పాపపూరిత కోపము—అది సృష్టించే వినాశనం 2వ భాగము—కోపం అంటే ఏమిటి?

(English version: Sinful Anger – The Havoc It Creates (Part 2))
పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో 2వ భాగం ఈ పోస్ట్. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయం 1వ భాగంలో చూశాము. ఈ పోస్ట్‌లో మనం ఈ అంశానికి సంబంధించిన మొదటి ప్రశ్న: కోపం అంటే ఏమిటి? అని పరిశీలిస్తాము.
I. కోపం అంటే ఏమిటి?
పాపపూరిత కోపం అనే అంశాన్ని చూసే ముందు, సాధారణంగా కోపమంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ ఒక సాధారణ నిర్వచనం ఉంది:
మనం నైతికంగా తప్పుగా భావించే పని పట్ల చూపించే చురుకైన ప్రతిస్పందనను కోపం అంటారు.
తప్పు ఒప్పులకు సంబంధించి కొన్ని ప్రమాణాల ప్రకారం మనమందరం జీవిస్తాము. ఆ ప్రమాణాల ప్రకారం తప్పు జరిగినప్పుడు మన భావోద్వేగాలను బలంగా వ్యక్తపరుస్తాము. కాబట్టి ప్రాథమిక అర్థం ప్రకారం కోపమనేది పాపం కాదు. ఇది మానవులందరికీ దేవుడు ఇచ్చిన భావోద్వేగము. అయితే బైబిలులో ఏది న్యాయమైన కోపమో ఏది పాపపూరిత కోపమో తెలియచేయబడింది.
న్యాయమైన కోపం.
న్యాయమైన కోపమంటే బైబిలులో వివరించిన దేవుని నైతిక నియమాన్ని [అంటే, దేవుని ప్రకారం ఏది ఒప్పు మరియు తప్పు అనే ప్రమాణం] పాటించనప్పుడు ప్రదర్శించబడే భావోద్వేగము. ఇది దేవుని అవమానించినందుకు వచ్చిన కోపము. ఇది అదుపు చేయగల కోపము.
పాత నిబంధనలోని ప్రవక్తలు అలాగే కొత్త నిబంధనలోని అపొస్తలులు వివిధ సమయాల్లో న్యాయమైన కోపాన్ని చూపించారు. యేసే స్వయంగా న్యాయమైన కోపాన్ని చూపించారు [ఉదా, రెండు సందర్భాలలో ఆలయాన్ని శుభ్రపరచడం, యోహాను 2:13-17; మత్తయి 21:12-13].
అదేవిధంగా, మనం కూడా న్యాయమైన కోపాన్ని చూపించగలము. మనం న్యాయమైన కోపాన్ని చూపించే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు: దేవుని వాక్యంపై దాడి జరిగినప్పుడు – తప్పుడు బోధ లేదా బలహీనమైన బోధ, చెడు జరిగినప్పుడు [ఉదా: గర్భస్రావం, అత్యాచారం, హత్య] మొదలైనవి. అయినప్పటికీ, ఆ సందర్భాలలో ఇది అదుపు చేయగల భావోద్వేగం, ఇది ఆవేశంగా వ్యవహరించదు. నిజానికి, దేవుని ప్రజలు వారు చూపించవలసినంత న్యాయమైన కోపాన్ని చూపించరని మనం చెప్పగలం!
పాపపూరిత కోపం.
పాపపూరిత కోపానికి దేవుని నైతిక నియమాన్ని ఉల్లంఘించడంతో సంబంధం లేదు. ఈ కోపం మనకు ఎప్పుడు వస్తుందంటే:
మన ప్రమాణాలు [లేదా నియమాలు] పాటించనప్పుడు;
మనకు అవమానం కలిగినప్పుడు;
మనం ఆశించిన ప్రకారం పనులు జరగనప్పుడు;
మనం అనుకున్నది సాధించనప్పుడు.
మన సొంత అవసరాలు గాని అంచనాలు గాని నెరవేరనప్పుడు తలెత్తే నిరాశే ఈ పాపపూరిత కోపము. అయినా మన పాపపూరిత కోపాన్ని న్యాయమైన కోపంగా సమర్థించే ధోరణి మనలో ఉంది. దీని గురించి బైబిలులోనే రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
మొదటి ఉదాహరణ యాకోబు కుమారులైన షిమ్యోను లేవికి సంబంధించినది. వారు కనానుకు తిరిగి వచ్చిన తర్వాత, యాకోబు మరియు అతని కుటుంబం షెకెముకు సమీపంలో స్థిరపడ్డారు [ఆది 33:18-19]. యాకోబు కుమార్తె దీనా పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేశపాలకుని కుమారుడైన షెకెము ఆమెపై అత్యాచారం చేశాడు [ఆది 34:1-2]. నిజంగా ఇది ఒక విషాద సంఘటన!
దానికి ప్రతీకారంగా, యాకోబు కుమారులు షెకెము దీనాను వివాహం చేసుకోవాలంటే షెకెము పురుషులు సున్నతి చేయించుకోవాలని చెప్పి వారిని మోసగించారు [ఆది 34:13-24]. అయితే, మూడు రోజుల తర్వాత షిమ్యోను లేవీలు పట్టణంలోనికి వెళ్లి, షెకెము మరియు అతని తండ్రితో సహా దానిలో ఉన్న మగవారందరినీ చంపారు. వారు పట్టణమంతా దోచుకుని జంతువులను అక్కడ ఉన్న మిగతా వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు [ఆది 34:25-29]. “వారు తమకు నచ్చిన విధంగా ఎద్దులను కొట్టి కాలి నరాలను తెంపారని” కూడా మనం చదువుతాము [ఆది 49:6]. కోపంతో ఉన్న ఈ ఇద్దరూ వ్యక్తులు జంతువులతో సహా ఏ నేరం చేయని అమాయకులైన పురుషులను గాయపరిచి చంపారు.
వారి చర్యలకు యాకోబు వారిని మందలించినప్పుడు, “వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా” అని వారడిగారు [ఆది 34:31]. ఒక వ్యక్తి చేసిన పాపానికి న్యాయమైన ప్రతిస్పందనగా వారు పట్టణంలోని మొత్తం మగవారిని చంపడాన్ని సమర్థించుకున్నారు! వారి కోపం పాపపూరిత కోపం ఎందుకంటే యాకోబు వారు చేసిన పని గురించి గట్టిగా మందలించడాన్ని చూస్తాము. “వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను” [ఆది 49:7].
రెండవ ఉదాహరణ, తాము చేసిన చెడు గురించి పశ్చాత్తాపపడిన నీనెవె వాసులకు దేవుడు తీర్పు ఇవ్వకుండా వారిని కనికరించినందుకు యోనా యొక్క ప్రతిస్పందనకు సంబంధించినది [యోనా 3:10]. యోనా స్పందన ఏమిటి? “యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు” [యోనా 4:1]. అతడు చాలా కోపంతో “నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను” [యోనా 4:3].
దేవుడు ఓర్పుతో యోనాను పరీక్షించడానికి, “నీవు కోపించుట న్యాయమా?” అని ఒకటి కాదు రెండుసార్లు అడిగారు [యోనా 4:4, 9]. అతడు మరోసారి మొండిగా “ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు” [యోనా 4:9]. యోనా యొక్క తప్పు ఒప్పుల ప్రమాణాల ప్రకారం దేవుడు చేయలేదు కాబట్టి జీవించడం కంటే చనిపోడానికే అతడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది న్యాయమైన కోపం కాదని స్పష్టంగా తెలుస్తుంది, కానీ పాపపూరిత కోపాన్ని న్యాయమైన కోపంగా సమర్థించుకుంటున్నాడు.
షిమ్యోను, లేవి మరియు యోనాల వలె, మన హృదయాలు కూడా మన కోపాన్ని న్యాయమైన కోపంగా సమర్థించుకునేలా మనల్ని సులభంగా మోసగించగలవు, వాస్తవానికి ఇది మన గర్వాన్ని స్వార్థాన్ని తెలియచేస్తుంది. నిగ్రహాన్ని కోల్పోయే అలవాటును మనం “సరైనది” గా అంగీకరించడం కొనసాగించినంత కాలం, స్వభావరీత్యా అత్యంత వినాశకరమైన మన కోపాన్ని పాపంగా చూడలేము.
అవును, యేసే స్వయంగా న్యాయమైన కోపాన్ని ప్రదర్శించారు కాని ఆయనను ఎప్పుడూ పాపపూరిత కోపం అదుపు చేయలేదని చూస్తాము. ఈ విషయంలో ఒక రచయిత యొక్క మాటలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి:
“యేసుకు కోపం వచ్చిన ఏ సందర్భానికైనా ఆయన వ్యక్తిగత అహంతో సంబంధంలేదు. ఇంకా చెప్పాలంటే, ఆయనను అన్యాయంగా బంధించినప్పుడు, అన్యాయంగా విచారించినప్పుడు, చట్టవిరుద్ధంగా కొట్టినప్పుడు, తిరస్కారంతో ఉమ్మివేసినప్పుడు, సిలువ వేసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు ఇంకా చాలా విషయాలు ఆయన అహం దెబ్బతినడానికి కారణం కావచ్చు, నిజంగా ఆయనకు తన గౌరవం గురించి ఆలోచించే అన్ని కారణాలు ఉన్నప్పటికీ, పేతురు చెప్పినట్లుగా,
ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపలేదు [1 పేతురు 2:23]. దప్పికతో ఎండిన ఆయన పెదవుల నుండి వచ్చిన దయగల మాటలు ఏమిటంటే, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’ [లూకా 23:34]. మనకు వ్యక్తిగతంగా అవమానం ఎదురైనప్పుడు మనస్తాపం చెందినప్పుడు చాలా త్వరగా కోపగించుకుంటాము కానీ పాపాన్ని అన్యాయాన్ని చూసినప్పుడు నెమ్మదిగా కోపగించుకుంటామని మనం ఒప్పుకుందాము.”
మనం పాపపూరిత కోపాన్ని వెంటనే చూపిస్తూ, న్యాయమైన కోపాన్ని చూపించడంలో విఫలమైనప్పుడు వెంటనే పశ్చాత్తాపం చెందుదాము. “మా తదుపరి పోస్ట్‌లో పాపపూరిత కోపానికి మూలం ఏమిటి?” అనే రెండవ ప్రశ్నను చూద్దాము.