రూపాంతరం చెందిన జీవితము 12వ భాగము సంతోషించు వారితో సంతోషించుడి

(English version: “The Transformed Life – Rejoice With Those Who Rejoice”)
రోమా 12:15లో “సంతోషించు వారితో సంతోషించుడి” అని మనకు చెప్పబడింది. దీనర్థం, తోటి విశ్వాసులు తమ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఆ ఆశీర్వాదాలను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నట్లుగా నిజాయితీగా ఆనందించాలి. కేవలం నోటి మాటగా కాకుండా మన ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిజమైన సహవాసం కలిగిన జీవితాన్ని గడపడం అంటే అదే.
సంతోషించే వారితో సంతోషించడం సులభమే అనిపించవచ్చు కాని క్రమంగా దానిని కొనసాగించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. నిజానికి, కొన్నిసార్లు సంతోషించే వారితో సంతోషించడం కంటే ఏడ్చే వారితో ఏడవడం సులభంగా ఉంటుంది. కారణం ఏమిటి? దానికి ప్రధాన కారణం అసూయ లేదా ఈర్ష. క్రైస్తవులలో చాలామంది ఈ ఆజ్ఞను పాటించడంలో విఫలమవ్వడానికి అసూయ ఒక ప్రధానమైన కారణము.
మన దగ్గర లేనిది లేదా మనం పొందాలనుకుంటున్నది ఇతరులు పొందినప్పుడు లేదా మనకు ఉన్న వాటినే వారు పొందినప్పుడు మనం వారితో కలిసి సంతోషించలేము . అది మాకు ఒక సాధారణమైన విషయంగానే అనిపిస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి చాలా విచారంగా కనిపించాడు. అతని గురించి బాగా తెలిసిన వ్యక్తి, అతనికి చాలా చెడన్నా జరిగి ఉండాలి లేదా అతని సన్నిహితుడికి చాలా మంచన్నా జరిగి ఉండాలి అని అన్నాడు. చాలామంది క్రైస్తవులు ఈ వ్యక్తిలానే ఉన్నారు.
బయటకు చిరునవ్వు నవ్వినా, లోపల అసూయ భావాలు ఉంటాయి. మరియు అది ఇతరులతో మనం నిజంగా ఆనందించకుండా నిరోధిస్తుంది. అసూయ అనేక విధాలుగా ప్రదర్శించబడుతుంది:
- తన చుట్టూ ఉన్నవారు పెళ్లి చేసుకుంటున్నప్పుడు సంతోషించలేని ఒంటరి వ్యక్తి కావచ్చు.వయసు మీద పడుతున్న ఒక అవివాహిత యువతి ఇలా చెప్పింది, “నా స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లి, తోడి పెళ్లికూతురుగా ఉండి ఉండి నేను విసిగిపోయాను. ఇక నేను నా పెళ్లికి తప్ప మరే ఇతర పెళ్లికి హాజరు కాలేను.”
- ఇది గొడ్రాలు లేదా గర్భం ధరించలేని భార్య కావచ్చు.ఫలితంగా ఆమె మరొక స్త్రీ గర్భం ధరించినా లేదా పిల్లలు కనినా సంతోషించలేదు.
- తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చే తల్లిదండ్రులు కావచ్చు. నా పిల్లలు ఇతర పిల్లల్లా తెలివిగా ఎందుకు లేరు? ఇతర పిల్లలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, నా పిల్లలు సాధారణ స్థాయిలో ఉంటే నేను ఎలా ఆనందించగలను?
- మీరు ఏ వృద్ధి లేకుండా నిలకడగా ఉన్న కార్యాలయంలో లేదా వ్యాపారంలో, విజయం సాధిస్తున్న మరొకరిని చూసి, “నేను కష్టపడి పని చేస్తున్నాను. నేను చాలా నిజాయితీగా ఉన్నా నాకు గుర్తింపు లేదు. నాకు వస్తుందని అనుకున్న ప్రమోషన్ నా క్రిందివారికి వస్తుంది. నేను ఎలా సంతోషించగలను?” అనుకుంటారు.
- ఇంటికి సంబంధించింది కావచ్చు. నేను ఇప్పటికీ చిన్న ఇంటిలోనే ఉన్నాను కాని అందరికి పెద్ద ఇళ్లు ఉన్నాయి. వారు ఆశీర్వాదించబడినందుకు నేను ఎలా సంతోషించగలను?
- మీరు చేసిన పనిని ఎవరూ గుర్తించకుండా మీ సహచరుడే ఆ పేరంతా పొందినప్పుడు సంతోషించ లేకపోవచ్చు!
- ఇది ఒకరి చర్చి గురించి కూడా కావచ్చు. మీరు నమ్మడం కష్టంగా అనిపించవచ్చు, కానీ పరిచర్యలో ఉన్నవారు కూడా ఇతరుల పరిచర్యలు అభివృద్ధి చెందినప్పుడు సంతోషించలేరు. నా పరిచర్య పెరగకుండా తగ్గిపోతున్నప్పుడు ఇతర చర్చిలు వృద్ధి చెందుతుంటే నేను ఎలా సంతోషించగలను? అనుకుంటారు. మూడీ చర్చి పాస్టరైన ఎర్విన్ లూట్జర్ ఈ అంశం గురించి మాట్లాడుతూ “దేవుడు తన ఆశీర్వాద హస్తాన్ని తప్పు నాయకుడిపై ఉంచుతున్నట్లు ఎల్లప్పుడూ అనిపిస్తుంది” అని అన్నారు.
జాబితా అలా కొనసాగుతూనే ఉంటుంది. నిజంగా అసూయ ఒక సమస్యయే. ఇది ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఇతరులతో కలిసి సంతోషిస్తున్నట్లుగా బయటికి చిరునవ్వు చూపించవచ్చు కాని లోపల అసూయ ఉంటుంది. అలాంటి వైఖరి ఇతరులతో హృదయపూర్వకంగా సంతోషించకుండా మనల్ని నిరోధిస్తుంది. కానీ ఈ రోజు కాకపోతే రేపు అసూయ వలన చేసే పనులు బాహ్యంగా కనిపిస్తాయి. మనకు లేనిది కలిగివున్నవారిని ప్రేమించడం మనకు మరింత కష్టతరంగా ఉంటుంది. దాని వలన వారి పట్ల పగ ఏర్పడుతుంది. మాటలతో లేదా శారీరకంగా వారిపై దాడి చేసే స్థాయికి కూడా తీసుకువెళ్తుంది.
బైబిలులో అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సౌలు దావీదు విజయాలను చూసి సంతోషించలేక, అతనిపై అపవాదు వేసి చివరికి అతడిని చంపడానికి ప్రయత్నించాడు. ప్రజలు యేసును వెంబడించడం మొదలుపెట్టినప్పుడు పరిసయ్యులు సంతోషించలేక ఆయనపై అపనిందలు వేసి చివరకు ఆయనను చంపారు. సామెతలు 27:4లో “క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?” అని చెప్పడంలో ఏ ఆశ్చర్యం లేదు. దీని అర్థమేమిటంటే, కోపంతో ఉన్న వ్యక్తిని ఎదుర్కోగలం కాని అసూయతో ఉన్న వ్యక్తిని ఎదుర్కోలేము!
ఇద్దరు దుకాణదారులు మధ్య బద్ద వైరం ఉంది. వీధిలో వారి దుకాణాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. వారు ప్రతి రోజు ఒకరి వ్యాపారాన్ని మరొకరు గమనిస్తూ ఉండేవారు. ఒకరికి కస్టమర్ దొరికితే, అతడు తన ప్రత్యర్థిపై విజయంతో నవ్వేవాడు.
ఒక రాత్రి దుకాణదారుల్లో ఒకరికి దేవదూత కలలో కనిపించి, “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, కానీ నీవు ఏది పొందితే, మీ పోటీదారుడు దానికి రెండింతలు అందుకుంటాడు. నీవు ధనవంతునిగా అవ్వాలనుకుంటున్నావా? నీవు చాలా ధనవంతునిగా మారతావు, కానీ అతడు రెండు రెట్లు ధనవంతుడవుతాడు. నీవు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించాలనుకుంటున్నావా? నీవు జీవించవచ్చు, కానీ అతడు నీకన్నా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవీస్తాడు. నీ కోరిక ఏమిటి?” అని అడిగాడు.
ఆ వ్యక్తి ముఖం చిట్లించి ఒక్క క్షణం ఆలోచించి, “నా కోరిక ఏమిటంటే, నా కళ్లలో ఒకదానిని గుడ్డిగా చేయి!” అన్నాడు.
అసూయకున్న శక్తి ఇదే! దాని ముందు ఎవరు నిలబడగలరు? యోసేపు తన సోదరుల అసూయ ముందు నిలబడలేకపోయాడు, చివరికి వారు అతడిని అమ్మేశారు [ఆది 37:12-36].
మనం కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, అసూయ అనేది చాలా శక్తివంతమైన పాపం, అది ఇతరులను బాధపెట్టడమే కాదు దేవుని కూడా బాధపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా? అసూయను అదుపు చేయకుండా వదిలేసినప్పుడు మనకు కాకుండా ఇతరులకు ఆశీర్వాదాలను ఇచ్చే దేవుని పట్ల మనం ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించవచ్చు! “దేవా, నేను చాలా నమ్మకంగా ఉన్నాను చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాను. అయినా నీవు నన్ను మరచిపోయారు. ఇది నీకు న్యాయం కాదు” అనే వైఖరి మనలో తొందర్లోనే ఏర్పడుతుంది. తప్పిపోయిన కుమారుని [లూకా 15:29-30] ఉపమానంలోని అన్నను జ్ఞాపకం చేసుకోండి! మనం దానిని మాటలతో వ్యక్తపరచకపోయినప్పటికీ, దేవుని మార్గాలు సరైనవి కావని మనం అనుకోవచ్చు. ఆ రకమైన మనస్తత్వం దేవుని బాధపెడుతుంది!
కాబట్టి, బైబిలులో చెప్పినట్లుగా మనం సంతోషించాలంటే, సంతోషించే వారితో సంతోషించకుండా నిరోధించే అసూయ అనే పాపంతో మనం వ్యవహరించాలి. మనం దానిని ఎలా చేయాలి? నేను నిత్యం గుర్తుపెట్టుకోవడానికి రెండు విషయాలను సూచించాలనుకుంటున్నాను.
1. దేవుడు సార్వభౌమాధికారుడని గుర్తుంచుకోండి.
దేవుడు సార్వభౌమాధికారుడు అంటే దేవుడు తాను చేసే పనిని తన ఇష్టానికి అనుగుణంగా చేస్తాడు. ఒకరి పట్ల ఆయనకున్న ప్రణాళికలు మరొకరి పట్ల అలాగే ఉండవు. ఆయన ఒక నిర్దిష్టమైన ఆశీర్వాదంతో ఒకరిని ఆశీర్వదించి దానిని మనకు ఇవ్వలేదంటే, ఆ నిర్దిష్టమైన ఆశీర్వాదం కంటే ఆయనతో మనం ఎక్కువ అనుబంధాన్ని కలిగివుండడంపై ఎక్కువ దృష్టి పెట్టడంలో అది మనకు సహాయపడవచ్చు. ఆయన సృష్టికర్త అని, మనం ఆయనచే సృష్టించబడ్డామని గుర్తుంచుకోవాలి! కుండ కుమ్మరిని తనని అలా ఎందుకు చేశావని ఎన్నటికీ ప్రశ్నించదు!
దానికి మంచి ఉదాహరణ బాప్తిస్మమిచ్చే యోహాను. ప్రజలు యేసును అనుసరించడానికి తనని విడిచిపెట్టినప్పుడు అతడు అసూయపడలేదు కానీ తనకు “పరలోకమునుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు” [యోహాను 3:27] అన్నాడు. అతడు దానిని దేవుని ప్రణాళికగా అంగీకరించాడు కాబట్టి సంతోషించాడు.
కాబట్టి, దేవుడు సార్వభౌమాధికారుడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇతరులు ఆశీర్వాదాలు పొందినప్పుడు మనం అసూయపడకుండా వారితో నిజంగా సంతోషించగలుగుతాము.
2. అన్ని సమయాల్లో కృతజ్ఞతతో ఉండాలని గుర్తుంచుకోండి.
1 థెస్సలొ 5:18లో “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” అని వ్రాయబడినది. మన దగ్గర ఉన్నదానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు, మనకు లేని వాటి గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మనకు అలాంటి ఆత్మ ఉన్నప్పుడు, మనం మరొకరితో పోల్చుకోము కాని మన కోరికలు ఇంకా నెరవేరనప్పటికీ ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు మనం కూడా నిజంగా సంతోషించగలుగుతాము.
రాబర్ట్ స్ట్రాండ్ కృతజ్ఞతకున్న శక్తి [ఎవర్‌గ్రీన్ ప్రెస్, 2001] గురించి వ్రాస్తూ ఇలా చెప్పాడు:
“ఆఫ్రికాలో టేస్టీ బెర్రీ అనే పండు దొరుకుతుంది. దానిని తిన్న తర్వాత ఏమి తిన్నా అది తియ్యగానే ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
కృతజ్ఞతలు చెప్పడం క్రైస్తవ్యంలో టేస్టీ బెర్రీ వంటిది. మన హృదయాలు కృతజ్ఞతతో నిండినప్పుడు మనకు ఏవీ వెగటుగా అనిపించవు. కృతజ్ఞత కలిగినవారు తమ జీవితాలలో ఇతరులతో పోలిక లేని జీవిత మాధుర్యాన్ని అనుభవిస్తారు.”
కృతజ్ఞత సణుగుడును అసంతృప్తిని చంపుతుంది. మనం ప్రతిరోజూ మన ఆశీర్వాదాలను లెక్కించుకుంటూ మనకు అర్హత లేకపోయినా ఆశీర్వాదాలను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే మనకు లేని వాటిపై మనం అంతగా దృష్టి పెట్టలేము. మనకు ఉన్నదాని గురించి మనం సంతోషిస్తాము . అలాంటి సంతోషకరమైన వైఖరి ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు అసూయపడకుండా మనల్ని రక్షిస్తుంది మరియు వారితో కలిసి మనస్ఫూర్తిగా ఆనందించడానికి సహాయపడుతుంది!
అసూయకు రెండు నివారణలు: దేవుడు సార్వభౌమాధికారుడని నిరంతరం గుర్తుంచుకోవడం మరియు అన్ని సమయాల్లో కృతజ్ఞతతో ఉండటం.
హెచ్చరిక మాట.
సంతోషించే వారితో సంతోషించండి అనే ఆజ్ఞ గురించి నేను ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. మనం ఆనందించే వారందరితో కలిసి గుడ్డిగా సంతోషించకుండా వివేచనను ఉపయోగించాలి. బైబిలు కొన్నిటిని అనుమతిస్తే మరి కొన్నింటిని నిషేధించింది.
1 కొరింథీ 13:6లో, “ప్రేమ దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును” అని వ్రాయబడి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ఇతరుల పట్ల మనకున్న ప్రేమ లేఖనాలలోని సత్యాల విషయంలో మనల్ని అంధులుగా చేయకూడదు. ఆశీర్వాదమని వారు అనుకుంటున్నది లేఖనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని గురించి మనం వారితో కలిసి సంతోషించకూడదు. మనం దేని గురించి సంతోషిస్తామో అది మన హృదయాల నిజస్థితిని తెలియచేస్తుంది. మనం ప్రభువును ఆయన సత్యాన్ని ప్రేమిస్తే, ఆయనకు దుఃఖం కలిగించే దేని గురించి మనం సంతోషించలేము, సంతోషించము. కానీ ఏదైనా లేఖనాలకు అనుగుణంగా ఉంటే ప్రతి కారణం బట్టి సంతోషించాలి.
ముగించే ముందు, సంతోషించే వారితో కలిసి సంతోషించడానికి మీకు మంచి ప్రేరణ అందిస్తాను. అది ఏమిటంటే: దేవుడు స్వయంగా ఇతరులతో సంతోషించే దేవుడు. అది సంతోషించే ఇతరులతో కలిసి సంతోషించేలా మనల్ని ప్రేరేపించాలి. యేసులా మారాలంటే, మనం గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటంటే, దేవుడు ఇతరులతో సంతోషించే దేవుడు! దేవుని గురించి మనకు తెలియచేసి వివరించడానికి వచ్చిన యేసు, లూకా 15లో తెలియచేసిన తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం మరియు తప్పిపోయిన కుమారుడు అనే మూడు ఉపమానాల ద్వారా మనకు ఈ సత్యాన్ని చెప్పారు. లూకా 15:10లో అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను అని ఉంది. దేవుని దూతల ఎదుట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు! ఆయన దేవదూతలతో, రక్షణానుభవం పొందిన పాపితో కలిసి సంతోషిస్తారు. దేవుని హృదయం పాపక్షమాపణలోని ఆనందాన్ని అనుభవించే పాపితో పాటు సంతోషిస్తుంది.
నీనెవె వాసులు పశ్చాత్తాపపడినప్పుడు [యోనా 4:1] ఆయనతో సంతోషించలేని యోనా వంటి ఆత్మను దేవుడు అంగీకరించలేదు, అతడు వారిపై ఆగ్రహంతో ఉన్నాడు. ఎలాంటి అసూయ పగ లేకుండా సంతోషించే వారితో కలిసి సంతోషించమని మనకు పిలుపు ఇవ్వబడింది. అలా చేయడంలో విఫలమైతే పాపమే! కాబట్టి, మనం యేసులాగా మారుతున్నందున ఈ ఆజ్ఞను పాటించడానికి సహాయం చేయమని ప్రభువును అడుగుదాం!
ప్రియమైన పాఠకుడా, మీ పాపాలు క్షమించబడిన ఆనందాన్ని మీరు ఎన్నడూ అనుభవించకపోతే, ఈరోజే మీ పాపాలను వదిలి పెట్టండి. సిలువపై పాపాలకు వెలచెల్లించి తిరిగి లేచిన క్రీస్తు వైపు తిరగండి. ఎంత పాపం చేసినా తన వద్దకు వచ్చిన వారందరినీ ఆయన క్షమించి వారితో కలిసి సంతోషిస్తాడు. మీరు అలా చేస్తే, మీరు సంతోషించడమే కాకుండా, దేవుడు మరియు పరలోకసైన్యం మీతో పాటు ఆనందిస్తారు. మిమ్మల్ని ఎరిగిన ఇతర క్రైస్తవులు కూడా మీతో పాటు సంతోషిస్తారు. కాబట్టి, యేసు వద్దకు రండి! మీరు బాప్తిస్మం వంటి మరే ఇతర విషయంలోనైనా ఆయనకు విధేయత చూపవలసి ఉంటే ఆలస్యం చేయకుండా ఆయనకు విధేయత చూపండి [కీర్తన 119:60]. ఇది మీ హృదయానికి అలాగే దేవుని హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతర విశ్వాసులు కూడా మీతో సంతోషిస్తారు!