కోపము—అది సృష్టించే వినాశనం 4వ భాగము—పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు?

Posted byTelugu Editor February 25, 2025 Comments:0

(English version: “Sinful Anger – The Havoc It Creates (Part 4)”)

పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో ఇది 4వ భాగము. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయం 1వ భాగంలో, “కోపం అంటే ఏమిటి?” అనే ప్రశ్నను 2వ భాగంలో పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే ప్రశ్నను 3వ భాగంలో చూశాము. పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు? అనే ప్రశ్నను ఈ 4వ భాగంలో పరిశీలిస్తాము.

III. పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు?

కోపాన్ని దేవుని మీద, మన మీద, ఇతరుల మీద వ్యక్తం చేస్తాము.

ఎ. దేవుని మీద

రెండు విధాలుగా దేవుడు మనల్ని నిరాశపరిచారని భావించడం వల్ల మనం దేవునిపై కోపగిస్తాము. (1) దేవుడు మనకు చేయాలని మనం ఆశించింది ఆయన చేయనప్పుడు [ఉదా, మనకు సంతోషకరమైన వివాహాన్ని, మంచి కెరీర్‌ను ఇవ్వడం, అనారోగ్యం నుండి మనల్ని బాగుచేయడం, చిరకాల కోరికను నెరవేర్చడం మొదలైనవి చేయనప్పుడు] ఒకవిధంగా మనం మోసపోయినట్లుగా అనిపిస్తుంది. దాని ఫలితంగా మనకు దేవునిపై కోపం వస్తుంది. (2) మనం ఊహించని దానిని దేవుడు చేసినప్పుడు. ఉదాహరణకు, దేవుడు ప్రియమైన వ్యక్తిని తీసుకువెళ్లిపోయినప్పుడు లేదా మన జీవితకాల కలను తుడిచిపెట్టినప్పుడు ఆయన మనకు అలా చేయకూడదని మనం భావిస్తాము. దేవుడు మనపట్ల క్రూరంగా ప్రవర్తించాడని భావించి మనం ఆయనపై కోపం తెచ్చుకుంటాం.

దేవునిపై అలా కోపం వచ్చిన కారణంగా, మనం చల్లబడే వరకు మనం చర్చికి, బైబిలు చదవడానికి, ప్రార్థనలో కొంత సమయం గడపడానికి దూరంగా ఉంటాము. కొన్నిసార్లు మనం చర్చికి రావడం, బైబిలు చదవడం, ప్రార్థించడం మొదలైనవాటిని కొనసాగించినప్పటికీ హృదయం స్థబ్దుగా దేవుని పట్ల ఉదాసీనంగా మారుతుంది. అవి దేవుని పట్ల ఆయన మార్గాల పట్ల అంతర్గప్రేమగా కాకుండ బాహ్యంగా యాంత్రిక చర్యలా ఉంటాయి. కొన్ని విపరీతమైన సందర్భాల్లో, ఈ కోపం దేవుని పూర్తిగా విడిచిపెట్టేలా చేస్తుంది.

మనం ఆలోచించే ముందు, “నా భావాలను దేవునికి నిజాయితీగా వ్యక్తపరచాలి ఎందుకంటే ఆయన నా తండ్రి,” అని మనం హెచ్చరించబడాలి. దేవుడు మనకు తండ్రి మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు; భయం పడడానికి మరియు గౌరవానికి ఆయన అర్హుడు. ప్రసంగి 5:1-2లోని “1  నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని వ్రాయబడ్డాయి.”

ఈ సందర్భం కోపంతో కూడిన భావోద్వేగాలను సమస్యగా చెప్పకపోయినా, దానిలో స్పష్టమైన సూత్రం ఏమిటంటే, గొప్పవాడు శక్తిమంతుడైన దేవునికి తగని వాటిని మాట్లాడకుండా మనల్ని మనం కాపాడుకోవడం మంచిది.

మనకు దేవునిపై కోపం రావడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, దేవుడు సౌకర్యవంతమైన సుఖమయమైన జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదని మనం తరచుగా గుర్తుంచుకోకపోడమే. ఇది మనకు కావలసినది పొందడం గురించిన సమస్య కాదు. దానికి విరుద్ధంగా, తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెనని ప్రభువు మనలను పిలుస్తున్నారు [లూకా 9:23]. మనం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, మన కోరికల ప్రకారం లేదా ఆశించిన ప్రకారం జరగనప్పుడు మనకు దేవునిపై కోపం రాదని మనకు తెలుస్తుంది. ఆయన మన జీవితంలోని అన్ని వ్యవహారాలపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని పూర్తిగా విధేయతతో ఆయన ముందు లోబడడనికి పిలువబడ్డామని మనం గ్రహిస్తాము.

బి. మనమీద మనకే.

కోపం గురించి చెబుతున్నప్పుడు మనమీద మనకి వచ్చే కోపం గురించి మాట్లాడము. చాలా సందర్భాలలో ఇది నిజము. ఎలా అంటే, మనం లేదా మనకు తెలిసిన ఇతరులు ఈ విధంగా చెప్పినప్పుడు:

  • నేను ఇలా చేశానని నమ్మలేకపోతున్నాను .
  • నా తప్పు వలనే మనం ఈ దుస్థితిలో ఉన్నాము.
  • నేను ఏం ఆలోచిస్తున్నాను?
  • నన్ను నేను చూసుకోలేకపోతున్నాను.
  • నేను ఈ పరీక్షని, సంగీత కార్యక్రమాన్ని, కీలకమైన ఆటని, ముఖ్యమైన ప్రెజెంటేషన్ మొదలైనవాటిని పాడు చేశానంటే నమ్మలేకపోతున్నాను .

మనం నైతికంగా తప్పుగా భావించే దానికి వ్యతిరేకంగా చూపించే చురుకైన ప్రతిస్పందనయే కోపమని గుర్తుంచుకోండి. కాబట్టి మనం సరైనది చేయడంలో విఫలమైనప్పుడు లేదా మనం నైతికంగా తప్పుగా భావించేదాన్ని చేసినప్పుడు మనపై మనకి కోపం వస్తుంది. అది ఒక విధంగా మనల్ని మనం శిక్షించుకోవడమే. మరో మాటలో చెప్పాలంటే, మన వైఫల్యాలకు మనల్ని మనం శిక్షించుకుంటాము.

మనస్సాక్షి అనేది మనం తప్పు చేసినప్పుడు మనల్ని నిందించడానికి దేవుడు ఇచ్చిన సాధనమే అయినా [రోమా 14:22-23, 1 కొరింథి 2:2-4, 1 యోహాను 3:19-21] కోపాన్ని అంతరంగంలోని మళ్లించి పాపం చేసేంతగా మనస్సాక్షి మనల్ని నియంత్రించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.

మనమీద మనకి కోపం రావడానికి గల కొన్ని కారణాల జాబితా:

1. దేవుని క్షమాపణను గ్రహించడంలో వైఫల్యం. ఈ కేటగిరీలోని వ్యక్తులు తమకు తాము విధించుకునే శిక్షను తిరిగి బాగుపడడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తారు [ఒక విధమైన భూసంబంధమైన ప్రక్షాళన]. వారు మనందరి పాపాలకన్నా ఎంతో గొప్పదైన దేవుని దయలోని లోతును అర్థం చేసుకోలేరు. విస్తారమైన పాపం ఉన్న చోటే కృప మరింత విస్తారంగా ఉంటుందని వారు మరచిపోతారు [రోమా 5:20-21].

2. గర్వం. నేను గందరగోళంగా ఉన్నందున ఇతరుల కళ్ళ ముందు నేను ఇబ్బంది పడ్డాను. వారు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? ఇతరుల ముందు మంచిగా కనిపించాలని, వారి దృష్టిలో మనమెప్పుడూ మంచిగా ఉండాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాము. మనం వారి ముందు మంచిగా కనిపించడంలో విఫలమైనప్పుడు కోపాన్ని అంతరంగంలోని మళ్లించి మనల్ని మనం శిక్షించుకుంటాము.

3. మానవ దుర్నీతిని అర్థం చేసుకోవడంలో వైఫల్యం. నేను లేదా నైతికవిలువలున్న మంచి వ్యక్తి ఇది ఎలా చేయగలడు? అనుకుంటాము. కాని వాస్తవానికి నేను చేయగలనని మాత్రమే కాకుండా, అంతకన్నా చాలా ఎక్కువ చేయగలనని అర్థం చేసుకోవడంలో వైఫల్యమే దానికి కారణము.

4. ఎంతో ఆరాటపడిన కోరికను సాధించలేకపోవటంలో నిరాశ. నేను చాలా ఎక్కువగా ఆశించాను కానీ నేను దానిని పాడు చేసిన కారణంగా దానిని పొందలేదు. కాబట్టి, నా మీద నాకే కోపం వచ్చింది. మరోవిధంగా చెప్పాలంటే, ఒక దాని పొందాలని దాని వలన వచ్చే ఆనందాన్ని అనుభవించాలని ఆరాటపడుతూ ఉంటాము. [ఉదా, ఒక కంపెనీలో ఒక నిర్దిష్ట ఉద్యోగం, ప్రమోషన్ పొందడం, టీంను తయారు చేయడం, ఆ వ్యాపారంలో విజయం సాధించడం మొదలైనవి]. ఇప్పుడు నేను దానిని పోగొట్టుకున్నాను, నేను దాని గురించి చాలా ఆరాటపడి కోరుకుని తప్పు చేసానని అంగీకరించడానికి బదులు ఈ వైఫల్యాన్ని ఎదుర్కోవటానికి కోపాన్ని ఉపయోగిస్తాను.

5. స్వనీతికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం. నేను స్వంతంగా ఏర్పరచుకున్న నియమాలకు అనుగుణంగా జీవించలేదు. నా ఇల్లు నేను కోరుకున్నంత శుభ్రంగా లేదు; నేను ఆశించిన విధంగా నా పనిని పూర్తిచేయలేదు మొదలైనవి. సాధారణంగా, మనం ఈ వ్యక్తులను పరిపూర్ణులు అంటాము. వారు తమను తాము బాధించుకుంటారు ఇతరులను కూడా బాధ పెడతారు. వారు విఫలమైనప్పుడు వారు ఆ కోపాన్ని అంతరంగంలోని మళ్లిస్తారు. ఇది అవాస్తవమైన అంచనాలను కలిగి ఉండడమే అవుతుంది.

6. దేవుడు నాకు ఏర్పరచిన ఉత్తమమైన వాటిని పొందడంలో వైఫల్యం. దేవుడు నా కోసం అత్యుత్తమమైన ప్లాన్ Aను కలిగి ఉన్నాడు,  కాని నేను నా వైఫల్యం కారణంగా ఉత్తమమైన ప్లాన్ Bతో మిగిలిపోయాను. ఇప్పుడు, ఈ విషయాన్ని జాగ్రత్తగా చెబుతాను. దైవిక ఎంపికలు చేయడానికి మనమే బాధ్యత వహిస్తున్నప్పుడు, మన పనుల వలన మనం ప్లాన్ Bతో మిగిలిపోతున్నాము. అలాంటప్పుడు, మన జీవితాల పట్ల దేవునికున్న ప్రణాళికలకు ఉద్దేశాలకు మనం ఏదో ఒకవిధంగా అడ్డుకుంటున్నాము కదా?

అలా ఆలోచించడం ద్వారా, మన జీవిత వ్యవహారాలపై మనమే సార్వభౌమాధికారులమని అనుకోవడం లేదా? సార్వభౌమాధికారుడైన దేవుని మార్గాలను సాధారణ మానవులు భంగం చేయగలరని అనుకోవడం తప్పు కాదా? మన వైఫల్యం గురించి దేవునికి ముందే తెలియదా?

అయినప్పటికీ, ఆ వైఫల్యాల ద్వారా కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చగలడు. యోసేపు సోదరులు తాము చేసిన వాటికి వారే బాధ్యులైనప్పటికి వారు దేవుని ప్రణాళికలను అడ్డుకోలేదు. వాస్తవానికి, దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చడానికి వారి చెడును ఉపయోగించాడు. మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను [ఆది 50:20]. దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ బాధ్యతల మధ్య ఉన్న ఈ ఒత్తిడి ఏదో ఒకవిధంగా మన వైఫల్యాల వలన మనకు ప్లాన్ B మాత్రమే మిగిలి ఉందని నిర్ధారించడానికి దారితీయకూడదు.

మన నిర్లక్ష్యపు ప్రవర్తనకు ఇది సాకు కాదు. అయినప్పటికీ, అన్ని వ్యవహారాలపై దేవుని సార్వభౌమాధికారం గురించి తప్పు దృక్కోణంతో ఆలోచించడం వలన అనారోగ్యకరమైన కోపం అంతరంగంలోని మళ్లించబడుతుంది. ఇలాంటి ఆలోచనల బారిన పడిన వ్యక్తులు నేను ఇలా చేసి ఉంటే లేదా అలా చేయకపోతే అని  నిరంతరం ఆలోచిస్తూ ఓడిపోయిన జీవితాలను గడుపుతారు.

ఈ స్వీయ-నిర్దేశిత కోపానికి ప్రతిస్పందన మనల్ని మనం క్షమించుకోవడంలో కనిపించదు ఎందుకంటే మనం ఎంతో విలువైనవారము కనుక యేసు మన కోసం మరణించారు. మనలో పాపం ఉన్నప్పటికీ, మన దేవుడు దయగలవాడని క్రీస్తు ద్వారా అందించబడిన క్షమాపణను మనం స్వీకరించి ఈ అంతర్గత కోపం నుండి మనల్ని మనం విడిపించుకోవాలని అంగీకరించలేకపోవడమే ఇక్కడున్న అసలు సమస్య.

సి. ఇతరుల మీద.

మన కోపంలో ఎక్కువ భాగం ఇక్కడే ఉంటుంది. ఇతరులు మనకు వ్యతిరేకంగా ఏదైనా చేసినందుకు లేదా మన కోసం ఏదైనా చేయడంలో విఫలమైనందున మనం వారిపై కోపంగా ఉంటాము. కొన్నిసార్లు, కొంతమంది తమ కోపాన్ని ఇతరులపై ఒక ఆయుధంగా కూడా ఉపయోగిస్తారు. ఎలా అంటే:

1. ఇతరులను నియంత్రించడానికి. మనం కోరుకున్నది పొందడానికి మన కోపాన్ని ఉపయోగించుకోవచ్చని మనకు తెలుసు; ఇతరులను మార్చటానికి దానిని ఒక సాధనంగా ఉపయోగిస్తాము. మన కోపానికి భయపడి ప్రజలు మనకు బలవంతంగా లోబడేలా చేస్తాము. చాలా ఇళ్లలో ఈ సూత్రం ఉపయోగించబడుతుంది. భార్య భర్త కోపానికి భయపడుతుంది, భర్త భార్య కోపానికి భయపడతాడు, పిల్లలు తల్లిదండ్రుల కోపానికి భయపడతారు, తల్లిదండ్రులు పిల్లల కోపానికి భయపడతారు, తద్వారా ఎప్పుడూ కోపంగా ఉన్నవారు తాము అనుకున్నది చేస్తారు. ఇది మనం కోరుకున్నది పొందడానికి ఇతరులను వేధించడం తప్ప మరొకటి కాదు.

2. ఇతర లోతైన బాధలను దాచడానికి. బహుశా మన గతంలో చేసినవాటిని మనం అవమానంగా భావించినప్పటికీ వీటిని ఇతరులకు వ్యక్తం చేయలేక ఇతరులపై కోపం చూపిస్తూ మనం వాటిని కప్పిపుచ్చుకుంటాము.

3. మనకు మంచి అనుభూతిని కలిగించడానికి. నైతికంగా మీ కంటే నేను గొప్పవాడిని అనే వైఖరిని మనం కలిగివుంటాము. కాబట్టి, మన స్వనీతిని పెంచడానికి ఇతరులపై చూపించే కోపం ఉపయోగించబడుతుంది.

4. ఒత్తిడిని విడుదల చేయడానికి. నేను నా భావాలన్నింటినీ వ్యక్తం చేసినందుకు ఇప్పుడు నేను మంచిగా అనుభూతి చెందుతున్నాను; నేను మొత్తం వేడినంతా బయటకు పంపాను. సమస్య ఏమిటంటే, మన గురించి మాత్రమే ఆలోచిస్తూ మన కోపం బయటకు పంపిస్తూ అది ఇతరులను ఎలా బాధపెడుతుందో పట్టించుకోకపోవడమే. ఉదాహరణకు, మనతో చెడుగా ప్రవర్తించిన మన తండ్రి, తల్లి లేదా జీవిత భాగస్వామిపై మనం కోపంగా ఉన్నామని అనుకుందాం. కొంతమంది కౌన్సెలర్‌లు మనతో ఒక దిండు తీసుకుని అది మీ తండ్రి లేదా తల్లి లేదా జీవిత భాగస్వామి అని ఊహించుకుని, “ఉపశమనం” పొందే వరకు దానిని కొట్టమని చెబుతారు. ఎందుకంటే మనలో బందీయైపోయిన భావోద్వేగాలు విడుదలై మనకు చాలా మంచిగా అనిపిస్తుంది.

5. ప్రతీకారం తీర్చుకోవడం. మనం వెళ్లనివ్వడం అంటే అవతలి వ్యక్తిని కొక్కెం నుండి తప్పించడాన్ని సూచిస్తుంది. మనం కూడా షిమ్యోను లేవి, యోనాలా అవతలి వ్యక్తికి వారికి తగినదే అందేలా చూడాలనుకుంటున్నాము! [ఈ సిరీస్ యొక్క 2వ పోస్ట్లో చూడండి]. మా పాపాలను మరచిపోయి మనల్ని శిక్షించవద్దని మనం దేవుని వేడుకున్నప్పటికీ, దేవుడు ఇతరులను వారి పాపాలను బట్టి  శిక్షించకుండా పాపాలను క్షమించి మరచిపోతే ముఖ్యంగా మనల్ని బాధపెట్టిన వారి పాపాలను మరచిపోతే మనకు కోపం వస్తుంది!

కాబట్టి, మనం “దేవుడు మిమ్మల్ని క్షమించవచ్చు కానీ మీరు నా నుండి అంత తేలికగా బయటపడలేరు; నేను మీకు ప్రతిఫలం చెల్లిస్తాను” అనే వైఖరిని కలిగివుంటాము.

పాపపూరితమైన కోపాన్ని దేవుని మీద, మనమీద, ఇతరుల మీద వ్యక్తపరుస్తామని మనం చూశాము. పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి? అనే తదుపరి పోస్ట్‌లో మనం ప్రశ్నలు సమాధానాలతో ఈ కోపం వివిధ రకాలుగా ఎలా వ్యక్తీకరించబడుతుందో తెలుసుకుంటాము.

Category