పనిచేసే స్థలములో క్రైస్తవుని పాత్ర

(English Version: The Christian’s Role In The Workplace)
యునైటెడ్స్టేట్స్లో TGIF – ధ్యాంకు గాడ్ ఇట్స్ ఫ్రైడే అనే ప్రసిద్ధిచెందిన ఒక రెస్టారెంటు ఉంది. హమ్మయ, ఈ వారం పని అయిపోయిందని అనుకునే సాధారణ వ్యక్తి ఆలోచనావిధానాన్ని ఈ పేరు సూచిస్తుంది. అయితే క్రైస్తవులు కూడా పని గురించి ఇలాంటి ధోరణినే కలిగివుండాలా? క్రైస్తవులు పనిని తప్పనిసరియైన చెడుగా చూడాలా లేక పని దేవుడు ఇచ్చిన బహుమానమని మనం పనిచేసేస్థలంలో కూడా ఆయనను మహిమపరచడానికి చూడాలా? పనికి సంబంధించిన 5 బైబిలు సత్యాలను తెలియచేయడం ద్వారా దేవుని మహిమపరచడంలో పాఠకులకు ఈ సంక్షిప్త వ్యాసం సహాయం చేస్తుంది.
1వ సత్యము – పాపం ఈ లోకంలోనికి రావడానికి ముందే పని ఉంది.
ఈ లోకంలో ఉన్న పాపఫలితమే పని అని చాలామంది తప్పుగా అనుకుంటారు. ఈ లోకంలోనికి పాపం రావడానికి ముందే దేవుడు ఆదామును “ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను” (ఆదికా 2:15). పాపం కారణంగా పని కష్టతరంగా మారింది. “నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు”(ఆదికా 3:17).
పరిపూర్ణమైన లోకంలో (అంటే మానవుల పతనానికి ముందు) పని మానవజీవితంలో ఒక భాగము, అలాగే రాబోయే నూతనలోకంలో కూడా పని మానవజీవితంలో ఒక భాగంగా ఉంటుంది. పనిని ఆశీర్వాదంగా చూడాలి తప్ప శాపంలా కాదు.
2వ సత్యము – పని దేవుని ఆజ్ఞ
1 థెస్సలొ 4:11లో “మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెనని” మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ కాలంలో గ్రీకు సంస్కృతిలో చేతులలో పనిచేయడం అంటే చాలా తక్కువగా చూస్తారు. ఏమైనప్పటికి, బైబిలు నియమాల ప్రకారం చేసే ఏ పనియైనా గౌరవప్రదమైనదే అని బైబిలు తెలియచేస్తుంది. ఒక నిముషం ఆలోచించండి. పని శాపమైతే, దేవుడు తన పిల్లలకు పనిచేయమని అదికూడా తమ చేతులతో పనిచేయమని ఎందుకు ఆజ్ఞాపిస్తారు? ఏమాత్రం చెడుకు ఆస్కారం ఉన్నా దానిని చేయమని దేవుడు ఆజ్ఞాపించరు కదా. దేవుని పిల్లలుగా మనం ప్రతి ఆజ్ఞను గంభీరంగా తీసుకోవాలి, అవి మన సహజమైన కోరికలకు విరుద్ధంగా అనిపించినా సరే!
3వ సత్యము – ఇతరుల మంచి కొరకు పని.
వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను” రెండవ ఆజ్ఞను (మత్తయి 22:39) నెరవేర్చడానికి పని ఒక మార్గము. అవసరంలో ఉన్నవారికి సహాయపడడంలో ఉన్న ప్రాధాన్యతను అనేక బైబిలు ఆజ్ఞలు గట్టిగా చెబుతున్నాయి. అపొకా 20:35లో “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని” ఆజ్ఞ ఇవ్వబడింది. ఎఫెసి 4:28లో “అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను” అని వ్రాయబడినది. సామెతలు 14:31లో “బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు” అని మనకు చెప్పబడింది. అలాగే దేవుడు ధనవంతులకు “సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని” (1తిమోతి 6:18) ఆజ్ఞయిచ్చారు.
అవసరంలో ఉన్నవారు కుటుంబస్థులు, స్నేహితులు లేదా అపరిచితులు ఎవరైనా కావచ్చును. మనం తెలివైన నేతృత్వాన్ని కలిగివుండాలి, అలాగే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే మనం ఆశీర్వదించబడ్డామని ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. డిఎల్ మూడీగారు పనిచేయడానికి సంబంధించిన ఈ సత్యం గురించి చాలా అద్భుతంగా చెప్పారు.
మీరు చేయగలిగినంత మంచిని, చేయగలిగినన్ని విధాలుగా, చేయగలిగినన్ని మార్గాలలో, చేయగలిగినన్ని స్థలాలలో, చేయగలిగినన్ని సమయాలలో, చేయగలిగినంతమందికి చేయగలిగినంతవరకూ చేయండి.
అలాగే మనం ఎక్కడ పనిచేస్తున్నామనే దాని గురించి జాగ్రత్తపడమని “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అనే ఆజ్ఞ మనకి జ్ఞాపకం చేస్తుంది. వ్యక్తుల కుటుంబాల నాశనానికి దారితీసే వస్తువుల పంపిణి లేదా సేవలు అందించే ప్రదేశాలు చట్టబద్దంగా నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు అనే భావన చూపించడానికి సరైనవికావు. అటువంటి ప్రదేశాలలో ఉద్యోగం విశ్వాసులకు అనువైనది కాదు.
ఖచ్చితంగా పాపం జరిగే సంస్థలకు (అంటే వినియోగుదారులకు అబద్ధం చెప్పడం.. వగైరా ) కూడా పనిచేయకూడదు అనే నియమం వర్తిస్తుంది. అవి ఆర్థికంగా లాభకరంగా ఉన్నప్పటికి దేవుని వాక్యానికి అవిధేయత చూపించేలా తొందరచేసే స్థలాలలో విశ్వాసులు ఉద్యోగం చేయకూడదు.
4వ సత్యము – ప్రభువే మనకు నిజమైన యజమాని అని జ్ఞప్తిచేసుకుంటూ పనిచేయాలి.
మీరు కాదు అంటారు; దేవుని వాక్యం అవును అంటుంది. ఎఫెసి 6:5లో “దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి” అని ఆజ్ఞ ఇవ్వబడింది. మనం క్రీస్తుకు లోబడిన విధంగానే మన యజమానికి లోబడాలి.
యజమాని గమనిస్తున్నప్పుడు అతనిని సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నంగా క్రైస్తవుల పనివిలువలు ఉండకూడదు. “మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించాలి” (ఎఫెసి 6:6) అని చెప్పిన ప్రకారం క్రైస్తవులు ఎల్లప్పుడూ ప్రభువు తమను చూస్తున్నారని, అంతిమంగా తాము సేవచేసేది ఆయనకేనని జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడూ తమ యజామానులకు లోబడివుంటూ, మంచిగా పనిచేయాలి. పౌలు ఇంకా ఏమిచెప్పాడంటే, “7మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. 8దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు(ఎఫెసి 6:7-8).” ఆ కారణంగానే యజమాని ఇచ్చే గుర్తింపుపై ఆధారపడి విశ్వాసుల పనివిలువలు ఉండకూడదు.
తమ పనికి గుర్తింపు లభించకపోతే చాలామంది ఆవేశపడతారు, కష్టపడి పనిచేయడం మానేస్తారు. అభినందనలు లేవు, బోనస్సులేదు, మెచ్చుకోలు లేదు, ఇక నేనెందు చేయాలి? అనే ధోరణి అనేకమందిలో ఉంటుంది. దేవుడే నిజమైన బాసు అయితే (ఆయనే), ఒక రోజు ఖచ్చితంగా ఆయన విశ్వాసులకు బహుమానం ఇస్తారు. అదే ఆయన వాగ్దానము, పనిచేయడానికి ప్రేరణ ఇచ్చేది కూడా అదే అంతేకాని మానవుల గుర్తింపుకాదు. మన బాసుకాని ఇతరులు కాని మన ప్రవర్తనని ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి.
ప్రభువే మనకు నిజమైన బాసు అన్నట్లుగానే మనం ఎల్లప్పడూ పనిచేయాలి. ప్రభువుకు మనం ఎలా లోబడతామో అలాగే లోబడాలి. ఇది వినయం యొక్క స్ఫూర్తిని తెలియచేస్తుంది. అయితే, లేఖనాలకు విరుద్ధమైనవాటిని చేయమని మన బాసు మనతో చెబితే, అలాంటప్పుడు మనం మానవ బాసుకు లోబడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా దేవునికే లోబడాలి. ఎందుకంటే “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” (అపొకా 5:29).
మనకు క్రైస్తవుడైన బాసు ఉంటే, 1 తిమోతి 6:2లో చెప్పినదానిని అనుసరించాలి, “విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.”
క్రైస్తవులు మంచి ఉద్యోగులుగా ఉండంతో పాటుగా మంచి యజమానులుగాను ఉండాలి. ఎఫెసి 6:9లో “యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి” అని వ్రాయబడింది. క్రైస్తవులైన ఉద్యోగులు క్రీస్తును గౌరవించినట్లుగానే తమ యజమానులను గౌరవించాలి. క్రైస్తవులైన యజమానులు కూడా అలాగే చేయాలి. వారిని బెదిరించకూడదు ప్రయోజనాలకోసం వాడుకోకూడదు. ప్రభువు ఎవరిపట్ల పక్షపాతం చూపలేదు కాబట్టి వారుకూడా ఎవరిపట్ల పక్షపాతం చూపకూడదు.
ప్రభువే మనకు నిజమైన బాసు అని గ్రహించినప్పుడు క్రైస్తవులు కేవలం జీతం కొరకు మాత్రమే పనిచేయరు, వారు పనిని చూసే విధానం కూడా మారుతుంది. పని భారంగా మారదు కానీ దేవునికి మహిమ కలిగించే ఒక ఆశీర్వాదంగా మరియు అద్భుతమైన సాధనంగా పరిగణించబడుతుంది.
5వ సత్యము – అంతిమంగా దేవుని మహిమపరచడానికి పని ఒక సాధనము.
1 కొరింథి 10:31 లో “మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడని” మనకు చాలా స్పష్టంగా చెప్పబడింది. దీనిని అర్థం చేసుకుంటే క్రైస్తవులు అంతిమంగా దేవుని మహిమపరచడానికి పనిని ఒక సాధనంగా చూడగలుగుతారు. ఆ దృష్టిలేనప్పుడు పని యజమానిగా పనివాడు బానిసగా మారతారు. దీనివలన ఇతర సమస్యలు ఎదురవుతాయి అంటే ధనవంతులు కావాలనే ఆశ, కార్పొరేటు నిచ్చెన ఎక్కాలనే కోరిక, ఈ లోకం ఇచ్చే అత్యుత్తమమైన వాటిని వెతకడం మొదలైనవి.
దీనివలన అత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి నష్టం కలుగుతుంది. (అంటే, వ్యక్తిగత ధ్యానానికి సమయం లేకపోవడం, చర్చిలో ప్రార్థనలకు సమయం లేకపోవడం, సర్దుబాటు స్వభావం రావడం, విజయం కోసం అడ్డదారులు వెతకడం) అందుకనే సామెతలు 23:4లో “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము; నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము” అని మనల్ని హెచ్చరించారు.
కేవలం పని ఒక్కటే ధ్యాసగా పెట్టుకోవద్దని సూటిగా చెప్పబడింది. ఉద్యోగులుగా లేక యజమానులుగా ఎంత విజయం సాధించారనే దానిపై క్రైస్తవుల గుర్తింపు ఆధారపడి ఉండదు కాని, కృపచేత క్రీస్తులో రక్షించబడిన పాపి అనే సత్యంలోనే క్రైస్తవుల గుర్తింపు ఉంది. దేవుడు వారిని అంగీకరించారు ఇదే అన్నిటికన్నా ముఖ్యము.
పనికి సంబంధించిన 5 సత్యాలు ఇవే. ఈ సత్యాలకు జతగా పనిచేయడం గురించి 3 సాధారణమైన నియమాలు ఉన్నాయి.
క్లిష్టమైన పరిస్థితులలో పనిచేయడము. ఒత్తిడితో నిండిన వాతావరణంలో పనిచేయవలసివస్తే దానికి నిరుత్సాహపడకూడదు. మన జీవితంలోని అన్నింటికి దేవుడే సర్వాధికారి. 1 పేతురు 2:18-21 ప్రకారం కొన్నిసార్లు మనం అన్యాయస్థులైన యజమానులను భరించాల్సివుంటుంది. దేవుడు మనల్ని అక్కడ ఉంచారంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది మన ద్వారా వారిలో మార్పు రావడానికైనా కావచ్చు లేదా మనం బలం కోసం ఆయన మీద మరింతగా ఆనుకునేలా ఆ క్లిష్టమైన పరిస్థితుల ద్వారా మనలో మార్పు కోససమైనా కావచ్చును.
ఉద్యోగం మారడము. మరో ఉద్యోగం వెతకడం పాపపంకాదు (1 కొరింథి 7:21). ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచనతో ముందుకుసాగాలి. కొన్ని కష్టమైన ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి:
- నేను ఎందుకు మారాలనుకుంటున్నాను?
- నేను నా యజమానికి లోబడడానికి నా గర్వం అడ్డవచ్చిన కారణంగా నేను మారాలనుకుంటున్నానా?
- మరింత డబ్బు మరిన్ని సౌకర్యాల కోసమా?
- కెరీరులో వ్యక్తిగత విజయం కోసమా?
- ఈ మార్పు వలన నా వ్యక్తిగత మరియు కుటుంబ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందా?
- దేవునికి నేను చేసే పరిచర్యమీద, స్థానికసంఘంలో నా పాత్ర మీద ప్రభావం చూపుతుందా?
- నేను కుటుంబంతో గడిపే సమయం మీద ప్రభావం చూపుతుందా?
ప్రార్థనతో పాటు నిజాయితీగా అటువంటి ప్రశ్నలు వేసుకోవడం ద్వారా మనం ఉద్యోగం మారడం గురించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాము. దేవునికి మహిమ ఎలా కలుగుతుంది మారాలనే నా కోరిక వలన లేదా అక్కడే ఉండడం వలన? అని ఎప్పుడూ ఆలోచించాలి. మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చి ప్రశ్నలు అడిగితే జవాబులు వెంటనే వస్తాయి. ఈ లోకపు విజయాల వెంట పరుగెత్తితే అది ఆత్మీయంగా తీవ్రమైన నాశనానికి దారితీస్తుంది అని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి.
అంతేకాకుండా పదేపదే యజమానుల గురించి చెడుగా మాట్లాడడం, మన పని గురించి సణగడం ఫిర్యాదులు చేయడం వలన దేవునికి మహిమ కలుగదు, అది క్రీస్తును పోలి నడుచుకోవడం కాదు. మనకు ఒక ఉద్యోగం ఉన్నందుకు ఎప్పుడూ కృతజ్ఞత కలిగివుండాలి, ఎంతోమంది ఉద్యోగంలేక బాధపడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక చోట నుండి మరోచోటకు ఉద్యోగం మారినప్పుడు , గతంలో పనిచేసిన కంపెనీ గురించి ప్రతికూలంగా మాట్లాడడం మంచిదికాదు. గతాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళడం చాలామంచిది.
గమనిక: పనిచేసేచోట మనకు ఎదురైన క్లిష్టపరిస్థితుల గురించి చెప్పి ప్రార్థించమని అడగడం, పనిచేసే స్థలాలలో సాధరణంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడడం పాపం కాదు. మనతో సరిగా వ్యవహరించని వారిపట్ల ద్వేషం పెంచుకోవడం పాపం అవుతుంది. మనం పనిచేసే స్థలంలోని ప్రతికూల అంశాల గురించి పదేపదే మాట్లాడడం వలన మనలో పాపపుధోరణి ఏర్పడే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి.
పనిచేసే స్థలంలో సువార్త పరిచర్య: క్రీస్తులో రక్షణ అనుభవం లేనివారందరికి సువార్తను అందించాలని బైబిలులో మనకు ఆజ్ఞాపించబడింది. దానిలో పనిచేసే స్థలంకూడా భాగమే అయితే మనం ఇక్కడ జ్ఞానంకలిగి నడచుకోవాలి. క్రైస్తవులు ఉద్యోగం చేసినందుకు జీతం తీసుకుంటున్నారు కాబట్టి వారి పనిలో సువార్తపరిచర్య జోక్యం ఉండకూడదు. మరోవిధంగా చెప్పాలంటే, పనివేళలలో సువార్తపరిచర్య చేయకూడదు, అలాచేస్తే మన ఉద్యోగబాధ్యతలను నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అప్పుడు క్రీస్తుగురించి చెప్పలేము. అంతేకాకుండా క్రైస్తవుల విశ్వాసపు సాక్ష్యం చెడిపోతుంది. లంచుబ్రేకులలో, పనివేళలు ముగిసిన తర్వాత సువార్తపరిచర్య చేయవచ్చును.
సువార్తను ప్రకటించడంతో పాటు నమ్మకమైన ఉద్యోగులుగా యజమానులగా ఉండడం ద్వారా క్రీస్తు గురించి మరింత శక్తివంతంగా ప్రకటించగలుగుతాము.
చివరి మాటలు.
మనకు బదులుగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి మన పాపాల కోసం సిలువమీద మరణించడం ద్వారా ప్రభువైన యేసుచేసిన పని అన్నింటికన్నా మహోన్నతమైనది. “సమాప్తమైనది” (యోహాను 19:30) అని ఆయన వేసిన విజయపు కేక మన పాపాల కొరకు తగినంత వెల ఆయన చెల్లించారని, ఆయన పునరుత్థానము ఆయన పనిని దేవుడు అంగీకరించారని తెలియచేస్తుంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి పనికి సంబంధించి బైబిలు నియమాల ప్రకారం జీవించడానికి కావలసిన శక్తిని ఆయన నుండి పొందుకోగలము, మరియు ఆయనలో విశ్రాంతి తీసుకోగలము.
లౌకిక రాజ్యంలో కూడా దేవుడు మహిమపరచబడతాడు. కేవలం చర్చి పరిచర్యలో పూర్తి సమయం పనిచేయడం ద్వారా మాత్రమే దేవుడు మహిమపరచబడతారని మనం తప్పుగా నిశ్చయించకూడదు. ప్రతి క్రైస్తవుడూ తాను పిలువబడిన పనిలో దేవునిని మహిమపరచినప్పుడు వారు పరిచర్యలో పూర్తి సమయం పనిచేసేవారే అవుతారు. అది సెక్యులరు జాబు అయినా, ఇంటిని చూసుకుంటూ విశ్వాసం కలిగిన పిల్లలను పెంచడం అయినా, చర్చిలో పరిచర్య చేయడమైనా ఏదైనా కావచ్చు అయితే దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగివుండాలి. మనం అటువంటి వైఖరి కలిగివున్నప్పుడు మనం TGIF అని చెప్పడానికి బదులు TGIM – థ్యాంకు గాడ్ఇట్స్మండే అని సంతోషంగా చెప్పగలుగుతాము.