రూపాంతరం చెందిన జీవితము 15వ భాగము ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి

(English version: “The Transformed Life – Live in Harmony With One Another”)
రోమా 12:16లో “ఒకనితో నొకడు మనస్సు కలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు అనే ఆజ్ఞ ఇస్తోంది.”
ఒకరితో ఒకరు సామరస్యంగా జీవిస్తూ దానికి ఆటంకంగా ఉన్నా ఒక్క అడ్డంకిని మనం ఖచ్చితంగా తీసివేయాలనేది దీని సారాంశం. ఆ ఒక్క విషయం ఏమిటి? అదే గర్వము! మనం ఏక మనస్సు కలిగివుంటే మన మనస్సులపై గర్వపు ఆలోచనలు ఆధిపత్యం చెలాయించడానికి మనం అనుమతించము. సామరస్యంతో జీవించడానికి ఆలోచనలో వినయంతో ఉండడం కీలకము.
ఈ వాక్యాన్ని 4 భాగాలుగా ప్రతి భాగాన్ని ఒక ఆజ్ఞగా చూద్దాం.
1వ ఆజ్ఞ.
ఒకనితో నొకడు మనస్సు కలిసి యుండుడి. కొన్ని అనువాదాలలో “ఒకరి పట్ల మరొకరు ఒకే ఆలోచనతో ఉండండి” అని చెబుతున్నాయి. ఆలోచనలో ఏకత్వం కలిగివుండడము. మనమందరికి ప్రతిదాని గురించి ఒకే అభిప్రాయం ఉండాలని దీని అర్థం కాదు. మనం రోబోలు కాదు. క్రీస్తు యొక్క రూపాంతరం చేసే పని ద్వారా మనం క్రీస్తులాగా మారినప్పుడు తండ్రిని మహిమపరచడం అనే ఉమ్మడి లక్ష్యం వైపు కలిసి నడవాలి. ఈ వైఖరి చాలా ముఖ్యమైనది, ఈ ఆజ్ఞ కొత్త నిబంధనలో తరచుగా పునరావృతమవుతుంది [ఫిలిప్పి 1:27; ఫిలిప్పి 2:1-2; 1 పేతురు 3:8].
అపొ.కా 4:32లో విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను అని చెప్పబడినట్లుగా ఆదిసంఘంలో ఈ వైఖరి ఉంది. పాత నిబంధనలో కూడా కీర్తనాకరుడు విశ్వాసులు ఐక్యంగా జీవించాలనే కోరికను కీర్తన 133:1లో వ్యక్తపరిచాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
కింది దృష్టాంతాన్ని ఆలోచించండి:
కాలిఫోర్నియాలో ఒక రకమైన చెట్టు భూమి నుండి 300 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. విచిత్రమేమిటంటే, ఈ పెద్ద చెట్ల వేరువ్యవస్థ లోతుగా ఉండదు. ఇవి ఉపరితల తేమను ఎక్కువగా గ్రహించడానికి అన్ని వైపులా వ్యాపిస్తాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ఈ వేర్ల వలన ఆ చెట్లు తుఫానులకు తట్టుకుని నిలబడడానికి ఒకదానికొకటి మద్దతునిస్తాయి. అందుకే ఇవి సాధారణంగా గుంపులు గుంపులుగా పెరుగుతాయి. అధికంగా వీచే గాలులు వీటిని త్వరగా కూల్చివేస్తాయి కాబట్టి ఈ చెట్లు ఒంటరిగా కనబడడం అరుదు.
మన సంఘాలలో మన ఇళ్లలో దేవుడు కోరుకునే చిత్రం ఇది. విశ్వాసులు ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించాలి. అయితే అనుభవపూర్వకంగా ఇది సాధారణంగా జరగదు. సామరస్యానికి బదులుగా విభజన, శాంతికి బదులుగా గందరగోళం ఉంటుంది. దానికి ఒక ప్రధాన కారణం గర్వము. అందుకే పౌలు మరో ఆజ్ఞ ఇచ్చాడు.
2వ ఆజ్ఞ.
హెచ్చు వాటియందు మనస్సుంచకండి అని పౌలు చెప్పిన దాని సారాంశం ఏమిటంటే, మీ ఆలోచనలో గర్వంగా ఉండకండి. సామరస్యం ఉండాలంటే గర్వపు ఆలోచనలు తొలగించాలి. అతడు చెప్పింది నిజమే. ఆలోచనల ఫలితమే ప్రవర్తన; గర్వపు ఆలోచనలు గర్వంగా ప్రవర్తించేలా చేస్తాయి!
గర్వం ఎప్పుడూ తన ఇష్టాన్నే కోరుకుంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ గొడవలే [యాకోబు 4:1-3]. చర్చిలో అయినా ఇంటిలో అయినా సరే నా ఇష్టం అనే మొండి వైఖరి ఉన్న చోట సామరస్యం ఉండదు. నేను మొదటి వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాను [3 యోహాను 1:9] అనే డియోట్రెఫెస్ రకం ఉన్న చోట అసమ్మతి ఉంటుంది. అందుకే “గర్వపడకండి” అనే ఆజ్ఞ ఇచ్చారు.
3వ ఆజ్ఞ.
గర్వం అనేది తమ స్థాయిని తమకున్న ప్రాముఖ్యతను ఆధారం చేసుకున్న కొంతమందికి మాత్రమే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, గర్విష్టులు అందరితో కాకుండా వారి ఆసక్తులను పెంచే వ్యక్తులతో మాత్రమే సహవాసం చేస్తారు. అందుకే పౌలు తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి అన్నాడు.
యేసు తృణీకరించబడిన వారిలో గడిపాడు కాని ఉన్నతవర్గాల మధ్య ఉండడానికి ప్రయత్నించలేదు. మనం కూడా అలాగే ఉండాలి. మన హోదా లేదా అధికారం పెరగడానికి సహాయపడే వారికోసం చూడకూడదు. అలాంటి వారితోనే తిరగకూడదు. మరో మాటలో చెప్పాలంటే, మనం అనుకున్న దానిని సాధించడనికి మనుష్యులను ఉపయోగించకూడదు. దానికి బదులుగా, తృణీకరించబడిన వారితో సమయం గడపడానికి ఇష్టపడటంతో పాటు అందరినీ ప్రేమతో సమానంగా చూడాలి [లూకా 14:13].
ఒక బోధకుడు తొలి క్రైస్తవ సంఘంలోని ఒక సన్నివేశాన్ని వివరించాడు. విశ్వాసిగా మారిన ఒక ప్రముఖ వ్యక్తి మొదటిసారిగా సంఘారాధనకు వచ్చాడు. ఆరాధన జరుగుతున్న గదిలోకి ప్రవేశించాడు. క్రైస్తవనాయకుడు అతనికి ఒక చోటు చూపిస్తూ, దయచేసి అక్కడ కూర్చుంటారా? అన్నాడు. అయితే ఆ వ్యక్తి, నేను అక్కడ కూర్చోను, అక్కడ నేను నా బానిస పక్కన కూర్చోవాలి అన్నాడు. ఆ నాయకుడు దయచేసి అక్కడ కూర్చుంటారా? అని మరలా చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి, ఖచ్చితంగా నా బానిస పక్కన కూర్చోను అన్నాడు. దయచేసి అక్కడ కూర్చుంటారా? అని ఆ నాయకుడు మరోసారి అన్నాడు. చివరికి ఆ వ్యక్తి గది దాటి తన బానిస పక్కన కూర్చుని అతనికి సమాధాన ముద్దు ఇచ్చాడు.
రోమా సామ్రాజ్యంలో క్రైస్తవం చేసింది అదే. యజమాని బానిస పక్కపక్కనే కూర్చున్న ఏకైక ప్రదేశం క్రైస్తవ సంఘం మాత్రమే. సంఘం ఇప్పటికీ భూలోక వ్యత్యాసాలు ఉండని ప్రదేశం, ఎందుకంటే, అక్కడ దేవునికి తప్ప వ్యక్తులకు గౌరవం ఉండదు.
కాబట్టి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉందాం.
4వ ఆజ్ఞ.
ఈ వచనంలో పౌలు మరో ఆజ్ఞ జత చేశాడు: మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మీ గురించి మీరే గొప్పగా అనుకోవద్దు. మీ దృష్టిలో మీరే జ్ఞానవంతులని అనుకోకండి. పౌలు అంటున్నది ఇదే. మీకు అన్నీ తెలుసునని అనుకోకండి అని ది న్యూ లివింగ్ అనువాదంలో ఉంది. గర్విష్టులు అలాగే ఉంటారు. వారు తమను తాము గొప్పగా అనుకుంటారు, అది వట్టి ప్రగల్భాలకు దారి తీస్తుంది.
అందుకే బైబిలు మనల్ని గర్విష్టులుగా ఉండవద్దని మనమే జ్ఞానవంతులుగా అనుకోవద్దని పదేపదే హెచ్చరిస్తుంది. సామెతలు 3:7లో నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అని ఉంది. సామెతలు 26:12లో తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు అని ఉంది.
తమకు తామే జ్ఞానులమని అనుకునే గర్విష్టులతో మాట్లాడటం కూడా కష్టమే. మీరు వారి తప్పులను ఎత్తిచూపితే వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండడం మంచిది. గర్వంగా ఉన్నారని వారితో చెప్పండి అప్పుడు వారు, నాకు గర్వం అంటావా? అని చాలా తీవ్రంగా అంటారు. మరోవైపు, వినయంతో ఉన్నవారు ఇతరులు తమ పాపాన్ని చూపించినప్పుడు అది నిజమేనా? అని అడిగి, మీరు నాలో ఏ విషయాలను చూసి నాలో గర్వం ఉందని, అసహనం లేదా కోపం ఉందని చెబుతున్నారు? అని అడగడానికి కూడా వెనుకాడరు.
ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎ బిగ్ షాట్ అనే కథనాన్ని హోవార్డ్ బట్ అనే ప్రముఖ క్రైస్తవ వ్యాపారవేత్త రాశారు. అతడు చెప్పిన ముఖ్యమైన విషయాలలో ఈ మాటలు ఉన్నాయి:
నా గర్వమే నన్ను దేవుని నుండి స్వతంత్రంగా చేస్తుంది. నా విధికి నేనే యజమానిగా ఉండి నా జీవితాన్ని నేనే నడుపుకోవడం నా స్వంత షాట్‌లను నేనే పిలవడం మరియు ఒంటరిగా వెళ్లడం నాకు ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆ భావమే నా మొదటి మోసం. నేను ఒంటరిగా వెళ్ళలేను. నేను ఇతరుల నుండి సహాయం పొందాలి; చివరికి నాపై నేనే ఆధారపడలేను. నా తర్వాతి శ్వాస కోసం నేను దేవుడిపై ఆధారపడి ఉన్నాను. నేను చిన్నవాడిని, బలహీనుడిని మరియు పరిమిత వ్యక్తిని తప్ప మరేదైనా కాదని నటించడం కూడా నా దృష్టిలో మోసమే. కాబట్టి, దేవుని నుండి స్వతంత్రంగా జీవించడం స్వీయ భ్రమ అవుతుంది.
కేవలం ఒక దురదృష్టకరమైన చిన్న లక్షణంతో గర్విష్టులు కారు అలాగే ఆకర్షణీయమైన చిన్న ధర్మగుణంతో వినయం కలిగినవారిగా ఉండరు; అది ఆ సమయంలో నా అంతర్గత మానసిక పరిస్థితి. నేను గర్వంతో ఉన్నప్పుడు నా గురించి నేను అబద్ధం చెప్పుకుంటాను. నేను మనిషిలా కాకుండా దేవుడిలా నటిస్తాను.
నా గర్వం నాకు విగ్రహారాధన. అది నరకం యొక్క జాతీయ మతం!
యిర్మీయా తన సహాయకుడైన బారూకును నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు [యిర్మీయా 45:5] అని హెచ్చరించడంలో ఏ ఆశ్చర్యం లేదు; ఫిలిప్పీ 2:3-4లో కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు 4 మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమే గాక యితరుల కార్యములను కూడ చూడవలెను అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
కాబట్టి, మనం గర్వాన్ని చంపి సామరస్యంగా జీవించడం ఎలా?
దానికి మూడు సూచనలు:
(1) మన హృదయాల్లో ఉన్న గర్వాన్ని మనం గుర్తించాలి [కీర్తన 51:4].
(2) గర్వం మరియు వినయానికి సంబంధించిన లేఖనాలను చదివి ఆ సత్యాలను మన హృదయాలకు అన్వయించమని ప్రభువును మనస్ఫూర్తిగా ప్రార్థించాలి [ఎఫెసీ 6:17-18].
(3) మనం నిరంతరం యేసు జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఆయన అడుగుజాడలను అనుసరించాలి. వినయాన్ని నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం యేసు మాదిరి నుండి నేర్చుకోవడమే. యేసు స్వయంగా తన గురించి చెబుతూ అన్న మాటలు, నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి [మత్తయి 11:29]. సువార్తలలో యేసు నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను అని తన గురించి తాను చెప్పిన ఏకైక సందర్భం ఇదే.
ఆయన జీవితం మరియు మరణం మనకు బాధ్యత వహించే ప్రతి విధమైన అహంకారానికి నిలువెత్తు గద్దింపు అని ప్రభువైన యేసు గురించి సరిగానే చెప్పబడింది. కింది పట్టిక ఈ విషయాన్ని వివరిస్తుంది.
గర్వం ఇలా అంటుంది, | బైబిలు యేసు గురించి ఇలా చెబుతోంది: |
నా కుటుంబ నేపథ్యం చూడు | ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? [మత్తయి 13:55] |
నా దగ్గర ఎంత డబ్బు ఉందో చూడు | మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు. [లూకా 9:58] |
నా రూపాన్ని చూడు | అతనికి సురూపమైనను సొగసైనను లేదు. [యెషయా 53:2] |
నేను కలుసుకునే ప్రముఖులను చూడండి | సుంకరులకును పాపులకును స్నేహితుడు. [లూకా 7:34] |
నా కింద ఎంత మంది ఉన్నారో చూడండి | నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను. [లూకా 22:27] |
నన్ను ఎంత మంది అభిమానిస్తున్నారో చూడండి | అతడు తృణీకరింపబడినవాడు మనుష్యుల వలన విసర్జింపబడినవాడు. [యెషయా 53:3] |
నేను ఎంత బలంగా ఉన్నానో చూడండి | నా అంతట నేనే ఏమియు చేయలేను. [యోహాను 5:30] |
నేను ఎప్పుడూ నేను అనుకున్నది ఎలా పొందుతున్నానో చూడండి | నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను. [యోహాను 5:30] |
నేనెంత తెలివైనవాడినో చూడండి | నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను. [యోహాను 8:28] |
మనం మన రక్షకుడు, మన ప్రభువు, సౌమ్యుడు వినయపూర్వకమైన రాజైన యేసు నుండి ఇవన్నీ నేర్చుకుందాం. మనం ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిజమైన వినయం ఎలా ఉంటుందో అనేదానికి ఆయనే మనకు మాదిరి!