నరకానికి సంబంధించిన వాస్తవాలు మరియు సలహాలు – 2వ భాగము

Posted byTelugu Editor May 30, 2023 Comments:0

(English version: Hell – Its Realities and Implications – Part 2)

నరకానికి సంబంధించిన వాస్తవాలు మరియు సలహాలు అనే సంపుటిలో ఇది రెండవది మరియు చివరి పోస్ట్. పార్ట్ 1లో మనము  చూసిన నరకానికి సంబంధించిన 4 వాస్తవాలు ఏమిటంటే:

1) నరకం నిజంగానే ఉంది.

2) నిత్యం హింస అనుభవించే స్థలమే నరకం.

3) నరకం అనేది భయంకరమైన దుర్మార్గులు అలాగే మంచివారు కలిసివుండే స్థలము.

4) నరకం అనేది నిరీక్షణ లేని స్థలము.

ఈ భయంకరమైన వాస్తవాల వెలుగులో, పాఠకులకు నేను క్రింద ఇవ్వబడిన 4 సూచనలు ఇవ్వదలచాను. వీటిలో త్రీ సూచనలు క్రైస్తవులకు, 1 సూచన క్రైస్తవేతరులకు.

క్రైస్తవులకు సూచనలు:

1. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.

“నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి?” (మత్తయి 27:46) అని యేసు సిలువమీద ఉండి కేకవేశారు. ఆయన విడువబడ్డారు కనుక దేవుని కృపబట్టి యేసుపై విశ్వాసం ఉంచిన మనం విడువబడము. మరోవిధంగా చెప్పాలంటే, యేసు పొందిన శ్రమల ద్వారా మనం పొందవలసిన ఉగ్రతనంతా ఆయన భరించారు. ఆ భయంకరమైన నరకాన్ని ఎప్పటికీ మనం ఒక్క క్షణమైనా అనుభవించకూడదని ఆయన మరణాన్ని రుచి చూశారు (హెబ్రీ2 :9). పౌలు 1 థెస్సలొ 1:10లో “రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు” అని చెప్పడంలో ఏ ఆశ్చర్యం లేదు.

ఈ సత్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి కదా?  ఈ భూమిమీద మనం అనుకున్న ప్రకారం అన్నీ జరగకపోతే ఫిర్యాదు చేసే హక్కు మనకుందా? మనం అనుభవించే బాధలు చాలా తాత్కాలికమైనవి. వాటిని మనకు పరలోకంలో లభించే నిత్య సంతోషంతో పోల్చి చూడండి.  ఆయన మనలను నిత్యం నరకంలోని బాధల నుండి రక్షించాడు. ఈ లోకంలో మనం అనుభవించే తాత్కాలికమైన బాధలకోసం మనమెందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానివేయాలి? 

ఇకపై ఈ జీవితంలో మనకెదురయ్యే శ్రమలు మనలను సణిగేలా చేసినా నిరాశ కలిగించినా కొంచెంసేపు ఆగి, భయంకరమైన నరకం గురించి, దాని నుండి మనల్ని తప్పించడానికి మనకు బదులుగా సిలువపై యేసు అనుభవించిన శ్రమల గురించి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మనం ఎన్ని శ్రమల మధ్యలో ఉన్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతాము. 

లండన్‌లోని ఒక మిషనరీని ఒక పాత భవనానికి పిలిచారు. అక్కడ ఒక స్త్రీ అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉంది. చల్లగావున్న ఒక చిన్నగదిలో నేలమీద ఆమె పడుకొని ఉంది. ఆ మిషనరీ ఆమెకు సహాయం చేయాలని ఏమైనా కావాలా అని అడిగాడు. అందుకు ఆమె, “నాకు కావలసినవన్ని ఉన్నాయి. నాకు యేసు ఉన్నారు” అన్నది.

అతడు ఆ మాట ఎప్పుడూ మర్చిపోలేదు, అతడు బయటకు వచ్చిన తర్వాత “లండన్ నగరం మధ్యలో పేదల నివాసాలలో ఈ లోకంలో ఉండే సౌకర్యాలు లేకుండా ఒక చిన్నగదిలో కటికనేలమీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఒంటరి స్త్రీ “నాకు యేసు ఉన్నాడు, ఇంకేమి కావాలి?” అనే బంగారు మాట చెప్పింది” అని వ్రాసాడు. ఆ మాటలు విన్న ఒకరు ఆమెకు ఏమైనా ఇవ్వాలని ఒక ప్రపంచప్రసిద్ధి చెందిక షాపుకు వెళ్ళాడు కాని దాని అవసరంలేదు. “నాకు యేసు ఉన్నాడు, ఇంకేమి కావాలి?” అని చెప్పి ఆమె మరణించింది.

2. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధతను వెంబడిస్తూ ఉండాలి.

మనం తరచూ నరకం గురించి ఆలోచించడం వలన పాపానికి దూరంగా ఉంటాము అలాగే పరిశుద్ధతను అనుసరిస్తాము. మత్తయి 5:29-30లో “29నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. 30నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా” అని యేసు చెప్పారు.

యేసు చెప్పినదాని సారాంశం ఏమిటంటే, “విధేయత చూపించడానికి మనం చెల్లించే మూల్యాన్ని నరకానికి దారితీసే అవిధేయతకు చెల్లించే మూల్యంతో పోల్చి చూస్తే అది అంత అధికంగా కనిపించదు. నరకానికి వెళ్లే దారి విశాలంగా ఉంటుంది. అలాగే ఇరుకైన దారి అంటే సంయమనం పాటించే దారి, శ్రమలతో కూడిన దారి నిత్యజీవానికి దారితీస్తుంది. ఈసారి మనకు పాపం చేయాలనిపించినప్పుడు, నరకానికి సంబంధించిన వాస్తవాల గురించి ఆలోచించి పాపం చేయడం విలువలేనిదని గుర్తించుకోండి. పరిశుద్ధతను అనుసరించడమే నిత్యత్వానికి వెల.

3. తప్పిపోయినవారికి ఎల్లప్పుడూ మనం చేరువలో ఉండాలి.

అతిభయంకరమైన నరకానికి సంబంధించి వాస్తవాల గురించి లోతుగా ఆలోచించినప్పుడు తప్పిపోయినవారిపట్ల మన హృదయంలో ప్రేమ కలుగుతుంది. నరకం నిజంగా ఉందని శాశ్వతమైనదని యేసుని అంగీకరించని ప్రజలు నిత్యం బాధించబడడానికి అక్కడికి వెళ్తారని మనం నమ్మితే (నమ్మాలి) తప్పిపోయినవారిగురించి ప్రార్థించి వారికి సువార్త అందించాలనే అధికమైన భారం మన హృదయాలలో ఉండదా? మన ఆలోచనలు సువార్త ప్రచారంపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉండవా? పరిచర్యను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మన డబ్బును వినియోగించడానికి మనం సిద్ధంగా ఉండమా? మనం ఎందుకు శాశ్వతమైన వాటిపై కాకుండా తాత్కాలికమైన వాటిపై మన శక్తిని ఎక్కువగా ఖర్చుచేస్తూ జీవిస్తున్నాము? 

లూకా 16:19-31లో ధనవంతుడు నరకంలో తాను అనుభవిస్తున్న భయంకరమైన బాధలను బట్టి (లూకా 16:27-28) జీవించివున్న తన కుటుంబసభ్యులకు సువార్త అందించాలనే గొప్ప కోరికను కలిగివున్నాడు. నరకం యొక్క వాస్తవాలను తెలుసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరంలేదు కాని నరకం గురించి బైబిలులో తెలియచేసినవాటిని విశ్వాసంతో నమ్మాలి. తప్పిపోయినవారు తమ పాపాలను విడిచిపెట్టి క్రీస్తువైపుకు తిరిగేలా వారికి మనవి చేయడానికి ఈ నమ్మకమే మనకు ప్రేరణ ఇస్తుంది. భయంకరమైన నరకాన్ని తప్పించుకోవడానికి తనవైపు తిరగాలని ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు తెలియచేశాడు. దాని ఒక ఉదాహరణ:

యెహెజ్కేలు 33:11 “11కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.”

అదేవిధంగా, మనం కూడా భయంకరమైన నరకాన్ని తప్పించుకోవడానికి తమ పాపాలను విడిచిపెట్టి, నూతనమైన మనస్సును ఆత్మను పొందాలని దేవుని తరుపున ప్రజలకు మనవి చేయాలి. తిరస్కరించబడతామని మనం భయపడకూడదు. మన అహం గురించి ఆలోచించకూడదు. క్రీస్తును తిరస్కరించడం వలన ప్రజలు నరకంలో ఎదుర్కొనే భయంకరమైన బాధలను మనం గ్రహించాలి. ఆ గ్రహింపు వలన వారిని క్రీస్తులోని రమ్మని ప్రేమపూర్వకంగా అడగడానికి ప్రేరణ పొందుతాము.

మన సంతోషాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే త్యాగపూరితంగా జీవించడం వలన అనేకమందికి సువార్త అందించబడుతుంది. ఎంతోమంది ప్రమాదంలో ఉన్నారు. యేసు యెరుషలేములో ప్రవేశించినప్పుడు ఆయన తప్పిపోయిన పాపుల గురించి ఏడ్చారు దానికి కారణం ఆయన వారిని ప్రేమించడమే ( లూకా 19:41). మనం కూడా అటువంటి ప్రేమనే కలిగివుండాలి. వారి కొరకు ప్రార్థించడం ద్వారా, వారిని సువార్తను అందించడం ద్వారా ఆ ప్రేమను చూపించాలి.

1800కి చెందిన హడ్సన్ టేలరు చైనాకు వెళ్ళిన మొదటి మిషనరీలలో ఒకరు. చైనాకు వెళ్ళేముందు ఆయన వైద్యసహాయకునిగా ఉండేవాడు. ఆయనకు అప్పగించిన మొదటిపని ఏమిటంటే, కాలులో తీవ్రమైన గ్యాంగ్రేనుతో బాధపడుతున్న ఒక వ్యక్తికి సహాయం చేయాలి. అతడు భయంకరమైన కోపిస్టి మరియు నాస్తికుడు. అతనితో ఎవరైనా మీకోసం బైబిలు చదువుతామని చెబితే బయటకు వెళ్ళిపొమ్మని వారిమీద కేకలు వేసేవాడు. ఒకసారి అతనిని చూడడానికి వచ్చిన పాస్టరు ముఖంపై ఉమ్మివేశాడు. అటువంటి వ్యక్తికి రోజు కాలికట్లను మార్చడమే హడ్సన్ పని. హడ్సన్ అతని రక్షణ కొరకు ఎంతో గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. మొదటి కొన్నిరోజులు అతనికి సువార్త బోధించకుండా కేవలం అతని కాలికట్లను జాగ్రత్తగా మార్చడంపైనే దృష్టిపెట్టాడు. అది అతని నొప్పిని ఎంతో తగ్గించింది తద్వార అతడు లోతుగా తాకబడ్డాడు.

అయితే హడ్సన్ టేలరు ఆ వ్యక్తి యొక్క శాశ్వతమైన గమ్యం గురించి ఆలోచించేవాడు. తర్వాతి రోజు కట్టు జాగ్రత్తగా మార్చి గదిలో నుండి బయటకు వెళ్ళపోకుండా అతని మంచం దగ్గర మోకరించి సువార్త చెప్పాడు. అతని ఆత్మ గురించి తనకున్న శ్రద్ధ గురించి చెప్పి, సిలువపై మరణించిన యేసు గురించి, పాపాలనుండి ఆయన అతనిని రక్షిస్తారని చెప్పాడు. అయితే అతనికి కోపం పెరిగిపోయింది కాని ఏమి అనకుండా ప్రక్కకు తిరిగిపోయాడు. హడ్సన్ టేలరు లేచి తన వైద్యపరికరాలు తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంతకాలం ఇలాగే కొనసాగింది. ప్రతిరోజు హడ్సన్  అతని కట్టు జాగ్రత్తగా మార్చి, అతని మంచం దగ్గర మోకరించి యేసు ప్రేమగురించి చెప్పేవాడు. ప్రతిరోజు ఆ వ్యక్తి  ఏమి మాట్లాడకుండా ప్రక్కకు తిరిగిపోయేవాడు. కొంతకాలం తర్వాత నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా? నా మాటల వలన ఈ వ్యక్తి ఇంకా కఠినంగా మారిపోయాడా? అని హడ్సన్ టేలరు ఆలోచించడం మొదలుపెట్టాడు.

చాలా వేదనతో హడ్సన్ టేలరు యేసుగురించి చెప్పడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఆ వ్యక్తికి కట్లు మార్చిన తర్వాత అతని మంచం దగ్గర మోకరించకుండా వెళ్ళిపోవడానికి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. అతడు బయటకు వెళ్ళడానికి ముందు ఆ వ్యక్తివంక చూశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎందుకంటే హడ్సన్ టేలరు అతనికి సువార్త చెప్పడం మొదలుపెట్టినప్పటినుండి తన మంచం దగ్గర మోకరించి యేసు గురించి చెప్పకుండా వెళ్ళిపోవడం ఇదే మొదటిసారి.

గుమ్మం దగ్గర నిలబడ్డ హడ్సన్ టేలరు హృదయం పగిలి ఏడ్వడం మొదలుపెట్టాడు. వెంటనే అతని మంచం దగ్గరకు వెళ్ళి, ”స్నేహితుడా, నీవు విన్నా వినకపోయినా నా హృదయంలో ఉన్న దానిని నీతో ఖచ్చితంగా చెప్పాలి“ అని హృదయమంతటితో యేసుగురించి చెప్పి తనతో కలిసి ప్రార్థించమని అతనిని వేడుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, అలా చేస్తే నీ బాధ తగ్గుతుందంటే నేను నీతో కలిసి ప్రార్తిస్తాను అన్నాడు. వెంటనే హడ్సన్ టేలరు మోకరించి ఆ వ్యక్తి రక్షణ గురించి ప్రార్థించగా దేవుడు జవాబిచ్చాడు. అప్పటి నుండి ఆ వ్యక్తి సువార్త వినడానికి ఆసక్తి కనపరిచాడు, కొన్ని రోజుల తర్వాత క్రీస్తును నమ్మడానికి ప్రార్థించాడు.

ఈ సంఘటన నుండి హడ్సన్ టేలరు నేర్చుకున్న పాఠాలు:

1. నేను  చైనాలో పనిచేసిన తొలి రోజులలో విజయం సాధించడానికి అక్కడి పరిస్థితులు
తరచుగా నిరాశాజనకంగా ఉన్న సమయంలో, నేను ఈ వ్యక్తి యొక్క మార్పిడి గురించి ఆలోచించేవాడిని. అందువలన మనుష్యులు విన్నా వినకపోయినా వారికి దేవుని వాక్యం చెప్పాలని ప్రోత్సహించబడ్డాను.

2. కన్నీళ్ల వచ్చేంతగా ఆత్మల కొరకు మనకు అధికమైన భారం ఉంటే, మనం కోరుకున్న ఫలితాలను మనం తరచుగా చూడాలి. కొన్నిసార్లు మనం ఎవరు మేలు పొందాలనుకుంటామో వారి హృదయ కాఠిన్యం గురించి ఫిర్యాదు చేస్తున్నప్పుడు, మన స్వంత హృదయాల కఠినత్వం మరియు శాశ్వతమైనవాటికి సంబంధించిన ఖచ్చితమైన వాస్తవాల పట్ల మనకున్న అనుమానాలు విజయం సాధించకపోవడానికి నిజమైన కారణం కావచ్చు.

నరకం యొక్క వాస్తవాల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో, అంత ఎక్కువగా మనం తప్పిపోయినవారికి సువార్తను ప్రకటించవలసి ఉంటుంది.

క్రైస్తవేతరులకు సలహాలు:

మీరు ఇంకా క్రైస్తవులు కాకపోతే, కేవలం 1 సందేహం మాత్రమే ఉంటుంది. మీరు రాబోయే ఉగ్రతనుండి పారిపోవాలి (మత్తయి 3:7).  నరకంలోకి వెళ్లడానికి పెద్దగా ఏమి చేయనవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో ఆవిధంగానే జీవించండి. యేసును తిరస్కరిస్తూ ఉండండి. మీ పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి నిరాకరించండి. మీరు నిస్సందేహంగా నరకంలో ఉంటారు.

మిత్రమా, మీకు నిజంగా కావాలసింది అదేనా? మీరు దానిని నమ్మలేదని నరకం  ఉండకుండాపోదు. నరకం నిజమైన ప్రదేశం. ఆ కారణంగానే యేసు లూకా 13:3లో, “మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు” ఆని చెప్పారు. ఈ జీవితం తర్వాత మరలా అవకాశాలు ఉండవు. హెబ్రీ 9:27లో “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” అని వ్రాయబడింది. యేసు తిరిగి వచ్చినప్పుడు, తన ప్రజలను శాశ్వతంగా తనతో ఉండటానికి తీసుకువెళ్తారు అలాగే తనను తిరస్కరించిన వారందరినీ ఆయన తీర్పు తీరుస్తారు. అంతేకాకుండా ఆ సమయంలో, పశ్చాత్తాపం చెందడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. నిర్ణయం తీసుకోవలసిన సమయం ఇదే.

ప్రియమైన మిత్రమా, ఈ కఠినమైన నిజాలు చెప్పడంలో నాకు ఎటువంటి సంతోషం లేదు. కానీ మీరు ఈ హెచ్చరిక మాటలు వినాలి. కాబట్టి, దయచేసి మీ పాపాలు విడిచిపెట్టి విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు తిరగండి, కేవలం ఆయన మాత్రమే పాపాలకు వెల చెల్లించి, తిరిగిలేచారని నమ్మండి. ఈరోజే యేసువద్దకు పరుగెత్తి నరకం నుండి రక్షించబడండి. ఇక ఆటలు ఆడకండి! ఆలస్యం చేయకండి! సాకులు చెప్పకండి! ఈరోజే ఆయన దగ్గరకు రండి! మీ పాపాల కొరకు పశ్చాత్తాపం చెందడానికి యేసుపై విశ్వాసం ఉంచడానికి ఇదే సరైన సమయము. మార్కు 1:15లో యేసు “కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.” మీరు ఎంత పాపం చేసినా సరే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తారు. మీరు ఆయనకు మొరపెడితే ఆయన మీకు కొత్త హృదయాన్ని ఇస్తారు. ఆయన మీలోనికి వచ్చి నివసించడానికి మరియు క్రైస్తవ జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడటానికి పరిశుద్ధాత్మను పంపుతారు. కాబట్టి, దయచేసి ఆలస్యం చేయకండి! రండి!

నరకం యొక్క భయానక విషయాలను గూర్చి విశ్వాసపాత్రుడైన బ్రిటిష్ బోధకుడు చార్లెస్ స్పర్జన్ చెప్పిన ఈ హెచ్చరిక మాటలతో నేను ముగిస్తాను:

మీకు నిజమైన శరీరం ఉన్నట్లుగానే నరకంలో నిజమైన అగ్ని ఉంటుంది,  ఈ భూమిపై మనకు ఉన్న అగ్నిని పోలివుంటుంది; అది మిమ్మల్ని హరించదు కాని హింసిస్తుంది. ఎర్రటి వేడి బొగ్గుల మధ్య ఉంచినా హరించబడని ఆస్బెస్టాస్‌ను మీరు చూసివుంటారు. అదేవిధంగా మీ శరీరం హరించిపోకుండా ఎప్పటికి కాలుతూనే ఉండేలా దేవుడు దానిని సిద్ధం చేస్తాడు. ఎన్నడూ తీవ్రత తగ్గించబడని ఉగ్రమైన మంటలతో మీ నరాలను పచ్చిగా మండించి, గంధకపు జ్వాలల నుండి వచ్చే తీవ్రమైన పొగతో మీ ఊపిరితిత్తులు కాల్చివేయబడి మీ శ్వాస ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మీరు మరణం దయచేయమని కేకలు వేస్తారు, కానీ అది ఎప్పటికీ, ఎన్నటికీ లేదు ఎప్పుడూ రాదు.

Category

Leave a Comment