నిరుత్సాహాన్ని ఓడించడము

(English version: Defeating Discouragement)
రచయిత జో స్టోవెల్ వ్రాసిన ఎటర్నిటీ అనే పుస్తకం ఒక నిజమైన కథకు సంబంధించింది. డువాన్ స్కాట్ మరియు జానెట్ విల్లిస్ అనే తల్లిదండ్రులకు తొమ్మిదిమంది పిల్లలు. డువాన్ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చికాగో దక్షిణభాగంలో ఉన్న మౌంట్ గ్రీన్వుడ్ పరిసరాల్లో పరిచర్య చేసేవాడు. వారు దేవునికి మరియు కుటుంబానికి అంకితమైన చాలా భక్తి కలిగిన దంపతులు. తమ చుట్టూ ఉన్న నిస్సారమైన ప్రపంచపు దురాశతో చెడిపోకుండా, కుటుంబాన్ని పోషించడానికి సంఘాన్ని పోషించడానికి తమకున్న కొద్ది వనరులతో వారు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు.
ఒకరోజు, స్కాట్, జానెట్‌లు తమ ఆరుగురు పిల్లలతో కలిసి తమ పెద్ద పిల్లలను చూడడానికి నార్త్ నుండి మిల్వాకీకి వెళ్లడానికి క్రొత్త వ్యాను ఎక్కారు. వారు నార్తు వైపు వెళ్తుండగా వారి ముందు ఉన్న ట్రక్కు నుండి ఒక పెద్ద లోహపు ముక్క పడి వారి ఇంధన ట్యాంకు క్రిందిభాగంలో గుచ్చుకోవడంతో గ్యాస్ అంటుకుని వెంటనే వారి వ్యానులో మంటలు వ్యాపించాయి. స్కాట్ మరియు జానెట్ మాత్రమే బయటపడ్డారు కాని ఆ మంటలు వారి ఆరుగురు పిల్లలను కాల్చివేశాయి.
ఇలాంటి సంఘటనలలో మనకు వచ్చే ప్రశ్నలు: వారికే ఎందుకు? అప్పుడే ఎందుకు? దేవుడు వారికి పిల్లలను ఇచ్చి అకస్మాత్తుగా వారిని ఎందుకు తీసుకువెళ్ళిపోతాడు? భక్తిలేని దుర్మార్గులైన తల్లిదండ్రులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, అయినా అలాంటి భక్తిగల తల్లిదండ్రులున్న కుటుంబానికి ఇలా జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తారు? నిజం చెప్పాలంటే, దేవుడు తన ప్రజలకు ఇలా జరగడానికి ఎందుకు అనుమతిస్తాడని మనం ఆశ్చర్యపోతాము. ఇలాంటి సంఘటనలు దేవునిపై మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మన విశ్వాసపు పునాదులను కదిలిస్తాయి.
అయినప్పటికీ, ఈ సమకాలీన ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు తమకు ఇప్పుడు ఉన్నదానికన్నా మెరుగైన మరింత ఆశీర్వాదకరమైన ప్రపంచాన్ని వాగ్దానం చేసిన అసాధారణమైన ప్రభుని సన్నిధిపై మరియు శక్తిపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగివున్నారు. స్కాట్ మరియు జానెట్‌ల దృక్పథం అదే. జానెట్ విల్లిస్ కాలిపోతున్న మినీవాను వైపు తిరిగి చూసి గట్టిగా ఏడ్చినప్పుడు, “ఏడవ వద్దు ! ఏడవ వద్దు !” అని ఆమె భర్త ఆమెను ఓదార్చాడు. అతడు ఈ సమయానికి మించిన అంటే ఈ ప్రపంచాన్ని మించిన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. స్కాట్ ఆమె భుజాన్ని తాకి, “జానెట్, దీని కోసమే మనం సిద్ధపడి ఉన్నాము. అయితే ఇది త్వరగా జరిగిపోయింది, వారు ప్రభువుతో ఉన్నారు” అని మెల్లగా చెప్పాడు.
చికాగో ట్రిబ్యూన్ మొదటి పేజీ కథనంలో ఇలా ప్రచురించింది, “మిల్వాకీ ఏరియా ఆసుపత్రిలో కాలిపోయి కట్టులతో ఇంకా శారీరకమైన బాధతో ఉన్న దంపతులు బుధవారం జరిగిన వార్తా సమావేశంలో అసాధారణమైన దయను, ధైర్యాన్ని ప్రదర్శించి, తమ తొమ్మిదిమంది పిల్లలలో ఆరుగురిని కోల్పోయినప్పటికి నిస్సందేహమైన విశ్వాసం తమని ఎలా నిలబెట్టిందో అందరికి తెలియచేయమని అభ్యర్థించారు.” వార్తా సమావేశంలో స్కాట్, “దేవునికి ఉద్దేశాలున్నాయని కారణాలు ఉన్నాయని నాకు తెలుసు … దేవుడు మాపై మా కుటుంబంపై తన ప్రేమ చూపించాడు. దేవుడు మంచివాడనడంలో మాకు ఏ సందేహం లేదు, అన్నింటిలో మేము ఆయనను స్తుతిస్తాము” అని చెప్పాడు. అంటే స్కాట్ ఈ ప్రపంచానికి మించి ఉన్న వాటితో సన్నిహితంగా ఉన్నాడని స్పష్టమవుతుంది.
రోమా 8:18లో “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” అని చదువుతున్నప్పుడు మనం కూడా అదే విధమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడంలో అపొస్తలుడైన పౌలు మనకు సహాయం చేస్తాడు. “యెంచుచున్నాను” అనే పదానికి పరిగణనలోకి తీసుకోమని లేక లెక్కించమని అర్థము. “శ్రమలు” అనే పదం ఈ ప్రపంచంలో క్రీస్తు కొరకు జీవించడం వలన ఎదురయ్యే అంతర్గత మరియు బాహ్య ఇబ్బందులను సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, పౌలు వాటి గురించి ఆలోచించి ఈ నిర్ధారణకు వచ్చాడు:
రాబోయే మహిమ యొక్క నిశ్చయత మనల్ని ఇప్పుడున్న నిరుత్సాహాల నుండి విముక్తి చేస్తుంది.
పౌలు శ్రమలకు అతీతుడు కాదు. సగటు క్రైస్తవులు ఎన్నడూ ఎదుర్కొనలేని తీవ్రమైన శ్రమలు అతడు ఎదుర్కొన్నాడు. అతని మాటల ప్రకారం ఒక చిన్న జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
“23 వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. 24 యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; 25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. 26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని. 27 ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి. 28 ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. 29 ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?” [2కొరింథీ 11:23-29]
ఎంత పెద్ద జాబితా! అయినప్పటికీ, అతను ఎప్పుడూ సణగలేదు ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, క్రైస్తవ జీవితమంటే పరీక్షలు లేని జీవితమని మనం భావించినప్పుడు, పౌలు యొక్క శ్రమల జాబితాను వాటికి అతని స్పందనను గుర్తుచేసుకుందాము.
యోబు గుర్తున్నాడా? అతడు నిందారహితుడని దేవుడే చెప్పారు. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు [యోబు 1: 1]. అయినప్పటికీ, అతడు చెప్పలేని బాధను అనుభవించాడు. సాతాను చెప్పినట్లు, అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు లేదా తన బాధలను బట్టి దేవుడిని శపించలేదు [యోబు 1: 11]. పౌలువలెనే ఉన్నాడు.
శ్రమలలో ఇంత సానుకూల స్పందన కలిగివుండటానికి యోబు లేక . పౌలు యొక్క రహస్యం ఏమిటి? ఈ ప్రస్తుత జీవితానికి మించిన దృక్పథం వారికి ఉంది. యోబు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా, “25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. 26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. 27 నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను; నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి” [యోబు 19: 25-27].
“పౌలు, నీవు ఇవన్నీ ఎందుకు ఎదుర్కొంటున్నావు? అది విలువైనదేనా?” అని మనం అడిగితే, అతడు ఏమి చెబుతాడంటే, “మనకు ప్రత్యక్షపరచబోయే మహిమమీద నా కన్నులు నిలిపాను. కాబట్టి ఎంతమాత్రం నిరుత్సాహపడకుండా ఇప్పటి శ్రమలను భరిస్తున్నాను.” పౌలు మాట్లాడుతున్న రాబోయే మహిమ ఏమిటి? ఈ రాబోయే మహిమలో భాగంగా రెండు భవిష్యత్తు వాస్తవాలను లేఖనాలు వెల్లడిస్తున్నాయి.
1. మనం యేసువలె తయారవుతాము.
మరో మాటలో చెప్పాలంటే, మనము క్రీస్తు మహిమ శరీరాన్ని పోలిన నూతన మహిమ శరీరాలను కలిగి ఉంటాము. పౌలు స్వయంగా ఫిలిప్పి 3: 20-21 లో ఇలా వ్రాశాడు, “20 మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. 21 సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.”
ఒక రోజు ఈ పాడైపోయే, పాపభరితమైన అనారోగ్యం బారినపడే మన శరీరం ఒక నూతన శరీరంగా మార్చబడుతుంది. ఆ శరీరం పరిపూర్ణమైనది, పాపరహితమైనది నశించనిది. క్రీస్తు తన ప్రజల కోసం తిరిగి వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఆ సమయంలో, మనం ఇకపై పాపం చేయము ఎలాంటి అనారోగ్యం ఉండదు. క్రైస్తవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ సమయాన్ని బైబిలు చివరి రాకడ అని పిలుస్తుంది! అందుకే విశ్వాసులు తాత్కాలిక భూసంబంధమైన బాధల ఫలితంగా నిరుత్సాహానికి గురికాకూడదు.
2. మొత్తం లోకం మార్చబడుతుంది.
క్రైస్తవుడిని మార్చడమే కాదు, భవిష్యత్తులో ఈ లోకమంతా కూడా మార్చబడుతుంది. ప్రకటన 21:1లో భవిష్యత్తులో జరుగబోయేది, “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు” అని చెప్పబడింది. అప్పుడిక బాధ దుఃఖం ఉండదు. కొన్ని వచనాల తర్వాత ఉన్న ఆదరణ మాటలు గమనించండి, “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” [ప్రకటన. 21: 4]
భవిష్యత్తులో మాత్రమే విశ్వాసి అనారోగ్యం, బాధ, దుఃఖం మరణం నుండి పూర్తిగా విడుదల పొందుతాడు. ఆ కొత్త ప్రపంచంలో అన్యాయం ఉండదు ఎందుకంటే అక్కడ “నీతి నివసిస్తుంది” [2 పేతురు 3:13]. ఇప్పుడున్న లోకం తాత్కాలికమైనది, ఒక రోజు దేవుడు దానిని నాశనం చేసినప్పుడు అది అగ్నితో దహించివేయబడుతుంది, దాని స్థానంలో ఒక కొత్త లోకం ఏర్పరచబడుతుంది. [2 పేతురు 3:7,10].
అందువలన, క్రీస్తును పోలి ఉన్నప్పుడు రాబోయే మహిమ పొందుకుంటాము. పాపం, దుఃఖం బాధ లేని కొత్త లోకంలో ఆయనతో కలిసి ఆరాధిస్తాము. అక్కడ శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉంటుంది.
ముగింపు మాటలు.
తాను చనిపోయే ముందు, ప్రముఖ నాస్తికుడు జీన్-పాల్ సార్త్రే తాను నిరాశ భావాలను గట్టిగా ప్రతిఘటించానని, “నేను నిరీక్షణ కలిగి చనిపోతానని నాకు తెలుసు” అని తనకు తాను చెప్పుకున్నానని ప్రకటించి తీవ్ర విషాదంతో, “అయితే ఆ నిరీక్షణకు ఒక పునాది కావాలి” అని చెప్పాడు.
అయితే క్రైస్తవుల నిరీక్షణకు ఒక బలమైన పునాది ఉంది, అది ఖచ్చితమైన దేవుని వాక్యము. క్రైస్తవుల నిరీక్షణ అనేది “నేను లాటరీని గెలుస్తానని ఆశిస్తున్నాను” అనే రకమైన నిరీక్షణ కాదు. ఇది “నాకు ఖచ్చితంగా తెలుసు” అనే నిరీక్షణ. ఇది “ఉండవచ్చు కావచ్చు” అని చెప్పే నిరీక్షణ కాదు.
ఇది పౌలుకు, యోబుకు, స్కాట్ మరియు జానెట్‌లకు ఉన్న నిరీక్షణ. అది మీకు నాకు ఉండాల్సిన నిరీక్షణ. మనం క్రీస్తును పోలి ఉంటామని ఆయన ఒక కొత్త భూమిని సృష్టిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఈ సత్యాలను నిరంతరం ధ్యానం చేస్తున్నప్పుడు, మా నిరీక్షణ బలపడుతుంది [రోమా 15: 4], అప్పుడు మనం కూడా ఇప్పుడున్న జీవితంలోని నిరుత్సాహాలను విజయవంతంగా జయించగలము.
అయితే, ఎవరైనా క్రైస్తవులుగా నటించినా లేదా క్రైస్తవ విశ్వాసాన్ని తిరస్కరించినా వారి భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. దేవుని నిజమైన పిల్లలకు మహిమ ఎదురుచూస్తుండగా, దేవుని పిల్లలు కానివారికి లేదా అవిధేయత పిల్లలకు శాశ్వతమైన బాధలు ఎదురుచూస్తున్నాయి. [ఎఫెసి 5: 6]. వారు దేవుని ఉగ్రతను ఎదుర్కోడానికి లేపబడతారు చివరిగా తీర్పుతీర్చబడి అగ్నిగుండంలో పడవేయబడతారు [ప్రకటన 20: 11-15]. కాబట్టి అలాంటివారు తమ పాపాలు విడిచిపెట్టి ఇప్పుడే క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తుపై ఖచ్చితమైన స్పష్టమైన నిరీక్షణ ఉంటుంది, ఇది వర్తమాన బాధలను సరిగా ఎదుర్కొనేలా చేస్తుంది.
క్రైస్తవులుగా చెప్పుకునే మనం అసాధ్యమని తెలిసినా బాధ లేని జీవితాన్ని ఈ లోకంలో ఎందుకు వెదకుతున్నాము? ఆరోగ్యం, సంపద, అభివృద్ధి ప్రతి క్రైస్తవుడి హక్కుగా ప్రోత్సాహించే తప్పుడు బోధలకు ఎందుకు బలి అవుతున్నాము? అలాంటి తప్పుడు బోధలు లేఖనాలలో స్పష్టంగా ఉన్న బోధలకు విరుద్ధంగా లేవా?
“క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” [2 తిమోతి 3:12] అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు నామం కొరకు అవమానాలు తిరస్కరణలు అనేక బాధలు అనుభవించేవారిని “ధన్యులు” అన్నారు [మత్తయి 5: 10-12]. వారికున్న విశ్వాసం బట్టి ప్రశంసించబడిన పౌలు, యోబు, హెబ్రీ 11: 35-39లో పేర్కొన్న మరికొందరు క్రైస్తవులు అలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు, మనకు శ్రమల నుండి మినహాయింపు ఉండాలని ఎలా అనుకోగలము? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా?
శ్రమలు కలగాలని ప్రార్థించమని నేను సలహా ఇవ్వడంలేదు కానీ మనం సమస్యలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి శ్రమలు అనివార్యమని గ్రహించి మనం వాటిని స్వీకరించాలి [యోబు 5: 7; యోహాను 16:33]. దేవుడు తన పిల్లలకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు [హెబ్రీ 13: 5-6]. ఇక నుండి ఈ సత్యాలను గుర్తుంచుకోవాలని నిశ్చయించుకుందాము.
శ్రమలు అనివార్యమైనవి అవి భవిష్యత్తులో మన కొరకు ఎదురుచూస్తున్న అద్భుతమైన కృపగల ప్రయోజనాలకు చెల్లించే కొంత మూల్యము. సముద్రంవంటి రాబోయే మహిమతో పోలిస్తే మన ప్రస్తుత శ్రమలు ఒక నీటి చుక్కలాంటివి. ఈ సత్యాలను స్వీకరించి సంతోషంగా ముందుకు సాగండి! అలా కాకపోతే మనలో నిరాశ, దుఃఖం పెరిగిపోతాయి. ఇంకా దేవుని పట్ల ఇతరులు పట్ల మొత్తం జీవితం పట్ల ద్వేషం పెరిగిపోతుంది.
నేటికీ కొంతమంది క్రైస్తవులు అలాంటి సానుకూల ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నారు? వారివలన పరలోకం నిజమైనదని, క్రైస్తవులకు రాబోయే మహిమకూడా వాస్తవమైనది తెలుస్తుంది. అదే వారిని ఈ ప్రపంచంలోని విషయాలకు ఆకర్షించబడకుండా చేస్తుంది. ఆ దృక్పథంతోనే స్కాట్ విల్లిస్ “జీవితాన్ని చిన్నగా చూడకూడదని శాశ్వతమైన జీవితాన్ని కలిగిన సుదీర్ఘ దృక్పథాన్ని కలిగివుండాలని జానెట్ మరియు నేను గ్రహించామని” చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, వారు నిత్యత్వమనే కళ్లద్దాలు ద్వారా అనిత్యమైన దానిని చూశారు. అందుకే వారు నిరాశతో కృంగిపోలేదు.
ట్రిబ్యూన్ సంపాదకీయం ఈ పదాలతో ముగించడంలో ఆశ్చర్యపోనవసరం లేదు:
గత వారం స్కాట్ మరియు జానెట్ విల్లిస్ ఎదుర్కొన్న నష్టానికి కేవలం రెండు రకాల స్పందనలు రావడానికి అవకాశం ఉంది. అవి పూర్తిగా నిరాశ లేదా నిస్సందేహమైన విశ్వాసము. విల్లీస్ నిరాశను ఎప్పుడూ ఎంపిక చేసుకోలేదు.
మన కూడా అలాంటి దృక్పథం కలిగివుండాలి కదా?