మీరు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోవద్దు

Posted byTelugu Editor July 18, 2023 Comments:0

(English version: Don’t Be Surprised When You Go Through Suffering)

15వ శతాబ్దం మధ్య కాలంనాటికి , బైబిలు ఇంగ్లీషులోనికి అనువదించబడింది. ఆంగ్ల భాషలో బైబిల్ మొదట దొరికిన ఇంగ్లాండ్‌లోని పట్టణాలలో హాడ్లీ పట్టణం ఒకటి. హాడ్లీకి పాస్టరుగా ఉన్న డాక్టర్ రోలాండ్ టేలర్ దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించేవాడు. ఊహించినట్లుగానే, లండనులోని బిషప్పు మరియు లార్డ్ ఛాన్సలర్‌ ముందు హాజరు కావాలని అతనికి ఆజ్ఞ వచ్చింది. వారు అతనిపై మతోన్మాదని నేరం మోపి, బైబిలుపై తనకున్న వైఖరిని మార్చుకోమని లేదంటే కొయ్యపై కాల్చివేస్తామని అన్నారు.

అందుకు అతడు ధైర్యంగా, “నేను సత్యాన్ని బోధించడం మానను; దేవుని వాక్యం కొరకు శ్రమపడడానికి ఆయన నన్ను పిలుచుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను” అన్నాడు. అప్పడు వారు అతడిని కొయ్యపై కాల్చివేయమని చెప్పి వెంటనే హాడ్లీకి తిరిగి పంపించారు. దారిలో అతడు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాడు, చూసిన వారెవరైనా అతడు విందుకో, వివాహానికో వెళ్తున్నాడని అనుకుంటారు. అతడు తనకు కాపలాగా వస్తున్నవారిని తమ దుష్టత్వాన్ని చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందమని హృదయమంతటితో వేడుకున్నప్పుడు వారు అతని మాటలకు కన్నీరు కార్చారు. అతడు చాలా దృఢంగా, నిర్భయంగా, ఆనందంగా, మరియు చనిపోవడానికి సంతోషంగా ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు.

అతడిని కాల్చవలసిన చోటికి వారు చేరుకున్నప్పుడు, అక్కడికి చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న తన సంఘసభ్యులందరితో డాక్టర్ టేలర్, “నేను మీకు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తప్ప మరిదేనిని బోధించలేదు. నేను చెప్పినవన్నీ దేవునిచే  ఆశీర్వదించబడిన పరిశుద్ధ బైబిలు నుండి తీసుకోబడినవే. ఈ రోజు నా రక్తంతో దానికి ముద్ర వేయడానికి నేను ఇక్కడకు వచ్చాను” అన్నాడు.

అతడు మోకరించి ప్రార్థన చేసి కొయ్య దగ్గరికి వెళ్లాడు. అతడు ఆ కొయ్యను ముద్దు పెట్టుకుని దానికి ఎదురుగా నిలబడి తన చేతులు ముడుచుకుని తన కన్నులు పరలోకంవైపు ఉంచాడు. అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. వారు అతడిని గొలుసులతో బంధించారు, చాలామంది కర్రలు తెచ్చి అక్కడ ఉంచారు. వారు మంట వెలిగిస్తున్నప్పుడు, డాక్టర్ టేలర్ తన రెండు చేతులు పైకెత్తి, “దయగల పరలోకపు తండ్రీ, నా రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి నా ఆత్మను నీ చేతుల్లోకి తీసుకో” అంటూ దేవుని ప్రార్థించాడు.

అతడు ఏడవకుండా, కదలకుండా చేతులు ముడుచుకుని మంటల్లో నిలబడ్డాడు. అతడు మరింత బాధ పడకూడదని పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మంటల వైపు పరిగెత్తుకొని వెళ్లి పొడవైన యుద్ధపు గొడ్డలితో అతని తలపై కొట్టాడు. వెంటనే టేలర్ చనిపోయి మంటల్లో పడిపోయాడు.

మనం ఈ కథను అలాంటి అనేక ఇతర కథలను చదివినప్పుడు, టేలర్ వంటి వారు అలాంటి శ్రమలు భరించడానికి కారణమేమిటని మనం ఆశ్చర్యపోతాము. ఒక కారణం ఏమిటంటే, క్రైస్తవ జీవితం శ్రమలు అనుభవించడానికి పిలువబడిందని అని వారికి తెలుసు కాబట్టి శ్రమలు ఎదురైనప్పుడు వారు ఆశ్చర్యపోలేదు. వారు 1 పేతురు 4:12లోని మాటలను హృదయంలో గుర్తుంచుకున్నారు. “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.” 

గమనించండి, “ఆశ్చర్యపడకుడి” అని పేతురు చెప్పాడు. ఇది ఒక ఆజ్ఞ. “క్రైస్తవ జీవితంలో భాగంగా శ్రమలను ముందే ఊహించండి” అని అతడు చెబుతున్నాడు. సాధారణ మనుషులు శ్రమలు ఎదురైనప్పుడు నాకు “ఏదో వింత” జరుగుతోందని ఆశ్చర్యపోతారు. అయితే, వాటి గురించి ముందే తెలియచేయబడిన క్రైస్తవులు అలా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు; మనం ముందుగానే వాటిని ఊహించాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆశ్చర్యపోకూడదని, బాధలు అనుభవించాలని బైబిలు మనకు పదే పదే గుర్తుచేస్తుంది. ఇక్కడ స్వయంగా యేసు ప్రభువు చెప్పిన కొన్ని మాటలు చుద్దాము:

మత్తయి 5:11  “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.”

మత్తయి 10:34-36  “34 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36 ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.”

మార్కు 10:29-30  “29 అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు 30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

యోహాను 15:20 “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు.”

ఇతర కొత్త నిబంధన రచయితలు కూడా ఈ సత్యాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. పౌలు 2 తిమోతి 3:12లో ఇలా చెప్పాడు, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.” 1 యోహాను 3:13లో యోహాను “సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి” అని మనకు గుర్తు చేస్తున్నాడు.

మనము అపొస్తలుల కార్యముల గ్రంథము లేదా హెబ్రీ 11వ అధ్యాయం చదివినప్పుడు, సంఘం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో దేవుని ప్రజలను రాళ్లతో కొట్టడం, ఖైదు చేయడం, కొరడాలతో కొట్టడం చంపడం మనకు స్పష్టంగా గుర్తుకు వస్తాయి. సంఘ చరిత్ర 1వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు ప్రపంచం చేతిలో దేవుని ప్రజలు అనుభవించిన శ్రమలకు సాక్ష్యంగా ఉంది. పతనం నుండి, సాతాను ప్రజలకు దేవుని ప్రజలకు మధ్య నిరంతర శత్రుత్వం ఉంది. సాతాను దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టి దేవుని మరియు దేవుని కోసం నిలబడే ప్రతి ఒక్కరినీ ద్వేషించేలా అతడు తన పిల్లలను ప్రేరేపిస్తాడు. కాబట్టి, యేసు, అపొస్తలులు మనలన్ని శ్రమలు యొక్క వాస్తవికత గురించి హెచ్చరించారనేది స్పష్టమవుతుంది.

1 పేతురు 4:12 వచనం మరలా చూద్దాము. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే శ్రమలు “అగ్నివంటివి” అని పేతురు వర్ణించాడు. క్రైస్తవులు శ్రమలను ముందే ఉహించి, అవి వచ్చినప్పుడు ఆశ్చర్యపడకుండా ఉండడమే కాకుండా, కొన్నిసార్లు ఆ శ్రమలు  తీవ్రంగా కఠినంగా ఉంటాయని గ్రహించాలి. “అగ్ని”(కాలిపోవడము) అనే పదానికి అర్థం అదే. అదే పదం పాత నిబంధనలో “కొలిమి”గా అనువదించబడింది. ఇది పేతురు ఎవరికైతే వ్రాశాడో ఆ క్రైస్తవులు ఆ సమయంలో అనుభవిస్తున్న శ్రమల తీవ్రతను అలాగే మన కాలంలో కూడా కొందరు అనుభవిస్తున్న శ్రమల తీవ్రతను వివరిస్తుంది.

ఇక్కడ “ఇంత తీవ్రమైన బాధల  వలన ప్రయోజనం ఏమిటి?” అని ఎవరైనా అడగవచ్చు. ఆ ప్రశ్నకు పేతురు ఇచ్చిన సమాధానం, “మిమ్మల్ని పరీక్షించడానికి మీకు అగ్నిపరీక్ష వచ్చింది.” శ్రమలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి. నిజమైన విశ్వాసం శ్రమలను తట్టుకుని నిలబడుతుంది. శ్రమలు ఎదురైనప్పుడు తప్పుడు విశ్వాసం కూలిపోతుంది. 1 పేతురు 1:6-7లో, బంగారం అగ్నిచే పరీక్షించబడి శుద్ధి చేయబడినట్లే క్రైస్తవుని విశ్వాసం శ్రమలు, బాధల ద్వారా శుద్ధి చేయబడడం గురించి పేతురు మాట్లాడాడు. అగ్ని వలన బంగారం నాణ్యత తెలుస్తుంది. అది నిజమైనదైతే, కాల్చబడినప్పుడు మరింత స్వచ్ఛంగా బయటకు వస్తుంది. నిజమైన క్రైస్తవులు కూడా అంతే. వారు శ్రమల గుండా వెళ్ళినప్పుడు స్వచ్ఛంగా మారతారు.

విశ్వాసులకు శ్రమలు అవసరము. లేదంటే మనం మన ప్రభువులా ఎలా మారగలం? మన శత్రువులను ప్రేమించడం, మనల్ని ద్వేషించే వారికి మేలు చేయడం, హింసించేవారి కోసం ప్రార్థించడం ఎలా నేర్చుకోగలం? మనం మరింత వినయంగా, మరింత సౌమ్యంగా, మరింత విరిగినవారిగా, ఇతరుల అవసరాలను అర్థం చేసుకునేవారిగా ఎలా మారగలం? దేవుడు మనలను శుద్ధి చేయడానికి శ్రమలను ఉపయోగిస్తారని గ్రహించడంలో మనం విఫలమైతే, శ్రమలు ఎదురైనప్పుడు మనకు “ఏదో వింత జరుగుతున్నట్లుగా” స్పందిస్తామని పేతురు అన్నాడు.

“నాకు ఏదో వింత జరుగుతోంది” అనేది చాలా మంది క్రైస్తవుల స్పందనగా ఉండడం చాలా బాధాకరము. బహుశా, క్రైస్తవ జీవితం అంటే మంచి ఆరోగ్యంతో, సంపదతో సంతోషంతో నిండిన సమస్యలు లేని జీవితమని వారికి వాగ్దానం చేయబడి ఉండవచ్చు; కాని ఇది బైబిలు బోధించే దానికి పూర్తిగా వ్యతిరేకము. అలాంటి వ్యక్తులు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు వాటికి సరైన రీతిలో స్పందించడం వారికి తెలియదు. అందుకే ప్రజలు క్రీస్తును అనుసరించే ముందు దానికి చెల్లించవలసిన మూల్యాన్ని కూడా చూసుకోవడం చాలా ముఖ్యము.

ప్రజలు తనను అనుసరించే దానికి చెల్లించవలసిన మూల్యాన్ని కూడా చూసుకోవాలని యేసు స్వయంగా చెప్పారు (లూకా 14:26-35). తమ విశ్వాసానికి మూల్యం చెల్లించవలసి వచ్చినప్పుడు పారిపోయే సగం హృదయం ఉన్న శిష్యులను తయారు చేయడంలో ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. శ్రమలు వచ్చినప్పుడు పారిపోయేవారు రాతి ప్రదేశాలలో పడిన విత్తనంలా భావోద్వేగ ప్రాతిపదికన క్రీస్తుకు ప్రతిస్పందిస్తారు. యేసు అటువంటి వారి గురించి ఏమి చెప్పారంటే, “16 అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; 17 అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు” (మార్కు 4:16-17).

మరోవైపు, మూల్యాన్ని లెక్కించే వారు తమ పాపజీవితాన్ని  బాధలను దుఃఖాన్ని పూర్తిగా గుర్తించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆయన షరతులను అనుసరించి క్రీస్తు దగ్గరకు వస్తారు. అలాంటి వారు మంచి నేలపై పడిన విత్తనం వంటివారు, శ్రమలు ఎదుర్కొన్నప్పుడు వారు సహిస్తారు. “మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు” (లూకా 8:15) వారు శ్రమలను ముందే ఊహిస్తారు అవి వచ్చినప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోరు. అందుకే వారు సహిస్తారు!

శ్రమలు అనుభవించాలని దాని గురించి ఆశ్చర్యపోకూడదని పరిశుద్ధాత్మ ద్వారా మనకు గుర్తు చేయమని నిరంతరం ప్రభువును అడుగుదాము. మనం యేసు కోసం జీవించినప్పుడు వివిధ రకాలైన తిరస్కరణలు శ్రమలు వస్తాయి. ఈ రకమైన బైబిలు అవగాహన కలిగివుండడం వలన కనీసం ఈ క్రింది రెండు విషయాలను సాధించవచ్చును:

(1) శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా సణుగుకోకుండా అది మనల్ని నిరోధిస్తుంది.

(2) ఫిలిప్పీ 1:29లో పౌలు చెప్పిన మాటలు “క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను” మనం జ్ఞాపకం చేసుకోవడం వలన మన హృదయలు బలపరచబడతాయి. 

Category

Leave a Comment