మీరు నిజమైన క్రైస్తవులా లేక క్రైస్తవులవంటివారా?

Posted byTelugu Editor April 4, 2023 Comments:0

(English Version: Are You A Real Christian Or An Almost A Christian)

1993 ఫిభ్రవరి 26వ తేదినా న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క అండర్‌గ్రౌండు పార్కింగులో శక్తివంతమైన బాంబు ప్రేలుడు జరిగి ఆరుగురు చనిపోయారు, వేయికన్నా ఎక్కువమంది గాయపడ్డారు. శక్తివంతమైన విచారణ జరిగి అనేక మంది అరెస్టు చేయబడ్డారు. అయితే కొందరు చట్టబద్దమైన అధికారులు అంతర్జాతీయ తీవ్రవాద కుట్రలో భాగంగా ఇది జరిగిందని గుర్తించారు.

2001 సం.లో తీవ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ధ్వంసం చేసినప్పుడు, రేమండ్ కెల్లీ అనే పోలీసుకమీషనర్ మొదట జరిగిన దాడిని గుర్తు చేసుకొని, “అమెరికాకు అది ఒక మేల్కొలుపు కాల్ అయి ఉండాలి” అన్నారు.

మత్తయి 25:1-13 నందు తెలియజేయబడిన ఉపమానం ద్వారా ప్రభువైన యేసు తీవ్రమైన మేల్కొలుపును ఇచ్చారు. దానిలో ఆయన క్రైస్తవులమని చెప్పుకొనే ప్రతిఒక్కరికి గంభీరమైన ఆత్మను పరిశోధించే ప్రశ్న, “మీరు నిజమైన క్రైస్తవులా లేక క్రైస్తవులవంటివారా?“ అని అడిగారు. మనం ఆ వాక్యభాగాన్ని చూసినట్లైతే, ఈ ప్రశ్నలో ఉన్న తీవ్రతను మనం తెలుసుకొని దానికి తగినట్లు స్పందించగలుగుతాము.

1. ఉపమాన వివరణ.

ఉపమానము అనగా, ఆత్మీయ సత్యాలను బోధించడానికి అనుదిన జీవితంలోని పరిస్థితులను ఆధారంచేసుకొని రూపొందించిన కథనం. తన పెండ్లికుమార్తెను వివాహం చేసుకొని తనతో ఉండడానికి  ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తున్న పెండ్లికుమారుని కథ ఈ ఉపమానము. ఆ రోజుల్లో ఉన్న ఆచారాల ప్రకారం, తోడి పెండ్లికుమార్తెలు పెండ్లికుమారునికి నమస్కరించి అతనిని పెండ్లికుమార్తె ఇంటికి తోడ్కొనిరావాలి. పెండ్లికుమారుడు రాత్రిసమయంలోనైనా రావచ్చు కనుక అతనికి వెలుగు చూపించడానికి తోడి పెండ్లికుమార్తెలు తమతో దీపాలను తీసుకువెళ్ళవలసి ఉంటుంది.

ఈ కథనం ప్రకారం, పెండ్లికుమారుడు అర్థరాత్రి సమయంలో వచ్చాడు. అతని కోసం ఎదురుచూస్తూ అక్కడ మొత్తం పదిమంది తోడి పెండ్లికుమార్తెలు ఉన్నారు. వారిలో ఐదుగురి దగ్గర నూనె దీపాలు ఉన్నాయి, మిగిలిన ఐదుగురి దగ్గర దీపాలు ఉన్నాయి కాని వాటిని వెలిగించడానికి నూనె లేదు. తమ దగ్గర నూనె ఉన్నవారు పెండ్లికుమారునితో పాటు పెండ్లివిందుకు వెళ్ళారు. అయితే మిగిలినవారు ఎంత బ్రతిమిలాడినా వారిని లోపలికి రానివ్వలేదు.

ఈ ఉపమానంలో ఉన్న పెండ్లికుమారుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. తమతో నూనె తీసుకువెళ్ళిన కన్యకలు (తోడి పెండ్లికుమార్తెలు) , క్రీస్తును కలుసుకోవడానికి సిద్ధపడివున్ననిజమైన క్రైస్తవులను సూచిస్తున్నారు. మిగిలిన అయిదుగురు బుద్ధిలేని కన్యకలు, క్రీస్తును కలుసుకోవడానికి సిద్ధపడిలేని అబద్ధ క్రైస్తవులను సూచిస్తున్నారు. మరియు అందువల్ల పరలోకద్వారం మూసివేయబడే ప్రమాదం ఉంది.

ఈ ఉపమానం యొక్క సారాంశం 13వ వచనంలో ఇవ్వబడింది. “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.“ మరో విధంగా చెప్పాలంటే, “ప్రభువును కలుసుకోవడానికి ఈ రోజే సిద్ధపడి ఉండండి. ఎందుకంటే సమయం సమీపించింది, అప్పుడు పాపాలకు క్షమాపణ పొందడం అసాధ్యము. ఒక్కసారి మీరు ఈ భూమిని విడిచిపెడితే పరలోకం చేరడానికి రెండవ అవకాశం ఉండదు.“

2. ఉపమానాన్ని అన్వయించడము.

మనం ఈ ఉపమానాన్ని గమనిస్తే అన్వయించతగ్గ మూడు సత్యాలను చూడగలము.

సత్యం #1 ఒకరు బహిరంగంగా క్రీస్తును అంగీకరించినప్పటికి అంతరంగంలో ఎన్నడు ఆయనను కలిగివుండరు.

బుద్ధిగల కన్యకలకు బుద్ధిలేని కన్యకలకు చాలా పోలికలు ఉన్నాయి. వారిరువురు దీపాలను తీసుకువచ్చారు, పెండ్లికుమారుని కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు (మత్తయి 25:1).  బుద్ధిలేని కన్యకలు పెండ్డికుమారుని రాకను వ్యతిరేకించడం లేదు. అతని రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు.

 అదేవిధంగా, క్రైస్తవులమని చెప్పుకొనేవారు కూడా తాము క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తున్నామని చెబుతారు కాని ఆయనను కలుసుకోవడానికి సరైన రీతిలో సిద్ధపడిలేరు. పెండ్లికుమారుని రాక ఆలస్యం అయినప్పుడు బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు ఇరువురూ నిద్రపోయారు. బుద్ధిగల కన్యకలు భద్రతాభావంతో నిద్రపోయారు.వారు క్రీస్తుతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నందున నిజమైన భద్రతను కలిగి ఉన్న నిజమైన విశ్వాసులను సూచిస్తారు. బుద్ధిలేని కన్యకలు కూడా భద్రతాభావంతో నిద్రపోయినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, వారు మోసపోయిన హృదయం ఫలితంగా తప్పుడు భద్రతను కలిగివున్న అబద్ధ క్రైస్తవులను సూచిస్తున్నారు. వారు తాము చర్చికి వెళ్తున్నాము, కొన్ని బహిరంగ క్రైస్తవ కార్యక్రమాలు చేశాము, ఇతర క్రైస్తవులతో కలిసివున్నాము కనుక క్రీస్తు కొరకు సిద్ధంగా ఉన్నామని అనుకుంటారు. విచారకరమైన వాస్తవమేమిటంటే, వారు తమ పాపాల గురించి నిజంగా పశ్చాత్తాపపడలేదు మరియు క్రీస్తులో నూతన జన్మను అనుభవించలేదు.

అబద్ధ క్రైస్తవుల జీవితాన్నితెలియచేసె కొన్ని లక్షణాలు:

i) వారు దేవుని చూసే విధానం తప్పు. దేవుడు ప్రేమామయుడు ఆయనలో ప్రేమ తప్ప మరియేది లేదు. ఆయన ఎన్నడు నన్ను త్రోసివేయడు. నేను ఆయన ముందు నిలబడినప్పుడు, నన్ను పరలోకంలోనికి చేర్చుకునేలా నేను ఆయనను ఒప్పించగలను. అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయమని బ్రతిమాలిన బుద్దిలేని కన్యకల దృక్పధం అదే (మత్తయి 25:11).

దేవుడు ప్రేమామయుడు అయినా ఆయన కేవలం ప్రేమను మాత్రమే చూపడు. ఆయన అంతే పరిశుద్ధుడు, న్యాయవంతుడు. తన కుమారునియందు నమ్మకముంచని వారిని శిక్షిస్తానని ఆయన తన వాక్యంలో వాగ్దానం చేశారు (యోహాను 3:18). ఆయనను అబద్ధికునిగా చేసేలా తన వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏదైనా చేస్తారనడం అసంభవమే. 

ii)• వారు పాపాన్ని చూసే విధానం తప్పు. అబద్ధ క్రైస్తవులు పాపాలను ఒప్పుకోవడం మరియు నిజమైన మార్పు ఒక్కటిగానే చూస్తారు. అయితే నిజమైన మార్పుకు ముందు పాపాలను ఒప్పుకోవడం జరుగుతుంది. నిజమైన మార్పు లేకుండానే పాపాలను ఒప్పుకోవడానికి అవకాశం ఉంది.

యూదా, ఫెలిక్సు మరియు ఏశావులు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపం చెందారు కాని వారు ఎన్నడు రక్షించబడలేదు (మత్తయి 27:3-5; అపో.కా 24:25; హెబ్రీ 12:16-17). పాపాల విషయంలో బాధపడినంత మాత్రాన అది వారు క్రైస్తవులు అనడానికి రుజువు కాదు. ఒకరు ఆ దుఃఖం వలన తమ పాపాలను విడిచిపెట్టి కనికరం కొరకు క్రీస్తు పాదాల చెంత చేరితేనే అది నిజమైన మార్పు కలిగిస్తుంది, కాని అబద్ధపు దుఃఖం కేవలం నాశనానికి నడిపిస్తుంది (2కొరింథి 7:9-10).

iii)• వారు లోకాన్ని చూసే విధానం తప్పు. లోకం పట్ల దాని సౌఖ్యాలపల్ల ఉన్న పిచ్చి ప్రేమను బట్టి అబద్ధ క్రైస్తవులను గుర్తించవచ్చును. ఈ లోకంలో ఉండడాన్ని క్రీస్తు ఖండించలేదు కాని వారిలో లోకం ఉండడాన్ని ఆయన ఖండించారని వారు తెలుసుకోలేరు.

1 యోహాను 2:15లో “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు“ అని చాలా స్పష్టంగా చెప్పినదానిని ఎరిగి కూడా  దానికి విరుద్దంగా ఈ లోకఆశల వైపు తమ జీవితాలను నడిపించడంలో తీరికలేకుండా ఉన్నారు. ఒకవేళ వారు లోకసంబంధమైనవాటి వెంట పరుగెత్తకపోయినా, లోకసంబంధమైనవాటి గురించి కలలు కనడంలో తీరికలేకుండా ఉన్నారు. బహుశ వారు మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు“  (మత్తయి6:24)  అనే ఆజ్ఞ నుండి తాము మినహాయింపబడతామని అనుకుంటారు. ది వారిని వారు మోసపుచ్చుకొనుటయే కదా?

iv)• వారు ఇతరులను ప్రేమించే విధానం తప్పు. ఇతరుల పట్ల ఎంచుకొని ప్రేమ చూపడం అబద్ధక్రైస్తవుల లక్షణము. వారు తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. క్రైస్తవులమని చెప్పుకొనే అనేకమంది ఇతరుల పట్ల కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన విరోధాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని, బాధని కలిగిస్తుంది. అది వారి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, ఇతర చర్చి సభ్యులు, సహోద్యోగులు, పొరుగువారు మొదలైన వారి పట్ల కావచ్చు. అయితే వారు సాధారణంగా, ”నేను అందరిని ప్రేమిస్తాను కాని పలానావారు నన్ను చాలా బాధ పెట్టారు కనుక నేను వారిని ప్రేమించలేను“ అంటారు.

ఏమైనప్పటికి, క్రైస్తవులనబడే వారికి ద్వేషం ఒక లక్షణంగా ఉండకూడదని లేఖనం స్పష్టంగా చెబుతుంది. 1 యోహాను 4:20-21 లో, ఎవడైనను–నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము“ అని చెప్పబడింది. 1 యోహాను 3:13-15 లో మరియు 1 యోహాను 4:7-8 లో ఇదే విషయం చెప్పబడింది.

కనుక ఐదుగురు బుద్ధిలేని కన్యకలవలె బహిరంగంగా క్రీస్తును అంగీకరించినా, అంతరంగంలో ఆయనను కలిగిలేకపోవడం సాధ్యమే. కాబట్టి మనం కేవలం పైకి చెప్పేవారిగా ఉన్నామా, లేక నిత్యజీవాన్ని నిజంగా కలిగివున్నామా అని మన జీవితాలను పరీక్షించుకోవలసిన అవసరం ఉంది.

సత్యం #2 రక్షణను బదిలీ చేయలేము మరియు రక్షణ లో భాగమివ్వలేము.

పెండ్లికుమారుడు వచ్చినప్పుడు తమ  దీపాలను వెలిగించడానికి తమ దగ్గర నూనెలేదని బుద్ధిలేని కన్యకలు గ్రహించారు. వెంటనే, “బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. 9అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. “(మత్తయి 25:8-9).

ఆ సమయంలో వారు వెళ్ళి తమ కొరకు నూనె కొనుక్కొని వస్తే ఆలస్యం అవుతుంది. పెళ్లి బృందం లోపలికి వెళ్లింది, అంతట తలుపు వేయబడెను (మత్తయి 25:11). బుద్ధిగల కన్యకలకు ఉన్న సిద్ధపాటును ఆధారంచేసుకొని బుద్ధిలేని కన్యకలు లోపలికి వెళ్లలేకపోయారు. ఎవరికివారే పెండ్లికుమారుని కొరకు సిద్ధపడాలి. మరోక విధంగా చెప్పాలంటే, రక్షణ అనేది పాపికి ప్రభువుకు మధ్య ఉండే వ్యక్తిగతమైన వ్యవహారము. దానిని బదిలీ చేయలేము భాగమివ్వలేము; ప్రభువును కలుసుకోవడానికి ఎవరికివారే వ్యక్తిగతంగా సిద్ధపడాలి.

క్రైస్తవులమని చెప్పుకొనే అనేకమంది బుద్ధిలేని కన్యకలవలె ఉన్నారు. తాము వెళ్లే చర్చిని బట్టి, క్రైస్తవులైన తమ తల్లిదండ్రులను బట్టి, క్రైస్తవులైన జీవితభాస్వామిని బట్టి దేవుడు తమను పరలోకంలోనికి రానిస్తాడని వారు అనుకుంటారు. తమను తాము మోసంచేసుకొనే అటుంటివారిని యేసు హెచ్చరిస్తూ స్పష్టంగా ఏమి చెప్పారంటే, మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు (లూకా 13:3). యోహాను 3:3లో ఆయన రక్షణ వ్యక్తిగత అనుభవమని మరోసారి ధ్రువపరిచారు;అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.“

మన జీవితాలను పరిశీలించుకుందాము. మనం పరలోకంలోనికి ప్రవేశించడానికి  చర్చితో స్నేహితులతో లెదా తల్లిదండ్రులతో మనకున్న సంబంధాలపై మనం ఆధారపడుతున్నామా? అలాగైతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. మన పాపాల విషయమై మనం వ్యక్తిగతంగా ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది విడుదలకై క్రీస్తువైపు తిరిగితేనే తప్ప మనం రక్షించబడము.

సత్యము#3 జీవితాంతం పట్టుదల కలిగివుండడానికి క్రైస్తవ విశ్వాసం పిలుపునిస్తుంది.

పెండ్లికుమారుడు తన రాకను ఆలస్యం చేసినప్పటికి బుద్ధిగల కన్యకలు అతడు ఏ సమయంలో వచ్చినా దానికి సిద్ధపడివున్నారు. అది ఊహించని సమయమైనా, అర్థరాత్రి (6 వ వచనం) సమయంలో పెండ్లికుమారుడు వచ్చాడు, అప్పటికి కూడా వారు సిద్ధపడేవున్నారు. క్రైస్తవులు చివరి వరకు విశ్వాసంలో పట్టుదల కలిగి ఉండాలని ఇది తెలియజేస్తుంది. 

అప్పుడప్పుడు లేదా అనుకూలంగా ఉన్నప్పుడు చూపించే విధేయతను చూపించడానికి క్రీస్తు మనలను పిలవలేదు. మనం క్రీస్తు వైపుకు తిరిగామంటే మన జీవితాన్ని పణంగా పెట్టాల్సివచ్చినా జీవితాంతం ఆయనను వెంబడిస్తామనే నిబద్ధతను కలిగివుండడమే.

నేడు చాలామంది క్రీస్తును మరియు ఆయన ఇచ్చిన రక్షణను నరకాన్ని తప్పించే ఒక ఇన్సురెన్సు పాలసీగా పరలోకానికి టిక్కెట్టుగా కేవలం లోకసంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చేదిగా మాత్రమే చూడడం చాలా బాధాకరమైన విషయము. మన తరంవారికి శ్రేయస్సు సువార్త అటువంటి విజ్ఞాపనలు చేయడంలో ఆశ్చర్యం లేదు. నేడు చాలా సంఘాలలో తమను తాము తగ్గించుకోవడం, సిలువ మోయడం గురించిన వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అది ఇప్పటికీ యేసుని వర్తమానమే.

ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి యేసు మనల్ని పిలిచారు ఎందుకంటే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, మరియు  జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమనై యున్నది (మత్తయి 7:13-14). ప్రవేశమార్గమే ఇరుకైనది కాదు క్రైస్తవుల దారి కూడా ఇరుకుగా ఉందని గమనించండి. క్రైస్తవ జీవితం ఒక సవాలుతో కూడిన జీవితం అని, జీవితాంతం స్థిరంగా నిలబడాలని ఇది సూచిస్తుంది,

క్రీస్తును వెంబడించడానికి చెల్లించవలసిన వెలను నిజమైన క్రైస్తవులు అర్థం చేసుకొంటారు. అందుకే వారు పాపానికి, సాతానుకి,  మరియు లోకానికి వ్యతిరేకంగా పట్టుదలతో యుద్ధం చేస్తారు. ఒకవేళ వారు పాపం చేసినా, దానిని విడిచిపెట్టి నిజంగా పశ్చాత్తాపపడతారు. తాము పాపం చేయడం వలన   తమ పాపాల కొరకు సిలువపై మరణించిన తమ ప్రభువుకు దుఃఖం కలిగిస్తుందని ఎరిగినవారు ఇంకా పాపంలోనే సౌఖ్యంగా ఉండరు. తమ రక్షకుడు భయంకరమైన వెల చెల్లించిన పాపంలో పోషించబడడం దానిలోనే ఉండడం అనే ఆలోచనలు వారికి తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది.

దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు; రక్షించబడినవారు తమ పట్టుదల కారణంగా రక్షణ పొందారని నేను చెప్పడంలేదు. కృపచేతనే క్రీస్తునందున విశ్వాసం ద్వారానే రక్షణ లభిస్తుందనే బైబిలు సత్యానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను (యోహాను 6:47; ఎఫెసి 2:8-9; తిమోతి 3:5). విశ్వాసంలో పట్టుదలగా ఉండడం వలన ఒకరు రక్షింపబడరు. పట్టుదల  రక్షణకు ఒక కారణం కాదు. అయితే అది నిజమైన రక్షణకు ఫలితము.

మన జీవితాలను పరిశీలించుకుందాము. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికి పట్టుదలతో ఉండే క్రైస్తవులుగా మనం ఉన్నామా?

చివరి మాటలు.

నేడు, క్రైస్తవ్యాన్ని అనుసరించే అనేకమంది “నేను క్రైస్తవునిగానే ఉంటూ లోకానికి ఎంత దగ్గరగా ఉండవచ్చు?“ అని అడుగుతున్నారు. క్రైస్తవునిగా ఉండకుండా ఆయనకు ఎంత దగ్గరగా వెళ్ళవచ్చునో యేసు స్పష్టంగా చూపించారు. క్రైస్తవులవంటివారిగాఉండడం చాలా తేలిక. దానికై వారు ఎక్కువ వెల చెల్లించనవసరం లేదు. ఏమైనప్పటికి రాబోయేకాలంలో ఒకరికున్న సమస్తాన్ని వెలగా చెల్లించవలసి వస్తుంది. తీర్పు దినాన నిజమైన క్రైస్తవునిగా ఉండడానికి క్రైస్తవులవంటివారిగా ఉండడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలుసుకున్నప్పుడు అది ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. పరలోకానికి నరకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది.

హెచ్చరించండి: దాదాపు రక్షించబడినట్లే అంటే కచ్చితంగా తప్పిపోయినట్లే! “నరకానికి వెళ్లే దారి మంచి ఉద్దేశాలతో చదును చేయబడి ఉంటుంది“ ఈ వాక్యం ఎంతవరకు సరైనది. ఈ మాటలు మనలో ఎవరి వర్ణన కాకుడదు.

బుద్ధిలేని కన్యకలు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. దయచేసి మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచకండి. మీరు అలా ఎన్నడూ చేయకపోతే, మీ పాపాలను విడిచిపెట్టండి, మిమ్మల్ని క్షమించమని యేసును అడగండి, ఇప్పుడే ఆయనను వెంబడించేవారిగా అవ్వండి. వెంటనే ఆయన స్పందిస్తారు. నీలోనికి వచ్చి నిసించేలా పరిశుద్ధాత్మను నీకు ఇస్తారు. మీ అంతట మీరు జీవించలేని జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుంది. మీ పట్టుదల కలిగిన జీవితం బట్టి మీరు కూడా నిజమైన క్రైస్తవులు అనే నిశ్చయతను కలిగివుంటారు.

Category

Leave a Comment