పాపపూరిత కోపము—అది సృష్టించే వినాశనం 6వ భాగము—పాపపూరిత కోపం యొక్క విధ్వంసక పరిణామాలు ఏమిటి?

(English Version: “Sinful Anger⎯The Havoc It Creates⎯Part 6”)
పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో ఇది 6వ భాగము. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయం 1వ భాగంలో, “కోపం అంటే ఏమిటి?” అనే మొదటి ప్రశ్నను 2వ భాగంలో, పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే రెండవ ప్రశ్నను 3వ భాగంలో, పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు? అనే మూడవ ప్రశ్నను 4వ భాగంలో, పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి? అనే నాల్గొవ ప్రశ్నని 5వ భాగంలో చూశాము.
ఈ పోస్ట్‌లో మనం 5వ ప్రశ్నను పరిశీలిస్తాము:
పాపపూరిత కోపం యొక్క విధ్వంసక పరిణామాలు ఏమిటి?
మొదటిగా, కోపంతో కూడిన మన ప్రేలాపనలకు మూల్యం చెల్లించవలసి ఉందని మనం అర్థం చేసుకోవాలి. బైబిలు ఈ సత్యాన్ని చాలా స్పష్టంగా బోధిస్తోంది. యోబు 5:2లో దౌర్భాగ్యమును గూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు [పాపపూరిత కోపాన్ని వివరించడానికి మరొక మార్గం] అని ఉంది. ఒక మూర్ఖుడి తీవ్రమైన కోపం చివరికి అతన్ని చంపేస్తుంది అనే అభిప్రాయ వివరణ భావాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది. మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు [సామెతలు 19:19] అని జ్ఞానియైన సొలొమోను [ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత] చాలా స్పష్టంగా చెప్పాడు.
పాపపూరిత కోపానికి లొంగిపోవడం విధ్వంసక పరిణామాలకు దారి తీస్తుందని స్పష్టమవుతుంది: వాటిలో ఏడు పరిణామాలు క్రింద ఇవ్వబడినవి.
విధ్వంసక పరిణామం # 1. పాపపూరిత కోపం ప్రజలను మన నుండి దూరం చేస్తుంది.
కోపంగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండడాన్ని గురించి ఒక రచయిత చెబుతూ “టైమ్ బాంబ్‌కు దగ్గరగా హత్తుకోవడమే―అది ఎప్పుడు పేలుతుందో మిమ్మల్ని ఎలా ముక్కలుగా చేస్తుందో మీకు తెలియదు” అన్నాడు. చిన్న విషయం కూడా కోపం ఉన్న వ్యక్తిని రెచ్చగొడుతుంది. కోపంతో ఉన్న వ్యక్తులు కారణాన్ని వినరు. అవతలి వ్యక్తి ఏమి చెప్పాలనుకుంటున్నాడో వినలేనంతగా వారు కేకలు వేయడంలో బిజీగా ఉంటారు. కోపంగా ఉన్న వ్యక్తుల దగ్గర ఉండడం అంటే గుడ్లపెంకులపై నడవడం లాంటిది. అందుకే ప్రజలు సాధారణంగా కోపంతో ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉంటారు. గాయపడకుండా ఉండడానికి తమ నుండి వారిని దూరంగా ఉంచాలని కోరుకుంటారు!
సామెతలు 22:24లో “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము” అని సొలొమోను హెచ్చరించడంలో ఏ ఆశ్చర్యం లేదు. సొలొమోను కన్నా కొన్ని శతాబ్దాల ముందు జీవించిన అతని పితరుడైన యాకోబు తాను చనిపోయే ముందు కూడా అదే విధంగా చెప్పాడు. ఆదికాండము 34లో యాకోబు కుమార్తెయైన దీనాను షెకెము పాలకుడి కుమారుడు షెకెము అత్యాచారం చేశాడని తత్ఫలితంగా ఆమె సోదరులైన షిమ్యోనును లేవీలు ఆ పట్టణంలో ఉన్న పురుషులందరిని నాశనం చేశారు, ఇది అనియంత్రితమైన అన్యాయమైన కోపం యొక్క ఫలితం!
యాకోబు తన మరణశయ్య మీద వారిపై పలికిన తీర్పులోని మాటలు ఇవి: “5 షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. 6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు; నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. 7 వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును; యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.”
కొన్నిసార్లు ఒక జీవిత భాగస్వామి మరొకరిని విడిచిపెట్టేంతగా ఉండే పాపపూరిత కోపం వల్ల ఎన్నో వివాహాలు నాశనం అవుతాయి కదా? మరోసారి, సొలొమోను మాటలు మనకు ఈ సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి, “గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు” [సామెతలు 21:9]. సామెతలు 25:24లో కూడా ఇదే సత్యం పునరావృతమవుతుంది. గొడవపడే భార్యయైన భర్తయైన ఈ సామెత చాలా వివాహాలలో వాస్తవము!
పాపపూరిత కోపం యొక్క ఒక పరిణామం ఇది: కోపంతో ఉన్న వ్యక్తి ఒంటరిగా జీవిస్తాడు. విశ్వాసులు ఒంటరిగా జీవించడానికి పిలవబడలేదు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే, మనం పాపపూరిత కోపంతో నియంత్రించబడుతున్నాం అనుకుందాం. అలాంటప్పుడు, మనం ఒంటరితనం వల్ల కష్టాలను అనుభవించడమే కాకుండా, మీవలె మీ పొరుగువారిని ప్రేమించండని దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో కూడా విఫలమవుతాము.
కొన్ని సందర్భాల్లో, కొంతమంది తమ నుండి ప్రజలను దూరం చేసుకోడానికి కోపాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా, వారు ఇతరులను నియంత్రిస్తారు లేదా ఏమారుస్తారు. అది ఎలాగంటే, ప్రజలను దూరంగా ఉంచడం అంటే వారు ఇతరులతో―ముఖ్యంగా వారు బాధపెట్టిన వారితో పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వారు అన్ని రకాల ఘర్షణలు, ఆరోపణలు మొదలైనవాటిని నివారించగలుగుతారు. సాధారణంగా ప్రజలు కోపంతో మండిపడేవారి నుండి దూరంగా ఉంటారని వారికి తెలుసు కాబట్టి, వారు తమ కోపాన్ని ప్రజలను దూరంగా ఉంచడానికి ఉపయోగిస్తారు.
మీరు జీవితంలో ఒంటరిగా ఉంటే, ఈ రెండు ప్రశ్నలు వేసుకోవడం మంచిది:
ఎ. నా కోపమే ప్రజలను నాకు దూరం చేస్తుందా?
బి. నేను నా కోపాన్ని ప్రజలను నా నుండి దూరం చేయడానికి ఉపయోగిస్తున్నానా?
కాబట్టి, పాపపూరిత కోపం ప్రజలను మన నుండి దూరం చేస్తుందని హెచ్చరించుకోవాలి.
విధ్వంసక పరిణామం # 2. పాపపూరిత కోపం ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
సామెతలు 22ని మళ్ళీ చూద్దాం. అయితే ఈసారి 24, 25 వచనాలను చూద్దాం.
సామెతలు 22:24-25 “24 కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము. 25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
25వ వచనాన్ని గమనించండి, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. మరో మాటలో చెప్పాలంటే, పాపపూరిత కోపం ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సొలొమోను మనకు చెబుతాడు. తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుంది.”
మీరు కోపం ఉన్న తల్లిదండ్రులు అయితే, మీ పిల్లలు మిమ్మల్ని ప్రతిరోజు కోపంగా ఉండడం చూస్తున్నారని ఊహించుకోండి. అది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది? ఇతరులపై-ముఖ్యంగా మన పిల్లలపై సానుకూలమైన ప్రభావం చూపించడానికి మనం పిలువబడ్డాము! కానీ పాపపూరిత కోపం దానికి పూర్తి విరుద్ధంగా చేయడాన్ని గమనించండి!
కాబట్టి, పాపపూరిత కోపం ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరించుకోవాలి.
విధ్వంసక పరిణామం # 3. పాపపూరిత కోపం హత్యతో సహా ఇతర పెద్ద పాపాలకు దారితీయవచ్చు!
సామెతలు 29:22 “కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.”
అని చెబుతోంది. కయీనును జ్ఞాపకం చేసుకోండి; హేబేలుపై అతనికున్న కోపం చివరికి హేబేలును హత్య చేయడానికి దారితీసింది [ఆది 4:6-8] కదా? బైబిలులోని మొదటి హత్య―అనియంత్రిత కోపం ఫలితంగా సోదరుడిని చంపడం. “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనే” [ఆది 4:7] మాటలతో దాని తీవ్రత తెలియచేస్తూ కోపమనే పాపం అతడిని నియంత్రిస్తోందని దేవుడు కయీనును హెచ్చరించినప్పటికీ అతడు వినలేదు.
మనం హత్య చేయనప్పటికి, మన పాపపూరిత కోపం మనం మొదట అనుకున్నదానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. దానికి ఉదాహరణ అనియంత్రిత కోపం ఫలితంగా వచ్చే పాపపూరిత మాటలు. సామెతలు 12:18 “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు; జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని చెబుతోంది. కోపంతో మాట్లాడిన మాటలు వారు మాట్లాడిన చాలా కాలం తర్వాత కూడా ఇతరులను గాయపరచి బాధిస్తాయి. మనం ఎవరినైనా శారీరకంగా చంపకపోయినా, అదుపు చేసుకోలేని కోపంతో మనం అన్న మాటలతో పదే పదే వారిని చంపేస్తాము.
పోలీసు భాషలో, హింసాత్మక చర్యను కొన్నిసార్లు “కోపంతో చేసిన నేరం” అని పిలుస్తారు, అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఒక వ్యక్తికి వచ్చిన ఆకస్మిక కోపం కారణంగా ఇటువంటి నేరాలు సాధారణంగా జరుగుతాయి. తరచుగా ఒక సాధారణ గొడవ―భౌతిక హింసతో సహా అనేక ఇతర పాపాలకు దారితీస్తుంది, హత్య గురించి చెప్పనక్కర్లేదు! దానికి మన కోపాన్ని నియంత్రించుకోలేకపోవడమే కారణము. కోపంతో ఉన్న వ్యక్తులు ఆవేశపూరితమైన పనులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కోపం అనే పాపాన్ని తొలిదశలోనే తుడిచివేయడానికి కృషి చేయాలి కాని అది పెరిగే వరకు వేచి ఉండకూడదు!
కాబట్టి, పాపపూరిత కోపం హత్యతో సహా ఇతర పెద్ద పాపాలకు దారి తీస్తుందని హెచ్చరించుకోవాలి.
విధ్వంసక పరిణామం # 4. పాపపూరిత కోపం అమాయకులను కూడా బాధించేలా చేస్తుంది.
కొన్నిసార్లు తల్లిదండ్రులుగా కూడా మన అనియంత్రిత కోపం చిన్న పిల్లలను మాటలతో గాని శారీరకంగా గాని బాధించేలా చేస్తుంది. ఈ సత్యాన్ని వివరించే ఒక చిన్న బాధాకరమైన కథ:
ఒక వ్యక్తి తన కొత్త కారును పాలిష్ చేస్తుండగా, అతని 4 ఏళ్ల కుమారుడు ఒక రాయి తీసుకుని వాహనానికి మరో వైపు గీతలు గీసాడు. కోపంతో ఆ వ్యక్తి తాను రెంచ్ ఉపయోగిస్తున్నానని గ్రహించకుండా పిల్లవాడి చేయి పట్టుకుని చాలాసార్లు కొట్టాడు.
ఎక్కువ గాయాల కారణంగా ఆ బిడ్డ తన వేళ్లన్నింటినీ కోల్పోయాడు. హస్పటల్లో బాధాకరమైన కళ్లతో ఉన్న తన తండ్రిని చూసిన పిల్లవాడు, ‘నాన్న, నా వేళ్లు ఎప్పుడు పెరుగుతాయి?’ అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చాలా బాధతో మాట్లాడలేకపోయాడు.
అతడు తన కారు దగ్గరకి వెళ్లి దానిని చాలాసార్లు తన్ని ఇక నిలబడలేక ఆ కారు ముందు కూర్చున్నప్పుడు, ‘లవ్ యు డాడ్’ అని తన బిడ్డ వ్రాసిన గీతలు చూశాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
దయచేసి ఈ కథ నుండి మనం మన పిల్లలను ఎప్పటికీ శిక్షించకూడదు అనే తప్పుడు నిర్ధారణకు రావద్దు ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు సరైన క్రమశిక్షణను [అవసరమైన చోట] పాటించకపోతే దానిని పాపం అని బైబిలు తెలియచేస్తుంది కాబట్టి. ఏది ఏమైనప్పటికీ, క్రమశిక్షణ అనేది నియంత్రణ లేని కోపం నుండి వచ్చినట్లయితే అది పాపం అవుతుంది. ఈ కథ అటువంటి ఆగ్రహానికి ఉదాహరణ. దుర్వినియోగానికి బైబిలు ఎలాంటి లైసెన్స్ ఇవ్వదు!
పాపపూరిత కోపం అమాయకులను కూడా బాధించేలా చేస్తుంది. ఉదాహరణకు, మనకు ఎవరిమీదైనా కోపం ఉన్నప్పుడు, మరొక వ్యక్తి వచ్చి మన దగ్గర వారి గురించి మంచిగా మాట్లాడితే అతడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడని అనుకుంటాము. మరో మాటలో చెప్పాలంటే, వారు మన “నీతిమంతమైన” కోపానికి మద్దతు ఇవ్వనందున ఇతరులపై [మన స్నేహితులైనా కావచ్చు] కోపం చూపిస్తాము!
కాబట్టి, పాపపూరిత కోపం అమాయక ప్రజలను బాధించేలా చేస్తుందని హెచ్చరించుకోవాలి.
విధ్వంసక పరిణామం # 5. పాపపూరిత కోపం దేవుని తీర్పును తీసుకురాగలదు.
పాపపూరిత కోపం యొక్క మరొక విధ్వంసక పరిణామం గురించి కొండపై ప్రసంగంలో ప్రభువైన యేసు పెదవుల నుండి వింటాము.
మత్తయి 5:21-22 “22 నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 22 నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.”
వ్యర్థుడా అనే పదంలాంటి తిరస్కారంతో కూడిన పాపపు మాటలు మాట్లాడడానికి కోపం దారి తీస్తుంది. అలాంటి పనుల వలన దేవుని నుండి తీర్పు ఎదుర్కోవలసి ఉంటుంది. దాని గురించి 21, 22 వచనాలలో రెండుసార్లు విమర్శకు లోనగును అని ఉంది. అలాగే 22వ వచనంలో నరకాగ్నికి లోనగును అని ఉంది.
నిజంగా దేవుని పిల్లలైన వారు నరకపు మంటలను ఎప్పటికీ ఎదుర్కోలేరు, అయితే వారు కోపంతో కూడిన జీవనశైలిని ప్రదర్శిస్తే దేవుడు తన పిల్లలను కఠినంగా శిక్షిస్తాడు. రోమా 6:17-18లో బోధించే దానికి విరుద్ధంగా పాపపూరిత కోపంతో ఉన్నవారు పాపానికి బానిసలుగా జీవించడం కొనసాగిస్తున్నందున వారు నిజంగా దేవుని బిడ్డలేనా అని తమను తాము పరీక్షించుకోవాలి!
కోపం ఉన్న వ్యక్తులు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే కోపంతో కూడిన ఆత్మ తిరుగుబాటు చేసే గర్వం కలిగిన ఆత్మ. తిరుగుబాటు చేసే గర్వం కలిగిన ఆత్మను దేవుడు ఎలా ఆమోదించగలడు? దీనహృదయం ఉన్నవారిలో మాత్రమే దేవుడు సంతోషిస్తాడు [యాకోబు 4:6].
కోపం ఉన్న వ్యక్తుల గురించి దేవుడు సంతోషించకపోవడానికి మరొక కారణం వారు దేవుని మహిమను దోచుకోవడమే. కోపం ఉన్న వ్యక్తి చివరికి దేవుని స్థానాన్ని తాను తీసుకుని ఇతరులకు తీర్పు తీరుస్తాడు. షిమ్యెను మరియు లేవీ షెకెమీయులపై దాడి చేసినప్పుడు సరిగ్గా అదే చేసారు [ఆదికాండము 34:24-29]. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు నగరాలను తుడిచిపెట్టమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడనేది నిజమే అయినప్పటికీ అది దేవుని సూచనల ప్రకారం మాత్రమే జరగాలి. మరో మాటలో చెప్పాలంటే, అది దేవుడు తనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన సాధనంగా ఉపయోగించే ఒక పవిత్ర యుద్ధము.
వ్యక్తులు తమంతట తాముగా తప్పును సరిదిద్దడానికి అది పూర్తిగా భిన్నమైనది. ఆ కోణంలో చెప్పాలంటే వారు దేవునికి చెందిన వాటిని అనగా, పాపకార్యాలపై ఆయన ప్రతీకారాన్ని తమ చేతులలోనికి తీసుకుంటారు. రోమా 12:19లో “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది” అని చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం దేవుని మహిమను దొంగిలించి ఆశీర్వాదం పొందాలని ఆశించకూడదు.
కాబట్టి, పాపపూరిత కోపం మనపై దేవుని తీర్పును తీసుకురాగలదని హెచ్చరించుకోవాలి.
విధ్వంసక పరిణామం # 6. పాపపూరిత కోపం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
సామెతలు 14:29-30లో “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. 30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు” అని వ్రాయబడింది.
ఈ వచనాలను వ్యాఖ్యానించిన ఒక రచయిత ప్రకారం, “హీబ్రూ కవితా నిర్మాణం ప్రకారం సహనానికి త్వరిత కోపపూరిత మధ్య ఉన్న వ్యతిరేకత శరీరంలోని జీవానికి ఎముకల కుళ్లుకు మధ్య ఉన్న వ్యతిరేకతకు సమానంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, కోపం మరియు అసూయ భౌతిక శరీరాన్ని దెబ్బతీస్తే సహనం మరియు శాంతి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
కోపమనేది ఒక యాసిడ్ లాంటిది. అది నిల్వ ఉన్న పాత్ర కన్నా అది పడిన పాత్రకే ఎక్కువ హాని చేస్తుంది అనే మాటలలో వాస్తవం ఉంది. ” కోపంగా ఉన్న వ్యక్తులు తరచుగా అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు [ఉదా, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు మొదలైనవి].
కాబట్టి, పాపపూరిత కోపం మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరించుకోవాలి
విధ్వంసక పరిణామం # 7. పాపపూరిత కోపం ప్రార్థనలను ప్రభావితం చేస్తుంది.
అపొస్తలుడైన పౌలు 1 తిమోతి 2:8లో, “కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను” అనే మాటలు వ్రాసాడు. మనం మన హృదయాలలో కోపంగా ఉండి ప్రార్థిస్తే మనం పాపం చేసినవారమై నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును అని కీర్తన 66:18లో తెలియజేయబడిన సత్యాన్ని అనుభవిస్తాము. కోపంతో సహా ఏ పాపాన్ని అయినా వదులుకోడానికి మొండిగా తిరస్కరించే వ్యక్తుల మొరను దేవుడు వినడు. 1 తిమోతి 2:8లో ఒకరి ప్రార్థనకు వచ్చే సమాధానం మీద వారి హృదయంలోని కోపం ప్రభావితం చేస్తుందని పురుషులను ఉద్దేశించి చెప్పినప్పటికీ అది ప్రార్థించే పురుషులకు అలాగే స్త్రీలకు కూడా వర్తిస్తుంది.
పేతురు కూడా భర్తలను హెచ్చరిస్తూ, “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” అనే మాటలు చెప్పాడు [1 పేతురు 3:7]. వారి భార్యల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం అంటే కోపాన్ని కలిగి ఉండటం భర్త ప్రార్థనలకు సమాధానం ఇవ్వకుండా అడ్డుకుంటుంది.
కాబట్టి, పాపపూరిత కోపం మన ప్రార్థనలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించుకోవాలి.
పైన పేర్కొన్న ఏడింటికి మరెన్నో పరిణామాలను జోడించవచ్చు. కానీ పాపపూరిత కోపం యొక్క ప్రతికూల పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో మనం చూస్తున్నప్పుడు ఇవి మనల్ని తీవ్రంగా కదిలించాలి.
మా తదుపరి పోస్ట్‌లో, మనం పాపపూరిత కోపం నుండి మనం ఎలా విడుదల పొందగలం? అనే 6వది మరియు చివరి ప్రశ్నను పరిశీలించడం ద్వారా ఈ సిరీస్‌ను ముగిస్తాము.