మిషనరీగా మారిన ఉగ్రవాది

(English version: “Terrorist Becomes A Missionary”)
“అమేజింగ్ గ్రేస్” అనే ప్రసిద్ధ క్రైస్తవ కీర్తన రచయిత జాన్ న్యూటన్ చిన్నప్పటి నుండి తన జీవితాన్ని సముద్రం మీద గడిపాడు. నావికుడైన అతను తన జీవితాన్ని తిరుగుబాటు మరియు దుష్టత్వంతో గడిపాడు. బానిస వ్యాపారంలో ఉపయోగించే ఓడలో పని చేస్తూ, అతను కొత్త ప్రపంచ నిర్మాణం కోసం బానిసలను బంధించాడు. తరువాత అతను ఆ ఓడకు కెప్టెన్ అయ్యాడు. మునిగిపోవడం ద్వారా మరణానికి సమీపంలో ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్న సంఘటనల శ్రేణి తరువాత, అతను తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించాడు. తరువాత అతడు గొప్ప బోధకునిగాను, అతని కాలంలోని చర్చికి నాయకుడిగాను మారాడు. పాపంలో జీవించి క్రీస్తు ద్వారా మార్చబడిన న్యూటన్ వంటి వ్యక్తుల ఉదాహరణలు చరిత్ర నిండా ఉన్నాయి.
అయితే, ఒక ఉదాహరణ మిగిలిన వాటికి భిన్నంగా ఉంది. ఈ వ్యక్తి తనను తాను “పాపులలో ప్రధానుడను” [1 తిమో 1:15] అని చెప్పాడు. అతడు చాలామంది క్రైస్తవులను హింసించాడు, వారికి మరణశిక్ష విధించడానికి అనుకూలంగా తన ఓటు కూడా వేసాడు. ఆ కాలంలో అతడు అత్యంత భయంకరమైన మతోన్మాది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయినప్పటికీ, అతడు ఏ విశ్వాసాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడో అదే విశ్వాసం కోసం దేవుని మహా దయను బట్టి అతడు మిషనరీగా మార్చబడ్డాడు! సగానికి పైగా క్రొత్త నిబంధన పత్రికలు అతడు రాసినవే. సువార్త వ్యాపింపచేయడంలో అతడి ప్రభావం ఇప్పటికీ ఎంతో గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత క్రైస్తవ్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి అతడే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
మిషనరీగా మారిన ఈ మతోన్మాదిని నేను మీకు పరిచయం చేస్తాను. ఇతడు తార్సుకు చెందిన సౌలు, అపొస్తలుడైన పౌలు అని పిలువబడ్డాడు. మనము అతని జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు మన స్వంత జీవితాలను ప్రభావితం చేసే కొన్ని ఆచరణాత్మక సత్యాలను మనం తెలుసుకోవచ్చు. అయితే, అపొ కా 22:3-11 లో వ్రాయబడినట్లుగా, అతని మాటలలోనే అతడు క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉండేవాడో అర్థం చేసుకుందాం.
I. గత జీవితం మరియు విద్య [అపొ కా 22:3-4]
పౌలు ఆధునిక టర్కీలో ఉన్న తార్సు పట్టణంలో జన్మించాడు. పౌలు కాలంలో తార్సు ఒక ప్రతిష్టాత్మకమైన ఓడరేవు పట్టణము. [అపొ కా 21:39] అది విశ్వవిద్యాలయానికి రాజకీయాలకు ప్రసిద్ధి చెందింది. తార్సులో వివిధ సంస్కృతులకు చెందిన దాదాపు 5,00,000 జనాభా ఉంది. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ పౌలు హీబ్రూతో పాటు గ్రీకు కూడా నేర్చుకున్నాడు. గతంలో అతడు పొందిన శిక్షణ అతని తరువాతి కాలంలో సువార్తతో యూదులు కానివారికి సమర్థవంతంగా చేరువయ్యేలా చేసింది.
పౌలు తండ్రి సాంప్రదాయాలను పాటించే ఒక పరిసయ్యుడు [అపొ కా 23:6]. అతని తల్లి గురించి మనకు ఎటువంటి సమాచారం లేదు కానీ అతనికి ఒక సోదరి ఉందని చెప్పబడింది [అపొ కా 23:16]. పౌలు వివాహం గురించి లేఖనాలలో స్పష్టంగా చెప్పలేదు. సమాజమందిరంలో పౌలు పాత్రను బట్టి చూస్తే, అతడు వివాహం చేసుకున్నాడని, క్రైస్తవునిగా మారే సమయానికి అతని భార్య చనిపోయిందని కొందరు అంటారు. 1 కొరింథి 7:8 బట్టి చూస్తే పౌలు భార్య మరణించిందని తెలుస్తుంది. అయితే దీని గురించి ఖచ్చితంగా చెప్పలేము.
వృత్తిరీత్యా పౌలు డేరాలు కుట్టుకునేవాడు [అనగా, జంతువుల చర్మాలతో డేరాలను తయారు చేయడం]. బహుశా అది అతని తండ్రి నుండి నేర్చుకున్న వృత్తి కావచ్చును. పౌలు యూదుడు ఇంకా రోమా పౌరుడు కాబట్టి [అపొ కా 22:27-28], రోమన్లందరికీ మూడు పేర్లు కలిసి ఉన్నట్లే [ఉదా, గయస్ జూలియస్ సీజర్] అతనికి కూడా మూడు పేర్లు కలిసి ఉండేవి. మొదటి రెండు పేర్లు కుటుంబానికి చెందినవి చివరిది వ్యక్తిగత పేరు. పౌలు విషయంలో, మొదటి రెండు పేర్లు మనకు తెలియవు. అతని పేరు పౌలస్ [లాటిన్], దాని నుండి మనకు పౌలు [గ్రీక] వచ్చింది. అయితే ప్రతి యూదునికి కూడా ఒక యూదుల పేరు ఉంటుంది. పౌలు యొక్క యూదా పేరు సౌలు, బహుశా ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు పేరు పెట్టి ఉండవచ్చు; అతడు పౌలు వలె బెన్యామీను గోత్రానికి చెందినవాడు [రోమా 11:1].
పౌలు యూదా మతం గురించి ఇంట్లోను తర్వాత యెరూషలేములోని గొప్ప యూదుల గురువైన గమలీయేలు దగ్గర గట్టి శిక్షణ పొందాడు. అతని మాటల ప్రకారం, “నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి” [గలతీ 1:14]. పౌలుకు అన్నింటి కన్న తన మతమే ముఖ్యము.
II. సంఘాన్ని హింసించుట [అపొ కా 22:4-5a]
అతడు గమలీయేలుతో అతని ప్రారంభ సంవత్సరాల తర్వాత , పౌలు గురించి పెద్దగా సమాచారం లేదు. తదుపరిసారి మనం అతన్ని చూసినప్పుడు అతను చర్చిని హింసించే వ్యక్తిగా కనిపిస్తాడు. క్రీస్తు కొరకు మొదటి హతసాక్షియైన స్తెఫను మరణించేటప్పుడు అతడు అక్కడే ఉన్నాడు [అపొ కా 7:54-8:3]. అతడు స్తెఫనును రాళ్లతో కొట్టేవారి వస్త్రాలను పట్టుకోవడమే కాకుండా, “వారు అతడిని చంపడాన్ని ఆమోదించాడు” [అపొ కా 8:1]. పౌలు స్తెఫనును చంపే విషయంలో అమాయకమైన ప్రేక్షకుడు కాదు అతడు దానిలో అంతర్భాగంగా ఉన్నాడు. క్రైస్తవులందరినీ నిర్మూలించాలనే పౌలు లక్ష్యానికి ఇది ప్రారంభం మాత్రమే.
అప్పటి నుండి పౌలుకున్న ఒకే ఉద్దేశం: “సంఘాన్ని నాశనం చేయండి” [అపొ కా 8:3]. “నాశనం” అనే పదం ఒక అడవిపంది ద్రాక్షతోటను ధ్వంసం చేయడం లేదా అడవి జంతువు ఒక శరీరాన్ని ఛిద్రం చేయడాన్ని వివరించడానికి ఉపయోగించబడింది. క్రూర జంతువు తన ఎరపై దాడి చేసినట్లుగా పౌలు క్రైస్తవులపై క్రూరంగా దాడి చేశాడు. పురుషులు స్త్రీలు అనే తేడా అతనికి లేదు [అపొ కా 8:3]. అందరిని సమానంగా బాధించాడు.
వీటన్నింటిలో అత్యంతప్రమాదకరమైన విషయం ఏమిటంటే, పౌలు ఇవన్నీ దేవుని పేరు మీద చేస్తున్నాడు. నిజానికి, పౌలు మతపరమైన ఉగ్రవాది తప్ప మరొకటి కాదు! తాను సంఘాన్ని హింసించానని అనేకసార్లు పౌలు స్వయంగా చెప్పాడు. అపొ కా 26:10-11 లో “10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; 11 అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.” భూమి మీద క్రైస్తవ్యం లేకుండా దానిని తుడిచివేయడమే పౌలు హింస ఉద్దేశము. యెరూషలేము దాని చుట్టుపక్కల పట్టణాలు అతని హింసలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు సుదూర పట్టణాలలో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది.
III. దమస్కు వెళ్లే మార్గంలో [అపొ కా 22:5b-11]
క్రైస్తవులను ఖైదు చేసి తీసుకురావడానికి యూదుల నాయకుల నుండి పత్రికలు తీసుకుని పౌలు దమస్కు వెళ్లాడు [అపొ కా 22:5]. దమస్కు జెరూసలేం నుండి 140 మైళ్ల దూరంలో సిరియాలో ఉంది. చేరుకోడానికి ఏడు రోజుల పట్టేది; ఎండ తగలకుండా ప్రజలు సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో ప్రయాణించేవారు. పౌలు మధ్యాహ్న సమయంలో [అపొ కా 22:6] దారిలో ఉన్నాడనే వాస్తవం దమస్కు వెళ్లడానికి అతనికి ఉన్న తొందరను సూచిస్తుంది.
అతడు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టు ప్రకాశించెను. అతడు నేను నేలమీద పడి “సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని” తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. అందుకు అతడు “ప్రభువా, నీవెవడవని” అడిగినప్పుడు ఆయన “నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును” అని అతనితో చెప్పెను [అపొ కా 22:6-8]. ఒకసారి ఊహించండి- పౌలు తన ముందు ప్రభువైన యేసుక్రీస్తుతో నేలపై పడి ఉన్నాడు.! యేసుక్రీస్తు గురించి స్తెఫను, ఇతర క్రైస్తవులు చెప్పినదంతా నిజమే! అతడు దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడు!
పౌలు సహచరులు వెలుగును చూశారు కానీ క్రీస్తు స్వరాన్ని గ్రహించలేకపోయారు [అపొ కా 22:9]. నేలమీద పడ్డ పౌలు క్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేయబడ్డాడు. రక్షణకు ముందు వినయం వస్తుంది! విమోచించబడిన హృదయం యొక్క మొదటి మొర, “ప్రభువా, నేను ఏమి చేయాలి?” [అపొ కా 22:10]. తన జీవితంపై యేసు ప్రభువుకున్న అధికారాన్ని పౌలు ఎన్నడూ ప్రశ్నించలేదు. ఇది ఒక సంపూర్ణమైన వాస్తవం! అన్నింటికంటే, యేసుక్రీస్తు ప్రభువుకు లోబడకుండా క్రైస్తవుడు ఎలా అవుతాడు? [మార్కు 8:34-38; రోమా 10:9].
అతని ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానం, దమస్కు వెళ్లు అక్కడ నీవేమి చేయాలో చెప్పబడుతుంది [అపొ కా 22:10]. వెలుగు వలన వచ్చిన గ్రుడ్డితనంతో ఉన్న అతడిని అతని సహచరులు దమస్కు తీసుకువెళ్లారు [అపొ కా 22:11]. సింహం వేటకు వెళ్ళినట్లు దమస్కుకు వెళ్ళాలని పౌలు అనుకున్నాడు కానీ అతడు సౌమ్యమైన గొర్రెపిల్లగా దమస్కు తీసుకువెళ్లబడ్డాడు. అతడు అంధుడు అయినప్పటికి ఇప్పుడు మాత్రమే చూడగలిగాడు. అతని ఆధ్యాత్మిక కళ్ళు ఎట్టకేలకు తెరవబడ్డాయి. పౌలు జాన్ న్యూటన్ తర్వాత జన్మించినట్లయితే అతడు అమేజింగ్ గ్రేస్ అనే కీర్తనలో నుండి “నేను ఒకసారి తప్పిపోయాను, కానీ ఇప్పుడు నేను రక్షించబడ్డాను, గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను!” అనే ఉత్తేజకరమైన పదాలను పాడేవాడు.
పౌలు మార్పు నుండి మనం అనుసరించాల్సిన మూడు సత్యాలు.
1. రక్షించబడలేనంత చెడ్డవారు ఎవరూ లేరు.
1 తిమోతి 1:15-16 లో, “నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని” అని పౌలు చెప్పాడు. క్రీస్తుకు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా చాలా చురుకుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన కనికరాన్ని పొందాడు.
మీరు రక్షింపబడలేనంత చెడ్డవారని అనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, ఏ పాపిగాని పాపం గాని యేసు రక్తం క్షమించలేనంత చెడ్డది కాదు. నిజమైన పశ్చాత్తాపంతో విశ్వాసంతో యేసును పిలవండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు! “నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను” [యోహాను 6:37] అని యేసే స్వయంగా వాగ్దానం చేశారు.
మీరు ఈ దయను పొందినట్లయితే, క్రీస్తు అన్ని రకాల పాపులను రక్షిస్తాడనే నమ్మకంతో సువార్త ప్రకటించండి. బహుశా, మీ సన్నిహితులకు పదే పదే విన్నవించినప్పటికీ వారు సువార్త ఆహ్వానానికి స్పందించలేదని మీరు భావిస్తూ ఉండవచ్చు. ప్రియమైన స్నేహితులారా, విడిచిపెట్టకండి. వారి రక్షణ కొరకు ప్రార్థిస్తూనే ఉండండి.
రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా స్తెఫను పట్టు వదలలేదు. సంఘం స్తెఫనుకు చాలా రుణపడి ఉందని తొలి సంఘనాయకుడైన అగస్టీన్ చెప్పాడు, ఎందుకంటే బహుశా అతని ప్రార్థన పౌలు మారడానికి దారితీసింది. జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు 50 సంవత్సరాలకు పైగా ముగ్గురు స్నేహితుల కోసం ప్రార్థించాడు. అతడు మరణించక ముందు ఇద్దరు క్రీస్తులోనికి వచ్చారు, అతడు మరణించిన ఒక సంవత్సరం తర్వాత మూడవవ్యక్తి క్రీస్తులోనికి వచ్చాడు. ప్రజలను రక్షించే శక్తి ఉన్న బైబిలు దేవుడిని ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే, “దేవునికి సమస్తము సాధ్యమే” [మత్తయి 19:26].
2. మంచి పనులు, బాహ్య నైతికత ఎవరినీ రక్షించలేవు.
సాంప్రదాయ యూదునిగా, తన మతపరమైన పనులు బాహ్య నైతికత తనకు దేవుని నుండి అంగీకారం పొందేందుకు సరిపోతాయని పౌలు నమ్మాడు. అయితే, అతడు తన స్పృహలోకి వచ్చినప్పుడు, అందరూ ఈ పరిశుద్ధమైన పరిపూర్ణమైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి మానవ ప్రయత్నాల ద్వారా దేవుని పరిపూర్ణ నీతిని ఎప్పటికి అందుకోలేమని అతడు గ్రహించాడు [ఫిలిప్పి 3:3-9].
మీరు పరలోకం చేరడానికి మీ మంచి పనులపై బాహ్య నైతికతపై నమ్మకం ఉంచితే, మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, దేవుని ప్రమాణానికి 100% పరిపూర్ణత అవసరం అంటే ఒక్క పాపం కూడా ఉండకూడదు! దేవుని దృష్టిలో పాపమంటే కేవలం చర్య మాత్రమే కాదు ఆలోచన కూడా అని గుర్తుంచుకోండి. హత్య చేయడం మాత్రమే కాదు కానీ హృదయంలో ఒకరిని ద్వేషించడం హత్యతో సమానమని యేసు స్పష్టంగా చెప్పారు [మత్తయి 5:21-22]. అలాగే వ్యభిచారం ఒక్కటే పాపం కాదు కానీ హృదయంలో ఎవరినైనా కోరుకోవడం వ్యభిచారంతో సమానమని కూడా ఆయన స్పష్టం చేశారు [మత్తయి 5:27-28].
మీరు ఈ సత్యాలను స్పష్టంగా చూసే వరకు, మిమ్మల్ని మీరు అసహ్యించుకునే బదులు ఆరాధించుకునేవారిగానే ఉంటారు. మిత్రమా, మంచి పనులు దేవునితో మంచి సంబంధానికి కారణం కాదు కాని యేసు ద్వారా దేవునితో మంచి సంబంధం కలిగివుండం వలన మంచిపనులు చేయగలము.
3. మీరు దేవునితో పోరాడి గెలవలేరు.
మరో సందర్భంలో పౌలు తన మార్పు గురించి చెబుతున్నప్పుడు అతడు దమస్కు వెళ్లే మార్గంలో యేసు మాట్లాడిన మాటలు, “సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని” [అపొ కా 26:14] అని చెప్పాడు. మునికోలు అంటే పనిచేసేలా ఎద్దులను పురికొల్పే పదునైన కర్ర. ఎద్దులు ప్రతిఘటించినా వెనక్కి తన్నినా మునికోలుకు ఉండే పదునైన అంచు ఎద్దునే బాధిస్తుంది. అందుకే, మునికోలుకు ఎదురు తన్నడం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి గెలవలేమని చెప్పడమే. దేవుడు పౌలుకు ఈ సత్యాన్ని స్పష్టంగా నమ్మి ఒప్పుకునేలా బోధించారు.
అదే విధంగా, మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంటే గనుక మీరు చివరికి ఓడిపోతారు. బహుశా, మీరు మీ రక్షణ కొరకు క్రీస్తు వైపు తిరగడాన్ని వ్యతిరేకిస్తూ ఉండవచ్చు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరే బాధించుకుంటున్నారు. మీరు క్రైస్తవులే కాని జీవితంలోని ఏదో ఒక అంశంలో దేవుని చిత్తానికి లోబడడానికి ఇష్టపడకపోవచ్చు. బహుశా అది మీరు మొండిగా పట్టుకున్న పాపం కావచ్చు లేదా ఆయన మీ పట్ల చేయదలచిన మంచిని చేయడానికి మీరు ఇష్టపడకపోవడం కావచ్చు. ఏది ఏమైనా, మీరు దేవునితో పోరాడి గెలవలేరు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరే బాధపెట్టుకోవడమే కాకుండా ఇతరులను కూడా బాధపెడతారు. పోరాటం ఆపి దేవుని ప్రోద్బలానికి లోబడండి.
ముగింపు మాటలు.
ఉగ్రవాది మిషనరీ అయ్యాడు. పీడించేవాడు బోధకుడయ్యాడు! దేవుడు చేసేది అదే! ఆయన కఠినమైన హృదయాలను విరగ్గొట్టి ఆయన చిత్తానికి కట్టుబడి ఉండే మృదువైన బోధించదగిన హృదయాలతో వాటిని భర్తీ చేస్తారు. ఒకప్పుడు క్రైస్తవులను చంపిన అదే పౌలు తరువాత “నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము” అన్నాడు [ఫిలిప్పి 1:21]. మన వైఖరి కూడా అలాగే ఉండును గాక!