ధన్యతలు 8వ భాగము సమాధానపరచువారు ధన్యులు

(English version: “Blessed Are The Peacemakers”)
మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్లో ఇది ఎనిమిదవది. ఇక్కడ యేసు ప్రభువు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను యేసు వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:9లో “సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు” అని వివరించబడిన సమాధనపరచువారు అనే ఏడవ వైఖరిని మనం పరిశీలిద్దాము.
***********************************
అనేక హింసాత్మక చర్యలతో యుద్ధాలతో నిండిన ఈ ప్రపంచంలో శాంతి అనేది అంతుచిక్కని విషయంగా కనిపిస్తోంది. దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తున్నాయి; ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య యుద్ధం జరుగుతోంది; చర్చిలు పరస్పరం యుద్ధం చేస్తున్నాయి; జీవిత భాగస్వాములు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. యుద్ధం, యుద్ధం ఎక్కడ చూసినా యుద్ధమే!
అయినప్పటికీ, ఈ గందరగోళాల మధ్య యేసు తన పిల్లలను సమాధానకర్తలుగా ఈ లోకంలోకి పంపారు. వారు కేవలం శాంతి ప్రేమికులు, శాంతి కోరుకునేవారు, శాంతిని ఆశించే వారు మాత్రమే కాదు, శాంతి స్థాపకులు కూడా! దేవునికి ప్రజలకు మధ్య నిజమైన శాంతి, ప్రజల మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికి వారి దగ్గర మార్గాలు ఉన్నాయి.
సమాధానపరచువారు అనే పదంలో 2 పదాల ఉన్నాయి సమాధానం మరియు కలిగించేవారు. సమాధానం అంటే సంఘర్షణ లేకపోవడం కంటే ఇంకా ఎక్కువ అర్థాన్ని కలిగివుంది. ఇది పరిపూర్ణత, శ్రేయస్సు మరియు దేవునిచే ఆశీర్వదించబడిన భావనను కలిగి ఉంటుంది. కలిగించేవారు అంటే ఈ సందర్భంలో సమాధానాన్ని పుట్టించడం లేదా కలిగించడం అనే ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి, సమాధానపరచువారు అనే పదానికి క్రైస్తవులు శాంతిని తీసుకురావడానికి కృషి చేస్తారనే భావన ఉంటుంది.
ఏమి చేసైనా సమాధాన పరచడం కాదు.
శాంతి స్థాపకునిగా ఉండేందుకు కృషి చేయడం అంటే మనం ఏమి చేసైనా సమాధానాన్ని తీసుకురావాలని కాదు. ముఖ్యంగా దేవుని మాటకు అవిధేయత చూపడం కాదు. గత ధన్యత హృదయశుద్ధికి అనగా దేవుని కేంద్రంగా కలిగిన హృదయానికి దేవుని అనుకరించాలని కోరుకునే హృదయానికి పిలుపునిస్తుంది. దేవుడు సమాధానాన్ని తీసుకురావడానికి పవిత్రత ను మూల్యంగా చెల్లించడు కాబట్టి మనం కూడా అదే చేయడానికి ప్రయత్నించాలి. మనం పవిత్రత ను మూల్యంగా చెల్లించి సమాధానం కోసం ప్రయత్నించలేము ప్రయత్నించకూడదు. పవిత్రత ఎల్లప్పుడూ సమాధానాన్ని గెలుస్తుంది.
సమాధానకర్తగా ఉండడం అంటే మన జీవితంలో ఎప్పుడూ గొడవలు ఉండవని లేదా ప్రజలందరూ మనల్ని ఇష్టపడతారని కాదు. లేదా మనం సమస్యల పరిష్కరించగలమని కాదు. అయితే, విషయాలు సంక్లిష్టంగా అనిపించినప్పటికీ, శాంతిని తీసుకురావడానికి దేవుని ప్రతినిధులుగా మనం ఈ అసంపూర్ణ లోకంలోకి పంపబడ్డాము.
సమాధానపరచేవారైన ఈ ప్రజలు దేవుని పిల్లలని పిలవబడతారని యేసు చెప్పారు. అయితే, శాంతిని కలిగించేవారిగా ఉండడం ద్వారా మనం దేవుని పిల్లలమవుతామని యేసు చెప్పడం లేదు. అదే జరిగితే, ఎవరూ దేవుని బిడ్డలు కాలేరు, ఎందుకంటే మనమందరం దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాము.
దేవుని పిల్లలుగా మారడానికి మనం ఏమి చేయాలో ధన్యతలలో వివరించలేదు. వారు ఇప్పటికే దేవుని పిల్లలుగా ఉన్న వారి నమూనాను లక్ష్యాన్ని వివరించారు. మనం యేసుపై విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలమవుతామని గమనించండి. యోహాను 1:12లో “తన్ను [యేసును] ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని చెబుతోంది. దేవుని బిడ్డగా మారడానికి యేసుపై మాత్రమే విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
అయితే, సమాధానకర్తగా ఉండాలనే పిలుపు ప్రకారం జీవించడం ద్వారా యేసుపై ఉన్న విశ్వాసం నిజమైనదని రుజువు అవుతుంది. వారు నిజంగా దేవుని బిడ్డగా ఉంటారు. వారు దేవుని ఆమోదాన్ని అనుగ్రహాన్ని పొందిన ధన్యులుగా ఉంటారు. అప్పుడు సహజంగా ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, ఒకరి విశ్వాసం నిజమైనదని రుజువు చేసే సమాధానకర్త యొక్క లక్షణాలు ఏమిటి? నేను 8 లక్షణాలను తెలియచేస్తున్నాను.
సమాధానకర్తల 8 లక్షణాలు.
1వ లక్షణము: సమాధానకర్తలు దేవునితో సమాధానంగా ఉంటారు. సమాధానమంతటికి పునాది దేవునితో సమాధానంగా ఉండటమే. పరిశుద్ధ దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఏకైక మార్గం ఆయన కుమారుడు ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. రోమా 5:1 లో “విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము” అని స్పష్టంగా ఉంది. మన పాపాలన్నిటినీ కడిగేది యేసు రక్తమే. పరిశుద్ధ దేవునితో మనం సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి యేసు నియమించబడిన మార్గం కాబట్టి అక్కడ నుండే ప్రారంభించాలి.
2వ లక్షణము: సమాధానపరిచేవారు యేసు ఇచ్చే శాంతిని అనుభవిస్తారు. యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన తన శిష్యులకు యోహాను 14:27 లో, “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” అని చెప్పారు. నిరాశ మధ్య యేసు తన శిష్యులకు శాంతిని అందించారు. అదే శాంతి మనకు కూడా అందించబడుతుంది. మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా యేసుపై మన దృష్టిని ఉంచినంత కాలం మనం కూడా యేసు అందించే ఆ శాంతిని అనుభవించగలము.
3వ లక్షణము: సమాధానకర్తలు దేవునితో సమాధానంగాలేని ఇతరులకు వారికి సమాధానం లభిస్తుందని నమ్మకంగా చెబుతారు. సమాధానకర్తలు క్రీస్తు ద్వారా తమకు కలిగిన అదే శాంతిని అంటే యేసు రక్తం ద్వారా తమ పాపాలు కడిగివేయబడినప్పుడు లభించిన శాంతిని ఇతరులు కూడా కలిగి ఉండాలని కోరుకుంటారు కాబట్టి వారితో యేసు సువార్తను పంచుకుంటారు. వారు యెషయా 52:7 లోని “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి” అనే మాటలను హృదయపూర్వకంగా తీసుకుంటారు. వారు 2 కొరింథి 5:20 లో “దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై–దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము” అని చెప్పిన పౌలు మాటలను యేసుకు దూరంగా ఉన్నవారిని చూసినప్పుడు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు.
4వ లక్షణము: సమాధానకర్తలు ప్రజలందరితో శాంతిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాధానకర్తలుగా వర్ణించబడిన క్రైస్తవులందరూ ఇతరులతో శాంతిని కొనసాగించాలని బైబిలు పదేపదే పిలుపునిస్తుంది. మత్తయి 5:23-24 లో “23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల 24 అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని యేసు మనకు ఆజ్ఞాపించారు. పౌలు రోమా 14:19 లో “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము” అని చెప్పాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో “ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించడానికి ప్రతి ప్రయత్నం చేయమని” మనల్ని కోరుతున్నాడు. ఈ వచనాల ఆధారంగా సమాధానాన్ని అనుసరించడం ఒక ఎంపిక కాదని స్పష్టమవుతుంది.
5వ లక్షణము: సమాధానకర్తలు తాము ఎప్పుడూ సమాధానకరమైన బంధాలను కలిగి ఉండమని తెలిసినప్పటికీ శాంతిని అనుసరిస్తారు. సత్యాన్ని ఎదుర్కొందాము. పరిపూర్ణ సమాధానకర్తయైన యేసుకు కూడా అందరితో శాంతియుతమైన సంబంధాలు లేవు. అలాగే అపొస్తలులకు కూడా! మనకు కూడా అదే వర్తిస్తుంది. మీరు గమనిస్తే, సువార్తకు నమ్మకంగా ఉండడం వలన వివాదాలు ఎదురవుతాయి “నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36 ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు” అని యేసు స్వయంగా చెప్పారు [మత్తయి 10:34-36].
అందుకే అపొస్తలుడైన పౌలు రోమా 12:18 లో “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అనే జ్ఞానవంతమైన మాటలు వ్రాశాడు. మన వంతుగా ఇతరులతో శాంతిని కొనసాగించేందుకు మనం కృషి చేయాలి. శాంతి కోసం కృషి చేయడంలో మనం అదనపు మైలు వెళ్లాలి. అయితే శాంతిప్రేమికులు కాని కొందరి వలన కొన్నిసార్లు పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
6వ లక్షణము: సమాధానకర్తలు ఎల్లప్పుడూ ప్రజల మధ్య శాంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మరో విధంగా చెప్పాలంటే, సాధ్యమైనంత వరకు క్రైస్తవులు ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి తగినంత శ్రద్ధ వహించాలి. ఒకరితో ఒకరు శాంతియుతంగా ఉండమని మనం ప్రజలకు చెప్పినప్పుడు దానిలో కొంత ప్రమాదం కూడా ఉంటుంది. మనల్ని అపార్థం చేసుకోవచ్చు, నిందించవచ్చు, స్నేహాన్ని కూడా కోల్పోవచ్చు. కానీ సమాధానకర్తలుగా మనం ఎప్పుడూ ప్రజల మధ్య శాంతిని నింపడానికి ప్రయత్నించాలి. అపొస్తలుడైన పౌలు అలాంటి వ్యక్తే.
ఉదాహరణకు ఫిలిప్పి 4:2లో అతను ఇద్దరు స్త్రీల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు. “ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.” ఫిలేమోనుకు అతని బానిస ఒనేసిము మధ్య సమాధానం తీసుకురావడానికి అతడు చేసిన ప్రయత్నాలు మరొక ఉదాహరణ. విశ్వాసిగా మారడానికి ముందు ఒనేసిము దొంగతనం చేసి ఫిలేమోను నుండి పారిపోయాడు. అందుకే పౌలు తన శాంతి ప్రయత్నాలలో ఫిలేమోనుకు ఒనేసిము చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పాడు, “17 నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము. 18అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము” [ఫిలేమా 1:17-18]. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు!
7వ లక్షణము: శాంతిని పెంపొందించడం కోసం సమాధానకర్తలు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. శాంతి కొరకు వెల చెల్లించవలసి వస్తుంది. మనం ఇకపై దేవునితో యుద్ధం చేయలేని విధంగా మనల్ని తనతో సమాధానపరచుకోవడం కోసం తండ్రి తన కుమారుని వెలగా చెల్లించారు. మన కోసం ఆ శాంతిని కొనడానికి కుమారుడు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ప్రపంచానికి సమాధానమనే శుభవార్త అందించిన తొలి అపొస్తలులు కొన్నిసందర్భాల్లో తమ జీవితాలను వెలగా చెల్లించారు.
అదేవిధంగా, మనం శాంతిని పెంపొందించడానికి కృషి చేస్తున్నప్పుడు మనం కొంత వెల చెల్లించవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే యేసు తరువాతి ధన్యతలో [మత్తయి 5:10-12] మనం ధన్యతల ప్రకారం జీవించినప్పుడు కలిగే బాధల గురించి తెలియచేశారు. మనం ఎంత మృదువుగా చెప్పినా నిజం బాధిస్తుంది. గర్వించే వ్యక్తులు తమ తప్పును వినడానికి ఇష్టపడరు. మనకు ఈ ప్రతికూల ప్రతిస్పందన కేవలం అవిశ్వాసుల నుండి మాత్రమే రాదు. విశ్వాసులుగా చెప్పుకునే వారి నుండి ఇంటిలో చర్చిలో లేదా కార్యాలయంలో ఎదురవ్వచ్చు. అయినప్పటికీ వెల చెల్లించాలనే భయంతో మనం శాంతిని పెంపొందించడానికి దూరంగా ఉండలేము. శాంతిని పెంపొందించమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు దానికి మనం లోబడాలి.
8వ లక్షణము: సమాధానకర్తలు బంధాలలో శాంతిని కోల్పోవడానికి కారణం కారు. మనం సమాధానకర్తలుగా ఉండడానికి పిలువబడినప్పటికీ, మనం తరచుగా శాంతి విఘాతకులుగా చెప్పబడే విధంగా ప్రవర్తిస్తాము. మన వైఖరి, మాటలు మరియు పనులు శాంతిని కలిగించకుండా మన మార్గాలలోనే మనం సాగాలని గట్టిగా కోరుకుంటున్నామని తెలియచేస్తాయి. మనం ఎప్పుడూ సరిగనే ఉన్నామని నిరూపించబడాలని కోరుకుంటున్నాము. ఎవరైనా మన తప్పులను ఎత్తిచూపితే దేవుడు దానిని తప్పించాలి. నరకంలో దాని వెల చెల్లించవలసి ఉంటుంది. ఇది వివాహ బంధాలలో, తల్లిదండ్రుల బంధాలలో, ఇతర విశ్వాసులతో సంబంధాలలో మరియు మన కార్యాలయాల్లోని వ్యక్తులలో కూడా కనిపిస్తుంది. మన నోటిని ఝుళిపిస్తాము. చిన్న కారణాలకు కూడా తీవ్రంగా కోపం వస్తుంది. సహనం లేకపోవడం మరియు క్షమించేగుణం లేకపోవడం మనలో కనపడుతుంది.
అహంకారం ఉన్న చోట శాంతిని కోల్పోవడం తప్ప మరొకటి ఉండదు. శాంతిని భంగం చేసేవారిలా బ్రతుకుతుంటే మనం సమాధానకర్తలం కాలేము! అందుకే దైవిక జ్ఞానాన్ని వెంబడించమని యాకోబు 3:16-18 లో “16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. 17 అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. 18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును” అని యాకోబు చెప్పాడు.
ఈ ధన్యత ప్రకారం జీవించడము.
సమాధానకర్తలుగా మనకు ఇవ్వబడిన పిలుపు ప్రకారం ఎలా జీవించాలి? నిత్యం పరిశుద్ధాత్మపై ఆధారపడటం ద్వారా మాత్రమే జీవిమచగలము. ఈ జీవనశైలిని మనం స్వంతంగా కొనసాగించలేము. అందుకే యేసు మన పక్షాన పరిపూర్ణతను పొందడమే కాకుండా, మనం జీవించడానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను కూడా ఇచ్చారు. గలతీ 5:22 లో, “అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము…” అని చెప్పబడింది. ఇది మనలో పని చేసే పరిశుద్ధాత్మ శక్తి వల్లనే మనం సమాధానాన్ని కలిగించేవారిగా ఉండగలుగుతాము. పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా కార్యం చేయును. ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మరియు జీవిత పరిస్థితుల ద్వారా [ప్రధానంగా పరీక్షలు ద్వారా] మనలో ఈ వైఖరి పెంపొందుతుంది.
అందుకే మనలో పరిశుద్ధాత్మ జీవిస్తున్నాడని మనం ఖచ్చితంగా ఉండాలి. ఆయన మనలో నివసించేలా చేయగలిగే ఏకైక మార్గం పాప క్షమాపణ కోసం క్రీస్తుపై మాత్రమే విశ్వాసం ఉంచడమే. మరో మాటలో చెప్పాలంటే, మనం దేవునితో శాంతిగా ఉండటమే ముఖ్యము [1వ లక్షణం చూడండి]. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ఈ అద్భుతమైన సమాధానాన్ని మన జీవితాలలోను మరియు మన జీవితాల ద్వారా కలిగిస్తారు.
బైబిలు నిరంతరం మనల్ని మొండి పట్టుదల పట్టకుండ, వినయంగా క్షమాగుణం కలిగి సహనంతో ఉండాలని పిలుపునిస్తుంది. అవమానాలను తిరస్కరణలను పట్టించుకోకుండా యేసు చేసినట్లే మనం కూడా మన శక్తి మేరకు శాంతిని పెంపొందించడానికి సిద్ధంగా ఉండాలి. మనం “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి.” మనం “ఒకరినొకరు సహించుకొనుచు ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభువు మనల్ని క్షమించినట్లు మనం క్షమించాలి.” మనం వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. మరియు “క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయములలో ఏలుచుండనియ్యుడి. సమాధానం కొరకే మనం ఒక్క శరీరముగా పిలువబడ్డాము.” చివరిగా, మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి [కొలసి 3:12-17].
మనం ఈ రకమైన జీవనశైలిని అనుసరించినప్పుడు, మనం నిజంగానే, ఆయన దయతో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు ఇవ్వబడిన పిలుపు ప్రకారం సమాధానపరిచేవారిగా జీవించగలము.
సమాధనపరచువారు నిజంగా ధన్యులు, వారు దేవుని పిల్లలని పిలువబడతారు!