ధన్యతలు 7వ భాగము హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

Posted byTelugu Editor February 20, 2024 Comments:0

(English Version: “Blessed Are The Pure In Heart”)

మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది ఏడవది. ఇక్కడ యేసు ప్రభువు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను యేసు వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:8లో “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” అని వివరించబడిన హృదయశుద్ధి అనే ఆరవ వైఖరిని మనం పరిశీలిస్తాము.

*******************

మీరు క్రైస్తవేతరులతో ఒక సర్వే చేసి వారు చూడాలనుకునే ఒక విషయం ఏమిటని వారిని అడగండి. అంటే దేనిని చూడాలని వారు ఆశపడుతున్నారని నా ఉద్దేశం, “నాకు దేవుని చూడాలని ఉంది. ఆయన సన్నిధి అనుభవించాలని కోరుకుంటున్నాను” అని ఎక్కువమంది చెబుతారంటే నేను నమ్మను. లోకం దేవుని మరియు ఆయన సన్నిధి కోరుకోదు. అయితే నిజమైన క్రైస్తవుని అదే ప్రశ్న అడిగినప్పుడు, నేను క్రీస్తు ముఖంలో దేవుని చూడాలనుకుంటున్నాను. నేను ఆయన సన్నిధిని అనుభవించాలనుకుంటున్నాను అని చెబుతాడు. ఇది లోక కోరికకు పూర్తిగా భిన్నమైన కోరిక!

అయితే, దేవుని చూడాలని మరియు ఆయనతో ఉండాలని కోరుకోవడం ఒక విషయమైతే ఇది జరుగుతుందని ఖచ్చితంగా నమ్మడం మరొక విషయము. కాబట్టి, మనం పరలోకంలో ఉండి దేవుని చూస్తామని ఎలా నిశ్చయించుకోవచ్చు? మత్తయి 5:8లో, హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరని యేసు ప్రభువు సమాధానమిచ్చారు. హృదయంలో స్వచ్ఛంగా ఉన్నవారు మాత్రమే దేవునిచే ఆశీర్వదించబడతారు లేదా ఆమోదించబడతారు. అలాగే తుదకు పరలోకంలో ఆయనను చూసినందుకు ఆనందాన్ని పొందుతారు అని కూడా ఈ వచనాన్ని చెప్పవచ్చును.

దేవుని చూచుట.

దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు. మనం ఆయన మహిమను మాత్రమే చూడగలము. అయినప్పటికీ, యేసు దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై ఉన్నారని బైబిలు పేర్కొంది [హెబ్రీ 1:3]. 1 యోహాను 3:2 లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను [యేసును] చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము అని చెబుతుంది. కాబట్టి దేవుని చూడడం అనేది పునరుత్థానుడైన యేసును ఆయన మహిమతో చూడడానికి సూచిస్తుంది. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడని యేసు స్వయంగా చెప్పారు [యోహాను 14:9].

హృదయశుద్ధి.

“హృదయశుద్ధి” అనే మాటను అర్థం చేసుకోవడం చాలా అవసరము. ప్యూర్ అనే ఆంగ్ల పదం కాథర్సిస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం ప్రక్షాళన లేదా శుభ్రపరచడం. ఇది మంచిది కాని దానిని వదిలించుకోవడాన్ని సూచిస్తుంది.

సాధారణంగా, “హృదయశుద్ధి” అనే మాట వ్యభిచారపు కోరికలు, మోహం లేని హృదయాన్ని తెలియచేస్తుంది. కామపు ఆలోచనల నుండి హృదయం విడుదల పొందాలి. ఇదే అధ్యాయంలో యేసు వ్యభిచారం గురించి హృదయంలోని మోహం వలన కలిగే ప్రమాదాల గురించి చెప్పారు [మత్తయి 5:27-30]. ఏది ఏమైనప్పటికీ, స్వచ్ఛమైన హృదయమనేది లైంగిక స్వచ్ఛతకు సంబంధించింది మాత్రమే కాకుండా ఇంకా విస్తృతమైనది. ఇది ఎటువంటి మలినం లేని హృదయాన్ని దేవునికి యదార్ధంగా అంకితం చేయబడిన హృదయాన్ని సూచిస్తుంది. విభజింపబడిన విధేయతలు, మిశ్రమ ఉద్దేశ్యాలు లేని హృదయము.

మత్తయి 6:24 లో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని యేసు చెప్పిన మాటలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో యేసు చెప్పింది ఏమిటంటే: ప్రతిదానికి మూలమైన హృదయం అన్ని మలినాల నుండి విడుదల పొందాలి. విధేయతలు విభజింపబడి ఉండకూడదు. ఇతర విధేయతలు ఉండకూడదు. దేవునికే పూర్తిగా అంకితమవ్వాలి. దేవునికి ఆయన మహిమకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవాలనే ఒకేఒక కోరిక ఉండాలి. అటువంటి ఆ హృదయాన్ని దేవుడు శుద్ధమైన హృదయంగా పరిగణిస్తున్నాడని యేసు చెప్పారు.

అంతర్గత స్వచ్ఛత కలిగివుండడం అనేది యేసు కాలంనాటి ప్రజలు ముఖ్యంగా మత పెద్దలు అనుకున్నదానికి పూర్తిగా వ్యతిరేకము. వారు అంతర్గత స్వచ్ఛత గురించి పట్టించుకోరు. వారు బాహ్య స్వచ్ఛత గురించి, మానవ సంప్రదాయాలకు అనుగుణంగా ఒకరిని శుభ్రపరచడం గురించి మాత్రమే శ్రద్ధ వహించారు.

అయితే యేసు అంతర్గత స్వచ్ఛతకు పిలుపునిచ్చారు. “సమస్త చెడుకు మూలం హృదయమే కాబట్టి హృదయశుద్ధి కలిగి ఉండాలన్నారు. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదు అని మత్తయి” 15:19-20 లో ఆయన చెప్పిన మాటలు గమనించండి.

భక్తిపరుడైన ఒక యూదా నాయకుడిని అరెస్టు చేసి జైలులో ఉంచడం గురించి ఈ కథ ఉంది. జైలులో ఉన్నప్పుడు అతనికి ఒక బ్రెడ్ ముక్క ఒక కప్పు నీరు మాత్రమే ఇచ్చేవారు. అతడు ఆ నీటిని తాగడానికి బదులుగా యూదుల సంప్రదాయం ప్రకారం చేతులు కడుక్కోవడానికి వాటిని ఉపయోగించి తరువాత రొట్టె ముట్టుకునేవాడు. యేసు కాలంలోని మతపరమైన వ్యక్తులు బాహ్య సంప్రదాయాలపై ఎంత శ్రద్ధ వహించేవారో ఈ కథ తెలియచేస్తుంది.

చర్చికి వెళ్లడం, కొన్ని క్రైస్తవ కార్యక్రమాలు చేయడం సమస్య కాదు కాని మన హృదయం మధ్యలో దేవుని ఉంచడమే. మత్తయి 6:33 లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును అని యేసు చెప్పారు. “మొదట” అనే పదం దేవునికి ఆయన నీతికి పూర్తి స్థాయి ప్రాధాన్యతను ఇవ్వడాన్ని సూచిస్తుంది. ఆ ప్రమాణాలలో కొన్నింటిని కొండమీది ప్రసంగంలో యేసు వివరించారు.

ఉదాహరణకు, హృదయశుద్ధి గలవారు కోరుకునేవి:

కోపాన్ని విడిచిపెట్టి సమాధానాన్ని వెదకుతారు [మత్తయి 5:21-26]

వ్యభిచారానికి దూరంగా ఉండి, తమ వివాహ బంధాన్ని గౌరవిస్తారు [మత్తయి 5:27-32]

మోసపూరిత మాటలు విడిచిపెట్టి, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడతారు [మత్తయి 5:33-37]

కంటికి కన్ను అనే ప్రతీకార ధోరణి విడిచిపెట్టి వారి శత్రువులను కూడా ప్రేమించి ప్రార్థించి వారికి మేలు చేయాలని కోరుకుంటారు [మత్తయి 5:38-48]

డబ్బు ఇవ్వడం ప్రార్థించడం, ఉపవాసం ఉండడం అనేవి బహిరంగ ప్రశంసల కోసం కాదు కాని దేవుని సంతోషం కోసమే చేస్తారు [మత్తయి 6:1-18]

వారి డబ్బును దేవుని మహిమ కోసం ఉపయోగిస్తారు కాని భూలోకంలో సంపద కూడబెట్టుకోరు [మత్తయి 6:19-34]

ఇతరుల పట్ల కఠినంగా కాకుండా దయగల హృదయంతో ప్రవర్తిస్తారు [మత్తయి 7:1-12]

విశాలమైన దారిలో వచ్చే ఆనందాలను ఆస్వాదించకుండా ఇరుకైన దారిలో నడుస్తారు [మత్తయి 7:13-27]

మరో మాటలో చెప్పాలంటే, వారు బాహ్యంగాను అంర్గతంగాను దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉండే జీవితాన్ని జీవిస్తారు. మతంలో ఉండే బాహ్య ప్రదర్శనపై వారు దృష్టి పెట్టరు. వారు దేవుని యథార్థంగా ప్రేమించి స్వచ్ఛమైన హృదయంతో ఆయనను సంతోషపెట్టాలని యథార్థంగా కోరుకుంటారు.

హృదయశుద్ధిని కొనసాగించడము.

మనం దానిని ఎలా చేయాలి? మన హృదయాలను ఎలా స్వచ్ఛంగా ఉంచుకోగలము? పరిశీలించవలసిన 4 సూత్రాలు.

1వ సూత్రము: రక్షించబడండి.

హృదయంలో స్వచ్ఛత కలిగివుండడానికి ప్రారంభంగా రక్షణలో భాగంగా మనం మన హృదయాలను పాపం నుండి శుభ్రపరచుకోవాలి. మరోవిధంగా చెప్పాలంటే, మన పాపాల కాలుష్యం నుండి మనం క్షమాపణ పొందుకోవాలి. అపొ కా 15:9 హృదయములను యేసులోని విశ్వాసమువలన పవిత్రపరచుకోవాలని పిలుపునిస్తుంది.

ఏదేమైనప్పటికీ, యేసు ఈ ప్రసంగంలో ప్రధానంగా విశ్వాసును అంటే క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారిని ఉద్దేశించి చెబుతూ హృదయంలో స్వచ్చతను కలిగి ఉండడం అంటే హృదయశుద్ధి కలిగి ఉండడమనే భావన కంటే అధికమైనదని చెప్పారు. ఇది క్రైస్తవ జీవితమంతటా కలిగివుండవలసిన హృదయశుద్ధిని అనగా ఏ మలినం లేని హృదయాన్ని సూచిస్తుంది.

2వ సూత్రము: మనకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వమని దేవుడిని నిరంతరం అడగాలి.

స్వచ్ఛమైన హృదయాన్ని మనంతట మనమే కొనసాగించడం అసాధ్యము. మన స్వంతానికి విడిచిపెడితే మన హృదయాలను నిరంతరం అపవిత్రం చేసుకోవడమే అవుతుంది. అందుకే మనం కూడా కీర్తన 51:10 లో మొరపెట్టిన దావీదువలె, “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” అని నిరంతరం మొరపెట్టాలి. ఏ మలినంలేని స్వచ్ఛమైన హృదయం కొరకు మొరపెట్టాలి. దేవునినే కేంద్రంగా కలిగివుండి ఆయనకు పోటీపడే శక్తులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించే హృదయముండాలి. దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దానిని చేయగలడు. అందుకే మనం ఆయనను అడుగుతూనే ఉండాలి.

మనం పరిశీలించవలసిన ప్రశ్న ఒకటి ఉంది. మనకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వమని చివరిసారిగా దేవుడిని ఎప్పుడు వేడుకున్నాము? మనం అనేక ఇతర విషయాల గురించి దేవునికి అడుగుతూనే ఉంటాము. కానీ స్వచ్ఛమైన హృదయం కోసం మన హృదయాలు నిరంతర మొరపెట్టవు. కారణం? క్రీస్తు పట్ల మనకున్న విధేయతకు లోకం పట్ల మనకున్న ప్రేమకు మధ్య మన హృదయాలు విభజించబడ్డాయి. మన హృదయాలు కలుషితమయ్యాయి. దాని ఫలితంగా మన ఉద్దేశాలు కూడా కలుషితమయ్యాయి.

వినోదంతో సంతృప్తి చెందే సంస్కృతిలో జీవించడం వల్ల మనం ముఖ్యమైన విషయాల పట్ల మొద్దుబారిపోతున్నాము. మనం ఎంపిక చేసుకునే వినోదాలు, మనం చూడాలనుకునే ప్రదేశాలు, మనం కొనాలనుకునే వస్తువులు మరియు మనం కోరుకునే కెరీర్ అన్నీ మన హృదయ స్థితిని వెల్లడిస్తాయి.

మన హృదయాన్ని పరిశోధించుకోవడానికి ఒక వేదాంతవేత్త అడిగిన ప్రశ్నలు.

ఎవరూ చూడనప్పుడు, మీ మనస్సు తటస్థంగా ఉన్నప్పుడు మీరు ఏమి ఆలోచిస్తారు?

ఎంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికి మోసం, నీచమైన హాస్యం విషయంలో మీరు ఎంత సహనంతో ఉంటారు?

మీరు దేనికి స్థిరంగా విధేయత చూపిస్తారు?

అన్నిటికంటే మీకు ఏది ఎక్కువగా కావాలి? మీరు దేనిని, ఎవరిని ప్రేమిస్తారు?

మీ హృదయంలో ఉన్నదానిని మీ పనులు మీ మాటలు ఎంతవరకు ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి?

మీ హృదయంలో ఉన్నదానిని మీ పనులు మీ మాటలు ఎంతవరకు కప్పి ఉంచుతాయి?

ఇలాంటి ప్రశ్నలు నిరంతరం అడుగుతూ ఉంటే మన హృదయాలు స్వచ్ఛమైనవా లేదా మురికిగా ఉన్నాయా అని తెలుస్తుంది. మనం నిజాయితీగా ఉంటే, చాలావరకు సమాధానాలు మనం కోరుకునే విధంగా ఉండకపోవచ్చు. దేవుని సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి మనకు అత్మీయ వనరులు ఎంత కొరతగా ఉన్నాయో గుర్తించడానికి ఆ వాస్తవం మనల్ని బలవంతం చేస్తుంది. మనం అత్మీయంగా ఎంత పేదవారిగా ఉన్నామో చూడడానికి అది మనకు సహాయం చేస్తుంది [మత్తయి 5:3]. ఆ గ్రహింపు వలన మనం పాపం ఒప్పుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లి, యేసు రక్తం అన్ని పాపాల నుండి మనలను శుద్ధి చేస్తుందని నమ్మేలా చేస్తుంది [1 యోహాను 1:7].

3వ సూత్రము: దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యాయనం చేయడము.

యోహాను 15:3లో యేసు, నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారని చెప్పారు. మన రక్షణ సమయంలో ప్రారంభ శుద్ధి చేసేది దేవుని వాక్యమే. కానీ అదే దేవుని వాక్యం నిరంతర శుద్ధిని అందిస్తుంది. అదే సువార్తలో తర్వాతి రెండు అధ్యాయాలలో యేసు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యమని ప్రార్థించారు [యోహాను 17:17]. ప్రతిష్ఠ చేయడమంటే పాపం నుండి దేవునికి, పాపం నుండి పవిత్రతకు స్వచ్ఛతకు వేరుగా ఉంచడమే.

కాబట్టి, మనం దేవుని వాక్యంలో సమయాన్ని వెచ్చించి దాని ద్వారా మన హృదయాలను శుద్ధి చేయడానికి పరిశుద్ధాత్మను అనుమతించకపోతే హృదయశుద్ధి కలుగదు.

4వ సూత్రము: మన కళ్ళు ఏమి చూస్తాయో, మన పాదాలు ఎక్కడికి వెళ్తాయో ఎలాంటి సహవాసంలో ఉన్నారో గమనించండి.

కీర్తన 101:3-4 లో దావీదు, “నా కన్నుల యెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను. 4 మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేననుసరింపను” అని అన్నాడు. ఈ రకమైన నిబద్ధత స్వచ్ఛమైన హృదయాన్ని కోరుకునే వ్యక్తికి నిశ్చయంగా ఉండాలి.

హృదయాన్ని అపవిత్రం చేసే విషయాలను మన కళ్లు చెవుల ద్వారా మనల్ని మనం ఎంత ఎక్కువగా దగ్గర చేసుకుంటామో స్వచ్ఛమైన హృదయాన్ని కాపాడుకోవడం అంత కష్టమవుతుంది. మన హృదయాలను త్వరగా అదుపు చేయలేము. కళ్ళు చెవులు హృదయానికి ప్రవేశ ద్వారాలు. మనం చూసేవి, వినేవి మరియు మనం ఉండే సహవాసం మన హృదయాలను ప్రభావితం చేస్తాయి. 1 కొరింథీ 15:33 లో పౌలు మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును అని స్పష్టంగా చెబుతున్నాడు. మన హృదయాన్ని కలుషితం చేసే దేనినైనా కత్తిరించడంలో మనం నిర్దయగా ఉండాలి.

హృదయశుద్ధి కలిగి ఉండడానికి మన సాధనలో పరిశీలించవలసిన 4 సూత్రాలు ఇవి.

రక్షించబడాలి. అది ప్రారంభము

మనకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వమని నిరంతరం దేవుని అడగాలి.

దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి.

మన కళ్ళు ఏమి చూస్తాయో, మన పాదాలు ఎక్కడికి వెళ్తాయో మరియు ఎలాంటి సహవాసంలో ఉన్నామో గమనించాలి.

హృదయశుద్ధి ఒక ఎంపిక కాదు. హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు [హెబ్రీ 12:14] అని యేసు స్పష్టంగా చెప్పారు. కేవలం పరిశుద్ధమైన మాటలు మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చవు. ఆ మాటలు స్వచ్ఛమైన హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన జీవితం ద్వారా బలపరచబడాలి.

2 కొరింథీ 7:1 లో “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని వ్రాయబడింది. అంతర్గత స్వచ్ఛత [ఆత్మ] ఫలితంగా బాహ్య [శరీరం] స్వచ్ఛత ఏర్పడుతుంది. మన జీవితమంతా ఈ రకమైన స్వచ్ఛతను కొనసాగించడానికి ప్రభువు మాకు సహాయం చేయాలి.

హృదయశుద్ధి గలవారు నిజంగా ధన్యులు, వారు కేవలం వారు మాత్రమే దేవుని చూస్తారు.

Category

Leave a Comment