడు. అందుకే విమోచన కంటే దత్తత తీసుకోవడం అపురూపమైన వరము.

దేవుడు తండ్రి అనే భావన పాత నిబంధనలో కూడా ఉంది ( నిర్గమ 4:22, కీర్తన 103:13, యెషయా 64:8). ఏది ఏమైనప్పటికీ, దత్తత అనే భావన గురించి మనకు మరింత స్పష్టంగా వెల్లడి చేయబడినందున, క్రొత్త నిబంధనలో మనం దేవుని పితృత్వాన్ని సంపూర్ణంగా చూడగలుగుతాము.  పౌలు వ్రాసిన పత్రికలలో దత్తత అనే పదం 5 సార్లు కనిపిస్తుంది (రోమా 8:15, 23; 9:5, గలతి 4:5, ఎఫెసి 1:5).

దేవుడు తనకు అవసరం ఉన్నందువల్ల లేదా ఆయనకు ప్రయోజనం చేకూరడానికి మనలో ఏదైనా మంచిని చూసి  మనల్ని దత్తత తీసుకోలేదు. కానీ ఆయన మనలో చూసింది ఆయనకు వెన్నుచూపించిన తిరుగుబాటుదారులనే. అయినప్పటికీ, ఆయన మనల్ని దత్తత తీసుకున్నారు, ఎందుకంటే సంపూర్ణమైన ప్రేమతో ఆయన దానిని ఎంచుకున్నారు (ఎఫెసి 1:4-5). అలాంటి ప్రేమ మానవుని అవగాహనకు మించినది!

మనల్ని దత్తత తీసుకునే అలాంటి ప్రేమ ఫలితంగా నాలుగు ఆశీర్వాదాలు లభిస్తాయి.

ఆశీర్వాదం #1. దత్తత తీసుకోవడం వల్ల దేవుడిని మన తండ్రి అని పిలవగలుగుతాము.

యేసు దేవుని తన తండ్రి అని సంబోధించేటప్పుడు “నాయనా, తండ్రి” అనే పదాన్ని ఉపయోగించారు. (మార్కు 14:36). మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా దేవుడిని “నాయనా, తండ్రీ” (గలతీ 4:6) అని పిలవగలము. ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త సంబంధం శాశ్వతంగా ఏర్పడింది. మనం ప్రేమించబడ్డాము, సంరక్షించబడ్డాము, మరియు ఈ అద్భుతమైన పరలోకపు తండ్రి నుండి ఎప్పటికీ విడిపోము!

ఆశీర్వాదం #2. దత్తత మన ప్రార్థన జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది.

మనం ప్రార్థించేటప్పుడు దేవుడిని “పరలోకంలో ఉన్న మా తండ్రి” అని సంబోధించమని యేసు మనకు బోధించారు (మత్తయి 6:9). ఈ సాన్నిహిత్యం వలన మనం మన తండ్రియైన దేవుని దగ్గరకు వెళ్తాము, ఆయన మనపై శ్రద్ధ వహిస్తున్నందున మన మనవులన్నీ ఆయన వద్దకు వెళ్తాయి. మనం ఆందోళన నుండి విముక్తి పొందవచ్చు. మనం పాపం నుండి విముక్తి పొందవచ్చు. మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నిటినీ ఆయన క్షమిస్తాడు. ప్రేమగల తండ్రి ఎల్లప్పుడూ తన పిల్లల ప్రార్థనలను వింటాడు.

ఆశీర్వాదం #3. దత్తత భవిష్యత్తు కోసం మన నిరీక్షణను బలపరుస్తుంది.

రోమా 8:23లో “23 అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? 25 మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము” అని పౌలు చెప్పాడు. దీని భావం ఏమిటంటే, భవిష్యత్తులో మనం మహిమాన్వితమైన శరీరాలను పొందినప్పుడు దత్తత యొక్క పూర్తి అనుభవం ఉంటుందని అప్పటి వరకు మనం ఈ ప్రస్తుత జీవితంలోని శ్రమలను దృఢమైన నిరీక్షణతో సహిస్తామని పౌలు చెబుతున్నాడు.

2 కొరింథి 1:22 ప్రకారం, “ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు” “మనకు ముద్రవేసి” అనే పదబంధం భవిష్యత్తులో శాశ్వతత్వం కోసం మన మహిమాన్వితమైన స్థితిలో ప్రభువుతో ఉంటామనే వాస్తవాన్ని సూచిస్తుంది. ఈ సత్యం మన నిరీక్షణను కూడా బలపరుస్తుంది.

ఆశీర్వాదం #4. దత్తత వల్ల మన పరలోకపు తండ్రి ద్వారా శిక్షణ పొందగలుగుతాం.

హెబ్రీ 12:5-6లో “నా కుమారుడా, ప్రభువుచేయు శిక్షను తృణీకరించకుము; ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి” అని చెబుతోంది. ఇంకా ఇలా ఉంది, “కష్టాలను క్రమశిక్షణగా భరించండి; దేవుడు మిమ్ములను తన పిల్లలుగా పరిగణిస్తున్నాడు” (హెబ్రీ 12:7]). దీని భావం ఏమిటంటే, మనం దేవుని పిల్లలం కాబట్టి , దేవుడు మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు అని  హెబ్రీ పత్రిక రచయిత చెబుతున్నాడు. అది మంచి విషయం! మనం ఆయన బిడ్డలమని ఇది తెలియచేస్తుంది. ఈ క్రమశిక్షణ యొక్క అంతిమ లక్ష్యం, “మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు” అని హెబ్రీ 12:10లో చెప్పబడింది.

మన ప్రతిస్పందన.

దత్తతకు సంబంధించిన  ఈ 4 ప్రయోజనాల ప్రకారం (మరిన్ని జోడించవచ్చు), మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? అది చాలా సులభం. మనం “మన తండ్రియైన దేవుని అనుకరించాలి.” మనం ఆయన కుమారులం కుమార్తెలమైతే, మనం కుటుంబ పోలికను చూపించాలి! దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతను వెంబడించాలని దీని అర్థం (1 పేతురు 1:15-16). దేవుడు ప్రేమించే విధంగానే మనం ప్రేమించాలి (ఎఫెసి. 5:1-2), ఆ  ప్రేమ మన శత్రువులకు కూడా వర్తిస్తుంది (మత్తయి 5:44-45).

మనమంతా ఒకే కుటుంబమని దేవుని పిల్లలు ఎన్నటికీ మరచిపోకూడదు. ద్వేషానికి, అసూయకి గొడవలకు చోటివ్వకూడదు. మనం సంతోషాలను బాధలను పంచుకుంటాము. ఈ లోకపు తండ్రులు విఫలమైనప్పటికీ, దేవునిలో మనకు ఎంత ప్రేమగల తండ్రి ఉన్నారో తెలుసుకుని నెమ్మదిగా ఉందాము. విశ్రాంతి తీసుకుందాం. ఆయన మనల్ని తన కుటుంబంలోకి దత్తత తీసుకున్న ఫలితంగా మనకు ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉంది! ఈ వాస్తవాలు మన తండ్రిని అనుకరించాలనే పరిశుద్ధ సంకల్పాన్ని ఇవ్వాలి!

మీరు దేవుని బిడ్డ కాకపోతే, ఇప్పటికీ మీరు ఆయనను నా తండ్రి అని పిలవలేకపోతే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజే మంచి రోజు. మీరు మీ పాపాలను విడిచిపెట్టి, యేసుక్రీస్తును మీ ప్రభువుగా  మీ సొంత రక్షకునిగా స్వీకరించడం ద్వారా ఆయన కుటుంబంలోకి దత్తత కావచ్చు. యోహాను 1:12లో “తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అనే ఓదార్పునిచ్చే మహిమాన్వితమైన సత్యం మనకు చెప్పబడింది. మీరు దేవుని దయతో ఆయన ప్రేమపూర్వక ఆహ్వానానికి ప్రతిస్పందిస్తే, మీరు కూడా దత్తత అవ్వడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు!

కాబట్టి, సంకోచించకండి. దయచేసి రండి. మరింత మంది పిల్లలను చేర్చుకోడానికి దేవుడు తన కుటుంబంలో ఎల్లప్పుడూ స్థలాన్ని కలిగి ఉంటాడు! మానవ తండ్రులు బలహీనతలను కలిగివుండి కొన్నిసార్లు విఫలమవుతారు. అయితే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన ఒకే ఒక్క పరలోకపు తండ్రికి ఎలాంటి లోపాలు లేవు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు!

Category