రూపాంతరం చెందిన జీవితము 5వ భాగము- ఆసక్తి కలిగి ప్రభువును సేవించడము

Posted byTelugu Editor May 28, 2024 Comments:0

(English version: “The Transformed Life – Serving The Lord Enthusiastically”)

ఆసక్తితో ప్రభువును సేవించడం పరిశుద్ధాత్మచే రూపాంతరం చెందుతున్న జీవితానికి ఒక నిదర్శనము.

మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందమని విశ్వాసులను ఆజ్ఞాపించిన తర్వాత పౌలు రోమా ​​​​12:11లో ఈ ఆజ్ఞను ఇచ్చాడు: “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” యేసు ఒక తలాంతును [బంగారు సంచి] పొంది వెళ్లి భూమిలో దాచిన వ్యక్తిని మందలిస్తునప్పుడు మత్తయి 25:26లో “లేమి” అనే పదం “సోమరితనం” అని అనువదించబడింది. పాత నిబంధనలో కూడా, దేవుడు సోమరి వ్యక్తులను “సోమరిపోతులు” అని పిలిచారు. ఉదాహరణకు, సామెతలు 6:9లో సోమరులను మందలించే మాటలు చూస్తాము, “సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?” యెషయా 56:10లో, ఇశ్రాయేలు మతనాయకులు తమ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనందుకు దేవుడు వారిని మందలించాడు. అప్పుడు వారి సోమరితనాన్ని కూడా మందలించారు. “వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.” యిర్మీయా 48:10లో అదే ఆలోచనను ఉంది, “యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక.” అజాగ్రత్తగా అలసత్వంతో తనను సేవించేవారి గురించి ప్రభువు సంతోషించడు.

మనం దేవుని ఎలా సేవిస్తామనేది ఆయన పట్టించుకుంటారు. దాని గురించి కొత్త నిబంధనలో హెబ్రీ 12:28-29లో కూడా స్పష్టంగా చెప్పబడింది, “అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.” అందుకే మనలో ప్రతి ఒక్కరూ “నేను భయభక్తులతో దేవుని ఆరాధించి సేవిస్తున్నానా? కృతజ్ఞతతో ఆనందంతో ఆసక్తితో చేస్తున్నానా? ఇది ఆమోదయోగ్యమైన సేవేనా?” అని మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేవుడు అదే కోరుతున్నాడు!

రోమా ​​​​12:11లో, పౌలు ముఖ్యంగా ఏం చెబుతున్నాడంటే, “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక బహుమతులతో ఇతరులకు [రోమా 12:3-8] ప్రయోజనం చేకూరాలి తద్వారా దేవుని మహిమపరచాలి. “ఆత్మయందు తీవ్రతగలవారై” అనే పదాలకు మరగడం లేదా పొంగడం అనే భావం ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరేపించే ఆ రకమైన ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్మాదం గురించి పౌలు మాట్లాడటం లేదు. అతడు ఆసక్తి కలిగి పూర్ణహృదయంతో దేవునికి సేవించే బైబిలు ఆధారితమైన మనస్సు నుండి వచ్చే అంతర్గత వైఖరి గురించి మాట్లాడాడు.  అది ఎలాంటి హృదయం అంటే ప్రభువు తన యజమాని అని మరియు ఆయనకు తనమీద పూర్తి అధికారం ఉంది అని విశ్వసిస్తుంది. బానిస అనే పదం వచ్చిన పదం నుండే సేవించడం అనే పదం వచ్చింది. కాబట్టి, 11వ వచనాన్ని ప్రభువు కోసం ఉత్సాహంగా బానిసగా ఉండడం అని అనువదించారు. ఇక్కడ ప్రతికూల అర్థంతో బానిస అని చెప్పలేదు కాని యేసు రక్తంతో కొనబడిన దేవుని సొత్తు అనే సానుకూల దృక్పధంతో చెప్పాడు [1 కొరింథి 6:20]. ఈ యాజమాన్యం పూర్తి విధేయతను ఆశిస్తుంది.

దేవుని సేవించేటప్పుడు మనం ఏమి చేయాలో అవి మాత్రమే చేస్తున్నాము. లూకా 17:7-10లో యేసు మనకు బోధించినది ఇదే, “7 దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. 8 అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని 9 ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? 10 అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.” మనం మన కర్తవ్యాన్ని మాత్రమే చేస్తాము. ఆ వినయమే మనకు గుర్తింపు. మనం “యేసు క్రీస్తు దాసులు” అనే గొప్ప బిరుదును కలిగి ఉన్నాము. బానిసలు తమ యజమాని ఆజ్ఞాపించినట్లు చేస్తారు. తనకి ఆసక్తిగా సేవ చేయమని యజమాని మనకు ఆజ్ఞ ఇచ్చాడు.

దేవుని సేవించడంలో మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలనే దాని గురించి స్పిరిట్యువల్ డిసిప్లేన్‌ అనే తన పుస్తకంలో డోనాల్డ్ విట్నీ ఇలా చెప్పాడు (p. 129):

స్థానికంగా దేవుని రాజ్యంలో కష్టతరమైన సేవ కోసం ప్రతిభావంతులైన వాలంటీర్లు కావలెను. సేవ చేయడానికి ప్రేరణ దేవుని పట్ల విధేయత, కృతజ్ఞత, సంతోషం, క్షమాపణ, వినయం మరియు ప్రేమ. సేవ ఎంతో మహిమాన్వితంగా ఉంటుంది. సేవా ప్రదేశాన్ని విడిచిపెట్టాలనే కోరిక కొన్నిసార్లు బలంగా ఉంటుంది. వాలంటీర్లు ఎక్కువ పనిగంటలు, తక్కువ లేదా కనిపించని ఫలితాలు ఉన్నప్పటికీ విశ్వాసంగా ఉండాలి. నిత్యత్వంలో దేవుని నుండి తప్ప బహుశా ఎటువంటి గుర్తింపు ఉండదు.

విట్నీ చెప్పిన దాని సారాంశం ఏమిటంటే: ఎంత కష్టమైన పనైనా సరే మీ ప్రయత్నాలకు తగిన ఫలితం కనిపించకపోయినప్పటికి దేవునికి నమ్మకంగా సేవ చేయండి!

మనం ప్రభువును సేవించడాన్ని చర్చికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. 1 కొరింథి 10:31లో, “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” అని మనకు చెప్పబడింది. జీవితంలోని ప్రతి విషయంలో మనం దేవుని మహిమ కోసం జీవించాలి. మనం ఆయన కోసం 24/7 సజీవ యాగంగా ఉండాలి. జీవితంలోని అన్ని విషయయాలలో మనం చేసేవన్ని అంతిమంగా దేవుని కోసమేనని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు పని విషయంలో పౌలు ఎఫెసీయులకు ఇలా చెప్పాడు.

ఎఫెసీయులు 6:5-8 5 దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి. 6 మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, 7 మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవచేయుడి. 8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు.

కాబట్టి, మనం పని చేసే చోట బాహ్యంగా పని చేసేది మనుష్యుల కోసమే అయినప్పటికి మనం ఆసక్తితో దేవుని సేవించాలి.

చివరిగా సేవ విషయానికి వస్తే, మనం ఎక్కడ ఉంచబడ్డాము, ఎలాంటి పనిని చేయడానికి మనం పిలువబడ్డాము, మనం చేసిన పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేవి దేవుడు ఆధీనంలో ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఈ విడిచిపెట్టిన ప్రదేశంలో మిమ్మల్ని మీరు ఎందుకు పాతిపెట్టుకుంటారు? అని ఒక వ్యక్తి ఒక విదేశీ మిషనరీని అడిగినప్పుడు నేను నన్ను పాతిపెట్టుకోలేదు, నేను నాటబడ్డాను అని ఆ మిషనరీ బదులిచ్చాడు. ఆ రకమైన వైఖరి మార్పునంతా కలిగిస్తుంది. [వారెన్ వైర్స్బే, వెన్ లైఫ్ ఫాల్స్ అపార్ట్, p. 63].

దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో దానిని హృదయపూర్వకంగా అంగీకరించాలి మరియు అక్కడ ఆసక్తిగా ఆయనకు సేవ చేయాలి. కొన్నిసార్లు మనం నిరుత్సాహానికి గురవుతామని నాకు తెలుసు. నిరుత్సాహానికి అనేక కారణాలు ఉండవచ్చు. దేవుని ప్రవక్తలు, ఆయన అపొస్తలులు నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి మనం కూడా ఎదుర్కుటాము. అయితే ఆ సమయాల్లో విశ్వాసంతో రెండు పనులు చేయడంలో మాకు సహాయం చేయమని మనం ఆయనను అడగడం అవసరం.

1. మనం దేవుని దయ గురించి ఆలోచిస్తూ ఉండాలి [రోమా 12:1].

2. ప్రభువు కొరకు మనం పడిన శ్రమ ఎప్పుడూ వ్యర్థం కాదనే దేవుని వాగ్దానాలను మనం గుర్తుచేసుకోవాలి. 

సేవించే విషయంలో మనల్ని ప్రొత్సాహించే కొన్ని వాక్యభాగాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

1 కొరింథి 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

గలతి 6:9-10 9 మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. 10 కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము.

హెబ్రీ 6:10-12 10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యా యస్థుడు కాడు. 11-12 మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.

దేవుని వాక్యం ఒక ప్రోత్సాహము. ప్రభువు పని కోసం తమ జీవితాలను అర్పించిన దేవుని ప్రజలు కూడా గొప్ప ప్రోత్సాహము. క్రీస్తు కొరకు తమ సమస్తాన్ని అర్పించిన క్రైస్తవుల మరియు ఆయన కొరకు ఘోరమైన శ్రమలు అనుభవించిన ఆయన ప్రజల జీవిత చరిత్రలను చదవండి. వీరు ప్రభువును సేవించాలనే తమ నిర్ణయం గురించి ఎప్పుడూ విచారించలేదు. దానికి ఒక ఉదాహరణ:

విలియం బోర్డెన్ 1904లో చికాగోలోని ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతడు బోర్డెన్ డైరీ ఎస్టేట్ వారసుడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు అతనికి ప్రపంచయాత్ర  బహుమతిగా లభించింది. అతనికి ఈ యాత్రను కానునకగా ఇచ్చిన వారు దాని వలన అతనికి ఏమి లభించిందో గ్రహించలేదు.

పర్యటనలో ఉన్నప్పుడు విలియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌర్భాగ్యుల కొరకు, క్రీస్తు అవసరం ఉన్నవారి కొరకు అతనిలో భారం కలిగింది. అతడు మిషనరీగా క్రీస్తు సేవలో తన జీవితాన్ని అంకితం చేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ ఇంటికి ఉత్తరం వ్రాసాడు. స్నేహితులు బంధువులు అవిశ్వాసంతో ఉన్నప్పటికీ, బోర్డెన్ తన బైబిల్ వెనుక సంకోచం లేదు అనే రెండు పదాలను రాశాడు.

అతడు అమెరికాకు తిరిగి వచ్చి యేల్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అతడు ఒక ఆదర్శ విద్యార్థి. కళాశాల జీవితం మిషన్ ఫీల్డ్ పట్ల విలియంకున్న కోరికను చల్లార్చుతుందని ఇతరులు భావించినప్పటికీ, అది దానికి ఆజ్యం పోసింది.

అతడు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు; తన మొదటి సంవత్సరం ముగిసే సమయానికి 150 మంది విద్యార్థులు బైబిలు అధ్యయనం చేయడానికి, ప్రార్థించడానికి వారానికొకసారి సమావేశమయ్యేవారు. అతడు సీనియర్‌గా ఉన్న సమయానికి యేల్‌లోని 1,300 మంది విద్యార్థులలో వెయ్యి మంది డిసైపుల్‌షిప్ గ్రూపులలో ప్రతివారం బైబిలు అధ్యయనం మరియు ప్రార్థన కోసం సమావేశమయ్యేవారు.

అతడు తన సువార్త ప్రయత్నాలను కేవలం యేల్ విశ్వవిద్యాలయం ప్రాంగణం చుట్టూ ఉండే ఉండేవారికే పరిమితం చేయలేదు. అతని హృదయం బయటివారి కోసం కూడా అలాగే ఉండేది. అతడు యేల్ హోప్ మిషన్‌ను స్థాపించాడు. కనెక్టికట్‌లోని న్యూ హెవెన్ వీధుల్లో ఉన్నవారికి ఆయన పరిచర్యలు చేశారు. అతడు అనాథలు, వితంతువులు, నిరాశ్రయులు, ఆకలితో ఉన్న వారితో క్రీస్తు పరిచర్యను పంచుకున్నాడు, వారికి నిరీక్షణ ఇచ్చి ఆశ్రయాన్ని అందించాడు.

విదేశాల నుండి వచ్చిన ఒక సందర్శకుడిని అమెరికాలో ఉన్న సమయంలో అతడిని బాగా ఆకట్టుకున్నది ఏమిటని అడిగితే అతడు, “ఆ యువ మిలియనీర్ తన చేతిని యేల్ హోప్ మిషన్‌ చుట్టూ ఉంచి మోకరిల్లుతున్న దృశ్యం” అని చెప్పాడు.

బోర్డెన్ యేల్ నుండి పట్టభద్రుడైనప్పుడు, అతనికి చాలా మంచి ఉద్యోగాలు లభించాయి కాని చాలా మంది బంధువులు, స్నేహితులకు నిరాశ కలిగిస్తూ అతడు వాటిని నిరాకరించాడు. అతడు తన బైబిల్ వెనుక “తిరోగమనం లేదు” అనే మరో రెండు పదాలను రాశాడు.

అతడు ప్రిన్స్టన్ సెమినరీలో ప్రవేశించి గ్రాడ్యుయేషన్ తర్వాత చైనాకు ప్రయాణించాడు. ముస్లిం జనాభాలో క్రీస్తుకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో అతడు అరబిక్ నేర్చుకోవడానికి అధ్యయనం చేయడానికి ఈజిప్టులోనే ఆగిపోయాడు. అయితే అక్కడ ఉండగానే అతనికి స్పైనల్ మెనింజైటిస్ సోకడంతో కేవలం ఒక నెల మాత్రమే జీవించాడు.

ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో విలియం బోర్డెన్ చనిపోయాడు. బోర్డెన్ క్రీస్తును తెలుసుకోవడానికి ఆయన గురించి తెలియచేయడం కోసం మిగిలిన అన్ని విషయాలను నష్టంగానే ఎంచాడు. అతడు తన పూర్వీకుల నుండి సంక్రమించిన నిర్ధక జీవితాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా తన విమోచన క్రయధనం యొక్క మహిమలో జీవించడానికి ప్రయత్నించాడు.

అతని మరణం తర్వాత అతని బైబిల్ని చూసినప్పుడు అతడు వెనుక పేజీలో “విచారం లేదు” అనే మరో రెండు పదాలను జోడించినట్లు కనబడింది.

తన విడుదల ధర తెలిసిన వారికి తమను విమోచించిన వ్యక్తి కోసం జీవించడం అనేది ఎటువంటి విచారం లేని జీవితమని తెలుసు. విలియం బోర్డెన్ తనను విమోచించిన వ్యక్తితో వెళ్లాడాన్ని ఎంచుకున్నాడు. మరి మీరు?

[ఆంథోనీ కార్టర్, బ్లడ్ వర్క్]

బోర్డెన్ వంటి పరిచర్యకు దేవుడు మనందరినీ పిలవలేదని నేను ఒప్పుకుంటాను. అయితే విషయమేమిటంటే: ఆయన మనల్ని ఎక్కడ సేవచేయమని పిలిచినా అక్కడ మనం ఆసక్తితో చేయాలి! చివరికి యేసును సేవించడంలో మన జీవితాలను హృదయపూర్వకంగా విడిచిపెట్టడం అనేది ఏ విచారం లేని జీవితము. ఈ ఇవ్వడమనే దానికి మనం దేవుని నుండి పొందిన దయచే ప్రేరేపించబడింది. అందుకే దయ మన సర్వస్వాన్ని యేసుకు ఇచ్చేందుకు ప్రేరణ అని చెబుతూ పౌలు రోమా ​​​​12:1ని ప్రారంభించాడు. దయ అన్ని ఆధ్యాత్మిక సేవకు ఆధారం కాబట్టి దేవుని సేవించడనికి మనల్ని మనం పూర్తిగా అర్పించుకోవడానికి కృప మనల్ని ప్రేరేపించాలి.

ఈ కృప మీకు లభించిందా? లేకపోతే, ఎందుకు ఆలస్యం? నిజమైన పశ్చాత్తాపంతో విశ్వాసంతో యేసు వద్దకు వెళ్లి రక్షణ కనికరాన్ని దయచేయమని ఆయనను అడగండి. ఆయన వైపు చూసే వారందరూ తమ పాపాలకు పూర్తి క్షమాపణ పొందడానికి ఆయన అందరి పాపాల కోసం మరణించి సజీవంగా తిరిగి లేచారు. ఆయన దయ ఎంత గొప్పది!

మీరు ఈ కృప పొందినట్లయితే, మీరు ఆసక్తితో ఆయనను సేవిస్తున్నారా? సేవిస్తే దానిని కొనసాగించండి. చేయకపోతే ఆసక్తి చూపనందుకు పశ్చాత్తాపపడండి, దేవుని దయ గురించి ఎక్కువగా ఆలోచించండి. ప్రభువులో మీ శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదని తెలుసుకుని ఈ రోజు నుండి మీరు ఆయనకు సేవించే విధానాన్ని మార్చడానికి పరిశుద్ధాత్మను అనుమతించండి.

Category

Leave a Comment