యేసుని వెంబడించడానికి పిలుపు

(English Version: The Call To Follow Jesus)
మత్తయి 4:18-22, 18 యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. 19-20 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. 22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
పైన చెప్పబడిన వాక్యములో 18, 19 వచనాలలో చెప్పబడిన విధంగా యేసు తన మొదటి శిష్యులను వారు జాలరులుగా తమ అనుదినజీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయన వారిని ఏర్పరచుకోవడం మనం చూస్తాము. యేసు గురించి ఈ సందర్భంలో మనం ధ్యానించినప్పుడు మనం 3 పాఠాలను నేర్చుకోవచ్చును.
మొదటిది, మొదట యేసే పిలుపు ఇచ్చారని గమనించడము.
సాధారణంగా, యేసు కాలంనాటి రబ్బీలు అనగా బోధకులు తమను వెంబడించమని ప్రజలను పిలవరు. ఎవరైనా ఆసక్తి కలిగివుంటే, తమ సొంత చొరవతోనే ఒక రబ్బీని వెండిస్తారు. అయితే, యేసు ఒక రబ్బీ మాత్రమే కాదు ఆయన శరీరధారియైన సర్వోన్నతమైన దేవుడు. కాబట్టి, ఆయన వారిని పిలిచారు. “నా వెంబడి రండి” (19 వ వచనము) అని. అది ఒక సలహా కాదు కాని ఒక ఆజ్ఞ. “నా వెంబడి రండి” లేదా “నన్ను అనుసరించండి” అనేది ఒక పిలుపు.
అదే వచనంలో ఉన్న “నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును” అనే పిలుపుకు లోతైన ఉద్దేశం ఉంది. చాలా కాలం నుండి మీరు బ్రతికిన చేపలు పట్టుకొని ఆహారం కొరకు వాటిని చంపుతున్నారు. కాని ఇప్పటి నుండి నా దూతలుగా ఉంటూ, మీరు ఆత్మపరంగా మరణించిన ప్రజలను పట్టుకొని సువార్తను ప్రకటించడం ద్వారా వారికి ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తారు. అదే ఈ పిలుపు! నిరంతరం ఒక జ్ఞాపకంగా నిలిచిపోయే గొప్ప పనిని చేయడానికి చదువురాని సాధారణ జాలరులు ఆయనకు మొదటి దూతలయ్యారు. యేసు తనకు ప్రతినిధులుగా ఏర్పరచుకున్న ప్రజలు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. కాని దానిలో దేవుని జ్ఞానం ఇమిడివుంది. ఆయన ఆలోచన ఈ లోకపు ఆలోచన వంటిది కాదు. ఆయన ఎవరినైతే వారికి నియమించిన పనులకు పిలవాలని ఏర్పరుచుకున్నారో వారిని ఆయన పిలిచారు.
ఇదే మనం నేర్చుకోవలసిన మొదటి పాఠము. యేసుకు సాక్షిగా ఉండే పిలుపు మన చొరవతో వచ్చేది కాదు. అది ఆయనతోనే మొదలవుతుంది. మనల్నితనకు సాక్షులుగా ఉండడనికి పిలిచేది ఆయనే. దాని గురించి మనం అపో.కా 1:8లో చదువుతాము, “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”
ఈ పిలుపుకు లోబడకపోవడం పాపము.
రెండవది, ఈ పిలుపును నెరవేర్చడానికి వారు ఆయన శక్తిని పొందుకుంటారని యేసు హామీ ఇచ్చారని గమనించడము.
“నేను మిమ్మల్ని పంపుతాను” అనే వాక్యంలో అధికారం ఇవ్వబడుతుంది అనే భావం ఉంది. కొన్ని తర్జుమాలలో “నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును” అని ఉంది. దానిలో కూడా అదే భావం ఉంది. మీరు శూన్యంలో పనిచేయరు. ఏమి చేయాలని మిమ్మల్ని పిలిచానో దానిని చేయడానికి నేను మీకు అధికారమిస్తాను. అదే యేసు వాగ్దానము.
తన దూతలుగా యేసు తొలి శిష్యులకు అధికారం ఇచ్చిన విధంగానే, ఆయన దూతలుగా ఉండడానికి మనకు కూడా అదే అధికారాన్ని ఇస్తారు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా ఆయన సాక్షులుగా ఉండడానికి ఈ లోకంలోనికి పంపబడిన ప్రజలం మనము (అపో.కా 1:8). కాబట్టి ఆ పిలుపును నెరవేర్చడంలో మనం భయపడవలసిన అవసరం లేదు. మనం నేర్చుకోవలసిన రెండవ పాఠం ఇదే.
మూడవది, ఎటువంటి ఆలస్యం చేయకుండా తక్షణమే లోబడడం ద్వారా యేసు పిలుపుకు శిష్యులు స్పందించడాన్ని గమనించడము
వారి విధేయతలో ఎటువంటి సంకోచం లేదు. తాము యేసును వెంబడించే మార్గంలోనికి ఆస్తులు రావడానికి వారు అనుమతించలేదు. మత్తయి 4:20లో, “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి” అని చెప్పబడింది. తాము యేసును వెంబడించే మార్గంలోనికి బంధుత్వాలు రావడానికి వారు అనుమతించలేదు. మత్తయి 4:22లో, “వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి” అని చెప్పబడింది.
అదే విధమైన స్పందన ఇవ్వడానికే అనగా తక్షణమే మనస్ఫూర్తిగా విధేయత చూపడానికి మనం పిలువబడ్డాము. ఆయన సాక్షులుగా ఉండడానికి యేసు ఇచ్చిన పిలుపుకి మనం విధేయత చూపించడానికి ఆస్తులు బంధుత్వాలు ఆటంకం కానివ్వకూడదు.
ఆయనను వెంబడించడానికి మనమందరం మన కుటుంబాలను ఉద్యోగాలను విడిపెట్టాలనేది దీని అర్థం కాదని దయచేసి గ్రహించండి. దీనికి విరుద్ధంగా, మనం మన కుటుంబాలను ప్రేమించాలని వారి అవసరాలను తీర్చాలని క్రొత్త నిబంధన మనకు స్ఫష్టంగా పిలుపునిస్తుంది. అదే పేతురు తర్వాత తన భార్యతో కలిసి పరిచర్య చేశాడు, అంతే కాకుండా అతని దగ్గర నివసిస్తున్న అతని అత్తను యేసు స్వస్థపరిచారు. యేసును వెంబడించే మార్గానికి కుటుంబం ఆటంకం కాకుండా మనం చూసుకోవాలి అనేది దీని భావము.
మంచి పనివారిగా ఉండాలని క్రొత్త నిబంధన మనకు స్ఫష్టంగా పిలుపునిస్తుంది. అంటే కొంతమంది తాము పనిచేసే స్థలాలలో సువార్త వెలుగును ప్రకాశించేవారిగా ఉండడానికి పిలువబడతారు. యేసును వెంబడించే మార్గానికి వృత్తి ఆటంకం కాకుండా మనం చూసుకోవాలి అనేది దీని భావము.
కొన్నిసార్లు, యేసు తన వెంబడించేవారిని వారు చేస్తున్న పనిలోనే కొనసాగుతూ ఆయనకు సాక్షులుగా ఉండడానికి పిలువవచ్చును. మరి కొన్నిస్తార్లు, తాము చేస్తున్న పనిని మార్చుకొని ఆయనకు సాక్షులుగా ఉండడానికి పిలువవచ్చును. కొన్నిసందర్భాలలో, ఆయనకు సాక్షులుగా ఉండడానికి లౌకికపరమైన పనిని విడిచిపెట్టమని యేసు మనల్ని పిలువవచ్చును.
ఈ అన్ని సందర్భాలలో ఉన్న అంశం ఏమిటంటే, మనం యేసుకు చూపించే విధేయత మనస్ఫూర్తిగా ఉండాలి, ఆ మార్గానికి మరేది ఆటంకం కాకూడదు. మనం నేర్చుకోవలసిన మూడవ పాఠం ఇదే.
తొలి మిషనరీలైన విలియం కేరీ, హడ్సన్ టేలర్‌లు యేసు తన సువార్తికులుగా ఉండడానికి వారికి ఇచ్చిన పిలుపును అందుకొని తమ ప్రాణాలను మాత్రమే కాకుండా తమ కుటుంబస్థుల జీవితాలను కూడా పణ్ణంగా పెట్టారు. మనం కూడా మన సంపద విషయంలో అటువంటి వైఖరినే కలిగివుండాలి. యేసు మనల్ని పిలిచింది మన సంపదతో మన సంతోషాలను తీర్చుకోవడానికి కాదు. దానిని మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా అంతిమంగా సువార్తను ప్రకటించడానికి ఉపయోగించాలి.
సంపద మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం దానిని గట్టిగా పట్టుకోకూడదు. దేవుని వాక్కును విస్తరింపచేయడానికి మన సంపదని ఉపయోగించాలి. ఇతర ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్లడానికి లేదా ఇతరులను పంపడానికి లేదా మన చుట్టూవున్న ప్రజలను చేరుకోవడాని మన సంపదను ఇవ్వాలి ఉపయోగించాలి. దీనిలోని ముఖ్యమైన అంశం: యేసుకు సాక్షులు ఉండడానికి ఆయన మనల్ని ఎక్కడ పిలిచినా ఆయన ఇచ్చిన పిలుపుకు మనం ఎల్లవేళలా విధేయత చూపిస్తుండాలి.
తమ జీవితాలు ఎలా అంతమవుతాయో ఈ శిష్యులకు తెలుసా? ఈ సమయానికి ఇంకా తెలియదు. అయినప్పటికి, విశ్వాసంతో వారు అన్నిటిని విడిచిపెట్టి యేనుని వెంబడించారు. సంఘచరిత్ర ప్రకారం, పేతురు అంద్రెయలు సిలువవేయబడ్డారు. అపొస్తలుల కార్యాలు ప్రకారం, హేరోదు యాకోబును చంపించాడు. ప్రకటన గ్రంథం ప్రకారం యోహాను పత్మాసు ద్వీపంలో చెరశాలలో ఉన్నాడు. ఈ లోకరీతిగా ఇవి గొప్ప ముగింపులు కావు. కాని పరలోకపు ప్రమాణాల ప్రకారం వారు విజయవంతమైన జీవితాన్ని జీవించారు.
అదే సువార్తలో యేసు స్వయంగా ఇలా అన్నారు, “తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును” (మత్తయి 10:39). దీనినే ఆయన మరోవిధంగా చెప్పారు, “తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును” (మార్కు 8:35).
ఈ శిష్యులు రాబోయే లోకాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే వారు ఎన్నో శ్రమల గుండా వెళ్లవలసి వచ్చినప్పటికీ, వారు యేసు పిలుపుకు విశ్వాసాన్ని విధేయతని చూపిస్తూ భూమి మీద ఉత్తమమైన జీవితాన్ని జీవించారు. వారు ఇప్పుడు ఖచ్చితంగా యేసు పాదాల చెంత శాశ్వతంగా సంపూర్ణమైన శాంతిని క్షేమాన్ని అనుభవిస్తూ ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక కన్నీరు లేదు దుఃఖం లేదు. కేవలం నిత్యమైన సంతోషం మాత్రమే ఉంది. అయితే మహిమకు ముందు సిలువ మొదట వచ్చింది.
ఈ విషయంలో బైబిలు చాలా స్ఫష్టంగా ఉంది. యేసుని వెంబడించడం అంటే మన స్వప్రయోజనాలకు ముగింపు చెబుతూ ఆయన ప్రయోజనాలను కోరుకుంటూ ముందుకు కొనసాగడము.
మొరావియను సంఘాలను స్థాపించి కౌంటు జింజెండోర్ఫు ఒక ఆసక్తికరమైన సంఘటన ద్వారా సిలువను దాని భావాన్ని ఎలా తెలుసుకున్నారో ఒక కథనం చెబుతుంది.
యూరప్‌లో ఉన్న తన ఎస్టేటుకు దగ్గరలో ఉన్న ఒక చిన్న మందిరంలో ఒక క్రైస్తవుడు వేసిన యేసుక్రీస్తు చిత్రం ఉంది. ఆ చిత్రం క్రింద “ఇదంతా నీ కోసం నేను చేశాను; నీవు నా కోసం ఏమి చేశావు?” అనే మాటలు ఉన్నాయి. జింజెండోర్ఫు ఆ చిత్రాన్ని, మాటలను చూసినప్పుడు అతనికి నోట మాటరాలేదు. గాయపడిన చేతులను రక్తమోడుతున్న నుదురును ప్రక్కలో గాయాన్ని అతడు చూశాడు. అతడు ఆ చిత్రం వైపు ఆ మాటల వైపు పదేపదే చూస్తూ ఉండిపోయాడు.
కొన్ని గంటలు గడిచిపోయాయి. జింజెండోర్ఫు కదల్లేకపోయాడు. ఆ రోజు గడిచినప్పుడు, అతడు మోకాళ్లమీద కూర్చుండిపోయి ఏడుస్తూ ప్రేమతో తన హృదయాన్ని జయించిన ఆయనను ఆరాధించాడు. ఆ రోజు అతడు మార్పు చెందిన వ్యక్తిగా ఆ మందిరం నుండి బయటకు వచ్చాడు. ప్రపంచమంతటిని తమ పరిచర్యతో సేవతో ప్రభావితం చేసిన మొరావియనుల ద్వారా పనిచేయడానికి తన డబ్బును ఉపయోగించాడు.
క్రీస్తు ప్రేమలో ఒక వ్యక్తి హృదయం బందీ అయినప్పుడు ఇటువంటి మార్పే కలుగుతుంది. ఆ రకమైన ప్రేమ ఒకరిని మొదట క్రైస్తవునిగా మారుస్తుంది అప్పటి నుండి వారు ఆయనకు ప్రేమతో లోబడేలా చేస్తుంది.
క్రీస్తు ప్రేమ ఎవరి హృదయానైతే జయిస్తుందో వారు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడాన్ని ఎన్నడూ మానరు. వారు ఇరుకైన మార్గంలో సంతోషంగా నడుస్తారు ఎందుకంటే కేవలం ఆ మార్గమే తమను పరలోకంలో ఉన్న తమ శాశ్వతమైన గృహానికి నడిపిస్తుందని వారికి తెలుసు. తమ చుట్టువున్న చీకటి లోకానికి వెలుగును ప్రకాశించడానికి వెలుగును తెచ్చేవారిగా తాము పిలువడ్డామని వారు గ్రహిస్తారు.
అంతేకాకుండా, అన్నిటికంటే ముందు మొదటిగా తమ సొంత హృదయాలలో యేసు వెలుగు ప్రకాశించడంతో ఇది మొదలవుతుందని వారికి తెలుసు. అది మీ విషయంలో జరిగిందా? ప్రేమతో పాపపరిహారంగా సిలువ మీద తన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వైపు తిరిగి మీ సొంత పాపాలను ఒప్పుకున్న వ్యక్తిగత అనుభవాన్ని మీరు కలిగివున్నారా? యేసుకు మీపట్ల ఉన్న ప్రేమ మీ హృదయాలను జయించిందా?
అలా జరిగితే, రక్షణ కొరకు ఆయన ఇచ్చిన ప్రియమైన పిలుపుకు మీ స్పందన ఏమిటి? అది అవును అని నేను ఆశిస్తున్నాను. అది అవును అయితే, “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును” అని సేవచేయడానికి అదే ప్రియమైన పిలుపుతో యేసు మిమ్మల్నిపిలుస్తున్నారని దయచేసి గ్రహించండి.
సేవచేయడానికి పిలిచిన ప్రియమైన పిలుపుకు మీ స్పందన ఏమిటి? తన ఆస్తులను చివరికి కుటుంబాలను తమ మార్గానికి ఆటంకం కానివ్వని ఈ శిష్యుల వలె తక్షణమే నిరంతమైన విధేయతను చూపించారా? లేదా యేసుకు ప్రభావవంతమైన సాక్షిగా ఉంకుండా మీకు ఆటంకంగా ఉన్న మీ ఆస్తులను హోదాలను బాంధవ్యాలను మీరు ఇంకా పట్టుకొని ఉన్నారా?
ఒకవేళ అలానే ఉంటే, మీరు పశ్చాత్తాపపడి మిమ్మల్ని క్షమించమని, నమ్మకమైన సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని ప్రభువైన యేసును అడగవలసిన రోజు ఈ రోజే. సువార్తను ప్రభావవంతంగా వ్యాప్తి చేయడానికి మీ హోదాని మీ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నేర్పించమని ఆయనను అడగండి. మీ బాంధవ్యాల కన్న ఆయనకు ఆధిక్యత ఇవ్వడానికి సహాయం చేయమని ఆయనను అడగండి. ఆయన మీ సృష్టికర్త అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయనే మీ విమోచనకర్త. కేవలం ఆయన మాత్రమే మీ కోసం చనిపోయారు. కాబట్టి, మీ జీవితంలో మొదటి స్థానానికి కేవలం ఆయనే అర్హుడు.