ధన్యతలు 4 వ భాగము సాత్వికులు ధన్యులు

(English Version: “The Beatitudes – Blessed Are The Meek”)
మత్తయి 5:3-12 నుండి వివరించబడిన ధన్యతలు సిరీస్ నుండి ఇది 4వ పోస్ట్. ఈ సిరీస్‌లో, యేసు ప్రభువు తన అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను వివరించారు. అనువదం ఏదైనప్పటికి, ఈ పోస్ట్‌లో మత్తయి 5:5లో, సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని వివరించబడిన 3వ వైఖరియైన సాత్వికం లేదా సౌమ్యం లేదా వినయం గురించి పరిశీలిద్దాము. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” ఇది కీర్తన 37:11 నుండి తీసుకోబడింది.
*******************
ఈ లోకం ఘనపరిచే ఒక లక్షణం ఏదైనా ఉంది అంటే అది శక్తి. మీ గురించి మీరు చెప్పుకోండని లోకం చెబితే యేసు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఏమి చెప్పారంటే
1. సౌమ్యంగా ఉండాలి.
2. మీ గురించి మీరు చెప్పకోవద్దు
3. కీర్తి కోసం ప్రాకులాడవద్దు.
4. గుర్తింపు కోసం ప్రయత్నించవద్దు.
ఇటువంటి జీవనశైలి వలన దేవుని ఆశీర్వాదాన్ని ఆయన ఆమోదాన్ని అనుగ్రహాన్ని పొందుకుంటామని ఆయన చెప్పారు. ఆ జీవనశైలి కలిగినవారు కేవలం వారు మాత్రమే చివరికి భూలోకమును స్వతంత్రించుకుంటారు.
శక్తిగలవారు బలవంతులని లోకం చెబితే, యేసు సాత్వికులు బలవంతులని అంటున్నారు. ఇవి రెండు భిన్నమైన అభిప్రాయాలు. ఇది సంస్కృతికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది మన శరీరం సహజంగా కోరుకునే దానికి పూర్తిగా వ్యతిరేకం అయినప్పటికీ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం సాత్వికమైన వైఖరిని ప్రదర్శించడానికి పిలువబడ్డాము. “సాత్వికులు” అనే ఈ పదాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా మనం దీన్ని ఎలా చేయగలమో చూద్దాము. సాత్వికం అంటే అర్థం ఏమిటి? మనం దానిని ఎలా నిర్వచించగలము?
సాత్వికం అంటే ఏమిటి?
మొదటిగా సాత్వికం లేదా సౌమ్యత అంటే బలహీనత కాదు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడింది [సంఖ్యా 12:3]. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను [మత్తయి 11:29] అని యేసు తన గురించి తాను చెప్పారు. మత్తయి 5:5 లో అదే పదాన్నిఉపయోగించారు. ఎవరైనా తమ మనస్సులో మోషేను లేదా యేసును బలహీనులని లేదా వెన్నెముక లేని వ్యక్తులని పిలవడానికి ధైర్యం చేయగలరా?
అయితే ఓ ప్రశ్న సాత్వికం అనే పదానికి అర్థం ఏమిటి? యేసు సాత్వికులు [కీర్తన 37:11] అనే పదాన్ని తీసుకున్న 37 వ కీర్తన నేపథ్యం నుండి మనం ఈ ప్రశ్నకు జవాబు పొందవచ్చును. తమ శత్రువుల చేతిలో అణచివేతకు గురవుతున్న దేవుని ప్రజలను [కీర్తన 37:1] ప్రోత్సహించడానికి దావీదు ఈ 37వ కీర్తనను వ్రాసాడు. అతడు వారిని ప్రతీకారం తీర్చుకోవద్దని [కీర్తన 37:8], సరైన సమయంలో వారికి తీర్పు తీర్చబడడానికి పూర్తిగా దేవునిపై ఆధారపడాలని, అదే సమయంలో మంచి చేయడం కొనసాగించాలని చెప్పాడు [కీర్తన 37:27].
కాబట్టి, సాత్వికులు ఎవరు? తాము అణచివేతకు గురైనప్పుడు పూర్తిగా దేవునిపై ఆధారపడేవారే. వారు తమ చేతులతో ప్రతీకారం తీర్చుకోకుండా తమను బాధపెట్టిన వారికి కూడా మంచి చేస్తూనే ఉంటారు.
సాత్వికులు బలమైన వ్యక్తులు. వారు తమ బలాన్ని అదుపులో ఉంచుకుంటారు. సాత్వికుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడని కాదు కానీ దానికి సరైన కారణాలు ఉంటాయి. దేవుని మహిమకు ఆటంకం కలిగినప్పుడు, లేదా ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు వారు కోపం తెచ్చుకుంటారు కానీ వ్యక్తిగత అవమానాలను ఎదుర్కొన్నప్పుడు కాదు. మృదుస్వభావాన్ని కలిగిన వ్యక్తులు తమ శత్రువులతో సహా ఇతరుల భావాలను వారి అవసరాలను పట్టించుకుంటారు! వారు ఎప్పుడూ తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతీకారం తీర్చుకోరు కానీ మంచి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు సరైన సమయంలో తీర్పు తీర్చబడడానికి దేవునిపై ఆధారపడతారు.
సాత్వికానికి నిర్వచనంగా యేసు జీవించారు కాబట్టి మనం కూడా అలాగే జీవించాలి! వినయవైఖరిని ప్రదర్శించినందుకు యేసు రాబోయే రాజ్యానికి రాజు అయినట్లే, మనం వినయంతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తే ఆ వారసత్వంలో పాలుపంచుకుంటామన్న హామీ మనకు ఉంది.
సాత్వికమైన జీవనశైలికి ప్రతిఫలము.
మత్తయి 5:5లో యేసు తెలియచేసిన ఈ వచనం పాత నిబంధన, మరి ముఖ్యంగా కీర్తన 37:11 “అయితే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు” అనే వచనంపై ఆధారపడి ఉంది. యేసు ఈ ధన్యతలో భూమిని భూలోకమని అన్నారు. తన అనుచరులు సాత్వికమైన వైఖరిని అనుసరించినందున యేసు తిరిగి వచ్చినప్పుడు భవిష్యత్తులో పాలస్తీనా ప్రాంతాన్ని మాత్రమే కాకుండా మొత్తం భూమిని స్వతంత్రించుకుంటారని సూచించడానికి ఆయన ఇలా అన్నారు. సాత్వికమైన జీవనశైలికి ప్రతిఫలం అదే!
సాత్వికుల గురించి బైబిలు ఏమి చెబుతుంది.
ఈ ధన్యతలో మాత్రమే కాకుండా అనేకచోట్ల, ముఖ్యంగా ఒరితో ఒకరికున్నసంబంధాలలో విశ్వాసులు వినయమనస్కులై ఉండాలని బైబిలు నొక్కి చెబుతుంది. కొలొస్సి 3:12 లో మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమని మనకు చెప్పబడింది. ఎఫెసి 4:2లో, “సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని” మనకు ఆజ్ఞాపించబడింది. క్రైస్తవులు కాని భర్తలతో నివసించే క్రైస్తవ భార్యలకు “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును…మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది” [1 పేతురు 3:4] అని ఆజ్ఞాపించబడింది.
అదే అధ్యాయంలో, పేతురు విశ్వాసులందరు ప్రతీకార ప్రవర్తన లేనివారై ఉండాలని నొక్కి చెప్పాడు. 1 పేతురు 3:9 లో, “ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి” అని చదువుతాము. దెబ్బకు దెబ్బ అన్నట్లు ప్రతీకారం తీర్చుకోవద్దు; కాని మీ పట్ల కఠినంగా ప్రవర్తించే వారితో దయగా మంచితనంతో ప్రతిస్పందించండి. అలా చేసిన వారు దేవుని ఆశీర్వాదం అనుభవిస్తారనే భరోసా ఉంది!
కాబట్టి, క్రైస్తవులమని చెప్పుకునే వారికి సాత్వికం ఒక ఎంపిక కాదని మనం చూస్తాము. తాను ఏర్పాటు చేయబోయే రాబోవు రాజ్యంలో కేవలం సాత్వికమైన వ్యక్తులు మాత్రమే ఉంటారని యేసు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం వారు మాత్రమే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు.
అయితే, మనం ఈ సాత్విక వైఖరిని ఎలా పెంపొందించుకోవాలి?
మనం సాత్వికంలో ఎలా ఎదగగలము? దానికి ఒకే ఒక మార్గం: మనలో దానిని పెంపొందించుకోవడానికి పరిశుద్ధాత్మపై ఆధారపడడమే. గలతీ 5:22-23, “అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహము.” సాత్వికమనేది పరిశుద్ధాత్మ మాత్రమే మనలో కలుగచేయగల లక్షణం [“ఆత్మ ఫలం” లేదా ఆత్మ ద్వారా కలిగిన ఫలం]. దీనిని బట్టి ఈ ధన్యతను కాని ఇతర ధన్యతలను కాని మనంతట మనమే ప్రదర్శించలేము. మనం పరిశుద్ధాత్మపై ఆధారపడి లోబడితే సాత్వికంలో ఎదగగలము.
ఈ రకమైన జీవనశైలిని కలిగివుండడానికి పరిశుద్ధాత్మ కొన్ని సాధనాలను ఉపయోగిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా, పరిశుద్ధాత్మ మనం సాత్వికంగా ఎదగడానికి సహాయపడడానికి 2 సాధనాలను ఉపయోగిస్తారు.
మనలో సాత్వికతను పెంపొందించడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే మొదటి సాధనం దేవుని వాక్యము. ఆత్మ ఉపయోగించే ఖడ్గం దేవుని వాక్యము [ఎఫెసి 6:17]. యాకోబు విశ్వాసులకు, “అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి” అని వ్రాసాడు [యాకోబు 1:21]. మరో మాటలో చెప్పాలంటే, రక్షణ విషయంలో మనం వినయంగా దేవుని వాక్యానికి లోబడడమే కాకుండా, మన క్రైస్తవ జీవితమంతటిలో దేవుని వాక్యం పట్ల అదే వైఖరిని కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని విని ఆచరించినప్పుడు మాత్రమే నిజమైన మార్పు వస్తుంది [లూకా 11:28].
మనము సాత్వికంలో ఎదగాలంటే, మనలను మార్చడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించడానికి పరిశుద్ధాత్మను అనుమతించాలి. అందుకే మనం వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజూ చదవాలి, అది సరిగా బోధించినప్పుడు వినాలి; మనం చదివిన మరియు విన్న వాటిని వెంటనే ఆచరణలో పెట్టాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిచే నియంత్రించబడాలని కోరుకుంటున్నాడు అనడానికి సాక్ష్యం అదే! అటువంటి వ్యక్తి జీవితంలో, పరిశుద్ధాత్మ సాత్వికం లేదా సౌమ్యత అనే మధురమైన లక్షణాన్ని కలుగచేయును.
కాబట్టి, మనలో సాత్వికతను పుట్టించడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే మొదటి సాధనం దేవుని వాక్యం.
మనలో సాత్వికతను పెంపొందించడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే రెండవ సాధనం శ్రమలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్వారీచేసే వ్యక్తి బలమైన అడవి గుర్రాన్ని పూర్తి అదుపులోనికి తీసుకురావడానికి దానికి కొంత నొప్పి కలిగించి మచ్చిక చేసుకోవడాన్ని వివరించడానికి యేసుకాలంలో ఉపయోగించే గ్రీకు పదం మత్తయి 5:5 లో “సాత్వికులు” అని అనువదించబడింది. ఆ మచ్చిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన జంతువును సాధుజంతువని అంటారు.
పరిశుద్ధాత్మ మనలో కూడా అదే పని చేస్తుంది. మనం మన ఇష్టాన్ని విడిచిపెట్టి మన స్వంత నిర్ణయాలు తీసుకోకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడేలా చేయడానికి శ్రమలను అనుమతిస్తారు. ఆ ప్రక్రియ ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో సాత్వికమనే ఈ లక్షణం మరి ఎక్కువగా పెంపొందించబడుతుంది. అందుకే మనం శ్రమలను ద్వేషించకూడదు కానీ వాటిని పరిశుద్ధాత్మ మనల్ని మరింత వినయమనస్కులుగా చేయడానికి ఉపయోగపడే అవకాశాలుగా చూడాలి.
శ్రమలు ఎదుర్కొన్నవారు సాధారణంగా ఇతరుల పట్ల ఎక్కువ సహనం కలిగి ఉంటారు, అలాగే ఇతరులు అనుభవించే భాధలు మరి ఎక్కువగా అర్థం చేసుకుంటారు. అలాగే, వారు ఇతరులకు మంచి చేయడానికి ముందు ఉంటారు. వారు తమ స్వంత ప్రయోజనాల కన్నా ఇతరుల ప్రయోజనాలను ప్రాధాన్యత ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు [ఫిలిప్పీ 2:4].
సాత్వికమైన వ్యక్తులకు తాము దేనికీ అర్హులుకామని తెలుసు కనుక తమను తాము గొప్ప చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించరు. వారికి ఏమి జరిగినా కోపం తెచ్చుకోరు. వారు ఇప్పటికే తగ్గించుకుని ఉన్నారు కాబట్టి పడిపోతామని భయపడరు! వారి తగ్గింపు స్వభావం ఇతరులపై ప్రతీకారం తీర్చుకోకుండా వారిని నిరోధిస్తుంది. అంతేకాదు, వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు. శ్రమలతో శోధించబడడం వలన అలాంటి స్వభావం వస్తుంది. ఇది అర్ధవంతమైనది.
మనం సాత్వికంలో ఎదగడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే 2 సాధనాలు దేవుని వాక్యం మరియు శ్రమలు.
ప్రతీకార స్వభావాన్ని విడిచిపెట్టి, సాత్వికతను వెదికి కొనసాగించాలి.
ప్రతీకారం మన ఆత్మలకు శాంతి కలిగించదు. ప్రతీకారం కోసం తిరిగి కొట్టడం వల్ల మనం క్రీస్తులా కనిపించలేము. ప్రతీకార స్ఫూర్తి కారణంగా చాలా కుటుంబాలు, చాలా బంధాలు తెగిపోయాయి. ప్రతీకార స్ఫూర్తి కేవలం ఇంట్లో బయట ఉండే బంధాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగిస్తుంది; చివరికి క్రీస్తు నామానికి అవమానాన్ని తెస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, దేవుడు తన సమయంలో తీర్పు తీర్చడానికి, అదే సమయంలో మనం ఇతరులకు మంచి చేయడం కోసం దేవునిపై ఆధారపడడం వలన దేవునికి గొప్ప మహిమ కలుగుతుంది అలాగే మనకు కూడా ఆశీర్వాదాన్ని తెస్తుంది. కేవలం అలాంటి వారికి మాత్రమే, మీరు రాబోయే ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని యేసు వాగ్దానం చేశారు.
వర్తమానంలో కూడా, సాత్వికులు దేవుని నడిపింపును అనుభవిస్తారు. కీర్తన 25:9లో, న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అని వ్రాయబడింది. మీరు మీ జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వినయంగా ఉండండి. మీ గర్వాన్ని విడిచిపెట్టండి. దేవుని మార్గాలకు లోబడండి. ఆయన మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తారు!
లోకం మనలో మరింత సాత్వికమైన, ప్రతికారం తీర్చుకోని స్వభావాన్ని చూడాలి. వారు దానిని చూసినప్పుడు వారు యేసును చూస్తారు. ఆయననే ఈ లోకం చూడాలి. మనం కేవలం నమ్మకంగా ఆయనకి ప్రాతినిధ్యం వహించడానికి పిలవబడిన ఆయన రాయబారులం మాత్రమే. మన ఇండ్లలో లేదా బయట కోపగించుకునే వారిగ, బాధించే వారిగా ఉండడం వలన మనం ఎవరిని క్రీస్తు కోసం గెలవలేము. కానీ కఠినమైన హృదయాలను కూడా కదిలించే గొప్ప శక్తి సాత్వికానికి ఉంది!
మీ జీవితాన్ని పరిశీలించండి. మీరు సాత్వికమైనవారా? ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? చిన్న చిన్న విషయాలైనప్పటికి పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు మీ స్పందన ఏమిటి? ఎప్పుడూ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలనుకునే కోపిష్టిగా ఉన్నారా మీరు? అదే మీ జీవనశైలి అయితే, మీరు మీ నోటితో ఏది చెప్పినప్పటికి మీరు నిజంగా దేవుని రాజ్యానికి చెందినవారో కాదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. కొండమీది ప్రసంగమంతా ఒకరు తాము నిజంగా ఆయన అనుచరులమో కాదో పరిశీలించుకోవడానికి యేసు పట్టుకున్న అద్దం అని గుర్తుంచుకోవాలి. పశ్చాత్తాపం చెందడానికి సమయం ఇంకా మించిపోలేదు.
ఒకవేళ మీరు దేవుని కుమారుడైన క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆయనకు లోబడకపోతే, ఈ రోజే మీరు సమర్పించుకోవాలని నా ప్రార్థన. మీ పాపాలను అంగీకరించండి. దేవుని పరిపూర్ణ సామర్థ్యాన్ని చేరుకోవడానికి మీకున్న అసమర్ధతను గుర్తించండి. మీ పాపాల నిమిత్తము మొరపెట్టి, మీరు చేసిన, చేయబోయే పాపాల కొరకు మరణించిన క్రీస్తు వైపు విశ్వాసంతో తిరగండి. ఆయన పాపక్షమాపణను స్వీకరించి, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. అప్పుడు మీరు దేవుని కుటుంబంలోనికి రావడమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా సాత్వికంగల వైఖరిని కొనసాగించగలరు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.