యేసు సిలువపై అనుభవించిన 3 బాధలు—శారీరకమైన, ఆధ్యాత్మికమైన, మానసికమైన బాధలు

(English version: 3 Cross-Related Sufferings of Jesus – Physical, Spiritual and Emotional)
ప్రభువైన యేసు భూసంబంధమైన జీవితమంతా దుఃఖంతో కూడిన జీవితం. ఏది ఏమైనప్పటికీ, ఈ వ్యాసం ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు రక్షణ కలుగచేస్తున్నప్పుడు సిలువ వేయడానికి మరియు సిలువపైన ఆయన అనుభవించిన 3 రకాల బాధలపై దృష్టి పెడుతుంది. ఆ 3 రకాల బాధలు ఏమిముందుటంటే: శారీరకమైన, ఆధ్యాత్మికమైన మరియు మానసికమైన బాధలు.
1. శారీరకమైన బాధ
బైబిలు విశ్వాసులలో యేసు అనుభవించిన శారీరకమైన బాధల గురించి ఎక్కువగా మాట్లాడకూడదనే ధోరణి ఉంది. ఇలా జరగడానికి గల 2 కారణాలను చూద్దాము.
కారణం # 1. బైబిలులో సిలువ వేయబడే పద్ధతి గురించి ఎక్కువ వివరాలు ఇవ్వబడలేదు, “వారు ఆయనను సిలువ వేశారు” [మార్కు 15:24] అని మాత్రమే వ్రాయబడింది. ఈ విధమైన శిక్ష గురించి దేవుడు బైబిలులో ఎక్కువ వివరాలను పొందుపర్చలేదు కాబట్టి మనం దాని గురించి వివరించడానికి ఇష్టపడము.
కారణం # 2. నిశ్చయంగా యేసు అనుభవించిన శారీరక బాధ చాలా భయంకరమైనదే కాని ఆ సమయంలో ఇతర వ్యక్తులు కూడా అదే బాధ అనుభవించారు కాబట్టి అది ప్రత్యేకమైనది కాదు. కాబట్టి మనం సిలువ వేయడం గురించి ఎక్కువగా వివరించము.
అయితే యేసు మరణశిక్ష విధించబడినందున సిలువ వేయడంలో ఉన్న క్రూరమైన స్వభావం గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించడం మనకు చాలా మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను.
సిలువ వేసి చంపడమనే శిక్షను పర్షియన్లు యేసు జీవించినకాలానికంటే సుమారు 600 సంవత్సరాల ముందు నుండే అమలుచేస్తున్నారు. తరువాత గ్రీకులు కూడా అమలుచేశారు. కానీ రోమన్లు దీనిని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్లారు. సిలువ వేయడం అనేది అత్యంత కరడుగట్టిన నేరస్థులకు విధించే శిక్షగా వారు రూపొందించారు. మీరు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే జరిగేది ఇదే! అనే సందేశాన్ని ప్రజలకు తెలియచేశారు. అందుకే రోమన్లు ఎక్కువమంది ప్రయాణించే ప్రదేశంలో ప్రజలను సిలువ వేసేవారు. కొన్ని రోజులపాటు ఆ బాధితులు పడే బాధలు ప్రయాణికులు చూసినప్పుడు మీరు రోమా ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేయవద్దు! అనే స్పష్టమైన హెచ్చరిక వారికి అందుతుంది.
సిలువ వేసే విధానము.
అవసరమైన వస్తువులు 2 చెక్క ముక్కలు, 3 మేకులు. 2 చెక్క ముక్కలు కలిసి ఒక క్రాస్‌గా కాకుండా [సాధారణంగా సూచించే + ఆకారంలో కాకుండా] T ఆకారంలో జతచేస్తారు. అడ్డకర్రను పాటిబులం అని పిలుస్తారు. నిలువు కర్రను లేదా స్తంభాన్ని స్టైప్స్ అని పిలుస్తారు.
ఈ విధానంలో మొదట బాధితుడిని లోహపు ముక్కలు లేదా ఎముకలు అంటించబడి ఉన్న కొరడాలతో కొడతారు. ఆ కొరడాకు ఒక చివర పట్టుకోడానికి వీలుగా కర్ర అతకబడి ఉంటుంది. ఆ కొరడాతో కొడితే మనిషి చనిపోవచ్చు లేదా శాశ్వతంగా వికలాంగుడు కావచ్చు, ఎందుకంటే అది వీపుపైన ప్రక్కల ఉన్న మాంసాన్ని చీల్చివేస్తుంది. అప్పుడు ఆ బాధితుడు తన సిలువను పట్టణం గుండా సిలువ వేయబడే ప్రదేశానికి మోసుకువెళ్లవలసి ఉంటుంది. ఒకరి సిలువను మోయడం అంటే చావడానికి సిద్ధంగా ఉండమని అర్థము. అక్కడికి వెళ్లడమే కాని వెనక్కి తిరిగి రావడం ఉండదు. క్రీస్తు విషయానికొస్తే, ఆయనను చాలా ఘోరంగా కొరడాతో కొట్టారు కాబట్టి ఆయన తన సిలువను మార్గమంతటిలో మోయలేకపోయారు [మార్కు 15:21].
బాధితుడు సిలువ వేయబడే ప్రదేశానికి వచ్చినప్పుడు, అడ్డకర్రను నిలువు కర్రకు లేదా స్తంభానికి పైభాగాన జతచేస్తారు. కర్రలలో ఒకదానికి రంధ్రం ఉంటుంది, మరొక దానికి చతురస్రాకారపు కొయ్యమేకు ఉంటుంది కాబట్టి వాటిని సులభంగా జతచేయవచ్చు మరలా ఉపయోగించడానికి వేరు చేయవచ్చు. జతచేయబడిన సిలువను నేలపై పడుకోబెడతారు. ఆ తర్వాత బాధితుని బట్టలన్ని తీసివేస్తారు అప్పుడు వారు మరింత అవమానానికి గురవుతారు.
కొన్నిసార్లు, నొప్పి తెలియకుండా బాధితుడికి మత్తు పానీయాలు ఇస్తారు. బాధితుని పట్ల దయతో అలా చేయరు కాని బాధితుడు ఎక్కువగా ప్రతిఘటించకుండా సైనికుల పని కష్టతరం కాకుండా ఉండడానికి అలా చేస్తారు. బాధితుడిని సిలువపై ఉంచినప్పుడు సిలువ కర్రకు రక్తమోడుతున్న వీపు తగిలి భయంకరమైన బాధ కలుగుతుంది.
బాధితుడు ఎంతకాలం బాధపడాలని సైనికులు కోరుకునే దానిని బట్టి బాధితుడిని తాళ్లతో కడతారు లేదా మేకులు కొడతారు. యేసు విషయంలో ఆయనకు మేకులు కొట్టారు. [యోహాను 20:24-27]. అడ్డకర్ర మీద బాధితుని చేతులు చాచి ఒక్కొ చేతికి ఒక్కొ మేకు కొడతారు. ఆ మేకులు అరచేతులలో [చిత్రాలలో తప్పుగా చిత్రీకరించినట్లుగా] కాకుండా మణికట్టులోనికి దిగగొడతారు. అప్పుడు ఆ మేకులు మాంసం నుండి వేరుకావు అలాగే బాధితుడు చేతులు వేలాడదీయలేడు 3వ మేకు రెండు పాదాల నుండి లోపలికి [పాదాలకు కాళ్ల మధ్యలో ఉండే కీలు దగ్గర] దిగగొడతారు. అప్పుడు పాదాలు నిలువు కర్రకు బిగించబడతాయి. శిక్ష విధించబడిన వ్యక్తి చేసిన నేరాన్ని ఒక బోర్డుపై వ్రాసి సిలువకు వేలాడదీస్తారు. ఆ వ్యక్తి ఏ నేరానికి పాల్పడ్డాడో అటువైపు వెళ్లే వారందరికీ తెలుస్తుంది.
సైనికులు ఆ సిలువను ఎత్తి నిలువుగా ఉంచడానికి లోతైన రంధ్రంలో పడవేస్తారు. అలా సిలువను పడవేసినప్పుడు వచ్చే కుదుపు విపరీతమైన నొప్పిని అంటే తల పగిలిపోయేంత బాధను కలిగిస్తుంది. అప్పటి నుండి కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు ఉండే ఊహించలేని భయంకరమైన బాధ మొదలవుతుంది! ముంజేతులు మొద్దుబారిపోతాయి భుజాలు కీళ్ళ నుండి లాగడం మొదలవుతుంది. ఛాతీ కుహరం పైకి వెలుపలికి లాగబడి శ్వాస తీసుకోవడానికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది.
శ్వాస తీసుకోవడానికి బాధితుడు సహజసిద్ధంగా తన కాళ్ళతో పైకి నెట్టాడు. ఇది బాధితుడు మరోసారి శ్వాస తీసుకోడానికి సహాయపడినప్పటికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రయత్నం చేయడానికి శరీర బరువు మొత్తం మేకు దిగగొట్టిన పాదాలపై పడాలి, మోచేతులను వంచాలి, మేకులు దిగగొట్టిన మణికట్టుల సహాయంతో పైకి లాగాలి. దాని వలన నరాలలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి అగ్ని గుండా వెళ్తున్నట్లుగా ఉంటుంది.
శ్వాస తీసుకున్న ప్రతిసారి కొరడా దెబ్బల కారణంగా రక్తమోడుతున్న బాధితుడి వీపు సిలువ చెక్కకు గీసుకుని బాధ కలిగిస్తుంది. కాళ్లు బలహీనపడి తిమ్మిరెక్కి వణుకుతున్నప్పుడు బాధితుడు ఉపశమనం కోసం తన వీపును వంచాడు. చేతులు, ఛాతీ, వీపు మరియు కాళ్లలో నొప్పిని తట్టుకోవడానికి లేదా భరించడానికి ఉన్న స్థితిని మార్చుతూ ఉండడమే ఏకైక మార్గం. ఈ మధ్యలో జీవించాలనే ఆశతో బాధితుడి నొప్పితో ఏడుస్తాడు. అతడు చాలా అలసిపోయే వరకు, గొంతు ఎండిపోయే వరకు, మరొక శ్వాసను తీసుకోలేనంత బలహీనం అయ్యే వరకు అది కొనసాగుతుంది. గంటల తర్వాత లేదా రోజుల తర్వాత సంభవించే మరణం రక్తం కోల్పోవడం వలన కాదు కాని ఊపిరాడకపోవడం వలన సంభవిస్తుంది.
ఇవి సంక్షిప్తంగా మీ పాపాల కోసం నా పాపాల కోసం మన ప్రభువు అనుభవించిన శారీరకమైన బాధలు. ఆయన బాధలలో శారీరకమైన అంశం చూశాము; ఇప్పుడు యేసు బాధలోని రెండవ అంశాన్ని చూద్దాము.
2. ఆధ్యాత్మికమైన బాధ
శారీరకమైన బాధ ఎంత భయంకరంగా ఉందో ఈ ఆధ్యాత్మిక బాధ కూడా మన ప్రభువుకు అంతే కష్టంగా ఉంది. ఎందుకంటే, ఒక రచయిత చెప్పినట్లుగా, సిలువపై యేసు మనందరి పాప అపరాధాన్ని భరించే మానసిక వేదనను అనుభవించారు.
మనం పాపం చేశామని గ్రహించినప్పుడు మనం విపరీతమైన అపరాధ భావాన్ని అనుభవించే సందర్భాలు కూడా ఉంటాయి. మన హృదయాలలో అపరాధభావం భారీగా ఉంటుంది. పాపులమైన మనమే అలాంటి బాధను అనుభవిస్తే ఎన్నడూ పాపం చేయని మన ప్రభువైన యేసుకు అది ఎలా ఉంటుందో ఊహించండి! ఆయన ఈ భూమిపై జీవించి ఉన్నంతకాలం పరిపూర్ణమైన పరిశుద్ధునిగా జీవించారు. పాపపు మాటలు మాట్లాడలేదు. పాపపు పనులు చేయలేదు. ఒక్క చెడ్డ ఆలోచన కూడా లేదు! ఆయన పాపాన్ని అసహ్యించుకున్నారు, పాపం గురించిన ఆలోచనను కూడా ఆయన వ్యతిరేకించేవారు. ఆయన అసహ్యించుకున్న పాపమంతా ఆయన చేయకపోయినా ఆయనపై పూర్తిగా కుమ్మరించబడింది. మరో మాటలో చెప్పాలంటే, మన పాపాలన్నీ ఆయనపై పూర్తిగా కుమ్మరించబడ్డాయి. బైబిలు దీని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
యెషయా 53:6 “యెహోవా మన యందరి దోషమును అతనిమీద.”
యెషయా 53:12 “అనేకుల పాపమును భరించును.”
యోహాను 1:29 “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.”
2 కొరింథీ 5:21 “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.”
హెబ్రీయులు 9:28 “క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడెను.”
1 పేతురు 2:24 “ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను.”
క్రీస్తు సిలువపై పాపి అయ్యాడని ఈ వచనాల భావం కాదు. ఆయనలో ఏ పాపం లేదు నేరం లేదు [యోహాను 8:46; 1 పేతురు 2:22]. ఆయన ఆ పాపాలు చేసినవానిగా పరిగణించబడ్డాడు కాబట్టి శిక్షను భరించాడు. దాని ఫలితంగా, ఆయనపై విశ్వాసం ఉంచిన వారందరూ తమ పాపాలకు క్షమాపణ పొందారు. ఎందుకంటే అప్పటికే వారి స్థానంలో యేసు శ్రమపడ్డారు, వారి విడుదలకు తన రక్తంతో మూల్యం చెల్లించారు.
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని యేసే స్వయంగా చెప్పారు [మత్తయి 20:28]. విమోచన క్రయధనం అనగా మూల్యం చెల్లించడాన్ని సూచిస్తుంది. మన పాపాలకు ప్రతిగా ఆయన రక్తము. అది విమోచన పరిభాష. సిలువపై తన రక్తాన్ని చిందించడం ద్వారా యేసు మన పాప అపరాధాన్ని భరించడమే కాకుండా, మనకు బదులుగా మన పాపానికి దేవుని ఉగ్రతను కూడా అనుభవించారు.
1 యోహాను 2:2 “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు.”
రోమన్లు 3:25 “క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.”
పాపాలకు దేవుని ఉగ్రతను సిలువపై అనుభవించడం ద్వారా యేసు తనపై విశ్వాసం ఉంచేవారు తమ పాపాలను బట్టి దేవుని ఉగ్రతను ఎన్నటికీ అనుభవించకుండా ఉండేలా ఏర్పాటు చేశాడు. ఇవి సంక్షిప్తంగా మీ పాపాల కోసం నా పాపాల కోసం యేసు సిలువపై అనుభవించిన ఆధ్యాత్మికమైన బాధలు.
యేసు బాధలో శారీరకమైన ఆధ్యాత్మికమైన కోణాన్ని చూసిన తరువాత, సిలువపై ఆయన అనుభవించిన 3వ మరియు చివరి అంశమైన మానసికమైన బాధను క్లుప్తంగా చూద్దాము.
3. మానసికమైన బాధ
మానసికమైన బాధ ద్వారా, సిలువపై యేసు అనుభవించిన వదిలివేయబడడం అనే భావాన్ని నేను తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయనను విడిచిపెట్టారు. మీరు జీవితంలో కష్టకాలాన్ని అనుభవిస్తున్న సమయంలో మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు స్నేహితులు మిమ్మల్ని వదిలివేయగా ఒంటరిగా ఉండాలనుకుంటారా? లేదా మీతో పాటు ఎవరైనా ఉండాలనుకుంటున్నారా? సమాధానం ఒక్కటే. తీవ్రమైన శ్రమలు ఎదుర్కొంటున్న సమయాల్లో సన్నిహితుడైన ఒక వ్యక్తి ఉన్నా అది గొప్ప ఆశీర్వాదమే కదా. అయితే ఎవరూ అనుభవించలేని ఘోరమైన శ్రమలు అనుభవిస్తున్న సమయంలో యేసు ఒంటరిగా మిగిలిపోయారు!
మొదటిది, ఆయనకు చాలా సన్నిహితులైన 11 మంది ఆయనను విడిచిపెట్టారు. ఆయన అప్పటికే యూదా చేసిన నమ్మకద్రోహం యొక్క బాధను అనుభవిస్తున్నారు. ఆయనతోనే ఉంటామని వాగ్దానం చేసిన 11 మంది ఆయనను బంధించినప్పుడే ఆయనను విడిచిపెట్టారు. రెండవది, తండ్రియైన దేవుడు ఆయనను విడిచిపెట్టినప్పుడు ఆయన గొప్ప మానసిక వేదనను ఎదుర్కొన్నారు. సిలువపై యేసు మన పాపాలను మోస్తున్నప్పుడు, ఆ సమయానికి ముందు తండ్రికి కుమారుని మధ్య శాశ్వతంగా ఉన్న పరిపూర్ణ సహవాసం [బంధం కాదు] ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్యలో తాత్కాలికంగా విడిపోయింది. అన్నింటినీ ఒంటరిగా భరించిన తన కుమారునిపై దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తున్న సమయం అది.
వాస్తవానికి, మానసికమైన బాధ ఎంత ఎక్కువగా ఉందంటే దాని వలన యేసు చాలా బిగ్గరగా, నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని కేక వేసెను [మత్తయి 27:46]. ఈ మాటలు మనం చదివినప్పుడు, మీ పాపాల కోసం నా పాపాల కోసం యేసు ఎంత లోతైన బాధను మానసిక వేదనను అనుభవించారో మనం తెలుసుకోవచ్చు.
కాబట్టి, మనలను విమోచించడానికి యేసు సిలువపై అనుభవించిన శారీరకమైన, ఆధ్యాత్మికమైన మానసికమైన బాధలను మనం చూశాము.
పునఃపరిశీలించటానికి.
మనం పాపం చేయాలనే శోధనను ఎదుర్కొన్న సమయంలో, మన ప్రభువు మనలను విమోచించడానికి తన రక్తాన్ని చిందిస్తున్నప్పుడు మన ప్రభువు సిలువపై అనుభవించిన వివిధ రకాల బాధల గురించి ఆలోచన చేద్దాం. ఆ ఆలోచన వలన మనం పాపం ప్రలోభానికి ‘వద్దు’ అని చెప్పగలుగుతాము.
మన రక్షకుడు పరలోకానికి భూమికి మధ్య వేలాడుతున్నాడని తీవ్రమైన వేదనతో మొర పెడుతున్నాడని ఎరిగి సిలువను చూస్తూ అదే సమయంలో మనం చాలా కాలంగా ప్రేమిస్తున్న పాపాలలో సంతోషంగా ఉండగలమా?
అలా ఊహించలేము కదా!
మన రక్షకుడు మన కొరకు చేసిన దానిని ఎరిగి పాపాలకు మనల్ని దూరంగా ఉంచే ద్వేషం మనలో పెరగడానికి ఈ రోజు నుండి మన హృదయాలు పవిత్రమైన సంకల్పంతో ముందుకు సాగాలి. అలాగే ప్రశస్తమైన ప్రభువైన యేసును మరింత ఎక్కువగా ప్రేమించటానికి పొందడానికి మన హృదయాలు ప్రేరేపించబడాలి.