రూపాంతరం చెందిన జీవితము 11వ భాగము మిమ్మును హింసించువారిని దీవించుడి

Posted byTelugu Editor August 20, 2024 Comments:0

(English version: “The Transformed Life – Bless Your Persecutors”)

రోమా 12:14లో “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు” అనే ఈ మాటల ద్వారా తమతో దుర్మార్గంగా ప్రవర్తించే వారిపట్ల బైబిలుపరంగా ప్రతిస్పందించమని విశ్వాసులందరు పిలువబడ్డారు.

మనల్ని హింసించేవారిని దీవించడమనేది ఈ లోకం మనకు బోధించే సంస్కృతికి భిన్నంగా,  మన సహజ గుణానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయినప్పటికీ పై వచనం మనల్ని దానిని ఖచ్చితంగా చేయమని చెబుతుంది. దేవుని యొక్క రక్షించే కనికరం యేసు చేసినట్లుగా తమను హింసించేవారిని దీవించేలా ప్రజలను మారుస్తుంది. ఈ విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి రోమా 12:17-21లో పౌలు ఈ అంశాన్ని మరింతగా వివరించాడు.

మిమ్మల్ని హింసించేవారిని దీవించండి అంటే క్రైస్తవులు హింసను ఎదుర్కొంటారని అర్థం. కొందరు తక్కువ ఎదుర్కొంటే కొందరు ఎక్కువగా ఎదుర్కొంటారు. 2 తిమోతి 3:12 లో “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించు వారందరు హింసపొందుదురు” అని వ్రాయబడింది. “దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు” [యోహాను 15:20] అనే మాటల ద్వారా యేసు హింసలో ఉన్న వాస్తవం గురించి మనల్ని హెచ్చరించారు. క్రైస్తవులకు బాధలు లేని జీవితాన్ని బైబిలు బోధించదు!

మనం లోకం నుండి ఎన్నుకోబడినప్పటి నుండి మనం దాని స్వంతం కాదు కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. అంతేకాదు లోకం యేసును అసహ్యించుకుంది, ఆయనను హింసించింది. ఎందుకంటే రోమా 8:7 ప్రకారం, “ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.” ఇప్పుడు యేసు భౌతికంగా ఈ లోకంలో లేరు, భౌతికంగా ఉన్న మనం యేసుకు, ఆయన బోధలకు  గుర్తుగా ఉన్నందుకు హింసించబడుతున్నాము. “వారు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు” అని యేసు అనడంలో ఏ ఆశ్చర్యం లేదు. వారు మనపై దాడి చేయడం ద్వారా క్రీస్తుపై దాడి చేస్తారు. మనం చెడు పనులు చేయడం వల్ల వారు మనల్ని హింసించరు కానీ మనం మంచి పనులు చేసినప్పటికీ వారు నిజమైన దేవుని మరియు ఈ ఏకైక సత్య దేవుడిని అనుసరిస్తున్నామని చెప్పేవారిని ద్వేషిస్తారు కాబట్టి మనల్ని ద్వేషిస్తారు. ఒక రచయిత ప్రకారం:

నిజానికి లోకాన్ని ఖండించే విధంగా జీవించే ప్రజలను లోకం ఇష్టపడదు. మంచిగా ఉండడం ప్రమాదకరం. దానికి మంచి ఉదాహరణ ఏథెన్స్‌లో అరిస్టైడ్స్‌కు ఎదురైన విధి. అతడు నీతిమంతుడైన అరిస్టైడ్స్ అని పిలువబడ్డాడు; ఇంకా అతడు బహిష్కరించబడ్డాడు. అతని బహిష్కరణకు ఎందుకు ఓటు వేశారని పౌరుల్లో ఒకరిని అడిగినప్పుడు, “ఎందుకంటే అతనిని ఎప్పుడూ నీతిమంతుడు నీతిమంతుడు అని పిలవడం విని విని నేను విసిగిపోయాను” అని సమాధానమిచ్చాడు.

క్రైస్తవుడు కానప్పటికీ, వారికన్నా భిన్నంగా ఉన్న వ్యక్తి పట్ల లోకం యొక్క స్పందన ఇలా ఉంటే, వారి ఆలోచనను ప్రవర్తనను ఖండించే జీవనశైలి ఉన్న క్రైస్తవుల పట్ల వారు ఎంత ఎక్కువ ప్రతికూలంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, క్రైస్తవులపై వేధింపులు ఊహించవచ్చు. మనం నిజంగా క్రైస్తవ జీవితాన్ని గడిపినప్పుడు హింసించేవారు ఉంటారు. అయితే, హింసకు గురిచేసే వారి పట్ల మనం ఎలా స్పందించాలి? క్లుప్తంగా చెప్పాలంటే, వారిని శపించడానికి కాదు, వారిని దీవించడానికి మనం పిలువబడ్డాము.

మనల్ని హింసించేవారిని దీవించడం అంటే ఏమిటి? 

ఒక వ్యాఖ్యాత ప్రకారం, “దీవించడానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. మనము దేవుని దీవించినప్పుడు ఆయనకు తగిన స్తుతిని ఆపాదిస్తాము [లూకా 1:64, 68, 2:24, 24:53; యాకోబు 3:9]. దేవుడు మనలను దీవించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వాదిస్తారు [మత్తయి 25:34; అపొకా 3:26; గలతి 3:9; ఎఫెసి 1:3]. మనం వ్యక్తులను లేదా వస్తువులను దీవించినప్పుడు వారిపై దేవుని ఆశీర్వాదాలు రావాలని ప్రార్థిస్తాము [లూకా 2:34; 1 కొరింథి 10:16; హెబ్రీ 11:20]. ఈ చివరిలో చెప్పిన అర్థమే ఈ వచనంలో చెప్పిన దానికి మరియు అనేక ఇతర సందర్భాలలో చెప్పిన ఇదే విషయానికి వర్తిస్తుంది.”

కాబట్టి, క్రైస్తవులు తమను హింసించేవారిని అనగా కనికరం లేకుండా గొప్ప బాధను కలిగించే వారి పట్ల అనుగ్రహాన్ని చూపించమని కోరుతూ దేవునికి ప్రార్థన చేయాలి. “దీవించండి” అనే పదం వర్తమాన కాలంలో ఉంది, దీని అర్థం మనం దీన్ని అన్ని సమయాలలో చేస్తూనే ఉండాలి. ఈ వచనంలో పౌలు మనకు “దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు” అనే మరొక ఆజ్ఞను జోడించాడు. మనం ఏమి చేయాలో [“దీవించుడి”] రెండుసార్లు చెప్పి, చేయకూడనిది [“శపింపవద్దు”] ఒక్కసారే చెప్పాడు.  మనల్ని హింసించేవారి పట్ల దీవెన శాపం రెండూ కలిసి ఉండకూడదని పౌలు చెప్పాడు. అన్ని వేళలా ఒక్క దీవెన మాత్రమే ఉండాలి. మన ప్రార్థనలలో మన శత్రువులను నాశనం చేయమని అడగడం కన్నా అనగా శపించడం కన్నా మనం వారి జీవితాలపై తన కృప చూపించమని దేవుని అడగాలి.

మనల్ని బాధపెట్టే వారి పట్ల ఈ వైఖరితో ఉండడం మన మానవ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. మనల్ని వేధించేవారి అనగా మనల్ని శారీరకంగా లేదా మాటలతో బాధపెట్టే వారిపై పగ తీర్చుకోవాలని కోరుకోవడం మానవ నైజం.“సరే, మీరు ప్రతీకారం తీర్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను [వారిని ఒక శపించడానికి బదులు]” అని మనకు చెప్పబడితే, ఈ ఆదేశం కష్టంగా ఉన్నప్పటికీ, మనం కొంత ఉపశమనం పొందుతాము. కానీ మనం కేవలం ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడమే కాదు వారికి మంచి చేయడానికి ప్రయత్నించాలని దేవుని వాక్యం చెబుతుంది. అంటే మనల్ని బాధపెట్టిన వారిపై దేవుని కృప కోసం ప్రార్థించడము.

అలాంటి పిలుపు ఇచ్చింది పౌలు ఒక్కడే కాదు. లూకా 6:28లో యేసు అదే పిలుపునిచ్చారు. “మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.” మనల్ని హింసించే వారిని దీవించమని దేవుని ప్రార్థించడమంటే నిజంగా మనం దేవుని పిల్లలమనడానికి గుర్తు అని యేసు స్పష్టంగా చెప్పారు. ఒక రచయిత ఇలా అన్నాడు, “దేవుని పిల్లలు, తమ పరలోకపు తండ్రిని అనుకరించడానికి పిలువబడ్డారని యేసు చెప్పారు. మనం ఆయనకు మాటకు రూపంగా ఉండాలి.”

హింసించబడిన క్రైస్తవులకు వ్రాస్తూ, యేసు మరియు పౌలు మాత్రమే కాకుండా, పేతురు కూడా అదే విధంగా స్పందించాలని పిలుపునిచ్చాడు. 1 పేతురు 3: 9లో “ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.” కాబట్టి మన శత్రువులపై దేవుని ఆశీర్వాదం కోసం మనం ప్రార్థించాలని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం ప్రత్యేకంగా ఏ దీవెన కోసం ప్రార్థించాలి? ప్రార్థన ప్రధానంగా వారి రక్షణ, వారి పాపక్షమాపణ గురించి ఉండాలని నేను నమ్ముతాను. అదే మనం ఇతరులకు చేసే గొప్ప మేలు. మన శత్రువులను దీవించమని దేవుని ప్రార్థించినప్పుడు, వారు పశ్చాత్తాపం చెందడానికి మరియు క్రీస్తు యొక్క పనిని విశ్వసించే సామర్థ్యాన్ని ఇవ్వడం ద్వారా వారికి నిత్యజీవాన్ని ఇవ్వమని మనం ఆయనను అడుగుతున్నాము. తద్వారా వారి పాపాలన్నీ క్షమించబడతాయి. అదే ప్రార్థన! అది వారు మనలను హింసించడానికి మూలమైన దేవునితో వారికున్న శత్రుత్వాన్ని పోగొడుతుంది.

ప్రజలు సిలువపై ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాస్యం చేస్తున్నప్పుడు, యేసు తన శత్రువుల కోసం ఏమి చేశారు? వారి కొరకు ప్రార్థించారు. ఏమని? “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” [లూకా 23:34]. దేవుని నుండి మనం పొందగలిగే గొప్ప ఆశీర్వాదం పాపక్షమాపణ. కాబట్టి, యేసు తన శత్రువుల క్షమాపణ కోసం ప్రార్థించడం అంటే వారు పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినప్పుడు వారు దేవుని నుండి పొందగలిగే ఉత్తమమైన ఆశీర్వాదం అనగా పాపక్షమాపణ పొందాలని దేవుడిని కోరడం. వారిని శపించడానికి బదులు వారి మంచి కోసం ప్రార్థించాలి. శతాధిపతిలో మార్పు (“నిజముగా ఈయన దేవుని కుమారుడని” [మత్తయి 27:54] అని చెప్పిన వ్యక్తి) నిస్సందేహంగా యేసు ప్రార్థనా ఫలితమే!

తనను హింసించేవారి చేతిలో మరణించిన మొదటి క్రైస్తవుడైన స్తెఫను కూడా అలాగే చేశాడు. అపొ.కా 7:59-60, 59 ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–“యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60 అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. స్తెఫనును చంపడానికి కారణమైన వారిలో సౌలు అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతడే తర్వాత పౌలు అని కూడా పిలువబడ్డాడు. అతడే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రోమా పత్రిక రాశాడు. పౌలు మారడంలో స్తెఫను ప్రార్థన ఎంత ప్రభావం చూపిందో ఎవరు చెప్పగలరు?

అదే పౌలు మన జీవితంలో మనల్ని హింసించేవారి కోసం ప్రార్థించమని ఈ పిలుపునిచ్చాడు. 2 కొరింథి 11:24లో, “యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని” అని వ్రాశాడు. అంటే మొత్తం 195 కొరడా దెబ్బలు! అయినప్పటికీ, రోమా 10:1లో, “సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి” అని వ్రాశాడు. శపించడానికి బదులు, రక్షణ ద్వారా వచ్చే మంచి కోసం ప్రార్థించాడు. అతడు తనని హింసించేవారిని దీవించమని కోరుతూ రోమా 12:14లో తాను బోధించిన దానిని ఆచరించి చూపాడు!

మనం కూడా అలాగే ఉండాలి. మనల్ని హింసించే వారిని దీవించడానికి మనం పిలువబడ్డాము. మనల్ని హింసించేవారి రక్షణ కోసం ప్రార్థనలో వారిని దేవుని దగ్గరకు తీసుకెళ్లాలి. మన నాలుక, కోపంతో ఎవరినీ నొప్పించకూడదు. బదులుగా, అది వారిపై దయ చూపమని, దీవించమని దేవుని ప్రార్థించాలి. మనం మోకారించి మనల్ని బాధపెట్టిన వారి కోసం హృదయపూర్వకంగా మధ్యవర్తిత్వం వహించాలి. వారికి నూతన హృదయాన్ని ఇవ్వమని మరియు మన స్వంత హృదయాలలో దాగి ఉన్న ప్రతీకారాన్ని విడిచిపెట్టేలా చేయమని మనం దేవుని అడగాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని బాధపెట్టేవారు క్రైస్తవులు కావచ్చు, అప్పుడు ఇతరులను బాధపెట్టే పాపపు ధోరణులను అధిగమించడానికి వారికి సహాయం చేయమని దేవుని ప్రార్థించాలి. వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా ప్రతీకారం తీర్చుకోకూడదు. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి మన ప్రార్థనలు ఉండాలి.

మనల్ని హింసించేవారిని దీవించమని దేవుని ప్రార్థించడంలో మనకు సమస్య ఉంది, ఎందుకంటే తప్పుగా ప్రవర్తించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అది కూడా వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని మనం కోరుకుంటాము. మమ్మల్ని బాధపెట్టినందుకు మూల్యం చెల్లించుకోకుండా మరియు తీర్పు యొక్క నొప్పి నుండి ఏదో ఒకవిధంగా తప్పించుకున్నందుకు మనం వారిని ద్వేషిస్తాము. మనతో దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తి మనకు కలిగించిన అదే బాధను అతడు కూడా అనుభవించాలని మనం కోరుకుంటాము. చెడును చెడుతో చెల్లించాలనుకుంటాము. అది మన సహజ స్పందన.

కానీ లేఖనాలు ఏమి చెబుతున్నాయంటే: “నీవు ఎన్ని పాపాలు చేశావో చూడు. దేవుడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? మీరు కోరిన మరియు పొందిన పాపక్షమాపణ అనే అదే ఆశీర్వాదం మీ శత్రువుల కోసం కూడా మీరు అడగాలి. యేసు చేసినట్లుగానే అన్ని తీర్పులను దేవుని చేతికి వదిలిపెట్టాలి.” నీతిమంతుడూ న్యాయాధిపతియైన దేవుడు సరైనది చేస్తారని విశ్వాసం నమ్ముతుంది. “సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” అని అబ్రాహాము ఆదికాండము 18:25లో అడిగాడు. యేసు దానిని విశ్వసించాడు కాబట్టి తీర్పు అంతా దేవుని చేతికి అప్పగించాడు [1 పేతురు 2:23]. అంతే కాకుండా తనను హింసించేవారిని క్షమించమని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు [లూకా 23:34].

 “మంచి చేసినప్పుడు చెడు తిరిగి ఇవ్వడం పాపం; మంచికి మంచిని తిరిగి ఇవ్వడం మానవత్వం; కానీ చెడుకు మంచిని తిరిగి ఇవ్వడం దైవికం” అని చెప్పబడింది.  కాబట్టి, మనం చెడుకు మంచిని తిరిగి ఇచ్చినప్పుడు మనం

1. దేవుని పిల్లలు అనే వాస్తవాన్ని చూపిస్తాము

2. మన ద్వారా పనిచేసే దైవిక శక్తి యొక్క వాస్తవికతను చూపిస్తాము

3. యేసులా ప్రవర్తించడానికి దేవుని కృప మనల్ని మారుస్తుందని చూపిస్తాము.

మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారా? వారి చెడుకు ఆశీర్వాదంతో ప్రతిస్పందించడానికి మీరు కష్టపడుతున్నారా? ప్రతీకార ఆలోచనలు మీ హృదయాన్ని ఆక్రమిస్తున్నాయా? అలా అయితే, అలాంటి వైఖరికి పశ్చాత్తాపపడండి. మీ కన్నులు యేసు వైపు తిప్పండి. ఆయనే మనకు ఆదర్శం. మనం అనుసరించవలసిన మాదిరి ఆయనే [1 పేతురు 2:21]. ఆయన మీ కోసం ఏమి చేసాడో చూడండి! గతంలో మీరు చేసిన పాపాలను ఆయన ఎలా క్షమించారు? ఆయన మిమ్మల్ని ఎలా క్షమిస్తూనే ఉన్నాడు? అని ఆలోచించండి. మీరు ఆయన దయ గురించి ఆలోచించినప్పుడు, మిమ్మల్ని బాధపెట్టిన వారికి అదే దయను అందించమని ఆయనను అడగండి.

ప్రార్థనలో మిమ్మల్ని హింసించేవారిని దేవుని వద్దకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా నిర్ణయించుకోండి. వారు అవిశ్వాసులైతే వారిని రక్షించమని దేవుడిని వేడుకోండి. దయచేసి వారు ఎదుర్కొనే శాశ్వతమైన శ్రమల గురించి ఆలోచించి వారి ఆత్మల కోసం కరుణతో వేడుకోండి. వారు విశ్వాసులైతే, వారి పిలుపునకు అనుగుణంగా జీవించడానికి వారికి సహాయం చేయమని దేవునికి వేడుకోండి. రోమా 12:14లోని ఆజ్ఞ ప్రకారం చేయండి, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించండి!

హింస అన్ని పరిమాణాలలో అన్ని రకాలుగా వస్తుంది. అన్ని వయస్సుల వారికి అన్ని  పరిస్థితులలో ఎదురవుతుంది. మనపై దాడి చేసినప్పుడు బాధించినప్పుడు మన నుండి వచ్చే స్పందన వారు క్రైస్తవ్యం గురించి ఆలోచించేలా చేస్తుంది.

బార్బరా రాబిడౌక్స్ తన పొరుగున ఉండే మిచెల్ అనే క్రైస్తవురాలిపై ఆసక్తిని కనబరిచింది, ఆమెను అక్కడి పొరుగువారందరు “బైబిల్‌ థంపర్” అని పిలుస్తారు. మిచెల్ సంతోషంగా ఉత్సాహాన్ని చూపిస్తూ వీధినంతా ఉత్తేజపరిచేది. ప్రతి వేసవికాలంలో VBS జరిగే సమయంలో ఆమె తన వ్యాన్‌నిండా పిల్లలను ఎక్కించుకుని తీసుకువెళ్లి వారితో కలిసి చర్చి కార్యక్రమాలలో పాల్గొనేది. వేసవికాలం సెలవులలో తమ పిల్లలతో సతమతమయ్యే తల్లిదండ్రులు గృహిణులకు ఉపశమనం ఇచ్చేది.

బార్బరా మిచెల్‌ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆమె లోపాలు వెదకుతూ ఆమెను ఇరుకున పెట్టాలని ప్రయత్నించేది. కాని ఆమెలో కరుణ, దయ, వినయం, సౌమ్యత, సహనం కనిపించాయి. ఒక రోజు మధ్యాహ్నం, మిచెల్ కుమారుడిపై పొరుగున ఉండే అల్లరి మూక దాడి చేసింది. అతడిని రాళ్లతో కొట్టి, “యేసు పిచ్చివాడు! యేసు పిచ్చివాడు!” అని ఎగతాళి చేశారు. అతడు కన్నీళ్లతో తడిచిపోయి లోపలికి వచ్చాడు. మిచెల్ తన కుమారుడిని నెమ్మదిగా ఓదార్చడం అతడిని వేధించినవారి ఆత్మల కోసం ప్రార్థించడం బార్బరా చూసింది. బార్బరా ఆమెను ఎలా సంయమనంతో ఉండగలిగావని అడిగినప్పుడు మిచెల్, నాకు మాట్లాడలేనంత కోపం వచ్చింది. కానీ రోమా 12:14లో “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు అని వ్రాయబడింది కదా” అని చెప్పింది.

ఆ సంఘటన బార్బరాను చాలారోజులు వెంటాడింది. సమయం గడిచేకొద్దీ, ఆమె మిచెల్‌ను తన నమ్మకాల గురించి ప్రశ్నించి ఆమె సమాధానాలను జాగ్రత్తగా విన్నది. “మిచెల్ కారణంగా పొరుగు పిల్లలలో ఎవరైనా ఆ వేసవి తరగతులలో క్రీస్తును తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం తెలుసుకున్నాను.  నా పొరుగున ఉండే ఒక కుటుంబం కారణంగా వారి అనుదిన జీవితం వలన నేను ఆయనను తెలుసుకున్నాను” అని బార్బరా చెప్పింది.

దేవుని ఆజ్ఞలను స్థిరంగా పాటించడం వల్ల కలిగే ప్రభావాన్ని మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. అందుకు అధిక వెల చెల్లించవలసి వచ్చినా సరే!

Category

Leave a Comment