ధన్యతలు 5వ భాగము నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.

Posted byTelugu Editor January 23, 2024 Comments:0

(English version: The Beatitudes –  Blessed Are Those Who Hunger And Thirst For Righteousness”)

మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది ఐదవది. ఇక్కడ యేసు ప్రభువు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను యేసు వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:4 లో నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు అని వివరించబడిన నీతికొరకు ఆకలిదప్పులు అనే నాల్గవ వైఖరిని మనం పరిశీలిస్తాము.

*******************

భౌతిక శరీరం గురించి చెప్పడానికి  మీరు ఏమి తింటారో అదే మీరు అనే ప్రసిద్ధ సామెతను ఉపయోగిస్తారు. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం సరైన ఆహారాన్ని మాత్రమే తినాలి. భౌతికమైన దానికి ఏది సత్యమో ఆధ్యాత్మికతకు కూడా అదే సత్యము.

4వ ధన్యతలో మన ప్రభువు మన శరీరానికి కాకుండా ఆత్మకు విరుద్ధమైన ఆహార పద్దతిని ఇచ్చారు. మనం ఏది తినాలో చెప్పడమే కాకుండా దానిని మనం ఎలా తినాలో కూడా చెప్పారు. నీతి విషయంలో లోతైన ఆశ కలిగి ఉండాలి. ఆకలిదప్పికలు అనేవి బలమైన కోరికను సూచిస్తాయి. నీతి కొరకు ఆశ  అంటే సరిగా జీవించడము అని అర్థము. అలాంటి ఆశ కలిగినవారు దేవుని ఆశీర్వాదాన్ని ఆమోదాన్ని మరియు అనుగ్రహాన్ని పొందుతారని యేసు చెప్పారు. వారు ధన్యులు. నీతిని జీవనశైలిగా అనుసరించినందుకు ప్రతిఫలం ఏమిటంటే వారు తృప్తిపరచబడతారు. ఈ ధన్యతలోని సారం అదే.

ఈ ధన్యతలో వివరించబడిన నీతి ఏమిటి?

ఇక్కడ వివరించబడిన నీతి క్రీస్తులో మన స్థానాన్ని సూచించదు, మనం క్రీస్తుపై విశ్వాసముంచినప్పుడు మనకు కలిగే దేవుని నీతి అది [రోమా 3:22]. కొండమీది ప్రసంగంలో చెప్పబడిన ధన్యతలు మరియు జీవనశైలి మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హతలు కాదు. దీనికి విరుద్ధంగా, అవి ఇప్పటికే ప్రవేశించిన వారి లక్షణాలుగా ఉండాలి. ఇవి రక్షణకు కారణం కాదు కాని రక్షణ వలన కలిగే ఫలితాలు.

కానీ మనం దేవుని నీతిని కలిగివున్నామని ఎలా తెలుసుకోవాలి? మనం నిజంగా రక్షించబడ్డామని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మన విశ్వాసం నిజమైనదని మనం ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలం? సాక్ష్యం ఏమిటి? దానికి జవాబు: దేవుని దృష్టిలో మనం నిజంగా నీతిమంతులమో కాదో తెలుసుకోవడానికి మన జీవితాలను పరిశీలించుకోవాలి. ఈ నీతినే ఆచరణాత్మక నీతి అంటారు. యేసుపై విశ్వాసం ఉంచడం వలన వచ్చే స్థిరమైన నీతి ఎప్పుడూ ఆచరణాత్మకమైన నీతికి దారి తీస్తుంది. “ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది” [మత్తయి 7:17]!

ఆచరణాత్మక నీతి లక్షణాలు.

మన జీవితాలు అబద్ధం చెప్పవు. మనం దేవుని ప్రమాణాలతో ఏకీభవించి జీవిస్తున్నామా, దేవుని దృష్టిలో సరిగా ఉన్నామా లేదా అని అవి చెబుతాయి. కాబట్టి, ఈ ధన్యతలో యేసు తెలియచేస్తున్న నీతి ఆచరణాత్మకమైన నీతి. నిజానికి కొండమీది ప్రసంగమంతటిలో దేవుని దృష్టిలో సరైన జీవితాన్ని జీవించడం అంటే ఏమిటో యేసు వివరించారు. మత్తయి 5-7 గురించి కొంచెం సర్వే చేస్తే మనం గమనించే అంశాలు ఇవే.

నీతి కొరకు ఆకలిదప్పులు అంటే సమాధానం కలిగి ఉండడం [మత్తయి 5:23-24], లైంగిక స్వచ్ఛత [మత్తయి 5:28], జీవిత భాగస్వామికి విశ్వాసంగా ఉండడం [మత్తయి 5:32], స్వచ్ఛమైన మాటలు [మత్తయి 5:37], ప్రతీకారం తీర్చుకోకపోవడం [మత్తయి 5:39], శత్రువులను ప్రేమించడం [మత్తయి 5:44], దేవుని మాత్రమే సంతోషపెట్టడానికి నీతికార్యలు చేయడం [మత్తయి 6:1], ప్రార్థనలో స్వీయ వృద్ధి కంటే దేవుని మహిమకు ప్రాధాన్యత ఇవ్వడం [మత్తయి 6:9-15], పరలోకంలో ధనం సమకూర్చుకోవడం [మత్తయి 6:19-21], చింతించకుండా దేవునిపై నమ్మకం ఉంచడం [మత్తయి 6:25-33], ఇతరులను కరుణతో మెలగడం [మత్తయి 7:1-12], చివరిగా యేసు మాటలపై జీవితాన్ని నిర్మించడము [మత్తయి 7:24-27].

నీతికలిగిన జీవితం ఎలా ఉండాలో కొండమీది ప్రసంగంలో యేసు మన కోసం వివరించారు. తమలో పరిశుద్ధాత్మ నివసించే యేసు అనుచరులకు నీతిని జరిగించాలనే పవిత్రమైన ఆకలిదప్పికలు ఉంటాయి. మన భౌతిక శరీరం ప్రతిరోజూ ఆహారాన్ని నీటిని కోరుకున్నట్లే, ఆధ్యాత్మికత నీతిని అనగా అన్ని వేళలా నీతికలిగిన జీవితాన్ని కోరుకుంటుంది. ఇది ఎప్పుడూ తృప్తి చెందదు. అందుకే యేసు ఈ ఆకలి మరియు దాహాన్ని వర్తమానకాలంలో, దేవుని దృష్టిలో సరైనది చేయాలనే ఆకలి దాహం ఎప్పుడూ ఉండాలని చెప్పారు. ఇది ఎప్పుడూ ఉండే మరియు ఎప్పటికప్పుడు అధికమయ్యే ఆకలి. ఇది మతంలా బయటకు కనిపించేది కాదు కాని హృదయం లోపలి నుండి దేవుని చిత్తానికి లోబడాలనే ఎడతెగని కోరిక.

ఓ దేవా, క్షమించబడిన పాపి ఎంత పవిత్రంగా ఉంటాడో నన్ను ఎంత పవిత్రంగా ఉంచండి! అని ఒక పాత స్కాటిష్ విశ్వాసి మొర పెట్టినట్లుగా నీతిమంతుల హృదయం నిరంతరం ప్రార్థిస్తుంది. దేవుని చిత్తాన్ని పాటించడంలో విఫలమైనప్పుడు ఆత్మలో లోతైన వేదన ఉంటుంది. ఎటువంటి సాకులు ఉండవు కానీ పాపాన్ని అంగీకరించి మరలా సరైన మార్గంలోనికి రావడానికి శుద్ధిచేసి శక్తిని దయచేయమని దేవునికి వేడుకునేలా చేసే నిజమైన దుఃఖం ఉంటుంది.

నీతికలిగిన జీవనశైలికి ప్రతిఫలము.

నీతి కొరకు ఆకలిదప్పులు కలిగిన వారు మాత్రమే తృప్తి పరచబడతారని యేసు వాగ్దానం చేస్తున్నారు. తృప్తి పరచబడడం అంటే మనల్ని మనం తృప్తి పరచుకోవడం కాదు. అది దేవుడు మనలో చేసే పని. దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. అయితే దేవుడు మనల్ని దేనితో తృప్తిపరుస్తారు? ఇక్కడ కోరుకునేది ఏమిటి? నీతి! కాబట్టి మనం ఏ నీతి కోసం ఆకలితో దాహంతో ఉన్నామో ఆ నీతితో దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు.

ఒక్క మాటలో, మనలో యేసు అనుచరులైన వారు క్రీస్తులో మనకు స్థిరపరచబడిన నీతి వలన కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు కాబట్టి మనం తృప్తి పరచబడతాము. మనం కూడా దేవుని దృష్టిలో సరైనది చేయాలని కోరుకున్నప్పుడు ఆ కోరికను కార్యరూపంలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ నిజంగా మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆ కోరిక తృప్తి పరచబడుతుంది. అదే ఆచరణాత్మక నీతిలోని ఆనందము.

అయితే మనలో నివసించే పాపం వలన ఈ కోరిక నిత్యం తృప్తి చెందదు. ఏమైనప్పటికి భవిష్యత్తులో యేసు తిరిగి వచ్చినప్పుడు మనం నూతన శరీరాలను పొందుతాము. ఆ నూతన శరీరాలలో ఇక పాపం ఉండదు, తద్వారా మనం నిరంతరం దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటాము. ఎప్పటికీ ఎడతెగని విధేయత వలన కలిగే ఆనందంతో మనం నిత్యం తృప్తిపరచబడతాము.

విధేయతతో కూడిన సంపూర్ణ జీవితాన్ని అంటే ఎప్పుడూ దేవుని దృష్టిలో సరైనది చేస్తూ ఉండే జీవితాన్ని మీరు ఊహించగలరా? వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడ మనం నీతి పాలన చేయడం చూస్తాము. మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నామని పేతురు చెప్పాడు [2 పేతురు 3:13]. ఇప్పుడు ఆశ కలినవారు యేసు భవిష్యత్తులో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ కోరిక పూర్తిగా తృప్తి చెందడాన్ని చూస్తారు. అది ఆయన వాగ్దానము.

నీతికలిగిన జీవనశైలిని అనుసరించడం వల్ల కలిగే మూడు ప్రయోజనాలు.

ఈ ధనత్యలో చెప్పిన నీతికలిగిన జీవనశైలిని అనుసరించడం వలన అనేక ప్రయోజనాల ఉన్నప్పటికి నేను మూడింటిని తెలియచేస్తాను.

ప్రయోజనం # 1. మనం రక్షణ గురించి ఖచ్చితమైన హామీని కలిగి ఉండవచ్చు [రోమా 8:14-16].

తక్కువ విధేయత చూపించి ఎక్కువ హామీని పొందలేము. దాని గురించి ఆలోచించండి. మన రక్షణ గురించి సందేహం కలగడానికి కారణం పాపంలో జీవించడమే కదా? నిజానికి, తమ రక్షణ విషయంలో ఒకరు మోసం చేయవచ్చు. కానీ సాధారణంగా, విధేయత  జీవనశైలిగా ఉన్నప్పుడు నిజమైన హామీని ఇస్తుంది. దాని ఫలితంగా, క్రైస్తవ జీవితంలోని ఆనందాన్ని మనం అనుభవిస్తాము.

ప్రయోజనం # 2. మనం వ్యక్తిగతంగాను వేరొకరి గురించి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు సమాధానాలను పొందుతాము [కీర్తన 66:18, యాకోబు 5:16].

దేవుడు మన ప్రార్థనలు వినకుండా పాపం అడ్డుకున్నట్లే, దేవుడు విని సమాధానం ఇవ్వడానికి నీతి మార్గం తెరుస్తుంది. మనం పాపం నుండి బయటపడాలనే కోరిక లేకుండా జీవిస్తూ ఉంటే వ్యక్తిగత మరియు మధ్యవర్తిత్వ ప్రార్థన వలన ఉపయోగం ఉండదు. ఏది ఏమైనప్పటికీ, నీతి కొరకు ఆకలిదప్పులు కలిగిన ఆత్మ ద్వారా సమర్పించబడినప్పుడు ఈ ప్రార్థనలు శక్తివంతంగా ఉంటాయి.

ప్రయోజనం # 3. మనం క్రీస్తుకు ప్రభావవంతమైన సాక్షిగా ఉండవచ్చు [మత్తయి 5:16, 1 పేతురు 2:12].

నీతికలిగిన జీవితం దాచబడి ఉండదు. ఇది సువార్తను అత్యుత్తమంగా ప్రకటిస్తుంది. మారిన జీవితం యేసుకు జీవితాలను మార్చే శక్తి ఉందని చూపిస్తుంది.

నీతి కొరకు మనకున్న ఆకలిదప్పికలను ఎలా పెంచుకోవాలి?

ఈ ధన్యతలో మనం ఎలా ఎదగాలి? ఈ ధన్యత కోసం మనకున్న ఆకలిదప్పికలను ఎలా పెంచుకోవాలి? దానికి 2 విధానలు ఉన్నాయి.

1. మనం దేవుని పట్ల ఆశను చురుకుగా పెంపొందించుకోవాలి.

నీతిమంతుడైన దేవుని పట్ల లోతైన ఆశ కలిగివున్నప్పుడు నీతిని జరిగించాలనే పరిశుద్ధమైన ఆశ కలుగుతుందని మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మనం నీతికలిగిన జీవితాన్ని జీవించడం కాదు. ప్రధానంగా, మనం నీతికి మూలమైన నీతిమంతుడైన దేవుని వెంబడించాలి. గతంలో దేవుని ప్రజల వైఖరి అదే.

కీర్తనలు 42:1 “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.”

కీర్తనలు 63:1-2 “దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును 2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది. నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.”

యెషయా 26:9 “రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.”

కాబట్టి, మనం దేవుని కోసం తపన పడాలి. అన్నింటికంటే ఎక్కువగా ఇచ్చేవాని కొరకు మన హృదయాలు ఆశ కలిగివుండాలి.

2. మనం దేవుని వాక్యం పట్ల ఆశను చురుకుగా పెంపొందించుకోవాలి.

రెండవదిగా, దేవుని పట్ల మన ఆశ  పెరుగుతుంటే దేవుని వాక్యం పట్ల మన ఆశ కూడా పెరగాలి. ఎందుకంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారి ఇష్టాలు అయిష్టాలు వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాము. దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి.

అదే విధంగా, మనం దేవుని ప్రేమించి ఆయనకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో తెలుసుకోవాలంటే, ఈ సత్యాలను మనకు తెలియచేసే ఒక్కఒక మార్గం లేఖనాలు. దేవుని దృష్టిలో సరైనది చేయడం గురించి ఈ ధన్యతలో తెలియచేయబడింది, దేవుని దృష్టిలో సరైనది ఏమిటో మనం తెలుసుకోగలిగే ఏకైక స్థలం ఆయన పరిశుద్ధ వాక్యమే. మరో మాటలో చెప్పాలంటే, నీతి కోసం ఆకలిదప్పికలు ఉన్నవారికి దేవుని వాక్యం ఆహారంగా ఉండాలి. అందుకే దేవుని ప్రజలు నిరంతరం దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండడం దానిలో ఆనందించడం గురించి బైబిలులో పదే పదే చదువుతాము.

కీర్తనలు 119:20 “నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది, దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.”

యోబు 23:12 “ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.”

యిర్మీయా 15:16 “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.”

మత్తయి 4:4 “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.”

1 పేతురు 2:1-3 “ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.”

జ్ఞానం కోసమే కాదు కాని, మనం మరింతగా లోబడడానికి విధేయత చూపడానికి మనం దేవుని వాక్యం పట్ల ఎక్కువ ఆశ కలిగివుండాలి. మనం ఎంత ఎక్కువ విధేయత చూపితే మనం అంత ఎక్కువగా నీతిలో తృప్తిని అనుభవిస్తాము. దాని ఫలితంగా, మనం దేవుని వాక్యం పట్ల ఎంత ఎక్కువ ఆకలిదప్పికలు కలిగివుంటాము. అది అలా కొనసాగుతూనే ఉంటుంది.

అదే విధంగా, మనం ఎంత అవిధేయతతో నడుచుకుంటామో, అంతగా దేవుని వాక్యం పట్ల ఆకలిదప్పికలు తగ్గిపోతాయి. మరియు దేవుని వాక్యం పట్ల ఆకలిదప్పికలు తగ్గిపోతే విధేయత తగ్గిపోతుంది. ఇక్కడ ప్రతికూలమైన ప్రభావం ఉంటుంది.

కాబట్టి, దేవుని పట్ల ఉన్న ఆశ దేవుని వాక్యం పట్ల ఆశకు దారి తీస్తుంది.  ఈ రెండు నీతి కొరకు మనలో ఆకలిదప్పికలు పెరగడానికి మార్గాలు. మీకు ఆ ఆశ ఉందా? మీరు ఏమి తింటారో అదే మీరని గుర్తుంచుకోండి. నీ హృదయంలోని ఆశ ఏమిటి? ఆశలు అబద్ధం చెప్పవు!

ఈ నీతి కొరకు ఆకలిదప్పికలకై మనవి.

భారతదేశంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చాలా మంది హిందువులు పాటించే ఒక ఆచారం ఉంది. నా తండ్రి చనిపోయినప్పుడు చిన్న పిల్లవాడిగా నేను కూడా దానిని పాటించడం నాకు జ్ఞాపకం ఉంది [అప్పటికి నేను ఇంకా రక్షించబడలేదు]. ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకుని చనిపోయిన వ్యక్తి నోటిలో వేసి ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్తారు. కాని ఆ బియ్యం తినకుండా అలాగే ఉండిపోయింది. కారణం శవానికి ఆకలి దాహం ఉండవు.

అదే విధంగా, ఆత్మీయంగా చనిపోయిన వారికి నీతి కొరకు ఆకలిదప్పికలు ఉండవు. కాబట్టి, మీరు క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని దృష్టిలో సరైనది చేయాలనే కోరిక లేకపోతే మిమ్మల్ని మీరు నేను ఆధ్యాత్మికంగా సజీవంగా ఉన్నానా? అని ప్రశ్నించుకోవాలి.

గుర్తుంచుకోండి, కొండమీది ప్రసంగమనేది యేసు అనుచరులకు ఉండవలసిన జీవితం గురించి ఆయన చెప్పినదానికి మన జీవితం సరిపోతుందో లేదో చూడటానికి యేసు మన ముందు ఉంచిన అద్దమని గుర్తుంచుకోండి. కొండమీది ప్రసంగం చివరలో “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” [మత్తయి 7:21] అని ఆయన చెప్పిన మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇతర విషయాలతోపాటు నీతి కొరకు అనగా ఆయన దృష్టిలో సరైనది చేయడం కోసం మనకు పవిత్రమైన ఆకలి పవిత్ర దాహం ఉండాలనేది తండ్రి చిత్తము. మనకు ఆ ఆకలి లేకపోతే మనం ఆయన బిడ్డలమని చెప్పుకునే హక్కు మనకుండదు.

మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మన జీవనశైలిలో నీతి లేకపోతే, మనం ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడి మన పాపాలను విడిచిపెట్టి క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన అందించే క్షమాపణను విశ్వాసంతో అంగీకరించాలి. ఆ విధంగా మనం దేవుని నీతిని పొందగలము. ఆ సమయం నుండి మనం జీవించినంత కాలం మన అనుదిన జీవితంలో ఈ నీతిని మరింత ఎక్కువగా పొందాలని పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపించబడతాము, దేవుడు మనలను తృప్తిపరుస్తూ ఉంటారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఒకేసారి సంపూర్ణమైన తృప్తిని అనుభవిస్తాము అదేవిధంగా ఆ సమయం నుండి మనం నిత్యం దేవుని సంతోషపరుస్తాము.

హెచ్చరిక మాట.

ఈ జీవనశైలిలో, నీతి కొరకు ఈ ఆకలిదప్పికలు లేనివారు భవిష్యత్తులో ఆకలిదప్పికలు అనుభవిస్తారు. అవి నరకపు వేదనల వలన కలిగే బాధ నుండి ఉపశమనాన్ని పొందాలనే ఆకలిదప్పికలు [లూకా 16:24]. ఆ ఆకలిదప్పికలు ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఎంతో భయంకరమైన జీవితం అది!

మనం ఏమి తింటామో అదే మనము. మన ఆహారం పాపమైతే దాని అంతిమ ఫలితం నరకంలో భయంకరమైన బాధ. అలాగే మన ఆహారం నీతి అయితే దాని అంతిమ ఫలితం పరలోకంలో అపరిమితమైన ఆనందము. మనం చేరుకునే గమ్యాలు ఈ రెండు మాత్రమే. మనం దేనిని ఎంచుకుంటాము? భయంకరమైన బాధ లేదా అపరిమితమైన ఆనందమా? ఈ ధన్యతలో అనుసరించమని యేసు పిలిచిన వాటిని అనుసరించడం వల్ల ఆనందాన్ని ఎంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. నీతి కొరకు ఆకలిదప్పికలు కలవారు నిజంగా ధన్యులు, వారు తృప్తి పొందుతారు.

Category

Leave a Comment