రూపాంతరం చెందిన జీవితం 13వ భాగము ఏడ్చువారితో ఏడువుడి 1వ భాగము

Posted byTelugu Editor September 17, 2024 Comments:0

(English version: The Transformed Life – Weep With Those Who Weep – Part 1)

రోమా 12:16లో మనకు “ఏడ్చువారితో ఏడువుడి లేదా దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి” అని చెప్పబడింది.

దుఃఖం వంటి కొన్ని విషయాలు మనల్ని స్నేహంలో బంధిస్తాయి. మీ గతం గురించి ఆలోచించండి ముఖ్యంగా, మీరు ఎక్కువ ఆనందం అనుభవించిన క్షణాలు, మీరు చీకటి అగాధంలో నడిచిన క్షణాల గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆ రెండు సమయాల్లో మీతో ఉన్నవారి గురించి ఆలోచించిస్తే ఎవరు ఎక్కువగా గుర్తున్నారు? మీరు నా లాంటి వారైతే, రెండవదే గుర్తుకు వస్తుంది. ఆ చీకటి అనుభవాల సమయంలో మన పక్కన ఉన్న వారిని మనం ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాము; పగలు రాత్రి కన్నీళ్లే మనకు ఆహారమైనప్పుడు మనతో పాటు ఉండే వారు. కింది కథనం ఈ వాస్తవాన్ని తెలియచేస్తుంది.

ఒక స్త్రీ తన పొరుగువారి పనివాడిని కలుసుకుని, “మీ ఆంటీ మరణం గురించి విని నాకు చాలా బాధ కలిగింది. మీరు మంచి స్నేహితులు. ఆమెలేని లోటు చాలా ఉంటుంది” అన్నది. అందుకు అతడు, “ఆమె మరణించినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ మేము స్నేహితులు కాదు” అన్నాడు. అప్పుడు ఆమె, ఎందుకు కాదు. మీరు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను అంది.

నిజమే, మేము కలిసి నవ్వుకునేవాళ్లం మాట్లాడుకునేవాళ్లం కానీ కేవలం పరిచయస్తులం మాత్రమే. మేము కలిసి కన్నీళ్లు పంచుకోలేదు. స్నేహితులు కావాలంటే కలిసి ఏడవాలి కదా అని సమాధానం వచ్చింది.

ఆ చివరి మాట కొంచెం విపరీతంగా అనిపించినప్పటికీ చాలా విలువైనది. కన్నీళ్ల పంచుకుంటేనే మనుషులలో స్నేహబంధం కలుస్తుంది. విడిపోని గట్టి బంధం ఏర్పడుతుంది. విచారకరమైన వాస్తవం ఏమిటంటే, తోటి క్రైస్తవులుగా మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటానికి మన జీవితాలను పంచుకోవడం అంటే మన ఆనందాలను మరియు బాధలను కలిసి పంచుకోవడానికి పిలువబడినా, మన బాధలను పంచుకోవడంలో మనం విఫలమవుతున్నాము. బాధలను పాలుపంచుకోవడం ద్వారా మనం ఇతరులతో సన్నిహితంగా ఉండడం చాలా అరుదు.

మనతో మనం నిజాయితీగా ఉన్నట్లయితే, ఎవరి బాధ గురించైనా మనం రహస్యంగా సంతోషించిన సందర్భాలు ఉండవచ్చు, ముఖ్యంగా మనల్ని బాధపెట్టిన వారి విషయంలో. వారికి జరగాల్సిందే జరిగింది అనుకునే వైఖరి. అలాంటి వైఖరి గురించి దేవుడు ఏమనుకుంటాడో మీకు తెలుసా? దానికి సమాధానంగా “ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు” అని సామెతలు 17:5లో ఉంది.

ఇతరుల బాధలలో పాలుపంచుకోవాలని దేవుడు మనలను పిలుస్తున్నాడు. సంతోషించే వారితో కలిసి సంతోషించమని మనము పిలువబడినట్లే, ఏడ్చే వారితో కూడా ఏడ్వడానికి మనం పిలువబడ్డాము. దుఃఖించడం లేదా ఏడ్వడం అంటే తోటి విశ్వాసి అనుభవించే దుఃఖాన్ని బాధను మనం అనుభవిస్తున్నట్లుగా భావించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే వారి సంతోషాలను, దుఃఖాలను మనవని భావించి వారితో కలిసి పంచుకోవాలి. ఒకరితో ఒకరు సహవాసం కలిగివుండడం లేదా మన జీవితాలను పంచుకోవడం అంటే ఇదే.

దేవుడు ఏడ్చేవారితో ఏడ్చే దేవుడు.

దేవుడు సంతోషించే వారితో సంతోషించినట్లే, ఏడ్చేవారితో కూడా ఏడుస్తాడు. యెషయా 63:9లో “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను” అని చదువుతాము. ఆ సమయంలో తన ప్రజలైన ఇశ్రాయేలు అనుభవిస్తున్న బాధలను చూసి దేవుడు బాధపడ్డాడు. యేసు లాజరు సమాధి దగ్గర కన్నీరు విడిచి (యోహాను 11:35) తాను ఎంతో ప్రేమించిన మరియా మార్తల దుఃఖంలో పాలుపొందడమే కాకుండా, పాపం వలన ఈ లోకంలోకి వచ్చిన దుఃఖాన్ని బట్టి కూడా కన్నీరు కార్చారు.

లూకా 19:41లో “ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చారు” అని మనకు చెప్పబడింది. త్వరలో తనను చంపబోయే నగరం గురించి ఆయన ఏడ్చారు! యేసు యొక్క ఈ భావోద్వేగం యెహెజ్కేలు 18:32లోని దేవుని హృదయానికి అనుగుణంగా ఉంది, “మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు;”  తనను తిరస్కరించి నశించే తన శత్రువుల మరణం గురించి కూడా దేవుడు దుఃఖిస్తాడు. ఈ లోకంలో దుఃఖం అంటే ఏమిటో తెలియకుండానే దేవతలుగా పిలవబడే దేవతలకు విరుద్ధంగా మన దేవుడు ఏడ్చే దేవుడని చెప్పడంలో తప్పు లేదు.

దేవుడు మన కన్నీళ్లను ఎలా చూస్తాడో మీకు తెలుసా? కీర్తన 56:8లో “నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా” అని వ్రాయబడింది. నా కన్నీళ్లను మీ తిత్తిలో నింపండి. తిత్తి అంటే సీసా అని అర్థం. సీసాలను ఆ రోజుల్లో విలువైన వస్తువులు పెట్టడానికి మాత్రమే ప్రజలు ఉపయోగించేవారు. తన కన్నీళ్లు దేవునికి చాలా విలువైనవి కాబట్టి ఆయన వాటిని సీసాలో వేస్తారని దావీదు భావము. ఈ విధంగా దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు!

మన దేవుడు శ్రద్ధగల దేవుడు. ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు సంతోషించినట్లే, ఆయన తన సృష్టి గురించి బాధపడతారు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. మన బాధను అనుభవించే దేవుడు! మనం ఈ దేవుని అనుకరించడానికి పిలువబడ్డాము [ఎఫెసి 5:1] మరియు ఆయన కుమారుడూ ప్రభువైన యేసుక్రీస్తులా మరింతగా రూపాంతరం చెందడానికి [రోమా 12:2; 2 కొరింథీ 3:18] పిలువబడ్డాం కాబట్టి ఏడ్చే వారితో ఏడ్వడం మన క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి! రోమా 12:16లో ఉన్న ఈ ఆదేశాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అన్వయించవచ్చో నేను గమనించాలని అనుకుంటున్నాను.

ఏడ్చే వారితో కలిసి ఎలా ఏడవాలి.

పరిశీలించడానికి క్రింద 10 విషయాలు ఉన్నాయి. ఏడుస్తున్న వారితో ఏడ్చేటప్పుడు ఏమి చేయకూడదో వాటిలో ఐదు చెబితే,  ఏమి చేయాలో మిగిలిన ఐదు చెబుతాయి.

ఏమి చేయకూడదు

1. బాధను అధిగమించమని చెప్పకండి. అన్నిసార్లు ఏడుపు ఆపమని మనం వారికి చెప్పకూడదు. ధైర్యంగా ఉండాలని చెప్పాలి. మరింత సానుకూలంగా ఉండమని, దేవుని శక్తి మీద ఆయన వాగ్దానాల మీద ఎక్కువగా ఆధారపడాలని వారిని ప్రోత్సహించాలి. దానిలో ఏ సందేహం లేదు. కానీ మనం వారితో కన్నీరు కార్చిన తర్వాతనే మనం అలాంటి పనులు చేయాలి.

బాధపడుతున్న వారి పట్ల మన మాటలు కఠినంగా ఉండకూడదు. సామెతలు 25:20లో “దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయు వానితోను సురేకారము మీద చిరకపోయు వానితోను సమానుడు” అని వ్రాయబడింది. ఎవరైనా తీవ్ర వేదనలో ఉంటే మనం వారి గాయాలను మరింత పెంచకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ముఖ్యము!

కొన్నిసార్లు బాధపడే వారిని చూసి చిరాకు పడడం జరుగుతుంది. ఆ చిరాకు మాటల రూపంలో బయటకు వస్తుంది.బాధలో ఉన్న వ్యక్తి ఏదైనా అదనపు గాయాన్ని భరించడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఊహించండి. యోబు స్నేహితులు గుర్తున్నారా? అప్పటికే చాలా బాధలో ఉన్న వ్యక్తికి వారు తమ మాటల ద్వారా ఇంకెంత బాధను కలిగించారో కదా!

2. ఇప్పుడు పూర్తి విడుదల గురించి వాగ్దానం చేయవద్దు. దేవుడు మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరుస్తాడు; మీరు మంచి ఉద్యోగం పొందుతారు; మీకు మరొక బిడ్డ పుడుతుంది; మీకు పెళ్లి అవుతుంది అనే మాటలతో దేవుడు ఇవ్వని వాగ్దానాలను చేయవద్దు. ఇవన్నీ దేవుడు చేయగలడా? చేస్తాడు కాని ప్రతి పరిస్థితిలోనూ అలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడా? చేయలేదు! మనం సర్వజ్ఞులం కాదు. మనం దేవుని స్థానంలో నిలబడలేము మరియు అలా చేయడానికి మనం ధైర్యం చేయకూడదు.

బాధపడేవారికి ఉపశమనం కలిగించడానికి ఇది ఒక మంచి ఉద్దేశ్యమే కాని అవి నెరవేరే మార్గాలు కూడా ముఖ్యము. లేఖనాలను అతిక్రమించి తప్పుడు వాగ్దానాలు చేయడం సరైన మార్గం కాదు. అంతేకాకుండా, దేవుడు పూర్తి స్వస్థతను లేదా  మెరుగైన ఉద్యోగాన్ని తీసుకురాకపోతే బాధపడేవారు మరింత నిరాశకు లోనవురతారు. అది బాధపడేవారికి ఉపయోగపడదు!

నిజమే పూర్తి విడుదల రాబోతుంది, కానీ అది భవిష్యత్తులో యేసు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు జరుగుతుంది. ఆ వాగ్దానానికి సంబంధించి మనం వారికి భరోసా ఇవ్వగలం. కానీ అప్పటి వరకూ వారి ప్రస్తుత జీవితంలో బాధలు ఉన్నప్పటికీ ఆయన చిత్తాన్ని అంగీకరించేలా మనం వారికి సహాయం చేయాలి. ఆ బాధల సమయంలో కూడా మనం దేవుని సన్నిధిని వారికి గుర్తు చేస్తూ ఆయన వైపు చూస్తూ ఉండమని వారిని ప్రోత్సహించవచ్చు.

3. వారి బాధలను ఇతరుల బాధలతో పోల్చవద్దు. మనం బాధపడేవారికి అలా చెప్పడం వలన ఎక్కువ స్వాంతన కలుగుతుందని అనుకుంటాము. “మీకు మడమలలో నొప్పిగా ఉంది. నాకు తెలిసిన వారికి మడమ దగ్గర విరిగిపోయింది.” నిజమేనా? అది విని ఏమనుకుంటారు? మడమ విరగనందుకు సంతోషించి నా బాధను వ్యక్తం చేయకూడదా? ఆ సమయంలో ఒకరు పడే బాధ చిన్న విషయం కాదు కాబట్టి మీరు ఈ బాధను అనుభవిస్తున్నందుకు నాకు బాధగా ఉందని చెప్పడం మంచిది.

4. వారికి తీర్పు తీర్చవద్దు. మరోసారి, యోబు స్నేహితులు గుర్తు చేసుకోండి. “మీ పాపాల కారణంగానే మీరు బాధపడుతున్నారు” అనే మాటలు కొన్నిసార్లు నిజమైనప్పటికీ అవే నిజమని చెప్పకూడదు. మనం దేవుడిలా చెప్పకూడదు. అది గర్వం. అవును, కొన్నిసార్లు వారి జీవితంలో ఉన్న పాపాన్ని పరిశీలించుకోమని వారిని ప్రోత్సహించడానికి ఒకటి రెండు మాటలు చెప్పడం సముచితంగా ఉంటుంది. అయితే అది కూడా మనం వారితో నిజంగా బాధపడి వారి నమ్మకాన్ని సంపాదించుకున్న తర్వాతనే చేయాలి. సామెతలు 12:18 “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని హెచ్చరిస్తోంది. మన మాటలు నయం చేసివిగా ఉండాలి కాని నొప్పి కలిగించేవిగా కాదు!

5.వారిని దూరంగా ఉంచవద్దు. కొన్నిసార్లు బాధపడేవారికి ఏమి చెప్పాలో మనకు తెలియదు. కాబట్టి, వారిని కించపరుస్తారనే భయంతో మనం వారిని పూర్తిగా తప్పించుకుంటాము. లేదా బాధల్లో ఉన్నవారి దగ్గర ఉండడం మనకు ఇష్టం ఉండదు. ఇది చాలా నిరుత్సాహపరుస్తుంది, మనం అలాంటివి అనుభవించకూడదని అనుకుంటాము. టీవీ చూస్తున్నప్పుడు కూడా ఏదైనా విచారకరమైన వార్తలు వస్తే చాలా త్వరగా ఛానెల్‌ని మారుస్తాము. మంచి సమరయుని ఉపమానంలో యాజకుడు, లేవీయుడు దెబ్బలు తిన్న వ్యక్తిని చూసి ప్రక్క నుండి వెళ్లిపోయినట్లుగా [లూకా 10:31-32] మనం కూడా బాధలను చూసినప్పుడు అలాగే చేస్తాము. అలా చేయడం మనం మానేయాలి.

కాబట్టి, ఏడ్చే వారితో ఏడ్వాలనే దేవుని ఆజ్ఞను పాటించాలని కోరుకునేటప్పుడు చేయకూడదని ఐదు విషయాలు: (1) అధిగమించమని వారికి చెప్పవద్దు (2) ఇప్పుడు పూర్తి విడుదల గురించి వాగ్దానం చేయవద్దు (3) వారి బాధలను ఇతరుల బాధలతో పోల్చవద్దు. (4) వారికి తీర్పు తీర్చవద్దు మరియు (5) వారిని దూరంగా ఉంచవద్దు.

తర్వాతి ప్రచురణలో ఏడుస్తున్న వారితో ఏడ్చే విషయంలో ఏం చేయాలో చూద్దాము.

Category

Leave a Comment