ప్రభువు దినాన చర్చికి వెళ్ళడానికి ఆటంకం కలిగించే సాధారణ సమస్యలు

Posted byTelugu Editor August 4, 2025 Comments:0

(English version: Common Problems That Hinder Going To Church On The Lord’s Day)

మునుపటి పోస్ట్‌లో, “క్రైస్తవులు ప్రభువు దినాన్ని పాటించాలా?” అనే ప్రశ్నకు ఒక నిర్దిష్ట చట్టాన్ని పాటించాలనే భావనతో కాదు కాని ప్రభువు పట్ల మరియు ఆయన ప్రజల పట్ల ప్రేమతో క్రైస్తవులు ప్రభువు దినాన్ని పాటించాలి అని సమాధానం ఇవ్వబడింది. ప్రభువు దినాన ఆయన ప్రజలతో కలిసి ప్రభువును ఆరాధించడానికి విశ్వాసిని ప్రేరేపించేది నియమాలు కాదు కాని ప్రేమయే.

ప్రభువు దినాన చర్చికి వెళ్ళే అలవాటును క్రమం తప్పకుండా కొనసాగించడం గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ అది చేయడం చాలా కష్టమైన విషయం . ప్రజలను అలా చేయకుండా అడ్డుకునే కొన్ని సాధారణ సమస్యలను ఈ పోస్ట్ లో పరిశీలిద్దాము. ప్రభువు దినాన దేవుని మహిమపరిచే రీతిగా సంఘానికి హాజరవడంపై ఆచరణాత్మక సూచనలను తదుపరి పోస్ట్ అందిస్తుంది.

 ప్రభువు దినమున క్రమం తప్పకుండా హాజరు కావడం ఒక సమస్య అని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటో చూడటానికి, ఈ హాజరు గణాంకాలను చూడండి. ఒక సంవత్సరానికి 52 ఆదివారాలు. ఒకరు నెలకు ఒక ఆదివారం చర్చికి రాలేదని అనుకుందాం; ఆ ప్రకారం చూస్తే సంవత్సరానికి 12 ఆదివారాలు చర్చికి రాలేదు అంటే సంవత్సరానికి 23% గైరుహాజరు. ఒక వ్యక్తి నెలకు 2 ఆదివారాలు రాలేదని అనుకుందాం. ఆ ప్రకారం చూస్తే సంవత్సరానికి 24 ఆదివారాలు చర్చికి రాలేదు అంటే సంవత్సరానికి 46% గైరుహాజరుకు దారి తీస్తుంది.

ఇక్కడ ఉన్న సమస్యను మీరు గమనించారా? ఈ సంఖ్యలను చూడనంత వరకూ మనకు ఈ గైరుహాజరు పెద్ద సమస్యగా కనిపించదు. ఈ పోస్ట్ను చదివే కొంతమంది పాఠకులు చాలా అసౌకర్యానికి గురికాకుండా ఉండడానికి నేను మరింత ముందుకు వెళ్లకూడదని అనుకుంటున్నాను (ఒక కోణంలో, ఇది చెడ్డ విషయం కాకపోవచ్చు). పరిపూర్ణ హాజరనేది నిజమైన ఆధ్యాత్మికతకు సంకేతం కాదని నాకు పూర్తిగా తెలుసు. పరిసయ్యులు హాజరవడంలో పరిపూర్ణంగా ఉన్నారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అయితే, హాజరు అనేది ప్రాధాన్యతల గురించి మరియు మనం ప్రభువు దినాన్ని ఆయన రోజుగా పరిగణిస్తున్నామా లేదా అనే దాని గురించి కూడా కొంత మేరకు తెలియజేస్తుంది!

ఆ ఉపోద్ఘాత ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని, ఒక వ్యక్తి క్రమంగా చర్చికి హాజరుకాకుండా అడ్డుకునే సాధారణ సమస్యలను చూద్దాం. సౌకర్యంగా ఉండడానికి నేను వాటిని  లాభం మరియు ఆనందం అనే రెండు వర్గాలుగా వర్గీకరించాను.

నేను మరింత ముందుకు వెళ్లడానికి ముందు, నియంత్రణ చేయలేని కారణాల వల్ల ( ఉదా:  అనారోగ్యం) నిజంగా చర్చికి వెళ్లలేని వారికి ఈ పోస్ట్ వర్తించదని తెలియచేస్తున్నాను.

1. లాభం

చైనాలో ఒక ఇతిహాసం ఉంది. ఒకరోజు మార్కెట్‌కి వెళ్లిన వ్యక్తి గురించి కథ. అతని దగ్గర ఏడు నాణేలు ఉన్నాయి. అతడు ఒక బిచ్చగాడిని చూసి ఆ నాణేలలో ఆరింటిని బిచ్చగాడికి ఇచ్చి ఏడవది తన జేబులో పెట్టుకున్నాడు. అయితే, జేబుదొంగ అయిన ఆ బిచ్చగాడు మిగిలిన ఆ ఏడవ నాణేన్ని కూడా అతని దగ్గర నుండి దొంగిలిస్తాడు. ఇది మన ఆధునిక కాలానికి తగిన ఉపమానం! మన ప్రభువు మనకు మన పని చేయడానికి ఆరు రోజుల సమయం ఇచ్చాడు, కానీ చాలామంది “నేను ఏడవది కూడా దొంగిలించి నా కోసం ఉపయోగించుకుంటాను” అంటున్నారు.

ప్రభువు దినము అనేది క్రైస్తవులమని చెప్పుకునే చాలామందికి లౌకిక పనికి సంబంధించిన మరొక రోజు వంటిదే. పని తప్పనిసరి అయిన ఏ పరిస్థితి గురించి నేను మాట్లాడటం లేదు. ఆది సంఘంలో కూడా బానిసలుగా ఉన్న చాలామంది విశ్వాసులు ఆదివారం కూడా పని చేయవలసి వచ్చింది. నిబద్ధతతో ఉన్న క్రైస్తవులు కూడా ఉద్యోగ స్వభావాన్ని బట్టి కొన్ని ఆదివారాల్లో పని చేయాల్సిన సందర్భాలు ఉన్నాయని నాకు తెలుసు(అటువంటి సందర్భాలలో కూడా పరిస్థితులను మార్చమని ప్రార్థించి ప్రభువును అడగవచ్చు. దేవుడు తన కాలంలో పరిస్థితిని మార్చగల శక్తిమంతుడు).

పని నుండి విరామాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికి పని చేయడానికే మొగ్గు చూపించే సమయాల గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. దాని ఫలితంగా వారు చర్చికి రాలేకపోతున్నారు. అటువంటి సందర్భాలలో కూడా, చర్చిని దాటవేయడానికి దారితీసే ప్రాపంచిక విషయాలను వెదికే శోధనను అధిగమించడానికి సహాయం చేయమని ప్రభువుకు మొర పెట్టవచ్చు. ప్రభువు దినాన ఆయనను ఘనపరిచాలనే ఉద్దేశం మనకుంటే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ప్రభువును మహిమపరిచే మార్గాలకు మనం “అవును” అని చెప్పాలని ఎంచుకుంటే, మనం కొన్ని ఆర్థిక నష్టాలను లేదా కెరీర్ నిచ్చెన పైకి ఎదగలేకపోవడం వంటి ఇతర నష్టాలను ఎదుర్కోవచ్చు. అయితే, మన కోసం తన సర్వస్వం అర్పించిన యేసును ఘనపరిచే విషయంలో మనం అలాంటి నష్టాలను లెక్కించాలా?

మరో విషయం, పరీక్షల కోసం చదువుతూ ఆదివారం ఆరాధన మానివేసే విద్యార్థులు కూడా ప్రభువు దినాన ఆయనను అవమానించే పని చేస్తున్నారు. అది ఎలాగంటే, మనం మన కుటుంబానికి కూడా ప్రభువైన యేసు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడనప్పుడు (లూకా 14:26), ఆ పరీక్షను చదివి వ్రాయడానికి మనకు అవకాశం ఇచ్చే వానికంటే మనం ఆ పరీక్షకు ఎక్కువ  ప్రాధాన్యత ఇవ్వగలమా? చర్చిని మానడానికి బదులుగా, విశ్వాసంతో ప్రభువు దినాన ఆయన ప్రజలతో కలిసి ఆరాధించడానికి రావడం ద్వారా ఆయనకు విధేయత చూపడానికి ప్రయత్నించాలి. ప్రార్థనాపూర్వకంగా రెండు గంటల సమయాన్ని గడిపి ఇతర సమయాలను ప్రభావవంతంగా చదవడానికి ఉపయోగించవచ్చును. ప్రభువును ఆరాధించడానికి చర్చికి రావడం వలన గ్రేడ్‌లు కొంచెం తగ్గినా పర్వాలేదు. అది విధేయత చూపడానికి అయ్యే ఖర్చు! చిన్న వయస్సు నుండే అన్నింటికన్నా యేసును ఉన్నతంగా ఉంచడం నేర్చుకోవడం మంచిది సరైనది.

ఈ విషయంలో, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలి మరియు వారిని ఉన్నత విద్యాభ్యాసం లేదా పని కోసం నెట్టడం ద్వారా వారికి అడ్డంకిగా ఉండకూడదు – అది ప్రభువు దినాన చర్చికి రాకుండా వారిని అడ్డుకుంటుంది. పిల్లలు అలవాట్లు చేసుకుంటారు. తల్లిదండ్రులుగా మనం వారిని ఏ మాదిరిలో పెంచుతున్నాము? మనల్ని మనం మోసం చేసుకోకూడదు: ఈ రోజు మనం విత్తిన పంటనే తర్వాత మనం కోస్తాము! అంతేకాకుండా, తల్లిదండ్రులుగా మనం ప్రభువు దినాన ఆరాధన కంటే పనికి ప్రాధాన్యత ఇస్తే, మనం మన పిల్లలకు ఏ సందేశం ఇస్తాము?

ఆదివారాల్లో విశ్వాసులు చర్చికి రాకుండా అడ్డుగా ఉన్న మొదటి సమస్యయైన లాభాన్ని చూసాము కదా, ఇప్పుడు రెండవ సమస్యను చూద్దాము.

2. సరదాలు

ప్రభువు దినాన ప్రజలు చర్చికి రాకుండా నిరోధించే రెండవ ప్రధాన సమస్య ఏమిటంటే, సరదాలలో మునిగితేలడం. ప్రత్యేకించి ఆదివారాల్లో క్రీడలు మరియు ఇతర సరదా కార్యక్రమాలలో పాల్గొనడము. చాలాకాలం పాటు చర్చికి రాకుండా చేసే లాంగ్ స్పోర్ట్స్ యాక్టివిటీలలో పిల్లలను చేర్చడం; అది అలా సంవత్సరం తర్వాత సంవత్సరం కొనసాగుతుంది! అలాంటి నిర్ణయాలు ప్రభువుకు సంతోషాన్ని ఘనతని ఎలా ఇస్తాయి?

ఒకరు ఇలా అనవచ్చు: “నాకు దొరికే రోజు ఇది ఒక్కటే. దానిలో కొంచెం ఆనందాన్ని విశ్రాంతిని పొందితే తప్పు ఏముంది? నా పిల్లలు వారి క్రీడలను ఇష్టపడితే ఏముంది? క్రీడలలో వారి ఎదుగుదలను నేను ఎలా అడ్డుకోగలను? దేవుడు దయగల దేవుడు, పాత నిబంధన కాలంలో లాగా మనం ధర్మశాస్త్రానికి లోబడి జీవించనవసరం లేదు. దానికితోడు, నేను పని చేస్తున్నట్లు కాదు. ఆదివారాలు పని చేయకూడదని నేను కూడా చెబుతాను. ఆదివారాల్లో శ్రమపడకూడదు!”.

నిజమే, మనం నియమాలకు లోబడి లేము. “దేవుడు నిజానికి  దయగల దేవుడు” (1 పేతురు 5:10). “మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కాదు” (రోమా 6:14). ఏది ఏమైనప్పటికీ, ప్రభువు దినాన పనికి దూరంగా ఉండి, ఆనందంలో మునిగితేలే వారితో ఉండే విచారకరమైన విషయం ఏమిటంటే: వారు కేవలం ఒక విగ్రహానికి బదులుగా మరొక విగ్రహాన్ని (అంటే, పనికి సరదాలు) మార్చారు, ఎందుకంటే దాని అంతిమ ఫలితం: ప్రభువు దినాన ఆయన  ప్రజలతో కలిసి ప్రభువును ఆరాధించకపోవడమే!

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి వాటిని చేయాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. నాకు కూడా పిల్లలు ఉన్నారు! కానీ మనతో మనం నిజాయితీగా ఉందాం: ప్రభువును గౌరవించడం కంటే క్రీడలను ఎంచుకోవడం అంటే బహుమానం ఇచ్చిన వాని కన్నా బహుమానానికే ప్రాధాన్యత ఇవ్వడం కాదా? మనం ఆయనకు రెండవ స్థానం ఇస్తే అది ఆయనకు ఇష్టమవుతుందా? మనం ఏ మాటలు చెప్పినా చివరకు, మన హృదయాలలో నిజంగా ఏది మొదటి స్థానంలో ఉందో మన పనులు తెలియజేస్తాయి!

పార్కు, ఫిషింగ్, క్యాంపింగ్ మొదలైన ఇతర విషయాల గురించి కూడా ఇదే చెప్పవచ్చు, తద్వారా క్రమంగా ప్రభువు దినాన ఆయన ప్రజలతో కలిసి ప్రభువును ఆరాధించడాన్ని మానేస్తారు. మనం పార్కుకు వెళ్లకూడదని, కలిసి సరదాగా బయటకు వెళ్లకూడదని, విశ్రాంతి తీసుకోకూడదని, సెలవులలో ఆనందించకూడదని దీని అర్థమా? అస్సలు కాదు! ఎవరైనా ఆ పనులన్నింటినీ సరైన పరిమితుల్లో చేసుకుంటూ ప్రభువు దినాన ఆయన మందిరానికి వచ్చి ప్రభువును ఘనపరచవచ్చు! సెలవులో కూడా, స్థానిక చర్చిని సందర్శించి ఇతర విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధించడానికి మనం హృదయపూర్వక ప్రయత్నం చేయవచ్చు. సెలవులకు ముందే చూడవలసిన ప్రదేశాల గురించి వెతికే మనం అక్కడ సమీపంలో ఉన్న మంచి బైబిలు-బోధించే చర్చిని వెదకడానికి ప్రయత్నిస్తున్నామా?

వేసవి కాలంలో తరచుగా చర్చిని మానేసే తన సంఘ సభ్యుడిని ఒక పాస్టర్ సందర్శించి దానికి కారణం అడిగాడు. మంచి గోల్ఫ్ క్రీడాకారుడైన ఆ వ్యక్తి, “పాస్టర్, నేను ఆదివారం చర్చిలో లేనందుకు చింతించకండి. నేను గోల్ఫ్ కోర్స్‌లో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆరాధిస్తాను” అని చాలా నమ్మకంగా సమాధానమిచ్చాడు.

అందుకు ఆ పాస్టర్ నెమ్మదిగా, “మీరు గోల్ఫ్ కోర్స్‌లో ప్రభువును ఆరాధించడం లేదు. మీరు నిజానికి ప్రభువు కోర్స్‌లో గోల్ఫ్‌ను ఆరాధిస్తున్నారు” అని అన్నాడు. మనం దేవుని కన్నా మన ఆనందానికి లేదా మన పిల్లల ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనకు మనం ఏమి చెప్పుకున్న సరే, మనం దేవుని కాకుండా మనల్ని మరియు మన పిల్లలను ఆరాధిస్తున్నామనేది వాస్తవము.

దేవుడు “మన ఆనందానికి” మనకు చాలా మంచి విషయాలను ఇస్తారు (1 తిమోతి 6:17). అయితే, బహుమతులకు వాటిని ఇచ్చేవారి స్థానం ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. ప్రభువు దినాన దేవుని ఆరాధించడానికి మన ఆనందాలు అడ్డుగా వచ్చినప్పుడు, వాటిని ఒక అవరోధంగా భావించి నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగించాలి. ఆదివారం ప్రభువు దినం కాబట్టి విశ్వాసి ప్రభువు దినాన ప్రభువు మందిరంలో ఉండడానికి ప్రయత్నించాలి.

క్రైస్తవులుగా చెప్పుకునే వారు ప్రభువు దినాన్ని మానివేయడం పట్ల బాధపడకపోవడం చాలా విచారకరం. నిజానికి చాలామంది ప్రభువు దినాన్ని చాలా కష్టమైన విషయంగా భావిస్తారు. వారు, “చర్చికి రావడం చాలా కష్టం. అందుకు చాలా శ్రమపడాలి” అంటారు. అదెంతో భారమని వారు భావిస్తారు. తమ పాపాల కోసం మరణించిన వానిని ఆరాధించడానికి చర్చికి వెళ్లడం నిజంగా కష్టమనే అబద్ధాన్ని నమ్మడం మొదలుపెట్టే వరకు వారు ఇది చాలా కష్టమని అంటూనే ఉంటారు. అలాంటి వైఖరి మలాకీ కాలంలోని యాజకులలో ఒకరికి గుర్తుచేస్తుంది (మలాకీ 1:6-14).

అనారోగ్యంతో ఉన్న రోజులతో సహా ఇతర రోజులతో పోల్చితే మనం ప్రభువు దినాన్ని ఎలా పరిగణిస్తామో చూస్తే అది కూడా హృదయ విదారకంగా ఉంది. మనం నిజంగా అనారోగ్యంతో రాలేని రోజుల గురించి నేను చెప్పడం లేదు. అలాంటి సందర్భాలలో అది ప్రభువు దినామైనా ఇంట్లోనే ఉండి శరీరానికి విశ్రాంతి ఇవ్వడం సముచితమే. శరీరంలో అక్కడో ఇక్కడో  కొంచెం నొప్పిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉండటానికి ఇష్టపడే సందర్భాల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను – అయితే అలాంటి నొప్పి మనల్ని పనికి వెళ్ళకుండా నిరోధించదు. కొన్నిసార్లు, శుక్రవారం నొప్పి వచ్చినా ఆదివారం చర్చికి వెళ్లలేమని అప్పటికే నిర్ణయించుకుంటాము! అలాంటి ప్రవచనాత్మక శక్తులు ఉండటం ఆశ్చర్యకరం కదా! అయినప్పటికీ, చాలా ఓపిక ఉత్సాహంతో పార్టీలతో సహా ఇతర సరదా కార్యక్రమాలలో పాల్గొని శనివారం రాత్రులు చాలా సమయం వరకూ ఉంటాము. అయితే, ఆదివారం ఉదయం వచ్చేసరికి చర్చికి వెళ్లలేనంతగా మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటాము. ఇది మన ప్రాధాన్యతల గురించి ఏమి చెబుతుంది?

చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ స్థానిక వార్తాపత్రికకు రాసిన లేఖ పై భావాన్ని సముచితంగా వివరిస్తుంది. ఆ లేఖలోని అంశాలు ఏమిటంటే:

మశూచి కంటే అధ్వాన్నమైన ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. అది చర్చి సభ్యులలో చాలామందిని బాధించే వ్యాధి. లక్షణాలు మారుతూ ఉంటాయి కానీ ఆకలిని ప్రభావితం చేయవు. ఇది ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉండదు. దీని గురించి ఎవరూ వైద్యులను సంప్రదించరు. ఇది ఎప్పుడూ ఆత్మకు ప్రాణాంతకం అని నిరూపించబడుతూనే ఉంది. ఇది చాలా ప్రబలంగా ఉండి ప్రతి సంవత్సరం వేలాది మందిని నాశనం చేస్తుంది. ఇది ప్రతి ఆదివారం ఉదయం అకస్మాత్తుగా సోకుతుంది.

శనివారం రాత్రి ఎలాంటి లక్షణాలు కనిపించవు కాని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సోకుతుంది. సాధారణంగా, బాధితుడు రాత్రి చాలా మంచి నిద్రను ఆస్వాదిస్తాడు, రుచికరమైన అల్పాహారం తింటాడు కానీ చర్చి సమయంలో ఆకస్మికంగా ఈ వ్యాధి చాలా తీవ్రంగా సోకుతుంది. ఉదయకాలపు ఆరాధనలు ముగిసే వరకు ఇది కొనసాగుతుంది, ఆపై వారు పెద్ద విందు తినడానికి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. మధ్యాహ్నం బాధితుడు చాలా మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తాడు; మోటారు రైడ్, గోల్ఫ్ ఆట లేదా ఇతర వ్యాయామాలకు బయటకు వెళ్తాడు.

ఈ వ్యాధి కళ్లను ఎప్పుడూ ప్రభావితం చేయదు కాబట్టి రోగి ఆదివారం పేపర్‌ను పూర్తిగా ఆస్వాదించగలడు. భోజన సమయానికి, అది మరొకసారి సోకి సాయంత్రం చర్చి ఆరాధనలు ముగిసే వరకు ఉంటుంది. సోమవారం ఉత్సాహంగా మేల్కొంటారు. తరువాతి ఆదివారం వరకు మరలా అది సోకదు.

నివారణ: ఒక పెద్ద మోతాదు, “నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు” (ఎఫెసి. 5:14).

ఒక రచయిత ఈ సమస్యను చాలా చక్కగా చెప్పాడు: “చర్చి సభ్యులతో సహా చాలామంది ప్రజలకు వారి వారంలో చర్చికి ప్రాధాన్యత లేదు. చర్చికి వెళ్లడం కంటే పాఠశాలకు పనికి క్రీడలకు మరియు ఇతర కార్యకలాపాలు ప్రాధాన్యతనిస్తారు. వారాంతాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఆటలు ఆడటానికి, నిద్రపోడానికి, ఎక్కువసేపు మేల్కొని ఉండడానికి సమయంగా భావించే ఈ లోకం తమ సమయాన్ని నియంత్రంచడానికి అవకాశం కల్పించడం వారి పొరపాటు. క్రైస్తవులకు ఆదివారం వారంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరు చర్చి చుట్టూ మీ పని, కార్యకలాపాలు, సమావేశాలు మరియు సెలవులను షెడ్యూల్ చేయడానికి ప్రయత్నించాలి.”

ప్రభువు దినాన్ని సరైన రీతిలో గడపడం ద్వారా, ప్రభువు దినాన్ని మనం ఎలా గడపాలో ఈ లోకం నిర్దేశించదు కానీ ప్రభువు మనం ఆయన దినాన్ని ఎలా గడపాలో నిర్దేశిస్తారని మనం ఈ లోకానికి చెబుతాము. ఇంకా మనం ఏమి గుర్తుంచుకోవాలంటే: అది ప్రభువు దినం. ప్రభువు సగం దినం కాదు! నేను నా రెండు గంటలు దేవునికి ఇచ్చాను. కాబట్టి ఇప్పుడిక నా సొంత పని చేసుకుంటాను అనే వైఖరి ఉండకూడదు. అటువంటి దృక్పథంతో, ముఖ్యంగా ఎప్పుడూ గడియారం వంక చూస్తూ దేవుని హృదయపూర్వకంగా ఎలా ఆరాధించగలం? మనం ఆ రోజంతా ప్రభువు దినంగా భావించి ఆయనను ఘనపరచడానికి కృషి చేయాలి.

ప్రభువు దినం అనేక ఇతర కార్యకలాపాలతో తీరికలేకుండా ఉందని అనుకుందాం. అలాంటప్పుడు, చర్చి, బైబిలు చదవడం, మంచి క్రైస్తవ పుస్తకాన్ని చదవడం/ప్రార్థించడం/ప్రభువును ధ్యానించడం వంటి కార్యకలాపాలలో పాల్గొనలేము. అయితే ప్రభువు దినాన కుటుంబమంతా ఒక్కటిగా కలిసి, ప్రభువు విషయాలను చదవడం/ప్రార్థించడం/ధ్యానం చేయడానికి, కుటుంబ సమేతంగా చర్చికి వెళ్లడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారని ఊహించండి. అది ఎంతటి ఆశీర్వాదం అవుతుంది! (ఈ పోస్ట్ చదువుతున్న కొందరికి రక్షణ పొందని జీవితభాగస్వామి ఉండవచ్చు లేదా చర్చికి రావడానికి బైబిలు చదవడానికి నిరాకరించే పిల్లలు ఉండవచ్చని నాకు తెలుస. అది చాలా కష్టమే అయినప్పటికీ, ఆచరణాత్మకంగా దేవునికి సంబంధించిన విషయాలకు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించడానికి తమ వంతు కృషి చేయడానికి విశ్వాసిగా చెప్పుకునేవారు తప్పనిసరిగా ప్రయత్నించాలి.)

ప్రభువు దినాన సరదాగా బయటకు వెళ్లి కారు ప్రమాదంలో మరణించిన ఒక అందమైన అమ్మాయి అంత్యక్రియలను చాలా కాలం క్రితం డ్వైట్ హిల్లిస్ అనే పాస్టర్ నిర్వహించారు. తండ్రి ప్రియమైన కుమార్తెకు వీడ్కోలు చెప్పి, తన స్నేహితుల వైపు తిరిగి దుఃఖ స్వరంతో ఇలా అన్నాడు: “మేము ఆదివారం గోల్ఫ్ ఆడుతూ లేదా ఇతర సరదా పనులు చేస్తూ గడిపాము. మా పిల్లలు మా మాదిరిని అనుసరించడమే కాకుండా దానిలో మమ్మల్ని మించిపోయారు. మా అబ్బాయి నన్ను అవమానపరిచాడు, మా అమ్మాయి చనిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి ఒకే ఒక మార్గం ఉందని నేను మీకు చెప్తున్నాను, అది సండే స్కూల్ మరియు చర్చిలోనే ఉంది. నేను ఏమి మాట్లాడుతున్నానో నాకు తెలుసు.”

నేను మళ్లీ చెబుతున్నాను: తల్లిదండ్రులారా, మనం మన పిల్లలకు ఏ మాదిరి ఇస్తున్నాము? లాభం,  సరదాలు అనే జంట బలిపీఠాలపై ప్రభువు దినాన్ని త్యాగం చేయవద్దు. దానికి బదులుగా, ప్రభువు పట్ల ఆయన ప్రజలపట్ల మనకున్న ప్రేమ ప్రభువు దినాన్ని ఆయన దినంగా ఘనపరిచేలా మనల్ని నడిపించాలి.

తదుపరి పోస్ట్‌లో, ప్రభువు దినాన్ని ఘనపరచాల్సిన విధంగా ఘనపరచడంలో సహాయపడగల ఆచరణాత్మక సూచనలు అందిచబడతాయి.

అయితే, లాభం మరియు ఆనందం అనే ఈ శత్రువులను [పాపాలను] అంతం చేయాలనే పవిత్ర సంకల్పం ఉంటే తప్ప, ఎన్ని ఆచరణాత్మక సూచనలు ఇచ్చినా అవి సహాయపడలేవు. ప్రభువు దినాన దేవుని ఆరాధించడానికి రావడమనేది ఒకరి హృదయాన్ని పట్టుకునే నమ్మకంగా మారితేనే తప్ప అది జరగదు. కాబట్టి, అలాంటి విశ్వాసం మీకు ఇంకా లేకుంటే ఎందుకు దానికోసం గట్టిగా ప్రార్థించకూడదు?

Category