రూపాంతరం చెందిన జీవితము 10వ భాగము శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి

Posted byTelugu Editor August 6, 2024 Comments:0

(English version: “The Transformed Life – Pursue Hospitality”)

రోమా 12:13లోని రెండవ భాగంలో “శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి” అని మనకు చెప్పబడింది. “ఆతిథ్యం” అనే పదం “ప్రేమ” మరియు “అపరిచితులు” లేదా “విదేశీయులు” అనే 2 పదాల నుండి వచ్చింది. కలిపితే దాని అర్థం “అపరిచితుల పట్ల ప్రేమ చూపడం.” “ఇచ్చుచుండుడి” అంటే ఆసక్తిగా ఇవ్వండి అని చెప్పచ్చు. ఈ రెండు పదాలను కలిపినప్పుడు “అపరిచితుల పట్ల ఆసక్తిగా ప్రేమను చూపించాలనే” భావం మనకు వస్తుంది—వారి అవసరాలను తీర్చడం ద్వారా మరియు వారిని రక్షించడానికి  ఇంటి తలుపులు తెరవడం ద్వారా ప్రేమ వ్యక్తీకరించాలి. పౌలు ప్రకారం, అది క్రీస్తులా మరింతగా మారడానికి ఆత్మ ద్వారా రూపాంతరం చెందే క్రైస్తవుని యొక్క జీవనశైలిగా ఉండాలి.

వీటికి సంబంధించిన అనేక ఉదాహరణలు మనకు లేఖనాలలో ఉన్నాయి. మానవ రూపంలో వచ్చిన దేవదూతలను అబ్రాహాము తన గుడారానికి ఆహ్వానించి వారికి ఆహారం ఇచ్చాడు [ఆది 18:1-8]. లోతు కూడా అలాగే చేశాడు [ఆది 19:1-11]. యోబు తన చిత్తశుద్ధిని సమర్థించుకుంటూ తన స్నేహితులతో “పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా” [యోబు 31:32] అన్నాడు.

ఆతిథ్యం చూపించడమనేది పాత నిబంధనలో దేవుని ప్రజలు వాగ్దానదేశంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ అని గమనించండి. “మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి” [ద్వితియో 10:19]. ఎందుకంటే, “దేవుడు తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు” [ద్వితియో 10:18].

క్రొత్త నిబంధనకు వస్తే ఆతిథ్యానికి సంబంధించిన ఆజ్ఞలు పెద్దగా మారలేదు. మనం అపరిచితుల పట్ల విదేశీయుల పట్ల ప్రేమ చూపించి శ్రద్ధవహించాలి. నిజానికి, దేవుడు దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. సంఘంలో పాస్టరుగా లేదా పెద్దగా ఉండాలంటే కావలసిన లక్షణాలలో ఆతిథ్యం ఒకటి. “అధ్యక్షుడగువాడు…అతిథిప్రియునిగా ఉండాలి” [1 తిమోతి 3:2, తీతు 1:8]. మరో మాటలో చెప్పాలంటే, దీనికి ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు!

వితంతువుల గురించి చెబుతూ, “సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవ రాండ్ర లెక్కలో చేర్చవచ్చును” [1 తిమో 5: 10] అని వ్రాయబడింది. “సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి” [హెబ్రీ 13:1] అని చెబుతూ హెబ్రీపత్రిక రచయిత ఆతిథ్యం ఇవ్వండని విశ్వాసులందరిని ఆజ్ఞాపించాడు.

1 పేతురు 4:9లో అపరిచితులకే కాకుండా తెలిసిన విశ్వాసులకు కూడా ఆతిథ్యం ఇవ్వాలనే ఆదేశం ఇస్తూ, “సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి” అని వ్రాయబడింది. పేతురు కాలంలో ఇది చాలా ప్రమాదకరమైన విషయం. హింస అధికమవుతున్న ఆ సమయంలోను కొందరు తమకు ప్రమాదం ఎదురైనా ఇతర విశ్వాసులకు తమ ఇళ్లలో చోటు ఇచ్చారు. “సణుగుకోకుండా” ఆతిథ్యమివ్వాలని ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే ఆతిథ్యాన్ని ఇచ్చేటప్పుడు ఎలాంటి ఫిర్యాదులు గొణుగుడులు ఉండకూడదు.

కొంతమంది అతిథులు ఒక మహిళ ఇంటికి వచ్చారు, భోజనానికి ముందు ప్రార్థన సమయంలో ఆమె తన కుమార్తెను ప్రార్థన చేయమని కోరింది. తన కుమార్తె సంకోచించడం చూసి, “సిగ్గుపడకు, మధ్యాహ్న భోజన సమయంలో నేను ప్రార్థించినట్లు చేయి” అంది. ఆ అమ్మాయి వెంటనే, “ప్రభూ, ఈ రోజు వీళ్లు ఎందుకు మా ఇంటికి రావాలి?” అని ప్రార్థించింది.

పిల్లలు చాలా వేగంగా పట్టుకుంటారు కదా? మనం ఉల్లాసమైన ఆత్మతో ఆతిథ్యమివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు!

ప్రధానమైన విషయం: ఆతిథ్యం అనేది కొంతమంది క్రైస్తవులకు మాత్రమే వుండే వరం కాదు. ఈ ఆజ్ఞ క్రైస్తవులందరికీ వారి జీవితమంతా చురుకుగా పాటించాలని మరియు ఆచరించాలని ఇవ్వబడింది. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే వారందరూ క్రమంగా ఆతిథ్యం ఇవ్వాలని కొత్తనిబంధన స్పష్టంగా తెలియజేస్తుంది. ఆది సంఘం దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. మొదటి శతాబ్దం చివరినాటికి, విశ్వాసులు ప్రయాణం చేసివచ్చే మిషనరీలకు తమ ఇళ్లల్లో ఆశ్రయమివ్వడం వారి పనికి మద్దతు ఇవ్వడం సర్వసాధారణం అయ్యింది. అపొస్తలుడైన యోహాను విశ్వాసులను మెచ్చుకుంటూ, 5 ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. 6-7 వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినయెడల నీకు యుక్తముగా ఉండును. 8 మనము సత్యమునకు సహాయ కులమవునట్టు3 అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము” [3 యోహాను 1:5-8] అని వ్రాసాడు.

అలాగే ఆతిథ్యం విషయంలో ప్రమాదం కూడా ఉంది. సహవాసం కోసం ప్రతిఒక్కరిని మన ఇంటిలోకి తీసుకురాకూడదు. కొన్ని గుంపుల విషయంలో బైబిలు స్పష్టంగా వద్దని చెబుతుంది. అవి రెండు రకాలు. మొదటి రకం అబద్ధపు బోధకులు [2 యోహాను 1:7-11; తీతు 3:10-11; 2 తిమోతి 3:5] మరియు రెండవ రకం విశ్వాసులమని చెప్పుకుంటూ పశ్చాత్తాపపడనివారు [1 కొరింథి 5:11]. కాబట్టి, మనం ఆతిథ్యం ఇవ్వాలనే ఆజ్ఞను పాటించేటప్పుడు ఈ బైబిలు ఆజ్ఞలకు అనుగుణంగా మనం వివేచనను ఉపయోగించాలి.

ఆతిథ్యం గురించి బైబిలు తెలియచేసిన దానిని చూసిన తర్వాత, 2 అంశాలను చూడటం ద్వారా ఈ ఆజ్ఞను ఎలా పాటించాలో చూద్దాం:

1. చాలామంది క్రైస్తవులు ఎందుకు ఆతిథ్యం ఇవ్వరు ?

2. క్రైస్తవులు ఎక్కువగా ఎలా ఆతిథ్యం ఇవ్వగలరు?

1. చాలామంది క్రైస్తవులు ఆతిథ్యం ఎందుకు ఇవ్వరు?

ఇక్కడ 5 కారణాలు ఉన్నాయి.

1. విభజించబడిన కుటుంబం.అటువంటి సందర్భాలలో, ఇంటి వెలుపల మీరు చేయగలిగినదంతా చేయండి. వారిని ఇంటికి తీసుకురాకుండా మీరు ఆశీర్వాదకరంగా ఎలా ఉండవచ్చో చూపించమని దేవుడిని అడగండి. కాఫీ షాప్‌లో వ్యక్తులను కలవండి మరియు మీరు వారికి ఎలా పరిచర్య చేయవచ్చో తెలుసుకోండి. వీలైన చోట వారిని సందర్శించి వారి అవసరాలను తీర్చండి.

2. భయం. స్వతహాగా కొంతమంది ఇంటికి ఎవరైనా వస్తే భయపడతారు. అది భయం కావచ్చు లేదా సిగ్గు కావచ్చు. అలాంటివారు స్వతహాగా అంతర్ముఖులుగా ఉంటారు. మీరు అలాంటివారైతే ఈ సమస్యలను అధిగమించడానికి దేవుని సహాయం కోరండి. ఒకసారి మీరు వ్యక్తులతో కలిసిపోయి వారు మీకు తమ హృదయాలను తెరిచినట్లయితే, వారికి క్రీస్తు ప్రేమను చూపడమనే అద్భుతమైన అనుభవం మీకు కలుగుతుంది.

3. గర్వం. కొందరు తమ ఇల్లు ఎలా కనిపిస్తుంది, వచ్చినవారు తమ ఇంటి గురించి ఏమనుకుంటారనే దానిపై ఎక్కువ దృష్టి పెడతారు. అలాంటివారి ఇంటికి చాలా తక్కువగా అతిథులు వస్తారు. సమస్య ఇంటి పరిమాణం కాకపోయినా దానిని సాకుగా చూపిస్తారు. అంతర్లీనంగా ఉన్న కారణం గర్వం, అహంకారం. నా ఇంటి పరిమాణాన్ని లేదా రూపాన్ని చూసి నన్ను అంచనా వేస్తారనే దానిపై ఎక్కువ దృష్టిపెట్టడమే సమస్య.

వినోదానికి ఆతిథ్యానికి మధ్య వ్యత్యాసం ఉంది. అహంకారం వినోదాన్ని కోరుకుంటుంది, వినయం ఆతిథ్యాన్ని కోరుకుంటుంది. ఆతిథ్యానికి వినోదానికి మధ్య భేదాన్ని కరెన్ మెయిన్స్ ఓపెన్ హార్ట్, ఓపెన్ హోమ్‌లో [ఎల్గిన్, ఇల్.: కుక్, 1976] క్రింది విధంగా చెప్పారు:

“నేను నా ఇల్లు, నేను చేసే అందమైన అలంకరణలు మరియు నేను తయారుచేసే ఆహారంతో మిమ్మల్ని ఆకట్టుకోవాలనుకుంటున్నాను” అని వినోదం అంటే పరిచర్యను కోరుకునే ఆతిథ్యం, “ఈ ఇల్లు నా యజమాని నుండి వచ్చిన బహుమతి. ఆయన చిత్తప్రకారం దానిని నేను ఉపయోగిస్తాను” అంటుంది. సేవ చేయడమే ఆతిథ్యం యొక్క లక్ష్యం.

వినోదంలో ప్రజలకన్నా వస్తువులకు ప్రాధాన్యత ఉంటుంది.  వినోదం “నా ఇల్లు పూర్తిగా సిద్ధమైనప్పుడు, అలంకరించబడి, శుభ్రం చేయబడినప్పుడు—నేను ప్రజలను ఆహ్వానించడం ప్రారంభిస్తాను” అనుకుంటుంది. ఆతిథ్యంలో ప్రజలకు ప్రాధాన్యత ఉంటుంది. ఫర్నీచర్ లేదు మనం నేలపై కూర్చుని తిందాం. డెకరేషను ఇంకా పూర్తి కాలేదు కాని మీరు రావచ్చు. ఇల్లు గందరగోళంగా ఉంది కానీ మీరు స్నేహితులే కాబట్టి మాతో ఇంటికి రండి.

వినోదం, “ఈ ఇల్లు నాది, నా వ్యక్తిత్వాన్నిచూపిస్తుంది. దయచేసి చూడండి మరియు మెచ్చుకోండి” అని గట్టిగా అంటుంది. ఆతిథ్యం, “నావన్నీ నీవే” అని గుసగుసలాడుతుంది.

4. పక్షపాతం. నాలాంటివారినే నేను ఆహ్వానిస్తాను. అది సాధారణంగా చెప్పే మరో కారణం. అంతరంగంలో జాత్యహంకార వైఖరి ఉంది. బైబిలు దీనిని ఖండిస్తుంది. ద్వితీయో 10:18-20 చదవండి. యెహోవా పట్ల ఉన్న భయం మనల్ని విదేశీయులను ప్రేమించి స్వాగతించేలా చేయాలి. దేవుడు జాత్యహంకార వైఖరిని అసహ్యించుకుంటాడు కాబట్టి అలాంటి ఆలోచనలకు లొంగిపోకుండా మనం పోరాడాలి. మనం మన శత్రువులను కూడా ప్రేమించాలి వారికై ప్రార్థించాలి మరియు వారికి మేలు చేయాలి!

5. సోమరితనం. సోమరితనం చివరిదే కానీ తక్కువ కాదు. ఆతిథ్యం ఇవ్వడానికి పని చేయాల్సి రావడాన్ని మనం ఇష్టపడము. పనిలో నాకు తీరికలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి నాకు సమయం కావాలి. బహుశా వచ్చే వారం లేదా వచ్చే నెల అంటూ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా మనం మన గురించి మన సౌకర్యాల గురించి మాత్రమే ఆలోచిస్తాము. అసౌకర్యానికి గురికావడానికి ఇష్టపడము. అది క్రీస్తులాంటి ఆలోచన కాదు. మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఇతరులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తే మన హృదయాలకు గొప్ప ప్రోత్సాహాన్ని తీసుకురావడానికి దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడని గుర్తుంచుకోవడంలో విఫలమవుతాము.

ఖచ్చితంగా మరిన్ని జోడించవచ్చని అనుకుంటున్నాను. కాని చాలా సాధారణమైనవే క్రమంగా ఆతిథ్యం ఇవ్వాలనే ఆజ్ఞను పాటించకుండా చాలామంది విశ్వాసులను నిరోధిస్తాయి. ఇప్పుడు, పరిష్కారం చూద్దాం. మనం మరింత ఆతిథ్యమివ్వడం ఎలా? 

2. క్రైస్తవులు ఎక్కువగా ఎలా ఆతిథ్యం ఇవ్వగలరు?

ఇక్కడ 5 సూచనలు ఉన్నాయి.

1. సరళంగా ఉండాలి. ఆతిథ్యం విషయంలో మనం తరచుగా చేసే తప్పు అతిగా చేయడమే. నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించి ప్రయాసపడతాము. దానివలన సులభంగా అలసిపోతారు. ఫలితంగా మరలా మరలా ఆహ్వానించలేము. దీన్ని సరళంగా ఉంచండని నా సలహా. అప్పుడు ఆహ్వానించడానికి, వ్యక్తులతో సమయాన్ని గడపడానికి మరియు వారి భారాలను పంచుకోవడానికి మరిన్ని అవకాశాలు కలుగుతాయి.

“మాకు తగినంత స్థలం లేదు. నాకు వంటచేయడం సరిగా రాదు. అందరితో కలవాలంటే భయం” అనే ఆలోచనలు రానివ్వకండి. మీకు ఉన్నదానితో మంచిగా చేయండి. మీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండండి! కొన్నిసార్లు, ఇది కాఫీ టీ స్నాక్స్‌ మాత్రమే కావచ్చు. ఇది సుధీర్ఘంగా ఉండవలసిన అవసరం లేదు. ఇతరులను ప్రోత్సహించడానికి కలిసి ఉండటం ముఖ్యం. అది సరళంగా ఉంచండి!

2. క్రమంగా ఇవ్వండి. ఈ ఆదేశాన్ని క్రమంగా పాటించడం ఒక సవాలు. సమంజసమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ప్రోత్సహించడానికి ప్రతి 2 వారాలకు ఒకసారైనా ఒక కుటుంబాన్ని ఆహ్వానించాలి. ఒకరినే పదే పదే ఆహ్వానించకండి. అలా చేస్తే ఇతరులను ఆహ్వానించడానికి మీకు ఎక్కువ సమయం ఉండదు. సమతుల్యత పాటించండి. లూకా 14:13-14లోని యేసు మాటల ప్రకారం ఒంటరిగాను సామాజికంగా అట్టడుగు స్థితిలో ఉన్నవారిని ఆహ్వానించడం అలవాటు చేసుకోండి, “13 అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. 14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.”

3. దానిని క్రీస్తు కేంద్రంగా ఉంచండి. వారు విశ్వాసులైతే, వారి ఆధ్యాత్మిక నడకను ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ప్రార్థించడానికి కూడా కొంత సమయం కేటాయించండి. చాలాసార్లు అనేక సమస్యల గురించి మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించి కేవలం భోజనానికి ముందు మాత్రమే ప్రార్థనలో గడుపుతారు. ప్రార్థన చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించడానికి ప్రయత్నించండి. అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వారు అవిశ్వాసులైతే దేవుడు అవకాశం ఇస్తే క్రీస్తు గురించి మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రార్థించండి, తలుపు తెరవమని ప్రభువును అడగండి.

4. అవకాశాల కోసం ప్రార్థించండి. ఆది సంఘ కాలంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండడం ప్రమాదకరం కాని ఇప్పుడు చాలా సురక్షితంగా ఉంది [చాలా ప్రదేశాలలో]. కాబట్టి కొన్నిసార్లు క్రొత్తవారిని కలుసుకోవడం అపరిచితులను ఆహ్వానించడం మనకు కష్టంగా ఉంటుంది. ప్రార్థిస్తూ ఉండండి; అవకాశాల కోసం వెతుకుతూ ఉండండి. బహిరంగ ప్రదేశాల్లో స్నేహితులను చేసుకోండి, అది మీ పిల్లలు వెళ్లే పాఠశాల, మీ చుట్టుప్రక్కల ప్రాంతాలు, పనిచేసే స్థలం ఏదైనా కావచ్చు. వారిని మీ ఇంటికి ఆహ్వానించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆదరించబడి వారి భారాన్ని పంచుకోవడం మీరు చూస్తారు.

5. విశ్వాసంతో చేస్తూనే ఉండండి. చివరిగా దేవుని ఆజ్ఞలను పాటించడానికి విశ్వాసం అవసరం. మీ ఆతిథ్యం వలన కలిగే పరిణామాలను మీరు ఇప్పుడు గ్రహించలేరు తర్వాత మాత్రమే తెలుసుకోగలరని నమ్మండి.

ఒక బైబిల్ కళాశాల విద్యార్థి ఆదివారం ఉదయం చర్చికి ముప్పై మైళ్ల దూరం కారు లో వెళ్లేవాడు మరియు సహాయం కోరిన ప్రయాణీకులకు తరచుగా లిఫ్ట్ ఇచ్చేవాడు.ఒకరోజు అతను ఒక యువకుడికి లిఫ్ట్ ఇచ్చాడు, మరియు ఆ యువకుడు విద్యార్థి కోటు మరియు సూట్ ధరించి ఉండటాన్ని గమనించి, అతనితో చర్చికి తాను కూడా రావచ్చా అని అడిగాడు. అందుకు ఆ విద్యార్థి సరే అన్నాడు.

అపరిచిత యువకుడు చర్చికి వచ్చాడు. సమావేశం తర్వాత ఆ చర్చిలోని ఒక కుటుంబం భోజనం మరియు ఫెలోషిప్ కోసం అతన్ని ఇంటికి ఆహ్వానించింది.  అక్కడ అతడు వేడినీటి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని వేడి వేడి భోజనం చేశాడు. ఆ యువకునితో మాట్లాడుతున్నప్పుడు, ఆ యువకుడు క్రైస్తవుడని, అయితే అతను కొంతకాలంగా ప్రభువుతో సహవాసానికి దూరంగా ఉన్నాడని హోస్ట్‌కి తెలిసింది. అతడు మరొక రాష్ట్రంలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడని గ్రహించారు. సాయంత్రానికి బస్సు టికెటు కొనిచ్చి పంపించారు.

ఒక వారం తర్వాత, సెమినరీ విద్యార్థికి ఆ వ్యక్తి నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరంతో పాటు హంతకునిగా మారిన వ్యక్తి అని హెడ్‌లైన్స్‌తో ఉన్న వార్తాపత్రిక క్లిప్పింగు జతచేయబడి ఉంది. ఆ యువకుడు దోపిడీకి ప్రయత్నిస్తూ ఓ టీనేజీ బాలుడిని హత్య చేసి కొంతకాలంగా చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. కానీ ఆ క్రైస్తవులు చూపించిన దయ, ఇచ్చిన ఆతిథ్యం అతడిని తప్పు ఒప్పుకునేలా చేశాయి. అతడు దేవునితో సహవాసం కలిగివుండాలని కోరుకున్నాడు. దానికి తన నేరానికి సంబంధించి సరైన చర్యలు తీసుకోవాలని అతనికి తెలుసు.

ఆతిథ్యం ఇవ్వడంలో తమ విశ్వాసాన్ని చూపించడం ద్వారా వారు దేవుని దృష్టిలో సరైనది చేసేలా ఒక వ్యక్తిని ప్రభావితం చేశారని తద్వారా అతడు ప్రభువుతో సహవాసంలోకి తిరిగి రావడానికి సహాయం పడ్డారని ఆ క్రైస్తవులకు తెలియదు. అందుకే, విశ్వాసంతో ఆతిథ్యాన్ని ఇవ్వాలనే ఈ ఆజ్ఞతో సహా దేవుని ఆజ్ఞలన్నింటినీ మనం పాటించాలి.

ఆతిథ్యాన్ని ఇవ్వడం ఒక ముఖ్యమైన ఆజ్ఞ. నిజమైన విశ్వాసం యొక్క లక్షణమని యేసు స్వయంగా చెప్పారు [మత్తయి 25:35-46]. ఈ ఆదేశాన్ని ఆచరణలో పెట్టడానికి ఉత్తమ ప్రేరణ ఏమిటి? యేసు తన రక్తాన్ని సిలువపై చిందించి మనలాంటి పాపుల కోసం పరలోకంలో తన ఇంటిని తెరిచారు. యేసు నామంలో మన గృహాలను ఇతరులకు తెరవలేమా? క్రైస్తవ మతాన్ని “తెరిచిన హస్తం, తెరిచిన హృదయం మరియు తెరిచిన తలుపు” అని పిలుస్తారు. మనం క్రీస్తులాగా మరింతగా రూపాంతరం చెందుతున్నప్పుడు ఈ సత్యాలు మన జీవితాల్లో స్పష్టంగా ఉండాలి.

Category

Leave a Comment