రూపాంతరం చెందిన జీవితం 14వ భాగము ఏడ్చువారితో ఏడువుడి 2వ భాగము

Posted byTelugu Editor October 14, 2024 Comments:0

(English version: The Transformed Life – Weep With Those Who Weep – Part 2)

మునుపటి పోస్ట్‌లో, రోమా 12:16లో మనకు ఏడ్చువారితో ఏడువుడి లేదా దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి అనే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నించేటప్పుడు “ఏడ్చేవారితో ఏడ్వడం ఎలా” అనే అంశంలో ఆ సమయంలో చేయకూడని 5 విషయాలు పరిశీలించాము. అవి:

1. బాధలో ఉన్న వ్యక్తిని దానిని అధికమించమని చెప్పవద్దు 2. ఇప్పుడే పూర్తి విడుదల గురించి వాగ్దానం చేయవద్దు 3. వారి బాధలను ఇతరుల బాధలతో పోల్చవద్దు.4. వారికి తీర్పు తీర్చవద్దు 5. వారిని దూరంగా ఉంచవద్దు.

తర్వాత, జీవితంలో కష్టకాలంలో ఉన్నవారిని ఓదార్చడానికి  చేయవలసిన 5 విషయాలను “ఏమి చేయాలి” అనే అంశంలో చూద్దాం.

ఏమి చేయాలి

1. ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించండి. మొదటిగా అన్నిటికంటే ముందుగా మనం వారి విడుదల కొరకు క్రమం తప్పకుండా వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ఈ శ్రమలలో వారు దేవుని సన్నిధిని అనుభవించేలా చేయమని మనం దేవునికి మనవి చేయాలి. బాధపడేవారికి ఆదరణ కలగడానికి మనల్ని ఇతరులను ఆయనకు తగినట్లుగా ఉపయోగించుకోమని దేవుడిని అడగాలి. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు లేదా ఇతర సాధనాల ద్వారా (ఇమెయిల్, మెసెజ్) సందేశాన్ని పంపినప్పుడు వారికి స్వస్థతను ప్రోత్సాహాన్ని కలిగించే సరైన పదాలను ఉపయోగించేందుకు జ్ఞానాన్ని ఇవ్వమని కూడా మనం దేవుడిని అడగాలి. “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి” అని సామెతలు 16:24లో ఉంది. “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని సామెతలు 12:18లో ఉంది. కష్టాలలో ఉన్న వారి ఆత్మలను మన మాటలు ఎంతో స్వస్థతపరచగలవు.

కష్టాలలో ఉన్న వారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు మనం వారితో కలిసి ప్రార్థించాలి. దేవున్ని జోక్యం చేసుకోమని ఆయన సంకల్పాన్ని నెరవేర్చమని మనం దేవునికి మనవి చేస్తున్నప్పుడు ప్రార్థనలోని ఆ కొన్ని మాటలు కూడా బాధలలో ఉన్న వారికి అద్భుతమైన ప్రోత్సాహాన్నిస్తాయి.

2. సాధ్యమైతే వారి సౌలభ్యాన్ని బట్టి వారిని సందర్శించండి. మనం ప్రజలను వారి సౌలభ్యం మేరకు సందర్శించాలి కాని మన సౌలభ్యాన్ని బట్టి కాదు! నా సౌలభ్యం ప్రకారం వస్తాను అనేది సందర్శించడం అవ్వదు. బాధలలో ఉన్న వారి అవసరాల గురించి మనం సునిశితంగా ఉండాలి. వారికి ఎవరిని కలుసుకోవాలని లేకపోతే మనం వారి అభ్యర్థనను తప్పనిసరిగా గౌరవించాలి.

మనం వారిని కలుసుకున్నప్పుడు, అది బాధలలో ఉన్న వారి హడావిడిగా అనిపించకూడదు. దుఃఖంలో ఉన్నవారిని సందర్శించినప్పుడు అత్యంత బాధ కలిగించే విషయాలలో ఒకటి, అక్కడ నుండి ఎప్పుడు బయలుదేరి వెళ్లిపోవచ్చో చూడటానికి ప్రతి 2 నిమిషాలకు గడియారం వైపు చూస్తూ ఉండడమే. సంతోషించే వారితో కలిసి గంటల తరబడి సమయాన్ని గడుపుతాం కానీ దుఃఖంలో ఉన్నవారిని సందర్శించినప్పుడు మనం తొందరలో ఉంటాము. మనం వారితో ఎక్కువ సమయం గడపాలని దాని అర్థం కాదు కాని (అధిక సమయం గడిపి బాధలలో ఉన్న వారికి మనం భారంగా ఉండకూడదు.) బాధలలో ఉన్న వారి అవసరాలపై సౌలభ్యంపై ఆ సమయ వ్యవధి ఆధారపడి ఉండాలి.

3. మంచి శ్రోతగా ఉండండి. మనం దుఃఖిస్తున్న వారితో ఉన్నప్పుడు మనం తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి; వారి మాటలను మాత్రమే కాకుండా వారి హృదయాలను కూడా మనం వినాలి. దుఃఖపడే వారి మాటలు సూచించే దానికంటే అంతరంగంలో వారు ఇంకా ఎక్కువగా విరిగిపోయి ఉండవచ్చు. మనం వారి భావోద్వేగాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. వారు సరిగా మాటలు మాట్లాడకపోయినా సరే మనం ఓపికగా ఉండాలి. వాటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం లేదు. ముందు వారిని మాట్లాడనివ్వాలి. వాళ్ళు మౌనంగా ఉంటే మనం కూడా మౌనంగా ఉండడం మంచిదే. కొన్నిసార్లు కేవలం భౌతిక ఉనికి స్వాంతన కలిగిస్తుంది. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు లేదా మౌనంగా ఉండటమే మంచిదని అనిపించినప్పుడు ఏమీ మాట్లాడకుండా మనం వారి దగ్గర కూర్చొని భుజం మీద చేయి వేస్తే సరిపోతుంది బాధలలో ఉన్న వారికి అది చాలా స్వస్థత చేకూరుస్తుంది.

 విశాల హృదయం ఉన్న ఒక చిన్న పిల్లవాడి గురించి ఒక కథ ఉంది. అతని పక్కింటిలో ఉండే ముసలాయన భార్య ఇటీవలే మరణించింది. ఆ ముసలాయన ఏడుస్తూ ఉండడం చూసిన ఆ పిల్లవాడు అతనికి ఒడిలోకి ఎక్కి కూర్చున్నాడు. విచారంగా ఉన్న తమ పొరుగువారితో ఏమి మాట్లాడావని ఆ బాలుడి తల్లి అతడిని అడిగినప్పుడు, “ఏమీ మాట్లాడలేదు, ఏడ్వడానికి సహాయం చేసాను” అని ఆ పిల్లవాడు బదులిచ్చాడు.

కొన్నిసార్లు తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కోసం మనం చేయగలిగిన ఉత్తమమైన పని అదే. వారికి సహాయపడే మాటలను తెలివిగా చెప్పడానికి మనం చేసే ప్రయత్నాల కంటే, దుఃఖంలో ఉన్న వారి పక్కన కూర్చోవడం, వారి చేయి పట్టుకోవడం, వారితో కలిసి ఏడ్వడం చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.

 4. లేఖనాలతో వారిని ప్రోత్సహించండి. బాధలలో ఉన్న వారి ప్రస్తుత బాధను తక్కువ చేయకుండా నిత్యత్వం గూర్చిన నిరీక్షణతో వారిని ప్రోత్సహించడానికి మనం ప్రయత్నించాలి. అందుకే ఏడ్చేవారితో కలిసి మనం ఏడ్చేటప్పుడు లేఖనాల ప్రాధాన్యతను తగ్గించలేము. రోమా 15:4లో, “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని ఉంది. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా బాధలలో ఉన్న వారికి నిరీక్షణ ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించినప్పుడు మనం “నిరీక్షణ అందించేవారం” కావచ్చు.

వారి వాస్తవమైన బాధను మనం గుర్తించాలి. వారిని దేవునికి మొరపెట్టమని ప్రోత్సహించాలి. దేవుని ప్రజలు అనేక సంవత్సరాలుగా ఆయనకు ఎలా మొరపెట్టారో బైబిలు పదేపదే ప్రస్తావిస్తున్నదని మనం వారికి గుర్తుచేయాలి. ఏదో ఒక రోజు ఈ కన్నీళ్లు ఇక ఉండవనే నిరీక్షణతో మొరపెట్టేలా మనం వారిని ప్రోత్సహించవచ్చు. నిరుత్సాహపడిన దావీదు కోసం యోనాతాను చేసినట్లే, బాధలలో ఉన్న వారికి దేవునిలో బలాన్ని కనుగొనడంలో సహాయం చేయడం చాలా అద్భుతమైన పని. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చి–…. దేవునిబట్టి అతని బలపరచెను” (1 సమూయేలు 23:15-17).

5. అనుభవపూర్వక సహాయాన్ని అందించండి. అవసరమైన చోట, మనం అనుభవపూర్వక సహాయాన్ని అందించాలి. ఇది వారికి ఆహారం అందించడం, డబ్బు ఇవ్వడం, వారి పిల్లలను చూడటం, వారి ఇళ్లను బట్టలను శుభ్రం చేయడం మొదలైనవి. మనం వారి అవసరాల పట్ల సున్నితంగా ఉండాలి. ఆచరణాత్మకంగా వారికి ఎలా సహాయం చేయవచ్చో చూపించమని దేవుడిని అడగాలి. ప్రజలు ఎప్పుడూ అడుగుతూ ఉండకపోవచ్చు, కానీ మనకు వీలైనంత వరకు సహాయం చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే : 1. ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించటం 2. సాధ్యమైతే వారి సౌలభ్యాన్ని బట్టి వారిని సందర్శించటం 3. మంచి శ్రోతగా ఉండటం 4. లేఖనాలతో వారిని ప్రోత్సహించటం 5. అనుభవపూర్వక సహాయాన్ని అందించటం.

మనం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాము కాబట్టి, మనమే ఏడ్చేవారిగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అనే విషయాలను కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. మరో విధంగా చెప్పాలంటే ఏడుస్తున్న వారికి ఒక మాట. మీరు ఆ పరిస్థితిలో ప్రస్తుతం ఉండవవచ్చు లేదా భవిష్యత్తులో ఉండవచ్చు.

ఏడుస్తున్న వారికి ఒక మాట.

 కొన్నిసార్లు, మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన వారు సరైన మాటలు మాట్లాడకపోవచ్చు. దయచేసి వారి తప్పులను పట్టించుకోవద్దు. వారు కూడా తోటి పాపులే. కొన్నిసార్లు, మిమ్మల్ని ఎవరూ ఓదార్చడం లేదని మీరు భావించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ హృదయాలలో కోపం పెరిగిపోకుండా జాగ్రత్త పడండి. మీరు కూడా ఏదో ఒక సమయంలో ఏడ్చే వారితో కలిసి ఏడవకుండా దోషిగా ఉన్నారని గుర్తుంచుకోండి. ఏడ్చేవారితో మీరు గతంలో తప్పుగా మాట్లాడినందుకు కూడా దోషి అయి ఉండవచ్చు. వారు బాధలో ఉన్న మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు కావచ్చు. వారు మీ తప్పులను పట్టించుకోనట్లే, మీరు కూడా ఇతరుల తప్పులను పట్టించుకోకండి. కొలస్సి 3:13లో ఒకరినొకరు సహించుకోమని మనకు చెప్పబడింది.

మీరు బాధపడుతున్నారనే విషయం ఇతరులకు తెలియని సందర్భాలు ఉండవచ్చని కూడా మీరు గుర్తుంచుకోండి! కాబట్టి, మీకు వారి మద్దతు కావాలంటే మీరు బాధలలో ఉన్నారని వారికి తెలుసో లేదో నిర్ధారించుకోండి. మీకున్న సమస్యల గురించి నిరంతరం ప్రచారం చేసుకోవాలని నా ఉద్దేశ్యం కాదు. కాని  మీరు మీ సమస్యలను మీ వరకే ఉంచుకుంటే వాటి గురించి ఇతరులకు ఏమీ తెలియకపోతే, బాధలలో ఉన్న సమయంలో మీరు ఒంటరిగా ఉండటానికి ప్రధాన కారణం మీరేనని గుర్తుంచుకోండి.

కొన్ని సంవత్సరాల క్రితం కష్టాలలో ఉన్న ఒక వ్యక్తిని పాస్టర్ అయిన నేను సందర్శించి ప్రార్థన చేయలేదని ఆ వ్యక్తి కలత చెందిన సంఘటన నాకు గుర్తుంది. సంఘసభ్యులు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు వచ్చి ప్రార్థించడం పెద్దల బాధ్యత అని చెప్పడానికి ఆ వ్యక్తి యాకోబు 5:14లోని వాక్యాన్ని ఉటంకించాడు. “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను”అని యాకోబు 5:14లో ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ వ్యక్తి కష్టకాలంలో ఉన్నాడని నాకు తెలియకపోవడమే! కాబట్టి నేను, “అది నిజమే. అయితే కష్టాలలో ఉన్న వారు మొదట పెద్దలను పిలవాలని అదే వాక్యం స్పష్టంగా చెబుతుంది. పాస్టర్లు మీ మనస్సులు చదవలేరు. వారు సర్వజ్ఞులు కాదు. కాబట్టి, ఇది ఈ వాక్యం రెండు విధాలుగా ఉంటుంది” అని చెప్పాను.

కాబట్టి, మీరు బాధలలో ఉంటే మీ పాస్టర్‌కు అవసరమైతే ఇతరులకు తెలియజేయండి, అప్పుడు వారు మీ దగ్గరకు వస్తారు. క్రైస్తవ జీవితం అంటే ఒక ద్వీపంలో ఒంటరిగా జీవించడం కాదు కాని మన సంతోషాలను బాధలను పంచుకునే ఒక సంఘంలో జీవించడమే. మీరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు! మీరు ఇతరులను ఇబ్బంది పెట్టడంలేదు! సహాయాన్ని కోరడం బలహీనత అవ్వదు. మన భారాలను ఇతరులతో పంచుకోవాలనే బైబిలు ఆదేశాలను అనుసరిస్తున్నారని అనడానికి అది ఒక గుర్తు.

మంచి ఆదరణ ఇచ్చేవారిగా ఉండడం

 ప్రసంగి 7:2లో 7:4లో, 2 విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును” అని ఉంది. దుఃఖంలో ఉన్న ఇంటికి వెళ్లడం వల్ల మనకు జీవితం గురించి నిత్యత్వం గురించి సరైన దృక్పథం వస్తుంది. మరణంపై సరైన పట్టు సాధించినప్పుడే మనం జీవితంపై మంచి పట్టు సాధించగలము. ఏడ్చే వారితో మనం ఏడ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది!

ఈ వాక్యాలలో స్పష్టత ఉన్నప్పటికీ, మనతో మనం నిజాయితీగా ఉన్నట్లయితే, మనం ఈ విధంగా ఉండమని మన పనులే మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. దుఃఖిస్తున్న వారి కంటే విందులు చేసుకునే వారితోనే మనం ఎక్కువ గంటలు గడుపుతాం! సాధారణంగా, ఒంటరిగా ఉండి ఏడ్చే వారితో గడపడం కంటే విందులను పార్టీలనే మనం ఎక్కువ ఇష్టపడతాము! అవును, సంతోషించే వారితో మనం కూడా సంతోషించాలి, అయితే దుఃఖించే వారితో పాటు మనం కూడా అంతే దుఃఖించాలని మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. బాధలలో ఉన్న వారిని పట్టించుకోని ఈ ప్రపంచంలో అలాంటి వారి పట్ల మనం మరింత శ్రద్ధ వహించాలి.

అత్యంత పతనమైపోయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నామని గమనించండి. ఎన్నో బాధలతో దుఃఖంతో ఈ ప్రపంచం నిండిపోయి ఉంది. కానీ ఒక రోజు దేవుడు అన్నిటినీ కొత్తగా చేస్తానని వాగ్దానం చేశారు. కన్నీళ్లన్నీ తుడిచి వేస్తానని హామీ ఇచ్చారు. పాపం ఉనికిని ఆ తర్వాత దుఃఖాన్ని మరణాన్ని కూడా ఆయన ఒకేసారి శాశ్వతంగా తొలగించినప్పుడు అది జరుగుతుంది. అప్పటి వరకు ఏడుస్తున్న వారి కన్నీళ్లు తుడవాలని ఆయన మనకు పిలుపునిచ్చారు. పదాలను ఉపయోగించడంలో వారికున్న ప్రతిభకన్నా సానుభూతి చూపడంలో వారికున్న సామర్థ్యమే ఆదరణ ఇచ్చే వారికి ఎక్కువ ఉపయోపడుతుందని అంటారు.

 ఫియర్‌ఫులీ అండ్ వండర్‌ఫుల్లీ మేడ్ అనే తన పుస్తకంలో డా. పాల్ బ్రాండ్ ఈ సత్యాన్ని అందంగా వ్యక్తపరిచాడు. 

నేను రోగులను మరియు వారి కుటుంబాలను, ‘మీ బాధలో మీకు ఎవరు సహాయం చేశారు?’ అని అడిగినప్పుడు, నాకు ఒక విచిత్రమైన మరియు స్పష్టత లేని సమాధానం వస్తుంది. వారు చెప్పే వ్యక్తి కేవలం వారి ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు ఇచ్చేవాడు కాదు, అలాగే అతను ఆకర్షణీయమైన లేదా ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం కలిగినవాడు కూడా కాదు. అతను ప్రశాంతంగా, వారిని అర్థం చేసుకునే వ్యక్తి, ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ వినేవాడు, ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా లేదా ఎక్కువ సలహాలు కూడా ఇవ్వకుండా ఉండేవాడు. వ్యక్తి  ‘ఒక సహన వ్యక్తి’, ‘అవసర సమయంలో అందుబాటులో ఉన్నవాడు’, ‘పట్టుకోగలిగిన ఒక చేయి’, ‘అర్థం చేసుకునే, అయోమయంతో కూడిన హగ్గు’, ‘నా లాగానే కన్నీళ్లతో ముడుచుకున్న గొంతు”.

కొన్నిసార్లు, సరైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన మాటల కంటే మనం అనుభూతి చెందిన భావాల భాషే చాలా బిగ్గరగా మాట్లాడుతుందని మనం మరచిపోతాము.

 ఎవరైనా ఏడుస్తున్నారని మనకు తెలిసినప్పుడు మనం వారి దగ్గరకు వెళ్దాం. ప్రేమతో వారితో కలిసి కన్నీరు కారుద్దాం. వారికి మనం ఒక ఆశీర్వాదంగా ఉందాం. ఇదే మనకిచ్చిన ఆదేశం, మన పిలుపు. దానిని నమ్మకంగా చేద్దాం.

తమ కోసం ఏడవని వారి కోసం కూడా మనం ఏడవడం నేర్చుకోవాలి.

నా ఉద్దేశ్యం ఏమిటంటే, మన ప్రియమైనవారిలో స్నేహితులలో చాలా మంది తాము చేసిన పాపాలను బట్టి ఏడ్వడం లేదు, క్రీస్తు వైపు తిరగడం లేదు, వారు క్రీస్తుకు ఎంతో దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం వారి రక్షణ కోసం మనం కన్నీళ్లుతో దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి.

ఈ విషయంలో యేసు మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నారు, ఆయన తనను సిలువ వేయబోయే ప్రజల గురించి ఏడ్చారు (లూకా 19:41). పౌలు తనను హింసిస్తున్న యూదుల కోసం ఏడ్చాడు (రోమా 9:1-3). మరొకచోట ఫిలిప్పీ 3:18లో యేసును తిరస్కరించేవారి గురించి రాస్తూ అతడు, “అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను” అని రాసాడు.

 తప్పిపోయినవారి కోసం మనం కూడా ఏడుద్దాం!

Category

Leave a Comment