పాపపూరిత కోపము—అది సృష్టించే వినాశనం 5వ భాగము—పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి?

Posted byTelugu Editor March 25, 2025 Comments:0

(English version: “Sinful Anger – The Havoc It Creates (Part 5)”)

పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో ఇది 5వ భాగము. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయం 1వ భాగంలో, “కోపం అంటే ఏమిటి?” అనే మొదటి ప్రశ్నను 2వ భాగంలో, పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే రెండవ ప్రశ్నను 3వ భాగంలో, పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు? అనే మూడవ ప్రశ్నను ఈ 4వ భాగంలో చూశాము.

ఈ పోస్ట్‌లో, పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి? అనే నాల్గొవ ప్రశ్నని మనం పరిశీలిస్తాము. అయితే, 4వ ప్రశ్నకు వెళ్లే ముందు మొదటి 3 ప్రశ్నలను సమీక్షించడం మంచిది.

2వ భాగంలో “కోపం అంటే ఏమిటి?” అనే మొదటి ప్రశ్నను మనం నైతికంగా తప్పుగా భావించే పని పట్ల చూపించే చురుకైన ప్రతిస్పందనను కోపం అంటారు అనే సాధారణ నిర్వచనంతో దానికి సమాధానమిచ్చాము. కాబట్టి ప్రాథమిక అర్థం ప్రకారం కోపమనేది పాపం కాదు. ఇది మానవులందరికీ దేవుడు ఇచ్చిన ఒక భావోద్వేగము. అయితే బైబిలులో ఏది న్యాయమైన కోపమో ఏది పాపపూరిత కోపమో తెలియచేయబడింది.

న్యాయమైన కోపమంటే బైబిలులో వివరించిన దేవుని నైతిక నియమాన్ని [అంటే, దేవుని ప్రకారం ఏది ఒప్పు మరియు తప్పు అనే ప్రమాణం] పాటించనప్పుడు ప్రదర్శించబడే భావోద్వేగము. ఇది దేవుని అవమానించినందుకు వచ్చిన కోపము. ఇది అదుపు చేయగల కోపము. మరోవైపు, పాపపూరిత కోపానికి దేవుని నైతిక నియమాన్ని ఉల్లంఘించడంతో సంబంధం లేదు. ఈ కోపం మనకు మన ప్రమాణాలు [లేదా నియమాలు] పాటించనప్పుడు; మనకు అవమానం కలిగినప్పుడు; మన ఆశించిన ప్రకారం పనులు జరగనప్పుడు; మనం అనుకున్నది సాధించనప్పుడు వస్తుంది. మన సొంత అవసరాలు గాని అంచనాలు గాని నెరవేరనప్పుడు తలెత్తే నిరాశే ఈ పాపపూరిత కోపము.

3వ భాగంలో పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే రెండవ ప్రశ్నను చూశాము. పాపపూరిత హృదయమనే తీవ్రమైన సమస్యకు కోపం ఒక కారణం కాదని అది ఒక లక్షణమేనని మనం గ్రహించాలని చూశాము. 21 లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డవన్నియు లోపలి నుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని యేసు స్వయంగా చెప్పారు [మార్కు 7:21-23].

పాపపూరిత కోపంతో సహా అన్ని చెడుకార్యాలకు మూలం హృదయంలోనే ఉంటుంది. బైబిలు ప్రకారం, మనలో భాగమైన హృదయంలో మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ఇష్టాలు ఉంటాయి. హృదయం తప్పుడు కోరికలతో నిండినప్పుడు ఆ కోరికలు నెరవేరకపోతే వచ్చే ప్రతిస్పందనయే పాపపూరిత కోపము.

4వ భాగంలో పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు? అనే మూడవ ప్రశ్నను చూశాము. కోపాన్ని దేవుని మీద, మన మీద, ఇతరుల మీద వ్యక్తం చేస్తామని చెప్పడం ద్వారా దానికి సమాధానం ఇచ్చారు.

దేవుడు మనకు చేయాలని మనం ఆశించింది ఆయన చేయనప్పుడు, మనం ఊహించని దానిని దేవుడు చేసినప్పుడు మనకు దేవునిపై కోపం వస్తుంది. మనం సరైనది చేయడంలో విఫలమైనప్పుడు లేదా మనం నైతికంగా తప్పుగా భావించేదాన్ని చేసినప్పుడు మనపై మనకి కోపం వస్తుంది. అది ఒక విధంగా మనల్ని మనం శిక్షించుకోవడమే. మరో మాటలో చెప్పాలంటే, మన వైఫల్యాలకు మనల్ని మనం శిక్షించుకుంటాము. చివరగా, మన కోపంలో ఎక్కువ భాగం ఇతరులపైనే ఉంటుంది. ఇతరులు మనకు వ్యతిరేకంగా ఏదైనా చేసినందుకు లేదా మన కోసం ఏదైనా చేయడంలో విఫలమైనందున మనం వారిపై కోపంగా ఉంటాము.

పాపపూరిత కోపానికి సంబంధించిన నాల్గవ ప్రశ్నను పరిశీలిద్దాం.

IV. పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి?

ప్రజలు తమ పాపపూరిత కోపాన్ని చూపించే విధానాలు విభిన్నంగా ఉంటారు. మనం దానిని ప్రెషర్ కుక్కర్ యొక్క మూడు దశలతో పోల్చవచ్చు.

ఎ. నిశ్శబ్దంగా వ్యక్తపరచడము

ప్రెషర్ కుక్కర్ యొక్క మొదటి దశలో లోపల వేడి నిశ్శబ్దంగా పెరిగిపోతుంది. అలాగే కొంతమంది బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోలోపల కోపాన్ని మూటగట్టుకుంటున్నారు. వారు లోపల కోపంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు కానీ బయట చిరునవ్వుతో ఉంటారు—కొన్నిసార్లు సంవత్సరాలు కలిసి ఉంటారు!

వారిని గమనించే ఇతరులు వారు చాలా నియంత్రణలో ఉన్నారని భావించి మోసపోతారు. సాధారణంగా చెప్పాలంటే, పాపపూరిత కోపాన్ని వ్యక్తపరచడంలో ఈ వర్గానికి చెందిన వ్యక్తులు సహజంగానే ఎక్కువ అంతర్ముఖులుగా ఉండి సిగ్గుపడతారు. బయటకు వ్యక్తం చేయరు.

అయితే, బయటకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటం అంటే లోపల కోపం లేదని కాదు. ఇలా స్థిరంగా ఉండే కోపంతో లోపలి హృదయం కాలక్రమేణా కఠినమైపోతుంది. కొంతకాలానికి ఈ కోపం మాటల రూపంలో పనుల రూపంలో బయటకు వ్యక్తీకరించబడుతుంది.

2. నెమ్మదిగా విడుదల

ప్రెషర్ కుక్కర్ యొక్క రెండవ దశలో ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మూత నెమ్మదిగా చిన్న మొత్తంలో ఆవిరిని విడిచిపెడుతుంది. పాపపూరిత కోపాన్ని వ్యక్తపరచడంలో ఈ వర్గానికి చెందిన వ్యక్తులు వ్యంగ్య వ్యాఖ్యలతో, బాధించే పనులతో తమ కోపాన్ని నిత్యం వ్యక్తం చేస్తారు. కొన్నిసార్లు, చూసేవారు స్పష్టంగా గమనించలేని విధంగా వారు అవతలి వ్యక్తిని బాధపెడతారు. అయితే కోపం నెమ్మదిగా వ్యక్తీకరించబడుతుంది.

3. ఆకస్మిక పేలుడు

ప్రెషర్ కుక్కర్ యొక్క మూడవ దశలో పెద్ద శబ్దంతో పూర్తి ఆవిరి బయటకు రావడం చూస్తాము. పాపపూరిత కోపాన్ని వ్యక్తపరచడంలో  ఈ వర్గానికి చెందిన వ్యక్తులు పేలే స్వభావంతో ఉంటారు. వారి కోపాన్ని సాధారణంగా గట్టిగా మాట్లాడడం, అరుపులు, కోపంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు భౌతికంగా దాడి చేయడం వంటి వాటితో గుర్తించవచ్చును. దురదృష్టవశాత్తూ, సాధారణంగా అమాయకులైన పిల్లలు తల్లిదండ్రుల కోపానికి గురవుతారు, ఇందులో శారీరక వేధింపులు కూడా ఉండవచ్చు.

ఈ విధంగా తమ కోపాన్ని వ్యక్తపరిచే వ్యక్తులు, “నేను నా భావాలను దాచుకోను. నేను చాలా పారదర్శకంగా ఉంటాను. నాకు కోపం వచ్చినప్పుడు దానినంతా బయటకు కక్కేస్తాను. నేను ఎక్కడ ఉన్నానో అందరికీ తెలియజేస్తాను” అని కూడా అనవచ్చు. ఇలాంటి మాటలు చెప్పి పారదర్శకతకు అభినందనలు అందుకోవాలని వారి వక్రబుద్ధి ఆశిస్తుంది!

మొత్తంమీద, ఈ పోస్ట్ యొక్క ప్రధాన అంశం ఏమిటంటే: కోపం యొక్క అన్ని వ్యక్తీకరణలు ఒకే విధంగా వ్యక్తం చేయబడవు. ఇది శైలిలో మార్పు ఉంటుంది కానీ వ్యక్తపరచబడుతూనే ఉంటుంది. ఒకే వ్యక్తి తమ కోపాన్ని చాలాకాలం నిశ్శబ్దంగా వ్యక్తం చేయవచ్చు, అన్ని సమయాల్లో నెమ్మది వ్యక్తం చేయవచ్చు  అలాగే అప్పటికప్పుడు పేలుడు పద్ధతిలో కూడా వ్యక్తం చేయవచ్చు. కోపాన్ని ఎలా వ్యక్తీకరించినా సరే దానికి పర్యవసానాలు ఉంటాయి; కొన్నిసార్లు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. మనం తదుపరి పోస్ట్‌లో వాటి గురించి చూద్దాము.

Category