రూపాంతరం చెందిన జీవితము 6వ భాగము- నిరీక్షణలో సంతోషించండి

Posted byTelugu Editor June 11, 2024 Comments:0

(English version: The Transformed Life – Rejoicing In Hope”)

మూడవ శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి తన మరణాన్ని ముందే ఊహించి తన స్నేహితుడికి వ్రాసిన చివరి మాటలు ఏమిటంటే: “ఇది చాలా చెడ్డ లోకం. కానీ నేను దాని మధ్యలో ఒక గొప్ప రహస్యాన్ని నేర్చుకున్న నెమ్మదస్తులు పరిశుద్ధులైన ప్రజలను కలుసుకున్నాను. మన పాప జీవితంలో లభించే సంతోషం కంటే వెయ్యి రెట్లు గొప్ప సంతోషాన్ని వారు కనుగొన్నారు, వారు తృణీకరించబడి హింసించబడ్డారు కానీ వారు దానిని లక్ష్యపెట్టలేదు. తమ ఆత్మలకు వారే యజమానులు. వారు లోకాన్ని జయించారు. వారే క్రైస్తవులు వారిలో నేనూ ఒకడిని.”

ఈ మాటల ప్రకారం, క్రైస్తవుడు ఈ లోకంలోని సుఖాలతో కష్టాలతో సంబంధంలేకుండా సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రచురణలో చర్చించే అంశం ఇదే.

మనమందరం అప్పుడప్పుడు నిరుత్సాహానికి గురిచేసే పరిస్థితులు ఎదుర్కొంటాం కాబట్టి సంతోషం అనే అంశం ప్రయోజనకరమైనది మరియు చాలా అవసరము. గమనించకుండా వదిలేస్తే నిరుత్సాహం శాశ్వతమైన నిరాశకు దారితీస్తుంది. అప్పుడు కేవలం ఉదాసీనత, భయం, మెదడు మొద్దుబారడం వంటివి ఉంటాయి. నిరాశతో పోరాడుతున్న వారికి ఒక రోజు గడవడం ఒక యుద్ధమే. పగలు పూర్తయితే రాత్రి  గడవడం మరొక యుద్ధమే. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. రాత్రి తర్వాత ఉదయం వస్తుంది ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

ఎవరైనా తీవ్ర నిరాశకు గురైనా లేదా నిరుత్సాహానికి గురైనా, రోమా ​​​​12:12 మొదటి భాగంలో నివారణ ఉంది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరంలేని నిజమైన వైద్యం మనమందరం పొందవచ్చును. అది ఏమిటంటే “నిరీక్షణగలవారై సంతోషించుడి.” పౌలు కేవలం సంతోషించమని చెప్పకుండా, “నిరీక్షణలో సంతోషించమని” చెప్పడాన్ని గమనించండి. మనలో ఉన్న నిరీక్షణ కారణంగా సంతోషంగా ఉండాలనే భావం దీనిలో ఉంది. నిర్వచనం ప్రకారం నిరీక్షణ అంటే ప్రస్తుతం మనకు లేని దానిని తెలియచేస్తుంది.  భవిష్యత్తులో మనం సొంతం చేసుకోవాలనుకునే దానిని సూచిస్తుంది. కాబట్టి, ఈ వచనంలో పౌలు ప్రస్తావిస్తున్న సంతోషానికి ఆధారమైన ఈ నిరీక్షణ ఏమిటి?

మనం క్రీస్తు వలె మారినప్పుడు బైబిలులో చెప్పిన విధంగా మహిమపరచబడేటప్పుడు మన రూపాంతరం యొక్క పూర్తి అంతిమ ప్రభావాలను విశ్వాసులు అనుభవించే సమయాన్ని ఇది సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. పౌలు మనసులో ఉన్నది ఇదే అని నేను నమ్ముతున్నాను. రోమా ​​​​5:1-2లో పౌలు ఈ నిరీక్షణ గురించి ముందుగానే ప్రస్తావించడం వలన నేను ఇలా చెప్పాను, “1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. 2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.” “దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ” అనే దానికి దేవుని మహిమను పంచుకోవడం గురించి నిరీక్షణ అని అర్థము. క్రీస్తునందు విశ్వాసముంచినందుకు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము [అనగా ఆయన దృష్టిలో దేవుని నీతి కలిగివున్నాము]. దేవునికి మనకు మధ్య యుద్ధం ముగిసింది, అందుకే మనం దేవునితో సమాధానం కలిగివున్నాము. ఇది మన రక్షణలోని మొదటి దశ.

దాని ఫలితంగా, మనం ఇప్పుడు మన రక్షణలోని చివరి దశ కోసం ఎదురుచూడవచ్చు, అక్కడ మనం దేవుని మహిమను పంచుకుంటాము అనగా పూర్తిగా క్రీస్తును పోలి ఉంటాము. రోమా ​​​​8:30లో పౌలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు, “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” మనం ఇంకా మహిమపరచబడనప్పటికీ, “వారిని మహిమ పరచెను” అని భూతకాలంలో వ్రాయబడింది. పౌలు ఎందుకు అలా వ్రాసాడు? ఎందుకంటే ఇది సంపూర్ణ నిశ్చయత! మనం మహిమపరచబడతాము అనగా యేసు తిరిగి వచ్చినప్పుడు మనం నూతన శరీరాలను పొందినప్పుడు క్రీస్తులా మారతాము [రోమా 8:22-25]. మనకు నూతన శరీరాలు లభిస్తాయనే ఈ నిరీక్షణ కోసం మనం ఎదురుచూడాలని పౌలు చెప్పాడు.

రోమా ​​​​12:12లో అలాంటి నిరీక్షణ మన సంతోషానికి కారణంగా ఉండాలని చెప్పాడు. భవిష్యత్తులో మనం ఎదురుచూసే విధంగా మనం క్రీస్తు మహిమ శరీరాన్ని పోలిన నూతన శరీరాలను పొందినప్పుడు మనం ఆయనలాగా మారతామనే నిరీక్షణలో మనం సంతోషిస్తాము. క్రీస్తులా మారతామనే ఈ నిరీక్షణ మనం సంతోషంతో నిండిపోయేలా చేస్తుంది. ఆ సమయంలో దుఃఖం ఉండదు, కన్నీళ్లు ఉండవు, బాధ ఉండదు కేవలం మన దేవుని ఆయనను ఆరాధించే విధంగా ఆరాధించడంలోని అంతులేని సంతోషం మాత్రమే ఉంటుంది.  కానీ అప్పటి వరకు మనం పాపంతో నిండిన శరీరంలో జీవిస్తున్నప్పటికి సంతోషించడానికి పిలువబడ్డాము, శ్రమల మధ్యలో ఉన్నప్పటికి ఆనందంగా జీవించాలని మనం ఆజ్ఞాపించబడ్డాము. పౌలు 2 కొరింథి 6:10లో తాను, ఇతర అపొస్తలులు “దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము” అని పేర్కొన్నాడు. ఒకే సారి ఈ రెండు ఎలా సాధ్యపడతాయి?

ఈ పాప-శాపగ్రస్త ప్రపంచంలో బాధ అంతర్భాగమని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. పౌలు రోమా ​​​​12:15లో “ఏడ్చువారితో ఏడువుడి” అని చెప్పిన వాక్యం  ద్వారా ఈ సత్యం నిరూపించబడింది.  దుఃఖం వాస్తవమే అయినప్పటికీ, అందులో మనలో పట్టజాలని ఆనందాన్ని కలిగించే భవిష్యత్తు ఆశీర్వాదాల నిశ్చయత కూడా ఉంది. ఒక్కొక్క రోజు గడిచేకొద్దీ, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మన నిరీక్షణ నెరవేరినప్పుడు ఉండే ఈ భవిష్యత్తు వాస్తవికతకు సమీపిస్తాము. అది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. పౌలు ఉద్దేశ్యం ఇదే.

సంతోషించండి అనే ఈ ఆజ్ఞను మనం తీవ్రంగా పరిగణించాలి. మనకున్న సంపద హోదాను బట్టి సంతోషించమని ఆజ్ఞాపించలేదు కాని క్రీస్తు తిరిగి వస్తాడనే ఆశతో సంతోషించమని చెప్పబడింది. అలా చేయడంలో విఫలమవడం పాపం. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఏ ఒత్తిడి లేదని చాలామంది అంటారు. బహుశా వారిలో మీరు కూడా ఒకరు కావచ్చు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే: మీ ఆనందం దేనిపై ఆధారపడి ఉంది? అది స్థిరమైన మంచి జీతం లభించే లౌకికమైన ఉద్యోగంపై ఆధారపడి ఉందా? అది మంచి అనుబంధాలు, మంచి స్నేహితులు, మంచి ఆరోగ్యం, బ్యాంకులో డబ్బులు ఉండటం మరియు ఏ ఇతర ఇబ్బందులు లేకపోవడం అనే వాటిపై ఆధారపడి ఉందా? అవే అయితే, పౌలు ఇక్కడ మాట్లాడుతున్న సంతోషానికి ఆధారం అవి కావని దయచేసి అర్థం చేసుకోండి. లోకస్తులు కూడా వీటన్నిటిని కలిగి ఉండి సంతోషాన్ని  అనుభవిస్తారు. కానీ వీటిలో ఒకదానిని తీసివేసినా వారి ఆనందం అదృశ్యమైపోయి వెంటనే నిరుత్సాహం కలుగుతుంది.

దాని గురించి ఆలోచించండి. మనం త్వరగా ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. మనం సులభంగా ఆర్థికంగా నష్టపోతాం. సామెతలు 11:28లో, “ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును” అని వ్రాయబడి ఉంది. మనం విశ్వసించే వ్యక్తులు విఫలం కావచ్చు లేదా చనిపోవచ్చు. సామెతలు 11:7లో, “భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును” అనే సత్యం చెప్పబడింది. మన శరీరాలు కూడా రాత్రికి రాత్రే నశించిపోవచ్చు. ఆ జాబితా అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుత మీకు సంతోషాన్ని కలిగించే ముఖ్యమైన విషయం ఏమిటి? అదిలేకున్నా మీరు సంతోషంగానే ఉండగలరా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.

ఈ సంతోషాన్ని మనం ఎలా అనుభవించగలం? నేను మొత్తం ప్రక్రియ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాను.

గలతి 5:22-23లో, “సంతోషం” అనేది ఆత్మ ఫలంలో ఒకటిగా చెప్పబడింది. కాబట్టి, సంతోషం అనేది మన హృదయాలలో పరిశుద్ధాత్మ మాత్రమే కలిగించగలదు. ఆయన ఎలా చేస్తారు? ఆయన మనకు ఇచ్చిన వాక్యం ద్వారానే. మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాలలో సంతోషం కలిగిస్తుంది. ఈ సంతోషంలో మానవీయ కోణం ఉంది. మనల్ని మనం ధ్యానించడానికి ముఖ్యంగా దేవుని వాక్యంలో ఆనందించడానికి అర్పించుకోవాలి తద్వారా మనలను మార్చడానికి పరిశుద్ధాత్మను అనుమతించాలి, దానిలో భాగంగానే మన హృదయాలలో సంతోషం కలుగుతుంది.

దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించి దానిని విశ్వసించి ఆచరిస్తే అంత ఎక్కువ సంతోషాన్ని పొందుతాము. సందర్భానుసారంగా, క్రీస్తు రాకడ గురించి, మనం క్రీస్తులాగా మారడం గురించి మనం ఎంత ఎక్కువగా చదివితే, ఇది జరగాలని మనం ఎంత ఎక్కువగా కోరుకుంటున్నామో, అది అంతగా మన నిరీక్షణను బలపరుస్తుంది అంత సంతోషాన్ని అనుభవిస్తాము. మనం ఎంత ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తామో అంతగా శ్రమలను ఓపికగా సహిస్తాము. యిర్మీయా 15:16లో యిర్మీయా అనుభవాన్ని తెలియచేస్తూ, “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” దేవుని వాక్యాన్ని నిజంగా విశ్వసించడానికి , ధ్యానించడానికి మరియు దేవుని వాక్యాన్ని అన్వయించడానికి అంకితమైన వ్యక్తిని నాకు చూపించండి. నిరుత్సాహంతో కాకుండా తన దృఢమైన నిరీక్షణను బట్టి , ఆనందంతో నిండిన వ్యక్తిని  ఆ వ్యక్తిలో నేను మీకు చూపుతాను.

మరోవైపు, భవిష్యత్తుకు సంబంధించి దేవుని వాగ్దానాలపై దృష్టి పెట్టని వ్యక్తిని నాకు చూపించండి, ఆ వ్యక్తి లో నిజమైన బైబిలుపరమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించకుండా భూలోకసంబంధమైన పరిస్థితులపై మాత్రమే ఆధారపడి జీవించే వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అన్ని సక్రమంగా ఉంటే వారు సంతోషంగా ఉంటారు. వారి ప్రాపంచిక సుఖాలలో స్వల్ప మార్పు కలిగినా వారు నిరుత్సాహానికి గురవుతారు. మనం అలాంటి వారిలా ఉండకూడదు. కాని మన భవిష్యత్తుకు సంబంధించి దేవుని వాగ్దానాలను విశ్వసించడం, సంతోషించడం మరియు వాటి ప్రకారం నడచుకోవడం ద్వారా దేవుని దయను పొందడం ద్వారా నిజమైన బైబిలు సంతోషాన్ని వెంబడిద్దాం [రోమా 12:1]. దేవుని వాక్యం ద్వారా మన మనస్సులు నూతనపరచబడినందున ఆత్మ మనలను యథార్థంగా మారుస్తున్నదని అది రుజువు చేస్తుంది.

Category

Leave a Comment