ప్రభువు దినాన దేవుని మహిమపరిచే రీతిగా సంఘానికి హాజరవడంపై ఆచరణాత్మక సూచనలు

Posted byTelugu Editor August 11, 2025 Comments:0

(English version: Practical Suggestions On Attending Church In A God-Glorifying Manner On The Lord’s Day)

విశ్రాంతి దినము మరియు ప్రభువు దినము అనే సిరీస్‌లో ఇది 4వ మరియు చివరి పోస్ట్. మొదటి పోస్ట్ లో “క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?” అనే ప్రశ్నను, రెండవ పోస్ట్ లో “క్రైస్తవులు ప్రభువు దినాన్ని పాటించాలా?” అనే ప్రశ్నను, మూడవ పోస్ట్ లో “ప్రభువు దినాన చర్చికి వెళ్ళడానికి ఆటంకం కలిగించే సాధారణ సమస్యలు” చర్చించాము. 

ప్రభువు దినాన దేవుని మహిమపరిచే రీతిగా సంఘానికి హాజరవడంపై ఆచరణాత్మక సూచనలను ఈ పోస్ట్ అందిస్తుంది. నేను వీటిని సన్నాహము మరియు పాల్గొనడము అనే రెండు వర్గాలుగా విభజించాను.

1. సన్నాహము

సాధారణంగా ప్రభువు దినాన ప్రభువును ఆరాధించడానికి చర్చి ప్రారంభానికి ఒకటి లేదా రెండు గంటల ముందు సన్నాహాలు జరుగుతాయి. అది గందరగోళానికి దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మనం ముందుగానే శనివారం సాయంత్రం/రాత్రి లేదా కొంచెం ముందుగానే సిద్ధపడడం వలన ఆదివారం ఉదయం దేవుని ప్రభావవంతంగా ఆరాధించవచ్చు.

శనివారం సాయంత్రం/రాత్రి చేయాల్సిన 10 విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

1. సరైన సమయంలో పడుకోండి.

ఇది చేయడం కంటే చెప్పడం సులభము. అనేక పోటీకరమైన ఆకర్షణీయమైన అంశాలు మనల్ని చాలా సమయం వరకు మేల్కొని ఉంచగలవు [ఉదా, టీవీ, ఇంటర్నెట్, క్రీడలు, గెట్ టు గెదర్‌లు]. అయితే, వాస్తవమేమిటంటే మన శరీరానికి తగిన విశ్రాంతి అవసరము. సమయానికి పడుకోవడం వల్ల మన శరీరాలు విశ్రాంతి తీసుకుని చర్చికి సిద్ధపడటమే కాకుండా మన శరీరాలు అలసిపోయినందున చర్చిని దాటవేయాలనే తాపత్రయాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

2. ఆదివారం ఉదయానికి బట్టలు సిద్ధం చేసుకోండి.

శనివారం రాత్రి 5-10 నిమిషాలను దీనికి కేటాయించడం వలన ఆదివారం ఉదయం అనవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు.

3. కారులో తగినంత పెట్రోల్ఉందని నిర్ధారించుకోండి.

చర్చికి వెళ్లే మార్గంలో పెట్రోల్ నింపడానికి బంకు వద్ద ఆగడం కేవలం కొన్ని నిమిషాల పని మాత్రమే అనిపించవచ్చు. కాని అప్పటికే హడావిడిగా ఉంటే ఆ కొన్ని నిమిషాలు నిస్పృహను పెంచుతాయి. కారు బంకు వద్దకు కూడా చేరుకోలేకపోతే ఏమి చేయాలి?

4. చెక్కు ముందే వ్రాయండి.

చర్చికి ఇచ్చే కానుకలు చెక్కు రూపంలో ఇవ్వడం అలవాటుగా ఉంటే దానిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

5. డైపర్ బ్యాగ్‌ను  సిద్దపరుచుకోండి (చిన్న పిల్లలు ఉంటే).

పిల్లలకు అవసరమైనవన్నీ తగినంతగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా అవసరము.

6. మీరు బోధించే పరిచర్యలో ఉంటే అన్ని మెటీరియల్‌లను ఒక చోట ఏర్పాటు చేసుకోండి.

ఇక్కడ ఏర్పాటు చేసుకోడం అంటే సిద్ధం చేసుకోవడం కాదు. చాలాకాలం క్రితమే సిద్ధపడాలి. ఎవరికైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించే అలవాటు ఉంటే [ఉదా, IPAD], అవి పని చేయనప్పుడు బ్యాకప్‌గా పేపర్ కాపీని ఉంచడం మంచిది. అలాగే కార్యక్రమం మధ్యలో బ్యాటరీ అయిపోకుండా ముందే ఛార్జ్ చేయడం మంచిది.

7. సంగీత పరిచర్యలో ఉంటే సంగీత వాయిద్యాలను సిద్ధంగా ఉంచుకోండి.

ముందు రాత్రి మ్యూజిక్ షీట్‌లు పరికరాలు సిద్ధం చేసుకుంటే అది ఎంతో సహాయపడుతుంది.

8. అల్పాహారాన్ని అవసరమైతే భోజనాన్ని కూడా సిద్ధం చేయండి.

ఆహారం అనేది ఒక పెద్ద సమస్య. ఏం తినాలి, వండడానికి ఎంత సమయం పడుతుంది అనేవి చిరాకు కలిగిస్తాయి. అయితే, ముందు రోజు రాత్రే ఏమి చేయాలో ఒక ప్రణాళికతో ఉంటే ఈ చిరాకును నివారించవచ్చు.

9. అవసరమైతే చర్చి పాట్‌లక్ కోసం ప్లాన్ చేసుకోండి.

మీ చర్చిలో పాట్‌లక్ లంచ్ ఉంటే, మీ కుటుంబానికి మరియు ఇతరులతో (ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వారితో) పంచుకోడానికి సరిపడా మొత్తాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆ విధంగా ఇతరులకు భారం కాకుండా వారికి ఒక ఆశీర్వాదంగా ఉండవచ్చు!

10. పడుకునే ముందు బైబిలు చదవడానికి ప్రార్థనకు సమయాన్ని వెచ్చించండి.

క్రైస్తవుని మూడు శత్రువులు – మనతో ఇంకా ఉన్న పాపపు స్వభావం, మరో రకంగా చెప్పాలంటే శరీరం, లోకం మరియు అపవాది అనేవి ఏ పోరాటం లేకుండా మనల్ని దేవుని విషయాలను వెంబడించనిస్తాయని అనుకోవడం అవివేకం. మనం ఈ యుద్ధాలను ఊహించాలి, లేఖనాలను ధ్యానించి ప్రార్థించడం ద్వారా వాటికి ఎదుర్కోవాలి.

స్తుతించడం, పాపపు ఒప్పుకోలు మన ప్రార్థనలతో పాటు ఉండాలి. మన హృదయాలలో చేదుని నింపుకుని ప్రభువు మందిరానికి రాకూడదని కూడా మనం నిర్ధారించుకోవాలి. అది మన ఆరాధనకు ఆటంకం కలిగిస్తుంది (మత్తయి 5:23-24, మార్కు 11:25). పాపపు హృదయాలతో ఆరాధించడం మరియు ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి (1 కొరి 11:27-31).

ఇది ఆధ్యాత్మిక పోరాటమని మనం గుర్తుంచుకోవాలి. అందుకే సరైన సిద్ధపాటు తప్పనిసరి! సెలవులలో కూడా, ప్రభువును ఆయన ప్రజలతో కలిసి ఆరాధించడానికి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి మరియు బైబిలు బోధించే స్థానిక చర్చి గురించి తెలుసుకోవాలి.

శనివారం నాడు చేయవలసిన 10 విషయాల జాబితాను చూసిన తరువాత, ఆదివారం ఉదయం చేయవలసిన కొన్ని విషయాలను పరిశీలిద్దాం.

ఆదివారం ఉదయం చేయాల్సిన 6 విషయాలు.

1. సరైన సమయంలో నిద్ర లేవండి.

త్వరగా పడుకున్నప్పటికీ మరి కొంచెం సేపు నిద్రపోవాలనే శోధన ఎప్పుడూ ఉంటుంది. పాత అలవాట్లు త్వరగా పోవు. అందుకే అలారం మోగిన వెంటనే లేచేలా సహాయం చేయమని మనం ప్రార్థించాలి!

2. తాజాగా ఉండటానికి స్నానం చేయండి.

పునరుత్థాన రాజైన యేసును ఆరాధించడానికి వస్తున్నప్పుడు మానసికంగా శారీరకంగా అప్రమత్తంగా ఉండటం మంచిది!

3. బైబిలు చదవడంలో ప్రార్థనలో సమయాన్ని గడపండి.

తాజాగా ఉండాలి అనేది కేవలం భౌతికమైన విషయమే మాత్రమే కాదు (తదుపరి పాయింట్ చూడండి) కానీ ఆధ్యాత్మికమైన విషయం కూడా. చర్చిలో దేవుని సన్నిధిని అనుభవించే ఆశీర్వాదం కోసం దేవుని వాక్యంలోను హృదయపూర్వక ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యము. పరిచర్యలో ఉన్నవారి కోసం మరియు వినయ హృదయాలతో వినడానికి ప్రజలను తీసుకువచ్చేలా ప్రభువును ప్రార్థించడం కూడా మంచిది. తప్పిపోయిన ప్రజలు రావాలని, సువార్త వినాలని రక్షించబడాలని ప్రార్థించడం కూడా అంతే మంచిది.

4. మంచి అల్పాహారం తినండి.

ఖాళీ కడుపు (ఉపవాసం ఉంటే తప్ప) ప్రభావవంతంగా ఆరాధించడానికి ఒక అడ్డుగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉంటే మనస్సు శరీరం రెండూ సరిగ్గా పనిచేయవు కాబట్టి మంచి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి!

5. పిల్లలను సిద్ధం చేయడంలో మీ జీవిత భాగస్వామికి సహాయం చేయండి.

ఈ సూచన భర్తలకు ఎక్కువగా వర్తిస్తుంది. మన భార్యలు వారికి అవసరమైన అన్ని రకాల సహాయాలను పొందాలి. పిల్లలను లేపడం, స్నానం చేయించడం మరియు వారి అల్పాహారం తినడానికి సహాయం చేయడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇతర పనులలో బిజీగా ఉండే భార్యకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. మంచి తాజా ఆహారాన్ని తిన్న పిల్లలు తల్లిదండ్రులకు మరియు చర్చి కుటుంబానికి ఒక ఆశీర్వాదం! అంతే కాకుండా అది పిల్లలకి కూడా మంచిది!

గమనిక: ఒక పేరెంట్ మాత్రమే క్రిస్టియన్గా ఉన్న సందర్భాల్లో వారు జీవిత భాగస్వామి నుండి సహాయం పొందలేరని నేను అర్థం చేసుకోగలను. అటువంటి పరిస్థితిలో అది అంత సులభం కాదు. మీరు అలాంటి తల్లిదండ్రులైతే ధైర్యం కోల్పోకండి. మీ ప్రయత్నాలు వ్యర్థం కావు. మీ కోసం మరణించిన ప్రభువైన యేసు కోసం మీరు చేస్తున్నారని గుర్తుంచుకోండి. అది మీరు ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి! ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు, మీ జీవిత భాగస్వామి కూడా మారతారు. దేవుడు కఠిన హృదయాలను మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి దయచేసి నిరాశతో వదిలిపెట్టకండి!

6. చర్చికి ముందుగానే రావాలని ప్లాన్ చేయండి.

ముందుగానే రావడం ద్వారా మీరు స్థిమితంగా కూర్చోవచ్చు, కొంతమందిని కలిసి ప్రోత్సాహకరమైన మాటలు పంచుకోవచ్చు, చర్చి సిబ్బందికి సహాయం చేయవచ్చు మరియు ఆరాధన కోసం ప్రార్థనాపూర్వకంగా మనస్సును సిద్ధం చేయవచ్చు. అంతేకాదు, ముందుగానే రావాలని ప్లాన్ చేసుకోవడం ద్వారా, హడావిడి కారణంగా మీ కుటుంబ సభ్యుల మధ్య చిరాకుకు వాదనలకు దారితీసే ఊహించని ట్రాఫిక్ జాంలను అధిగమించవచ్చు. అదనంగా, ఆరాధనకు వెళ్లే తొందరలో స్పీడ్ లిమిట్‌కు మించి డ్రైవింగ్ చేసిన పాపాన్ని కూడా నివారించవచ్చు!

చర్చికి  ముందుగానే రావడం పిల్లలకు కూడా మంచి ఉదాహరణగా ఉంటుంది! ఇది సమయానికి ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. మనం ముఖ్యంగా ప్రభువును ఆరాధించే చర్చితో సహా ఏ చోటికైనా వెళ్లేటప్పుడు ఎప్పుడూ హడావిడిగా ఉన్నా, ఆలస్యంగా వెళ్తున్నా మన పిల్లలకు ఎలాంటి మాదిరిని ఇస్తాము? పిల్లలు మన మాదిరితోనే నేర్చుకుంటారు!

మీరు చూడగలిగినట్లుగా, ముందుగానే రావాలని ప్లాన్ చేసుకోవడంలో చాలా అనుకూలమైన విషయాలు ఉన్నాయి.

చర్చికి వచ్చే ముందు శనివారం రాత్రి మరియు ఆదివారం ఉదయం ఉండవలసిన ప్రణాళికల గురించి చూసిన తరువాత, చర్చిలో పాల్గొనే అంశాన్ని చూద్దాం.

2. పాల్గొనడము

చర్చిలో ఉన్నప్పుడు పరిగణించవలసిన మూడు విషయాలు.

1. పాటలు పాడటంతో మొదలుకొని వాక్యం వినడం, ప్రార్థన చేయడం మరియు ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనడం వరకూ ఆరాధనలోని అన్ని అంశాలలో మనం హృదయపూర్వకంగా పాల్గొనాలి. మన హృదయపూర్వక ఆరాధనకు ప్రభువైన యేసు అర్హుడు!

2. మనం ప్రజలతో సహవాసం చేసి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మనం కొత్తవారిని కూడా పరిచయం చేసుకోవాలి. తెలిసిన వారితో మాత్రమే సమయం గడపాలనే ధోరణిని మనం అధిగమించాలి.

3. మనం ఆరాధనంతా ఉండేలా ప్లాన్ చేయాలి. అందుకే మనం ఆరాధన అయిన వెంటనే చాలా విషయాలకు సమాయాన్ని కేటాయించకూడదు ( కొన్ని మినహాయింపులు ఉన్నాయి). మనం చాలా విషయాలకు కట్టుబడి ఉంటే, ఆరాధన ముగియడానికి ఆలస్యమైతే కంగారుపడుతూ మనం తరచూ గడియారం వైపు చూస్తూనే ఉంటాము. ఇది ప్రభువు దినం కదా!

ముగింపు మాటలు.

ఈ సూచనలు చాలామంది పాఠకులకు కొత్తేమీ కాదు. అయినప్పటికీ, ప్రభువు దినాన్ని ఆయన దినంగా పరిగణించడంలో మనకు సహాయపడేందుకు అవి అద్భుతమైన రిమైండర్‌గా ఉపయోగపడతాయి.

ఈ సిరీస్‌లో నేను ఏది వ్రాసినా, నేను వాటిని ధర్మశాస్త్రపరమైన దృక్పథంతో వ్రాయలేదు అయినప్పటికీ నన్ను ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పూర్తి చేసిన రక్షణ కార్యానికి మనం దేనినీ జోడించకూడదు తొలగించకూడదు అనేది వాస్తవమే. అయితే ఇంత అధిక వెల చెల్లించగా వచ్చిన విడుదలను అంగీకరించి హృదయపూర్వకమైన నిబద్ధత కలిగి జీవించాలి. ప్రభువు దినాన ప్రభువును గౌరవించడం కూడా దానిలో భాగమై ఉంది.

మనం ప్రభువు దినాన్ని ప్రభువు దినంగా పరిగణించినప్పుడు మనం తప్పనిసరిగా ఏమి చెబుతామంటే, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను గౌరవించాలనుకుంటున్నాను. అది నన్ను నేను తృణీకరించుకుంటేనే చేయగలిగేటట్లయితే, అలా చేయడానికి నాకు సహాయం చేయండి. మీరు దానికి అర్హులు. నేను వారంలోని మొదటి రోజున చేసినట్లే వారంలో అన్ని రోజులు మిమ్మల్ని గౌరవించటానికి దయచేసి నాకు సహాయం చేయండి.” అలాగే మనం విఫలమైనప్పుడు, “ప్రభువా, నన్ను క్షమించు. నేను మారవలసిన విషయాలలో మారడానికి నాకు సహాయం చెయ్యండి” అని ప్రార్థిస్తూ ఆయన వద్దకు వెళ్దాం. అది మన హృదయాల నిరంతర మొఱ్ఱగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.

(పై జాబితాలకు చేర్చడానికి ఇతర అంశాలు మీ వద్ద ఉంటే వాటిని చేర్చడానికి దయచేసి సంకోచించకండి, అవి ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక కోణంలో, ప్రభువు దినాన దేవుని మహిమపరిచే ఈ లక్ష్యాన్ని కొనసాగించడంలో మనమందరం కలిసి ఉన్నాము.)

 

Category