సంతృప్తికి సంబంధించిన 3 అపోహలు

(English version: 3 Misconceptions Concerning Contentment)
అస్తమానం సణుగుతూవుండే తండ్రి ఉన్న ఒక చిన్నపాప తన తల్లితో, “మన ఇంటిలో ప్రతి ఒక్కరి ఇష్టం నాకు తెలుసు. జానీకి హాంబర్గర్లు అంటే ఇష్టం, జెనీకి ఐస్ క్రీం ఇష్టం, విల్లీకి అరటిపండ్లు, మమ్మీకి చికెన్ అంటే ఇష్టం” అని చెప్పింది. తన గురించి చెప్పలేదన్న చిరాకుతో తండ్రి, “నా గురించి చెప్పు? నాకు ఏమి ఇష్టం?” అని అడిగాడు. అమాయకమైన ఆ చిన్నపాప, “మనకు లేనివన్నీ నీకు నచ్చుతాయి” అని సమాధానమిచ్చింది. ఈ మాటలకు మనం నవ్వు రావచ్చు, కాని మనల్ని మనం నిజాయితీగా చూసుకుంటే, మనలో చాలామంది క్రైస్తవులు ఈ తండ్రిని పోలి ఉంటారు. సంతృప్తికి సంబంధించి అనేక అపోహలు ఉన్నందుకే ఈ సమస్య. ఈ ప్రచురణ ఈ అంశానికి సంబంధించిన 3 సాధారణమైన అపోహల గురించి తెలియచేస్తూ వాటిలో ప్రతిదానికి బైబిలుపరంగా జవాబిస్తుంది.
అపోహ # 1. సంతృప్తి అనేది అంత పెద్ద సమస్య కాదు.
సాధారణంగా, జీవితంలో మనకు ఇష్టంకాని విషయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని మానవనైజంగా భావిస్తాము. నేను సాధారణమైన మానవుడిని. నేను అప్పుడపుడు నా అసంతృప్తిని వెల్లడించాలి.
బైబిలుపరమైన జవాబు: దేవుడు అసంతృప్తిని “సాధారణమైన” స్పందనగా చూస్తే, తృప్తి కలిగివుండడం యొక్క అవసరత గురించి ఆయన అనేక ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు? “మీ జీతంతో తృప్తి చెందండి” [లూకా 3:14], “మీకు ఉన్నదానితో సంతృప్తి చెందండి” [హెబ్రీ 13: 5], “ఏవిధమైన అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్త వహించండి” [లూకా 12:15]. విశ్వాసులుగా, దేవుని ఆజ్ఞలలో దేనిని పాటించకపోయినా అది పాపమేనని మనం అంగీకరిస్తాము. అలాంటప్పుడు, తృప్తి కలిగివుండకపోవడాన్ని కూడా మనం పాపంగా భావించాలి కదా? కాబట్టి, తృప్తి కలిగివుండడం ఒక పెద్ద సమస్య -అది మనం దుప్పటి కింద దాచిపెట్టగలిగేది కాదు.
మరింత లోతుగా పరిశీలించినప్పుడు దేవుడు అసంతృప్తిని పాపం అని ఎందుకు పిలుస్తున్నాడో మరింత స్పష్టంగా తెలుస్తుంది. దానికి 2 కారణాలు గుర్తుకు వస్తాయి.
a. దేవుని సార్వభౌమత్వాన్ని అసంతృప్తి ప్రశ్నిస్తుంది. మన జీవితంలోని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేయడమంటే మన పట్ల చేయాలనుకున్నది చేయడానికి దేవునికున్న హక్కును ప్రశ్నించడమే. జీవి సృష్టికర్త చర్యలను ప్రశ్నించడం ఎల్లప్పుడూ పాపమే.
b. దేవుని మంచితనాన్ని అసంతృప్తి ప్రశ్నిస్తుంది. మన జీవితంలో పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు, మనం ఏమి [మాటల్లో కాదు, వైఖరి ద్వారా] చెబుతామంటే: “దేవా, ఈ పరిస్థితిలో నీవు నాకు దయ చూపించలేదు. నీవు మంచివాడవు, ప్రేమించేవాడవైతే, నాకు కావాల్సినవి నీవెందుకు ఇవ్వడంలేదు? నాకు నచ్చనివి నా జీవితం నుండి ఎందుకు తీసివేయడంలేదు?”. శ్రమల నుండి విడుదల కోసం దేవునికి మొరపెట్టుకోవడం పాపం కాదు కాని, దేవుని మంచితనాన్ని ప్రశ్నించడమే పాపము.
గమనిక: మనం దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలో అలా లేము కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం పట్ల అసంతృప్తిగా ఉండటం మంచిదే. మరో మాటలో చెప్పాలంటే, మీకు ఉన్నదానితో సంతృప్తి చెందండి కాని ఆధ్యాత్మి స్థితి గురించి ఎప్పుడూ తృప్తి చెందకండి. మన చుట్టూ పెరిగిపోతున్న పాపాన్ని చూసినప్పుడు, యేసు నామాన్ని అగౌరవపరుస్తున్నప్పుడు అసంతృప్తి చెందడం కూడా మంచిదే. ఈ విషయాలలో అసంతృప్తి వ్యక్తంచేయడం పాపం కాదు అలాగే అది క్రైస్తవుడికి సహజ స్పందనగా ఉండాలి.
అపోహ # 2. సంతృప్తి అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడున్న నా పరిస్థితులు మారితే జీవితం ఎంత బాగుంటుందో అని మనం తరచు అనుకుంటున్నాము. మనం ఒంటరివారమైతే వివాహం కావాలనుకుంటాము; ఒకవేళ వివాహం జరిగివుంటే, ఇంకా ఒంటరివారిగా ఉండాలని కోరుకుంటున్నాము. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలనుకుంటాము; మనకు పిల్లలు ఉంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుండును అనుకుంటున్నాము. మనకు పిల్లలు పుట్టినప్పుడు, ఇంకా మంచి పిల్లలు కావాలనుకుంటాము. అలా జాబితా కొనసాగుతూనే ఉంటుంది. “నేను ఉన్న పరిస్థితి కన్నా మరి వేరే ఏ పరిస్థితియైనా మెరుగ్గానే ఉంటుంది” అని హృదయం ఎప్పుడూ ఏడుస్తునే ఉంటుంది. ఒక ఆసక్తికరమైన కోటేషను ఈ సత్యాన్ని చక్కగా చెబుతుంది, “ఒక సూత్రం ప్రకారం, మనిషి ఒక మూర్ఖుడు. వేడిగా ఉన్నప్పుడు, అతను చల్లదనాన్ని కోరుకుంటాడు. చల్లగా ఉన్నప్పుడు, అతను వెచ్చదనాన్ని కోరుకుంటాడు. ఎప్పుడూ లేనిదానినే కోరుకుంటాడు.” ఇక్కడ చెప్పిన వ్యక్తి మీకు బాగా తెలిసినవానిగా ఉన్నాడా?
తన స్నేహితులకు పెద్దపెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నందున వారిపై అసూయపడే వ్యక్తి గురించి ఒక కథ. అతడు తన ఇంటి గురించి ఒక రియల్ ఎస్టేటువారితో మాట్లాడి, దానిని అమ్మి మరింతగా ఆకట్టుకునే ఇంటిని కొనాలని ఆలోచన చేశాడు. కొంతకాలం తర్వాత, అతడు వార్తాపత్రికలో ప్రకటనలు చదువుతున్నప్పుడు, తాను కావాలనుకుంటున్న ఇంటి గురించి ఒక ప్రకటన చూశాడు. అతడు వెంటనే రియల్ ఎస్టేటు ఏజెంటుకి ఫోనుచేసి, “మీరు ఈ రోజు పేపర్లో ప్రకటించిన ఇల్లులాంటి దానినే నేను వెతుకుతున్నాను. వీలైనంత త్వరగా నేను దానిని కొనాలనుకుంటున్నాను” అన్నాడు. ఆ ఏజెంట్ అతడిని దాని గురించి చాలా ప్రశ్నలు అడిగి, “అయితే సార్, మీరు చెబుతున్నది మీ ఇంటి గురించే” అన్నాడు.
బైబిలుపరమైన జవాబు: ఆదాము హవ్వ గుర్తున్నారా? ఊహించలేని పరిపూర్ణ పరిస్థితులలో వారు జీవించారు; ఒక చెట్టు తప్ప విశ్వంలో ఉన్న ప్రతిదీ వారి దగ్గర ఉంది [ఆదికా 1:28, 2: 15-16]. ప్రేమ కలిగిన దేవుడు వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. అయినప్పటికీ, వారికి అసంతృప్తి కలిగేలా సాతాను వారిని ఎలా ప్రేరేపించాడో గమనించండి, “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” [ఆదికా 3: 1]. బైబిల్లో మన కోసం వ్రాయబడిన మొదటి ప్రశ్న సాతాను పెదవుల నుండి వచ్చింది, అది దేవుని మాటను అనుమానించడానికి ఆయన మంచితనంపై సందేహం కలిగించడానికి రూపొందించబడిన ప్రశ్న.
సాతాను భావం ఏమిటంటే: “అయితే విశ్వంలో ఉన్నవన్ని మీ దగ్గర నిజంగా ఉన్నాయా? దేవుడు చాలా కఠినాత్ముడు కదా? ఆయన మీ ఆనందాన్ని, సంతోషాన్ని , సంతృప్తిని దోచుకోవటం లేదా?” అతని లక్ష్యం -వారి దగ్గర ఉన్న వాటి నుండి వారి దృష్టిని మళ్లించడం [ప్రతిదీ], తమ వద్ద లేనివాటిపై దృష్టి పెట్టేలా చేయడము [అది కేవలం ఒక చెట్టు పండు]. అదే అసంతృప్తి అంతటికి మూలము: మన దగ్గర ఉన్నదానిపై కాకుండా మన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టడం!
ఆదాము, హవ్వ ఇద్దరూ సాతాను చెప్పిన ఈ అబద్ధానికి లొంగిపోవడం బాధాకరము. ఆ అబద్ధం ఏమిటంటే, మీ పరిస్థితులు మారితే మీరు సంతోషంగా ఉంటారు! ఫలితం? సంతోషానికి బదులుగా ఏమి జరుగుతుందని దేవుడు చెప్పాడో అలాగే, పాపం మరియు సాతాను చేసే తప్పుడు వాగ్దానాలకన్నా దేవుని మాట ఎప్పుడూ ప్రబలంగా ఉంటుందని రుజువు చేస్తూ, వారు కష్టాలను అనుభవించారు.
మనం ఈ కీలకమైన పాఠాన్ని నేర్చుకుందాం. ఈ విశ్వంలో దాదాపు అన్నీ తమ దగ్గర ఉన్నప్పటికి ఆదాము హవ్వ సంతృప్తి చెందలేకపోయారు, “ఇప్పుడు నా దగ్గర ఏది లేదో అది ఉంటేనే నేను సంతృప్తి చెందుతాను” అనే తప్పుడు వాగ్దానాల పట్ల జాగ్రత్త వహించండి. అందుకే మనం నిరంతరం, “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము” [కీర్తన 119: 37] అని దేవుని అడగాలి.
నిజమైన సంతృప్తి బాహ్య పరిస్థితుల నుండి కలుగదని మనం గ్రహించాలి. మనం దైవభక్తికి ప్రాధాన్యత ఇచ్చి నిత్యత్వాన్ని మన దృక్పథంగా చేసుకోవడం ద్వారా కలుగుతుంది. 1 తిమోతి 6: 6 ఇలా చెబుతోంది, “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.” దైవభక్తి వలన యేసుక్రీస్తు ద్వారా దేవునితో నిజమైన సంబంధం ప్రారంభమవుతుంది. మీరు ఇంకా అలా చేయకపోతే, పశ్చాత్తాపంతో విశ్వాసంతో క్రీస్తు దగ్గరకు రండి. ఆయనను మీ సమృద్ధిగా అంగీకరించండి.
అపోహ # 3. క్రైస్తవునికి సంతృప్తి సహజంగా కలుగుతుంది.
మనం క్రైస్తవులుగా మారినప్పుడు, మనం వెంటనే ప్రపంచంలోని విషయాలను ద్వేషించడం మొదలుపెడతాము అలాగే క్రీస్తులో మన సంతృప్తి కలిగివుంటాము. ఇకపై మనం పాపభరితమైన శరీరాశలకు లొంగిపోము.
బైబిలుపరమైన జవాబు: ఇది నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను! అవును, విశ్వాసిగా మారడం వలన మన స్వభావంలో ప్రాథమికమైన మార్పు వస్తుంది. అయితే, నిత్యం పరిశుద్ధాత్మకు లోబడి ఉండడం, పాపభరితమైన శరీరాశలను నిరాకరించడం అనేది నిరంతరమైన పోరాటమే కదా? అపొస్తలుడైన పౌలును ఉదాహరణను తీసుకుందాం. పౌలు రోమాలో చెరశాలలో ఉండి ఫిలిప్పీయులకు వ్రాస్తూ ఏమన్నాడంటే, “నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను” [ఫిలిప్పీ4:11]. పౌలు సంతృప్తి కలిగివుండడం నేర్చుకున్నాడని మీరు గమనించారా? తర్వాతి వచనంలో, “దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను” [ఫిలిప్పీ4:12] అవే మాటలు మరలా చెప్పాడు. అతడు ఈ రెండు వచనాలలో రెండుసార్లు సంతృప్తి కలిగివుండడం నేర్చుకోవడం గురించి మాట్లాడాడు. మరో విధంగా చెప్పాలంటే, క్రీస్తు అతనిని అద్భుతమైన రీతిలో పట్టుకున్నప్పటికీ, అతనికి సంతృప్తి సహజంగా రాలేదు!
ఇది మనకు కొంత నిరీక్షణనిస్తుంది కదా? సంతృప్తి సహజంగా రాదు కానీ దానిని నేర్చుకోవాలి. అది ఒక ప్రక్రియ. పౌలువలె మనం కూడా సంతృప్తి కలిగివుండడంలోని రహస్యాన్ని తెలుసుకోవడానికి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని వాక్యాన్ని మరియు అలుపెరుగని మన ప్రార్థనను ఉపయోగించి మనం అవసరమైన ప్రయత్నం చేయగలుగుతాము.
ఫిలిప్పీ 4:11 లో “సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను” అని చెప్పినప్పుడు పౌలు ఉపయోగించిన “సంతృప్తి” అనే పదానికి సమానమైన గ్రీకుపదం “స్వయం సమృద్ధి” లేదా “సంతృప్తి చెందడం” అని సూచిస్తుంది. ఈ పదాన్ని ఉపయోగించిన ఆ కాలంలోని లౌకిక ప్రపంచంలో, ఒక వ్యక్తి ఏ బాహ్య శక్తి సహాయం లేకుండా తన అంతర్గత మానవ బలంతో జీవితంలోని ఒత్తిడినంతటిని ప్రశాంతంగా అంగీకరించడాన్ని ఆ పదం సూచిస్తుంది. దానికి విరుద్ధంగా, విశ్వాసులందరూ అన్ని సమయాలలో సంతృప్తి చెందడానికి అవసరమైనవన్నీ అందించే క్రీస్తు నుండి తనకు సమృద్ధి కలిగినట్లుగా పౌలు గుర్తిస్తాడు.
“మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ సంతృప్తి కలిగివుండడానికి రహస్యాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు?” అని మనం పౌలును అడిగితే, “నాకు సంతృప్తి చెందడానికి కావలసిన వాటిని అందిస్తున్న క్రీస్తు నుండి నాకు సమృద్ధి కలిగింది” అని అతడు జవాబు చెబుతాడు. తర్వాతి వచనం దీనిని స్పష్టం చేస్తుంది.
“నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఫిలిప్ఫి 4:13లో చెప్పడం మనం చూడవచ్చును. కొన్ని అనువాదాలాలో, “నేను క్రీస్తు ద్వారా లేదా నన్ను బలపరిచేవాని ద్వారా అన్ని పనులు చేయగలను.” తప్పుగా అర్థం చేసుకున్న వచనాలలో ఈ వచనం కూడా ఒకటి. క్రీస్తుపై విశ్వాసం ఉంచినట్లయితే తమ మనస్సులో అనుకున్న దేనినైనా చేయగలమని ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఎంతో దురదృష్టకరము. ఈ వచనం బోధించేది అది కానేకాదు. ఫిలిప్పీయులు 4: 10-19లోని మొత్తం వాక్యం సంతృప్తి గురించి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతృప్తిగా జీవించడానికి తన రహస్యం, తనకు [మనకు] కావలసిన వాటన్నిటిని అందించే క్రీస్తు నుండి కలిగిన సమృద్ధిని ఆధారం చేసుకొని ఉందని పౌలు చెప్పాడు.
కాబట్టి, క్రైస్తవ కోణంలో, “సంతృప్తి కలిగివుండడం అంటే క్రీస్తు ఉన్నందున పూర్తిగా తృప్తి చెందడమే.” మనం సంతృప్తి కలిగివుండాలని కోరుకుంటే మనం నేర్చుకోవలసినది అదే. మనకు క్రీస్తు ఉన్నారు , అంటే ఈ జీవితం మరియు రాబోయే జీవితం కోసం మన దగ్గర సమస్తం ఉన్నాయని అర్థము. మనం క్రీస్తును కలిగిలేము అంటే, మనకి ఈ లోకంలో సమృద్ధి ఉన్నప్పటికీ మనకి ఏమి లేనట్లే.
ముగింపు మాటలు.
క్రైస్తవులుగా, నరకానికి తప్ప మరిదేనికి పాత్రులంకాని మనలాంటి పాపులను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం తరచుగా మోకరిస్తాము. ఏదేమైనా, ప్రార్థన ముగించకముందే, మన జీవితాల్లో సరిగాలేవని మనం భావించే వాటిని ఎలా పరిష్కరించాలో దేవునికి తెలియజేస్తాము. మన జీవితంలో ఏదో తప్పు జరిగినప్పుడు, మనం వెంటనే “నేను దేవునికి నమ్మకంగా ఉన్నప్పటికీ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నాకన్నా ఎక్కువ పాపం చేసినవారు ఎంతో మంచిగా ఉంటున్నారు కాని నాకు మాత్రమే అన్ని సమస్యలు ఉంటున్నాయి , కలలు నెరవేరడం లేదు ఎందుకు?” అనుకుంటున్నాము. మనం ఏదైనా మంచిని పొందడానికి పాత్రులంకామని పాపులమని చెప్పినప్పటికి మనకు తప్పనిసరిగా కొన్ని అధికారాలు ఇవ్వబడతాయని ఆశించే ధోరణి ఉంటుంది. మనలోని కపటత్వాన్ని మనం చూడగలమా?
“మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగివుంటే, వాటితో తృప్తిచెందాలి” అని 1తిమోతి 6:8లో చెప్పబడింది. “నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు” అని ఫిలిప్పీ 4:19లో చెప్పబడింది. ఈ వాక్యాల నుండి దేవుడు మన అవసరాలన్నింటినీ ఎల్లప్పుడూ చూసుకుంటాడని మనం భావించవచ్చు [మన కోరికలు లేదా డిమాండ్లు కాదు]. మనం ఎటువంటి మంచికి అర్హులం కాకపోయినా ఇంకా దేవుడు ఎప్పుడూ మన అవసరాలన్నింటినీ సమకూర్చడం మనకు సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని జీవితాన్ని చూడాలి. అలాంటి అభిప్రాయం మన అహంకారాన్ని అణిచివేయడంలో కూడా సహాయపడుతుంది [అది ఎప్పుడూ మంచిదే].
ప్రియమైన విశ్వాసి, బహుశా మీరు శారీరకంగా బాధపడుతూ మీ జీవితాంతం స్వస్థత పొందలేకపోవచ్చు. మీరు చాలా పేదవారు ఎప్పుడూ కొరతగానే ఉండవచ్చు; మీరు మీ కెరీర్లో పైకి వెళ్లడం లేదు, ఎప్పటికీ ఉన్నత స్థాయికి వెళ్లలేకపోవచ్చు. మీరు ఒంటరివారు, మీ జీవితాంతం ఒంటరిగా ఉండవచ్చు; మీ పిల్లలు అనారోగ్యంతో ఉండి జీవితాంతం వారిని చూసుకోవలసిన బాధ్యత గల తల్లితండ్రులుగా మీరు ఉండవచ్చును. మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామిగాని పిల్లలు గాని మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించకపోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ, మీరు ఇలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా: “ప్రభువా, మీరు నాకు ఇచ్చిన లేదా నిలిపివేసిన వాటన్నిటిని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను మరియు వాటి గురించి పూర్తిగా సంతృప్తి కలిగివున్నాను. అసంతృప్తితో మిమ్మల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు నన్ను ప్రేమపూర్వకంగా ఉంచిన ప్రతి పరిస్థితిలోనూ మీ నామానికి మహిమ తీసుకురావడానికి దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని చెప్పగలిగి ఉండాలి. అదే నిజమైన సంతృప్తి యొక్క సారాంశం!
జీవితంలో మన భాగ్యాన్ని సంతోషంగా స్వీకరించడం నేర్చుకోవాలి. మన జీవితంలోని అన్ని ప్రతికూలతల గురించి పదేపదే నెమరువేయడం వలన అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతుంది. మనం సమస్యలు కొనితెచ్చుకోవడంలో తీరికలేకుండా ఉండి కొన్నిసార్లు మన ఆశీర్వాదాలను లెక్కించడం మర్చిపోతున్నాము. అసంతృప్తి చంపి సంతృప్తి పెంపొందించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి ఫిలిప్పీ 4: 8లోని నియమాన్ని వర్తింపజేయడం: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.” విశ్వాసులు యేసుతో తన సంబంధంపైన మరియు బైబిలులో సత్యమైనవని, గౌరవనీయమైనవని, న్యాయమైనవని, మరియు పరిశుద్ధమైనవని చెప్పబడినవాటిపైన నిరంతరం దృష్టినిలిపితే వారు నిజమైన సంతృప్తిని మరియు ఆత్మకు సమాధానాన్ని ప్రసాదించే దేవుని సన్నిధిని అనుభవిస్తారు [ఫిలిప్పీ 4: 7, 9].
మనం జీవితంలో పతనం అవ్వడానికి దేవుడు మన జీవితంలో ఏమీ చేయడని దేనిని అనుమతించడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడూ ఆయనకు మహిమ కలగడానికే మరియు అంతిమంగా మన మంచి కోసమే. చాలాసార్లు మనం జీవిత రహస్యాలను అర్థం చేసుకోలేము, నిజానికి మన మన జీవితంలోని అన్నింటికి మన దేవుడే సార్వభౌముడని ఆయన చాలా మంచి దేవుడని గ్రహించినప్పుడు మనకు ఆ అవసరం ఉండదు. మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. మనం ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. మనం ఈ సత్యాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తే, మన హృదయ స్థితి ఎలా ఉంటుందంటే, ఎల్లప్పుడూ సంతృప్తితో విశ్రాంతి కలిగివుంటుంది.
ఎఫెసీ 1: 3లో “ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను” అని చెప్పారు. కొలస్సి 2:10లో “ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు” అని చెప్పారు. మనం ఎలా కనిపిస్తున్నామో లేదా మన దగ్గర ఏమి ఉన్నాయో లేదో అనే దాని గురించి ప్రపంచం ఏమి చెప్పినప్పటికి, క్రీస్తుతో మన సంబంధం కారణంగా మనం ఎంతగానో ఆశీర్వదించబడ్డామని సంపూర్ణంగా ఉన్నామని దేవుడు చెప్పారు. మనకు ఇప్పుడు ఏ కొరత లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” అని దేవుడు వాగ్దానం చేశారు [యెషయా 46:4]. ఇంత అందమైన వాగ్దానాలతో, మనం ఎల్లప్పుడూ సంతోషంగా, “యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు”[కీర్తన 23: 1] అని చెప్పలేమా?