నీవు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు నిన్నుసంరక్షిస్తాడా?

(English Version: Does God Care When We Are In Trouble?)
గుర్రం నుండి పడిన కారణంగా కాలు చేయి తీవ్రంగా గాయపడిన ఒక యువతి దేవుడు ప్రేమామయుడు, సమస్తం ఆయన ఆధీనంలోనే జరుగుతాయి కదా అలాంటప్పుడు నాకు ఎందుకు ఈ విధంగా జరిగింది? అని ప్రశ్నించింది. ఆమె పాస్టరుగారు ఒక్క నిముషం మౌనంగా ఉండి ఆమెను, “వారు నీకు చికిత్స చేస్తున్నప్పుడు నీవు చాలా నొప్పిని భరించావా?” అని అడిగినప్పుడు, “భయంకరమైన నొప్పి వచ్చిందని” ఆమె సమాధానం ఇచ్చింది.
“నిన్ను అలా బాధపెట్టడానికి మీ తండ్రి డాక్టరుకు అనుమతి ఇచ్చారా?” అని మరలా అడిగినప్పుడు, ఆమె “ఇచ్చారు, కాని అది తప్పనిసరి కదా?” అన్నది. అప్పుడు ఆ పాస్టరుగారు “మీ తండ్రి నిన్ను ప్రేమించినప్పటికి నిన్ను బాధపెట్టడానికి అనుమతి ఇచ్చారా లేక నిన్ను ప్రేమించారు కాబట్టి అనుమతి ఇచ్చారా?” అని నొక్కి అడిగినప్పుడు, “అంటే మీరు దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను గాయపడడానికి ఆయన అనుమతించాని చెబుతున్నారా?” అనేది దిగ్భ్రాంతికరమైన ఆమె ప్రతిస్పందన.
ఆ పాస్టరుగారు సమాధానంగా తల ఊపారు. “ఇది నా నుండి వచ్చినదే.” దేవుని నుండి వచ్చిన ఈ మాటలు నిన్ను ఆదరిస్తాయి. అవి మేఘానికి వెండి అంచును అమర్చుతాయి. మీది దుర్దశ కాదు. ఈ శోధన దేవుడే ఏర్పాటు చేసాడు. మీరు ఆయన పిల్లలైతే, మరింతగా సేవచేయడానికి ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు.
“నేను ఎక్కువ చెప్పను, నా అనారోగ్యంలో నా బాధ వలన నేను మెరుగుపడుతున్నానా; దాని కోసం నేను మెరుగవుతున్నానా?” అని షేక్స్పియర్ చెప్పాడు. అదే విధంగా క్రైస్తవులుగా మనం “ఈ శోధననుండి నేనెప్పుడు బయటపడతాను?” అని అనడానికి బదులు “ఈ శోధన ద్వారా నేను మెరుగుపడుతున్నానా?” అని అడగడం నేర్చుకోవాలి. అయితే చాలామంది క్రైస్తవుల స్పందన అది కాదు. “నేను ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకుంటాడా?” అనేది వారి ప్రశ్న.
బైబిలు ప్రకారంగా ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి మార్కు 4:35-41 లో వ్రాయబడిన విధంగా యేసు తుఫానును నెమ్మదిపరిచే సందర్భాన్ని మనం చూసి దాని నుండి కొన్ని సత్యాలను నేర్చుకుందాము.
35-36 ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. 37అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. 38ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.
39అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.
40అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను.
41వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
తీరకలేకుండా గలిలయలో పరిచర్య చేసి సాయంకాలమైనప్పుడు ప్రభువైన యేసు గలిలయ నుండి బయలుదేరి గలిలయ సముద్రాన్ని దాటి గెరాసేనుల దేశానికి వెళ్ళమని తన శిష్యులకు ఆజ్ఞాపించారు (35-36). అయితే వారు తమ ప్రయాణంలో తీవ్రమైన తుఫానును ఎదుర్కొన్నారు (37).
ఆయన శిష్యలందరు చాలా భయపడి వెంటనే నిద్రపోతున్న యేసు దగ్గరకు వెళ్ళి ఆయన తమ కోసం చింతిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు (38). యేసు లేచి ఆ తుఫానును నెమ్మదిపరిచి శిష్యులకున్న అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించారు(39-40). ప్రకృతిపై ఆయనకున్న అధికారాన్ని చూసి శిష్యులకు గొప్ప భయం పట్టుకుంది(41).
ప్రకృతిపై క్రీస్తుకున్న అధికారాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది. అలాగే ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ఎదురయ్యే శోధనలకు మరియు శోధనల సమయంలో దేవుడు సంరక్షణకు సంబంధించి నాలుగు సత్యాలను నేర్పిస్తుంది.
1. శోధనల నుండి క్రైస్తవులు మినహాయింపు కాదు (35-37 వచనాలు).
తుఫాను రాబోతుందని యేసుకు తెలుసా? ఆయనకు తెలుసు! అయినప్పటికి ఆయన శిష్యులను ఆ తుఫాను మధ్యలోనికి నడిపించారు. శిష్యులకు ఆ రోజుకు సంబంధించిన శిక్షణ పాఠ్యాంశాల్లో ఆ తుఫాను ఒక భాగము.
అవిధేయత కారణంగానే తుఫానులు వస్తాయని చాలామంది అనుకుంటారు, కాని అన్నిసార్లు కాదు. యోనా తన అవిధేయత కారణంగానే తుఫానులో చిక్కుకున్నాడనేది నిజమే. అయితే శిష్యులకు ప్రభువు పట్ల ఉన్న విధేయత కారణంగా వారు తుఫానులో చిక్కుకున్నారు. ఈ శిష్యులందరు యేసుని వెంబడించడానికి తన ఇండ్లను పనులను విడిచిపెట్టారు అయినా ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు. ఇది మనకు నీతిమంతుడైనప్పటికి ఎన్నో శోధనలు ఎదుర్కొన్న యోబును జ్ఞాపకం చేస్తుంది (యోబు 1:8; 2:3).
ప్రభువు పట్ల విధేయత మరియు పరిచర్య వలన శోధనల నుండి తప్పించుకుపోతామనే హామీ లేదు. ప్రభువు అన్నివేళలా శోధనల నుండి తప్పించడు గాని వాటి గుండా పోయినప్పుడు మనలను కాపాడతాడని క్రైస్తవులుగా మనం గ్రహించాల్సి ఉంది. కొన్నిసార్లు ఆయన తుఫానును నెమ్మదిపరుస్తారు. మరికొన్నిసార్లు తుఫానును రేగనిస్తారు కాని తన బిడ్డను నెమ్మదిపరుస్తారు.
ఫలితాన్నే కాకుండా మనం ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, “క్రీస్తు లేకుండా ఒడ్డున ఉండడం కన్నా క్రీస్తు ఉన్న పడవలో తుఫాను మధ్యలో ఉన్నప్పటికి అది ఎంతో మంచిది ఎంతో క్షేమకరము”.
2. శోధనల సమయాలలో దేవుడు లేనట్లుగా కనిపించ వచ్చును (38).
కీర్తనాకారుడు “యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు? (కీర్తన 10:1) ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము (కీర్తన 44:23) అని మొరపెట్టాడు.
అదే విధంగా, శిష్యులు బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని మొరపెట్టడానికి దారితీసిన వారి శోధన సమయంలో యేసు భిన్నంగా పట్టించుకోనట్లుగా కనిపిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే, దేవా, నీవు నన్ను ప్రేమిస్తే నన్ను ఎందుకు ఈ శోధనల గుండా నడిపిస్తున్నావు? నీవు చుస్తున్నావా?
దానికి సమాధానం ఇదే: దేవుడు ఎల్లప్పుడు మనల్ని కనిపెడతారు. ఆయన ఎన్నడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టరు కాని జీవితంలో చీకటి సమయంలో ఉన్నప్పటికి మనం పట్టుదలతో ఆయన యందు నమ్మకం కలిగివుండాలని కోరుకుంటున్నారు.
యెషయా 50:10 మనకు “మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను” అని జ్ఞాపకం చేస్తుంది.
3. మనం దేవునికి దగ్గరగా వెళ్లడానికి శోధనలు సహాయపడతాయి (38).
వారికి బలహీనమైన విశ్వాసం ఉన్నప్పటికి ఆ తుఫాను శిష్యులను క్రీస్తుకు దగ్గరగా తీసుకువెళ్లింది. వారు ఆయన దగ్గరకు వెళ్లిన విధానం తప్పుకావచ్చు కాని చివరికి వారు ఆయన దగ్గరకు వెళ్లారు. వారి ఫిర్యాదుతో ఆయనకు తొందర కలిగించినప్పటికి ప్రభువు వారిని గద్దించలేదు. దానికి బదులు, వారు కలతచెంది భయపడినందుకు వారిని గద్దించారు. శోధనలు ఒకరిని దేవుని నుండి దూరంచేస్తాయి అనేది నిజమే. అయినప్పటికి దేవుని బిడ్డలను ఎల్లప్పుడు శోధనలు ఆయనకు దగ్గరగా తీసుకువస్తాయి. దేవుని వాక్యం పట్ల మన ప్రేమ పెంపొందడానికి మరియు ప్రార్థనలో ఆయనతో మరింత ప్రశస్తమైన సమయాన్ని గడపడానికి శోధనలు సహాయపడతాయి.
4. శోధనలు దేవుని లక్షణముల పట్ల మన అగాహనను మరింత పెంచుతాయి (39-41).
ఈ అనుభవం ద్వారా శిష్యులు దేవుని ప్రేమ గురించి మరియు సమస్తమైన వాటిపై ఆయనకున్న అధికారాన్ని గురించి లోతైన అవగాహన పొందుకున్నారు. మనం కూడా జీవితంలో ఎదురయ్యే శోధనల ద్వారా అటువంటి అవగాహన పెంపొందించుకోవచ్చు. విలువైన ఈ సత్యాలన్ని దేవుడు అన్నివేళలా తన బిడ్డలను సంరక్షిస్తారని బయలుపరుస్తాయి. శోధనకు మరియు ప్రతి విశ్వాసి జీవితంలోని శోధనల సమయంలో దేవుని సంరక్షణకు సంబంధించిన నాలుగు సత్యాలు ఇవే.
క్రైస్తవులుగా ఉండడం అనేది సమస్యల లేని జీవితానికి హామీని ఇవ్వదు. ఒక రచయిత వ్రాసినట్లుగా, “సాతాను చాలా యుక్తిగా మన ప్రధాన వర్తమానం నుండి మన దృష్టిని మళ్లిస్తాడు. క్రీస్తులో పాపులు నీతిమంతులుగా చేయబడతారు మరియు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతారు అనే సువార్తను ప్రకటించడానికి బదులుగా సమస్యలను పరిష్కరించడానికి మన జీవితంలో అద్భుతమైన ప్రణాళికను బయలు పరచడం, క్రీస్తులో మనలను సంతోషపరచడం మరియు జీవితంలో ఎదురయ్యే అవాంతరాల నుండి మనలను కాపాడడమే దేవుడు మనలను రక్షించడంలో ఉన్న ప్రాధమిక ఉద్దేశం అనే సువార్తలో మనం స్థిరపడుతున్నాము. క్రీస్తులో సంతోషాన్ని వెదకుతూ విశ్వాసంలోనికి వచ్చినవారు తాము సంతోషంగా ఉండడమే దేవుని ప్రేమకు నిదర్శనం అని అనుకుంటారు. వారికి శోధనలు వచ్చినప్పుడు సంతోషాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు తమను విడిచిపెట్టాడని కూడా అనుకుంటారు. కాని సిలువను దేవుని ప్రేమకు గుర్తుగా చూసేవారు తమ పట్ల ఆయనకున్న స్థిరమైన విశ్వాసాన్ని వారు ఎన్నడు సందేహించరు.”
మనం జీవితంలో తుఫానుల మధ్యలో ఉన్నప్పటికి దేవుడు మన హృదయమంతటితో నమ్మదగినవాడని దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. నరకం నుండి సాతాను నుండి క్రీస్తు మనలను రక్షిస్తారని మనం నమ్మితే మరి మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యల విషయంలో ఆయనను నమ్మడం ఎందుకు కష్టంగా ఉంది? విశ్వాసం భయాన్ని పోగొడుతుంది మరియు భయం విశ్వాసాన్ని పోగొడుతుంది.
విశ్వాసంలో మనకు పట్టుదల లేనందుకు మనం పశ్చాత్తాపం చెంది, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా ప్రార్థించాలి (మార్కు9:24). మనం అలా ప్రార్థించినప్పుడు మంచివాడైన ప్రభువు, జీవితంలో చీకటి సమయంలో ఉన్నప్పటికి తన పరిశుద్ధాత్మ ద్వారా, ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు (యెషయా 26:3) అనే వాక్యం యొక్క సత్యాన్ని అనుభవించడానికి మనకు సహాయం చేయును.
మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి: విధేయత వలన కలిగే శోధనలు ఎల్లప్పుడు పాత్రలో క్రీస్తు సన్నిధి ఉన్నదని భరోసానిస్తాయి. పాత్రలో క్రీస్తుతో ఉన్నప్పుడు మనం తుఫానును చూసి స్వచ్ఛంగా నవ్వుగలము. మరియు నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నేను ఇబ్బందులలో ఉన్నప్పటికి నన్ను సంరక్షిస్తాడు అని స్థిరంగా చెప్పగలుగుతాము.