క్రైస్తవులు సబ్బాతు అనగా విశ్రాంతిదినమును పాటించాలా?
(English version: Are Christians Required To Keep The Sabbath?)
సాధారణంగా, క్రైస్తవులు సబ్బాతు అనగా విశ్రాంతి దినమును ఎలా అనుసరించాలి అనేదాని గురించి మూడు అభిప్రాయాలు ఉన్నాయి.
అభిప్రాయం # 1. సబ్బాటేరియన్ల అభిప్రాయం. ఈ అభిప్రాయం ప్రకారం, క్రైస్తవులు విశ్రాంతి దినాన అనగా శనివారం ఆరాధన చేయాలి. సెవంత్ డే అడ్వెంటిస్టులు సాధారణంగా ఈ కోవలోనికి వస్తారు.
ఈ అభిప్రాయం ఉన్నవారు విశ్రాంతి దినం శనివారం అని చెప్పడం సరైనది కాని శనివారాలలో క్రైస్తవులు ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారని చెప్పడం తప్పు.
అభిప్రాయం # 2. ఆదివారం విశ్రాంతి దినము అనే అభిప్రాయం. ఈ అభిప్రాయం ప్రకారం, పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం ఎలాగో, ప్రభువు దినమైన ఆదివారం క్రైస్తవులకు విశ్రాంతి దినం, ఇది క్రైస్తవులందరూ పాటించాలి. కాథలిక్కులు మరియు చాలా మంది ప్రొటెస్టంట్లు కూడా ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈ అభిప్రాయం ప్రధానంగా 16వ శతాబ్దంలో ప్యూరిటన్ల కాలం నుండి ఉంది.
ఆదివారాల్లో ఆరాధించడం సరైనదే అయినప్పటికీ ఆదివారం క్రైస్తవ విశ్రాంతి దినం అని పిలవడం తప్పు ఎందుకంటే బైబిలులో ఎక్కడా పాత నిబంధనలోని శనివారం విశ్రాంతి దినాన్ని కొత్త నిబంధనలో ఆదివారం విశ్రాంతి దినానికి బదిలీ చేయబడింది అని చెప్పలేదు.
అభిప్రాయం # 3. బైబిలు అభిప్రాయం. ఈ అభిప్రాయం ప్రకారం శనివారం విశ్రాంతి దినము. కాని క్రొత్త నిబంధనలో ఎక్కడా క్రైస్తవులు దానిని పాటించమని ఆజ్ఞాపించలేదు. పాత మరియు కొత్త నిబంధనలలో ఉన్న బైబిలు వచనాలను గౌరవించే వారికి ఈ అభిప్రాయం ఉంది.
మనం ప్రభువు దినాన్ని జరుపుకుంటాము ఎందుకంటే దానికి నిర్దిష్ట ఆదేశం ఉంది కాబట్టి ఇది కొత్త నిబంధన. ఇది సంఘచరిత్రలో నమోదు చేయబడిన ఆది సంఘం యొక్క మాదిరి.
ఈ పోస్ట్ బైబిలు ఆధారిత సర్వేను అందించడం ద్వారా ఈ మూడవ అభిప్రాయాన్ని సమర్ధిస్తుంది.
పాత నిబంధనలో విశ్రాంతి దినము.
1. సృష్టి జరిగిన వారము
ఆది 2:2లో “దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను” అని ఉంది. “విశ్రమించెను” అనే పదం హీబ్రూ పదం “షబాత్” నుండి వచ్చింది. దీనికి విశ్రాంతి తీసుకోవడం లేదా కార్యకలాపాల నుండి విరమించడం అని అర్థం. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని మాత్రమే వచనం చెబుతుందని దయచేసి గమనించండి. ఇక్కడ అలసిపోయినందున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని కాదు. యెషయా 40:28లో “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు; ఆయన సొమ్మసిల్లడు అలయడు; ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము” అని తెలియచేసి అటువంటి తప్పుడు అభిప్రాయాలను తొలగిస్తుంది. సృష్టి కార్యకలాపాలన్నీ సంపూర్తి అయినందున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇది సంపూర్తి కావడం వలన కలిగే విశ్రాంతి.
ఆదికాండములోని మరెక్కడా దేవుడు కాని మానవులు కాని 7వ రోజున విశ్రాంతి తీసుకుంటున్నట్లు మనకు ఎటువంటి సూచన కనిపించలేదు. ఆదాము నుండి మోషే వరకు (ఆది 3 నుండి నిర్గమ 15 వరకు), సబ్బాతు ప్రస్తావన లేదు. ఏబెలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు వంటి దైవభక్తులకు 7వ రోజున విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞ ఇవ్వబడలేదు. అలాగే వారు 7వ రోజున కూడా విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా హెబ్రీ 11లో వారికున్న విశ్వాసాన్ని బట్టి వారందరూ మెచ్చుకోబడ్డారు!
2. విశ్రాంతి దినము
ఆది 2:2 తరువాత, ప్రభువు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత యూదులు అరణ్యంలో మన్నాను సేకరించిన సందర్భంలో నిర్గమకాండంలోనే విశ్రాంతి దినం యొక్క ప్రస్తావన ఉంది (నిర్గమ 16:11-15). దేవుడు యూదులను ఏడవ రోజున కాకుండా కేవలం ఆరు రోజులు మాత్రమే పోగుచేసుకోవాలని ఆజ్ఞాపించాడు. నిర్గమ 16:23లో “అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను” అని ఉంది.
విశ్రాంతిదినము ఆజ్ఞ ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబడింది. తరువాత దేవుడు నిర్దేశించినట్లుగా మోషే దానిని 10 ఆజ్ఞలలో భాగంగా చేసాడు.
నిర్గమ 20:8-11 “8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 9 ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 10 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.”
గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే: దేవుడు ఈ ఆజ్ఞను ఇశ్రాయేలు దేశానికి మాత్రమే ఇచ్చాడు తప్ప మరియే ఇతర దేశానికి ఇవ్వలేదు. ఒక విదేశీయుడు ఇశ్రాయేలులో నివసించినట్లయితే ఆ వ్యక్తి విశ్రాంతిదినమును పాటించాలి (నిర్గమ 20:10). విశ్రాంతిదినం అనేది భౌతిక శరీరానికి విశ్రాంతిని ఇచ్చి సేదదీర్చేందుకు ఇశ్రాయేలీయుల కోసం ఏర్పరచబడింది. అది ఆత్మకు కూడా ఆశీర్వాదకరము.
నిర్గమ 31:12-17లో విశ్రాంతిదినం గురించి మరిన్ని సత్యాలను మనకు బోధించబడ్డాయి. సున్నతి వలెనే, విశ్రాంతిదినం కూడా దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య ఒక సూచన అని 13వ వచనం “అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును” అని మనకు తెలియచేస్తుంది. విశ్రాంతిదినాన్ని ఉల్లంఘిస్తే మరణశిక్ష విధించబడుతుందని 14వ వచనం దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును అని స్పష్టం చేస్తోంది. 16-17 వచనాలు విశ్రాంతిదినం గురించిన ఆజ్ఞను మోషే ధర్మశాస్త్రం క్రింద నివసిస్తున్న ఇశ్రాయేలీయులపై మాత్రమే కట్టుబడి ఉందని మనకు బోధిస్తుంది, “16 ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతిదినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. 17 నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.”
ద్వితీయో 5:15లో దేవుడు ఇశ్రాయేలీయులను వారి బానిసత్వం నుండి విడిపించాడు కాబట్టి వారు విశ్రాంతిదినాన్ని ఆచరించాలని చెప్పారు. “నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.”
ఇశ్రాయేలీయులు విశ్రాంతిదినమున చేయకూడదని నిషేధించబడిన కొన్ని పనులు: మంటలను ఆర్పడం (నిర్గమ 35:3), మన్నా సేకరించడం (నిర్గమ 16:23-29), వస్తువులు అమ్మడం (నెహెమ్యా 10:31; 13:15-22), భారాలను మోయడం (యిర్మీయా 17:19-27). యేసుకాలంలో యూదులు దూర నియమాన్ని కూడా పాటించారు, అంటే విశ్రాంతిదినాన ¾మైలు కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. ఒక వ్యాఖ్యాత ప్రకారం, ఈ దూరాన్ని సంఖ్యాకాండము 35:5తో నిర్గమకాండము 16:29ను (“ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను”) అన్వయించడం ద్వారా లెక్కించబడుతుంది, ఇది 2,000 మూరలు ఉన్న ఒక నగరం యొక్క పరిధిని (¾ మైలు కంటే తక్కువ) తెలియచేస్తుంది. ఆ విధంగా ఒక వ్యక్తి తన “స్థలం” (నగరం) వదిలి వెళ్లలేడు, అనగా, దాని పరిమితులను దాటి వెళ్లలేడు.
3. విశ్రాంతి సంవత్సరం మరియు సునాదకాలము
నిర్గమ 23: 10-11 ప్రకారం, ప్రతి ఏడవ సంవత్సరం భూమి సాగు చేయకుండా ఉంచాలి, “10 ఆరుసంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 11 ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.” (లేవీ 25:1-7 కూడా చూడండి).
ప్రతి 7 సంవత్సరాలకు అదనంగా, ప్రతి 50 సంవత్సరాలకు కూడా భూమిని సాగు చేయకుండా ఉండాలి: “10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. 11 ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్దిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. 12 అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.” (లేవీ 25:10-12).
క్లుప్తంగా చెప్పాలంటే, మోషే నిబంధన ప్రకారం యూదులు ప్రతి వారం విశ్రాంతిదినాన్ని, ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరాన్ని మరియు ప్రతి 50వ సంవత్సరానికి సునాద సంవత్సరాన్ని పాటించాలి.
విశ్రాంతిదినమును ఉల్లంఘించినందుకు తీర్పు.
లేవి 26:33-35లో విశ్రాంతిదినాన్ని పాటించడంలో విఫలమైతే వచ్చే దేవుని తీర్పు గురించి హెచ్చరిక ఉంది. “33 జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. 34 మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును. 35 అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.”
దురదృష్టవశాత్తు, యూదులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేక ఇతర పాపాల మధ్య విశ్రాంతిదినాన్ని అపవిత్రం చేశారు. కాబట్టి, బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా తీర్పును తీసుకువచ్చి దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు.
2 దినవృ 36:17, 20-21, “17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతని చేతికప్పగించెను. 20 ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. 21 యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను“. (యిర్మీయా 17:19-27; 25:11 కూడా చూడండి).
దురదృష్టవశాత్తూ, యూదులు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా తమ గుణపాఠం నేర్చుకోకుండా విశ్రాంతిదినాన కొనుగోళ్లు అమ్మకాలు చేశారు. నెహెమ్యా కాలంలో, యూదులు విశ్రాంతిదినాన వస్తువులను కొనడంలో అమ్మడంలో నిమగ్నమై ఉన్నారు. నెహెమ్యా వారిని గద్దిస్తూ, “16 తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. 17 అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి–విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? 18 మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. 22 అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.” (నెహెమ్యా 13:16-18, 22).
కాబట్టి, చెరనుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా విశ్రాంతిదినానికి సంబంధించిన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నట్లు మనం చూస్తాము. పాత నిబంధనలో విశ్రాంతిదినం యొక్క సమీక్ష చూసిన తర్వాత కొత్త నిబంధనలో పరిశీలిద్దాము.
కొత్త నిబంధనలో విశ్రాంతిదినము.
1. యేసు బోధ
యేసు కాలం నాటికి, యూదులు విశ్రాంతిదినానికి దేవుడు ఇచ్చిన నియమాల కన్నా మరిన్ని ఎక్కువ నిబంధనలను జోడించారు. దాని ఫలితంగా అది ఒక ఆశీర్వాదంగా కాకుండా భారంగా మారింది. యేసు తన పరిచర్యలో ఈ బోధలను ఎదిరించడమే కాకుండా యూదా నాయకులు విశ్రాంతిదినాన్ని ఉల్లంఘించినట్లు భావించే వాటిని అనగా, విశ్రాంతిదినాన ఆయన స్వస్థతలు చేసి తరచుగా వివాదాలను ఎదుర్కొన్నాడు. అయితే, విశ్రాంతిదినము అనేది ఒకరు తమ పొరుగువారికి మేలు చేసే రోజని చూపించడానికి యేసు పదేపదే ప్రజలను స్వస్థపరిచాడు.
మత్తయి 12:9-14 “9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను. 10 వారాయనమీద నేరము మోపవలెనని–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. 11 అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? 12 గొర్రెకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి 13 ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. 14 అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి.”
మార్కు 2:23-28 “23 మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు– వెన్నులు త్రుంచుచునుండిరి. 24 అందుకు పరిసయ్యులు–చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. 25 అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులేగాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. 27 మరియు–విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. 28 అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.”
“ఆజ్ఞాపాలనను ఆధారంగా చేసుకునే తత్వం” (Legalism ) ఎల్లప్పుడూ మీ పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞతో సహా దేవుని ఆజ్ఞలకు హాని కలిగిస్తుంది. అందుకే యేసు దానిని ధీటుగా ఎదుర్కొన్నాడు! యేసు మనకు పరిపూర్ణ ప్రత్యామ్నాయంగా ఉండేందుకు ధర్మశాస్త్రంలో కావలసిన వాటన్నిటిని నెరవేర్చాడు. విశ్రాంతిదినాన్ని పాటించడంతో సహా వాటన్నిటిని పరిసయ్యులు వక్రీకరించిన విధంగా కాకుండా దేవుడు ఉద్దేశించిన విధంగానే నెరవేర్చాడు.
2. పౌలు బోధ
పౌలు తరచుగా సమాజమందిరంలో విశ్రాంతి దినాలలో సువార్త ప్రకటించేవాడు. అతడు విశ్రాంతిదినాన్ని ఆచరించాలని భావించడం వల్ల కాదు కానీ యూదులు ఒకే చోట ఉంటారని అది అతనికి సువార్త ప్రకటించడానికి ఒక వేదికగా ఉంటుందని అతనికి తెలుసు. అయినప్పటికీ, మనం ఇంకా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నామా అనే సమస్యకు పౌలు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు: మనం ఇకపై ధర్మశాస్త్రానికి లోబడి లేము మరియు అందువల్ల ధర్మశాస్త్రంలో భాగమైన విశ్రాంతి దినాన్ని పాటించాల్సిన అవసరం లేదు.
గలతీ 5:1 “ఈ స్వాతంత్రము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. ”
రోమా 7:6 “ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.”
కొలస్సి 2:16-17 “16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. 17 ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.”
క్రైస్తవులు ఇకపై విశ్రాంతి దినం యొక్క నిబంధనల క్రింద లేరని తెలిపే కొలస్సీ 2లోని ఈ వచనాల కంటే మరేదీ స్పష్టంగా చెప్పలేదు. విశ్రాంతి దినంతో సహా మోషే ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు రాబోయే వాటి యొక్క నీడలు మాత్రమే. ప్రధానాంశం క్రీస్తు మాత్రమే. క్రీస్తులో కనిపించే గొప్ప వాస్తవికత కోసం విశ్రాంతి దినం ఎదురుచూస్తోంది. ప్రధానాంశమైన క్రీస్తు వచ్చిన తర్వాత అది దాని విలువను కోల్పోయింది. మనం ఇకపై నీడలపై అంటే విశ్రాంతి దినం లేదా ఇతర మతపరమైన సెలవులు మరియు ఆహార నియమాలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. మనం వాటిని పాటించనవసరం లేదు.
3. హెబ్రీ పత్రిక నుండి బోధ
పౌలు చెప్పినట్లే హెబ్రీ పత్రికలో కూడా ఇదే విషయం చెప్పబడింది.
హెబ్రీ 4:8-11 “8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును. 9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. 10 ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును. 11 కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.”
హెబ్రీ పత్రిక రచయిత 4:8-12లో పేర్కొన్న “విశ్రాంతి” అనేది వారపు విశ్రాంతిదినం లేదా జాషువా అందించిన కానాను విశ్రాంతి కాదు కానీ పరలోక విశ్రాంతి. తనను నమ్మే వారందరికీ యేసు ఇచ్చిన రక్షణ విశ్రాంతి. కాబట్టి, మనల్ని ప్రవేశించమని ఆజ్ఞాపించబడిన విశ్రాంతి ఇదే కాని 7వ రోజు విశ్రాంతిదినము కాదు.
రాబోయే వేయి సంవత్సరాల రాజ్యంలో విశ్రాంతి దినము.
యేసు తన రెండవ రాకడ సమయంలో (ప్రకటన 20:4-6) స్థాపించే రాబోయే 1000 సంవత్సరాల రాజ్యంలో మనం విశ్రాంతి దినాన్ని పాటిస్తాము. యెహెజ్కేలు 46:3లో భవిష్యత్తు దేవాలయం (ఇంకా నిర్మించబడలేదు) మరియు ఇశ్రాయేలీయులు మెస్సీయ వైపు తిరిగిన ఫలితంగా పూర్తి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నప్పుడు, యేసు ఈ విధంగా పేర్కొన్నాడు: “విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.”
అయితే, వెయ్యేళ్ల రాజ్యం ఇంకా రాలేదు, మనం ఇంకా యేసు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య జీవిస్తున్నాము కాబట్టి విశ్రాంతి దినాలను లేదా మరే ఇతర పవిత్ర దినాలను పాటించాల్సిన అవసరం లేదు.
ముగింపు మాటలు.
విశ్రాంతి తీసుకోవడానికి మరియు పునరుజ్జీవింపబడడానికి ఒక రోజు ఉండటం మంచిదే అయినప్పటికీ, పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిన విశ్రాంతి దినానికి సంబంధించిన ఆజ్ఞను పాటించాల్సిన బాధ్యత మనకు లేదు. క్రైస్తవులు పాత నిబంధన క్రింద లేరు. తత్ఫలితంగా, మనం ఇకపై విశ్రాంతి దినాన్ని పాటించాల్సిన బాధ్యత లేదు. పాత నిబంధన క్రింద ఉన్నవారికి విశ్రాంతి దినం ఇప్పటికీ శనివారం. ఆదివారానికి మారలేదు.
అదనంగా, క్రైస్తవులకు ప్రభువు దినం విశ్రాంతి దినమని బైబిల్లో ఎక్కడా పేర్కొనబడలేదు-ఖచ్చితంగా ఎక్కడా లేదు! అది క్రొత్త నిబంధన యొక్క స్పష్టమైన బోధ. కొంతమంది క్రైస్తవులు ప్రభువు దినాన్ని విశ్వాసి కోసం విశ్రాంతి దినమని పిలిచినప్పటికీ, ఇది బైబిలుకు సంబంధించింది కాదు కాబట్టి నేను అలాంటి పదాన్ని ఇష్టపడను. బైబిలు అంశాలను సూచించేటప్పుడు బైబిలు ఖచ్చితత్వాన్ని అనుసరించడం ఎల్లప్పుడూ మంచిది.
తదుపరి పోస్ట్‌లో, ప్రభువు దినానికి క్రైస్తవునికి గల సంబంధాన్ని మనం చూస్తాము.
