సువార్తీకరణకు ఉండే సాధారణ అడ్డంకులు – 1వ భాగము

Posted byTelugu Editor August 8, 2023 Comments:0

(English version: Common Barriers To Evangelism & How To Overcome Them – Part 1)

యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమైనప్పుడు మనకు చెప్పిన ఆఖరి మాటలను గొప్ప ఆజ్ఞ అని పిలుస్తాము. “18 అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. 19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.” [మత్తయి 28:18-20].

గొప్ప ఆజ్ఞకు సంబంధించిన యేసు మాటలు లూకాలో ఇలా వ్రాయబడ్డాయి: “క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు 47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. 48 ఈ సంగతులకు మీరే సాక్షులు” [లూకా 24:46-48].

మరియు అదే లూకా అపొ.కా 1:8లో గొప్పఆజ్ఞ గురించి మరిన్ని వివరాలు ఇచ్చాడు. అయితే ఈసారి, సువార్తీకరణ చేయడానికి పరిశుద్ధాత్మ మనకు శక్తిని ఇస్తుందని యేసు చెప్పిన మాటలు ఉన్నాయి: “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”

మామూలు మనుషుల చివరి మాటలకు ప్రాధాన్యత ఇచ్చే మనం విశ్వానికి ప్రభువు, రాజైన యేసు భూమిని విడిచిపెడుతున్నప్పుడు చివరిగా చెప్పిన మాటలకు ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఆయన సాక్షులుగా మనం ప్రపంచానికి సువార్త ప్రకటించడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి యేసు మాటలు స్పష్టంగా తెలియచేయడం లేదా? అయినప్పటికీ, నమ్మకమైన సాక్షులుగా ఉండుటలో మనం తరచూ విఫలమవుతాము! ఈ ఆజ్ఞను అతిక్రమించడం వలన మనం ఎంతో అపరాధభావాన్ని మోస్తున్నాం!

అయితే ఈ ప్రచురణలోను తర్వాతి ప్రచురణలోను నమ్మకమైన సువార్తీకరణ చేయడానికి ఉన్న కొన్ని సాధారణ అడ్డంకులను (కొన్నిసార్లు మనం చెప్పే సాకులు) గమనించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఈ అడ్డంకులను అధిగమించడానికి ఆయనపై ఆనుకొనడం ద్వారా మనం మన మార్గాలను కూడా మార్చుకునేలా చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా, యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలనే మన పిలుపును మనం నెరవేర్చగలము.

అయితే, మనం ఈ సాధారణ అడ్డంకుల గురించి చూసే ముందు సువార్తీకరణ యొక్క సరళమైన నిర్వచనాన్ని చూద్దాం: సువార్తీకరణ అనేది మన పాపాల కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్తను ప్రేమపూర్వకంగా నమ్మకంగా ప్రకటించడమే. అప్పుడు ప్రజలు తమ పాపాలకై పశ్చాత్తాపం చెంది కేవలం ఆయనపైనే నమ్మకం ఉంచడం ద్వారా పాపక్షమాపణ పొందగలరు.

కాబట్టి, ఈ నిర్వచనాన్ని మన మనస్సులలో ఉంచుకుని ముందుకు సాగుదాం.

1. నా మాటలు ఆ వ్యక్తికి కోపం తెప్పిస్తాయేమో, దాని ఫలితంగా ఆ వ్యక్తితో నా సంబంధం తెగిపోతుందేమోనని నేను భయపడుతున్నాను.

దేవునితో శత్రుత్వం ఉన్నవారికి సువార్త సందేశం అభ్యంతరకరంగానే ఉంటుంది. అయినప్పటికీ, మనం ప్రేమతో సత్యాన్ని తెలియచేయడానికి ప్రయత్నించాలి కాని సంబంధం తెగిపోతుందని భయపడకూడదు. ఎందుకంటే మనకు సంబంధాలను ఇచ్చేది దేవుడే! అందుకే దేవునితో మనకున్న సంబంధం కన్నా మనుషులతో మనకున్న సంబంధాలకు ఎక్కువ  ప్రాధాన్యత ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.

మత్తయి 10:37, “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.”

2. వారు నా పని ఏమిటో అదే చూసుకోమని నాకు చెప్పవచ్చు.

ఇతరుల ఆధ్యాత్మిక స్థితి గురించి ఆందోళన చెందడం క్రైస్తవుని పని. ఒక్కసారి ఆలోచించండి, మనకు సువార్త బోధించిన వారు కూడా మన ఆధ్యాత్మిక స్థితి గురించి చింతించడం తన పని కాదని అనుకుంటే మనం ఎక్కడ ఉంటాము!

ఒకసారి చికాగోలోని ఒక వీధిలో నడుస్తున్నప్పుడు D. L. మూడీ పరిచయంలేని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి, “సార్, మీరు క్రైస్తవులా?” అని అడిగితే  “మీ పని మీరు చూసుకోండి” అని జవాబు వచ్చింది. అందుకు మూడీ వెంటనే, “సార్, అదే నా పని” అన్నారు.

2 కొరింథి 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.”

3. ఎక్కడ ప్రారంభించాలో నాకు తెలియదు.

మనం ఎప్పుడూ మన సాక్ష్యాన్ని యేసు మనకు ఏమి చేసారో చెప్పడంతో ప్రారంభించవచ్చు. గెరసీనీయుల దేశంలో  బాగుపడి దయ్యం పట్టిన వ్యక్తిని అదే చేయమని యేసు ఆజ్ఞాపించారు.

లూకా 8:39 “అయితే ఆయన నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.”

మన సాక్ష్యాలు వ్యక్తిగతమైనవి మరియు వాటిని ఎవరూ తిరస్కరించలేరు. పరిశుద్ధాత్మ చిత్తమైతే, మన సాక్ష్యాలు వినేవారి హృదయాల మీద చాలా ప్రభావం చూపుతాయి.

4. నేను ఇంకా బైబిలు నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రజలు అడిగే అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు.

గెరసీనీయుల దేశంలో  బాగుపడి దయ్యం పట్టిన వ్యక్తికి [లూకా 8:26-39] బైబిలు గురించి పెద్దగా తెలియదు. అయినప్పటికీ, అతను మారిన వెంటనే సాక్ష్యమివ్వడం ప్రారంభించాడు [లూకా 8:39]. అవిశ్వాసి అడిగే వాటన్నింటికి మన దగ్గర ఎప్పటికీ సమాధానాలు ఉండవు. అయితే, అది సాక్ష్యమివ్వకుండా మనల్ని ఆపకూడదు. “నాకు సమాధానం తెలియదు కాని నేను కనుక్కొని మీకు చెబుతాను” అని చెప్పడం మంచిదే. ఆధ్యాత్మికంగా సహాయం చేయగల వ్యక్తిని సంప్రదించి వారికి సమాధానం ఇవ్వండి. అప్పటికీ మీకు సమాధానం దొరక్కపోతే, “నాకు తెలియదు!” అని చెప్పండి. సువార్తీకరణ అంటే అన్నింటికి సమాధానాలను కలిగి ఉండటం కాదు!

నూతనంగా మారినవారిని సాధ్యమైనంత త్వరగా సాక్ష్యం ఇమ్మని ఉపదేశించే ఒక చైనీస్ పాస్టర్ గురించి హడ్సన్ టేలర్ చెప్పారు. ఒకసారి, నూతనంగా మారిన యువకుడిని కలుసుకున్నప్పుడు, ఆ పాస్టర్ ఇలా అడిగాడు, “బ్రదర్, మీరు రక్షింపబడి ఎంతకాలం అయ్యింది?” తాను రక్షించబడి దాదాపు మూడు నెలలు అయిందని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. “అయితే రక్షకుని కొరకు మీరు ఎంతమందిని గెలిచారు?” అని అడిగాడు హడ్సన్.

“ఓహ్, నేను ఇంకా నేర్చుకుంటున్నాను” అని మారిన వ్యక్తి  అన్నాడు. పాస్టర్ అసమ్మతితో తల అడ్డంగా ఊపుతూ,  “యువకుడా, నీవు పూర్తి స్థాయి బోధకుడివి కావాలని ప్రభువు ఆశించడు, కానీ నీవు నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కొవ్వొత్తి ఎప్పుడు ప్రకాశిస్తుందో చెప్పు  అది సగం కాలిపోయినప్పుడా?.”

“కాదు, వెలిగించగానే” అని సమాధానం వచ్చింది. “నిజమే కదా. కాబట్టి వెంటనే మీ కాంతిని ప్రకాశింపజేయండి” అన్నాడు.

5. నేను సువార్తీకరణలో మరిన్ని సృజనాత్మక పద్ధతులను నేర్చుకోవాలి. అప్పుడు నేను సువార్తీకరణ చేస్తాను.

మన సువార్తీకరణలో మెరుగుపొందడానికి ఆస్కారం ఉండాలి. అయితే, సువార్తీకరణకు సంబంధించి మనకు తెలిసిన కొద్దిపాటి విషయాల్లో మనం నమ్మకంగా ఉండకపోతే, మరిన్ని పద్ధతులను నేర్చుకున్నప్పుడు మనం విశ్వాసంగా ఉంటామా?

లూకా 16:10 “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.”

పై వాక్యం చాలావరకు డబ్బు విషయానికి వర్తించినప్పటికి  సువార్తీకరణకు కూడా వర్తిస్తుంది.

6. నేను పిచ్చివాడిని మరియు మతోన్మాదినని వారు అనుకుంటారు.

క్రైస్తవుడు ఈ లోకానికి చెందినవాడు కాదు కానీ మరొక ప్రపంచానికి చెందినవాడు. కాబట్టి, ఈ లోకంలోని ప్రజలు క్రైస్తవులను భిన్నంగా చూడడం సహజమే. మనం క్రైస్తవులం కాకముందు మనం కూడా క్రైస్తవులను పిచ్చివారిగా చేసేవారమని గుర్తుంచుకోండి.

1 కొరింథి 1:18 “సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.”

1 కొరింథి 4:10 “మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము.”

7. సువార్తీకరణ చర్చిలో నాయకుల బాధ్యత.

అవిశ్వాసులను చర్చి ఆరాధనకు, సువార్తను వినడానికి లేదా ప్రత్యేక సువార్తీకరణకు ఆహ్వానించడం సువార్తీకరణలో ఒక పద్ధతి, కాని ఇది వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు సాక్ష్యమివ్వడానికి ప్రత్యామ్నాయం కాదు. సువార్త ప్రకటించడానికి నోరు తెరవమని తనను అనుసరించే ప్రతి ఒక్కరికి ప్రభువు ఆజ్ఞాపించారు. ఇది ఆది విశ్వాసుల మాదిరి.

అపొ.కా 8:4 కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.”

8. నేను అందరిలో కలవలేను. సహజంగానే నాకు చాలా సిగ్గు, ప్రజలతో మాట్లాడాలంటే భయము.

దేవుడు భయాన్ని తొలగించి, ఆయన గురించి మాట్లాడే శక్తిని మనలో నింపారు.

అపొ.కా 1:8 “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”

2 తిమోతి 1:7-8 “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు. 8 కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చి యైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.”

9. నేను వారితో మాట్లాడే బదులు ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తాను.

సువార్తీకరణకు ప్రార్థన తప్పనిసరి కాని, ప్రభువు మనల్ని నోరు తెరిచి ఇతరులకు తన గురించి చెప్పమని ఆజ్ఞాపించారు.

లూకా 24:47 “యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.”

లూకా 8:39 “నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.”

తప్పిపోయిన వ్యక్తి గురించి నోరు తెరచి మనం ప్రభువును అడగాలి. అది ప్రార్థన. అయితే దేవుని గురించి తప్పిపోయిన వ్యక్తికి కూడా మనం నోరు తెరచి చెప్పాలి. అది సువార్తీకరణ. రెండూ ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయం కాదు.

10. వారు చాలా మొండిగా కనిపిస్తారు. వారు సందేశాన్ని అంగీకరిస్తారని నేను అనుకోను.

సువార్త ప్రకటన ద్వారా కఠిన హృదయాలను బద్దలు కొట్టి వాటి స్థానంలో మృదువైన హృదయాలను పెట్టడం దేవుని పని.

యిర్మీయా 23:29 “నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?”

అపొస్తలుడైన పౌలును ఉదాహరణగా తీసుకోండి. అతడు సువార్తను ప్రతిఘటించడమే కాకుండా చాలామంది క్రైస్తవులను వారి విశ్వాసం బట్టి చంపడంలో చురుకుగా ఉన్నాడు. అయినప్పటికీ, దేవుడు అతడిని మార్చారు [1 తిమో 1:12-16; అపొ.కా 26:9-18]. దేవుడు చేయగలిగిన దానిని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. సత్యాన్ని నమ్మకంగా అందించడమే మన వంతు. ఫలితాలు దేవుని చేతిలో ఉన్నాయి.

ఇవీ సువార్తీకరణకు సాధారణంగా ఉండే 10 అడ్డంకులు.

తర్వాతి ప్రచురణలో, సువార్తీకరణకు ఉండే అదనపు అడ్డంకులను చూస్తాము. అప్పటి వరకు, ఈ అడ్డంకులను అధిగమించడానికి మరియు తన సువార్తను నమ్మకంగా ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక!

Category

Leave a Comment