రూపాంతరం చెందిన జీవితము 8వ భాగము- పట్టుదల కలిగిన ప్రార్థన

(English version: “The Transformed Life – Faithful Praying”)
రూపాంతరం చెందిన జీవితంలో ప్రార్థన ఒక అంతర్భాగము. రోమా 12లో రూపాంతరం చెందిన జీవితాన్ని వర్ణిస్తూ పౌలు విశ్వాసులను “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని పిలుపునివ్వడంలో ఏ ఆశ్చర్యం లేదు [రోమా 12:12]. ప్రార్థనలో నిమగ్నమైన జీవితాన్ని జీవించమని ఈ పిలుపుకు అర్థము. ఈ పిలుపు మనకు ఆశ్చర్యం కలిగించకూడదు ఎందుకంటే మన రూపాంతరం యొక్క అంతిమ లక్ష్యం పూర్తిగా క్రీస్తులా మారడమే కాబట్టి క్రీస్తు ప్రార్థన ద్వారా గుర్తించబడినట్లుగా మనం కూడా ప్రార్థన ద్వారా గుర్తించబడాలి.
ప్రార్థనావసరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే అది యేసు మాత్రమే. అయినప్పటికీ, ఆయనే ఎడతెగని ప్రార్థనకు మాదిరిగా ఉన్నారని సువార్తలు స్పష్టం చేస్తున్నాయి. ప్రార్థనా నేపథ్యంతో యేసు పరిచర్య చేశారు. ఆయనకు బహిరంగంగా పరిచర్య చేసినప్పటికి మూడున్నర సంవత్సరాలే సమయం ఉన్నప్పటికీ, ప్రార్థనలో సమయం గడపడకుండా ఆయన ఎప్పుడూ లేరు. ఆయన గెత్సేమనేలో బంధించబడడానికి ముందు ప్రార్థించారు అలాగే సిలువపై ప్రార్థించారు. తన చివరి శ్వాస వరకు ప్రార్థించారు. ప్రార్థన లేకుండా యేసు ఏ రోజూ ప్రారంభించలేదు ముగించలేదు.
ఆయనను నిశితంగా గమనించిన ఆయన శిష్యులు [లూకా 11:1] ప్రార్థించడం నేర్పించమని అడగడమే కాకుండా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత తమ జీవితాల్లో కూడా ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అపొ.కా 2:42లో చూసినట్లుగా ఆదిసంఘం ప్రార్థన పట్ల అంకితభావంతో ఉంది. సంఘంలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కూడా, అపొస్తలులు తమ మొదటి పిలుపైన ప్రార్థన మరియు బోధించడం నుండి తప్పిపోలేదు [అపొ.కా 6:4].
ఆదిసంఘం ప్రార్థనకు ఎలా అంకితమైందో అపొస్తలుల కార్యములు గ్రంథం మళ్లీ మళ్లీ చూపిస్తుంది. అపొస్తలుల కార్యములు చదివితే ప్రార్థనకు సంబంధించి కనీసం 20 వచనాలు మనం చూస్తాము [అపొ.కా 1:13-14, 1:24-25, 2:42, 3:1, 4:24, 29, 31, 6 :3-4, 6, 7:60, 8:15-17, 9:11, 40, 10:2, 9, 12:5, 12, 13:3, 14:23, 16:25, 20:36 , 21:5, 27:35-36, 28:8]. మనం చూసినట్లుగా ఆది క్రైస్తవులు ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి ఆదిసంఘం ఒక బలమైన శక్తిగా ఉండటంలో ఏ ఆశ్చర్యం లేదు!
రోమాలోని ఈ వాక్యభాగంలో చెప్పినట్లుగానే పౌలు తన ఇతర పత్రికలలో కూడా ఎడతెగని ప్రార్థనకున్న అవసరాన్ని నొక్కి చెప్పాడు. దానికి కొన్ని ఉదాహరణలు:
ఎఫెసి 6:18 “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.”
ఫిలిప్పి 4:6 “దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”
కొలొస్సి 4:2 “ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.”
1 థెస్సలొ 5:17 “యెడతెగక ప్రార్థనచేయుడి.”
యేసు పట్టుదల కలిగి ప్రార్థించారు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి! ఆదిసంఘం ఆయన మాదిరిని అనుసరించింది మనం కూడా అనుసరించాలి. ప్రార్థించే గురువుకు ప్రార్థించే సేవకులు ఉండడం సముచితం. కానీ, జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం మొదట దేవుని వద్దకు పరిగెత్తకుండా మన స్వంత శక్తిపై ఆధారపడడం మన స్వభావం
ఒక క్యాన్సర్ రోగికి అనేక రకాల చికిత్సలు చేసిన తర్వాత డాక్టర్, మేము అన్ని రకాల చికిత్సలు చేశాము. “బహుశా ఇప్పుడు మీరు ప్రార్థించాల్సిన సమయం వచ్చింది” అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి “అయితే చివరకు విషయం అంతవరకు వచ్చింది అన్నమాట” అని అన్నాడు.
ప్రార్థన చివరి ఎంపిక! మిగిలినవన్ని విఫలమైనప్పుడు ప్రార్థన ప్రయత్నించండి అనేది ఈ లోక ఆలోచనా విధానం. బైబిలు బోధకు ఇది పూర్తిగా వ్యతిరేకము. ప్రార్థన అనేది ఎప్పుడూ మన మొదటి , రెండవ మరియు చివరి ఎంపికగా ఉండాలి. మనం చేసే ఇతర పనులన్నీ ప్రార్థనలో నుండే రావాలి. మీరు చూడండి, మనం ప్రార్థన చేయలేదంటే దేవునిపై ఆధారపడటం కంటే మనపై మనమే ఆధారపడతామని తెలియచేయడమే అని అర్థము. మనం దీన్ని మాటల ద్వారా చెప్పకపోవచ్చు, కానీ మన పనులు దానిని బహిరంగంగా తెలియచేస్తాయి.
పరిచర్యలో కూడా ప్రార్థన ప్రప్రథమంగా ఉండాలి. మనము పరిచర్యను దృష్టిలో ఉంచుకొని ప్రార్థించకూడదు, కానీ మనము ప్రార్థన ప్రకారం అన్ని పరిచర్యలను చేయాలి. ప్రార్థనలో గడిపిన సమయం నుండి పరిచర్య వస్తుంది. యేసు తన 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు, ఆయన వారిని మొదట “తనతో ఉండడానికి” తరువాత “బోధించడానికి వెళ్లడానికి” నియమించారు. [మార్కు 3:14]. మొదట ఆయనతో ఉండండి, ఆపై పరిచర్యకు వెళ్లండి!
యేసు తండ్రితో సమయం గడిపి ఆ తర్వాతే పరిచర్య చేశారు. అపొస్తలులు యేసుతో సమయం గడిపి ఆ తర్వాత పరిచర్య చేశారు. మొట్టమొదటి మిషనరీ ప్రయాణం ప్రార్థనతో ఉపవాసంతో ప్రారంభించబడింది [అపొ కా 13:1-3]. మన విషయంలో కూడా అలాగే ఉండాలి. మన ప్రార్థన మన ఇతర కార్యకలాపాలన్నింటికీ ఆజ్యం పోస్తుంది. చాలామంది విశ్వాసులు తాము బాధలు అనుభవించినప్పుడు మాత్రమే ప్రార్థిస్తారు. అవిశ్వాసులు కూడా అంతే. అయితే విశ్వాసులమైన మనం ఉత్సాహంగా ప్రార్థించడానికి కష్టాల కోసం ఎదురుచూడకూడదు. మనం ఎప్పుడూ శ్రద్ధగా ప్రార్థిస్తూ ఉండాలి.
అమీ కార్మైకేల్ మాటలు ఈ సత్యాన్ని ధృవీకరిస్తున్నాయి:
యుద్ధ గాయాల నుండి రక్షణ కోసం, మనకు కలిగిన వినాశనం నుండి ఉపశమనం కోసం, నొప్పి నుండి విశ్రాంతి కోసం కాకుండా ఆధ్యాత్మిక విజయం కోసం మనం ఎక్కువగా ప్రార్థించడం నేర్చుకోవాలి. విజయం అంటే శ్రమల నుండి విడుదల కాదు, శ్రమలలో విజయం. అది అడపాదడపా కలిగేది కాదు శాశ్వతమైనది.
క్రైస్తవులు సణగడానికి ఉపయోగించే సమయమంత సమయం ప్రార్థనలో గడిపినట్లయితే, వారు సణగడానికి ఏమీ ఉండదు అని ఒకరు చెప్పారు.
ప్రార్థనలో పట్టుదలగా ఉండాలనే ఈ ఆజ్ఞను మనం ఎలా ఆచరణలో పెట్టగలం? ప్రార్థనలో పట్టుదలగా ఉండడంలో మనకు సహాయపడేందుకు నేను 10 ఉపయోగకరమైన సూచనలు అందించి మీకు సహాయపడాలని అనుకుంటున్నాను.
1. నిశ్శబ్దమైన స్థలాన్ని కనుగొనండి.
ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రార్థన చేసుకోడానికి మన ఇళ్లలో లేదా బయట ఒక స్థలాన్ని మనం కనుగొనాలి. అది మన ప్రార్థన గదిగా ఉండాలి.
2. నిర్దిష్ట సమయాలను నిర్ణయించుకోవాలి.
దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి నిర్దిష్ట సమయాలను నిర్ణయించుకుని వాటిని కొనసాగించడంలో మనం క్రమశిక్షణ పాటించాలి. ఆ పవిత్రమైన సమయాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. నిర్ణీత సమయాల్లో ప్రార్థించడం ద్వారా ఇతర సమయాల్లో కూడా మరి ఎక్కువగా ప్రార్థించగలుగుతాము.
3. ప్రార్థించేటప్పుడు బైబిలు ఉపయోగించండి.
బైబిలును ఉపయోగించడం ద్వారా ఆయన వాక్యంలో బయలుపరచిన దేవుని చిత్తానికి అనుగుణంగా మన ప్రార్థనలు ఉండేలా చూసుకోవచ్చు. లేఖనభాగాలను ప్రార్థనగా మార్చడం నేర్చుకోవాలి. బైబిలు వచనాలను బిగ్గరగా ప్రార్థించాలి. ఇది మన మనస్సును ఏకాగ్రతగా ఉంచడానికి సహాయపడుతుంది!
4. వినయంతో ప్రార్థించాలి.
దేవుడు సృష్టికర్త; మనం ఆయనచే సృష్టించబడ్డాము. దీని మధ్య చాలా భేధం ఉంది. ఈ సత్యం మనం ఆయనను వినయంతో సమీపించడానికి మనకు సహాయం చేస్తుంది. మనం ఆయన పిల్లలమే అయినప్పటికీ, మనం మన పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపపడి వినయంతో ఆయన దగ్గరకు వెళ్ళాలి. వినయం కలిగిన హృదయం నుండి మన ప్రార్థనలు రావాలి. “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని నిజంగా ప్రార్ధించగలగాలి [లూకా 22:42].
5. నిజాయితీతో ప్రార్థించాలి.
దేవుడు మనలను స్వాగతిస్తున్నాడు, ఆయనతో నిజాయితీగా ఉండాలి. కాబట్టి, మన మొరలను వినేవాని ఎదుట భక్తిపూర్వకంగా నిస్సందేహంగా మన హృదయాలను కుమ్మరించడానికి మనం సంకోచించకూడదు.
6. మీ అభ్యర్థనలు నిర్దిష్టంగా ఉండాలి.
నిజమే మన అవసరాలు చెప్పకముందే దేవునికి తెలుసు. కానీ అడగడం వలన మనం ఆయనపై ఆధారపడ్డామని తెలియచేస్తాము. అలాగే నిర్దిష్టంగా ఉండడం వల్ల మన ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా మనకు సహాయం పడుతుంది.
7. దృష్టి మరల్చే వాటిని తొలగించండి.
ప్రార్థన చేసేటప్పుడు మన గాడ్జెట్‌లను దూరంగా ఉంచాలి. ఫోను లేదా టాబ్లెట్ నుండి వచ్చే నోటిఫికేషన్ శబ్దం మన దృష్టిని మరల్చవచ్చు. కొన్ని సమయాల్లో ఏదో ఒక వస్తువు వలన ప్రార్థన నుండి మన దృష్టి మరలుతుంది. మన పూర్తి ధ్యానాన్ని యేసుపై ఉంచాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం మన జీవిత భాగస్వామితో లేదా పిల్లలతో మాట్లాడకూడదు. దాని వలన మన దృష్టి మరలుతుంది. అందుకే మనకు ప్రశాంతమైన ప్రదేశం కావాలి.
8. ఇతరులతో కలిసి ప్రార్థించండి.
వ్యక్తిగత ప్రార్థనతో పాటు, మన కుటుంబ సభ్యులతో, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించాలి. మనం చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరవ్వాలి. కలిసి ప్రార్థించడం వలన మనం ఇతరులను ప్రోత్సహించడమే కాకుండా మరింత నమ్మకంగా ప్రార్థన చేసేలా ప్రోత్సహించబడతాము.
9. ఇతరుల కొరకు ప్రార్థించండి.
మధ్యవర్తిత్వ ప్రార్థన మన ప్రార్థనలలో అంతర్భాగంగా ఉండాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలో వారి భౌతిక మరియు ఈ లోకఅవసరాలకన్నా వారి ఆత్మీయ అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పిపోయివారి రక్షం కోసం మాత్రమే కాకుండా తోటి విశ్వాసులు గొప్ప ఆధ్యాత్మిక ఫలాన్ని కలిగివుండాలని ప్రార్థించాలి.
10. దేవుని హస్తాన్ని మాత్రమే కాకుండా దేవుని ముఖాన్ని చూడటానికి ప్రార్థించండి.
సాధారణంగా దేవుని చేతి నుండి మనం పొందగలిగే వాటిపై మాత్రమే మన ప్రార్థనలు కేంద్రీకరించబడి ఉంటాయి. దేవుని ముఖాన్ని చూడడానికి ఎక్కువ కృషి చేయాలని మనం నేర్చుకోవాలి.మనం ఆయనతో మరింత సన్నిహితంగా ఉండటానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నించాలి. 1 దినవృ 16:11లో “యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి” అని చెప్పబడింది. కీర్తన 27:8లో దావీదు, “నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.”
మనం ఈ జాబితాకు మరిన్ని చేర్చవచ్చు—విశ్వాసంతో ప్రార్థించడం, పట్టుదలతో ప్రార్థించడం మొదలైనవి. అయితే ఈ కొన్ని ఆలోచనలు మరింత నమ్మకంగా ప్రార్థించేలా మనల్ని ప్రేరేపించాలని ఆశిద్దాం.
మత్తయి 26:40లో “యేసు మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? అన్నారు.” మనలో ఎంతమంది రోజూ ఆ గంట కేటాయిస్తాము? సగటు విశ్వాసి గరిష్టంగా 10-15 నిమిషాలు కేటాయిస్తాడు. మనం దేవునికి అంత తక్కువ సమయం ఇచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన వింటారని ఎలా ఆశించగలం? ఒక గంట అంటే 24 గంటలన్న రోజులో 4%. అంటే 5% కంటే తక్కువ! మనం అనవసరమైన ఇతర విషయాలకు అంటే టీవీకి సోషల్ మీడియాకు ఎక్కువ సమయం ఇస్తాము. సమయం లేకపోవడం సమస్య కాదు కానీ ప్రార్థన అవసరతకున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోకపోవడమే సమస్య. అది మనల్ని ప్రార్థనలో నమ్మకంగా ఉండకుండా నిరోధిస్తుంది.
ప్రార్థించే యజమానికి ప్రార్థించే సేవకులు ఉండాలి! కాబట్టి, మనం నమ్మకమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. తద్వారా క్రీస్తు స్వరూపంలోకి మరింతగా రూపాంతరం చెందుతాము!