ప్రభువుతో అర్థవంతమైన ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని ఎలా గడపాలి

(English version: “How To Have A Meaningful Quiet Time With The Lord”)
చాలాకాలం క్రితం యునైటెడ్ స్టేట్స్ సందర్శించిన ఒక స్పీకర్ ఒక సాయంకాల సమయంలో టెలిఫోన్ కాల్ చేయాలనుకున్నాడు. అతడు ఒక టెలిఫోన్ బూత్‌లోకి వెళ్ళాడు కానీ అది తన దేశంలో ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉంది. చీకటి కావస్తుండడంతో అతనికి డైరెక్టరీలో నంబరు చూడడం ఇబ్బందిగా మారింది. పైన సీలింగుకు ఉన్న లైటు గమనించాడు కానీ దానిని ఎలా ఆన్ చేయాలో అతనికి తెలియలేదు. మసక వెలుతురులోనే నెంబరు వెతుక్కోవడానికి మళ్లీ ప్రయత్నిస్తుండగా అటువైపు వెళ్తున్న ఒకరు అతని పరిస్థితిని గమనించి, “సార్, మీరు లైట్ వేయాలంటే, తలుపు మూసివేయాలి” అని చెప్పాడు. అతడు తలుపు మూసేసరికి ఆశ్చర్యపోయేలా అది కాంతితో నిండిపోయింది. అతడు వెంటనే నంబరు చూసి కాల్ చేశాడు.
అదేవిధంగా, మనం మన బిజీ జీవితాలకు అడ్డుకట్ట వేయాలి. దేవుడు మన హృదయాలలో తన వెలుగును ప్రకాశింపజేయడానికి ప్రశాంతమైన స్థలంలోకి ప్రవేశించాలి. అయితే చాలామంది క్రైస్తవులు ఈ కీలకమైన క్రైస్తవ క్రమశిక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఈ క్రమశిక్షణను స్థిరంగా అభ్యసించేలా ఈ ప్రచురణ క్రైస్తవులను ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము.
మనం ఈ ప్రశ్నలను చూసే ముందు, ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం కోసం సమయం కేటాయించటం అనేది భగవంతుని నుండి ఆశీర్వాదాలు పొందే సాధనం కాదు, కానీ అది మన మంచి ప్రభువుపై ఆధారపడటానికి మరియు ఆయన పట్ల మనకున్న ప్రేమకు నిదర్శనం. మనం కృప కోసం పనిచేయడం లేదు కాని కృప వలననే చేస్తున్నాము. మరో విధంగా చెప్పాలంటే, మన పాపాల కోసం పశ్చాత్తాపం చెందినప్పుడు మన పాపాల కోసం క్రీస్తు చిందించిన రక్తంలో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుని ముందు నిలబడగలము. కేవలం క్రీస్తుపైన మాత్రమే విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడ్డాము. ధ్యాన సమయం అనేది రక్షణ కలిగించే ఆధ్యాత్మిక క్రమశిక్షణ మాత్రమే కాని రక్షణకు కారణం కాదు. ఇది మనం ప్రభువు నుండి దీవెనలు పొందే మార్గం కూడా కాదు.
అని చెప్పడంతో, ముందుకు వెళ్దాం.
1. ధ్యాన [నిశ్శబ్ద] సమయం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి బైబిలు పఠనంలో [దేవుడు మనతో మాట్లాడటం], ప్రార్థనలో [మనం దేవునితో మాట్లాడటం] దేవునితో ఏకాంతంగా గడిపే రోజువారీ సమయము.
2. ఎవరు ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని గడపాలి?
ప్రతి క్రైస్తవుడు ప్రభువుతో ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని గడపాలి. మనం 1 కొరింథీ 1:9 లో “మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు” అని చదువుతాము. సహవాసము అనే పదానికి పంచుకోవడం లేదా ఉమ్మడిగా కలిగి ఉండటం అని అర్థము. ఇది సన్నిహిత సంబంధాన్ని తెలియచేస్తుంది. ఆది.కా 1-2లో చూసినట్లుగా దేవుడు తనతో సహవాసం చేయడానికి మానవులను సృష్టించారు. ఆదాము చేసి పాపం దేవునితో మన సంబంధాన్ని విచ్ఛిన్నం చేయగా, దేవుడు ఆ విచ్ఛిన్నమైన సంబంధాన్ని క్రీస్తు ద్వారా పునరుద్ధరించారు. ఈ సంబంధం కొనసాగుతున్న సహవాసం ద్వారా పెంపొందించబడుతుంది. సహవాసాన్ని పెంపొందించుకోవడానికి పునరుద్ధరించడానికి ధ్యాన [నిశ్శబ్ద] సమయం ఒక మార్గము.
3. ఎందుకు ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని గడపాలి?
కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:
ఎ. క్రీస్తు గురించి మరింత తెలుసుకోండి: తన జీవితంలోని తరువాతి దశలలో కూడా పౌలు కోరిక ఏమిటంటే, “నేను క్రీస్తును తెలుసుకోవాలనుకుంటున్నాను” [ఫిలిప్పు 3:10]. మనం ఆయన గురించి తెలుసుకోవలసినవన్నీ వెల్లడి చేసే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు క్రీస్తు గురించిన జ్ఞానం పెరుగుతుంది.
బి. మార్గాన్ని వెతకండి: దావీదు ఇలా మొరపెట్టాడు, “4 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. 5 నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను” [కీర్తన 25:4-5]. మనం మంచి కాపరిచే నిరంతరం నడిపించవలసిన గొర్రెలము. మనం ఆయనతో ఏకాంతంగా సమయం గడుపుతున్నప్పుడు ఆయన తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తారు.
సి. విశ్వాసంలో బలపడాలి: క్రైస్తవ జీవితం గులాబీలు పరచిన మంచం కాదు. సవాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. “ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను” అని వ్రాయబడింది [లూకా 5:16]. మన ప్రభువు తండ్రితో ఒంటరిగా ఉండటానికి సమయం కేటాయించినప్పుడు మనం ఈ క్రమశిక్షణను విస్మరించగలమా? క్రైస్తవునికున్న ముగ్గురు శత్రువులు శరీరం, లోకం మరియు సాతాను. ఇవి మన విశ్వాసాన్ని త్రోసిపుచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తునే ఉంటాయి. దేవునితో ఒంటరిగా ఉండడం ద్వారా, మన విశ్వాసంలో బలపడడం ద్వారా మాత్రమే ఈ శక్తివంతమైన కనికరంలేని శత్రువులతో మనం పోరాడగలము!
ఇతర కారణాలనూ చేర్చవచ్చు. కానీ ఈ 3 కారణాలు ఈ భూమిపై మన రోజువారీ జీవనాన్ని బలోపేతం చేయడానికి ప్రభువుతో ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని గడపవలసిన అవసరాన్ని మనకు తెలియచేయడానికి సరిపోతాయి.
4. అర్థవంతమైన ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని ఎలా గడపవచ్చు?
విధేయత లేని జ్ఞానం ఎందుకూ పనికిరాదు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎలా కలిగివుండాలో చూద్దాం. మనం పరిశీలించతగిన అంశాలు మూడు ఉన్నాయి.
ఎ. ఒక క్రమమైన సమయం: విశ్వాసులు ప్రతి ఉదయం రాత్రి ప్రభువుతో సమయం గడపడానికి క్రమమైన సమయాలను నిర్ణయించుకోవాలి. ప్రభువు వైపు చూడకుండా మనం రోజు ప్రారంభించలేము. హడ్సన్ టేలర్ ఉదయకాల ఆరాధన ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, “కచేరీ చేయడానికి ముందే మీ వాయిద్యాలను సరి చేసుకుంటారు కాని ముగిసిన తర్వాత కాదు కదా!” అన్నాడు.
ఉదయకాల ఆరాధన కోసం సమయానికి లేవడానికి సరైన సమయానికి పడుకోవాలి. ప్రభువుతో సమయం గడపడానికి ఉదయాన్నే లేవడానికి మనకు సహాయం చేయమని రాత్రే మనం ప్రార్థించి అడగాలి. ఉదయాన్నే అలారం మోగినప్పుడు లేవాలా వద్దా అని ఆలోచించకుండా వెంటనే లేవాలి. ఉదయమే లేవడానికి జరిగే యుద్ధంలో మొదటి ఐదు సెకన్లలోనే గెలవటమో ఓడిపోవటమో జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ప్రభువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మనం కృషి చేయాలి.
అంతేకాకుండా, మనం రోజును ప్రభువుతోనే ముగించాలి. ఆయన మనల్ని రోజంతా కాపాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన కృతజ్ఞతకు అర్హుడు! అందుకే రాత్రిపూట నిద్రమత్తులో ఆరాధన చేయడం మానుకోవాలి. ప్రభువు మన పూర్తి శ్రద్ధకు అర్హుడు!
ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించుకోవలసి ఉండగా, ప్రతిరోజూ ఉదయం రాత్రి కనీసం 20 నిమిషాలు కేటాయించడానికి ప్రయత్నించాలి. అలాగే కాలం గడిచే కొద్దీ సమాయాన్ని పెంచుకోవచ్చు. ఇంకా, సమయం దొరికినప్పుడెల్లా ప్రభువుతో మాట్లాడడానికి కనీసం కొన్ని నిమిషాలు గడపడానికి ప్రయత్నించాలి. అదనంగా, వారాంతంలో దేవునితో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించవచ్చు.
బి. ఒక క్రమమైన స్థలము: ఎలాంటి అవాంతరాలు లేకుండా దేవునితో మాట్లాడడానికి వ్యక్తిగతమైన సౌకర్యవంతమైన స్థలాన్ని కలిగివుండటం మంచిది [ఉదా. టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోన్ మొదలైనవి]. ప్రభువుతో మన సహవాసం కలిగివుండడానికి ఏకాంతంగా ఉండడం గొప్ప సహాయం చేస్తుంది. అది ఇల్లు కావచ్చు లేదా కారైనా కావచ్చు. స్థలం ఏదైనప్పటికీ, దానిని మన “ఏకాంత గది” అని పిలవడానికి ఒక స్థలాన్ని కనుగొనాలి.
సి. ఒక క్రమమైన పద్దతి: బైబిలు యాదృచ్ఛిక ఆలోచనలతో నిండిన పుస్తకం కాదు. దేవుడు ఒక క్రమపద్ధతిలో తన ప్రత్యక్షతను ఇచ్చారు. కాబట్టి మనం అన్ని లేఖనాలను అధ్యయనం చేయడానికి సహాయపడే స్థిరమైన బైబిలు పఠన ప్రణాళిక సిద్ధం చేసుకుని దానిని అనుసరించాలి. లేఖనాలను అధ్యయనం చేయడంతో పాటు మనం ప్రార్థనలోనూ సమయాన్ని వెచ్చించాలి. ప్రార్థనలో దేవుని స్తుతించడం, పాపాల్ని ఒప్పుకోవడం, కృతజ్ఞతలు చెల్లించడం, వేడుకోవడం వంటివి ఉండాలి.
ఇప్పుడు నాలుగు ప్రశ్నలను క్లుప్తంగా పరిశీలించిన తర్వాత, మనం కొన్ని చివరి అంశాలను పరిశీలిద్దాము.
ఏదైనా ఒక పని అలవాటుగా మారాలంటే దాదాపు 4 వారాల సమయం పడుతుంది. మనం మన ధ్యాన [నిశ్శబ్ద] సమయం విషయంలో స్థిరంగా ఉండాలి; వెంటనే అంటే ఈ రాత్రి లేదా రేపు ఉదయమే ఎందుకు ప్రారంభించకూడదు? మనం ఈ క్రమశిక్షణను పాటిస్తున్నామనే బావన కలిగే వరకూ ఎదురు చూస్తూ ఉంటే, శరీరం [అపవాది] ఆ భావన రాకుండా చూస్తుంది.
నిజమే, క్రైస్తవునికి కొన్నిసార్లు ధ్యాన [నిశ్శబ్ద] సమయాల్లో నిర్జీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, అవి వదులుకోవడానికి కారణాలు కాదు. ఆ సమయాల్లోనే మనం ప్రభువుకు మరింత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఉంది! చాలా మంది వ్యక్తులు [పాస్టర్‌లతో సహా] ధృవీకరించింది ఏమిటి అంటే ఎప్పుడైతే వారి ధ్యాన [నిశ్శబ్ద] సమయం మందగించిందో లేదా ఆగిపోయిదో అప్పుడు వారు పాపంలో పడిపోయారు.
మనం మన జీవితాలను పరిశీలించి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి: మనం పాపంతో పోరాడుతున్నట్లయితే లేదా మన క్రైస్తవ జీవితంలో ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదలను లేదా ఆనందాన్ని అనుభవించకపోతే దానికి మనకు ప్రభువుతో స్థిరమైన ధ్యాన [నిశ్శబ్ద] సమయం లేకపోవడం కారణమా? అలాగైతే, మనం ఈ పాపం గురించి పశ్చాత్తాపపడి వెంటనే మనల్ని మనం సరిదిద్దుకుందాము.
క్రైస్తవ మతంలోకి మారిన మొదటి ఆఫ్రికన్లు వ్యక్తిగత భక్తిలో శ్రద్ధగా చాలా క్రమంగా ఉండేవారు. ప్రతి ఒక్కరికి పొదలో ఒక ప్రత్యేక స్థలం ఉందని నివేదించబడింది, అక్కడ వారు తన హృదయాన్ని దేవునికి ఎదుట కుమ్మరించేవారు. కాలక్రమేణా ఈ ప్రదేశాలకు వెళ్ళే మార్గాలు బాగా అరిగిపోయాయి. ఫలితంగా, ఈ విశ్వాసులలో ఎవరైనా ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినట్లయితే వెంటనే ఇతరులకు స్పష్టంగా కనిపించేది. నిర్లక్ష్యం చేసిన వారితో, “సోదరా, నీ దారిలో గడ్డి పెరుగుతుంది” అని వారు దయతో గుర్తుచేసేవారు.
మన జీవితాలను పరిశీలిద్దాం: మన మార్గాల్లో గడ్డి పెరిగిందా? అలా అయితే, ఇంకా ఆలస్యం కాలేదు. పశ్చాత్తాపపడి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తిరిగి సరైనమార్గంలోకి రావడానికి సహాయం చేయమని ప్రభువును అడుగుదాం. మనం చేసే హృదయపూర్వక మొరను ఆయన వింటారు. మనం సరైనమార్గంలోనికి తిరిగి రావడానికి ఆయనతో మన సహవాసాన్ని ఆస్వాదించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు.
చివరగా, ధ్యాన [నిశ్శబ్ద] సమయం అనేది ఇప్పటికే ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసంలోకి ప్రవేశించిన విమోచించబడిన హృదయానికి ఒక ప్రత్యేక హక్కు, ఆనందం అని గుర్తుంచుకోండి. మన భూసంబంధమైన జీవితమంతా ఈ సహవాసాన్ని అనుభవిద్దాం!