రూపాంతరం చెందిన జీవితము 1వ భాగము—క్రీస్తుకు మన శరీరాలను సమర్పించుట

Posted byTelugu Editor April 2, 2024 Comments:0

(English version: “The Transformed Life – Offering Our Bodies To Christ”)

మీరు మీ అనుదిన జీవితంలో యేసుక్రీస్తులా ఉండాలని కోరుకుంటే, రోమా ​​12 ద్వారా ప్రయాణించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బైబిలులోని అత్యంత ముఖ్యమైన అధ్యాయాలలో ఈ అధ్యాయం ఒకటి. ఎందుకంటే ఇది క్రీస్తు ద్వారా రూపాంతరం చెందిన జీవితాన్ని సూచిస్తుంది. 

రూపాంతరం చెందిన జీవితం అనే సిరీస్‌లో రోమా ​​12:1 ని ఆధారం చేసుకున్న “క్రీస్తుకు మన శరీరాలను సమర్పించుట” అనే మొదటి ప్రచురణ ఇది.

[గమనిక: రూపాంతరం చెందుట అనే ఈ ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు ప్రతి ప్రచురణలో ఈ అధ్యాయం నుండి చెప్పబడిన నిర్దిష్ట వచనాలను గుర్తుంచుకోవడం, ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం వంటివి కూడా చేయవచ్చు]

***************

ఒక క్రైస్తవ స్త్రీ ఒక పాస్టర్‌తో, “సమర్పించుకోవడం అంటే ఏమిటో దయచేసి నాకు ఒక్క మాటలో చెప్పగలరా?” అని అడిగింది. అందుకు ఆ పాస్టర్ ఒక తెల్ల కాగితాన్ని పట్టుకుని, “ఈ తెల్ల కాగితం చివరలో మీ సంతకం చేసి, తన చిత్తప్రకారం దేవుడిని దానిని నింపనివ్వడమే” అని చెప్పాడు. సమర్పించుకోవడం అంటే అదే! ఎలాంటి ప్రశ్నలు అడగకుండా మన జీవితాలను ఆయనకు అప్పగించడము. అన్ని సమయాల్లో దేవునికి ఆయన ఉద్దేశాలకు పూర్తిగా అంకితమై ఉండడము. ఏ షరతులు లేకుండా లోబడి జీవించడము.

పాత నిబంధన కాలంలో, నిర్ధిష్ట సమయాల్లో జంతువులను బలిగా అర్పించమని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. అయితే యేసు సిలువపై ఒక్కేసారి అందరి బదులుగా బలియైన తర్వాత, దేవునికి ఇకపై నిర్ణీత సమయాల్లో జంతువుల బలులు అవసరం లేదు కానీ తన ప్రజలు తమ శరీరాలను మనస్సులను నిర్దిష్ట సమయాల్లో మాత్రమే కాకుండా అన్నివేళల సజీవ యాగంగా సమర్పిస్తూ ఉండాలని కోరుతున్నాడు. అది రోమా ​​​​12: 1-2 లో ఉన్న అంశము.

రోమా ​​​​12: 1-2 1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”

మనం సంపూర్ణ సమర్పణకు, అనుదినము సజీవ యాగంగా దేవునికి పూర్తిగా లోబడడానికి పిలువబడ్డాము. ఇది రెండు పనులు చేయడం ద్వారా సాధించవచ్చు:

(1) మన శరీరాలను దేవునికి సమర్పించడం ద్వారా [వ. 1]

(2) మన మనస్సులను దేవునికి సమర్పించడం ద్వారా [వ. 2]

రోమా ​​​​12:1 ఆధారంగా మన శరీరాలను దేవునికి సమర్పించడం అనే మొదటి దానిని మాత్రమే ఈ ప్రచురణలో చూద్దాము.

మొదటిగా, 1 వ వచనంలోని మొదటి భాగంలో “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని పౌలు మనలను పిలిచినప్పుడు దానికి ప్రేరణగా దేవుని వాత్సల్యాన్ని ఉపయోగిస్తున్నాడని గమనించండి.

ఇక్కడ “కాబట్టి” అనేది పౌలు మన పాపభరితమైన స్థితిని, మనకు ఎదుర్కొంటున్న తీర్పును మరియు దేవుడు తన “కృపలో” క్రీస్తు ద్వారా ఎలా రక్షణ అందించాడో తెలియచేసిన మునుపటి 11 అధ్యాయాలకు సంబంధించినది. అంతే కాదు, మనల్ని తన కుటుంబంలోకి దత్తత తీసుకోవడంలో, భవిష్యత్తులో మహిమ పొందేందుకు మనల్ని రక్షించే పరిశుద్ధాత్మను ఇవ్వడంలోని దేవుని దయను కూడా పౌలు వివరించాడు. దేవుని కృప ఫలితంగా అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి.

ఇక్కడ బైబిలు క్రైస్తవ్యం ఇతర మతాల కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర మతాలు తమ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీనికి విరుద్ధంగా, మనం  దయ పొందాం కాబట్టి దేవుని సంతోషపెట్టడమే లక్ష్యంగా కలిగివున్నాము. మరో మాటలో చెప్పాలంటే, వారు దయ కోసం పని చేస్తారు; మనం దయ పొంది పని చేస్తాము!

దేవుని దయ ద్వారా మన హృదయాలకు హత్తుకున్న సిలువ త్యాగం మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకునేలా చేస్తుంది. అందుకే పౌలు విశ్వాసులను ప్రోత్సహించినప్పుడు వాత్సల్యాన్ని ప్రేరణగా ఉపయోగించాడు. అతడు ఆజ్ఞాపించలేదు కాని సహోదర సహోదరీలారా, నేను మిమ్మల్ని బతిమాలుతున్నానని” చెప్పడం గమనించండి. బతిమాలుతున్నాను” అనే పదానికి ప్రోత్సహించడానికి లేదా ప్రోత్సహించడానికి కలిసిరండి అని అర్థం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి” అనేది పురుషులకు [సహోదరులు] స్త్రీలు [సహోదరీలు] అందరికి వర్తిస్తుంది కాబట్టి అతడు విశ్వాసులలో అందరిని బతిమాలుతున్నాడు.

శరీరం చెడ్డది ఆత్మ మాత్రమే మంచిది అనే ఆలోచనకు విరుద్ధంగా, శరీరాన్ని మంచికి చెడుకి కూడా ఉపయోగించవచ్చని బైబిలు స్పష్టంగా పేర్కొంది. మనం శరీరాన్ని ఎప్పుడూ మంచి కోసం ఉపయోగించలేకపోతే, పరిశుద్ధంగా దేవునికి ప్రీతికరమైన సజీవయాగంగా మన శరీరాలను సమర్పించాలనే ఈ పిలుపు అర్ధంలేని ఆజ్ఞ అవుతుంది.

కాబట్టి, పిలుపు స్పష్టంగా ఉంది. మన శరీరంలోని ప్రతి భాగం కళ్ళు, చెవులు, నాలుక, చేతులు, పాదాలు దేవునికి నిరంతరం సమర్పించాలి. “సజీవ యాగం” అనే దానికి అర్థం అదే. మనం జీవించి ఉన్నంత కాలం మన శరీరాలను పరిశుద్ధంగా ఆయనకు సమర్పించాలి. అటువంటి యాగం వలన మాత్రమే దేవుడు సంతోషిస్తాడు!

పాతనిబంధనలో మలాకీ 1:8లో, “గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.” పాత నిబంధనలో ఇలా జరిగితే, కొత్త నిబంధనలో, ప్రత్యేకించి తన కుమారుడు సిలువపై తనను తాను సమర్పించుకోవడానికి వచ్చిన తర్వాత దేవుడు తన ప్రమాణాలను తగ్గించుకుంటాడా? ఖచ్చితంగా కాదు! అందుకే పౌలు దేవునికి అనుకూలమైనరీతిలో” మన శరీరాలను సమర్పించుకోవాలని చెప్పాడు

“ఇదే మీ నిజమైన సరైన ఆరాధన” అని పౌలు చెప్పాడు. పౌలు చెప్పింది చాలా సులభం: దేవుని దయలో మన శరీరాలను సమర్పించడం అనేది ఆయనను ఆరాధించడానికి నిజమైన సరైన మార్గము. కాబట్టి పౌలు ప్రకారం, ఆరాధన అనేది ఆదివారం ఉదయం కొన్ని గంటలకే పరిమితం కాదు. అనుదినము మన శరీరంలోని ప్రతి భాగాన్ని ఆయనకు సమర్పించడమే నిజమైన ఆరాధన.

మనం ఎక్కడ ఉన్నా మన శరీరంలోని ప్రతి భాగాన్ని దేవునికి సమర్పించాలనేది పిలుపు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పనిచేసే చోట ఎక్కువ సమయం గడిపితే అది అతని ప్రార్థనా స్థలం అవుతుంది. అది ఎలా? ఎఫెసి 6:7-8 లో, “7 మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. 8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు” అని వ్రాయబడింది. మన అంతిమ యజమాని యేసుక్రీస్తు అని మనం గ్రహించినప్పుడు, మానవులైన మన యజమానులు మనల్ని గుర్తించకపోయినా దానితో ప్రభావితం కాకుండా మనం మన శ్రేష్ఠమైన వాటిని అందించడానికి కృషి చేస్తాం. మనం క్రీస్తు ముందు నిలబడినప్పుడు ఆయన మనకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆయన ఎప్పుడూ మనల్ని చూస్తుంటారని, మనం ఎప్పుడూ ఆయనకు మన ఉత్తమమైన వాటిని అందించాలనే లక్ష్యంతో ఉండాలని మనం తెలుసుకోవాలి. పని చేసే చోట ఆయనకు మన చేసే ఆరాధన అదే!

1 కొరింథీ 10:31 లో “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అనే ఈ సుపరిచిత మాటల ద్వారా జీవితమంతా ఆరాధన అని స్పష్టంగా తెలియజేయబడింది. దీనర్థం మన భౌతిక శరీరంలోని ప్రతి అవయవం ఎప్పుడూ దేవుని సంతోషపెట్టే విధంగా పనిచేయాలి. మనం మన శరీర అవయవాలను పాపభరితమైన ఆనందాలలో మునిగిపోయి అదే సమయంలో మన ఆరాధనతో దేవుడు సంతోషిస్తున్నాడని అనుకోలేము.

మరో మాటలో చెప్పాలంటే, మనం ఈ క్రింది విధంగా ఉంటే నిజమైన సరైన ఆరాధన చేస్తున్నామని చెప్పకూడదు.

  • పాపంతో నిండిన వాటిని చూడటానికి మన కళ్లను ఉపయోగించినప్పుడు [అది శారీకమైన లేదా భౌతికమైన విషయాలు]
  • పుకార్లు, అబద్ధాలు, వ్యంగ్యమైన లేదా సూటిపోటి మాటలు మాట్లాడడానికి మన నాలుకలను ఉపయోగించినప్పుడు
  • పాపపు మాటలు వినడానికి మన చెవులు ఉపయోగించినప్పుడు [ఉదా., పుకార్లు]
  • పాపపు మార్గాలలో డబ్బు సంపాదించడానికి, ఇతరులను శారీరకంగా బాధించడానికి, ఇతరులను బాధించే వ్రాతలు వ్రాయడానికి [ఇమెయిల్, సోషల్ మీడియా], లైంగిక పాపాలలో పాలుపంచుకోడానికి మన చేతులు ఉపయోగించినప్పుడు
  • నిషేధించబడిన ప్రదేశాలకు వెళ్లడానికి మన పాదాలను ఉపయోగించినప్పుడు
  • తిండిపోతులుగా మన కడుపులను ఉపయోగించినప్పుడు
  • చెడు ఆలోచనల కోసం మన మనస్సులను ఉపయోగించినప్పుడు.

అపవిత్రమైన శరీరాల నుండి వచ్చిన ఆరాధన ఆమోదయోగ్యం కాదు. మలాకీ 1:8 గుర్తుందా? పరిశుద్ధమైన శరీరాల నుండి వచ్చే ఆరాధనయే దేవునికి ఇష్టమైన ఆరాధన. మన శరీరంలోని ప్రతి భాగం దేవుని ఘనపరచేదిగా ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి. మన శరీర భాగాలలో ఎక్కువ భాగాలను పరిశుద్ధత కోసం ఉపయోగిస్తున్నప్పుడు శరీరంలోని ఒక భాగం అప్పుడప్పుడు పాపం చేస్తే పర్వాలేదులే అనుకుంటాము. అది చాలా ప్రమాదకరం. కేవలం నా నాలుక మాత్రమే, లేదా నా కళ్ళు మాత్రమే అది కూడా కొన్ని నిమిషాల పాటు మాత్రమే అనే ఆలోచన చాలా బుద్ధిహీనమైన ఆలోచన. మన శరీరంలో కేవలం కొన్ని భాగాలు మాత్రమే కాదు మన శరీరమంతా నిత్యం సజీవ యాగంగా ఉండాలి అనేదే ఆజ్ఞ!

అవును, ఎల్లవేళలా మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి అంటే కొంత వెల చెల్లించుకోవలసి ఉంటుందనేది నిజం. సమర్పించుకోవడం అనే పదం వెలను సూచిస్తుంది! కాబట్టి, మనల్ని మనం కొన్ని కీలకమైన ప్రశ్నలను వేసుకుందాం: దేవుని మాటకు కట్టుబడి ఉండడానికి వెల చెల్లించవలసి వస్తే మన ప్రతిస్పందన ఏమిటి? మనం ముందుకు వెళ్తామా లేదా వెనక్కి తగ్గుతామా? ఒకవేళ మనం వెనక్కి తగ్గడానికి ఇష్టపడితే, మనం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి: (ఎ) మన పాపాలకు యేసు చెల్లించిన మూల్యం దృష్ట్యా మనం చెల్లించాల్సిన వెల కారణంగా మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోకుండా వెనక్కి తగ్గడం సరైనదేనా? (బి) ఆయన చేసిన త్యాగం ఆయన కోసం అన్నివిధాలా వెళ్లేలా మనల్ని ప్రేరేపించడం లేదా?

2 కొరింథీ 5:15లోని “జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము” అనే మాటలను నిరంతరం ఆలోచిద్దాము. క్రీస్తు రక్తంతో కొనబడిన వారిగా, ఆ సిలువపై తనకున్నదంతా అర్పించి మనల్ని కొన్న ఆయన కోసం మనం జీవించడమే సముచితం. మనం ఆయనకు చెందినవారిమే గాని మన స్వంతం కాదు. మనం ఆయన కనికరాన్ని రుచి చూశాము. ఆయన దయ కనికరాలు మనం ప్రతి రోజు దేవునికి ఇష్టమైన సజీవయాగంగా ఉండేలా మనల్ని ప్రేరేపిస్తాయి. ప్రలోభాలను అధిగమించడంలో మనం శక్తిహీనులుగా భావించినప్పుడు, సిలువ నుండి వచ్చే ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు ప్రలోభాలకు “లేదు” అని చెప్పడానికి, మన శరీరాలను మనస్సులను అర్పించడం ద్వారా సజీవయాగంగా ఉండాలనే  పిలుపుకు “అవును” అని చెప్పడానికి అది మనకు సహాయం చేస్తుంది.

దేనిని విడిచి పెట్టకుండా మనకున్నవన్ని ఇవ్వాల్సిన అవసరం గురించి ఒక పాస్టర్ చాలా అద్భుతమైన దృష్టాంతాన్ని చెబుతూ ఇలా అన్నాడు:

“మీకున్న వెయ్యి ఎకరాల భూమిని కొనడానికి ఒకరు మిమ్మల్ని సంప్రదించారు అనుకోండి. మధ్యలో ఉన్న ఒక ఎకరం దానికి దారి తప్ప మిగిలిన పొలానంతా అమ్మడానికి మీరు ఒప్పుకున్నారు.” అతను కొనసాగిస్తూ, “ఆ వెయ్యి ఎకరాల పొలం మధ్యలో ఉన్న ఆ ఒక్క ప్లాట్‌లోకి వెళ్లడానికి చట్టం మిమ్మల్ని అనుమతిస్తుందని మీకు తెలుసా? మీరు ఆ చిన్న భూమిని చేరుకోవడానికి మిగిలిన మొత్తం పొలం గుండా రహదారిని నిర్మించవచ్చు.”

దేవునికి పూర్తిగా లోబడని క్రైస్తవుని విషయంలో కూడా అలాగే ఉంటుంది. వానిలో లోబడని భాగానికి చేరుకోవడానికి సాతాను ఆ వ్యక్తి జీవితంలో చొరబడుతుంది. దాని ఫలితంగా అతని సాక్ష్యం మరియు పరిచర్య మసకబారుతుందని, అతని పరిచర్య ఇతర వ్యక్తులపై ఎక్కువ ప్రభావం చూపదని ఖచ్చితంగా తెలుసుకోండి.

ఇంకా అతడు ఏమి చెప్పాడంటే,

క్రైస్తవుడా, నీ శరీరం ప్రభువు ఆధీనంలో ఉందా? ఆయన నియంత్రణకు, ఆయన ఉపయోగించడానికి మరియు ఆయన మహిమ కోసం మీరు ప్రతి విషయాన్ని ఆయనకు సమర్పించారా? లేకపోతే మీరు ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ప్రభువా, నేను ఇంతకుముందే నా హృదయాన్ని నీకు ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇదిగో నా శరీరం ఇస్తున్నాను! దానిని స్వచ్ఛంగా పరిశుద్ధంగా నిష్కల్మషంగా ఉంచడానికి నాకు సహాయం చేయండి. నీకు తగినట్లుగా నీ మహిమ కోసం నన్ను ఉపయోగించుకోండి. నన్ను ఆజ్ఞాపించండని ప్రార్థించండి.

చాలా ఆలస్యం కాలేదు. ఇప్పుడు కూడా ప్రారంభించవచ్చు. మనం పూర్తిగా దేవునికి లోబడితే నిత్యమైన ఆశీర్వాదం ఉంటుంది కానీ నిత్యమైన ప్రమాదం ఉండదు. ఖాళీ కాగితంపై సంతకం చేసి దేవుడికి ఇద్దాం. ఆయనకు తగినట్లుగా దాన్ని పూరించనివ్వండి! అదే నిజమైన సమర్పణ. కనికరంతో మన కోసం ఎన్నో చేసిన వానికి షరతులు లేకుండా లోబడే జీవితమంటే అదే!

Category

Leave a Comment