రూపాంతరం చెందిన జీవితము 9వ భాగము ఇతరుల అవసరాలలో పాలుపొందండి

(English version: “The Transformed Life – Sharing With Others In Need”)
రోమా 12:13 మొదటి భాగం మనల్ని “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుడి” అని పిలుస్తుంది. పాలుపొందుడి అనే పదం కొయినోనియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీని నుండే సహవాసం అనే పదం వచ్చింది. ఇది క్రైస్తవ సమాజంలో సాధారణంగా ఉపయోగించే పదం. కొత్త నిబంధనలో ఈ పదాన్ని సందర్భానుసారంగా వివిధ రకాలుగా అనువదించారు: పాల్గొనడం, భాగస్వామ్యం, పాలుపొందడం మరియు సహవాసం. అందరు కలిసి జీవించడం దీని ప్రాథమిక భావము.
అన్ని సహవాసాలకు పునాది దేవునితో మనకున్న సహవాసమే అని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. 1 కొరింథి 1:9లో “మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు” అని ఉంది. తన కుమారుని ద్వారా దేవునితో సహవాసంలో ఉన్నవారు ఆటోమెటిక్‌గా ఇతర క్రైస్తవులతో సహవాసం కలిగివుంటారు. అన్నింటికంటే ముందు మనమందరం క్రీస్తు శిరస్సుగా ఉన్న ఒకే శరీరంలోని అవయవాలం. అవసరంలో ఉన్న విశ్వాసులతో మన వనరులను పంచుకోవడం ఈ సహవాసంలో ఒక భాగం. రోమా 12:13లో చెప్పింది అదే.
తమ భౌతిక వనరులను అవసరంలో ఉన్న ఇతర విశ్వాసులతో పంచుకోవాలని విశ్వాసులు తెలియచేసే కొన్ని ఇతర వాక్యభాగాలు కొత్త నిబంధనలోని ఉన్నాయి.
1 తిమోతి 6:18 “మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.”
హెబ్రీ 13:16 “ఉపకారమును, ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.”
కాబట్టి, విశ్వాసులకు పంచుకోవడం ఒక ఎంపిక కాదని మనం గమనించాలి. ఇది స్పష్టమైన ఆదేశం. ఒకే శరీరంలోని సభ్యులమైన మనం ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ, అక్కర కలిగి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి.
జాన్ ముర్రే అనే వేదాంతవేత్త, “మనం పరిశుద్ధుల అవసరాలను మన అవసరాలుగా గుర్తించి వాటిని మన స్వంతం చేసుకోవాలి” అన్నాడు. ఆదిసంఘం అదే వైఖరి కలిగివుంది. అపొ.కా 2:44-45లో, “విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. 45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి” అని ఉంది. ఇది కమ్యూనిజం కాదు కాని క్రైస్తవ్యానికి మూలం! తరువాత, అపొ.కా 4:32-35 విశ్వాసుల వైఖరిని వివరిస్తుంది.
కాబట్టి, ఆ ఆలోచనలతో 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఈ ఆదేశాన్ని ఆచరణలో పెడదాము.
1వ ప్రశ్న: మనం ఇవ్వాల్సిన ప్రజలు ఎవరు?
అవిశ్వాసులకు సహాయం చేయమని విశ్వాసులకు అనేక సూచనలు బైబిలులో ఉన్నప్పటికీ, ఇక్కడైతే మనకు తెలిసిన మరియు తెలియని విశ్వాసులకు ఇవ్వాలనే ఆదేశం ఇచ్చారు. బైబిలులో ఈ రెండింటికి ఉదాహరణలు ఉన్నాయి. పైన ఉన్న అపొ.కా 2:44-45 విశ్వాసులు తమకు తెలిసిన ఇతర విశ్వాసులకు ఇవ్వడం గురించి తెలియచేస్తుంది. రోమా 15:26-27 కొరింథీ, థెస్సలొనీకయ మరియు ఫిలిప్పీయాలోని సంఘాల విశ్వాసులు యెరూషలేములో ఉన్న తమకు తెలియని ఇతర విశ్వాసులకు ఇవ్వడం గురించి తెలియచేస్తుంది.
కాబట్టి, అవసరంలో ఉన్న తెలిసిన మరియు తెలియని విశ్వాసులకు మనం ఇవ్వాలి.
2వ ప్రశ్న: మనం ఇస్తున్నప్పుడు ఉండాల్సిన వైఖరులు ఏమిటి?
మనం ఇస్తున్నప్పుడు 3 వైఖరులు కలిగివుండాలి.
#1. మనం ఆత్రుత కలిగి ఇవ్వాలి. మాసిదోనియా విశ్వాసులు ఇచ్చిన కానుకలు గురించి వివరిస్తూ పౌలు, “…ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను” అని వ్రాసాడు [2 కొరింథీ 8:3-4]. మాసిదోనియా విశ్వాసులను ముందుకు నెట్టవలసిన అవసరం లేదు. వారికి ఒక అవసరం గురించి తెలుసు కాబట్టి వారు ఇవ్వడానికి ఆసక్తి చూపారు. పరిశుద్ధాత్మ ఆధీనంలో జీవించే విశ్వాసులు ఇవ్వాలని కోరుకుంటారు. వారు ఒక అవసరం గురించి విన్నప్పుడు వారి హృదయాలు వెంటనే తెరుచుకుంటాయి, అలాగే వారి పర్సులు కూడా! ఇవ్వడానికి వారిని ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు.
#2. మనం దాతృత్వ వైఖరితో ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు ద్వేషంతో కాకుండా సంతోషకరమైన ఉదార హృదయంతో ఇవ్వాలి. మరిన్ని నాణేలను తిరిగి పొందడానికి మీరు స్లాట్ మెషీన్‌లో నాణేలు ఉంచిన మాదిరిగా మనం ఇవ్వకూడదు. మరో మాటలో చెప్పాలంటే, మనం ఎక్కువ పొందడానికి దేవునికి లంచం ఇస్తున్నామనే వైఖరితో ఇవ్వకూడదు. ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఉదారంగా ఇవ్వాలి.
ఈ అంశానికి సంబంధించి ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మోషే చెప్పిన మాటలు: “7 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. 8 నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. 10 నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. 11 బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను” [ద్వితియో 15:7-8, 10-11].
ఉదారంగా ఇవ్వమని యేసు ఆజ్ఞాపించారు [లూకా 6:38]. ఉదారంగా ఇవ్వడం విశ్వాసానికి సంబంధించినది. నేను నా వనరులతో ఇతరుల అవసరాలను తీర్చినట్లయితే, దేవుడు నా అవసరాలు తీరుస్తాడనే వాగ్దానాన్ని విశ్వాసం నమ్ముతుంది.
#3. మనం దేవుని మహిమపరచాలనే లక్ష్యం కలిగిన వైఖరితో ఇవ్వాలి: ఇతరులకు ఇవ్వడం అనేది మనకు మంచిగా అనిపించడానికి [మనం సరైన వైఖరితో చేసినప్పుడు]; ఇతరులు చూడడానికి [కొన్ని సందర్భాల్లో ఇది అనివార్యం]; ఇతరులు ప్రయోజనం పొందడానికి [సందర్భానుసారంగా] కాదు కానీ ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలనే లక్ష్యంతో ఉండాలి.
పౌలు 2 కొరింథి 9:12-15లో ఇలా వ్రాసాడు, “12 ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. 13 ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందునవారు దేవుని మహిమపరచుచున్నారు. 14 మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థనచేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు. 15 చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.”
దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు [12వ వచనం]; దేవుడు స్తుతించబడును [13వ వచనం]. అదే అంతిమ లక్ష్యం. మనం ఇచ్చే దానితో సహా జీవితంలో మనం చేసే ప్రతిపనిలో ఆయన మహిమే మన లక్ష్యం కావాలి.
కాబట్టి, మనం ఇస్తున్నప్పుడు ఉండాల్సిన 3 వైఖరులు: ఆత్రుత, దాతృత్వం మరియు దేవుని మహిమపరచడమే లక్ష్యం.
“మొదట మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవడమే” సరైన వైఖరికి కీలకమని 2 కొరింథి 8:5 ప్రకారం నేను అంటాను. “ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.” దేవునికి లొంగిపోయి మనల్ని మనం ఎంత ఎక్కువగా సమర్పించుకుంటామే ఇతరులతో పంచుకునే విషయంలో మనకు అంత సరైన వైఖరి ఉంటుంది. మన కోసం మరణించడానికి తన కుమారుడిని ఇచ్చిన ఉదారమైన దేవుడిగా మనం ఈ దేవుని ఎంత ఎక్కువగా చూస్తామో, మన కోసం తనను తాను సమర్పించుకున్న ఈ రక్షకునితో మనం ఎంతగా ప్రేమలో పడతామో ఇతరులతో మన వనరులు పంచుకునే విషయంలో మనం సరైన వైఖరిలో అంత వృద్ధిని అనుభవిస్తాము.
ఇచ్చే విషయంలో హెచ్చరిక.
మంచి విషయాలు దుర్వినియోగం అయినట్లే ఇవ్వడంలో కూడా సులభంగా దుర్వినియోగం జరుగుతుంది. నా ఉద్దేశ్యం ఏమిటంటే, క్రైస్తవులమని చెప్పుకునే కొందరు ఇతరులను ఉపయోగించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. థెస్సలొనీకలో ఇదే జరిగింది. 2 థెస్సలొ 3:10లో “మేము మీ యొద్ద ఉన్నప్పుడు–ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితిమి గదా” అని చదువుతాము. థెస్సలొనీకలో పని చేయని కొంతమంది సోమరిపోతులు సమస్య కాదు; వారు పనిచేయడం లేదు పనిచేయడానికి ఇష్టపడడం లేదు; మరియు వారు తమ వనరులను వారితో పంచుకున్న ఇతర క్రైస్తవులను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పౌలు ఈ సోమరి విశ్వాసులను పని చేయాలని హెచ్చరిస్తూ వారికి మద్దతు ఇవ్వకుండా విశ్వాసులను హెచ్చరించాడు.
అదే విధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెడు అనుభవాలు ఎదురైనప్పటికి ఈ ఆదేశానికి మనం విధేయత చూపించాలని నేను చెబుతున్నాను. ఈ ఆజ్ఞను నమ్మకంగా పాటించడానికి సహాయం చేయమని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని అడగాలి.
ఆపదలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేయడమనేది ఒక్కసారి లేదా అప్పుడప్పుడు చేసే పని కాదు. మనం చేయగలిగినంతలో కష్టాలలో ఉన్న విశ్వాసులకు సహాయం చేయాలి. గలతీ 6:10లో “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము” అని వ్రాయబడింది.
“మనకు లేని దాని నుండి ఇవ్వాలని దేవుడు ఆశించడని” గుర్తుంచుకోండి. మనకు ఉన్నదాని నుండి మాత్రమే ఇవ్వాలి. మన ఆర్థిక విషయాలలో మనం ఎంత తెలివిగా ఉంటే అంత ఎక్కువ ఇవ్వగలము. విశ్వాసుల అవసరాలను కోసం ఇవ్వడమనేది మన నెలవారీ బడ్జెట్‌లో భాగంగా ఉండాలి. అత్యవసరం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. తీతు 3:14లో “మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను” అని వ్రాయబడింది.
మనం మన జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోడానికి కాదు కానీ మన ఇచ్చే ప్రమాణాన్ని పెంచుకోడానికే దేవుడు మన సంపదను వృద్ధి చేస్తారు. అవసరంలో ఉన్న ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం నిజంగా రక్షించబడ్డామో లేదో తెలుసుకోవచ్చు. యాకోబు 1:27లో, “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే” అని వ్రాయబడింది. అలా చేయడంలో విలమైతే అది దేవుడు తిరస్కరించడమే అవుతుంది. యేసే స్వయంగా, “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” [మత్తయి 7:21] అని చెప్పారు. మనం ఇతరులతో మనస్ఫూర్తిగా పంచుకోవడమనేది ఆయన ఉద్దేశాలలో ఒకటి.
మనం నమ్మకమైన దాతలమా? మనం నిల్వచేసేదానికంటే ఎక్కువ ఇస్తున్నామా? బ్యాంకు ఖాతాలు అబద్ధాలు చెప్పవు. మన అసలు నిధి ఎక్కడ ఉందో అవి చెబుతాయి. మన నిజమైన యజమాని యేసునా లేక డబ్బునా? అని అవి చెబుతాయి. మన ఆర్థిక విషయాలపై కూడా యేసే ప్రభువు అని రూపాంతరం చెందిన జీవితం రుజువును చూపించడానికి మనకి మనం ఈ ప్రశ్న వేసుకుని పరిశీలించుకోవడం చాలా ముఖ్యము.
ఇచ్చేటప్పుడు మనం చాలా వరకు దేవునిలా ఉంటామని అంటారు. అది నిజమే! దేవుడు గొప్ప దాత. ఆయన పిల్లలు కూడా అదే ఆలోచన కలిగివుండాలి. ఇతరులతో పంచుకోవడంలో ఈ ఆజ్ఞను నమ్మకంగా పాటించేవారికి “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడని” దేవుని నుండి ఒక వాగ్దానం ఉంది [హెబ్రీ 6:10].