డబ్బును ప్రేమించడం వలన కలిగే 4 ప్రమాదాలు

Posted byTelugu Editor May 16, 2023 Comments:0

( English Version : 4 Dangers Of Loving Money )

ఒక నాటకంలోని పాత హాస్యనటుడు అన్నింటికన్నా డబ్బు మనకు ఎంత ముఖ్యంగా మారిందో వివరించాడు. హాస్యనటుడు నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా సాయుధుడైన దొంగ అతడి దగ్గరకు వచ్చి, “నీకు డబ్బు కావాలా? నీ ప్రాణం కావాలా?” అని అడుగుతాడు. ఆ హాస్యనటుడు చాలా సేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. దొంగ అసహనంతో “చెప్పు?” అంటాడు. అందుకు ఆ హాస్యనటుడు, “నన్ను తొందరపెట్టకండి. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను” అంటాడు.

దీనిని చూసి మనం నవ్వుతాము కాని, డబ్బు మనపై ఈ రకమైన పట్టును కలిగి ఉండటం నిజమే కదా? అందుకే డబ్బు వలన కలిగే ప్రమాదాల గురించి బైబిలులో చాలా హెచ్చరికలు ఇవ్వడంలో ఏ ఆశ్చర్యం లేదు. ఆ హెచ్చరికలలో చాలా వరకు స్వయంగా యేసు ప్రభువు పెదవుల నుండి వచ్చాయి. వాటికి రెండు ఉదాహరణలు:

మత్తయి 6:24, “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”

లూకా 12:15, “మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.”

హెబ్రీ పత్రికలో కూడా మనకు “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి” అని జ్ఞాపకం చేయబడింది.

ఖచ్చితంగా చెప్పాలంటే, డబ్బును ప్రేమించడం గురించి కేవలం కొత్త నిబంధన బోధనలు మాత్రమే చెప్పడం లేదు కాని పదవ ఆజ్ఞ కూడా దురాశ కలిగివుండవద్దని చెబుతుంది, “దేనినైనను ఆశింపకూడదు” (నిర్గమ 20:17).

డబ్బుమీది ఆశ అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. వాటిలో నాలుగు ప్రమాదాలు క్రింద వివరించబడ్డాయి.

ప్రమాదము # 1. దేవుని కన్నా దానినే మనం విశ్వసించేలా చేస్తుంది.

నిత్యజీవం కోసం యేసు దగ్గరకు వచ్చిన ఆస్థిపరుడైన యువ పాలకుడు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ [మార్కు 10:17-22]. అతనికి తన డబ్బుమీద చాలా ప్రేమ, అలాగే దానిని విడిచిపెట్టడడం ఇష్టంలేదు. దాని ఫలితంగా, మరణానికి పాత్రునిగా ఎంచబడిన అతడు నిత్యజీవాన్ని ఇచ్చేవాని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్థిపరుడైన ఆ యువ పాలకుడు తీర్పు కోసం యేసు ఎదుట నిలబడినప్పుడు, “అతడు రక్షకుడైన యేసును తిరస్కరించాడు కాబట్టి అతని ధనం అతడిని కాపాడుతుందా చెప్పండి?

మన కాలంలో కూడా, స్టాక్ మార్కెట్ కుప్పకూలినా, ఆర్థికమాంద్యాలు వచ్చినా, అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఇంకా చాలామంది ఇప్పటికీ నిజమైన దేవునిపై కాకుండా అస్థిరమైన సంపదమీదే తమ నమ్మకాన్ని ఉంచుతున్నారు (1 తిమోతి 6:17). “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు” అని సామెతలు 11: 4 లో హెచ్చరిక చేయడంలో ఏ ఆశ్చర్యం లేదు.

ప్రమాదము # 2. ప్రస్తుత ప్రపంచంలో కూడా ఇది అనేక బాధలను తెస్తుంది.

“ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” (1 తిమోతి 6:9) అని బైబిలులో స్పష్టంగా చెప్పబడింది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక ప్రజలు ఎక్కువ గంటలు పని చేసేలా, దేవుడిని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేలా, ఇంకా పాప మార్గాలలో డబ్బు సంపాదించేలా  చేస్తుంది.

ఒక్క సంతోషాన్ని తప్ప ప్రపంచంలో అన్నింటిని అందించగలగేది డబ్బు అని అంటారు అది నిజమే! ఇప్పటివరకు ఉన్న అత్యంత సంపన్నులలో ఒకరైన రాక్‌ఫెల్లర్ ఇలా అన్నాడు, “నేను చాలా లక్షలు సంపాదించాను, కానీ అవి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు.” “నేను మెకానిక్‌గా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను” అని ధనవంతుడైన హెన్రీ ఫోర్డ్ [ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు] ఒకసారి అన్నాడు. బైబిలులో మహాజ్ఞాని అని పిలువబడిన సొలోమోను కూడా “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు” అని చెప్పాడు (ప్రసంగి 5:12).

ప్రమాదము # 3. ఇది మనల్ని చాలా స్వార్థపరులుగా చేస్తుంది.

సహజంగా మనం మరింత కావాలనుకుంటే, మన దగ్గర ఉన్నవాటిని వదిలిపెట్టడానికి అసలు ఇష్టపడము. దానిని గట్టిగా పట్టుకోవాలని ఆత్రంగా ప్రయత్నిస్తాము.  అది స్వార్థం పెరగడానికి కారణమవుతుంది. దేవుని పనికి ఇవ్వడానికి స్వార్థం (హగ్గాయి 1) మరియు ఇతరుల అవసరాలను తీర్చడంలో స్వార్థం (1 యోహాను 3:16-18) చూపుతారు.

మనం బాప్తిస్మం పొందినప్పుడే మా బ్యాంక్ ఖాతా కూడా బాప్తిస్మం పొందిందని మనం మర్చిపోతాము. మన డబ్బంతా దేవుడి సొంతమనే విషయాన్ని మనం మర్చిపోతాము. ఆయన మా సంరక్షణలో అప్పగించిన దానికి మనం కేవలం పర్యవేక్షకులం మాత్రమే. దేవుడు మనల్ని అభివృద్ధి చేశాడు అంటే మనం ఇచ్చే స్థాయిని  పెంచుకోమని దాని అర్థం అంతేకాని మన జీవన ప్రమాణాన్ని పెంచుకోమని కాదు అని గ్రహించడంలో మనం విఫలమౌతుంటాము . దీనిని బట్టి, మనం కష్టమైన పరిస్థితులలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తే, మనం మన జీవన పరిస్థితులను తగిన విధంగా మెరుగుపరుచుకోకూడదని నేను చెప్పడం లేదు. “నా దగ్గర ఉన్నదంతా నా ఆనందం కోసం మాత్రమే ఇవ్వబడింది” అనే వైఖరినుండి మనల్ని మనం కాపాడుకోవాలి అనేదే హెచ్చరిక.

“ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు” (లూకా 12:48) అని యేసు హెచ్చరించారు. ఈ వాక్యంలోని సత్యం కేవలం ఆర్ధికవ్యవస్థకు మాత్రమే పరిమితం కాదని నేను ఒప్పుకున్నప్పటికీ, నిజానికి మన ఆర్థికస్థితికి కూడా ఇది వర్తిస్తుంది.

ప్రమాదము # 4. ఇది మనల్ని తాత్కాలికమైనవాటికి బంధీచేస్తుంది అలాగే నిత్యత్వం చూడకుండా గ్రుడ్డివారిని చేస్తుంది.

డబ్బుపై ప్రేమ మన దృష్టిని మరుగుపరుస్తుంది. మార్కు 10:17-22 లో ఉన్న ఆస్థిపరుడైన యువ పాలకుడు దానికి మంచి ఉదాహరణ. అతడు యేసును కలుసుకున్న సందర్భం బట్టి, యేసులో మాత్రమే లభించే నిజమైన శాశ్వత సంపదను చూడకుండా ఒక వ్యక్తిని గ్రుడ్డివానిగా చేయగల శక్తి అశాశ్వతమైన డబ్బుకు ఉందని తెలుస్తుంది.

ఒక వ్యాపారికి దేవదూత కనబడి అతడు కోరిన ఒక వరాన్ని ఇస్తానని వాగ్దానం చేయడం గురించి ఒక కథ ఉంది. ఆ వ్యక్తి భవిష్యత్తులో ఒక సంవత్సరం పాటు స్టాక్-మార్కెట్ అంచనాలకు సంబంధించిన కాపీ కావాలని కోరుకున్నాడు. అతను వివిధ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భవిష్యత్ ధరలను అధ్యయనం చేస్తున్నప్పుడు, భవిష్యత్తులోని చూడగలగడం వలన అతడు తన ప్రణాళికల గురించి పెరిగిన సంపద గురించి ప్రగల్భాలు పలికాడు.

అతడు వార్తాపత్రిక పేజీని చూస్తున్నప్పుడు, శ్రద్దాంజలి కాలంలో తన ఫొటోని చూశాడు. అనివార్యమైన అతని మరణాన్ని బట్టి చూస్తే, డబ్బు నిజంగా అంత ముఖ్యమైనదా?

లూకా 12:13-21 లో ఉన్న ఉపమానం ద్వారా యేసు ఈ సత్యం గురించే హెచ్చరించారు. ఈ లోకసంబంధమైన తాత్కాలిక సంపదకు బంధీ అయ్యి, దేవుడికి బదులుగా డబ్బును వెంబడించి నిత్యత్వాన్ని చూడలేని గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి గురించి ఈ ఉపమానము. “అయితే దేవుడు, వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. 21దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను” (లూకా 12:20-21).

కాబట్టి, డబ్బును ప్రేమించడం వల్ల కలిగే 4 స్పష్టమైన ప్రమాదాలు—తాత్కాలిక మరియు శాశ్వతమైన పరిణామాలను కలిగి ఉండే ప్రమాదాలు.

అయితే, మనం డబ్బుమీది ప్రేమ నుండి విడుదల పొందామని ఎలా నిర్ధారించుకోవాలి? అది చాలా సులభం, మనం డబ్బు కంటే యేసుని ఎక్కువగా ప్రేమించాలి. మన పాపాలు క్షమించబడాలని మన మధ్య జీవించడానికి మనకు బదులుగా చనిపోవడానికి పరలోకపు మహిమను విడిచిపెట్టింది కేవలం యేసు మాత్రమే అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు మనకు మధ్య ఏదీ రాకూడదని మనం అర్థం చేసుకోవాలి, అందులో డబ్బు కూడా ఉంది. ఈ జీవితం తర్వాత ఏ విలువలేని భూలోక సంపదలన్నిటి కంటే ఆయననే మనం విలువైన సంపదగా భావించాలి. మన జీవితంలోని ఉన్న వాటన్నిటిపై ఆయన అధికారానికి మనం లోబడాలి. డబ్బుకు మనపై ఉన్న పట్టును అధిగమించడానికి మనకు సహాయం చేయమని మనం నిరంతరం ఆయనకు మొరపెట్టవలసిన ఉంది.

మనం అలా చేసినప్పుడు, డబ్బు మన యజమానిగా మనల్ని నియంత్రించకుండా మనం దానిని మనకు బానిసగా చేసుకొనే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనకు ఇస్తారు. మనం దేవుని ప్రేమించడానికి, అతని స్వరూపంలో సృష్టించబడిన ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి ఆయన మనల్ని డబ్బుమీది ప్రేమ నుండి విడుదల చేస్తారు!

సామెతల గ్రంథంలో ఇవ్వబడిన ప్రార్థనను కంఠస్థం చేసి ప్రతిరోజూ ఈ ప్రార్థన చేస్తూ దానిని పాటించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?

సామెతలు 30:8 “వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.”

సామెతల గ్రంథంలో ఇవ్వబడిన ఏకైక ప్రార్థన ఇదే. ఇది ఎంతో ఆచరణాత్మకమైన ప్రార్థన కదా?

Category

Leave a Comment