దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు/తీర్మానాలు—3వ భాగము

(English version: “12 Commitments of a Godly Church – Part 3”)
దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు /తీర్మానాలు అనే ఈ సిరీస్‌లోని 1&2 భాగాలలో మనం దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లలో మొదటి ఎనిమిది చూశాము. అవి: (1) రక్షణ సభ్యత్వము (2) బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం (3) నియమాలను పాటించాలి (4) సహవాసము (5) ఒకరినొకరు ప్రేమించవలెను (6) ప్రార్థన (7) దేవుని స్తుతించడము (8) సువార్తీకరణ.
ఈ చివరి భాగంలో మనం చివరి నాలుగు కట్టుబాట్లను /తీర్మానాలను చూద్దాము.
తీర్మానం # 9. పరిశుద్ధత
పరిశుద్ధమైన క్రీస్తు పరిశుద్ధమైన సంఘాన్ని కోరుకుంటాడు. పరిశుద్ధత కలిగిన సంఘాల గుండా పరిశుద్ధమైన క్రీస్తు నడిచారని ప్రకటన గ్రంథంలోని 2 మరియు 3 అధ్యాయాలు మనకు తెలియచేస్తున్నాయి. ఇది ఆది సంఘంలోనే దేవుడు ప్రారంభించిన విషయము.
అపొ.కా 5లో, తాము ఇచ్చే కానుక గురించి పేతురుకు అంతే కాకుండా పరిశుద్ధాత్మకు సైతం అబద్ధం చెప్పిన అననీయా మరియు సప్పీరాల గురించి చూస్తాము. అబద్ధం, వంచన అనే పాపం చేసినప్పుడు దేవుడు ఏమి చేశాడో అపొ.కా 5:3-11 మనకు వివరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మరణం. నిజమే మరణం. దేవుడు చాలా కఠినమైనవాడని, ఇది కేవలం చిన్న అబద్ధం కొంచెం డబ్బే కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడే మనం ఆరాధించే దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు అని మనము గుర్తుంచుకోవాలి. ఆయన పాపవిషయమై దయ చూపించరు. మరిముఖ్యంగా ఆయన తన కుమారుని విలువైన రక్తంతో కొన్న సంఘం విషయంలో అసలు [అపొ.కా 20:28] కనికరించరు.
పాపం విషయంలో సంఘాలు చూసి చూడనట్లు ఉండటానికి ఆసక్తిగా ఉన్న కాలంలో మరియు యుగంలో, ఒక దైవిక సంఘం పరిశుద్ధతను తేలికగా తీసుకోదు మరియు తీసుకోకూడదు. స్థానిక సంఘంలో పాపాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో యేసు స్వయంగా మత్తయి 18:15-20లో వివరించిన విధానాన్ని అనుసరించాలి [1 కొరింథీ 5 మరియు 2 థెస్సలొ 3:10-15 కూడా చూడండి]. పశ్చాత్తాపపడని వారిని సంఘం నుండి బయటకు పంపే బాధాకరమైన అనుభవాన్ని దైవభక్తిగల సంఘం ఎదుర్కొనే సందర్భాలు రావచ్చు. పశ్చాత్తాపపడని పాపంతో వ్యవహరించేటప్పుడు ఆనందం ఉండదు కాబట్టి బాధాకరమైనదని చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ, తన సంఘానికి ఏది మంచిదో ఆయనకు తెలుసు కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రభువు మనకు ఆజ్ఞాపించిన దానిని చేసినందుకు మనం ఎన్నటికీ చింతించము. మన పని క్రీస్తును ప్రశ్నించడం కాదు, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలకు లోబడడమే.
తీర్మానం# 10. దైవభక్తిగల నాయకత్వం
ఆది సంఘంలో నాయకులుగా ఉన్న అపొస్తలులలో 11 మందిని యేసు స్వయంగా ఎన్నుకున్నారు 12వ వాడైన మత్తీయ ప్రార్థన ద్వారా ప్రభువుచే ఎన్నుకోబడ్డాడు [అపొ.కా 1:23-26]. కాబట్టి వీరు అర్హులు. సంఘం పెరిగేకొద్దీ నాయకత్వ నిబద్ధత పెరిగింది. పౌలు సంఘాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు అతడు నాయకులను లేవనెత్తడానికి కట్టుబడి ఉన్నాడు, అపొ.కా 14:23లో, “పౌలు బర్నబాలు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.”
నిరుపేదలకు వితంతువులకు ఆహారం పంపిణీ చేయడం వంటి వివిధ పరిచర్యలలో పాల్గొనడానికి అర్హులైనవారిని ఎంచుకోమని ఈ 12 మంది చెప్పారు. అపొ.కా 6:3లో “సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము” అని ఉంది. ఎవరికి బడితే వారికి కాదు ఆత్మతో నిండినవారికి ఆ బాధ్యత అప్పగించారు. తర్వాతి కాలంలో పెద్దలని పిలవబడిన డీకన్ వ్యవస్థకు ఇదే ఆరంభము. ఒక సంఘం దాని నాయకుని మించి ఎదగదు కాబట్టి, స్థానిక సంఘాన్ని నడిపించడానికి దైవభక్తిగలవారు అవసరము.
1 తిమోతి 3:1-7, తీతు 1:6-9 మరియు 1 పేతురు 5:1-3లో పెద్దలకు ఉండవలసిన అర్హతలు వివరించబడ్డాయి. డీకన్‌లకు ఉండవలసిన అర్హతలు 1 తిమోతి 3:8-13లో వివరించబడ్డాయి. లేఖనాల ప్రకారం అర్హత కలిగిన వారినే కాకుండా పిలుపు అందుకుని మనస్ఫూర్తిగా తమ సంఘానినకి కట్టుబడి ఉండే దైవభక్తి గల పెద్దలను [పాస్టర్లను కూడా] ప్రభువు లేవనెత్తాలని దైవభక్తిగల సంఘం కోరుకోవాలి. వారు సంఘసభ్యులను నడిపించడం, పోషించడం మరియు సంరక్షించే పనికి కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉండాలి. పాస్టర్లకు వారి విధులలో సహాయం చేయడానికి దైవభక్తి గల డీకన్‌లను లేవనెత్తడానికి కూడా దైవభక్తిగల సంఘం ప్రయత్నించాలి. ప్రభువు తన ఇష్టానుసారంగా తన కాలంలో ఈ స్థానాలకు తగినవారిని లేవనెత్తుతారు.
తీర్మానం# 11. మిషన్లు
అపొ. కా 1:8లో యేసు తన అనుచరులను యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూమి అంచుల వరకు తన సాక్షులుగా ఉండమని ఆజ్ఞాపించాడని వ్రాయబడింది: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.” సరిగ్గా అదే జరిగింది! ఆది సంఘం కేవలం తామున్న పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతలకు సువార్త తీసుకుని వెళ్లడంపై కూడా దృష్టి పెట్టింది. సమరయలో సువార్త ప్రకటించబడిందని అపొ.కా 8లో వ్రాయబడింది. ఇది హింసచెలరేగిన కారణంగా జరిగిందని అంగీకరించాలి, కాని చెదిరిపోయినవారు వారు తాము వెళ్లిన ప్రతిచోట సువార్తను ప్రకటించారు [అపొ.కా 8:4].
తరువాత అపొ.కా 10లో పేతురు అన్యుడైన కొర్నేలీకి సువార్త చెప్పడానికి వెళ్తాడు; అలా అన్యుల సంఘం ఏర్పడింది. అపొ.కా 13వ అధ్యాయంలో ప్రపంచవ్యాప్త మిషన్లను అధికారికంగా ప్రారంభించడాన్ని చూస్తాము. అపొ.కా 13:1-3లో “1 అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. 2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. 3 అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి” అని చదువుతాము. సువార్త రోమా వరకు చేరుకోవడంతో అపొస్తలుల కార్యములు ముగుస్తుంది [అపొ.కా 28]. ఇది అనుకోకుండా జరిగింది కాదు. సువార్తను భూమి అంచుల వరకు తీసుకువెళ్లమన్న ఆదేశాన్ని చాలా తీవ్రంగా తీసుకున్న తొలి విశ్వాసుల ప్రయత్నాల ద్వారా దేవుడు తన కృపతో దీనిని జరిగించారు [అపొ.కా 1:8].
దైవభక్తిగల సంఘం మిషన్లకు మద్దతు ఇవ్వడానికి సాధ్యమైతే ఉదారంగా ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. సంఘ స్థాపన, బైబిలు అనువాదపని, మరియు చిన్న పిల్లలకు సువార్త అందించే క్రైస్తవ అనాధ శరణాలయాలపై దృష్టి సారించిన మిషనరీలకు మద్దతు ఇవ్వాలి. సువార్తను ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లడానికి ఇష్టపడేవారిని ఆ పిలుపు ఉన్న మిషనరీలను లేవనెత్తడంపై కూడా దైవభక్తి గల సంఘం దృష్టి పెట్టాలి. మిషన్‌లకు దేవుడు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడో ప్రజలకు బోధించడంతో పాటు ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా నాయకులు ఈ విషయంలో దేవుని హృదయాన్ని వెంబడించేలా సంఘాన్ని కదిలించగలదు.
తీర్మానం #12. దేవుని భయము
ఇది పన్నెండు అంశాలలో చివరిదే కానీ విలువైనది. దేవుని భయాన్ని కలిగివుండడంలో ఆది సంఘానికున్న నిబద్ధతను మనం చూస్తాము. దేవుని భయమే ప్రతిదానికీ పునాది. స్థానిక సంఘవిషయానికి వస్తే దానిలో ఎందుకు భేదం ఉంటుంది? ఉండదు.
ఆది సంఘాన్ని ఎక్కువగా బాధించినవారిలో ఒకడైన పౌలు మారుమనస్సు పొందిన తరువాత, అపొ.కా 9:31 లో మనం ఇలా చదువుతాము: “కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.” అపొ.కా 5లో కూడా దేవుడు అననీయా మరియు సప్పీరాలు చేసిన పాపానికి వారికి విధించిన శిక్షను చూస్తాము. మనం 11వ వచనంలో సంఘమంతటికిని, ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగిందని చదువుతాము.
సంఘం దేవునికి భయపడుతూ ఆయన పట్ల భయభక్తులతో ఉండకపోతే ఆయనకు భయపడమని ఈ లోకానికి ఆయన వైపు తిరగాలని ప్రజలకు ఎలా చెప్పగలుగుతుంది? దేవునికి భయపడడాన్ని విలువలేని దానిగా అసహ్యకరమైన కాలం చెల్లిన అంశంగా పరిగణించబడే రోజులలో, కాలంలో సంఘం కచ్చితంగా దేవుని భయం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉగ్రతకు భయపడాల్సిందే. పాపం, ముఖ్యంగా సంఘంలో ఉండే పాపం దేవునికి చాలా అసహ్యము. దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడు. 2000 ఏళ్లు గడిచినా దాని విషయంలో ఆయన మనస్సు మార్చుకోలేదు.
అననీయా మరియు సప్పీరాలు గుర్తున్నారా? 1 కొరింథీ 11లో పశ్చాత్తాపపడని పాపంతో ప్రభురాత్రి భోజనంలో పాల్గొని మరణశిక్ష పొందిన విశ్వాసులున్న కొరింథీ సంఘం గుర్తుందా? ఈ పనులు మనం దేవుని భయం కలిగి ఉండడానికి సహాయపడతాయి. అది ఒక్కసారి మాత్రమే కాదు కానీ సంఘం నిత్యం దేవుని భయం కలిగివుండాలి. సంఘసభ్యులు ఏమి చెబుతున్నారు, వారు ఏమి చూస్తున్నారు, వారు ఏమి వెంబడిస్తారు మరియు వారి హృదయాలలో వారు ఏమనుకుంటున్నారనే [ఇవి కేవలం వారికి మరియు దేవునికి మాత్రమే తెలుసు] దాని ద్వారా ఇది రుజువు చేయబడుతుంది. సామెతలు 28:14లో “నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడని” వ్రాయబడి ఉంది. నాయకునితో సహా దైవభక్తిగల సంఘంలోని ప్రతి సభ్యుని వైఖరి అన్ని సమయాలలో ఇలానే ఉండాలి.
దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు:
(1) రక్షణ సభ్యత్వము
(2) బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం
(3) నియమాలను పాటించాలి
(4) సహవాసము
(5) ఒకరినొకరు ప్రేమించవలెను
(6) ప్రార్థన
(7) దేవుని స్తుతించడము
(8) సువార్తీకరణ
(9) పరిశుద్ధత
(10) దైవభక్తిగల నాయకత్వం
(11) మిషన్లు మరియు
(12) దేవుని భయము.
“నా యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అనే సుందరమైన పాత కీర్తన నాకు చాలా ఇష్టము. మనం యేసును ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, ఆయన తన విలువైన రక్తంతో కొన్న సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి. యేసు తన సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాడు [మత్తయి 16:18]. సమాధి ద్వారాలు ఎన్నటికీ జయించలేవు. ప్రియ పాఠకుడా, బైబిలును విశ్వాసించి బైబిలును బోధించే మీ స్థానిక సంఘం పట్ల మీ నిబద్ధతను మరింత తీవ్రంగా తీసుకుంటారా? మీరు నాయకులుగా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని [ఎఫెసి 3:20-21] ఉంచిన సంఘాన్ని దేవుడు మహిమపరచబడేలా నడిపించడంలో మీకు సహాయం చేయమని క్రీస్తు ద్వారా మీరు దేవునికి మొరపెడతారా? మీ ప్రయత్నాలను వదులుకోవద్దు. ఆయన అర్హుడు!