నీటి బాప్తిస్మం గురించి 6 ప్రశ్నలు – జవాబులు

Posted byTelugu Editor April 25, 2023 Comments:0

(English Version: Water Baptism – 6 Key Questions Asked And Answered )

యేసు క్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడూ ఖచ్చితంగా పాటించవలసిన ప్రాథమిక ఆజ్ఞలు లేదా విధులు  రెండు ఉన్నాయి. మొదటిది నీటి బాప్తిస్మము. రెండవది ప్రభువుబల్లను ఆచరించడము. దానినే ప్రభురాత్రి భోజనమని సంస్కారమని అంటారు. ఇవి రెండూ ఒకదానితో ఒకటి భిన్నమైనవి.  ఎందుకంటే  నీటి బాప్తిస్మం ఒక్కసారే తీసుకోబడుతుంది, ప్రభువు బల్లలో పాల్గొనడం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మొదటి విధి అయిన నీటి బాప్తిస్మం గురించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ముందుగా ఈ చిన్ని వివరణ ఇవ్వడం జరిగింది.

ఒకరు విశ్వాసి అయిన తర్వాత అనగా, తమ పాపాల గురించి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన తర్వాత వారికివ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ నీటి బాప్తిస్మము. ఈ విషయం బైబిలులో స్పష్టంగా ఉన్నప్పటికి సూటిగా ఇవ్వబడిన ఈ ఆజ్ఞ పట్ల చాలా అవిధేయత ఉంది. ఒక బైబిలు బోధకుడు చెప్పిన ప్రకారం, దీనిని పాటించడంలో విఫలమవ్వడానికి ఉన్న ప్రాథమిక కారణాలు ఇలా ఉన్నాయి:

i. అజ్ఞానము:  ఈ ఆజ్ఞ గురించి ప్రజలకు బోధించలేదు కాబట్టి వారు దీనిని స్పష్టంగా అర్థం చేసుకోలేదు.

ii. ఆధ్యాత్మిక గర్వము: చాలా కాలం తర్వాత బహిరంగంగా బాప్తిస్మం పొందడం అనేది అవగాహన లేమిని లేదా ఎక్కువ కాలం అవిధేయతను చూపించడాన్ని సూచిస్తుంది. ఈ అవిధేయతను అంగీకరించడం చాలా వినయపూర్వకమైనది కాని ఆ కారణంగానే చాలా మంది బాప్తిస్మం తీసుకోరు. అయితే దురదృష్టవశాత్తూ ఈ కేటగిరిలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఈ లోకం ఎదుట కాదు కాని తీర్పు దినాన యేసు ప్రభువు ఎదుట సిగ్గుపడతారు. 

iii. సాధారణమైన వైఖరి: చాలామంది బాప్తిస్మాన్ని సాధారణమైన విషయంగా చూస్తారు. అటువంటివారు బాప్తిస్మాన్ని అంతగా వ్యతిరేకించరు కాని వారు దానిని అంత ప్రాముఖ్యమైన దానిగా చూడరు. ఆ వైఖరి ఉన్నవారు, “ఇప్పుడు పరిష్కరించవలసిన అత్యవసరమైన విషయాలు చాలా  ఉన్నాయి. మరొక రోజు నాకు సమయం దొరికినప్పుడు బాప్తిస్మం గురించి ఆలోచిస్తాను” అంటారు.

iv. ఒప్పుకోవడానికి భయము: కొంతమంది తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడతారు, దానికి కారణం వారు తమ జీవితాలలో ఇంకా పాపానికి స్థానమివ్వడమే. బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా తమను తాము వేషధారులుగా చూపించుకుంటున్నామని వారు భావిస్తారు. ప్రజలు (కుటుంబం, సమాజం మొదలైనవారు) ఏమనుకుంటారో అని భయపడేవారు కూడా ఉన్నారు. బాప్తిస్మం కారణంగా కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో ప్రజలు బాప్తిస్మం తీసుకోవడానికి వెనుదీస్తారు.

v. నిజమైన క్రైస్తవులు కాకపోవడము: కొన్ని సందర్భాలలో, వారు ఎంతమాత్రం విశ్వాసులు కారు. వారిలో పరిశుద్ధాత్మ ఉండదు కాబట్టి వారిలో విశ్వాసం లేదు, వారు ఈ ఆజ్ఞకు విధేయత చూపించరు. అయినప్పటికి వారు క్రమం తప్పకుండా సంఘానికి వస్తారు, ప్రభుబల్లలో కూడా పాల్గొంటారు. కాని వారు నిజానికి క్రీస్తు సంబంధులు కారు. 

ప్రజలు బాప్తిస్మం తీసుకోవడానికి వెనుదీయడానికి గల మరిన్ని కారణాలను ఇతరులు జతచేయగలరని నేను ఖచ్చితంగా చెబుతాను. ఏమైనప్పటికి మొదటి కారణం – అజ్ఞానము అనే అంశం గురించి ఈ ప్రచురణలో దృష్టిసారించబడింది. లేఖనాల నుండి ఆరు ప్రాథమికమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం ద్వారా ఈ అంశం మీద ఈ ప్రచురణ స్పష్టమైన వివరణ అందిస్తుంది. ఈ సత్యాలను ప్రార్థనాపూర్వకంగా పరిగణించడం మరియు వాటి ప్రకారం నడచుకోవడం అనేది దీనిని చదువుతున్నవారి బాధ్యత.

మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాము.

1. మనం నీటి బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకోవాలి?

మొదటిగా, మత్తయి 28:19లో “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి” అని వ్రాయబడింది. ఈ వాక్యంలో నామములో అనేది ఏకవచనానే సూచిస్తుంది (నామాలలో అని కాదు). ఈ ఏకవచనము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సమానమనే  భావాన్ని చూపిస్తుంది. ఇది బాప్తిస్మం వద్ద మళ్లీ చెప్పే సూత్రం కాదు. అయితే దీని అర్థం ఏమిటంటే, విశ్వాసి మూడు రూపాలలో ఉన్న ఒకే దేవునితో ఆధ్యాత్మికంగా గుర్తించబడతాడు. 

రెండవది, అపొ.కా 2: 38లో వ్రాయబడిన “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు” అనే ఆజ్ఞ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఆజ్ఞ స్పష్టంగా ఇవ్వబడింది: దానిలో మొదటిది, వ్యక్తిగతంగా మారుమనస్సు పొంది తమ పాపాల గురించి పశ్చాత్తాపపడాలి (సువార్తను విని విశ్వాసంతో దానికి స్పందించిన కారణంగా). రెండవది, వారు ఖచ్చితంగా బాప్తిస్మం పొందుకోవాలి. దాని క్రమం కూడా స్పష్టంగా ఉంది: బాప్తిస్మం నిజమైన పశ్చాత్తాపం మరియు యేసు నందు విశ్వాసాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నీటి బాప్తిస్మాన్ని పొందుకోవాలి ఎందుకంటే అది ఒక ఆజ్ఞ, ఎంపిక కాదు.

2. నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

మారుమనస్సు పొందినప్పుడు అంతర్గ నూతనజన్మకు బహిర్గతంగా కంటికి కనిపించేలా ప్రాతినిథ్యం వహించేదే నీటి బాప్తిస్మము. ఇది అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాన్ని భౌతికంగా తెలియచేస్తుంది.

రోమా 6:3-5లో మనకు తెలియచేయబడిన సత్యాలు “3క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? 4కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. 5మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.” మారుమనస్సు సమయంలో కలిగే ఈ అంతర్గత ఆధ్యాత్మిక వాస్తవాలు నీటి బాప్తిస్మం ద్వారా బహిర్గతంగా వివరించబడతాయి. 

క్రీస్తు మరణం, సమాధి మరియు పునరుత్థానంతో మన ఆధ్యాత్మిక ఏకత్వానికి దృశ్యరూపమే నీటి బాప్తిస్మము. క్రీస్తు మరణించి సజీవంగా లేచిన విధంగానే ఆయనతో ఏకమైన మనము కూడా రాబోయే కాలంలో సజీవంగా లేపబడతామని మనకున్న నిరీక్షణను ఇది సూచిస్తుంది.

3. క్రీస్తు యొక్క నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

క్రీస్తు ఎవరి కోసమైతే సిలువమీద మరణించి తర్వాత సజీవంగా లేపబడతారో ఆ పాపులతో ఆయనకున్న గుర్తింపును బహిరంగంగా తెలియచేసేదే క్రీస్తు యొక్క బాప్తిస్మము (మత్తయి 3:13-17). క్రీస్తు మన పాపాల కోసం సిలువను భరించడం ద్వారా మాత్రమే కాకుండా మనం ఎన్నడు జీవించలేని సంపూర్ణమైన విధేయత కలిగిన జీవితాన్ని జీవించడం ద్వారా యేసు నీతి అంతటిని నెరవేర్చారు(మత్తయి 3:15). నీతి అంతటిని నెరవేర్చించి ఒక్క యేసు మాత్రమే కనుక కేవలం కృప చేతనే రక్షణ కలుగుతుందని నిజమైన బైబిలు సంబంధమైన విశ్వాసం బోధిస్తుంది. మనం చేసిన పనుల ద్వారా మనం రక్షించబడలేదు కాని మనకోసం ఇదంతా చేసిన యేసులో నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే రక్షించబడతాము.

కాబట్టి, యేసు యొక్క నీటి బాప్తిస్మం  అనేది అప్పటికి ఇంకా  నెరవేరని ఆయన మాటలలోని వాస్తవానికి (ఇప్పడు నెరవేర్చబడింది) చిహ్నంగా ఉంది. ఆ వాస్తవం ఏమిటంటే, మనకు బదులుగా ఆయన మరణించడం మరియు ఆయన చేసిన బలియాగాన్ని దేవుడు అంగీకరించాడు అనేదానికి రుజువుగా ఆయన పునరుత్థానం చెందారు.

యేసు బాప్తిస్మం పొందడం ద్వారా తండ్రి యొక్క అన్ని ఆజ్ఞలకు లోబడడంలో ఉన్న ప్రాధాన్యతను చూపించడాన్ని గమనించడం చాలా ఆసక్తికరమైనది. దేనికి లోబడాలి దేనికి లోబడకూడదు అని యేసు ఎంచుకొని ఎంపిక చేసుకోలేదు. తన పరిపూర్ణమైన జీవితంలో భాగంగా ఆయన తన తండ్రి యొక్క అన్ని ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా సంతోషంగా లోబడ్డారు.

4. నీటి బాప్తిస్మం యొక్క క్రమము ఏమిటి?

ఇక్కడే ఎక్కువ గందరగోళం విభేధాలు ఉన్నాయి. బాప్తిస్మక్రమములో చాలా అస్థిరత్వం ఉంది (అంటే ఇది కేవలం ముంచడం ద్వారా మాత్రమే లేదా ఒకరిపై చిలకరించడం ద్వారా మొదలైనవి).  ఏమైనప్పటికి బాప్తిస్మక్రమం గురించి స్పష్టమైన సమాధానం  పొందడానికి ప్రజలు ఎలా బాప్తిస్మం పొందారో బైబిలులోనే మనం చూద్దాము.

క్రొత్తనిబంధనలో, బాప్తిస్మం అనే పదం బాప్టో  మరియు బాప్టైజో అనే రెండు గ్రీకు క్రియాపదాలతో సూచించబడుతుంది. పాత మరియు నూతన నిబంధన  పదనిఘంటువు ప్రకారం బాప్టో  అంటే ముంచుట అని అర్థం, వస్త్రాలకు రంగులు వేసేటప్పడు లేదా నీళ్ళతో నిండివున్న ఒక పాత్రలో మరో పాత్రను ముంచి నీళ్ళు తోడడాన్ని తెలియచేయడానికి గ్రీకులు ఈ పదాన్ని  ఉపయోగిస్తారు. మరో పదం బాప్టైజో అంటే బాప్తిస్మం ఇవ్వడము (పూర్తిగా ముంచడం, లేదా మునగడము) అని అర్థము.  ఇది నూతన నిబంధనలో అనేకసార్లు  కనపడుతుంది.

నూతన నిబంధనలో బాప్టిజం “మునగడం” లేక “ముంచడం”, లేక “మునిగివుండడం” లను సూచిస్తుంది. అలాగే బాప్తిస్మం ఇవ్వడానికి ఒకరిపై నీళ్ళు వేయాలని చెప్పలేదు (అనగా చిలరించడము లేదా నుదిటిపై నీళ్లతో చుక్కలు పెట్టడం కాదు). వాక్యభాగాలలో నీటిలో బాప్తిస్మం తీసుకున్నారు అని ప్రతిసారి చెప్పబడింది.

నీటిలో మునగడం ద్వారానే ప్రభువైన యేసు బాప్తిస్మం పొందారు. మత్తయి 3:16లో “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను” అని మనం చదువుతాము. “నీళ్ల నుండి బయటకు వచ్చారు” అనేది ఆయన నీటిలో మునగడం ద్వారా బాప్తిస్మం పొందారని అది కూడా ఆయన వయస్సుకు వచ్చిన తర్వాతనే అని తెలియచేస్తుంది. 

బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మం పొందినవారు  యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు (మత్తయి 3:6). యోహాను 3:23 నీటలో ముంచడం ద్వారా యోహాను బాప్తిస్మం ఇచ్చాడని తెలియచేస్తుంది. అక్కడ మనం సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో యోహాను కూడ బాప్తిస్మం ఇస్తున్నాడు, నీరు సమృద్ధిగా ఉండేది కనుక ప్రజలు వచ్చి బాప్తిస్మాన్ని పొందుకొనేవారు అని చదువుతాము. ముంచడం ద్వారా కాకుండా మరో విధంగా బాప్తిస్మం పొందాలంటే నీరు సమృద్ధిగా ఉండవలసిన అవసరం లేదు.

ఆది సంఘంలో కూడా ముంచడం ద్వారానే బాప్తిస్మం పొందేవారు. అపొ.కా 8:38 లో, పన్నెండుమంది అపొస్తలులలో ఒక్కడైన ఫిలిప్పు ఐతియొపీయుడైన నపుంసకునికి బాప్తిస్మం ఇవ్వడం గురించి చదువుతాము, ఆ వాక్యం ఏమిటంటే, “వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.”

కొన్ని వచనాలలో చూస్తే, నూతననిబంధనలో ఆచరించిన మునగడము అనేది నీటి బాప్తిస్మం పొందారనడానికి ఉదాహరణ అని ఒప్పుకోవలసి వస్తుంది. మునగడము అనేది రక్షణ సమయంలోని ఆధ్యాత్మిక సత్యం యొక్క వాస్తవికతకు సరిపోతుంది. అంటే విశ్వాసి క్రీస్తుతో  పాటు మునుగుతారు, ముఖ్యంగా ఆయన మరణము సమాధి చేయబడుటలో మరియు పునరుత్థానంలో ఆయనతో పాటు ఉంటారు.

చిలరించడము లేదా నుదిటిపై నీళ్లతో చుక్కలు పెట్టడం అనేది బైబిలుపరమైన బాప్తిస్మక్రమము కాదు. అది రోమను కాథిలిక్కు సంఘం నుండి పుట్టింది. ఏమైనప్పటికి, రోమను కాథిలిక్కు సంఘంలో 13వ శతాబ్ధం వరకు ముంచడము అనే బాప్తిస్మక్రమమునే పాటించేవారు. దురదృష్టవశాత్తు, తర్వాతి కాలంలో కొన్ని ప్రొటెస్టంటు సంఘాలు రోమను కాథిలిక్కు పద్దతియైన చిలకరింపు పద్దతిని అవలంభించాయి (ప్రెస్బిటేరియను, మెథడిస్టు, లూథరను మొదలైన సంఘాలు).

5. రక్షణతో నీటి బాప్తిస్మానికి ఉన్న సంబంధం ఏమిటి?

రక్షణకు నీటి బాప్తిస్మం అవసరమా? మనం నూతన నిబంధన బోధ అంతటిని చూసినట్లైతే, రక్షణ గురించి ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే, ఒకరు తమ పాపాల కొరకు పశ్చాత్తాపపడి రక్షణ కొరకు యేసువైపు తిరిగినప్పుడు కేవలం కృప వలన, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే  రక్షణ కలుగుతుంది. (మార్కు 1:15; యోహాను 3:16; యోహాను 5:24; అపొ.కా 20:21; రోమా 4:5; రోమా 10:9-13; ఎఫెసి 2:8-9, తీతు 3:5) ప్రభువుగా రక్షకునిగా కేవలం యేసుని నమ్మడం వలన ఒక వ్యక్తి రక్షించబడతాడు. నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా ఒప్పుకోవడం యేసుని నిజంగా నమ్ముతున్నారనే వాస్తవాన్ని నిర్ధారిస్తుంది.

ఏమైనప్పటికి, కొన్ని వాక్యభాగాలలో  రక్షణతో నీటిబాప్తిస్మానికి దగ్గరి సంబంధం ఉంది ఎందుకంటే నిజమైన రక్షణ వలన ఎల్లప్పుడూ విధేయత వస్తుంది. మరియు క్రైస్తవునికి విధేయత యొక్క మొదటి మెట్టు బాప్టిజం పొందడం. అంటే, క్రీస్తులో తమకున్న విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోవడము. అపొస్తలులకార్యములు గ్రంథంలో ఈ ఆజ్ఞకు లోబడిన కొంతమంది గురించి క్రింద ఇవ్వబడింది.

* పెంతెకొస్తు పండుగ రోజున ఆది సంఘం ఏర్పడినది

అపొ.కా 2:41 లో, (పేతురు రక్షణ సందేశం) “కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి” అని చెప్పబడింది.

 రక్షణ సందేశాన్ని అంగీకరించి తర్వాత బాప్తిస్మం తీసుకోవడంలో ఎటువంటి ఆలస్యం జరగలేదని మీరు ఇక్కడ చూడవచ్చును. అదేరోజు వారు బాప్తిస్మం పొందారు.

* ఫిలిప్పు బోధకు సమరయ ప్రజల స్పందన

అపొ.కా 8:12 లో, “అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి” అని చెప్పబడింది.

ఫిలిప్పు బోధించిన సందేశాన్ని అనగా దేవుని రాజ్యసువార్తను మరియు యేసుక్రీస్తు నామమును వారు విశ్వసించిన వెంటనే బాప్తిస్మాన్ని తీసుకున్నారు.

* కొర్నేలీ మరియు అతని కుటుంబము బాప్తిస్మం పొందుట

పేతురు కొర్నేలీ మరియు అతని కుటుంబనికి సువార్తను ప్రకటించినప్పుడు వారు ఆ సువార్తను అంగీకరించిన వెంటనే బాప్తిస్మాన్ని పొందారు. అపొ.కా 10:47-48 లో వారు సువార్తను అంగీకరించారు కనుక వారు బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు.

“47 అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి 48యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.”

* ఫిలిప్పీలో లూదియా మరియు చెరశాల అధికారి బాప్తిస్మాన్ని పొందుట

మనం అపొ.కా 16:14-15 లో దేవుడు లూదియా అనే స్త్రీని ఎలా రక్షించాడు మరియు ఆమె ఎలా బాప్తిస్మాన్ని పొందిందో చూస్తాము.

 “14…ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. 15ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.”

పౌలు సందేశానికి ఆమె స్పందించిన ఆమె బాప్తిస్మం పొందిందని వాక్యంలో స్పష్టంగా ఉంది.

తర్వాత ఇదే అధ్యాయంలో పౌలు చెరశాలలో ఉన్నప్పుడు అతనికి కావలిగా ఉన్న చెరశాల అధికారిని దేవుడు ఎలా రక్షించాడో మరియు సువార్తకు స్పందించిన తర్వాత అతడు ఎలా బాప్తిస్మాన్ని పొందాడో చదువుతాము. ఈ సంఘటన అంతా అపొ.కా 16:16-34 లో వ్రాయబడింది.

మొదట ఆ చెరశాల అధికారి పౌలు సీలలను అడిగాడు,  “వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. 31అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి 32అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.” పౌలు సీలలు అతనికి , అతని ఇంటివారందరికి ప్రభువాక్యాన్ని బోధించారని వాక్యభాగంలో స్పష్టంగా ఉన్నది.

రెండవదిగా,  “33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి” అని చదువుతాము.

వారు బాప్తిస్మం పొందడానికి ముందు వారు నమ్మారని వాక్యభాగంలో లేదని కొందరు అడగవచ్చు. మనం తర్వాతి వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వారు బాప్తిస్మం పొందడానికి ముందే విశ్వసించారనే జవాబు మనకు దొరుకుతుంది. “34మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.” ఈ వాక్యభాగంలో కేవలం చెరశాల అధికారి మాత్రమే కాదు అతడు అతని ఇంటివారందరు దేవుని నమ్ముకున్నారని తెలుస్తుంది.

కాబట్టి, సువార్తను విశ్వాసించిన తర్వాత బాప్తిస్మం పొందారనడానికి మనకు రుజువులు ఉన్నాయి. ముందు వచనాలలో ఈ సంఘటన అర్ధరాత్రి (అపొ.కా16:25) జరిగిందని మనకు చెప్పబడింది. వారు అర్ధరాత్రి బాప్తిస్మం పొందారు. అది పౌలుకు గాని చెరశాల అధికారి కుటుంబానికి ఆటంకం కాలేదు. నిజమైన విశ్వాసం ఎలాంటి ఆలస్యం చేయకుండా ఎల్లప్పుడు దేవుని ఆజ్ఞలను పాటిస్తుంది.

*ఎఫెసులో బాప్తిస్మము

అపొస్తలుల కార్యములు  గ్రంథంలో వ్రాయబడిన చివరి బాప్తిస్మం గురించి 19:1-7లో ఉన్నది. ఎఫెసులో బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులకు పౌలు బోధించాడు. యేసుక్రీస్తు ద్వారా వారు రక్షణ సువార్తను విన్న తర్వాత వారు దానికి స్పందించి నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యమిస్తూ వారు తమ విధేయతను చూపించారు.  “5వారు ఆ మాటలు (అనగా యేసు ద్వారా రక్షణ సువార్తను) విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.” (అపొ.కా 19:5)

ఈ వచనంలో వారు సువార్తను అంగీకరించారని స్పష్టంగా చెప్పనప్పటికి, “ఆ మాటలు విని” అనే పదాలు వారు సువార్తను సానుకూలంగా స్వీకరించారని తెలియచేస్తున్నాయి. కాబట్టి, ప్రజలు సువార్తను విని అంగీకరించిన తర్వాత బాప్తిస్మాన్ని పొందారని మరొకసారి తెలుస్తుంది.

పైన పేర్కొన్న ఐదు ఉదాహరణల నుండి సువార్తను నిజంగా అంగీకరించిన తర్వాతనే బాప్తిస్మం పొందారని స్పష్టంగా తెలుస్తుంది. బాప్తిస్మం ఎవరిని రక్షించనప్పటికి అది రక్షించే నిజమైన విశ్వాసాన్ని అనుసరిస్తుంది. ఇదే రక్షణకు బాప్తిస్మానికి ఉన్న సంబంధము.

6. శిశు బాప్తిస్మము సంగతి ఏమిటి?

ఒకరు బాప్తిస్మాన్ని పొందడానికి ముందు వారు వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడి మరియు క్రీస్తులో విశ్వాసాన్ని ఉంచాలని నూతన నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి శిశు బాప్తిస్మక్రమము అనేది బైబిలు సంబంధమైనది కాదు. ఒక చిన్న బిడ్డ ఎలా పశ్చాత్తాపపడి విశ్వసిస్తాడు? శిశువులకు బాప్తిస్మం ఇవ్వాలనే ఆజ్ఞ కాని, శిశువులు బాప్తిస్మం పొందారని కాని బైబిలులో ఎక్కడా వ్రాయలేదు.

పాత నిబంధనలో సున్నతి ఉన్న ప్రకారమే ఒడంబడిక కుటుంబంలో ఉన్నారు అనడానికి గుర్తుగా క్రొత్త నిబంధనలో శిశు బాప్తిస్మం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తారు. అటువంటి అభిప్రాయంతో ఉన్న సమస్య ఏమిటంటే, దాని గురించి బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు.

మరోవైపు , ఎవరైతే తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి తమ పాపక్షమాపణ కొరకు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మకం ఉంచడం ద్వారా సువార్తను అర్థం చేసుకొని అంగీకరిస్తారో వారు మాత్రమే నీటి బాప్తిస్మం పొందాలని బైబిలులో స్పష్టంగా ఉంది. అలా చేసినవారు పాటించవలసిన మొదటి ఆజ్ఞ మునగడం ద్వారా నీటి బాప్తిస్మం పొందాలి. అది కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా పొందాలి. దీని గురించి లేఖనాలలో ఎన్నో రుజువులు ఉన్నాయని మనం ఈ ప్రచురణలో చూశాము.

ముగింపు మాటలు 

నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను పాఠకులు గమనిస్తారని నేను నమ్ముతున్నాను. సాతాను ఈ సాధారణ సమస్యతో గందరగోళం చేయాలనుకుంటాడు.  ఎందుకు? ఎందుకంటే క్రైస్తవ జీవితం ప్రారంభం నుండి విశ్వాసులు అవిధేయత చూపించాలని సాతాను కోరుకుంటాడు. ఒకవేళ అతడు రక్షణను ఆపలేకపోతే ఈ ప్రప్రథమమైన ఆజ్ఞ విషయమై దేవునికి అవిధేయత చూపించేలా విశ్వాసులను శోధించి వారిని బలహీనపరుస్తాడు.  ఈ విషయంలో విశ్వాసులు అవిధేయత చూపించడానికి అతడు కారణమైతే, మరిన్ని విషయాలలో అవిధేయత చూపించడానికి కారణమవుతాడు. అదే అతని కుట్ర.

అదేవిధంగా, క్రీస్తును వెంబడించడం యొక్క వెలను చెల్లించడానికి నూతన విశ్వాసులు సిద్ధంగా ఉన్నారో లేదో చూడడానికి బాప్తిస్మం ఒక మంచి పరీక్ష.  నీటి బాప్తిస్మం ద్వారా  యేసే ప్రభువని బహిరంగంగా ప్రకటించడానికి  ఒక వ్యక్తి నిరాకరిస్తే ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడలేదని యేసువైపు తిరగలేదనడానికి అవకాశం ఉంది. కాబట్టి మనస్సు నిజంగా మారిందా లేదా అని చూడడానికి అనగా ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడా అతడు నిజంగా మారుమనస్సు పొందాడా పాపాలను విడిచిపెట్టి యేసువైపు తిరిగాడా అని తెలుసుకోడానికి బాప్తిస్మం ఒక అద్భుతమైన పరీక్ష అని రుజువవుతుంది. 

తమ జీవితంలో ముందుగానే బాప్తిస్మం పొందిన కొందరు తాము బాప్తిస్మం పొందడానికి ముందు నిజంగానే పశ్చాత్తాపపడ్డామా యేసులో విశ్వాసం ఉంచామా అని తెలుసుకోడానికి పోరాడుతున్నారు. ఈ పోరాటం సాధారణంగా క్రైస్తవకుటుంబాలలో పుట్టిపెరిగినవారిలో ఉంటుంది. ప్రస్తుతం వారు క్రీస్తును విశ్వసిస్తున్నారని అనగా ఆయనే వారి జీవితాలకు ప్రభువని, తాము ఆయనకు సంబంధించినవారమని వారికి తెలుసు.

అయితే, వారు బాప్తిస్మం పొందిన సమయంలో తమలో నిజమైన పశ్చాత్తాపం మరియు  నమ్మకం ఉన్నాయో లేదో వారికి ఖచ్చితంగా తెలియదు. ఆ అనిశ్చితి వెనుక ఉన్న కారణంగా కొన్ని సంవత్సరాలుగా పాపపు జీవితాన్ని గడిపివుంటారు. ఇప్పుడు యేసు ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల అవిధేయతను భక్తిహీనత అని పిలవడం బదులు ఆ వ్యక్తిని తాను ముందు తీసుకున్న బాప్తిస్మాన్ని అంచనా వేయమని వేడుకుంటాను. ముందు తీసుకున్న బాప్తిస్మంలో నిజమైన రక్షణ ఉండకపోవ్చును. అది ఒక భావోద్వేగమైన నిర్ణయమైనా కుటుంబం నుండి, సంఘం నుండి వచ్చే ఒత్తిడి కారణంగా లేదా స్నేహితులు బాప్తిస్మం పొందారనే కారణంగా తీసుకున్న నిర్ణయమైనా కావచ్చును.

అటువంటి సందర్భాలలో తలెత్తే ప్రశ్న నేను మరలా బాప్తిస్మం పొందాలా? సమాధానం ఏమిటంటే, మీరు కనుక నూతన నిబంధన ప్రకారం అంటే, నిజమైన పశ్చాత్తాపం కలిగి క్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిస్మం పొందకపోతే మీరు మరలా మునగడం ద్వారా బాప్తిస్మాన్ని పొందాలి. మీరు ముందు తీసుకున్న బాప్తిస్మం మునగడం ద్వారా తీసుకున్నప్పటికి దానికి విలువ ఉండదు.

నీటి బాప్తిస్మం అంటే కేవలం నీటిలో మునగడం మాత్రమే కాదని మీరు గమనించాలి. నీటి బాప్తిస్మాన్ని ఒక ఆచారంగా లేదా సంప్రదాయంగా పరిగణించవచ్చును. అయితే, ఈ పవిత్రమైన ఆజ్ఞను నియమించడం మన ప్రభువు యొక్క ఉద్దేశం కాదు. ప్రభువు యొక్క ప్రతి ఆజ్ఞకు సంతోషంగా హృదయమంతటితో లోబడాలి కాని అయిష్టతతో కాదు. 1 సమూయేలు 16:7 లో ప్రభువు సమూయేలుతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” ప్రభువు హృదయన్ని లక్ష్యపెడతారనే ఆలోచన ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మన హృదయ తలంపులు ఆయనకు తెలుసుననే ఆలోచన భయాన్ని కలిగిస్తుంది(ప్రకటన 2:23).

మన విశ్వాసం నిజమైనదైతే మన పశ్చాత్తాపం కూడా వాస్తవమే. అబద్దపు పశ్చాత్తాపం పాపాల వలన కలగే పరిణామాల గురించి భయపడుతుంది అలాగే నిజమైన పశ్చాత్తాపం పాపానికి భయపడుతుంది. పరిశుద్ధదేవునికి వ్యతిరేకమైన పాపాన్ని నిజమైన పశ్చాత్తాపం ద్వేషిస్తుంది. పాపం చెడ్డదని దేవుడు దాని ఉద్దేశాలను ద్వేషిస్తాడని తెలిసిన నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి దానిని విడిచిపెడతాడు. నిజమైన పశ్చాత్తాపం పాపాన్ని వదిలివేస్తుంది మరియు , యేసు వైపు తిరిగి ఆయనకు పూర్తిగా లోబడుతుంది.

ముగింపులో, మీరు చదువుతున్న ఈ ముఖ్యమైన అంశం గురించి  యేసు స్వయంగా చెప్పిన రెండు వచనాలను తెలియచేస్తాను.

లూకా 6:46 “నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు ?”

మత్తయి 10:32-33 “32మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. 33మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” 

ఇవి యేసే స్వయంగా పలికిన శక్తివంతమైన మరియు లోతైన మాటలు. కీర్తనలు 119:60 లో “నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని” అని చెప్పిన కీర్తనాకారుడిని అనుసరించాలని అందరిని నేను ప్రోత్సాహిస్తున్నాను.

ప్రియ పాఠకులారా, మీరు బైబిలును అనుసరించి సరైన రీతిలో బాప్తిస్మం పొందాలనుకుంటే ఆలస్యం చేయకండి. ఏ విశ్వాసి కూడా బాప్తిస్మం పొందడానికి ఆలస్యం చేసినట్లుగాని సరైన సందర్భం కోసం ఎదురు చూసినట్లుగాని నూతన నిబంధనలో ఎక్కడా రుజువులు లేవు. అది వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా జరిగింది.

ఒక్క బాప్తిస్మం విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ప్రతి అంశంలో దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడమే నిజమైన పశ్చాత్తాపం అని జ్ఞాపకం ఉంచుకోండి. బాప్తిస్మం దానికి మంచి ప్రారంభము. నిజమైన పశ్చాత్తాపం తర్వాత నీటి బాప్తిస్మం పొందడమనేది ఒక ఎంపిక కాదు కాని ఎటువంటి ఆలస్యం చేయకుండా పాటించవలసిన ఆజ్ఞ అని జ్ఞాపకం ఉంచుకుందాము.

గర్వం (చాలా కాలం తర్వాత నేను బాప్తిస్మం పొందితే ప్రజలు ఏమి అనుకుంటారు), భయం (నా కుటుంబం ఏమి అంటుంది ఏం చేస్తుంది) లేదా ఏ కారణంగానైనా మీరు యేసుకు విధేయత చూపించకుండా ఉండకండి. ప్రభువైన యేసును కేవలం ఆయనను మాత్రమే సంతోషపరచడానికి ఇది చేయండి. మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కనుక ఆయనకు విధేయత చూపించండి. నిత్యనరకాగ్ని నుండి మిమ్మల్ని తప్పించడానికి సిలువ మీద మీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మీరు సంతోషంగా హృదయపూర్వకంగా తక్షణమే విధేయత చూపించడానికి ఆయన అర్హుడు.

“యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు” (కీర్తనలు 128:1) కనుక మనమందరం ఆయన ఆజ్ఞల ప్రకారం నడచుకునేలా మన ప్రభువు చేయును గాక!

Category

Leave a Comment