ధన్యతలు 3వ భాగము దుఃఖపడువారు ధన్యులు

Posted byTelugu Editor December 26, 2023 Comments:0

(English version: The Beatitudes – Blessed Are Those Who Mourn)

మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది మూడవది. ఇక్కడ యేసు ప్రభువు తన అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:4లో వివరించబడిన “దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు” అనే మూడవ వైఖరిని మనం చూస్తాము.

నేను ఆఫీస్‌కు వెళ్లే దారిలో ఉన్న హైవేపై ఒక బార్ యొక్క ప్రకటనలో “ఎవ్రీ అవర్ హ్యాపీ అవర్” అనే మాటలులు ఉన్నాయి. ఆ ప్రకటన నిజంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకునే జీవితాన్ని సూచిస్తుంది. మంచి సమయాన్ని గడపడమే జీవితమని పదే పదే చెబుతుంటారు. అందులో నాకేముంది? ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుందా? ఒక రచయిత ఈ లోకపు మనస్తత్వం గురించి తెలియచేస్తూ చాలా మంది ప్రజలు తమ సమాధిపై “ఇతడు సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు” అని వ్రాస్తే ఎక్కువ సంతృప్తి చెందుతారని చాలా బాగా చెప్పాడు.

యేసు మత్తయి 5:4లో “దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు” అని చెప్పారు. ఇది సంస్కృతికి పూర్తి విరుద్ధం! యేసు అనుచరులు భిన్నమైన మార్గంలో నడుస్తారు. “ఈ లోకం దుఃఖించేవారిని ఇష్టపడదు; దుఃఖించేవారు దుప్పట్లను తడుపుతారు” అని ఒక వ్యాఖ్యాత చెప్పాడు. అయితే దుఃఖించేవారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుతారని యేసు చెప్పారు. వారు మాత్రమే దేవుని ఆమోదాన్ని లేదా అనుగ్రహాన్ని పొందుతారు.

మొదటిగా, క్రైస్తవులు ఎప్పుడూ నవ్వకూడదని లేదా ఆనందంగా ఉండకూడదని దీని అర్థం కాదని నేను మీకు హామీ ఇస్తున్నాను. చాలా వచనాలు ఆనందంగా ఉండమని మనల్ని ఆజ్ఞాపించాయి (ఫిలిప్పి 4:4; 1 థెస్స 5:16). మనం అనుభవించే ఆనందం కూడా దుఃఖించే వైఖరికి వేరుగా ఉండకూడదని అర్థం చేసుకోవడం ముఖ్యము.

యేసు ఇక్కడ ఉపయోగించిన “దుఃఖించు” అనే పదం గ్రీకు భాషలో అంతరంగంలో ఉన్న లోతైన విచారాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, యేసు చనిపోయినప్పుడు శిష్యుల కష్టాలను వివరించడానికి ఈ పదం ఉపయోగించబడింది (మార్కు 16:10). యేసు ఆ పదాన్ని ఉపయోగించడం ద్వారా ఈ పదం యొక్క అర్థాన్ని మనం తగ్గించలేమని బోధించారు.

ఇది వర్తమాన కాలంలో కూడా ఉంది, ఈ వచనాన్ని “నిరంతరం దుఃఖిస్తున్నవారు ధన్యులు” అని అనువదించారు. కాబట్టి, యేసు మనల్ని దుఃఖించే జీవనశైలికి పిలుస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన ఇక్కడ ఎలాంటి దుఃఖాన్ని వివరిస్తున్నారు? ఆ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు, ఆయన ఎలాంటి దుఃఖాన్ని ఇక్కడ వివరించలేదో చూద్దాం.

ఈ దుఃఖం దేనికి సంబంధించింది కాదు.

ఈ దుఃఖం ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు లేదా కోరుకున్నది పొందనప్పుడు కలిగే బాధ కాదు (2 సమూ 13:2; 1 రాజులు 21:4). దైనందిన జీవితంలో ఎదుర్యయే వివిధ సవాళ్ల కారణంగా జీవితం ఒక పోరాటంగా మారినప్పుడు కలిగే బాధ కాదు. చివరిగా, ఇది సంతోషంలేని విచారం కలిగిన ముఖంతో తిరగడం కూడా కాదు.

విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఇద్దరూ పైన పేర్కొన్న దుఃఖాన్ని అనుభవిస్తారు. ఏది ఏమైనప్పటికీ, ధన్యతలో యేసు వివరించిన దుఃఖం కేవలం విశ్వాసులకు మాత్రమే ఉండే వైఖరి. ఆయనకు నమ్మకమైన అనుచరులు మాత్రమే చూపించగలరు.

ఏమిటి ఈ దుఃఖం?

యేసు ఇక్కడ వర్ణించిన దుఃఖం ఏమిటంటే పాపం గురించి దుఃఖించడము. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” (మత్తయి 5:3) అనే మొదటి ధన్యతను గుర్తుంచుకోండి. భౌతిక పేదరికం కంటే ఆధ్యాత్మిక పేదరికాన్ని ఇది సూచిస్తుంది. అదే విధంగా, యేసు ఇక్కడ వర్ణించిన దుఃఖం ఆత్మీయ దుఃఖము. హృదయాంతరంగంలో నుండి పాపం గురించి దుఃఖించడం, తీవ్రమైన దుఃఖము! విశ్వాసులు మాత్రమే అలాంటి వైఖరిని జీవన విధానంగా చూపించగలరు.

ఆత్మవిషయమై దీనులైనవారు అనే మొదటి ధన్యత పాపం గురించి మన అవగాహనలోని వివేకాన్ని వివరిస్తుంది. దుఃఖించువారు అనే 2వ ధన్యత, పాపం గురించి మన అవగాహనలోని భావోద్వేగాన్ని వివరిస్తుంది. ఈ రెండూ కలిసి ఉంటాయి. ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, తాను ఆధ్యాత్మికంగా దివాళా తీసినట్లు తెలుసుకున్నప్పుడు (అనగా ఆత్మవిషయమై దీనత్వము) పశ్చాత్తాపం చెందుతాడు (అనగా, పాపం గురించి దుఃఖించడం). “పాపం ఎప్పుడూ కన్నీళ్లతో ఉండాలి” అని ఒక పాత రచయిత అన్నారు. పాపం గురించి దుఃఖించడం అనేది మార్పు వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ మనం నిత్యం పాపం చేస్తునే ఉన్నాం కాబట్టి అది నిరంతరం ఉండాలి.

యాకోబు 4:9లోని, “వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి” అని వ్రాయబడిన మాటలు కూడా ఈ సత్యాన్ని బలపరుస్తున్నాయి. ఈ వచనంలోని “దుఃఖించు” అనే పదం మత్తయి 5:4లో యేసు ఉపయోగించిన గ్రీకు పదం ఒక్కటే. ఈ వచనంలో యాకోబు చెప్పిన దుఃఖమంటే ఆధ్యాత్మిక దుఃఖము పాపాల కొరకు దుఃఖమని స్పష్టమవుతుంది.

బైబిలులో 2 కొరింథీ 7:10 లో పాపం గురించి రెండు రకాల దుఃఖం లేదా చింత వివరించబడింది. ఒకటి దైవిక దుఃఖం, మరొకటి ఈ లోక దుఃఖం: “దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును”. దైవచిత్తానుసారమైన దుఃఖము దేవునిపై ఆధారపడి ఉంటుంది, పాపాలకు పశ్చాత్తపం చెంది దేవుని వైపు తిరిగేలా చేస్తుంది. ఈ లోక దుఃఖం స్వీయ-కేంద్రీకృతమైనది మరియు దేవుని వైపుకు నడిపించదు.

దానికి మంచి ఉదాహరణ పేతురు, యూదా. యేసును అప్పగించినందుకు ఇద్దరూ దుఃఖించారు. పేతురు దుఃఖం అతడిని తిరిగి క్రీస్తు వైపుకు నడిపించింది ఇది దేవునిపై ఆధారపడిన దుఃఖము. యూదా దుఃఖం అతడిని క్రీస్తు వద్దకు నడిపించలేదు ఎందుకంటే అది స్వీయ-కేంద్రీకృతమైన ఈ లోక దుఃఖం! ఈ ధన్యతలో, యేసు దేవునిపై ఆధారపడిన దుఃఖానికి పిలుపునిచ్చారు. ఇది మనల్ని పశ్చాత్తాపంతో దేవుని వైపుకు మరియు ఓదార్పు కోసం క్రీస్తు వైపుకు తిరిగి వెళ్లేలా చేస్తుంది!

మన దుఃఖంలోని నిస్సారత.

దురదృష్టవశాత్తూ క్రైస్తవులమని చెప్పుకునేవారిలో చాలామంది దుఃఖం ఈ లోక దుఃఖాన్ని పోలి ఉంటుంది. కోరికలు తీర్చుకోకపోవడం, జనాదరణ పొందకపోవడం, కార్పొరేట్ విజయం సాధించకపోడం వంటి మొదలైన వాటి చుట్టూ ఈ దుఃఖం తిరుగుతుంది. ఒక్కసారి ఆలోచిద్దాం.

మన గర్వం, స్వార్థం, ఉన్నత స్థానానికి ప్రయత్నించడం, ఇతరుల నుండి ప్రశంసలు పొందాలనే చిన్న ప్రయత్నాలు, ఇతరులతో మాట్లాడకపోవడం వంటి వాటి గురించి చివరిసారిగా మనం ఎప్పుడు బాధపడ్డాము? పరిశుద్ధుడైన దేవుని దుఃఖపరచినందుకు, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు మనం చివరిసారిగా తీవ్రమైన బాధను ఎప్పుడు అనుభవించాము? మన పాపాలకు చివరిసారిగా ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాము?

అల్లరిగా ఉండే యువకులు ఒక బోధకుడిని, “రక్షించబడని వ్యక్తులు పాపపు భారాన్ని మోస్తున్నారని మీరంటున్నారు. మాకు అలా అనిపించడంలేదు. పాపం ఎంత బరువుగా ఉంది? పది పౌండ్లు? ఎనభై పౌండ్లు?” అని అడిగారు. అందుకు ఆ బోధకుడు, “మీరు శవం మీద నాలుగు వందల పౌండ్ల బరువు వేస్తే అది దానికి భారంగా ఉంటుందా?” అని ఆ యువకులను అడిగాడు. వారు, “చనిపోయింది కాబట్టి ఏమీ తెలియదు” అన్నారు.

అప్పుడు ఆ బోధకుడు, “అలాగే ఆత్మ కూడా నిజంగా చనిపోయింది కాబట్టి అది పాపపు భారాన్ని అనుభవించడం లేదు; తన భారం పట్ల ఉదాసీనంగా ఉంటుంది, దాని గురించి నిర్లక్ష్యంగా ఉంటుంది” అని చెప్పాడు.

మరోవిధంగా చెప్పాలంటే, విశ్వాసులు అంటే ఆత్మీయంగా మరణించని వారని అర్థము. వారు ఆత్మచే సజీవంగా చేయబడ్డారు (ఎఫెసి 2:4-5). వారు మరలా జన్మించారు పాపపు భారాన్ని అనుభవించడమే ఆ నూతన జన్మకు స్పష్టమైన రుజువు! ఎక్కడైతే పాపపు భారం తెలియదో, దుఃఖం ఉండదో అక్కడ అడగవలసిన న్యాయమైన ప్రశ్న ఏమిటంటే: “నిజంగా నూతనంగా జన్మించారా?”

మనం కృప చేత రక్షించబడ్డాం కాబట్టి మన పాపాల గురించి మనం ఏడ్వవలసిన అవసరం లేదని మనకు మనం సర్దిచెప్పుకుంటాము. మనం మన పాపాలను ఒప్పుకుంటాము, యేసు అందించే క్షమాపణను అందుకుని ముందుకు సాగిపోతాము. మనం దానిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాము. లేదా కొన్నిసార్లు, మన పాపాలను వదులుకోవడానికి ఇష్టపడము. మనం దానిని మరికొంత కాలం పట్టుకుని ఉండాలనుకుంటున్నాము. కాబట్టి, దాని గురించి మనం దుఃఖపడము. ఎందుకంటే దుఃఖం అంటే మనం వదిలి పెట్టామని అర్థము! మనం దుఃఖించినప్పుడు, సాధారణంగా మనం విడిచిపెట్టిన పాపాల కోసం దుఃఖిస్తాము.

తనను వెంబడించేవారు తమ పాపాలన్నిటిని బట్టి తీవ్రంగా దుఃఖిస్తారని యేసు స్పష్టంగా చెప్పారు. అతి చిన్న పాపం కూడా వారిని ఇబ్బంది పెడుతుంది! దాని నుండి విడుదల కోసం వారు మొరపెడతారు. నిస్సహాయంగా మొరపెట్టడమే కాదు కానీ మనలో ఉన్న పరిశుద్దాత్మ  వలన ఆ పాపం కొరకు తీవ్రంగా దుఃఖించడమే కాకుండా విడుదల కూడా కోరుకుంటాము.

జాన్ స్టోట్ అనే రచయిత, “కొంతమంది క్రైస్తవులు ముఖ్యంగా ఆత్మతో నింపబడి ఉంటే, వారు తమ ముఖంపై శాశ్వతమైన నవ్వును ధరించి నిరంతరం సందడిగా ఉరకలెత్తుతూ ఉండాలని ఊహించుకుంటారు. ఒకరు బైబిలుకు విరుద్ధంగా ఎలా మారగలరు?” బైబిలు ప్రకారం, అతడు చెప్పింది సరైనదే, ఎందుకంటే పాపాన్ని తేలికగా తీసుకునే వైఖరి దైవభక్తిగల వ్యక్తుల లక్షణంగా మనం చూడము.

దావీదు పాపం చేసినప్పుడు అలాంటి స్పందననే కలిగి ఉన్నాడు. అతని మాటలు గమనించండి: “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి” (కీర్తన 38:4). “నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను” (కీర్తన 8:18). ” నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది” (కీర్తన 51:3). అయితే ఈ లోకం దావీదు గురించి,  “ఇది చాలా వ్యతిరేక ధోరణి. ఇది ఆనందానికి మూలం కాదు!” అంటుంది కాని, దేవుడు, అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు (అపొ కా 13:22) అంటున్నారు. కాబట్టి, ఒకరి పాపం గురించి దుఃఖించడం దైవభక్తికి అనుకూలంగా ఉంటుందని మీరు గమనించండి.

ఇతరుల పాపాల కొరకు దుఃఖించుట.

బైబిలు విశ్వాసులను తమ పాపాల కోసం మాత్రమే కాకుండా ఇతరుల పాపాల కోసం కూడా దుఃఖించమని పిలుపునిస్తుంది. ఇతరుల పాపాల కోసం దుఃఖించడంలో వైఫలమై లైంగిక అనైతికతను సహించిన గొప్ప కొరింథీ సంఘాన్ని పౌలు, “మీరు ప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారుకారు” అని గద్దించాడు. (1 కొరింథి 5:1-2). 

లోకం ఇతరుల పాపాలను ఖండిస్తుంది లేదా క్షమిస్తుంది. అయితే మనం మొదటగా ఇతరుల పాపాల కొరకు దుఃఖించాలి. అదే లేఖనాల్లో కనిపించే విశ్వాసుల మాదిరి (కీర్తన 119:36; యిర్మీయా 13:17; ఫిలిప్పు 3:18).

ఈ ధన్యతలను భోధించిన యేసు కూడా ఇతరుల పాపాల కోసం దుఃఖించారు. లూకా 19:41లో “ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చారు” అని వ్రాయబడింది. మరికొద్ది రోజుల్లోనే ఆయనను చంపే మహాపాపాన్ని ఆ పట్టణవాసులు చేస్తారేమోనని ఆయన ఏడ్చారు. బైబిలు యేసును దుఃఖించేవానిగా (యెషయా 53:3) వర్ణించడంలో ఏ ఆశ్చర్యం లేదు. ఆయన ఇతరుల పాపాలు తనను ఇబ్బంది పెడుతున్నాయనే కోణంలో దుఃఖించే వ్యక్తి. “ఆయన ఏ పాపం చేయలేదు” (1 పేతురు 2:22) కనుక తన పాపాల గురించి కాకుండా ఇతరుల పాపాల గురించి తీవ్రంగా దుఃఖించారు.

ఆ వెలుగులో, యేసు అనుచరులమైన మనం తోటి విశ్వాసుల పాపాలతో సహా మన చుట్టూ ఉన్నవారి పాపాల వల్ల ఎలా ప్రభావితం కాకుండా ఉండగలము? మన చుట్టూ ప్రబలుతున్న పాపాన్ని చూసి మనం ఎలా నవ్వుకోగలము?

క్రైస్తవ జీవితమంతా చిరునవ్వులే అనే అబద్ధాన్ని చాలామంది నమ్ముతారు. నిజమే, “సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని” (1 తిమోతి 6:17) వ్రాయబడింది. అలాగే సొలొమోను “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము” అని చెప్పాడు (సామెతలు 17:22). జీవితమంటే మంచివాటిని ఆస్వాదించడం మాత్రమేనా? దుఃఖాన్ని నివారించడానికి ప్రతిదీ చేయడానికి ప్రయత్నించడం మాత్రమేనా? దుఃఖాన్ని మరిచిపోయేంతగా వినోదాన్ని పొందడం కోసమేనా?

మనతో మనం నిజాయితీగా ఉంటే, ఈ జీవితంలోని ఆనందాలను మోతాదుకు మించి తీసుకోవడంలో మనం దోషులం కాదా? అలాంటి జీవితాన్ని గడపడం అవివేకం మరియు ఆధ్యాత్మికంగా ప్రమాదకరము. ఆనందం ఆధిపత్యం వహించే జీవన విధానానికి వ్యతిరేకంగా మనలను హెచ్చరించే సొలొమోను యొక్క జ్ఞానం కలిగిన మాటలను విందాము: “విందు జరుగుచున్న ఇంటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి ఇంటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి ఇంటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును” (ప్రసంగి 7 :2-4).

దుఃఖపడమని సొలొమోను చెప్పాడు. దుఃఖపడమని యేసు చెప్పారు. ఇవి మన హృదయాలపై మనం అల్లుకున్న మోసపు వల నుండి మనలను విడిపించడానికి నేరుగా చెప్పబడిన మాటలు. మనం ఏడ్చి ఏడ్చి నవ్వితే మన హృదయాల నిజ పరిస్థితి తెలుస్తుంది. మనం మనతో నిజాయితీగా ఉంటే, మనం ఏడ్వవలసిన విషయాల గురించి నవ్వడం మనం నవ్వవలసిన విషయాల గురించి ఏడ్వడం తప్పు కాదా?

 తమ పాపాల గురించి ఇతరుల పాపాల గురించి నిరంతరం దుఃఖించేవారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడని యేసు చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి. దేవుడు అలాంటి వారిని మాత్రమే ఆమోదిస్తాడు.

ఓదార్చబడతారు అనే వాగ్దానము

దుఃఖించడమనే వైఖరికి ప్రతిఫలం? ఓదార్పు! మత్తయి 5:4లోని చివరి భాగాన్ని చూస్తే, “ఓదార్చబడుదురు” అని ఉంటుంది. వారు మాత్రమే ఓదార్చబడతారు; ఈ ప్రస్తుత జీవితంలోను మరియు రాబోయే కాలంలోను సంపూర్ణంగా యేసు తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు మన కన్నీళ్లన్నింటినీ తుడిచివేస్తాడు. అది యేసు వాగ్దానము.

“ఓదార్పు” అనే పదానికి గ్రీకుభాషలో ఓదార్చడానికి ప్రోత్సహించడానికి మరియు బలపరిచేందుకు మన ప్రక్కన ఉండే వ్యక్తి అని అర్థము. “దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని పిలువబడ్డాడు (2 కొరి 1:3). “యేసు ఆదరణకర్త” అని వ్రాయబడింది, (1 యోహాను 2:1) అయితే అదే పదాన్ని న్యాయవాది అని కూడా అనువదించారు. పరిశుద్ధాత్మను ఆదరణకర్త, ప్రోత్సహించేవాడు లేదా బలపరిచేవాడు అని కూడా అంటారు (యోహాను 14:16).

మనం లేఖనాలను చదివినప్పుడు, ప్రసంగం వినినప్పుడు, ఇతర విశ్వాసుల సహవాసంలో ఉన్నప్పుడు మనం పాపం గురించి దుఃఖిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా, తండ్రి కుమారులు మనకు ఆదరణను ప్రోత్సాహాన్ని అందిస్తారు.

దుఃఖిస్తున్న హృదయాలను దేవుడు ఓదార్చుతాడనే విశ్వాసం దావీదుకు ఉంది, కాబట్టి అతడు, “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” (కీర్తన 34:18; కీర్తన 51:17 కూడా చూడండి) అని చెప్పగలిగాడు. మనం పాపాల గురించి దుఃఖించి నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తు వద్దకు తీసుకువెళ్ళినప్పుడు, మన పాపాలు క్షమించబడతాయని పరిశుద్ధాత్మ మనకు హామీ ఇస్తాడు. 1 యోహాను 1:9లో “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” అని వ్రాయబడింది.

ప్రకటన 21:4లో, “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని” వ్రాయబడింది. నిజమే, పాపం కోసం దుఃఖించే జీవనశైలిని అనుసరించే వారందరికీ ఇది భవిష్యత్తులో జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి, ఈ జీవితంలో ఆనందానికి సంతోషానికి దారితీసే ఓదార్పు ఉంది; రాబోయే రాజ్యంలో నిత్యం ఆ ఓదార్పును పూర్తిగా అనుభవిస్తాము.

కానీ మీరు ఇప్పుడు ఈ జీవితంలో నవ్వుతూ ఉండాలనుకుంటే, ఈ దుఃఖించడానికి దూరంగా ఉంటే, లూకా 6:25లో, “అయ్యో ఇప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు” అని యేసు మీ గురించే చెప్పారు. మొత్తం తలక్రిందులు అవుతుంది. పాపం కోసం దుఃఖించండి నిత్య ఓదార్పు పొందండి. పాపం గురించి ఇప్పుడు నవ్వుతూ ఉండండి నిత్యం ఏడుస్తునే ఉండండి! యేసు చాలా తీవ్రంగా చెప్పారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఆయన మాటలు మన సమాచారం కోసం మాత్రమే కాదు. అవి మనలో మార్పు కోసమే. ఈ విధమైన దుఃఖాన్ని కలిగివుండడమే మన లక్ష్యం చేసుకోవాలి.

కాబట్టి, మనం దీనిని ఎలా చేయాలి? మన పాపాల కోసం ఇతరుల పాపాల కోసం దుఃఖించే జీవనశైలిని మనం ఎలా అనుసరించగలము? దానికి సహాయపడే 2 పదాలలో 2 సూచనలు: ఆలోచన మరియు పరుగెత్తు.

1. ఆలోచన

మన ఆధ్యాత్మిక స్థితి గురించి ఆలోచించడానికి మనం తప్పకుండా సమయాన్ని వెచ్చించాలి. ఆ సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:

నేను తరచుగా పాపపు ఆలోచనల గురించి ఎందుకు ఆలోచిస్తాను? నేను కోరుకున్నది పొందనప్పుడు నేను ఎందుకు సరిగా ప్రతిస్పందించను? ఎవరైనా నన్ను రెచ్చగొట్టినప్పుడు కోపంతో ఎందుకు స్పందిస్తాను? ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు నేను ఎందుకు అసూయపడుతున్నాను? నేనెందుకు ఆ కామపు ఆలోచనను విడిచిపెట్టకుండా వాటిలోనే ఉంటున్నాను? నేను స్వీయ-నీతితో ఇతరులను ఎందుకు తప్పుపడుతూ ఉంటున్నాను? నన్ను నేను నిత్యం ఇతరులతో ఎందుకు పోల్చుకుంటాను? దేవుడు నాకు ఇచ్చిన దానితో నేను సంతృప్తి చెందకుండా ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాను? నేను వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లి చూడకూడని వాటిని ఎందుకు చూస్తాను? నేను ఇతరులను బాధపెట్టడానికి నా నోటిని ఎందుకు ఉపయోగిస్తాను?

మనల్ని మనం ఒక సారి పరిశీలన చేసుకోవాలి. ఈ విషయాలలో మనం నిజాయితీగా వ్యవహరించాలి. మన హృదయాలను పరిశోధించమని (కీర్తన 139:23-24) మరియు మనకు తెలియని పాపాలను వెలుగులోకి తీసుకురమ్మని దేవుని అడగాలి.

కాబట్టి, పరిశుద్ధాత్మ మన దృష్టికి తీసుకువచ్చే అన్ని పాపాల గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చిద్దాం. మన పాపాల భారం నిజమైన పాపపు ఒప్పుకోలును తీసుకువస్తుంది. అప్పుడు ఏ పాపాల కోసం యేసు ఉమ్మివేయబడ్డాడో, కొరడాలతో ఆయన వీపును చీల్చివేయబడిందో, ఆయన చేతులలో పాదాలలో  మేకులు కొట్టబడ్డాయో ఆయన నుదిటిపై ముళ్ళకిరీటం పెట్టబడిందో ఆ మన పాపాల  గురించి దుఃఖించడం ప్రారంభిస్తాము. “నేను ఎంత ఘోరమైన పాపిని! నేను పాపం చేయడమే కాదు, సరిచేసుకోవలసిన రీతిలో నన్ను నేను సరిచేసుకోవడం లేదు. నా పశ్చాత్తాపంలో లోతు లేదు” అని నిజాయితీగా మొరపెడతాము.

2. పరుగెత్తు

ఆలోచించడం యొక్క ఉద్దేశం ఓదార్పు కోసం క్రీస్తు వద్దకు పరిగెత్తడము. దుఃఖిస్తూ పశ్చాత్తాపపడే పాపిని ఎప్పటికీ తిరస్కరించక ఎప్పుడూ ఆహ్వానించే ఆయన చేతులలోనికి పరిగెత్తడము. మనం కష్టాల్లో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. మనం పాపం చేశామని ఆయనకి చెప్పి మనల్ని శుద్దిచేయమని అడగవచ్చు. ఏ సంకోచం లేకుండా కరుణామయుడైన యేసు క్షమాపణ ఇవ్వడమే కాకుండా మన కష్టాల్లో ఉన్న మన ఆత్మలకు సమాధానాన్ని ఓదార్పును కూడా ఇస్తారు.

కాలేజీలో ఒక నూతన విద్యార్ధి తన మురికి బట్టలు పాత చొక్కాలో మూట కట్టి లాండ్రీ గదికి వెళ్ళాడు. అతడు తన బట్టలు చాలా మురికిగా ఉన్నాయని ఆ మూట విప్పడానికి ఇబ్బంది పడి  బట్టల మూట విప్పకుండానే వాషింగ్ మెషీన్‌లోకి వేసాడు. మిషీన్ ఆగిన తర్వాత ఆ మూట తీసుకుని తన గదిలోనికి వెళ్లి దానిని తెరిచి చూసినప్పుడు ఆ బట్టలు తడిసి ఆరిపోయినా శుభ్రపడలేదని అతను గ్రహించాడు.

 “మీ పాపాలను చిన్న మూటలో ఉంచుకోకండి; నేను మీ జీవితంలో ఉన్న మురికినంతా పూర్తిగా శుభ్రపరచాలని కోరుకుంటున్నాను” అని దేవుడు అంటున్నాడు.

“ఆయన(దేవుని) కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:7) అని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. కాబట్టి, ఆలోచించండి మరియు పరుగెత్తండి. మన దైనందిన జీవితంలో ఈ ధన్యతను పొందాలని కోరుకుంటే, మనమందరం ప్రతిరోజూ ఆచరించడానికి నేను సూచించే రెండు విషయాలు ఇవే.

మనం నిరాశ చెందకుండా ఉండడానికి, యేసు ఈ ధన్యతను మన తరపున సంపూర్ణంగా నెరవేర్చారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి, దేవుని అంగీకారం పొందడానికి లేదా దేవుని అంగీకారం పొంది ఉండడానికి మనం ఈ దుఃఖించే వైఖరిని సంపూర్ణంగా కలిగివుండాలని ఆలోచించే ఉచ్చులో పడకండి. దానికి బదులుగా, మనం ఈ పరుగు పందెంలో పరుగెడుతున్నప్పుడు ఆయనను మన మాదిరిగా చూడాలి. మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము (2 కొరింథి 3:18).

గతం గతః. ఈరోజు కొత్త రోజు. తమ పాపాల గురించి ఇతరుల పాపాల గురించి దుఃఖపడువారు ధన్యులు; కేవలం వారు మాత్రమే ఓదార్చబడతారు అనే ఈ గొప్ప సత్యాన్ని విశ్వసించడం ద్వారా దానిని అనుసరించడం ద్వారా మనం మళ్లీ ప్రారంభించవచ్చును.

Category

Leave a Comment