క్రైస్తవులు ప్రభువు దినాన్ని పాటించాలా?

Posted byTelugu Editor July 29, 2025 Comments:0

(English version: Are Christians Required To Keep The Lord’s Day?)

గత పోస్ట్‌లో, క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా? అనే ప్రశ్నకు లేఖనాలను పూర్తిగా పరిశీలించి సమాధానం ఇవ్వబడింది. క్రొత్త నిబంధన క్రింద నివసిస్తున్న క్రైస్తవులు వారంలోని 7వ రోజైన శనివారంను విశ్రాంతి దినంగా పాటించాల్సిన అవసరం లేదని పోస్ట్ నిర్ధారించింది. ఈ వివరణ ప్రభువు దినము అని కూడా పిలువబడే ఆదివారానికి క్రైస్తవునికి ఉన్న సంబంధాన్ని గురించి తార్కికంగా మనం దానిని పాటించాలా? అలాంటి ఆజ్ఞ ఉందా? అని అడిగేలా చేస్తుంది.

దానికి సమాధానం: ఒక నియమానికి విధేయత చూపే విధంగా క్రైస్తవులు ప్రభువు దినాన్నిఆచరించమని ఆజ్ఞాపించబడలేదు. దేవుని మీద ఆయన ప్రజల మీద ఉన్న ప్రేమతో ప్రభువు దినాన్ని ఆచరించాలని బైబిలులోను సంఘచరిత్రలో ఉన్న ఆదిసంఘం యొక్క మాదిరులు మనకు పిలుపునిచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, ప్రభువు దినాన విశ్వాసులందరితో ఏకంగా కలిసి ఆయనను ఆరాధించమని మనల్ని బలవంతం చేసేది ప్రేమే కానీ నియమం కాదు.

పైన పేర్కొన్న అభిప్రాయానికి ఈ పోస్ట్ క్రింది విధంగా మద్దతు ఇస్తుంది:

1. బైబిలు నుండి ఉదాహరణలు

వారంలో మొదటి రోజు మరియు ప్రభువు దినమైన ఆదివారానికి సంఘంగా చేరి ఆరాధించే రోజుగా ప్రాధాన్యత ఇవ్వడానికి బైబిలులో నుండి ఆరు ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

1. యేసు ప్రభువు ఆదివారం నాడు మృతులలో నుండి లేచారు.

మత్తయి మనకు ఏమి చెప్పాడంటే, “1 విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 2 ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ….. 5 దూత ఆ స్త్రీలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; 6 ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడండి” (మత్తయి 28:1-2, 5-6). లూకా 24:1-7 కూడా అదే చెబుతుంది. యేసు ఆదివారం మృతులలో నుండి లేచారు కాబట్టి అది క్రైస్తవులకు ప్రత్యేకమైన రోజు.

2. మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువు తన శిష్యులను మొదటిసారి కలిసింది ఆదివారము.

లూకా 24:13-15, “13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు 14 జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి. 15 వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;”

యేసు వారితో మాట్లాడిన తరువాత వారితో కలిసి రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడి యేసును గుర్తించినప్పుడు, “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి” (లూకా 24:32). యేసు ఈ ఇద్దరితో పాత నిబంధన లేఖనాల భావం వారికి తెలియచేశారు. అది ఎంతో గొప్ప బోధగా ఉంది!

యేసు ఆ ఆదివారం నాడు ఈ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కాకుండా పదకొండు మంది అపొస్తలులలో ఎక్కువమందికి కూడా కనిపించాడని లూకా తెలియజేశాడు; “వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారిమధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను” (లూకా 24:36).

3. సంఘం ఆదివారం ఏర్పడింది.

సంఘం ఏర్పడిన రోజున ఏమి జరిగిందో అపొ కా 2 అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అది వారంలో ఏ రోజో మొదటి వచనం మనకు ఒక క్లూ ఇస్తుంది. “పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి” (అపొ కా 2:1). పస్కా (ఇది శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు) తర్వాత 50 రోజులకు పెంతెకొస్తు దినం వస్తుంది. కాబట్టి, 50 రోజుల తర్వాత ఆదివారం – సంఘం ఏర్పడినరోజు.

4. ఆది సంఘం ఆదివారం నాడు ఆరాధించడానికి ఒక చోట చేరేవారు.

ప్రారంభంలో ఆది సంఘం ఆరాధించడానికి ప్రతిరోజూ కలుసుకునేవారు (అపొ కా 2:46). అయితే కాలం గడిచేకొద్దీ వారు క్రమం తప్పకుండా ఆదివారం కలుసుకునేవారు. “ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు” అని చెబుతూ అపొ కా 20:7 మనకు రుజువును అందిస్తుంది.

5. ఆదివారం సంఘం కలుసుకున్నపుడు కానుకలు సేకరించబడ్డాయి.

యెరూషలేములోని పేద విశ్వాసుల కోసం కానుకలు సేకరించడం గురించి కొరింథులోని విశ్వాసులకు పౌలు వ్రాస్తూ ఈ మాటలు చెప్పాడు: “నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” (1 కొరి 16:2). ఆదివారం నాడు సంఘాలు కూడుకున్నప్పుడు కానుకలు సేకరించినట్లు తెలుస్తోంది.

6. బైబిలు ఆదివారం నాడు పూర్తయింది.

ప్రకటన గ్రంథం బైబిలులో చివరి పుస్తకము. AD 95లో వ్రాసి ఇతర సంఘాలకు పంపించడానికి పన్నెండుమంది అపొస్తలులలో ఒకరైన యోహానుకు ఈ గ్రంథంలోని విషయాలు తెలియచేయబడ్డాయి. యేసు ప్రభువు యోహానుకు ఈ ప్రకటనలను ఇప్పుడు ప్రభువు దినమని పిలువబడుతున్న ఆదివారం నాడు ఇవ్వడం చాలా ఆసక్తికరమైన విషయము.

ప్రకటన 1:9-11 లో ఇలా ఉంది, “9 మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. 10-11 ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.”

ఆదివారానికి సంఘ ఆరాధన దినంగా ప్రాధాన్యతనివ్వవలసిన అవసరాన్ని తెలియజేసే ఆరు ఉదాహరణలను బైబిలు నుండి మనం చూస్తాము.

బైబిలు నుండి తీసుకున్న ఆరు ఉదాహరణలతో పాటు, ప్రభువు దినమైన ఆదివారం నాడు ఆది సంఘం ఆరాధించడం గురించి ఆది సంఘ నాయకుల రచనల రికార్డులు కూడా మనకు ఉన్నాయి.

2. సంఘ చరిత్ర నుండి ఉదాహరణలు

1. ఆది సంఘ నాయకుడు జస్టిన్ మార్టిర్: 

“ఆదివారం అని పిలువబడే రోజున, నగరాల్లో లేదా దేశంలో నివసించే వారందరూ ఒక చోటికి చేరుకుంటారు, అపొస్తలుల జ్ఞాపకాలు లేదా ప్రవక్తల రచనలు చదవబడతాయి, సమయం అనుమతించినంత కాలం, ఆదివారం నాడు మేమందరం ఒక్కటిగా కూడుకునే వారము. ఎందుకంటే అది దేవుడు చీకటిలో పదార్థంలో మార్పును తెచ్చి లోకాన్ని సృష్టించిన మొదటి రోజు; అదే రోజున మన రక్షకుడైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచారు” (ఫస్ట్ అపొలజి ఆఫ్ జస్టిన్, వీక్లీ వర్షిప్ ఆఫ్ క్రిస్టియన్స్ చాప్టర్ 68, 150 AD).

2. సంఘ చరిత్రకారుడు ఫిలిప్ షాఫ్:

క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు దినాన్ని జరుపుకోవడం అనేది నిస్సందేహంగా అపోస్తలుల యుగం నాటిది. రెండవ శతాబ్దపు సంఘాలలోని సార్వత్రిక మతపరమైన ఆచారాలను వివరించడంలో అపోస్తలుల మునుపటి ఉదాహరణలు ఏమాత్రం తక్కువ కాలేదు. ఏ భిన్నాభిప్రాయాలు లేవు. తొలి అపోస్తలుల తర్వాతి రచయితలైన బర్నబాస్, ఇగ్నేషియస్ మరియు జస్టిన్ మార్టిర్ వంటి వారి సాక్ష్యాలు ఈ ఆచారాన్ని ధృవీకరిస్తున్నాయి (హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్, వాల్యూం 1, పేజీ. 201-22).

షాఫ్ ఇంకా ఇలా చెప్పారు: “… క్రొత్త నిబంధనలోనే ఆదివారాన్ని ఆరాధన దినంగాను విమోచన పని ముగిసిన పునరుత్థానం యొక్క ప్రత్యేక జ్ఞాపకార్థంగాను పాటించినట్లు కనిపిస్తుంది. రెండవ శతాబ్దంలో సార్వత్రికంగా ఏ భేదాలు లేకుండా ఆదివారాన్ని పాటించడానికి మూలాలు అపోస్తలుల ఆచరణలోనే ఉన్నాయనే వాస్తవం ద్వారా మాత్రమే వివరించబడుతుంది.” [పేజి. 478-479].

పైన తెలియజేసిన వాటితో పాటు, యోహాను శిష్యుడు మరియు అంతియొకయ బిషప్ అయిన ఇగ్నేషియస్ రెండవ శతాబ్దం ప్రారంభంలో ఇలా వ్రాశాడు, “క్రీస్తు యొక్క ప్రతి స్నేహితుడు రోజులన్నిటిలో రాణి మరియు ప్రధానమైన ప్రభువు దినాన్ని పండుగగా పునరుత్థాన దినంగా పాటించాలి.”

బైబిలు నుండి మరియు ఆది సంఘనాయకుల రచనల నుండి మనకు ఉదాహరణలు ఉన్నందున ప్రభువు దినాన సమాజంగా చేరి ఆరాధించడం యొక్క ప్రాముఖ్యతను మనం సురక్షితంగా ముగించవచ్చని నేను భావిస్తున్నాను.

ముగింపు మాటలు.

హెబ్రీ 10:24-25లో “కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని ఉంది. మనం క్రమం తప్పకుండా కలుసుకోకపోతే ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకుని హెచ్చరించుకుంటాము?

కొలొస్సి 3:16లో “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి” అని ఉంది. మనమందరం ఒక్కటిగా కలిసినప్పుడు మాత్రమే ఈ ఆదేశాన్ని పాటించగలము.

ఆదివారాలు కలుసుకోవడం ద్వారా మాత్రమే ఈ ఆదేశాలను పాటించవచ్చని ఈ వచనాలలో స్పష్టంగా చెప్పలేదు అనేది వాస్తవమే. అయితే మనం అన్ని రోజులూ కలుసుకోలేం కదా? కాబట్టి, కనీసం వారానికి ఒక రోజున-ప్రభువు దినాన కలుసుకోవడం ద్వారా మనకంటే ముందున్న విశ్వాసులు ఇచ్చిన మాదిరిని ఎందుకు అనుసరించకూడదు?

ఒకరు ఈ పోస్ట్‌ని చదివినప్పటికీ ఆదివారం సంఘంగా కూడుకోవడం యొక్క ఆవశ్యకత గురించి వాదించవచ్చు. అటువంటి వాదనలకు నా ప్రతిస్పందన ఏమిటంటే: ఇతర విశ్వాసులతో కలిసి ఆదివారం ఆరాధనను నిరోధించడానికి అసలు కారణం ఏమిటి? ఇది ఇతర కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమేనా? స్థానిక సంఘంలో భాగం కావడానికి అయిష్టత కారణంగా ఉందా? చెడు అనుభవాలు మిమ్మల్ని చర్చికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయా? అభ్యంతరాలు తెలిపే ముందు తమ హృదయాలను పరిశోధించవలసిందిగా మరియు వారి ఉద్దేశాలను లేఖనాల వెలుగులో పరిశీలించవలసిందిగా నేను వారిని వినయంగా కోరుతున్నాను.

క్రైస్తవులు ఒంటరిగా ఒక ద్వీపంలో నివసించకూడదు. విశ్వాసులుగా చెప్పుకునే వారు తమ స్థానిక చర్చిలకు తక్కువలో తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరియు ఇతర కార్యకలాపాలకు (సంఘ ఇతర పరిచర్యలతో సహా) ఇవ్వడానికి పుష్కలంగా సమయం ఇస్తున్న ఈ రోజులలో యేసు రక్తం ద్వారా కొనబడిన సంఘానికి అధిక నిబద్ధత చూపించమని మనల్ని పిలిచే బైబిలును మనం తిరిగి పరిశీలించవలసిన అవసరం ఉంది. (అపొ కా 20:28)!

విశ్వాసులు ఆజ్ఞను పాటించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రభువు పట్ల ఆయన ప్రజల పట్ల ప్రేమతో ప్రభువు దినాన ఒక్కటిగా కలుసుకోవడం కొనసాగించాలి. వారంలో ఒక రోజు మరియు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కేటాయించడం విశ్వాసికి ఎప్పుడూ సమస్య కాకూడదు-అయితే విశ్వాసులమని చెప్పుకునే చాలామంది ప్రభువు దినాన సరిగా హాజరు కాకపోవడం చాలా బాధాకరము. నిజంగా విచారకరం! “చర్చికి హాజరవడం వల్ల నేను ఏమి పొందగలను?“ అని అడగడానికి బదులుగా “చర్చికి హాజరవడం ద్వారా నేను ఏమి ఇవ్వగలను?” అని విశ్వాసులు తమను తాము ప్రశ్నించుకుంటే అది ఎంత సమూలమైన మార్పును తెస్తుంది! అలాంటి దృక్పథం ప్రభువు పట్ల ప్రేమను చూపడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకోవడం ద్వారా ఇతరులకు మన ప్రేమను కూడా చూపిస్తుంది కదా?

ప్రభువు దినాన విశ్వాసులు ఆరాధించడానికి ఆటంకం కలిగించే సమస్యల గురించి  తర్వాతి పోస్టులో చర్చిస్తాము; ఆ తర్వాత వచ్చే పోస్టు, ప్రభువు దినాన ఆయనను ప్రభావవంతంగా ఆరాధించడానికి ఎలా ప్లాన్ చేయాలో వివరిస్తుంది.

Category