ధన్యతలు 9వ భాగము- నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు

Posted byTelugu Editor March 19, 2024 Comments:0

(English version: “Blessed Are Those Who Are Persecuted”)

మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ఇక్కడ యేసు ప్రభువు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను యేసు వివరించారు. ఈ వైఖరులను అనుసరించడం అంటే సంస్కృతికి భిన్నంగా ఉండడమే. అందుకే ధన్యతల జీవనశైలిని “సంస్కృతికి భిన్నమైన క్రైస్తవ్యం” అని కూడా వర్ణించవచ్చు.

ఈ ప్రచురణలో, మనం చివరిదైన ఎనిమిదవ వైఖరిని చూస్తాము. అది మనం క్రైస్తవ జీవితాన్ని జీవించడం వల్ల వచ్చే బాధలను ఓపికగా భరించడము. యేసు దీనిని మత్తయి 5:10-12 లో వివరించారు, “10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” 

*******************

కొన్నేళ్ల క్రితం ఇరాక్‌లో ఒక క్రైస్తవురాలైన అమెరికన్ యువతి హత్యకు గురైంది. శరణార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించడం ద్వారా ఇతరులకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్లడమే ఆమె చేసిన నేరము.

ఒక వేళ తనను చంపేస్తే చదవడానికి తన చర్చికి ఆమె ఉత్తరం వ్రాయడం చాలా ఆశ్చర్యము. ఆమె ఏమి రాసిందంటే, “దేవుడు పిలిచినప్పుడు విచారించవలసిన పని లేదు. నేను ఒక ప్రాంతానికి పిలువబడలేదు కాని ఆయన దగ్గరకు పిలవబడ్డాను. దానికి విధేయత చూపడమే నా లక్ష్యం. శ్రమలు ఊహించినవే. ఆయన మహిమే నా బహుమానము. ఆయన మహిమే నా బహుమానము.”

ఆమె తన అంత్యక్రియలకు సంబంధించి తన పాస్టర్‌కి ఈ మాటలు రాసింది: ధైర్యంగా ఉండండి; ప్రాణాలను రక్షించే, జీవితాన్ని మార్చే నిత్యమైన సువార్తను బోధించండి. మన తండ్రిని మహిమపరచి ఘనపరచండి. తనకు ఇష్టమైన కొన్ని లేఖనాల భాగాలను ఆమె పేర్కొంది. వాటిలో ఒకటి 2 కొరింథి 5:15, “జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.”

మరొకటి రోమా ​​​​15:20, “క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి ఆలాగున ప్రకటించితిని.”

ఉత్తరం చివరిలో, “యేసును తెలుసుకోవడం ఆయనను సేవించడం కన్న మించిన ఆనందం లేదు” అని ఆమె వ్రాసింది.

ఆయన మహిమే నా బహుమానము! యేసును తెలుసుకోవడం ఆయనను సేవించడం కన్నా మించిన ఆనందం లేదు! ఆమె ఈ చివరి ధన్యతలోని సారాన్ని గ్రహించిందని ఈ మాటలు వెల్లడించలేదా? దాని ఫలితంగా, విశ్వాసులైన అనేకమంది యేసు అనుచరులవలె ఆమె కూడా విషాదకరంగా తన భూలోక జీవితాన్ని కోల్పోయినప్పటికీ, నిజమైన జీవితాన్ని శాశ్వతత్వంగా పొందడం ద్వారా ఆమె తన జీవితాన్ని ముగించింది. దేవునితో ఉండడంలో, నిత్యం ఆయనను ఆరాధించడంలో ఉన్న ఆనందమనే బహుమానాన్ని ఆమె పొందింది.

శ్రమల వాస్తవము.

ఈ వచనాలలో, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు హింసను ఎదుర్కొంటామని ప్రభువైన యేసు మనకు గుర్తు చేస్తున్నారు. సందర్భానుసారంగా, ఇప్పటివరకు ధన్యతలలో వివరించిన “సంస్కృతికి భిన్నమైన జీవనశైలి” కలిగివున్నప్పుడు తిరస్కారం ఎదుర్కొంటాము. యేసు కలిగివుంటే అని చెప్పలేదు కానీ “కలిగివున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, హింసిస్తారు, మీకు వ్యతిరేకంగా రకరకాల అబద్దాలు చెప్తారని” తెలియచేశారని గమనించండి [మత్తయి 5:11]. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినందుకు తన అనుచరులందరూ వ్యతిరేకత ఎదుర్కోవడానికి కొంత సమయం ముందే ఆయన ఇది చెప్పారు. వారు నివసిస్తున్న ప్రాంతం  లేదా ఎదుర్కొనే పరిస్థితులను బట్టి వ్యతిరేకతలోని తీవ్రత ఆధారపడి ఉంటుంది. అయితే హింస ఎదుర్కోవాలనే వాస్తవం ఇక్కడ నొక్కి చెప్పబడింది.

యేసు చెప్పిన దాని సారాశం ఏమిటంటే, మనం ఆయన  ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు ఈ లోకం, సాతాను మనల్ని హింసించడానికి వెంటాడుతుంది. హింస అనే అంశం ఆహ్లాదకరమైన అంశం కాదు. అయినా యేసును హృదయపూర్వకంగా అనుసరించాలని కోరుకునే వారందరికీ ఇది ఇప్పటికీ ఒక ముఖ్యమైన అంశమే. ఎందుకంటే, యేసు తన పరిచర్యలో ఎంతో నిజాయితీతో, తన అనుచరులు ఎదుర్కొనే హింసకు సంబంధించిన వాస్తవాల గురించి మాట్లాడారు. తనను అనుసరించడానికి ఎంత వెల చెల్లించాలో వారు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు.

మత్తయి 10:22 “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు.”

మార్కు 8:34 “నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను.”

లూకా 14:27 “ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.” 

యోహాను 15:20 “దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.”

హింస ఒక ముఖ్యమైన అంశం కాబట్టి యేసు దాని గురించి పదే పదే చెప్పడం మనం స్పష్టంగా చూస్తాము.

ఈ అంశాన్ని యేసు మాత్రమే కాదు అపొస్తలులు కూడా ముఖ్యమైనదిగా పరిగణించారు.

అపొ కా 14:22 “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.”

2 తిమోతి 3:12 “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.”

1 పేతురు 4:12 “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.”

ప్రకటన గ్రంథంలో కూడా, క్రీస్తు విరోధి అధికారంలోకి వచ్చినప్పుడు విశ్వాసులు తమ విశ్వాసం కోసం విపరీతమైన బాధలు అనుభవిస్తారని యోహాను వ్రాయడం చూస్తాము.

ప్రకటన 13:10 “ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను.”

శ్రమకు కారణము.

దేవుడు మనం ఏదో ఒక స్థాయికి బాధ పడతామని బోధించడమే కాకుండా ఈ బాధకు కారణాన్ని కూడా చెప్పారు. 10వ వచనం గమనిస్తే, ఆయన నీతినిమిత్తము హింసించబడటం” గురించి ఆయన మాట్లాడుతున్నారు. 11 వ వచనం చివరి భాగంలో “నా నిమిత్తం బాధ అనుభవిస్తారని” చెబుతున్నారు. కాబట్టి, “నీతి” అంటే యేసు కోసం, ఆయన ఆజ్ఞలను పాటించడం కోసం జీవించడాన్ని సూచిస్తుంది. అందుకే ఇది మన పాపం వలన వచ్చే శ్రమ కాదు [1 పేతురు 4:15]. పతనమైన ఈ లోకంలో జీవించడం వల్ల ప్రజలందరూ అనుభవించే సాధారణ శ్రమ కూడా కాదు [రోమా 8:20-22]. ఇది ప్రత్యేకించి యేసును అనుసరిస్తున్నందుకు ఎదురయ్యే శ్రమ.

మనం క్రీస్తు కొరకు జీవించినప్పుడు శత్రువు మౌనంగా ఉండడు. చీకటి రాజ్యం మనపై దాడి చేస్తుంది తీవ్రంగా దాడి చేస్తుంది. యోహాను 3:19-20 లో విశ్వాసులు ఎందుకు హింసను అనుభవిస్తారో యేసు చెప్పారు, “వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.” కనిపించని వాటిని కనిపించేలా చేయడమే వెలుగు యొక్క ఉద్దేశ్యము.

క్రైస్తవులు తమ మాటలు, తమ జీవితాల ద్వారా అవిశ్వాసుల పనులను బహిర్గతం చేసినప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటారు. విశ్వాసులు అవమానాలు, హింసలు, అన్ని రకాల చెడును ఎదుర్కొంటారు. హింసించేవారు తమ పనులు మాటల ద్వారా విశ్వాసుల జీవితాలను దుర్భరంగా మార్చడానికి ఎంతవరకైనా వెళ్తారు ఏమైనా చేస్తారు.

శ్రమకు ప్రతిస్పందన.

మనం హింసించబడినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? 12వ వచనంలో యేసు స్పష్టమైన సమాధానం ఇచ్చారు: “సంతోషించి ఆనందించుడి” [మత్తయి 5:12]. సంతోషంతో గంతులు వేయాలని మరో తర్జుమాలో ఉంది. యేసు ఏర్పాటు చేయబోయే రాజ్యంలో త్రియేక దేవునితో ఉంటామనే వాస్తవం బట్టి అపరిమితమైన ఆనందం ప్రతిస్పందనగా ఉండాలి. హింసకు విశ్వాసి యొక్క ప్రతిస్పందన అపరిమితమైన ఆనందమని కొత్త నిబంధన చెప్పడంలో ఏ ఆశ్చర్యం లేదు.

పేతురు  శ్రమలనుభవిస్తున్న విశ్వాసులకు వ్రాస్తూ, “క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి” [1 పేతురు 4:13] అని ఆజ్ఞాపించాడు. “నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” అని యాకోబు మనకు చెబుతున్నాడు [యాకోబు 1:2].

మతనాయకులు అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. యేసు నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి” అని అపొ. కా 5:40-42 లో మనం చూస్తాము. వారు ప్రకటించడం ఆపలేదు. అపొ.కా 16:23-25 లో “వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి…వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి” అని మనం చూస్తాము.

తొలి క్రైస్తవులు తమకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బాధాకరమైన అనుభవాలు ఎదురైనా తమ విశ్వాసాన్ని వదులుకోలేదని పై వచనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. యేసును అనుసరించాలనే పిలుపులో వారు విశ్వాసంగా కొనసాగారు.

అయితే, మన ప్రతిస్పందన దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉండడం విచారకరము. కొన్ని సమయాల్లో, క్రీస్తు పట్ల విధేయత చూపినందుకు మనం భారీ మూల్యం చెల్లించామని భావించడం వల్ల మనం తీవ్రమైన దుఃఖంతో మంచం నుండి లేవలేము. ఇది అవమానం వంటి చిన్నది కావచ్చు కాని మనం చాలా రోజులు బాధపడతాము. అలాంటి ప్రతిస్పందన ఎందుకు? దానికి కొన్ని కారణాలు: మనలో లోకం చాలా ఎక్కువగా ఉండడం; యేసు మాటలను తీవ్రంగా పరిగణించడంలో విఫలమవ్వడం; అహం ఎక్కువగా ఉండడం. అందుకనే “హింస” అనే పదం ప్రస్తావనకు కూడా మనం సరిగ్గా స్పందించడం లేదు.

అయితే, దేవుని రాజ్యంలో జీవించాలని కోరుకునే వారందరికీ కొంతవరకు హింస ఎదుర్కోవడం లేదా మరొక విధమైన శ్రమలు తప్పని సరి అని గుర్తుంచుకోండి [2 తిమో 3:12]. అటువంటి సందర్భాలలో అపరిమితమైన ఆనందం మన ప్రతిస్పందనగా ఉండాలి. కన్నీళ్లు ఉండవచ్చు అవి తరచుగా ఉండవచ్చు. కానీ మనకోసం ఎన్నో దెబ్బలు తిన్నవాని కోసం మనకు దెబ్బలు తగులుతున్నాయని తెలుసుకోవడం వలన లోలోపల కలిగే ఆ గాఢమైన ఆనందాన్ని ఆ కన్నీళ్లు ఆపలేవు. ఆ గ్రహింపు ఉంటే వేదన వలన కలిగే తీవ్రమైన దుఃఖంలో కూడా లోతైన ఆనందం కలుగుతుంది. పౌలు చెప్పినట్లుగా మనం దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారిగా ఉన్నాము” [2 కొరింథి 6:10].

శ్రమలు భరించినందుకు ప్రతిఫలము.

ఈ బాధలన్నిటినీ ఎదుర్కొంటున్నప్పుడు ఎదురయ్యే ప్రశ్న—ప్రయోజనం ఏమిటి? చివరికి నేను ఏమి పొందుతాను? యేసును వెంబడించడంలో చాలా బాధ భరించడం విలువైనదేనా? దానికి యేసు ఇచ్చే సమాధానం చాలా సూటిగా ఉంటుంది: “పరలోక రాజ్యం వారిది కేవలం వారిది మాత్రమే” [మత్తయి 5:10]. 11 వ వచనంలో “పరలోకమందు మీ ఫలము అధికమగును” అని యేసు చెప్పినప్పుడు, 10వ వచనంలో ఉన్న అదే విషయాన్ని ఆయన చెప్పారని నేను నమ్ముతాను.

కష్టాలను అనుభవించడానికి ఇష్టపడే వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. వారు మాత్రమే భవిష్యత్తులో రాబోయే పరలోక రాజ్యంలో తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సమక్షంలో నివసిస్తున్నారు. తమ పాపాలు క్రీస్తు రక్తం ద్వారా కడిగివేయబడినందుకు ఆయనను ఆరాధిస్తారు. అదే బహుమానము! వారు నిజంగా “ధన్యులు” [మత్తయి 5:10]. దేవుని ఆమోదం ఆయన అనుగ్రహం వారిపైనే ఉంటాయి!

నిజానికి, మరో విధంగా చెప్పాలంటే, మొత్తం ధన్యతలన్ని దేవుని రాజ్యంలో జీవించడానికి సంబంధించినవే. యేసు మత్తయి 5:3లో చెప్పిన మొదటి ధన్యతను మత్తయి 5:10 లో చెప్పిన చివరి ధన్యతను గమనిస్తే రెండూ “పరలోక రాజ్యం వారిది” అనే మాటతో ముగుస్తాయి. 3, 10 వచనాల మధ్యలో ఉండే మిగిలిన ధన్యతల్ని పరలోకరాజ్యంలో నివసించడంపై కేంద్రీకరించబడి ఉన్నాయి.

ఈ బహుమానం కొరకు పరుగెత్తడానికి మనల్ని ప్రోత్సహించడానికి మత్తయి 5:12 చివరిలో యేసు “ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి” అని చెప్పారు. పాత నిబంధనలో కూడా ఇది దేవుని ప్రజలకు మాదిరిగా ఉంది. తన స్వంత సోదరుడైన కయీనుచే హింసించబడిన హేబెలుతో మొదలుపెట్టి దేవుని సత్యాన్ని మాట్లాడిన ప్రవక్తలతో సహా దేవుని ప్రజలు ఎప్పుడూ హింసించబడ్డారు.

కాబట్టి యేసు చెప్పేది ఏమిటంటే: ఈ విషయంలో మీరు ఒంటరి కారు, ఈ శ్రమలు క్రొత్తవి కాదు. దేవుని వెంబడించినందుకు ఎప్పుడూ హింస ఎదురవుతూనే ఉంది. కానీ ప్రతిఫలం విలువైనది: నిత్యం త్రియేక దేవునితో జీవించడం. ఆ కారణంగానే తీవ్రమైన శ్రమలలో కూడా గొప్ప ఆనందం కలుగుతుంది.

ముగింపు మాటలు.

కొండమీది ప్రసంగమంతటిలో ఈ ధన్యతలతో సహా యేసు చేసిన బోధలు క్రైస్తవులమని చెప్పుకునే వారందరికీ అద్దంలా ఉపయోగపడతాయి. మనం ఈ ఆదేశాలలో దేనినీ పరిపూర్ణంగా ఉంచలేమనేది సత్యం. యేసు మాత్రమే అది చేశారు! ఆయన చేసిన దానిని బట్టే మనం దేవుని నీతి కలిగివున్నాము!

అయితే, మనం విశ్వాసం ద్వారా యేసుతో ఐక్యమై ఉన్నాం కాబట్టి, మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు. మనల్ని నిరంతరం యేసులాగా మార్చడమే ఆయన పని. కాబట్టి ఈ లక్షణాలు మనలో స్పష్టంగా కనిపించాలి. ఈ రకమైన నీతి ఉన్నచోట తప్పనిసరిగా హింస ఉంటుంది. అది ఇల్లు, కార్యాలయం, పాఠశాల, కళాశాల, సామాజిక సంబంధాలలో లేదా సంఘంలో కూడా యేసును అనుసరించినందుకు మనం తిరస్కారం ఎదుర్కొంటాము. కానీ మనం నిజంగా యేసు అనుచరులమని అది రుజువు చేస్తుంది కాబట్టి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

క్రైస్తవులుగా చెప్పుకునే చాలామంది ఎటువంటి హింసను ఎదుర్కోవడం లేదు ఎందుకంటే వారు ఎక్కువ నీతి  కలిగివుండరు. అక్కడ కేవలం స్వనీతి మాత్రమే ఉంటుంది. అది నిజమైన బైబిలు నీతి కాదు, యేసు ఇక్కడ చెబుతున్న నీతి అనేది ఆయనతో ఐక్యమై ఉండటం వల్ల కలిగే నీతి కలిగిన జీవితాన్ని సూచిస్తుంది. యేసు తన ప్రసంగం చివరలో అలాంటి వారిని ఉద్దేశించి “ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” [మత్తయి 7:21] అన్నారు. ఈ ధన్యతలను అనుసరించిన జీవనశైలి కలిగినివారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారనేదే తండ్రి చిత్తము.

ధన్యతలలోని యేసు మాటలను మరో రకంగా చెప్పాలంటే, ఆత్మవిషయమై దీనులైనవారు, తమ పాపాల గురించి దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు కనికరంగలవారు, హృదయశుద్ధిగలవారు, హింసలను సహించేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి, పాప క్షమాపణ కోసం మీరు నిజంగా యేసు వైపు తిరగకపోతే దయచేసి ఆలస్యం చేయకండి. మీ పాపాలను విడిచిపెట్టి, ఆయన ఇచ్చే పాపక్షమాపణను అంగీకరించినప్పుడు మాత్రమే మీరు ఆయన కోసం శ్రమను అనుభవించే సామర్థ్యంతో సహా ఈ ధన్యతల ప్రకారం జీవనశైలిని అనుసరించే శక్తిని కలిగి ఉంటారు.

అంతిమంగా, విశ్వాసం కోసం శ్రమపడడం విశ్వాసియైన ప్రతి క్రైస్తవుని భాగ్యము. యేసు శ్రమపడ్డారు. పాత మరియు క్రొత్త నిబంధనలలోని విశ్వాసులు శ్రమపడ్డారు. మనలో ఎవరికైనా ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? సాధారణంగా, హింసించబడడమనేది దేవునికి మనపట్ల ఉన్న అసంతృప్తికి సంకేతమని అనుకుంటాము. అందుకే శ్రేయస్సు సువార్త సందేశం ప్రజాదరణ పొందింది!

అయితే అపొస్తలుడైన పౌలు చాలా భిన్నమైన విషయం చెప్పాడు. ఫిలిప్పీ 1:29 లో “క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను” అని మనకు గుర్తుచేస్తున్నాడు. అనుగ్రహింబడెను అనే పదం నుండి దయచేసెను అనే పదం వస్తుంది. దీనికి “బహుమతి” అనే భావం కూడా ఉంది. క్రీస్తుపై నమ్మకం [ఈ వచనంలోని మొదటి భాగం], క్రీస్తు కొరకు శ్రమపడడం [ఈ వచనంలోని రెండవ భాగం] రెండూ దేవుడు తన దయతో మనకు ఇచ్చిన “బహుమతి”. మనం ఎలా ఆయన ఇచ్చిన ఒక బహుమతికి కృతజ్ఞతలు చెప్పి, మరొక బహుమతికి కృతజ్ఞతలు చెప్పడానికి నిరాకరిస్తాము? క్రీస్తును విశ్వసించడమే కాకుండా ఆయన కోసం బాధలు పడడం కూడా ఒక ఆధిక్యతే.

కాబట్టి, అవమానాలు తిరస్కారాలు ఎదుర్కొన్నప్పుడు వాటికి ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” [1 పేతురు 2:23] కనుక మనం మన ప్రభువు అడుగుజాడల్లో నడుద్దాము.

ప్రియమైన పాఠకులారా, మనం ఈ జీవితాన్ని ముగించి యేసు సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన కోసం మనం అనుభవించినవి మరణానికి దారితీసినప్పటికీ, ఆయన మన కోసం అనుభవించిన వాటిలో అవి ఏ మాత్రం సరిపోవని మనం గ్రహిస్తాము. ఆయన తండ్రి సన్నిధిని, పరలోక మహిమను విడిచిపెట్టి భూమికి దిగివచ్చారు. ఆయన భూమిపై ఉన్నప్పుడు చెప్పలేని బాధలు భరించి చివరికి మనం అనుభవించాలస్సిన ఆ అవమానకరమైన మరణాన్ని పొందడానికి సిలువ వేయబడ్డారు. ఆయన మన పాపాల కోసం తండ్రి కోపాన్ని భరించాడు. అలాంటప్పుడు ఆయన కోసం బాధపడటం ఒక గొప్పతనంగా మనం ఎందుకు భావించకూడదు?

కాబట్టి, మనం ఎదుర్కొనే తిరస్కారాలు అవమానాల గురించి ఆలోచించి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. మనం యేసు కోసం జీవించడం వల్లనే బాధపడుతున్నామా? లేక మన పాపపు పనుల ఫలితంగానా? దానికి మొదటిది కారణమైతే అంతిమంగా అది విలువైనదేనని తెలుసుకుని, సంతోషించి ఆనందించి పట్టుదలతో కొనసాగిద్దాం. రెండవది కారణమైతే, మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుని వాటికై పశ్చాత్తాపపడి, వీటిని అధిగమించడానికి మనకు సహాయం చేయమని అడుగుదాము.

ఏ సంకోచం లేదు, తిరోగమనం లేదు, విచారం లేదు

విలియం బోర్డెన్ 1904 లో చికాగోలోని ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతడు బోర్డెన్ డైరీ ఎస్టేట్ వారసుడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు అతనికి ప్రపంచయాత్ర  బహుమతిగా లభించింది. అతనికి ఈ బహుమతి ఇచ్చిన వ్యక్తులకు ఈ బహుమతి అతని జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో తెలియదు.

విలియం పర్యటనలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌర్భాగ్యుల కొరకు, క్రీస్తు అవసరం ఉన్నవారి కొరకు అతనిలో భారం కలిగింది. అతడు మిషనరీగా క్రీస్తు సేవలో తన జీవితాన్ని అంకితం చేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ ఇంటికి ఉత్తరం వ్రాసాడు. అతని స్నేహితులు మరియు బంధువులు దానిని విశ్వసించనప్పటికీ, బార్డెన్ తన బైబిల్ చివరి పేజీలో సంకోచం లేదు అనే రెండు పదాలను రాశాడు.

అతడు అమెరికాకు తిరిగి వచ్చి యేల్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అతడు ఒక ఆదర్శ విద్యార్థి. కళాశాల జీవితం మిషన్ ఫీల్డ్ పట్ల విలియంకున్న కోరికను చల్లార్చుతుందని ఇతరులు భావించినప్పటికీ, అది దానికి ఆజ్యం పోసింది. అతడు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు; తన మొదటి సంవత్సరం ముగిసే సమయానికి 150 మంది విద్యార్థులు బైబిలు అధ్యయనం చేయడానికి, ప్రార్థించడానికి వారానికొకసారి సమావేశమయ్యేవారు. అతడు సీనియర్‌గా ఉన్న సమయానికి యేల్‌లోని 1,300 మంది విద్యార్థులలో వెయ్యి మంది డిసైపుల్‌షిప్ గ్రూపులలో ప్రతివారం బైబిలు అధ్యయనం మరియు ప్రార్థన కోసం సమావేశమయ్యేవారు.

అతడు తన సువార్త ప్రయత్నాలను కేవలం యేల్ విశ్వవిద్యాలయం ప్రాంగణం చుట్టూ ఉండే ఉండేవారికే పరిమితం చేయలేదు. అతని హృదయం బయటివారి కోసం కూడా అలాగే ఉండేది. అతడు యేల్ హోప్ మిషన్‌ను స్థాపించాడు. కనెక్టికట్‌లోని న్యూ హెవెన్ వీధుల్లో ఉన్నవారికి ఆయన పరిచర్యలు చేశారు. అతడు అనాథలు, వితంతువులు, నిరాశ్రయులు, ఆకలితో ఉన్న వారితో క్రీస్తు పరిచర్యను పంచుకున్నాడు, వారికి నిరీక్షణ ఇచ్చి ఆశ్రయాన్ని అందించాడు.

విదేశాల నుండి వచ్చిన ఒక సందర్శకుడిని అమెరికాలో ఉన్న సమయంలో అతడిని బాగా ఆకట్టుకున్నది ఏమిటని అడిగితే అతడు, “ఆ యువ మిలియనీర్ తన చేతిని యేల్ హోప్ మిషన్‌ చుట్టూ ఉంచి మోకరిల్లుతున్న దృశ్యం” అని చెప్పాడు.

బోర్డెన్ యేల్ నుండి పట్టభద్రుడైనప్పుడు, అతనికి చాలా మంచి ఉద్యోగాలు లభించాయి కాని చాలా మంది బంధువులు, స్నేహితులకు నిరాశ కలిగిస్తూ అతడు వాటిని నిరాకరించాడు. అతడు తన బైబిల్ వెనుక “తిరోగమనం లేదు” అనే మరో రెండు పదాలను రాశాడు.

అతడు ప్రిన్స్టన్ సెమినరీలో ప్రవేశించి గ్రాడ్యుయేషన్ తర్వాత చైనాకు ప్రయాణించాడు. ముస్లిం జనాభాలో క్రీస్తుకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో అతడు అరబిక్ నేర్చుకోవడానికి అధ్యయనం చేయడానికి ఈజిప్టులోనే ఆగిపోయాడు. అయితే అక్కడ ఉండగానే అతనికి స్పైనల్ మెనింజైటిస్ సోకడంతో కేవలం ఒక నెల మాత్రమే జీవించాడు.

ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో విలియం బోర్డెన్ చనిపోయాడు. బోర్డెన్ క్రీస్తును తెలుసుకోవడానికి ఆయన గురించి తెలియచేయడం కోసం మిగిలిన అన్ని విషయాలను నష్టంగానే ఎంచాడు. అతడు తన పూర్వీకుల నుండి సంక్రమించిన నిర్ధక జీవితాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా తన విమోచన క్రయధనం యొక్క మహిమలో జీవించడానికి ప్రయత్నించాడు.

అతని మరణం తర్వాత అతని బైబిల్ని చూసినప్పుడు అతడు వెనుక పేజీలో “విచారం లేదు” అనే మరో రెండు పదాలను జోడించినట్లు కనబడింది.

తన విడుదల ధర తెలిసిన వారికి తమను విమోచించిన వ్యక్తి కోసం జీవించడం అనేది ఎటువంటి విచారం లేని జీవితమని తెలుసు. విలియం బోర్డెన్ తనను విమోచించిన వ్యక్తితో వెళ్లాడాన్ని ఎంచుకున్నాడు. మరి మీరు?

[కార్టర్; ఆంథోనీ (2013-03-19). బ్లడ్ వర్క్, (పేజీలు 106-108). రిఫార్మేషన్ ట్రస్ట్ పబ్లిషింగ్. కిండెల్ ఎడిషన్.]

Category

Leave a Comment