నిజమైన విజయాన్ని అందించే 3 దైవికమైన అలవాట్లు

(English version: 3 Godly Habits That Lead To True Success!)
పాత నిబంధనలో వర్ణించబడిన ఎజ్రా అనే దైవభక్తి గల వ్యక్తి జీవితం, దేవుడు వివరించిన నిజమైన మరియు శాశ్వతమైన విజయరహస్యాన్ని వివరిస్తుంది. దేవుని వాక్యబోధకుడైన ఎజ్రా 3 దైవిక అలవాట్లు అనుసరించడం వలన తన జీవితంలో (ఎజ్రా 7:9) “తన దేవుని దయగల హస్తాన్ని” (అనగా నిజమైన విజయాన్ని) అనుభవించాడు. ఎజ్రా 7:10లో, “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను” అని చదువుతాము.
3 అలవాట్లను ఆచరించాలని ఎజ్రా హృదయంలో నిశ్చయించుకున్నాడని ఈ వచనం మనకు బోధిస్తుంది:
(1) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం
(2) దేవుని వాక్యాన్ని ఆచరించడం
(3) దేవుని వాక్యాన్ని బోధించడం
దేవుడు తెలియచేసిన నిజమైన విజయాన్ని అనుభవించాలని మనం కూడా కోరుకుంటే వీటిలో ప్రతి ఒక్కదానిని పరిశీలిద్దాము.
అలవాటు # 1. ఎజ్రావలె మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలని మనం హృదయంలో నిశ్చయించుకోవాలి.
“ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి…దృఢనిశ్చయము చేసికొనెను.”
ఎజ్రా తన స్వంత ఆత్మ కోసం దేవుని వాక్యాన్ని [అంటే ధర్మశాస్త్రాన్ని] అధ్యయనం చేయాలని మొట్టమొదటి అలవాటుగా తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు బోధకుడైనప్పటికీ, అతడు కూడా విద్యార్థియే. మనం కూడా, ఎజ్రాలాగే, మన స్వంత ఆత్మల కోసం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. అదే ఆరంభము.
లేఖనాలన్నీ దైవావేశమువలన కలిగాయి, అవి జీవితంలో అన్ని వేళలా ప్రయోజనకరమైనవి (2 తిమో 3 : 16, 17). అన్ని రకాల శోధనలను ప్రభావవంతంగా ఎదుర్కొనగల ఆయుధం లేఖనము (ఎఫెసి 6: 17) కాబట్టి దానిని హృదయంలో ఉంచుకోవాలి (కీర్తన 119 : 11). క్రైస్తవుడు తన అల్మారాలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బైబిళ్ళును ఉంచితే సాతాను పారిపోడు. బైబిలు వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకొని పాటించినప్పుడు మాత్రమే సాతాను పారిపోతాడు.
టీచరు రాలేదని అబ్బాయిలకు పాఠం చెప్పమని ఒక కొత్త పాస్టరుని అడిగారు. అతడు ముందు వారికి ఏమి తెలుసో చూడాలనుకున్నాడు కాబట్టి ఎరికో గోడలు ఎవరు పడగొట్టారని వారిని అడిగాడు. అబ్బాయిలందరూ మేమెవరం చేయలేదని చెప్పడంతో ఆ బోధకుడు వారి అజ్ఞానానికి నివ్వెరపోయడు.
తర్వాత జరిగిన డీకన్ల సమావేశంలో అతడు దీని గురించి చెప్పాడు. “ఎరికో గోడలు ఎవరు పడగొట్టారో వారిలో ఎవరికీ తెలియదు” అని చెప్పి అతను బాధపడ్డాడు. వారందరు నిశ్శబ్దంగా ఉండగా అనుభవజ్ఞుడైన ఒకతను లేచి మాట్లాడుతూ, “పాస్టరుగారు ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. అయితే, ఆ అబ్బాయిలందరూ వాళ్ళు పుట్టినప్పటి నుండి నాకు తెలుసు, వారంతా మంచిపిల్లలు. వారు తమకి తెలియదని చెబితే, నేను వారిని నమ్ముతాను. మరమ్మత్తు మరియు నిర్వహణ నిధి నుండి కొంత డబ్బు తీసుకుని ఆ గోడలను సరిచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాము” అన్నాడు.
ఈ కాలంలో క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది ఇలానే ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో సంఘం బలహీనంగా ఉండటంలో ఏ ఆశ్చర్యం లేదు! మనం బలంగా ఉండాలనుకుంటే బైబిలును మనం బాగా చదవాలి. సమర్థవంతమైన బైబిలు పఠనంలో 3 ప్రాథమిక సూత్రాలను అన్వయించాలి. అవి:
(1) వచనాన్ని చదవడం ( ఇది ఏమి చెబుతుంది?)
(2) వచనాన్ని వివరించడం ( దీని అర్థం ఏమిటి ?)
(3) వచనాన్ని అనుసరించటం (ఇది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది ?)
“ఈ వచనం లేదా భాగం అర్ధం ఏమిటి ?” అని అడిగినప్పుడు, ఆ వాక్యాన్ని మొదట విన్నవారిని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరము. మరో మాటలో చెప్పాలంటే, “దీనిని మొదట ఏ ప్రజలకు వ్రాసారో వారికి అది ఏమి చెబుతుంది?” అనేది ముఖ్యంగా చూడాలి. దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఆ వాక్య వివరణ తప్పుగా ఉంటుంధి. అప్పుడు మనం ఆచరించడం కూడా తప్పుగానే ఆచరిస్తాము.
బైబిలు అధ్యాయనాలు, వ్యాఖ్యానాలు మరియు భక్తులైన బోధకులవంటి సహాయక వనరులతో ప్రభువు తన సంఘాన్ని ఆశీర్వదించారు. అయితే, వనరులను ఉపయోగించుకునే ముందు, మనం మొదట ప్రార్థించి మనం బైబిలు చదివేటప్పుడు దానిని అర్థం చేసుకునేలా మన కళ్ళు తెరవమని పరిశుద్ధాత్మను అడగాలి. ఆ తర్వాత మాత్రమే మనం ఈ ఇతర వనరులను ఉపయోగించడానికి ప్రయత్నించాలి. మరో మాటలో చెప్పాలంటే, మన ఆత్మలతో నేరుగా దేవుని వాక్యం మాట్లాడడం కంటే ఈ వనరులు మనతో మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.
దేవుని వాక్యాన్ని క్రమపద్ధతిలో అధ్యాయనం చేయడానికి కనీసం ఉదయం 15 నిమిషాలు రాత్రి 15 నిమిషాలు కేటాయించడం వలన గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని అధ్యాయనం చేయడానికి 24 గంటల ఉన్న రోజులో 30 నిమిషాలు సులభంగా కేటాయించవచ్చు. ప్రార్థనకు అదనపు సమయం తప్పనిసరిగా ఉండాలి. మనకు ఆసక్తి ఉన్న దానిని చేయడానికి ఎప్పుడూ సమయాన్ని వెదకుతాము. విశ్వాసికి దేవుని వాక్యం మరియు ప్రార్థనయే మొదటి ఆసక్తిగా ఉండాలి కదా?
కాబట్టి, మన జీవితంలో నిజమైన విజయాన్ని కోరుకుంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేద్దాము.
అలవాటు # 2. ఎజ్రా వలె మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆచరించేలా మన హృదయంలో నిశ్చయించుకోవాలి.
“ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును…దృఢనిశ్చయము చేసికొనెను.”
ఎజ్రా తన హృదయంలో నిశ్చయించుకున్న రెండవ అలవాటు ఏమిటంటే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తాను నేర్చుకున్నవాటిని తన జీవితంలో ఆచరణలో పెట్టి వారి ప్రకారం నడుచుకోవడము. మన హృదయాలు కూడా అదే చేయాలి. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దానిని మనమే ఆచరించకపోతే అది ఆత్మవంచన అవుతుంది. “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి” (యాకోబు 1:22). “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” (లూకా 11:28) యేసే స్వయంగా చెప్పారు. తమ పాపాలను చూడలేని గ్రుడ్డివారిగా ఉండి తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని పాటించని ఇతరులను ఖండించడం ఎంత సులభమో ఈ క్రింది ఉదాహరణ తెలియజేస్తుంది.
పాశ్చాత్య దేశంలో ఒక సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు కలప వ్యాపారం చేసేవారు. ఆ పట్టణస్థులు తమ కోసం ఒక చర్చి నిర్మించి దానిలో ఒక పాస్టరుని నియమించారు. ఆయన ఇబ్బందికరమైన ఒక సంఘటన చూసేవరకు ఆయనకు అక్కడ మంచి ఆదరణే లభించింది. తన సంఘసభ్యులలో చాలామంది నది ఒడ్డున కొన్ని దుంగలను పట్టుకోవడం ఆయన చూశాడు. అవి నదికి పైనున్న గ్రామం వారు నదికి దిగువన ఉన్న మరొక గ్రామంలోని వారికి అమ్మిన దుంగలు. ప్రతి దుంగకు ఒక చివరలో దాని యజమాని యొక్క స్టాంపు వేయబడి ఉంటుంది.
తన సంఘసభ్యులు దుంగలు బయటకు లాగి స్టాంపువేయబడిన చివర కోసివేసి వాటిని తమ దుంగలని చెప్పి అమ్మడం చూసి ఆ పాస్టరుకు చాలా బాధ కలిగింది. మరుసటి ఆదివారం, ఆయన పది ఆజ్ఞలలో ఎనిమిదవ ఆజ్ఞ (నిర్గమ 20:15) దొంగిలించవద్దు అనే దానిపై శక్తివంతమైన ఉపన్యాసం సిద్ధం చేసుకుని చెప్పాడు. ఆరాధన ముగింపులో, ఆ సంఘసభ్యులు వరుసగా వస్తూ, అద్భుతమైన సందేశం, చాలా చక్కగా బోధించారని అభినందించారు.
అయితే, మరుసటి వారం ఆ పాస్టరు నది దగ్గర తన సంఘసభ్యులు మరలా దుంగలను దొంగిలించడం చూశాడు. ఇది అతనికి చాలా కష్టం కలిగించింది. కాబట్టి అతడు ఇంటికి వెళ్లి, తరువాతి వారానికి ఒక ఉపన్యాసం సిద్ధపరచుకున్నాడు. అంశం పేరు, “నీ పొరుగువారి దుంగల చివరను నువ్వు కోయకూడదు.” ఆయన అది బోధించిన వెంటనే చర్చి నుండి అతన్ని తొలగించారు.
అలాంటి వేషధారణ నుండి ప్రభువు మనల్ని కాపాడును గాక! మొదట మన ఆత్మలకు ఆపాదించకుండా కేవలం మన పొరుగువారికి మాత్రమే వర్తించేదిగా దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ తీసుకోకూడదు. మనం దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించాలి, “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు” (యెహోషువ 1:8). దేవుని వాక్యాన్ని “ధ్యానించి దానికి లోబడిన ఫలితంగా విజయం” కలుగుతుందని దయచేసి గమనించండి.
కాబట్టి, మన జీవితంలో నిజమైన విజయం కావాలంటే, మన జీవితాల్లో దేవుని మాటను వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.
అలవాటు # 3. ఎజ్రా వలె, మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా బోధించాలని హృదయంలో నిశ్చయించుకోవాలి.
“ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును…దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.”
ఎజ్రా తన హృదయంలో నిశ్చయించుకున్న మూడవ అలవాటు దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడము. మత్తయి 28:20 లేఖనంలో ఉన్న సమస్తాన్ని ఇతరులకు బోధించాలని ప్రతి క్రైస్తవునికి ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రతిఒక్కరూ చర్చిలో అధికారికంగా బోధించడానికి పిలవబడనప్పటికీ, ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఇతరులకు తగిన విధంగా బోధించాలి; తల్లిదండ్రులు పిల్లలకు, పరిణతి చెందిన క్రైస్తవులు నూతన విశ్వాసులకు మొదలైన రీతిలో. మనలో ప్రతి ఒక్కరూ మనకన్నా తక్కువ తెలిసిన వారికి దేవుని వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేయాలి. అవకాశాల కోసం మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, దేవుడు మనకు ద్వారాలు తెరుస్తారు.
కాబట్టి, మన జీవితాల్లో నిజమైన విజయాన్ని కోరుకుంటే, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించాలని హృదయపూర్వకంగా కోరుకుందాము.
ఎజ్రా దేవుని వాక్యాన్ని అధ్యాయనం చేసి, ఆచరించి, ప్రజలకు బోధించాడు. దాని ఫలితంగా అతడు నిజమైన విజయాన్ని అనుభవించాడు. మనం కూడా నిరంతరం ఈ 3 అలవాట్లను అనుసరించాలని మన హృదయంలో నిశ్చయించుకుంటే నిజమైన విజయాన్ని అనుభవించవచ్చు. అలా చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయును గాక!