4 అడ్డంకులను విరగ్గొట్టిన రక్షకుడైన యేసు

Posted byTelugu Editor May 9, 2023 Comments:0

(English Version: Jesus The Savior Breaks Down 4 Barriers To Save People )

క్రైస్తవునిగా మారిన యూదుడైన మార్వీన్ రోసంతాల్ ఇలా అన్నారు, నేను యేసే మెస్సియా అని ఒప్పుకోవడానికి మత్తయి 1:1-17లో ఇవ్వబడిన యేసు వంశావళియే ఒక ఆధారము. యూఎస్ నౌకాదళంలో సభ్యునిగా సుదూరం నుండి లక్ష్యాలను ఖచ్చితంగా చేధించగల తన అనుభవం నుండి మార్వీన్, మత్తయిలో ఇవ్వబడిన వంశావళి 10 కి 10 సార్లు లక్ష్యాన్ని చేధించిందని యూదులైనవారికి  చెప్పాడు.

యూదులు పాతనిబంధన కాలం నుండి వంశావళులను చాలా ప్రత్యేకంగా చూస్తారు, అది భూమి పంపకాలు కావచ్చు లేదా యాజకత్వం కావచ్చు లేదా రాజుల విషయమైనా కావచ్చును. మత్తయి యేసే మెస్సియా అని, “ఆయనే దావీదు కుమారుడని” మరియు “అబ్రాహాము కుమారుడని” (మత్తయి1:1) అసాధారణమైన విషయాన్ని చెప్పాడు కనుక అతడు దానిని నిరూపించవలసివుంది, ఎందుకంటే యేసు మీద విశ్వాసం ఉంచమని అతడు ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ కారణంగానే అతడు దావీదు ద్వారా అబ్రాహాము వరకు యేసు వంశావళినంతటిని తెలియచేశాడు. మత్తయి తన గతజీవితంలో పన్నువసూలుచేసేవానిగా ఉన్నప్పటికి అతడు వంశావళి జాబితాను తయారుచేయడంలో చాలా నిష్ణాతుడు ఎందుకంటే తన వృత్తిలో భాగంగా కుటుంబసభ్యులను ఆధారంగా చేసుకుని అతడు సరైన పన్నులు వసూలు చేసేవాడు.

ఏమైనప్పటికి, మనలో చాలామంది యూదులు కారు కాబట్టి బైబిలులో పొందుపరచబడిన వంశావళులు మనకు అంత ఆసక్తికరంగా ఉండకపోయినా అవి దేవుని ప్రేరణతో వ్రాయబడినవి మరియు అవి మనకెంతో ఉపయోగకరము (2 తిమోతి 3:16-17). ఈ ప్రచురణలో ఈ పేరాలన్ని పేర్లతో నిండి ఉన్నప్పటికి అవి మనకెంతో ప్రయోజనకరమని చూపాలని ఆశిస్తున్నాను; ఎందుకంటే, ప్రజలను వారి పాపాలనుండి రక్షించడానికి యేసు విరగ్గొట్టిన 4 అడ్డంకులను అవి వివరిస్తాయి. మనం విశ్వాసంలో ఆయనతో నడవడానికి సంతోషంగా ఆయన గురించి ఇతరులతో పంచుకోవడానికి అవి మనకు ప్రేరణనిస్తాయి.

మత్తయి 1:1-17 వరకు ఉన్న వచనాలను ఒకసారి చదవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రజలను రక్షించడానికి యేసు విరగొట్టిన 4 అడ్డంకులను చూద్దాము.

1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.

2అబ్రాహాము ఇస్సాకును కనెను,

ఇస్సాకు యాకోబును కనెను,

యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;

3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;

పెరెసు ఎస్రోమును కనెను,

4 ఎస్రోము అరామును కనెను,

అరాము అమ్మీనాదాబును కనెను,

అమ్మీనాదాబు నయస్సోనును కనెను;

5 నయస్సోను శల్మానును కనెను,

శల్మాను రాహాబునందు బోయజును కనెను,

బోయజు రూతునందు ఓబేదును కనెను,

ఓబేదు యెష్ష యిని కనెను;

6 యెష్షయి రాజైన దావీదును కనెను.

ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.

7 సొలొమోను రెహబామును కనెను;

రెహబాము అబీయాను కనెను,

అబీయా ఆసాను కనెను;

8 ఆసా యెహోషాపాతును కనెను,

యెహోషాపాతు యెహోరామును కనెను,

యెహోరాము ఉజ్జియాను కనెను;

9 ఉజ్జియా యోతామును కనెను,

యోతాము ఆహాజును కనెను,

ఆహాజు హిజ్కియాను కనెను;

10 హిజ్కియా మనష్షేను కనెను,

మనష్షే ఆమోనును కనెను,

ఆమోను యోషీయాను కనెను;

11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. 

12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను,

షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;

13 జెరుబ్బాబెలు అబీహూదును కనెను,

అబీహూదు ఎల్యాకీమును కనెను,

ఎల్యాకీము అజోరును కనెను;

14 అజోరు సాదోకును కనెను,

సాదోకు ఆకీమును కనెను,

ఆకీము ఎలీహూదును కనెను;

15 ఎలీహూదు ఎలియాజరును కనెను,

ఎలియాజరు మత్తానును కనెను,

మత్తాను యాకోబును కనెను;

16 యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను,

ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

17 ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదువరకు తరములన్నియు పదునాలుగు తరములు.

1. జాతిపరమైన అన్ని అడ్డంకులకు రక్షకుడైన యేసు విరగ్గొట్టారు.

ఈ జాబితాలో కేవలం యూదుల పేర్లు మాత్రమే కాకుండా యూదులుకానివారి పేర్లు కూడా ఉన్నాయి. మొదటి పేరు “తామారు” (మత్తయి 1:3), “పెరెసు” మరియు “జెరహు” అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన ఈమె యూదురాలు కాదు, ఇంకా చెప్పాలంటే ఒక కనానీయురాలు. రెండవ పేరు “రాహాబు” (మత్తయి 1:5), ఈమె యూదులైన ఇద్దరు గుడాచారులకు ఆశ్రయం ఇచ్చిన స్త్రీ (యెహోషువ 2:4). ఈమె కూడా ఒక కనానీయురాలే. మూడవ పేరు “రూతు” (మత్తయి 1:5), ఈమె మోయాబీయురాలు. “ఊరియా భార్యగానుండిన“(మత్తయి 1:6) అని చెప్పబడింది బెత్సేబ గురించే. ఈమె రాజవంశీకురాలు కావచ్చు లేదా ఊరియాను వివాహం చేసుకోవడం వలన రాజవంశంలో చేర్చబడి ఉంటుంది. దావీదుకు భార్య అవడానికి ముందే ఆమె ఒక రాజవంశీకురాలు.

ఒకరకంగా చూస్తే యూదులు కానివారు ఉన్న వంశం నుండి వచ్చిన యేసు ఆయనలో ఈ జాతిపరమైన అడ్డంకులు విరగ్గొట్టబడ్డాయని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అతను అన్ని నేపథ్యాల ప్రజల రక్షకుడు. ఒకరి చర్మం రంగు ఏమిటి లేదా ఒకరు ఎక్కడ జన్మించారు అనేది పట్టింపు లేదు. యేసుప్రభువు అన్ని నేపథ్యాల ప్రజలను తన కుటుంబంలోకి స్వాగతిస్తాడు. దీని అర్థం యేసు అనుచరులు వారి నేపథ్యాల ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదు, కానీ వారందరినీ స్వాగతించాలి

2. లింగపరమైన అన్ని అడ్డంకులకు రక్షకుడైన యేసు విరగ్గొట్టారు.

యేసు విరగ్గొట్టిన రెండవ అడ్డంకి లింగపరమైన అడ్డంకులు. వంశావళిలో స్త్రీలను చేర్చడం అసాధారణమైన విషయము. ఈ వాక్యభాగంలో ఐదుగురు స్త్రీల పేర్లు ఇవ్వబడ్డాయి, వారు తామారు, రాహాబు, రూతు, బెత్సేబ, మరియ. వీరిలో ముగ్గురి (తామారు, రాహాబు, బెత్సేబ) నేపథ్యం ప్రశ్నార్థకము. స్త్రీలు కోర్టులో సాక్ష్యమివ్వడానికి కూడా అనుమతించని కాలంలో యేసు వారిని గొప్పచేశారు. యేసు తానే మెస్సియనని మొట్టమెదటిసారిగా సమరయ స్త్రీకి బయలుపరిచారే కాని యెరూషలేములో ఉన్న ఉన్నతవర్గీయులకు కాదు (యోహాను 4). యేసు మరణించి లేచిన తర్వాత తన పదకొండుమంది శిష్యులకు కాకుండా మగ్దలేనే మరియ అనే స్త్రీకి కనిపించారు(యోహాను 20:16-18).

రక్షకుడైన యేసులో లింగపరమైన అన్ని అడ్డంకులు విరగ్గొట్టబడ్డాయి. మనం చేయవలసిన దాని ప్రకారం మనవి విభిన్నమైన పాత్రలు అయినప్పటికి ఆత్మీయంగా క్రీస్తులో మనమందరం సమానమే. ఆయన రాజ్యం స్త్రీ పురుషులిద్దరిది. యేసుని వెంబడించేవారు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి.

3. సామాజికపరమైన అన్ని అడ్డంకులకు రక్షకుడైన యేసు విరగ్గొట్టారు.

మత్తయిలో ఇవ్వబడిన జాబితాలో రాజులు, గొర్రెలకాపరులు, వడ్రంగులు ఇంకా కొన్ని తెలియని పేర్లు చేర్చబడ్డాయి. నిజానికి, యేసు యొక్క 12మంది శిష్యులలో 11మంది గలిలయకు చెందినవారు. వారు ఉన్నతవిద్యావంతులు కాదు, జాలరులు, పన్నువసూలుచేసేవారు, తిరుగుబాటుదారులు. అయినప్పటికి లోకాన్ని కుదిపివేయడానికి ఆయనచే వారందరు వాడబడ్డారు. మొదటి శతాబ్దపు సంఘ విశ్వాసులలో ఎక్కువమంది తక్కువ సామాజికస్థాయి చెందిన బానిసలు (1 కొరింథి 1:26-31). దేవుడు వారిని రక్షించడమే కాకుండా సువార్తను వ్యాపింప చేయడంలో వారిని చాలా అధికంగా వాడుకున్నారు. దీనిని బట్టి రక్షకుడైన యేసు కేవలం సమాజంలోని ఉన్నతవర్గానికే కాదు ప్రజలందరికి అని మనకు స్పష్టమవుతుంది. సామాజికపరమైన, ఆర్థికపరమైన అన్నిఅడ్డంకులు ఆయనలో విరగ్గొట్టబడ్డాయి. సామాజిక మరియు ఆర్థికస్థాయిని బట్టి మనమెవరి పట్ల వివక్షచూపించకుండా అందరిని సమానంగా చూడాలని యేసుని వెంబడించే ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.

4. పాపానికి సంబంధించిన అన్ని అడ్డంకులకు రక్షకుడైన యేసు విరగ్గొట్టారు.

యేసు విరగ్గొట్టిన అన్ని అడ్డంకులకన్నా ఈ అడ్డంకి చాలా పెద్దది. ఈ లోకంలో మరణంతో సహా మన కష్టాలన్నిటికి పాపమే కారణము. అయినప్పటికి, యేసు వంశావళి ద్వారా, పాపానికి సంబంధించిన అడ్డంకులను కూడా యేసు విరగ్గొట్టారని మత్తయి మనకు తెలియచేశాడు. ఎలా? యేసు వంశవృక్షంలో కొన్ని పేర్లను క్లుప్తంగా మరిముఖ్యంగా వారు చేసిన తప్పులను చూద్దాము.

అబ్రాహాము – ఒకటికన్న ఎక్కువసార్లు అబద్ధం చెప్పాడు. (ఆదికా 12:10-20; ఆది.కా 20:1-18).

ఇస్సాకు – అబద్ధం చెప్పాడు, దేవుడు యాకోబును ఎంచుకున్నప్పటికి తనకు ఆహారం మీదవున్న ఇష్టం కారణంగా జేష్ఠత్వ దీవెనలు ఇవ్వడానికి యాకోబుకు బదులు ఏశావును ఎంచుకున్నాడు. (ఆది.కా 26:1-11; ఆదికా 25:21-23; ఆదికా 27:1-4)

యాకోబు – మోసగాడు, అబద్ధికుడు (ఆదికా 27:1-29)

యూదా – యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేయాలని పథకం వేశాడు, కనానీయురాలిని పెళ్లి చేసుకున్నాడు, తాను వేశ్యగా భావించిన స్త్రీతో లైంగిక సంబంధాన్ని కలిగివున్నాడు (ఆదికా 37:26-27; ఆదికా 38:1-2; ఆదికా 38:11-19)

తామారు – ఈమె యూదా కోడలు, ఈమె వేశ్యగా నటించి అతనితో పడుకున్నది. (ఆదికా 38:11-19)

రాహాబు – వ్యభిచారం చేసింది. (యెహోషువ 2:1)

దావీదు – ఇశ్రాయేలీయుల గొప్ప రాజు అయినప్పటికి వ్యభిచారం, హత్య చేశాడు. (2 సమూ 11:1-27)

సొలొమోను – ఎక్కువమంది భార్యలు ఉన్నారు, విగ్రహారాధన, ఈ లోక సంతోషాలను వెదికాడు. (1 రాజులు 11:1-8)

రెహబాము – గర్వము మరియు దుష్టత్వము (1 రాజులు 12:1-15)

ఆహాజు – తీవ్రమైన విగ్రహారాధన మరియు మనుష్యులను బలిచ్చాడు. (2 రాజులు 16:1-4)

ఈ జాబితా ఇంకా ఉంది. అయితే ఈ జాబితాలో దుర్మార్గానికి అంతిమ బహుమతి ఎవరికి లభిస్తుందో ఊహించండి? అది హిజ్కియా కుమారుడైన మనష్షే కు. 2 రాజులు 21:11లో, “యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.” 2 దినవృ 33 లో అతడుచేసి చెడుతనం గురించి వివరంగా ఇవ్వబడింది. అతడు చేసిన దానిలో అతిఘోరమైనది ఏమిటంటే, “బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యముచేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను” (2 దినవృ33:6).

ఇది చాలా చెడ్డ విషయం కదా? ఈ జాబితాలో దుష్టులైన పాపులు ఉన్నారు అలాగే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడిన అబ్రాహాము వంటి భక్తులు (ఆదికా22) కూడా ఉన్నారు. ఏమైనప్పటికి, ఈ జాబితా మానవులలో ఉత్తములైన అబ్రహాము లేదా దావీదును ఉత్తమమైన మనుషులుగా చూపిస్తుంది.  ఏమి పాపుల సమాహారం-వారి పాపం పరంగా సాధారణ మరియు అసాధారణమైనది. ఎలాంటి పాపులు ఉన్నారంటే సాధారణమైన, ఘోరమైన పాపం చేసినవారు ఉన్నారు. వఅబద్ధికులు, మోసగాళ్లు, వేశ్యలు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహారాధికులు ఇంకా ఎందరో. ఈ వ్యక్తుల కలయిక క్లింట్ ఈస్ట్‌వుడ్ యొక్క ప్రసిద్ధ చిత్రం “ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ”లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి, ఈ జాబితాలోని కొన్ని పేర్లు “హాల్ ఆఫ్ షేమ్” జాబితాలో అగ్రస్థానంలో చేర్చవచ్చు , మరియు కొన్ని పేర్లు “హాల్ ఆఫ్ ఫెయిత్” జాబితాలో అగ్రస్థానంలో చేర్చవచ్చు.

అయితే వారందరు పశ్చాత్తాపపడి కృప పొందారు. దానికి మంచి ఉదాహరణ మనష్షే. అతడు ఎంతో చెడ్డవాడైనప్పటికి, 2 దిన 33:12-13 లో ఏమి చదువుతామంటే, “12అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని 13ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.”

దేవుడు తన దగ్గరకు విధేయతతో వచ్చిన ప్రజలను రక్షించడానికి పాపంతో సహా ఈ అడ్డంకులన్నిటిని విరగ్గొట్టడానికి తన అనంతమైన కృపతో యేసును రక్షకునిగా పంపారని ఈ పేర్లజాబితాను తెలియచేయడం ద్వారా మత్తయి మనకు తెలియచేశాడు.

అనేక సంవత్సరాలు పాపంలో గడిపిన తర్వాత ఒక మిషనరీ ద్వారా క్రీస్తులోనికి నడిపించబడిన ఒక వృద్ధుడైన అమెరికన్ ఇండియన్ గురించి ఒక కథ. అతని జీవితంలో వచ్చిన మార్పు గురించి చెప్పమని స్నేహితులు అడిగారు. అతడు క్రిందకు వంగి ఒక పురుగును తీసుకొని ఆకులకుప్ప మీద ఉంచి ఆ ఆకులకు నిప్పు అంటించాడు.

మంటపెరిగి ఆ పురుగు ఉన్న చోటికి వ్యాపిస్తున్నప్పుడు ఆ వృద్ధుడు హఠాత్తుగా తన చేయి మంటల్లోకి చాపి ఆ పురుగును బయటకు తీసివేశాడు. జాగ్రత్తగా ఆ పురుగును తన చేతిలో ఉంచుకొని, దేవుని కృప గురించి సాక్ష్యం చెబుతూ, ఆ పురుగు నేనే అన్నాడు.

ముగింపు మాటలు. 

ఇకనుండి బైబిలులో ఇవ్వబడిన పేర్లు మనకెంతో ప్రయోజనకరమైనవిగా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రజలను రక్షించడానికి ఉన్న అన్ని ఆటంకాలను యేసు విరగ్గొట్టారని ఇది స్పష్టంగా తెలియచేస్తుంది. ఏ జాతైనా, లింగమైన, ఏ సామాజిక స్థాయి అయినా, ఎంత ఘోరమైన పాపం చేసినా యేసు ప్రజల పాపాలను క్షమించి వారికి నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసు అన్ని అడ్డంకులను విరగ్గొట్టగలరు.

పాపులకు, బహిష్కరించబడినవారికి యేసు స్నేహితుడు. వారితో కలవడానికి ఆయన ఎన్నడు సిగ్గుపడడు. తప్పిపోయిన ప్రజలను వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. తమ పాపాలను ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినవారిని అంగీకరించకుండా యేసును ఆపలగల శక్తి ఏ పాపానికి లేదు. ఆయనను రాజుగా అంగీకరించిన వారందరిని ఆయన స్వాగతిస్తారు. ఎటువంటి సంకోచం లేకుండా ఆయన దగ్గరకు రావడానికి ఇది ఎవరికైనా ప్రేరణనిస్తుంది.

ప్రియచదువరి, మీరు ఇంకా ఆయన దగ్గరకు రాకపోతే మీరు కూడా దానిలో భాగమే. భయపడవద్దు. ఆయనను సందేహించవద్దు. మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీకు ఇచ్చే నూతన జీవితాన్ని అనుభవించండి. మీ పాపాలు, బాధలు, అపజయాలు, తలనొప్పులు ఆయనకు ఇవ్వండి. ఆయన మిమ్మల్ని బాగుచేస్తాడు. ఈ లోకంలో ఇంక ముందు మీరు జీవించే కాలమంతా అది ఎన్ని సవాళ్లతో నిండినా ఆయన మీకు సహాయం చేస్తాడు. మీరు ఆయన దగ్గరకు తొందరగా రావడం లేదు. సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ఒకవేళ అప్పటికి మీరు యేసువైపు తిరగడానికి ఆలస్యం అయిపోవచ్చును. జీవితం అశాశ్వతమైనది. ఏ క్షణమైన మరణం రావచ్చు కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ రోజే ఆయన దగ్గరకు రండి.

మనలో పాపక్షమాపణ పొందినవారిని ఈ సత్యాలు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపేలా మనల్ని బలవంతం చేస్తాయి. యేసు సువార్తను వినవలసినవారికి ఆ సువార్తను తెలియచేయడం ఈ విధేయతలో భాగమే. మనల్ని నిత్యమైన బాధ నుండి వేదన నుండి రక్షించిన ఆయనకు మనం సంపూర్ణ విధేయతను చూపించబద్దులమై ఉన్నాము.

ఇంగ్లాండు మహారాణియైన ఎలిజబెతుపై జరిగిన హత్యాప్రయత్నం గురించి ఒక పాస్టరుగారు ఇలా చెప్పారు: ఒక స్త్రీ పురుషునిగా వేషం వేసుకొని రాణి అంతఃపురంలో దాక్కొని రాణిని హత్య చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. మహారాణి విశ్రాంతి తీసుకోవడానికి ముందు ఆమె సేవకులు గదులన్నిటిని క్షుణ్ణం పరీక్షిస్తారని ఆమె గ్రహించలేదు. గౌనుల మధ్యలో దాక్కొన్న ఆ స్త్రీని వారు కనిపెట్టారు. ఆమె దగ్గరనుండి రాణిని చంపడానికి ఉపయోగించాలనుకున్న కత్తిని తీసుకొన్న తర్వాత ఆమెను రాణి ఎదుటికి తీసుకువచ్చారు.

తప్పించుకోడానికి తనకు ఎలాంటి అవకాశం లేదని గ్రహించిన ఆమె తన మోకాళ్లమీద తలవంచుకొని కూర్చుని, ఒక స్త్రీగా తనను కనికరించమని, ఒక స్త్రీగా తనపై కృపచూపించమని రాణిని వేడుకుంది. రాణి సూటిగా ఆమె వంక చూసి, “నేను నీ మీద కృప చూపిస్తే నీవు ఏ వాగ్దానం చేస్తావు” అని అడిగింది. అందుకు ఆ స్త్రీ పైకి చూస్తూ, “షరతలతో కూడిన కృప, ముందస్తు హెచ్చరికలతో చూపించే కృప ఎన్నటికి కృప కాదు” అన్నది. ఎలిజబెతు మహారాణి ఒక్క క్షణం ఆగి, “నీవన్నది నిజమే; నేను నీ మీద కృప చూపించి నిన్ను క్షమిస్తున్నాను” అని చెప్పి ఆమెను స్వేచ్ఛగా వదిలివేసింది.

అప్పటినుండి ఎలిజబెతు మహరాణికి ఆమెను చంపాలనుకున్న ఆ స్త్రీ కన్నా విశ్వాసపాత్రులు అంకితభావం కలిగిన సేవకులు ఎవరూ లేరని చరిత్ర మనకు చెబుతుంది.

ఒకరి జీవితంలో ఈ విధంగానే దేవుని కృప ఉంటుంది. అతడు లేదా ఆమె దేవునికి నమ్మకమైన సేవకులు అవుతారు. తన అద్భుతమైన కృపతో మనకు నూతన జీవితాన్ని ఇచ్చిన యేసురాజుకు నమ్మకమైన సేవకులుగా ఉండడానికి మనం  ఎల్లప్పుడు ప్రయత్నించాలి.

Category

Leave a Comment