సంతోషకరమైన వివాహానికి దేవుని నియమము

(English Version: God’s Formula For A Happy Marriage)
ఒక వ్యక్తి కొన్ని లక్షణాలను కొన్ని వారాలపాటు గమనించిన తర్వాత డాక్టరు దగ్గరకు వెళ్లాడు. పరీక్ష చేసిన డాక్టరు అతని భార్యతో, “మీ భర్త అరుదైన ఎనీమియాతో బాధపడుతున్నారు. చికిత్స చేయకపోతే 3 నెలల్లో చనిపోతాడు. కాని మంచి విషయం ఏమిటంటే సరైన పోషకాహారంతో దీనిని బాగుచేయవచ్చు. మీరు చేయవలసిందేల్లా ఉదయానే లేచి బలమైన అల్పాహారం చేసిపెట్టాలి. మధ్యాహ్నం ఇంటిలో చేసిన ఆహారం, రాత్రి మొలకెత్తిన ధాన్యాలు ప్రతిరోజు అతనికి తినడానికి ఇవ్వాలి. ఇంటిలో వండిన కేకులు తినుబండారాలు, బన్నులు మొదలైనవి పెట్టడం వలన అతని ఆయువు పెరుగుతుంది. మరొకవిషయం ఏమిటంటే, అతనికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది కాబట్టి, మీ ఇల్లు ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండాలి” అని చెప్పి, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అని అడిగాడు అన్నాడు. ఆ భార్య ఏమి అడగలేదు.
ఈ విషయం మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా? అని అడిగాడు డాక్టరు. అందుకు ఆమె నేను చెబుతాను అని పరీక్ష చేసే గదిలోనికి వెళ్ళింది. తనకు తీవ్రమైన అనారోగ్యం ఉందని గ్రహించిన భర్త, కష్టమా? అని అడిగాడు. అందుకామె కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా అవును అని తలాడించే సరికి నాకేమయింది? అని అడిగాడు.భార్య ఏడుస్తూ “మీరు 3 నెలలో చనిపోతారని డాక్టరు చెప్పారు” అంది.
మనం ఈ రకమైన జోకులకు నవ్వుతాము. చాలామంది వివాహాన్ని ఇలానే చూస్తారు. పరిస్థితులు కష్టంగా ఉంటే విడిచిపెట్టి వచ్చేయడమే. అయితే క్రైస్తవులు కూడా వివాహాన్ని ఈ దృష్టితోనే చూడాలా? మరి ముఖ్యంగా, దేవుడు వివాహాన్ని ఈ దృష్టితోనే చూస్తారా? లేఖనాల ప్రకారం కాదా?
ఆది.కా 2:24 లో వివాహం ద్వారా స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు హత్తుకుంటారు వారు ఏకశరీరమైతారు అని చెప్పబడింది. విజయవంతమైన వివాహం గురించి దేవుని ఆలోచన ఎలా ఉందో “హత్తుకొనును, ఏక శరీరమైయుందురు” అనే మాటలలో అద్భుతంగా తెలుస్తుంది. తప్పుడు విడాకులు లేని కాలంలో వివాహం గురించి దేవుని అభిప్రాయం ఇది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధం క్రీస్తుకు సంఘంతో ఉన్న ఆత్మసంబంధంగా ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి (ఎఫెసి 5:32).
దీనినిబట్టి వివాహమనేది శారీరక సంబంధం కన్నా అధికమైనది. క్రీస్తు ద్వారా సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగానే (ఎఫెసి 3:21) దైవిక వివాహం ద్వారా ఆయన మహిమపరచబడతారు. భార్యాభర్తలు ఇద్దరూ హృదయపూర్వకంగా తమ జీవితంలో వివాహంతో సహా అన్ని విషయాలలో యేసు అధికారానికి లోబడినప్పుడే అది సాధ్యమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ సహపనివారిగా తమ జీవితాలలో ప్రభువును మహిమపరచాలనే ఉద్దేశాన్ని కలిగివుండాలి.
అయితే, పాపం అలా జరగకుండా అడ్డగిస్తుంది. వ్యభిచారం, గర్వం, క్షమించలేకపోవడం, గత తప్పులను గుర్తుచేసుకోవడం, స్వార్థం, డబ్బు పట్ల ప్రేమ మొదలైన పాపాల కారణంగా వివాహాలు విఫలమవుతున్నాయి. ఈ లోకం కూడా బలమైన వివాహాలను స్నేహించదు. “కలిసివుండలేకపోతే విడిపోండి” లేక “పెళ్లి చేసుకునేది విడిపోడానికే విడిపోయేది పెళ్లి చేసుకోడానికే” లేక “నీ సొంత విజయాన్ని నీవు పొందాలి” అని లోకం చెబుతుంది. క్రీస్తును వెంబడించడంలో ఆత్మత్యాగం కన్నా ఆత్మగౌరవానికి ప్రాధాన్యతను ఇచ్చే బైబిలు విరుద్దమైన బోధలతో ఎక్కువ సంఘాలు కూడా ఈ విషయంలో ఏమి సహాయకారిగా ఉండటం లేదు.
కాబట్టి, 10 అంశాలను పరిశీలించడానికి ఇవ్వడం ద్వారా ఈ దౌర్జన్యాలన్నిటి మధ్య వివాహాం గురించి దేవుని బోధనలకు లోబడాలనే ఆశకలిగినవారికి సహాయం చేయడానికి ఈ ప్రచురణ ప్రయత్నిస్తుంది. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి కృషి చేస్తే, ఇబ్బందికరమైన వివాహంలో కూడా పట్టుదలతో నిలబడగలిగే శక్తి ఆయన మనకు ఇస్తారు.
1. వాక్యాన్ని ధ్యానించండి.
కొలసి 3:16లో “క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి” అని ఉన్నది. కీర్తన 1:2లో “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు” అని ఉన్నది. కాబట్టి లేఖనాలను చదవడానికి మనం ప్రతిరోజు తగినంత సమయాన్ని కేటాయించాలి. మనం దేవుని ఘనపరిచే వివాహాన్ని కలిగివుండాలంటే మన శరీరం సాతాను మరియు లోకం నుండి మనం వినే మాటలకు సమాధానం చెప్పడానికి మనం క్రమంగా దేవుని మాటలు వినవలసివుంది. ఎఫెసి 5:21-32 మరియు 1 కొరింథి 13 వంటి వాక్యభాగాలను తరచూ ధ్యానించడం ఆరోగ్యకరమైన వివాహానికి ఎంతో అవసరము.
2. మీ జీవితభాస్వామిని నిజాయితీగా ప్రేమిండం నేర్చుకోవాలి.
ఎఫెసి 5:25లో “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, …….. దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను” అనే ఆజ్ఞ భర్తలకు ఇవ్వబడింది. తీతు 2:4లో, “తమ భర్తలను ప్రేమించవలెను” అనే ఆజ్ఞ భార్యలకు ఇవ్వబడింది. ఇది “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను” ఆజ్ఞకు ప్రతిబింబంలా ఉన్నప్పటికి, (మత్తయి 22:39) ఒకరికి అత్యంత దగ్గరా ఉండే పొరుగువారు వారి జీవితభాగస్వామియే అని జ్ఞాపకం ఉంచుకోవాలి.
నిజమే, మన జీవితభాగస్వామి ఈ లోకంలో పరిపూర్ణ వ్యక్తి కాదు, అలాగే మనంకూడా పరిపూర్ణులం కాదని గుర్తుంచుకోవాలి. మనం విడిపించబడిన పాపులమైనప్పటిని యేసుని చూసేవరకు ఈ జీవితకాలమంతా పోరాడుతూ ఇంకా పాపపూరితమైన శరీరంలో నివశిస్తున్నాము. కాబట్టి ఇది మనకు ఎలా పోరాటమో, మన జీవితభాగస్వామికి కూడా అలాగే పోరాటమని గుర్తుంచుకోవాలి. ఏమైనప్పటికి, అపరిపూర్ణ ప్రజలను దేవుడు ప్రేమిస్తాడు అని ఎరిగి ఉండడం మనకు ఆదరణ కలిగిస్తుంది. అలాగే అపరిపూర్ణ వ్యక్తులను ప్రేమించడానికి కావలసిన శక్తిని కూడా ఇస్తానని వాగ్దానం చేశారు. (1 థెస్సలో 4:9)
3. లైంగిక పవిత్రత కొనసాగించండి.
హెబ్రీ 13:4లో ఈ ఆజ్ఞ చాలా స్పష్టంగా ఇవ్వబడింది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” అశ్లీలచిత్రాలు మరియు వ్యభిచారం వలన అనేక వివాహాల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి కన్నులు ఏమి చూస్తున్నాయి హృదయంలో రహస్యకోరికలు ఏమిన్నాయని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి (మత్తయి 5:28-30).
పాపపు ఆలోచనలు వెంటనే అయినా తర్వాత అయినా పాపం చేయడానికి దారితీస్తాయి. మామూలుగా సరసమాడుతున్నాను అనడానికి అవకాశంమే లేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనకిచ్చిన జీవితభాగస్వామిని కాకుండా వేరే ఎవరినైనా కోరుకోవడం పాపమే. ఇతరులకు తప్పుడు సంకేతాలు ఇచ్చేలా విశ్వాసులు ఎన్నడూ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, వస్త్రధారణ చేసుకోకూడదు. దాని వలన అనవసరమైన సమస్యలు వస్తాయి. “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము” (1థెస్సలొ 4:3) కాబట్టి దానికి దూరంగా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి.
4. లైంగిక సాన్నిహిత్యాన్ని కొనసాగించాలి.
లైంగిక పవిత్రత కొనసాగించడం ఎంత అవసరమో లైంగిక సాన్నిహిత్యాన్ని కొనసాగించడం కూడా అంతే అవసరము. 1 కొరింథి 7:1-5లో లైంగిక సాన్నిహిత్యం గురించి కొన్ని సత్యాలను వివాహమైన దంపతులకు పౌలు జ్ఞాపకం చేశాడు. రెండవ వచనంలో, “అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను” అని అతడు చెప్పాడు. అతడు లైంగిక సాన్నిహిత్యాన్ని ప్రోత్సాహిస్తున్నాడని దీనిలో స్పష్టంగా ఉంది. అతడు 3-5 వచనాలలో, “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు. ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి” అని చెప్పాడు.
అయితే ఈ వచనాలు భర్త లేదా భార్య ఎదుటివారినుండి లైంగిక సుఖాన్ని హక్కుగా అడగమని కాదుకాని నిస్వార్థమైన ప్రేమ వాతావరణంలో లైంగిక సాన్నిహిత్యాన్ని కలిగివుండాలని ఇవి నొక్కి చెబుతున్నాయి. కొన్ని వివాహాలలో భార్యాభర్తలలో ఒకరు లేదా ఇద్దరు తీరికలేని జీవితాలతో లేదా అయిష్టతతో తమ శరీరాలను ఒకరి నుండి ఒకరికి దూరం చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన వివాహానికి దేవుని ప్రణాళిక ఇది కాదు. బలమైన వివాహానికి లైంగిక పవిత్రత మాత్రమే కాకుండా లైంగిక సాన్నిహిత్యం కూడా కావాలి. ఆ కారణంగానే వివాహాబంధంలో లైంగిక సాన్నిహిత్య సుగుణాలను ప్రశంసించడనికి దేవుడు బైబిలులో పరమగీతములు అనే గ్రంథమంతటిని ఉంచారు.
5. క్షమించే హృదయాన్ని పెంపొందించుకోవాలి.
ఎఫెసి 4:32లో మనకు “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అని బోధించబడింది. విశ్వాసులుగా మనం, ఏ అపకారం గురించైనా ఎన్నడూ మన హృదయాలలో ద్వేషాన్ని ఉంచుకోకూడదు; ఎల్లప్పుడూ క్షమించగలిగేవారిగా ఉండాలి. గతంలో చేసిన తప్పులనే పదేపదే గుర్తు చేసుకోవడం వలన చాలా వివాహాలు విఫలమయ్యాయి. “తప్పుల చిట్టా ని పెట్టుకోవద్దు” అని 1 కొరింథి 13:5లో మనకు చెప్పడంలో ఏ ఆశ్చర్యం లేదు. ద్వేషం మనుషులను బానిసగా చేస్తే, క్షమాపణాగుణం మనల్ని విడుదల చేస్తుంది. క్రీస్తుచే క్షమించబడిన మన పాపాలను పదేపదే గుర్తు చేసుకోవడం వలన ద్వేషాన్ని అధికమించగలుగుతాము అలాగే క్షమించే హృదయాన్ని కలిగివుండగలము.
6. తృప్తికలిగి ఉండండి.
హెబ్రీ 13:5లో “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా” అని చెప్పబడింది. తృప్తికలిగి ఉండమని చెప్పిన హెబ్రీ 13:5 వచనానికి ముందు 4వ వచనంలో “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను” అనే ఆజ్ఞ ఇవ్వడం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. వివాహాలు నాశనం అవడానికి గల రెండు ప్రధానమైన కారణాలు ఏమిటంటే లైంగిక పాపము మరియు ధనాపేక్ష.
డబ్బు, కెరీర్, ఇతర అనారోగ్యకరమైన కోరికల వెంట పరిగెత్తడం వలన అవి కేన్సరుగా వ్యాపించి వెంటనే వివాహాలను నాశనం చేస్తాయి (1తిమోతి 6:6-10). తప్పైన వాటివెనుక పరిగెత్తిన ఫలితంగా భార్యాభర్తల మధ్య అనేక విభేధాలు వస్తాయి. యాకోబు 4:1-3లో అన్నిరకాల గొడవలకి సరైన మూలకారణం తెలియచేయబడింది, “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.”
కాబట్టి దురాశనుండి తమ హృదయాన్ని కాపాడుకోగలిగి సంతృప్తిని కలిగివుంటే, అది వివాహాన్ని బలపరచడానికి సహాయపడుతుంది.
7. ఇరువురూ కలిసి యెహోవాను సేవించండి.
ఎన్నో సంవత్సరాలు యెహోవాను సేవించిన తర్వాత తన జీవితచరమాంకంలో కూడా యెహోషువా యెహోవాను సేవించాలనే ఆశను పోగొట్టుకోలేదు. యెహోషువా 24:15లో అతని పరిశుద్ధ సంకల్పాన్ని మనం చదువుతాము. “యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.” తన చుట్టూ ఉన్నవారు దేనిని వెంబడిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా యెహోషువ తన పరిశుద్ధ లక్ష్యాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.
“ఎవరు సేవించినా సేవించకపోయినా మేము కలిసి యెహోవాను సేవిస్తాము” అనే లక్ష్యం ప్రతి క్రైస్తవ దంపతులకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు సేవించడానికే రక్షించబడ్డారని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యము. ఏక హృదయంతో యెహోవాను సేవించడానికి ప్రయత్నించే కుటుంబం తప్పకుండా వైవాహిక ఆనందాన్ని అనుభవిస్తుంది.
8. దీనులై ఉండండి.
సామెతలు 16:5లో, “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు” అని వ్రాయబడివుంది. గర్వానికి చోటువున్న వివాహంలో ఎన్నడూ సమాధానం ఉండదు. కాబట్టి భార్యాభర్తలు ఇరువురూ నిరంతరం దీనులై ఉండడానికి ప్రయత్నించాలి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని వ్రాయబడివుంది (యాకోబు 4:6).
సంతోషకరమైన వివాహం కావాలి అనుకుంటున్నారా? రోజు దీనులై ఉండడానికి ప్రయత్నిస్తే దానిలోనే జవాబు దొరుకుతుంది. దేవుడు దీనులను ఎల్లప్పుడు దీవిస్తారు ఎందుకంటే, క్రీస్తు నడచినమార్గం దీనత్వము. మనం కూడా ఆ మార్గంలో నడవడానికి పిలువబడ్డాము.
9. మీ హృదయాలను కాపాడుకోండి.
సామెతలు 4:23లో “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని వ్రాయబడెను. కాబట్టి అన్ని రకాల చెడ్డ ఆలోచనలను ప్రారంభంలోనే వాటిని పెరగనివ్వకుండా హృదయంలో చంపివేయాలి. లేకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది. యాకోబు 1:14-15లో ఈ నియమం గురించి మనకు స్పష్టంగా బోధించబడింది, “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.”
చెడు ఆలోచనలకు బదులు మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి దంపతులు ధ్యానించడానికి మరియు అనుదినం ఆచరించడానికి ఫిలిప్పి 4:8, “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి” అనేది చాలా అద్భుతమైన వాక్యము.
10. తరచుగా ప్రార్థించండి.
మనంతట మనమే మన వివాహాన్ని బలపరచుకోలేము. మన స్వశక్తితో ఈ యుద్ధాన్ని పోరాడలేము. మన వివాహాలను తేలిక గా తీసుకోకూడదు. ఎఫెసి 6:12లో “ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము” అని మనకు జ్ఞాపకం చేయబడింది. మనం నిరంతరం తీవ్రమైన అలుపెరుగని ఆత్మీయయుద్ధంలో ఉన్నామని గ్రహించాలి. ఆ గ్రహింపు వలన మనం అనుదినం మోకరించి దేవుని కాపుదల కోసం ఆయనకు మొరపెడతాము.
ఎఫెసి 6:18లో, “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయమని” ఆజ్ఞ ఇవ్వబడింది. ఆత్మలో ప్రార్థించడమంటే, ఆత్మ బయలుపరచిన వాక్యం ప్రకారం ఆత్మ సమర్పణతో ప్రార్థించాలి. యెహోవా సహాయం లేకపోతే మన వివాహాలు కృంగిపోతాయి. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” (యోహాను 15:5) అని యేసు చాలా స్పష్టంగా చెప్పారు.
కాబట్టి దైవభక్తికలిగిన వివాహాలను పెంపొందించడానికి సులువైన మరియు సహాయకరంగా ఉండే 10 నియమాలు ఇవే.
యెహోవా సహాయంతో ఆయన ఆత్మ మరియు వాక్యం ద్వారా ప్రతి వివాహం దైవభక్తికలిగిన వివాహంగా ఉంటుంది. మరలా నూతనంగా ప్రారంభించడానికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. క్రైస్తవులు నిత్యం శోధనలతో ఉక్కిరిబిక్కరి అయ్యే ఈ లోకంలో, దేవుడు తనను నమ్మకంగా వెంబడించేవారిని కనికరిస్తానని వాగ్దానం చేశారు. విడిచిపెట్టడం చాలా సులభంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దేవుడు చాలా స్పష్టంగా పట్టుదలతో ఆయనతో నడవడానికి మనల్ని పిలిచారు. ఈ పిలుపు వివాహవిషయంలో కూడా వర్తిస్తుంది.
ఈ ప్రచురణ చదువుతున్నవారిలో ఎవరి వివాహమైనా క్లిష్టపరిస్థితులలో ఉండవచ్చును. నా హృదయం మీ కొరకు నిజంగా బాధపడుతుంది. దానికి మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణం కావచ్చు కాకపోవచ్చు. కారణం ఏమైనప్పటికి సర్వశక్తిమంతుడు మరియు సార్వభౌమాధిపతి ఐన ప్రభువు ఆధీనంలో సమస్తం ఉన్నాయనే ఆలోచనలో మీరు ఆదరణ పొందాలని నేను కోరుకుంటున్నాను.
యిర్మీయా 32:27లో “నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” అని దేవుడు అంటున్నారు. ఆయన తలచుకుంటే ఇప్పుడే నిన్ను విడిపించగలరు. అయితే మీరు వీటిని మరికొంతకాలం అనుభవించడం దేవుని చిత్తమైతే ఆయనకు ప్రతిఘటించవద్దు. ఈ పరిస్థితుల గుండా నీవు వెళ్ళడానికి ఆయన ప్రణాళికలను అంగీకరించి ఆయన కృపమీద నమ్మకం ఉంచాలి(2 కొరింథి 12:9). మీ జీవితభాగస్వామిని ప్రేమించడం కొనసాగించండి. మీ పాపపూరితమైన శరీరం మిమ్మల్ని చేయమని బలవంతం పెట్టేవాటిని చేయడానికి అంగీకరించకండి.
దయగల దేవుడు కొన్ని సందర్భాలలో బైబిలుపరమైన విడాకులను దయచేశాడు అయితే అది చివరి ఎంపికగా ఉండాలి (మత్తయి 5:31; మత్తయి 19:9; 1 కొరింతి 7:15-16). క్రైస్తవులుగా మనం, మన జీవితభాగస్వామి పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపపడేలా చేయడానికి సాధ్యమైనవన్నీ చేయాలి. వ్యభిచారం చేసినప్పటికి క్షమించగలిగివుండాలి. అయితే కొన్ని సందర్భాలలో తప్పకుండా విడాకులు తీసుకోవలసి వస్తుంది. అయితే క్రైస్తవులుగా చివరివరకూ ఆ వివాహాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ప్రయత్నాన్ని చేయాలి.
మీరు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఆయనపై ఆనుకుంటే తట్టుకునే శక్తి మీకు ఇవ్వబడుతుంది. క్రీస్తుకొరకు పట్టుదలగా ఉన్నందుకు మనలో ఎవరు పరలోకంలో చింతించరు. నిజానికి, మనం ఉండవలసినంత పట్టుదలగా ఉండలేదని మనం చింతించాలి. కాబట్టి, మనం నిరంతరం నిత్యత్వం గురించి ఆలోచించాలి. భూమిపై ఈ తాత్కాలిక యాత్ర యొక్క కష్టాలను భరించడానికి ఇది సహాయపడుతుంది.
విశ్వాసులందరికి చివరిగా ఒక మాట. మనలో స్వీయనీతి మరియు విడాకులు తీసుకున్నవారిపట్ల లేదా వ్యభిచారం చేసినవారిపట్ల వ్యతిరేకత పెంపొందకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. తమ వైవాహిక జీవితంలో విఫలం అయినవారిపై రాళ్ళు రువ్వడానికి బదులుగా వారు మరలా దేవునిలో కట్టబడాలనే ఆశ నిజంగా కలిగి ప్రేమతో వారిని చేరుకోవాలి (గలతీ 6:1).
“నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు అన్నారు (మత్తయి 5:28). ఈ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదని మనలో ఎవరైనా చెప్పగలరా? వివాహవిషయంలో ఇబ్బందులు పడుతున్న ఇతరులతో సౌమ్యంగా మెలగాలని ఇది మనకు తెలియచేస్తుంది.