ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టారని మీరనుకున్నా ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు.

(English Version: The Lord Remembers You – Even When You Feel Abandoned By Him!)
కష్టాలు ఎక్కువకాలం ఉండడం వలన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టారని మీరెప్పుడైనా భావించారా? అవి ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబసమస్యలా? అది ఎటువంటి బాధ అయినప్పటికి, మీ ప్రతిస్పందన క్రింది వాటిలో ఒకటిగా ఉందా? :
1) దేవునిలో నిరాశ
2) ఆయనపట్ల కోపం
3) నిరుత్సాహం మరియు అధైర్యము
4) ఆయన సమయంలో విడుదల దయచేసేవరకు ఓపికతో ఆయనలో ఎదురుచూడడము.
ఈ విషయంలో, దీర్ఘకాలం శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు మనమందరిది ఆయన సమయంలో విడుదల దయచేసేవరకు ఓపికతో ఆయనలో ఎదురుచూడడము అనే 4వ సమాధానం కావాలని నేను మీ అందరిని ప్రోత్సాహిస్తున్నాను. అది చెప్పడం సులభం కాని చేయడం కష్టము. శ్రమల నుండి ఉపశమనం లభించని సమయంలో అటువంటి దైవభక్తికలిగిన స్పందనను మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి? దాని సమాధానం క్రింద ఇవ్వబడిన సత్యాన్ని అంగీకరించడంపై ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను.
దేవుడు ఎన్నడూ తన పిల్లలను మరువడు. వారిని విడిచిపెట్టారని వారనుకున్నా ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటారు.
దేవుడు తమ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు అనడానికి ఉదాహరణలు:
నోవాహు: దేవుడు జ్ఞాపకం చేసుకున్నారని మనం మొదటిసారిగా ఆదికా 8:1లో “దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నారని” చదువుతాము. కటికచీకటిలో ప్రకాశించే వెలుగుగా దేవుడు ఉన్నాడు. ముందు వచనంలో “నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను” (ఆదికా 7:24) అని చదువుతాము. లోకమంతా వరదలో కొట్టుకుపోయింది. నోవాహు మరియు ఓడలో ఉన్నవారందరు లోపల ఉండిపోయారు, బయటకు రాలేని పరిస్థితి.
తాము ఓడలోపలికి వెళ్ళినప్పటి నుండి ఎంతకాలం ఓడలోపల ఉన్నామో వారు గ్రహించినప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఊహించగలము. ఆదికా 7:6, 11 ప్రకారం భూమి మీదకు జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయస్సు 600 సం. (ఓడలోనికి వచ్చిన వారం తర్వాత). ఆదికా 8:13-15 ప్రకారం అతడు ఓడనుండి బయటకు వచ్చినప్పుడు అతనిక వయస్సు 601 సం. అంటే వారు సుమారు ఒక సంవత్సరంపాటు ఓడలోపల ఉన్నారు. చుట్టూవున్నవన్ని చనిపోతున్నప్పుడు ఆ చిన్నస్థలంలో చాలాకాలం ఉన్నారు.
అయినా దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నారని మనకు చెప్పబడింది. జ్ఞాపకం చేసుకున్నారు అంటే దేవుడు తన జ్ఞాపకశక్తి కోల్పోవడం వలన నోవాహును మర్చిపోయారని కాదు కాని దయతో, అడిగినవాటిని ఇవ్వడం ద్వారా, కాపాడుతూ, విడుదలనిస్తూ జ్ఞాపకం చేసుకున్నారని అర్థము. దేవుడు నోవాహును జలప్రళయం నుండి కాపాడతానని చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారని ఈ సందర్భంలో తెలుస్తుంది (ఆదికా 6:17-18). ఆయన తన వాగ్దానానికి క్రియారూపం ఇచ్చారు.
అబ్రాహాము: ఆదికా 19:29లో “దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను” అని వ్రాయబడినది. అబ్రాహాము తన మేనల్లుడైన లోతు గురించి చేసిన ప్రార్థనను దేవుడు దయతో ఆలకించి (ఆదికా18:16-23) ఆయన సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు అతడిని తప్పించారు.
ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు: నిర్గమకాండములో దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా శ్రమపడుతున్నప్పుడు, “ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను” (నిర్గమ 2:22-25). దేవుడు తనకున్న దయతో మోషేను లేవనెత్తి అతని ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు తీసుకువచ్చారు.
హన్నా: 1 సమూయేలు 1:11లో దేవుని వేడుకుంటున్న హన్నా అనే పిల్లలులేని దైవభక్తికలిగిన స్త్రీ గురించి చదువుతాము. “సైన్యములకధిపతియగు యెహోవా” ఆమెకున్న “శ్రమను చూచి”, మరువక “జ్ఞాపకము” చేసికొని “మగపిల్లను” దయచేయమని ప్రార్థించింది. అదే అధ్యాయంలో “యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను” (1 సమూ 1:19-20) అని చదువుతాము.
కీర్తనలు: దేవుడు తన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించారని, మరికొన్ని సందర్భాలలో తన ప్రజలు చేసిన తప్పులకు వారిని శిక్షించక కరుణించారని కీర్తనలలో అనేకసార్లు వ్రాయబడింది.
కీర్తన 98:3 “ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు.”
కీర్తన 105:42 “ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొనెను.”
కీర్తన 106:45 “వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను; తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.”
“మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను; ఆయన కృప నిరంతరముండును” అని కీర్తన 136:23లో కీర్తించిన విధంగా ప్రజల దేవుని స్తుతించడంలో ఏ ఆశ్చర్యం లేదు.
సిలువమీద పశ్చాత్తాపపం చెందిన దొంగ: దేవుడు దయతో ప్రజలను జ్ఞాపకం చేసుకోవడం గురించి బైబిలులో ఇచ్చిన అన్ని ఉదాహరణలలో సిలువమీద పశ్చాత్తాపం చెందిన దొంగకు యేసు ఇచ్చిన సమాధానం హృదయాన్ని ఎంతగానో కదిలించేదిగా ఉంటుంది. ఆ సన్నివేశంలో మన పాపాలను భరిస్తూ యేసు సిలువమీద వేలాడుతూ తీవ్రమైన వేదనతో బాధపడుతున్నారు.
ఆ పరిస్థితిలో ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒకడు, “ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను” (లూకా 23:42). యేసు ఇచ్చిన దిగ్ర్భాంతి కలిగించే సమాధానాన్ని మీరు గమనించారా? “అందుకాయన వానితో, నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను” (లూకా 23:43). రేపు కాదు, ఒక నెల తర్వాత కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కాదు కాని “ఈ రోజే పరలోకంలో ఉంటావు” అని పశ్చాత్తాపం చెందిన దొంగకు ఆయన వాగ్దానం చేశారు.
పశ్చాత్తాపం చెందిన ఆ దొంగ ఈ మాటలు విన్నప్పుడు అతనికి ఎంత సంతోషం కలిగివుంటుందో ఒకసారి ఊహించండి. కొన్ని గంటలలో చనిపోతాడు అనగా అతడు చెప్పనశక్యంకాని సంతోషాన్ని అనుభవించాడు; పరలోకానికి వెళ్ళాడు అక్కడ యేసు అతని కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా విడుదలకోసం ఆయన వైపు చూసేవారిని దేవుడు ఇలానే జ్ఞాపకం చేసుకుంటారు.
దేవుడు దేనిని జ్ఞాపకం చేసుకొనరు?
దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటారు అనడానికి పైన తెలిపిన ఉదాహరణలు సరిపోవు, వేదనలో ఉన్న హృదయానికి ఇంకా ఆదరణ కలించడానికి ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. తన ప్రజలను “గుర్తుంచుకునే” ఈ దేవుడు తన కుమారుడు ప్రభువైన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ కోసం ఆయన దగ్గరకు వచ్చినవారి పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు.
“వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను” అనే వాగ్దానము హెబ్రీ 10:17లో వ్రాయబడినది. యేసు “పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించారు” (హెబ్రీ 10:12) అనే దానిని ఆధారం చేసుకొని ఈ వాగ్దానం ఇవ్వబడింది.
యేసు రక్తం క్రింద మనందరి పాపాలు కప్పివేయబడ్డాయి. “వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు” అని హెబ్రీ 10:18లో చాలా స్పష్టంగా వ్రాయబడింది కనుక మనం ఇక వెల చెల్లించనవసరం లేదు అలాగే తీర్పు గురించి భయం అవసరంలేదు.
దేవుడు మనల్ని విడిచిపెట్టారనే భావన మనకు కలుగుతున్నప్పుడు, ఇది మనందరికి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించే ప్రాముఖ్యమైన ఆధారము. ఆయన సన్నిధినుండి మనల్ని దూరంచేసే మన పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అది ఎంత సంతోషం! ఎంత ఆదరణ!
దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటారు?
యేసుని తిరస్కరించినవారు ఈ ఆనందాన్ని ఆదరణను అనుభవించలేరు. వారు పాపక్షమాపణ పొందకుండా చనిపోయి రాబోయే దేవుని తీర్పును ఎదుర్కోవడానికి విడిచిపెట్టబడతారు. ఆ సమయంలో దేవుడు వారి పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని ఆధారంగా శాశ్వతమైన శిక్షగా నరకమనే నిత్యమైన అగ్నిగుండంలో పడవేస్తారు. ప్రకటన 20:11-15లో దాని గురించి వ్రాయబడింది.
11మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. 12మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. 13సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. 14మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
13వ వచనం చివరిలో ఉన్న “వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను” అనే వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. ఎవరైనా పాపక్షమాపణ పొందకుండా చనిపోతే వారు ఆ రోజువరకు చేసిన పాపాలు క్షమించబడకుండా రాబోయే తీర్పుదినాన అవన్ని పైకి తేబడతాయి.
పాపపూరితమైన ప్రతి ఆలోచన, మాట, చేసిన పని అన్ని పైకి తీసుకురాబడతాయని దీని అర్థము. అలాగే 100% మంచిపనులు చేయకపోవడం కూడా వాటిలో భాగమే. అలాగైతే తీర్పుదినాన ఒకరు తనమీద వేసుకొని మోసుకురావలసిన పాపాల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. ఎవరూ పరిపూర్ణలు కాదు కాబట్టి తమంతట తామే తమ పాపాలన్నిటికి తగినంత మూల్యం చెల్లించలేరనేది ఎంతో సత్యము. ఆ కారణంచేతనే యేసును తిరస్కరించినవారు తమ పాపాల ఫలితంగా అగ్నిగుండంలో నిత్యమైన శిక్ష అనుభవిస్తారు.
కాబట్టి ఏది ఎంచుకోవాలో స్పష్టంగా ఉంది.
ఇంకా జీవించి ఉండగానే పశ్చాత్తాపంతో విశ్వాసంతో రక్షకుడైన యేసు దగ్గరకు వెళ్తే వారి పాపాలన్నిటికి పూర్తి వెల చెల్లించబడుతుంది. అప్పుడు ఇక ఎన్నడూ యేసు వారి పాపాలను జ్ఞాపకం చేసుకోరు. అదేవిధంగా వారు పరలోకంలో యేసుతో పాటు శాశ్వతకాలం ఉంటామనే నమ్మకం కలిగివుంటారు.
లేదంటే ఇప్పుడు యేసుని తిరస్కరించి తమ పాపాలన్నిటిని మోసుకుంటూ రాబోయే తీర్పుదినాన న్యాయాధిపతిగా ఉండే క్రీస్తును ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ రోజు యేసు వారు చేసిన ప్రతిపాపాన్ని జ్ఞాపకం చేసుకొని వాటికి శిక్షగా నరకమనే నిత్యమైన అగ్నిగుండంలో వారిని పడవేస్తారు. దేవుడు శాశ్వతంగా విడిచిపెట్టడం అంటే ఎలా ఉంటుందో వారు అక్కడ అనుభవిస్తారు.
మీ ఎంపిక ఏమిటి? యేసు మీ రక్షకునిగా దయతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలా లేక మీ న్యాయాధిపతిగా మీ పాపాలను జ్ఞాపకం చేసుకోవాలా?