రూపాంతరం చెందిన జీవితము 3వ భాగము- మన ఆత్మీయ వరములతో ఒకరికి ఒకరు సేవచేసుకొనుట

Posted byTelugu Editor April 30, 2024 Comments:0

(English version: “The Transformed Life – Using Our Spiritual Gifts To Serve One Another”)

రోమా ​​​​12: 1-2 లో, దేవునికి వాత్సల్యం బట్టి వారి శరీరాలను మనస్సులను సజీవ యాగంగా ఆయనకు సమర్పించడానికి క్రైస్తవులకున్న బాధ్యత గురించి పౌలు మాట్లాడాడు. రోమా ​​​​12:3 నుండి మిగిలిన అధ్యాయం అంతా క్రైస్తవులకు ప్రజల పట్ల అనగా విశ్వాసుల పట్ల అవిశ్వాసుల పట్ల ఉన్న బాధ్యత గురించి పౌలు చెప్పాడు.

రోమా ​12:3-8 లో, స్థానిక సంఘంలో ఒకరికొకరు సేవ చేసుకోవడానికి మన ఆత్మీయవరాలను ఉపయోగించవలసిన బాధ్యత గురించి చెప్పాడు. అయితే, మనం ఈ వచనాలను చూసే ముందు, 1 కొరింథి 12:7 “అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది” అనే దాని నుండి ఆత్మీయవరాల గురించి 4 ప్రాథమిక సత్యాలను నేర్చుకుందాము.

1వ సత్యము. ప్రతి క్రైస్తవునికి ఆత్మీయవరం [వరాలు] ఇవ్వబడ్డాయి: “ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.”

2వ సత్యము. ఆత్మీయవరాలు బహుమతిగా ఇవ్వబడ్డాయి. వారు సంపాదించలేరు లేదా డిమాండు చేయలేరు.

3వ సత్యము. ఆత్మీయవరాలు ఇచ్చేది పరిశుద్ధాత్మ: “ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.”

4వ సత్యము. ఇతరుల ప్రయోజనం కోసం ఆత్మీయవరాలు ఇవ్వబడ్డాయి: “అందరి ప్రయోజనము కొరకు.”

ఈ వచనంలోని సత్యాలను సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆత్మీయవరం అనేది ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రత్యేకమైన సామర్థ్యమురోమా ​​​​12: 3-8 ప్రకారం, క్రైస్తవులు తమ దేవుడు ఇచ్చిన ఆత్మీయవరాలతో ఒకరికొకరు సేవచేసే విషయంలో రూపాంతరం చెందిన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నప్పుడు వారికి ఖచ్చితంగా ఈ మూడు వైఖరులు ఉండాలి.

వైఖరి # 1. తగ్గింపు [రోమా 12:3]

3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.

ఆత్మీయవరాలను ఉపయోగించే విషయానికి వస్తే, రూపాంతరం చెందిన జీవితాన్ని తెలియచేసే ప్రాథమిక వైఖరి తగ్గింపు. “తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక,” అంటే మనల్ని మనం ఉన్నతంగా భావించకూడదు. ఇది మనందరికి అవసరము. “దేవుడు తన సేవకులకు అంతిమసంస్కారం చేసి తన పనిని కొనసాగిస్తాడు” అనే సామెత ఉంది. దేవుని ప్రజలు గతించిన తర్వాత కూడా దేవుని సంఘం కొనసాగుతుందనడానికి స్మశానమే రుజువు.

“ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” అని 1 కొరింథి 4:7 లో దేవుని కృప ఫలితమే మన జీవితాలు అని మనకు గుర్తుచేయబడుతుంది. మన వరాల గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి లేదా ఉన్నతంగా భావించడానికి ఏ ఆస్కారం లేదని ఈ వచనం స్పష్టం చేస్తుంది. మనకు లభించినదంతా సార్వభౌమాధికారుడైన దేవుడు ఇతరుల ప్రయోజనం కోసం, అంతిమంగా తన మహిమ కోసం మనకు వరాలు ఇవ్వడానికి మనల్ని ఎంచుకున్న ఫలితమే. 

పౌలు ప్రజలు తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని” అనగా తామున్న దానికన్నా తమను తాము ఎక్కువగా భావించకూడదని అలాగే సరైన రీతిలో తమ గురించి ఆలోచించమని పిలుపునిచ్చాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన విశ్వాసానికి అనుగుణంగా మన గురించి మనం ఆలోచించాలి.

మన గురించి మనకు ఉన్నతమైన దృక్పథం కలిగివుండకూడదు, అలాగే మన గురించి మరీ అల్పంగా భావించకూడదు. అది తప్పుడు తగ్గింపుకు సంకేతము. ఇది ఒకరు తన పాస్టరు వద్దకు వెళ్లి, “పాస్టర్‌గారు, నేను ఏపాటివాడిని అని నాకు అనిపిస్తోంది!” అని చెప్పి తన తగ్గింపు స్వభావాన్ని చూపించడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. దానిని గమనించిన ఆ పాస్టర్‌ వెంటనే “సోదరా, నువ్వు ఏ విషయం లోను నువ్వు అర్హుడవు కాదు! విశ్వాసంతో దీన్ని అంగీకరించు!” అన్నాడు.

పౌలు ఉద్దేశ్యం ఏమిటంటే, మనకు ఉన్నదంతా దేవుని నుండి వచ్చిన బహుమానం అని తెలుసుకోవడం ద్వారా మన గురించి మనం సరైన ఆరోగ్యకరమైన దృక్పథాన్ని కలిగి ఉంటాము! ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ మరియు ఆయన ద్వారా వరాలను పొందారు. మన ఆత్మీయవరాలను  తగ్గింపు స్వభావంతో ఉపయోగించడం మన బాధ్యత. మన వరాలను ఉపయోగించడం ద్వారా ఇతరులకు సేవ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం కలిగివుండాల్సిన మొట్ట మొదటి వైఖరి ఇదే. 

వైఖరి # 2. ఐక్యత [రోమా ​​12:4-5]

ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

మనం ఇతరులకు సేవ చేయాలనుకున్నప్పుడు తగ్గింపు స్వభావం మాత్రమే కాదు, ఐక్యత అనే దృక్పథం కూడా మనకు ఉండాలి. క్రీస్తు శరీరంలోని అవయవాలలో గొప్ప వైవిధ్యం ఉన్నప్పటికీ, చివరికి మనమందరం క్రీస్తుతో ఐక్యంగా ఉన్నాము మరియు మనలో ప్రతి ఒక్కరికి ఒకరిపై ఒకరికి అధికారం ఉంటుంది. ఈ సత్యాన్ని స్మరించుకున్నప్పుడు, మనం ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఐక్యత కోసం కృషి చేస్తాము. భౌతిక శరీరంలోని ప్రతి అవయవానికి ఇతర అవయవాలు అవసరమైనట్లే, మనం కూడా ఒకరికొకరు అవసరము.

మరొకచోట 1 కొరింథీయులకు 12:15-26 లో పౌలు భౌతిక శరీరం యొక్క ఉదాహరణను ఉపయోగించి క్రీస్తు శరీరంలోని ప్రతి క్రైస్తవునికి ఇతరులు ఎలా అవసరమో వివరించాడు. “అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున” [1 కొరింథి 12:25].

బైబిలు ఆధారిత ఐక్యత లక్ష్యంగా ఉండాలి. మానవ శరీరంలో ఒక అవయవం బాధించబడినప్పుడు మొత్తం శరీరం నొప్పిని అనుభవిస్తుంది అదేవిధంగా మనందరం ఒక్కటిగా ఉండి కలిసి బాధించబడతాము కలిసి సంతోషిస్తాము. శరీరంలో ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది, యోహాను 17:21 లో మన ఐక్యత కోసం “నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని” యేసు స్వయంగా ప్రార్థించారు. ఎఫెసి 4:3 లో, “మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడండి” అనే మాటల ద్వారా మనం ఐక్యతను కలిగివుండాలని పౌలు నొక్కిచెప్పాడు. విశ్వాసుల మధ్య ఐక్యతను కాపాడుకోవడానికి కృషి అవసరం!

ఇతరులు తమ ఆత్మీయవరాలను ఉపయోగించినప్పుడు వారు పొందే బహుమతులు లేదా గుర్తింపు గురించి మనం అసూయపడకూడదని దీని అర్థము. శరీరంలోని ఐక్యతను సులభంగా చెదరగొట్టే చిన్న చిన్న సమస్యలను మనం పట్టించుకోకూడదని దీని అర్థము. మనమందరం ఒకే శరీరంలో భాగమని, మనలో ప్రతి ఒక్కరూ మన ఆత్మీయవరాలను ఉపయోగించడం ద్వారా ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి పిలువబడ్డామని గుర్తుచేసుకుంటూ సహనాన్ని, క్షమాగుణాన్ని చూపించాలి.

వైఖరి # 3. విశ్వసనీయత [రోమా ​​12:6-8]

మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

పై జాబితా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఆత్మీయవరాలన్నిటి సమగ్ర జాబితా కాదు కాని 1 కొరింథి 12:28-30, ఎఫెసి 4:11, మరియు 1 పేతురు 4:11 వంటి ఇతర వాక్యభాగాలలో మరిన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ ఇచ్చిన వరాన్ని లేదా వరాలను ప్రతి విశ్వాసి విశ్వాసంతో ఉపయోగించాలని ఈ వాక్యం యొక్క భావము. ఒకరు తమ వరాలను దాచిపెట్టలేరు లేదా వాటిని ఉపయోగించవలసి వచ్చినప్పుడు సోమరిగా ఉండలేరు.  ఇతరులకు మేలుకరంగా ఉపయోగపడటానికి మనకు వరాలు ఇవ్వబడ్డాయి. అలాగే, ఈ వచనాలలో పాల్ ఇచ్చిన జాబితాను మీరు గమనిస్తే, బైబిల్‌లోని ఇతర భాగాల వలెనె, ఈ జాబితాలోని ప్రతిదీ ప్రతి  క్రైస్తవుడు అనుసరించవలసి ఉంది. ప్రతి విశ్వాసి ఇతరులకు బైబిలు గురించి చెప్పాలి, ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు బోధించాలి, ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులకు దానం చేయాలి మరియు ఇతరులపై దయ చూపాలి. ప్రత్యేక వరాలు కలిగి ఉన్నవారు ఇవ్వన్నీ మరి ఎక్కువగా చేయడానికి పిలువబడ్డారు.

మనకు ఇవ్వబడిన వరాలను నమ్మకంగా ఉపయోగించడమే అసలు సమస్య. మీకు ఏ వరాలు ఉన్నాయో మీకు తెలియకపోతే, ఎక్కడ అవసరం ఉందో తెలుసుకుని అక్కడ సేవ చేయడం ప్రారంభించండి. మీరు ఏ విషయంలో వరాలను కలిగివున్నారో మీరు తెలుసుకుంటారు. లేదంటే మీ చుట్టూ ఉన్న ఇతరులను అడగండి. లేదా ఏయే విషయాలలో సేవ చేయడానికి మీ హృదయం ఆసక్తి కలిగివుందో తెలుసుకోండి. దేవుడు శరీరాన్ని ఒకచోట చేర్చాడు, తద్వారా ఆత్మీయవరాలను దాచవలసిన అవసరం లేదు కానీ వాటిని బయటకు తీసుకువచ్చి ఉపయోగించాలి.

కాబట్టి, మనకు దేవుడు ఇచ్చిన ఆత్మీయవరాలతో ఒకరికొకరు సేవచేసే విషయంలో రూపాంతరం చెందిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనలో ఉండవలసిన 3 వైఖరులు-తగ్గింపు, ఐక్యత మరియు విశ్వసనీయత.

ముగింపు మాటలు.

ఏకాంత జీవితాలను గడపకూడదన్నది ప్రధాన విషయం. మన ఆత్మీయవరాలను ఒంటరిగా ఉపయోగించలేము. ఇతరులకు మేలు చేయడానికి వాటిని ఉపయోగించాలి. అందుకే స్థానిక చర్చిలో ఉండటం, సంఘ సమావేశాలకు హాజరు కావడం చాలా అవసరము. అంటే ఆదివారం ఉదయం ఆరాధనకు అలాగే ఇతర చర్చి కార్యక్రమాలైన బైబిలు అధ్యయనాలు, ప్రార్థన సమావేశాలు మొదలైన వాటిలో పాల్గొనాలి. చర్చి సమావేశాలలోనే కాకుండా బయట ఇతర విశ్వాసులను కలుసుకోవడం కూడా దీనిలో భాగమే. మనం క్రీస్తువలె ఉండాలనేది దేవుని లక్ష్యము. సంఘజీవనానికి వేరుగా ఉంటే అది జరగదు. మన ఆత్మీయవరాలను సముచితంగా ఉపయోగించడం ద్వారా మనం ఒకరి పట్ల ఒకరు చేయవలసిన వాటన్నిటిని చేయగలుగుతాము.

చాలామంది క్రైస్తవులు తమ ఆత్మీయవరాలను సమర్థవంతంగా ఉపయోగించకపోవడానికి గల కొన్ని కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • అహంకారం. “అంతా నాకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే నేను సేవ చేయను.” లేదా “నాకు గుర్తింపు ఇవ్వకపోతే, నేను సేవ చేయను.” లేదా విఫలమవుతామనే భయంతో, “నేను విఫలమైతే ఇతరులను ఎలా ఎదుర్కోగలను?” మొదలైన ఆలోచనలు ఉంటే దేవుడు ఏమనుకుంటున్నాడో అనే దానికంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
  • సోమరితనం. సేవ చేయడానికి కృషి అవసరం. దేవుని పనికి “అవును” అని చెప్పడం అంటే కొన్ని పనులకు “కాదు” అని చెప్పడమే. కేవలం ఆదివారాల్లో వచ్చి కనిపించడమే నేను చేయగలిగేది, ఎక్కువ వరాలు కలిగినవారు అవసరమైన పనులు చేస్తారనే వైఖరి చాలామంది విశ్వాసులలో ఉండడం బాధాకరమైన విషయము. వరాలు కలిగి ఉండటం అంటే మనం వాటిని ఉపయోగిస్తామని కాదు. మనం పూర్తిగా ప్రయత్నించి ముందుకు సాగాలి. నేడు విశ్వాసులలో వేధిస్తున్న పాపం సోమరితనము.
  • నిరుత్సాహము. కారణాలు అనేకం ఉన్నాయి. “ఫలితాలు కనిపించక పోవడం. తక్కువ ఉత్పదన. నా వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి, నేను ఇతరుల గురించి ఆలోచించలేను” వంటివి.
  • తప్పు ప్రాధాన్యతలు. లోకవ్యవహారాలకు చాలా సమయం ఇవ్వడము. శనివారం చేసే పనులకు ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే, ఆదివారం ఉదయానికి వచ్చేసరికి సేవ చేయడానికి చాలా అలసిపోయి ఉంటారు. లేదా వారం అంతా, ఇతర కార్యకలాపాలతో ఎక్కువగా ముడిపడి ఉంటారు కాబట్టి అస్సలు సమయం ఉండదు. తీరికలేని జీవితాలను గడపడం వలన ఆత్మీయంగా ఫలించలేము. మనం దేనితో తీరిక లేకుండా ఉన్నాము? “అవి శాశ్వతమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయా?” అనే ప్రశ్నను ప్రతి క్రైస్తవుడు నిరంతరం తనకు తాను వేసుకోవాలి.

కొందరు తమ ఆత్మీయ వరాలను ఉపయోగించకుండా, ఎప్పుడూ సాకులు చెబుతూ తమ్మును తాము సమర్ధించుకుంటారు. కానీ వాస్తవమేమిటంటే: మనల్ని మనం తిరస్కరించుకుని అన్ని సమయాలలో తనను అనుసరించమని ప్రభువు మనలను పిలుస్తున్నాడు. మీ ఆత్మీయవరాలను ఉపయోగించేటప్పుడు కొంత వెల చెల్లించవలసి ఉంటుంది. ఆయన పిల్లలుగా మనకు ఇవ్వబడిన పిలుపును నెరవేర్చకుండా అది మనల్ని ఆపకూడదు. రక్షించబడిన వారు ఇతరులకు సేవ చేస్తారు! ఆకట్టుకునే వరాలు లేకపోవడం విషయం కాదు కాని దేవుడు మనకు ఇచ్చిన వరాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యము.

మత్తయి 25:14-30లోని తలాంతుల ఉపమానంలో యేసు చెప్పిన మాటలను గుర్తుంచుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతులు ఇవ్వబడ్డాయి. “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” [వ 15] ఒకరికి 5, మరొకరికి2 ఇంకొకరికి 1 మాత్రమే ఇవ్వబడ్డాయి. తమకు అందిన వాటిని సద్వినియోగం చేసుకున్న వారిని అభినందించారు. ఇచ్చినా వినియోగించుకోని వాడిని ఘాటుగా మందలించారు. యేసు ఈ వ్యక్తి గురించి చెబుతూ, “సోమరివైన చెడ్డ దాసుడా, పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను” [మత్తయి 25:26, 30]. ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు కాడని ఇది తెలియచేస్తుంది. కాబట్టి, సేవ చేయకపోవడం నిజమైన విశ్వాసికి తగినది కాదు.

మరోవైపు, ఇతరులకు సేవ చేయడానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, భవిష్యత్తులో ఒక రోజు మన ప్రభువైన యేసు పెదవుల నుండి భళా, నమ్మకమైన మంచి దాసుడా” [మత్తయి 25:21] అనే మాటలను వినడమే కాదు కానీ మన రక్షణ నిజమైనదని వర్తమానంలో కూడా భరోసాను కలిగివుంటాము.

ఈ వాక్యభాగంలో మన ఆత్మీయవరాలను ఉపయోగించడం గురించి పౌలు మనకు బోధించిన వాటికి తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. అందుకే మనం చాలా శ్రద్ధ వహించాలి. మనకు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆత్మీయవరాలను తగ్గింపు, ఐక్యత మరియు విశ్వాసంతో కూడిన దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించడానికి ఏమి కావాలి? మనం సిలువను చూస్తూనే ఉండాలి. యేసు మనకోసం తనను తాను అర్పించుకున్నారు! అది మనం ఇతరులకు సమర్పించుకునేలా మనల్ని నిరంతరం ప్రేరేపిస్తుంది.

మనం దయ పొందాము. మన ఆత్మీయవరాలను ఇతరులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రేమతో ఉపయోగించేందుకు ఈ దయ మనల్ని మళ్లీమళ్ళీ పురికొల్పుతుంది. రోమా ​​​​12: 3-8 లో పౌలు చెప్పింది ఇదే. దీనిని ఆచరణలో పెట్టడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును గాక.

 

Category

Leave a Comment