పాపపూరిత కోపము—అది సృష్టించే వినాశనం 7వ భాగము—పాపపూరిత కోపం నుండి మనం ఎలా విడుదల పొందగలము?

English Version: “Sinful Anger – The Havoc It Creates (Part 7)”
పాపపూరిత కోపం అనే అంశంపై మా బ్లాగ్ పోస్ట్‌ల సిరీస్‌లో ఇది 6వ భాగము. పాపపూరిత కోపం యొక్క సాధారణ పరిచయంను 1వ భాగంలో, “కోపం అంటే ఏమిటి?” అనే మొదటి ప్రశ్నను 2వ భాగంలో, పాపపూరిత కోపానికి మూలం ఏమిటి? అనే రెండవ ప్రశ్నను 3వ భాగంలో, పాపపూరిత కోపం యొక్క లక్ష్యం ఎవరు? అనే మూడవ ప్రశ్నను 4వ భాగంలో, పాపపూరిత కోపంలో కనిపించే సాధారణ వ్యక్తీకరణలు ఏమిటి? అనే నాల్గొవ ప్రశ్నని 5వ భాగంలో, పాపపూరిత కోపం యొక్క విధ్వంసక పరిణామాలు ఏమిటి? అనే ఐదవ ప్రశ్నను 6వ భాగంలో చూశాము.
ఈ ముగింపు పోస్ట్‌లో, మనం 6వ ప్రశ్నని పరిశీలిస్తాము:
VI. పాపపూరిత కోపం నుండి మనం ఎలా విడుదల పొందగలము?
పాపపూరిత కోపం నుండి విడుదల కోరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే: దేవుడు అలా చేయమని ఆజ్ఞాపించడమే! రెండు వాక్యభాగాలు ఈ సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. కొలొస్సి 3:8, “ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.” ఎఫెసి 4:31, “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి” అని ఉన్నాయి.
కోపాన్ని వదిలిపెట్టడం వలన సంతోషకరమైన సంబంధాలు ఏర్పడతాయి; హృదయానికి శాంతి ఉంటుంది. కాని పాపపూరిత కోపాన్ని దూరంగా ఉంచడానికి ఇవి ప్రధాన కారణం కాకూడదు. పై వచనాలు సూచిస్తున్నట్లుగా, పాపపూరిత కోపాన్ని విడిచిపెట్టమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి అది మాత్రమే సరిపోతుంది!
బైబిలు ఈ పాపాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తే, దేవుని పిల్లలుగా ఆయన దయతో మనం ఈ పాపాన్ని అధిగమించగలమని అర్థము. కాబట్టి ప్రశ్న ఏమిటంటే మనం ఈ పాపాన్ని ఎలా అధిగమించాలి? ఈ పాపాన్ని అంతం చేసే ఈ యుద్ధంలో మనకు ఎంతగానో సహాయపడే 6 సూచనలు క్రింద ఉన్నాయి.
1. మనకు కోపమనే సమస్య ఉందని ఒప్పుకోవాలి.
తాను చనిపోయానని అందరితో వాదిస్తూ ఉండే ఒక వ్యక్తి గురించి నేను చదివాను. అతడు చెబుతున్నది తప్పు అని నిరూపించడానికి అతని భార్య అతన్ని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లింది. డాక్టర్ ఆ వ్యక్తిని, చనిపోయినవారికి రక్తస్రావం అవుతుందా? అని అడిగాడు, ఆ వ్యక్తి అవ్వదు అని చెప్పాడు. అప్పుడు ఆ డాక్టర్ ఒక పిన్ తీసుకొని ఆ వ్యక్తి చేతికి గుచ్చగానే రక్తం వచ్చింది. అప్పుడు డాక్టర్ ఆ వ్యక్తిని, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, నేను తప్పు చెప్పానని అనుకుంటున్నాను. చనిపోయిన వారికి కూడా రక్తస్రావం అవుతుంది అన్నాడు.
చూడండి, కొన్నిసార్లు మనం ఆ వ్యక్తిలానే ఉంటాము. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు కోపమనే సమస్య ఉందని గమనించవచ్చు. కానీ మనం దానిని స్వయంగా చూడడానికి ఇష్టపడకపోతే, మనం ఎప్పటికీ దాని నుండి విడుదలను కోరుకోలేము. కాబట్టి, మనకు కోపమనే సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి మన కళ్ళు తెరిపించమని, దానిని అంగీకరించేంత వినయాన్ని దయచేయమని ప్రభువును అడగాలి. దావీదులా మనం కూడా ఎల్లప్పుడూ ఇలా ప్రార్థించాలి, “23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. 24 నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము; నిత్యమార్గమున నన్ను నడిపింపుము.”
2. ఈ పాపం నుండి విడుదల పొందాలని మనం హృదయపూర్వకంగా కోరుకోవాలి.
మనకు సమస్య ఉందని అంగీకరించడం ఒక విషయమైతే దాన్ని వదిలించుకోవాలనుకోవడం పూర్తిగా మరొక విషయము. పాపం నుండి అది ఏ పాపమైనా సరే దాని నుండి విడుదల పొందడం అంత తేలికైన విషయం కాదు. మనం నిరంతరం మూడు బలమైన శత్రువులతో పోరాడవలసి ఉంది.
(ఎ) మన శరీరం – అది తేలికగా లొంగదు.
(బి) సాతాను – మన విశ్వాసాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరి పరిశుద్ధత కోసం మనం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాడు.
(సి) లోకం – దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో మన విశ్వాసాన్ని చెడగొట్టాలనే లక్ష్యాన్ని కలిగివుంది.
అయితే, ఈ శత్రువులను ఎదిరించడం అంత సులభం కాదు. దానికి గొప్ప పట్టుదల అవసరం, మనం ఈ పాపం నుండి విడుదలను నిరంతరం కోరుకుంటేనే అది వస్తుంది. అలాంటి కోరికను పెంపొందించుకోవడానికి ఒక మార్గం దేవుని యొక్క పరిశుద్ధతను మరియు పాపంలో ఉన్న కళంకాన్ని నిరంతరం ధ్యానించడమే.
3. మన ఆలోచనా విధానాలను మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి.
మనం గత పోస్ట్‌లలో అధ్యయనం చేసినట్లుగా, పాపపూరిత కోపానికి హృదయమే మూలము [మార్కు 7:21-23, యాకోబు 4:1-2]. కాబట్టి, మనం ఈ పాపం నుండి విడుదల పొందాలని కోరుకోవడం అంటే కేవలం కొన్ని బాహ్య మార్పులు చేయడం మాత్రమే కాదు. మనం ఈ పాపాన్ని మూలాల నుండి వదిలించుకోవాలనుకుంటే, ఈ సమస్యకు మూలమైన తప్పుడు హృదయ కోరికలను తెలుసుకోవాలి. మన ఆలోచనా విధానాలను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మరోవిధంగా చెప్పాలంటే, మన మురికి ఆలోచనను పరిశుద్ధమైన ఆలోచనతో భర్తీ చేయాలి. బైబిలు దీనిని గురించే మనలను “వదులుకోమని” మరియు “ధరించుకోవాలని” పిలుపునిస్తుంది [ఎఫెసి 4:22-24, కొలొసి 3:9-10].
ఈ సిరీస్‌లోని 3వ భాగంలో, పాపపూరిత కోపం యొక్క మూలాన్ని చర్చిస్తున్నప్పుడు, కోపంతో ప్రేరేపణలకు దారితీసే తప్పుడు ఆలోచనల ఉదాహరణను మనం చూశాము [ఇంకా చదవడానికి ముందు దానిని త్వరగా సమీక్షించడం సహాయకరంగా ఉండవచ్చు]. పాపపూరిత కోపం విషయంలో కేవలం కొన్ని కొమ్మలను కత్తిరించడం లేదా కొన్ని ఆకులను తెంపడం కంటే లోతుగా పరిశోధించి సమస్య యొక్క మూలాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కోపం ఎల్లప్పుడూ మంచుకొండ యొక్క కొనలా ఉంటుందని అని మనం గుర్తుంచుకోవాలి. దాని దిగువ భాగాన్ని చూడడమే ఇక్కడున్న సవాలు.
మన చర్యలన్నీ మన ఆలోచనల ఫలితమే. కాబట్టి మనం మన ఆలోచనలను మార్చుకుంటే, మన చర్యలు వాటంతట అవే మారతాయి.
“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని రోమా 12:2లో చెప్పిన దానిని మనం గుర్తుచేసుకోవాలి. సామెతలు 4:23లో కూడా “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని మనకు స్పష్టంగా గుర్తుచేయబడింది. మనస్సు మరియు హృదయం అనేవి మనలో ఆలోచన ఉత్పన్నమయ్యే భాగాన్ని సూచిస్తాయి. ఆ ఆలోచన త్వరగా గాని తరువాత గాని క్రియారూపంగా మారుతుంది. కాబట్టి, మూలం [మనస్సు/హృదయం] ఎంత శుభ్రంగా ఉంటే చర్య [ప్రవర్తన] అంత శుభ్రంగా ఉంటుంది.
లోతైన సమస్యలను ఎదుర్కోవటానికి ఇష్టపడరు కాబట్టి మనలో చాలా మంది కోపంతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు. దానికి కారణం మన అంతర్గత కోరికలను మార్చుకోవడం మనకు ఇష్టం ఉండదు. ఈ పాపం గురించి కొన్నిసార్లు నేరారోపణ చేసినప్పటికీ మన కోప వైఖరితో మనం సౌకర్యంగానే ఉంటాము. కాబట్టి మనం కేవలం కొన్ని బాహ్య మార్పులపైనే దృష్టి పెడతాము. మనం ఈ పాపాన్ని తొలగించాలనుకుంటున్నాము కాని పూర్తిగా కాదు, ప్రస్తుతానికి కాదు! అవి మనకు అసౌకర్యాన్ని కలిగించనంత కాలం మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ అలాంటి ఆలోచనలు ఎక్కువ పాపాలకు దారితీస్తాయి. ఈ పాపాన్ని ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం హృదయాన్ని పూర్తి మార్చుకోవడమే. మన మనస్సులను బైబిలు సత్యంతో నింపాలి, అది శుభ్రమైన ఆలోచనలకు దారి తీస్తుంది, ఫలితంగా చర్యలు శుభ్రంగా ఉంటాయి [5వ పాయింట్‌లో దాని గురించి మరింత వివరంగా చూద్దాం].
4. మనం కోపాన్ని ప్రేరేపించే అంశాలను తెలుసుకుని వాటితో తెలివిగా వ్యవహరించాలి.
సామెతలు 22:3 “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని వ్రాయబడింది. కాబట్టి, ఆ సమయాలలో మనకు కోపం ఎందుకు వచ్చిందో పరిశీలించి తెలుసుకోవడానికి మనం తెలివిగా ఉండాలి. కారణాలను గుర్తించడానికి వాటిని మరింత ప్రభావవంతంగా ఎదుర్కోడానికి అటువంటి పరిశీలన మనకు బాగా సహాయపడుతుంది. ఆ కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చును. ఇక్కడ కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి: వివిధ సమస్యల కారణంగా [పని, కుటుంబం, ఆరోగ్యం] కలిగే ఒత్తిడి, నిద్రలేమి, అవాస్తవమైన అంచనాలు, మనల్ని బాధపెట్టిన వారి పట్ల ద్వేషం, అసహనం మొదలైనవి. ఆ జాబితాలో ఇంకా చాలా ఉంటాయి.
మనకు కోపం తెచ్చే కారణాలను మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వెదకవలసిన అవసరం ఉంది. మనం వాటిని గుర్తించిన తర్వాత, మనం పాపపూరితమైన స్పందన ఇచ్చేలా ప్రేరేపించే హృదయ ఉద్దేశాలను తెలుసుకోడానికి లోతుగా పరిశోధించాలి మరియు ఆ పాపపు ఉద్దేశాలను సరిగ్గా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, ఒకరి అంచనాలను అందుకోవడంలో మనం విఫలమైనందుకు మనకు కోపం వస్తే, ఇతరుల ప్రశంసలు మరియు ఆమోదం కోసం మనమెందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇతరుల ముందు మంచిగా కనిపించాలనే అహంకారమా? విఫలం అయినప్పుడు మనకు కోపం మనపై వస్తుందా లేక ఇతరులపై వస్తుందా? మనం ఒకసారి అసలు కారణాన్ని గుర్తిస్తే దానిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలము.
ఇతరుల అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వడమనే పైన పేర్కొన్న దృష్టాంతానికి పరిష్కారం, క్రైస్తవజీవనం అనేది ప్రదర్శనకు సంబంధించినది కాదని నిరంతరం గుర్తుంచుకోవడమే. మనమింకా తన శత్రువులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు మనకు ఉన్నాడని [రోమా 5:8] ఇప్పుడు మరియు ఎప్పుడూ ఏదీ ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదనే దానిపై నమ్మిక ఉంచడమే [రోమా 8:38-39]. ఈ వాస్తవం గురించిన నమ్మిక మన ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించాలి. ఇతరుల [లేదా స్వీయ] అంచనాలను అందుకోలేక కోపం వచ్చినప్పుడు “నాలో వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు; నేను ఆ సత్యాన్ని నమ్ముతున్నాను” అని మనం ఆలోచించాలి.
ఇప్పుడు మనం మురికి ఆలోచనని పరిశుద్ధమైన ఆలోచనతో భర్తీ చేశాము. అంటే ఇతరుల భావాలను మనం పట్టించుకోకూడదని దీని అర్థం కాదు కాని మనం ఎప్పుడూ ఇతరులను ప్రేమించాలని వారికి ఆశీర్వాదంగా ఉండాలని కోరుకోవాలి. అయితే ఈ రకమైన ఆలోచన వలన నిత్యం ఇతరుల పెదవుల నుండి ఆమోదాన్ని ప్రశంసలను కోరుకునే జీవితాన్ని గడుపుతాము. అలాంటి విధానం ఇతరులపైన మనపైన ఉన్న కోపపు ఆలోచనలలో ¾ వంతును చంపుతుంది.
మన బలహీనతలను విశ్లేషించి, మనం పాపపూరితంగా స్పందించేలా మనల్ని ప్రేరేపించే హృదయ ఉద్దేశాలను తెలుసుకునేంత లోతుగా పరిశోధించడమే ప్రధాన సమస్య. ఇది ఉల్లిపాయ పొరలను తీయడం వంటి బాధాకరమైన ప్రక్రియ. ఒక్కొక్క పొర తీసినప్పుడు మరిన్ని కన్నీళ్లు వస్తాయి. కానీ అది అవసరం! మనం ఉద్దేశాలను కనుగొన్న తర్వాత, తప్పుడు కోరికలను లేఖనాలకు అనుగుణంగా ఉండే కోరికలతో భర్తీ చేయడానికి మనం ప్రయత్నించాలి.
5. మనం క్రమంగా లేఖనాలను ధ్యానించాలి వాటిని కంఠస్థం చేయాలి.
యేసు తన ప్రధాన యాజక ప్రార్థనలో, “సత్యమందు 2 వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము” [యోహాను 17:17]అని అన్నారు. కీర్తనలు 119:11లో కీర్తనాకారుడు “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” అన్నాడు. పౌలు “దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి” [ఎఫెసి 6:17] అన్నాడు. దీనర్థం, మనం మరింత పరిశుద్ధంగా [అంటే, మరింత పవిత్రంగా] మారడానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే ఆయుధం దేవుని వాక్యమే! కేవలం బైబిలు కలిగి ఉన్నంత మాత్రాన శత్రువును, లోకాన్ని మరియు శరీరాన్ని జయించలేము! మన ఆలోచనలను ప్రభావితం చేసి చివరికి మన చర్యలను కూడా ప్రభావితం చేసేలా బైబిల్లోని విషయాలు మనం గ్రహించాలి.
దురదృష్టవశాత్తు, చాలామంది క్రైస్తవులకు వాక్యధ్యానం మరియు కంఠస్థం అనేవి వింత పదాలుగా ఉన్నాయి. ఈ ప్రాథమిక బైబిలు సూత్రాలను ఆచరించలేనంత బిజీగా మనం ఉన్నాము. మనం పాపం వలన గాయపడడంలో ఏ ఆశ్చర్యం లేదు. కానీ మనం నిజంగా దేవుని మాటలను తీసుకుని వాటిని నిరంతరం ప్రతిబింబిస్తే, దేవుని దయతో మనం ఈ పాపాన్ని సమర్థవంతంగా చంపగలము.
ఒక సూచన ఏమిటంటే ఈ బ్లాగ్ పోస్ట్‌లను పరిశీలించి కోపానికి సంబంధించిన 6 వచనాలను తీసుకోండి. వారానికి ఒక వాక్యం చొప్పున 6 వారాలు ఆ వచనాలను ధ్యానించి ప్రార్థించండి. అది 6 వచనాలు పూర్తి అయిన తర్వాత మరిన్ని వచనాలను చూడండి. అలాగే ఇతర అంశాలను కూడా చేర్చండి. మీ భూమి మీద జీవించినంత కాలం దీనిని చేస్తూ ఉండండి. అది ఎంతటి మార్పును సృష్టిస్తుందో కదా! లేఖనాలను ధ్యానించి కంఠస్థం చేయడం వలన పాపపు ఆలోచనా విధానాలను తద్వారా పాపపు చర్యలను తొలగించడంలో సహాయపడే ఆవశ్యక సాధనాలుగా అవి ఉపయోగపడతాయి.
6. మనల్ని మనం హృదయపూర్వక ప్రార్థనకు అర్పించుకోవాలి.
లేఖనాలు మనతో దేవుడు మాట్లాడే మాటలైతే, పాపపూరిత కోపాన్ని జయించే ఈ యుద్ధంలో గెలవాలని మనం ఆశించినట్లయితే మనం కూడా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అనేది పాపాన్ని చంపడానికి మనకు సహాయపడే వానిపై మన పూర్తి ఆధారపడటం యొక్క వినయపూర్వకమైన చెప్పడానికి అంతిమ రూపము.
ప్రభువా, నేను ఒంటరిగా ఇది చేయలేను. నాకు మీరు చాలా అవసరం. దయచేసి ఈ యుద్ధంలో విజయం సాధించడానికి మీ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయండి. నేను నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను; మీకు వ్యతిరేకంగా పాపం చేయను. దయచేసి నాకు సహాయం చేయండి. అని మనం ప్రార్థన చేయాలి. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” అని యేసే స్వయంగా అన్నారు [యోహాను 15:5]. దేవుని మహిమ కోసం కూడా అని ఆయన ఉద్దేశ్యము. పాపంతో వ్యవహరించడం అంటే యుద్ధం. పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేసే క్రీస్తు సహాయం లేకుండా కోప ఆత్మను మనం విజయవంతంగా తొలగించలేము.
అవసరమైనప్పుడు, పరిశుద్ధత కోసం ఈ యుద్ధంలో మరింత తీవ్రంగా పోరాడడానికి ఉపవాసం మరొక అద్భుతమైన మార్గము. మీరు ఎన్నడూ ఉపవాసం చేయకపోతే, నెమ్మదిగా ప్రారంభించండి [అల్పాహారం మాని సగం రోజు]. ఆ సమయాన్ని ప్రార్థించడానికి, పాపపు ఒప్పుకోలు ముఖ్యంగా కోపమనే పాపాన్ని ఒప్పుకోవడానికి ఆయన చూపించిన కృపలకు దేవుని స్తుతించడానికి లేఖనాల ధ్యానం కోసం ఉపయోగించండి. ఈ పాపంతో వ్యవహరించడంలో మీరు చాలా పట్టుదలతో ఉన్నారని దేవునికి తెలియజేయండి. ఆయన మీకు సహాయం చేస్తాడు.
యాకోబు 4:1-3లో మన కోపానికి మూలమైన హృదయం యొక్క పాపపూరిత కోరికలను తెలియచేసిన తర్వాత రచయిత యాకోబు 4:6-10లో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించాడు. హృదయపూర్వక దుఃఖంతో కన్నీళ్లతో కూడిన పాపపు ఒప్పుకోలు ద్వారా మనల్ని మనం తగ్గించుకుని మరియు సమర్పించుకోడానికి ఆయన మనల్ని పిలుస్తున్నారు. దేవుడు మన దగ్గరికి వస్తాడు అనే వాగ్దానం యొక్క అర్థం ఏమిటంటే ఆయన మన ప్రార్థనలను వింటాడు! మనం ఒప్పుకున్నప్పుడు అది మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉండాలి. ప్రభువా, నా అహంకారం నేను పడిపోడానికి కారణమైంది, నేను మీకు వ్యతిరేకంగాను పలానా వారికి వ్యతిరేకంగా పాపం చేశాను, నా చర్యకు నేను పూర్తి బాధ్యత వహిస్తాను. దయచేసి నా ఒప్పుకోలు అంగీకరించండి. నాకు సహాయం చేయండి ప్రభూ! నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను -వంటి పదాలు మనలోని పశ్చాత్తాపాన్ని తెలియచేయాలి.
మన కోపంలో పెద్దగా మార్పు కనిపించకపోవడం వలన విడిచిపెట్టాలనే శోధన మనకు కలిగినప్పుడు “విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని” [లూకా 18:1] మన ప్రభువు స్వయంగా చెప్పిన మాటలను మనం గుర్తుంచుకుందాం. ప్రార్థన అనేది విశ్వాసం యొక్క చర్య మరలా మరలా దేవుని సింహాసన గదిలోకి చొచ్చుకుపోతుంది. విశ్వాసం ద్వారానే మనం ఆయన దయను కృపను పొందుతామని నమ్ముతున్నాము. హెబ్రీ పత్రికలో “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” [హెబ్రీ 4:16] అని వ్రాయబడి ఉంది.
ప్రార్థనలో తన వద్దకు రావాలని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈ ఆహ్వానాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక రోజులో మనందరికీ 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ముప్పై నిమిషాలు ఈ 24 గంటల్లో దాదాపు 2%కి సమానం. మనకిచ్చిన రోజులో కనీసం రెండు శాతాన్ని మన ప్రార్థనలకు స్తుతులకు అర్హుడైన వానికి ఇస్తున్నామా? మనం పిలువబడిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేసే వ్యక్తిని మనం వెతుకుతామా? పాపపూరిత కోపంపై చేసే ఈ యుద్ధంలో గెలవాలని మనం కోరుకుంటే, పట్టుదలతో కూడిన ప్రార్థనకు మనల్ని మనం తప్పనిసరిగా అప్పగించుకోవాలి.
కాబట్టి, ఈ యుద్ధంలో మనకు సహాయపడే ఆశాజనకమైన 6 సూచనలు ఉన్నాయి. మనం నిజమైన విడుదల కోసం ప్రయత్నిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి . మనం ఈ పాపాన్ని తక్షణమే పరిష్కరించకపోతే, మన జీవితాలపై సాతానుకి ఎక్కువ పట్టును అందించినట్లే అవుతుంది. అది ఎఫెసీయులు 4:26-27లో, “26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. 27 అపవాదికి చోటియ్యకుడి” అని వ్రాయబడినది. ఎంతో కాలం నుండి హృదయంలో స్థిరపడి ఉన్న కోపం గొప్ప వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి, ఈ రోజు నుండి ఈ పాపాన్ని అంతం చేయాలనే పవిత్ర సంకల్పాన్ని పెంపొందించుకోవాలని కోరుకుందాం.
ఈ బ్లాగును చదువుతున్న వారికి మరియు మీ కోప ప్రేలపణలకు మరియు దాని ఫలితంగా మీరు అనుభవిస్తున్న పర్యవసానాల గురించి లోతుగా విచారిస్తున్న వారి కోసం నేను కొన్ని ఓదార్పు మాటలను వ్యక్తిగతం అందిస్తున్నాను.
మీకు వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రభువైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన దగ్గరికి రమ్మని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. దెబ్బతిన్న ఆ సంబంధాలు మారవచ్చు లేదా మారకపోవచ్చు. కానీ నేను చేసే వాగ్దానం ఏమిటంటే: మీరు ఈ విషయంలో క్రీస్తును ఆయన చిత్తాన్ని వెదికినప్పుడు ఆయన మిమ్మల్ని మార్చినప్పుడు తన శాంతిని మీకు ఇస్తాడు . కష్టకాలంలో కూడా ఆయన తన సన్నిధిలోని ఆనందాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి, వదిలిపెట్టవద్దు.
ప్రభువైన యేసు ఇప్పటికీ హృదయాలను మార్చే పనిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, పాపపు బంధకాలను మిరి ముఖ్యంగా అవి చాలా కాలంగా ఉన్నప్పటికీ ఆయన తన శక్తితో వాటిని విచ్ఛిన్నం చేస్తారు. విశ్వాసంతో ఆయనను వెదకండి, మీరు ఎప్పటికీ నిరాశ చెందరు. అది మీరు ఆయన ముఖాన్ని చూసి కృతజ్ఞతతో మీ జీవితాంతం ఆయనని ఆరాధించే సమయానికి సంబంధంచినది మాత్రమే. కాబట్టి, చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉండండి! ధైర్యాన్ని కోల్పోవద్దు!