పుకారు అనే పాపము- కొండెమనే పాపము

(English Version: The Sin of Gossip)
అట్లాంటా జర్నల్‌కు క్రీడా పాత్రికేయుడైన మోర్గాను బ్లాకు వ్రాసిన మాటలు:
“ఫిరంగి నుండి పెద్ద శబ్దంతో వచ్చే గుండుకన్నా నేను ప్రాణాంతకమైనవాడిని. నేను చంపకుండా గెలుస్తాను. నేను కుటుంబాలను కూల్చివేస్తాను, హృదయాలను విచ్ఛిన్నం చేస్తాను, జీవితాలను నాశనం చేస్తాను. గాలి రెక్కల మీద నేను ప్రయాణిస్తాను. నన్ను బెదిరించేంత బలం ఏ నిరపరాధిత్వానికి లేదు. నన్ను భయపెట్టేంత స్వచ్ఛత ఏ పవిత్రకి లేదు. నేను సత్యాన్ని లక్ష్యపెట్టను, న్యాయాన్ని గౌరవించను, దిక్కులేనివారి పట్ల దయ చూపించను. నా బాధితులు సముద్రపు ఇసుకలా అసంఖ్యాకంగా ఉన్నారు, వారిలో చాలామంది అమాయకులే. నేను ఎప్పుడూ మర్చిపోను, అరుదుగా క్షమిస్తాను; నా పేరు కొండెము.”
ఇక్కడ కొండెపు మాటకు ఉన్న ప్రాణాంతకమైన శక్తి గురించి ఎంత స్పష్టంగా చెప్పారో కదా! తిరిగి సరిచేయలేనంత నష్టాన్ని కలిగించే శక్తి దీనికుంది.
కొండెము అంటే ఏమిటి?:
ఈ సామెతలో చెప్పబడిన “కొండెము” అనే మాటకు (కొన్ని సార్లు గుసగుసలు అని కూడా అంటారు) అర్థం, ఒకరి గురించి వారి వెనుకాల విమర్శించడం లేదా అపనిందలు వేయడమే. కొన్ని నిఘంటువులలో నిరాధారంగా పుకారు పుట్టించడం అని ఉంటుంది.
ఒకరి వ్యక్తిత్వాన్ని నాశనం చేసి వారిని ప్రతికూలమైన పరిస్థితుల్లోనికి నెట్టివేయడానికి మాట్లాడే మాటలే ఈ కొండెపు మాటలు. ఒకరి గురించి వారి వెనుక ఈ మాటలు మాట్లాడతారు గాని ఎదురుగా మాట్లాడరు. కొండెము ఒకరి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది, వారికున్న పేరు పోగొడుతుంది, అశాంతి కలిగిస్తుంది, ఎన్నో బాంధవ్యాలను చెడగొడుతుంది. కొండెములు చెప్పే నాలుక చేసినంత లోతైన గాయాన్ని కత్తి కూడా చేయలేదు. కాబట్టి ఈ పాపం గురించి బైబిలులో ఎక్కువగా తెలియచేయడంలో ఏ ఆశ్చర్యంలేదు.
కొండెము వలన కలిగే నష్టాలు:
రోమా 1:29లో, అవిశ్వాసి జీవితాన్ని వర్ణించే అనేక పాపాలలో “కొండెము” ఒకటిగా కనిపిస్తుంది. సామెతలు 16:28లో “కొండెగాడు మిత్రభేదము చేయును” అని మనకు జ్ఞాపకం చేయబడింది. లేవి 19:16లో “నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, … నేను యెహోవాను” అనే మాటలతో చాలా ముందుగానే దేవుడు తన ప్రజలకు గట్టిగా హెచ్చరించారు.
తిరిగి సరిచేయలేనంత నష్టాన్ని కలిగించడమే కొండపు మాటలతో ఉన్న ప్రధానమైన సమస్య.
పూర్వకాలంలో ఒక యవ్వనస్థుడు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి, “నేను ఒకరి మీద అపవాదు వేసి పాపం చేశాను. ఇప్పుడు నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు ఆ సాధువు, “నీవు వెళ్ళి పట్టణంలో ఉన్న ప్రతి గుమ్మం ముందు ఒక ఈక పెట్టు” అని చెప్పాడు. ఆ యవ్వనస్థుడు ఆ ప్రకారమే చేసి తాను చేయవలసింది ఇంకా ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి మరలా సాధువు దగ్గరకు వచ్చాడు.
ఆ సాధువు, “నీవు తిరిగి వెళ్ళి ఆ ఈకలన్నిటిని తీసుకురా” అని చెప్పాడు. అందుకు ఆ యవ్వనస్థుడు “అది అసాధ్యం! అవన్ని గాలికి పట్టణమంతా చెదిరిపోయి ఉంటాయి” అన్నాడు. అప్పుడు ఆ సాధువు, “వాటివలెనే నీ అపవాదు మాట సరిచేయడం కూడా అసాధ్యం” అని చెప్పాడు. కొండెపు మాటల ప్రభావం ఆవిధంగా ఉంటుంది.
కొండెపు మాటల నివారణ:
కొండెము అనే సమస్యకు సామెతలు 26:20లో ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే, “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.” కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది అలాగే కొండెపు మాటలు లేనప్పుడు గొడవలు కూడా ఉండవు. కొండెమును ప్రోత్సాహించే వాతావరణంలోనే అది వృద్ధి చెందుతుంది. మనం కొండెపు మాటలు వినడం మానివేస్తే వాటి ఫలితంగా వచ్చే గొడవలు బాంధవ్యాలు విడిపోవడం వంటివి ఉండవు.
కొండెమనే మంట వెలిగించే ఇంధనంగా విశ్వాసులు ఎప్పుడూ ఉండకూడదు. అటువంటి వాతావరణం నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. సామెతలు 26:22లో “పనికిమాలిన మాటలు రుచిగల పదార్ధములవంటివి అవి లోపలి కడుపులోనికి దిగిపోవును” అని చెప్పిన విధంగా, కొండెమనే పాపానికి ఆకర్షణీయమైన శక్తి ఉంది కాబట్టి అలా చేయడం సులభం కాదు. రుచికరమైన ఆహారాన్ని కాదనడం ఎంత కష్టమో ఆసక్తికరమైన వార్త వినకుండా మన చెవులను మూసుకోవడం కూడా అంతే కష్టము!
అయితే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమిటంటే, కొండెమనేది ఒక పాపము. దానికి రెండు మార్గాలు లేవు. మన ప్రభువుకు కొండెమంటే అసహ్యము కాబట్టి కొండెములు వినకుండా వాటికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఇతరుల నోటి నుండి వచ్చేవాటిని మనం అదుపుచేయలేము. అయితే మన చెవిలోనికి వెళ్ళవాటిని మనం నియంత్రించగలము. చెవులు తెరవబడి ఉన్నంతసేపు తెరచి నోరు తెరచినట్లే ఉంటుంది. కాబట్టి కొండెపు మాటలు వినకుండా మన చెవులు మూసుకొనేలా మనం నేర్చుకోవాలి.
కొండెములు చెప్పేవారికి మనం ప్రేమగా మరియు ఖచ్చితంగా తెలిచేయాల్సిన రెండు విషయాలు:
- వారు ఎవరి మీద అయితే అపవాదు వేస్తున్నారో వారి దగ్గరకే వెళ్ళి వారికే నేరుగా సమస్య తెలియచేయమని వారిని ప్రోత్సాహించండి.
- ఇక ముందు కొండెపు మాటలను మన చెవులు వినవు.
కొండెపు మాటలు వినకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో రెండు విషయాలను జ్ఞాపకం పెట్టుకోవడం చాలా సహాయకరంగా ఉంటుంది.
మొదటిది, ఇతరుల పట్ల ప్రేమ లేకపోవడమే ఈ పాపానికి ప్రధానమైన కారణమని మనం గ్రహించాలి. వ్యక్తుల మీద ప్రేమ తగ్గిపోతున్నప్పుడు లేదా పూర్తిగా పోయినప్పుడు వారిలో ఉన్న లోపాలనే మనం చూస్తాము కాబట్టి వారి మీద నిందలు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొండెమనే పాపానికి దూరంగా ఉండాలనే కోరిక మనలో ఉంటే, ఇతరుల పట్ల మనలో ద్వేషం పెరుగకుండ మనల్ని మనం కాపాడుకోవాలి (ఎఫెసి 4:29-32). ఒకవేళ ప్రజలు మనల్నిబాధపెట్టినా,వారి మీద నిందలు వేయడం ద్వారా ప్రతికారం తీర్చుకోవాలని అనుకోవడం కూడా పాపమే అవుతుంది. మీ పనులను సమర్ధించుకోవడానికి ప్రయత్నించడంలో ఫలితం ఉండదు. దేవుడు కొండెములు చెప్పటం పాపం అంటాడు, అంతే!
రెండవది, ఎవరి మీదైనా మనకు ఏదైనా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యక్తి వెనుక మాట్లాడకుండా ఒంటరిగా ఆ విషయం గురించి కొంత సమయం వ్యక్తిగత (బహిరంగంగా కాదు) ప్రార్థనలో గడిపిన తర్వాత వారితోనే నేరుగా మాట్లాడడం చాలా మంచిది. మత్తయి 18:15లో, “నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము;….” అని చెప్పబడింది. ఈ వాక్యం సంఘక్రమశిక్షణకు సంబంధించినదే అయినప్పటికీ, సంఘసభ్యులు కానివారి విషయంలో కూడా అనుసరించతగినది.
ఇది అంత సులభమైన పని కానప్పటికీ, ఈ ఆజ్ఞకు లోబడడానికి కావలసిన శక్తిని కూడా ప్రభువు మనకు ఇస్తారని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎదుటివారు పశ్చాత్తాపపడతారనే నమ్మకంతో ఈ పాపాన్ని వ్యక్తిగతంగా మరియు నేరుగా ఎదుర్కోవడం ద్వారా ఇతరుల వెనుక నిందలు వేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఎవరైనా మన గురించి మన వెనుక మాట్లాడడం మనలో ఎవరికి నచ్చదు. దాని వలన కలిగే బాద మనకు తెలుసు. మరి ఎందుకు మనం ఇతరుల పట్ల అదేవిధంగా చేసేవారిగా ఉంటున్నాము? ఇతరులు మనకు ఏది చేయకూడదని మనం అనుకుంటామో వాటిని మనం ఇతరులకు చేయకూడదు.
కొండెమనే పాపాన్ని తీవ్రంగా పరిగణించి ఈ పాపం నుండి బయటపడాలనే కోరిక మనకున్నట్లైతే ఈ నియమాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. మరి ముఖ్యంగా, మనం ఈ పాపం చేసినట్లేతే ప్రభువు సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపపడాలి. మాటలలో స్వచ్ఛతను కొనసాగించడానికి మనం చేసే ప్రయత్నాలలో మనకు సహాయం చేయమని ఆయనను అడుగుదాము. “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9) అనే బైబిలులోని వాగ్దానంను బట్టి మనం ఆదరణ పొందుదాము. “యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:7) అని దేవుడు వాగ్దానం చేశారు.
ఈ రోజే నూతనంగా ప్రారంభించండి. ఇప్పటి నుండి, పరిశుద్దాత్మ శక్తి మీద ఆధారపడి మన పెదవులు కొండెపు మాటలు మాట్లాడకుండా మన చెవులు కొండెములను వినకుండా ఉండడానికి మనం ప్రతి రోజు ప్రయత్నించాలి. ఈ విషయంలో, “జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను” (1పేతురు 3:10) అనే పేతురు మాటలు మన ఆలోచనలను ప్రభావితం చేయాలి.