పాపపూరిత కోపము—అది సృష్టించే వినాశనం 3వ భాగము—పాపపూరిత కోపానికి మూలం ఏమిటి?

(English version: “Sinful Anger – The Havoc It Creates (Part 3)”)
పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో ఇది 3వ భాగము. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయం 1వ భాగంలో, “కోపం అంటే ఏమిటి?” అనే ప్రశ్నను 2వ భాగంలో చూశాము. ఈ పోస్ట్‌లో పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే ప్రశ్నను పరిశీలిస్తాము.
II. పాపపూరిత కోపానికి మూలం ఏమిటి?
పాపపూరిత హృదయమనే తీవ్రమైన సమస్యకు కోపం ఒక కారణం కాదని అది ఒక యొక్క లక్షణమేనని మనం గ్రహించాలి. పాపపూరిత కోపానికి మూలం గురించి యేసు ఏమి చెప్పాడో గమనించండి:
మార్కు 7:21-23 21 లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డవన్నియు లోపలి నుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
పాపపూరిత కోపంతో సహా అన్ని చెడుకార్యాలకు మూలం హృదయంలోనే ఉంటుంది. బైబిలు ప్రకారం, మనలో భాగమైన హృదయంలో మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ఇష్టాలు ఉంటాయి. హృదయం తప్పుడు కోరికలతో నిండినప్పుడు ఆ కోరికలు నెరవేరకపోతే వచ్చే ప్రతిస్పందనయే పాపపూరిత కోపము.
యాకోబు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు.
యాకోబు 4:1-3 1 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? 2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు. 3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
ఇతరులు కాని అపవాది కాని మన కోపానికి కారణం కాదు; కేవలం వారు దానిని ప్రేరేపిస్తారు అంతే! మన కోపం గురించి వారిని నిందించకూడదు, అయితే కొన్నిసార్లు అది రావడంలో వారి పాత్ర గురించి మనకు తెలియకపోవడం కూడా మన మూర్ఖత్వమే. అందుకే మనం అపవాదిని ఎదిరించాలి; అలాగే మనం ఈ పాపాన్ని అధిగమించాలని కోరుకుంటే ఇతరులకు మనల్ని రెచ్చగొట్టే అవకాశం ఇవ్వకూడదు. కానీ ఎదుర్కోవాల్సిన క్లిష్టమైన సమస్య పాపపూరిత కోపానికి మూలమైన మన హృదయమే. దురదృష్టవశాత్తు ఈ విషయంలో మనం తరచుగా విఫలమవుతాము. మనం లక్షణానకే [పాపపూరిత కోపం] చికిత్స చేస్తాం కాని కారణానికి [హృదయ కోరికలు] కాదు.
ఉదాహరణకు, మన జీవిత భాగస్వామి లేదా సన్నిహిత స్నేహితులు మనల్ని చాలా ప్రేమిస్తున్నారని నిశ్చయానికి రావడానికి మనం కష్టపడుతున్నామని అనుకుందాం. మరో మాటలో చెప్పాలంటే, మనకు 11వ ఆజ్ఞ ఉంది, నేను ప్రేమించబడాలని కోరుకునే విధంగా మీరు నన్ను మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో శక్తితో ప్రేమించాలి. మనం ఆ విధంగా ప్రేమించబడలేదని భావించినప్పుడు మనకు కోపం వస్తుంది. చాలా త్వరగా అంచనాలు డిమాండులుగా చివరికి ఆజ్ఞలుగా మారిపోతాయో కదా! అలాంటి మనస్తత్వం మనలో కోపం కట్టలుతెంచుకునేలా చేస్తుంది.
అయితే, ఈ కట్టలుతెంచుకునే కోపం మనకు ఇష్టంలేదు దానిని మార్చాలనుకుంటున్నాము. కాబట్టి, మనం సాధారణంగా “ఇప్పటి నుండి, ఇతరులు నాపై తమ ప్రేమను చూపించకపోతే నేను కోపం తెచ్చుకోను; నిర్లక్ష్యం చేసినందుకు నేను కోపం తెచ్చుకోను” అనుకుంటాము. అటువంటి తీర్మానంతో కలిగే ప్రమాదం ఏమిటంటే: అసలు సమస్య పరిష్కరించబడకుండా మిగిలిపోతుంది! ఆ కోపానికి మూలం ఇంకా అలాగే ఉండిపోతుంది. మనం లక్షణం గురించి మాత్రమే చూశాము కాని కారణాన్ని కాదు!
కారణాన్ని ఎదుర్కోవటానికి మనం లోతుగా పరిశోధించి, నేను నిత్యం ఇతరుల నుండి ప్రేమను ఎందుకు కోరుతున్నాను? అనే లోతైన ప్రశ్న అడగాలి. మనం అలా చేసినప్పుడు, ప్రేమించబడాలని కోరుకునే ఈ కోరిక స్వార్థపూరితమైన స్వీయ ప్రేమ నుండి పుట్టిందని మనం తెలుసుకుంటాము. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మన దౌర్భాగ్యలం అయినప్పటికి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని, మనం ఎప్పుడూ క్రీస్తులో పూర్తిగా అంగీకరించబడతామనే బైబిలు సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఇతరుల నుండి ఈ రకమైన ప్రేమను కోరుకోవడంలో ఉన్న పాపాన్ని మనం చూస్తాము.
ఆ తర్వాత సమస్యను క్షుణ్ణంగా ఎదుర్కోవడానికి, అలాంటి స్వార్థపూరిత కోరికకు బదులుగా దేవునికి మనపట్ల ఉన్న ప్రేమకు నిత్యం కృతజ్ఞతాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు శుద్ధమైన ఆలోచన చెడు ఆలోచనను భర్తీ చేసింది. ఈ విధంగా ఈ పరిస్థితులలో మూలాల నుండి నిర్మూలించడం ద్వారా మనం కోపమనే సమస్యను సరిగ్గా పరిష్కరించగలము. మనలో పాపపూరితమైన కోపం పెరగడానికి కారణమయ్యే ఇతర సమస్యలకు కూడా మనం ఇదే సూత్రాన్ని అన్వయించవచ్చు. మనకు ఎంత తరచుగా కోపం వస్తుందంటే:
- ఎవరైనా మన ఇమెయిల్ లేదా ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించలేనప్పుడు. మనకు 12వ ఆజ్ఞ ఉంది, “నా ఫోన్ కాల్ లేదా ఇమెయిల్‌కు ఈ రోజే సమాధానం కావాలి.”
- మనం నిర్లక్ష్యం చేయబడ్డాము, అవమానించబడ్డాము లేదా అన్యాయంగా ప్రవర్తించారు [మనం తిరస్కరణను ఎదుర్కోవాలని, అయినా క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలని బైబిలు చెబుతున్నప్పటికీ].
- మన కలలు చెదిరిపోయినప్పుడు [మనల్ని మనం ఉపేక్షించుకోవాలని బైబిలు పిలుపునిచ్చినప్పటికీ].
విషయం ఏమిటంటే: పాపపూరిత కోపాన్ని ఎదుర్కోవడానికి కొన్ని కొమ్మలను ఆకులను కత్తిరించడం కంటే లోతుగా పరిశోధించి సమస్య యొక్క వేరును తెలుసుకోవడం చాలా అవసరం. కోపం ఎల్లప్పుడూ మంచుకొండ యొక్క కొనలా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అయితే దాని క్రింద ఉన్న ఉపరితలాన్ని చూడడమే సవాలు. లోతైన సమస్యలను పట్టించుకోరు కాబట్టి చాలామంది నిత్యం కోపంతో పోరాడుతూనే ఉంటారు. అలా ఎందుకు? ఎందుకంటే వారు తమ అంతర్గత కోరికలను మార్చుకోవడానికి ఇష్టపడరు. వారు కేవలం కొన్ని బాహ్య మార్పులపై దృష్టి పెడతారు.
పంపుకు తెల్లని పెయింట్ వేయడం వల్ల నీటి రంగు మారదని మనం గ్రహించాలి. మరో మాటలో చెప్పాలంటే, బాహ్య ప్రవర్తనలో మార్పు వలన మూల సమస్య పరిష్కరించబడదు. మనం హృదయంలో మారి రూపాంతరం చెందడంపై దృష్టి పెట్టాలి [రోమా 12:2]. ఈ ప్రపంచం మనకు బాహ్యంగా ఎలా మారాలో అని మాత్రమే నేర్పుతుంది; అంతర్గతాన్ని మార్చడానికి దానికి వనరులు గాని శక్తి లేదు. కేవలం దేవుడు మాత్రమే తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మనల్ని లోపలి నుండి మారుస్తాడు! అందుకే హృదయాన్ని మార్చుకునే విషయానికి వస్తే, అది కేవలం తప్పుడు ఉద్దేశాలను మరియు కోరికలను విడిచిపెట్టడం కాదు, కానీ వాటి స్థానంలో దైవిక కోరికలను ఉద్దేశ్యాలను కలిగివుండాలి. అది ఒక్కటి పూర్తయ్యాక బాహ్యమార్పును కూడా అదే వస్తుంది.
సామెతలు 4:23లో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని చెప్పబడింది. హృదయం శరీరమంతటిని ఎలా నియంత్రిస్తుందో గమనించండి [సామెతలు 4:20-22, 24-26 కూడా చూడండి]. అన్ని కార్యాలు హృదయం నుండే వస్తాయి కాబట్టి, హృదయం పాపపూరిత కోపానికి మూలమని అర్థం చేసుకోవడం చాలా అవసరము. మనం దానిని తొలిగించాలనుకుంటే హృదయ కోరికలలో మార్పును తీసుకురావాలి. “పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు?” అనే ప్రశ్నను మా తదుపరి పోస్ట్‌లో పరిశీలిస్తాము.